ఇస్రా వ మేరాజ్ – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]

[డౌన్ లోడ్ PDF]

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

1) ఇస్రా వ మేరాజ్ ప్రాముఖ్యత
2) ఇస్రా వ మేరాజ్ తారీఖు
3) ఇస్రా వ మేరాజ్ లోని సంఘటనలు
4) ఇస్రా వ మేరాజ్ ఉద్దేశ్యము

ఇస్లామీయ సోదరులారా!

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ ఎన్నో అద్భుతాలను ప్రసాదించాడు. వాటిలో ఒక ముఖ్యమైన అద్భుతం – ఇస్రా వ మేరాజ్. ఈ అద్భుతంలో రెండు ముఖ్యమైన భాగాలు వున్నాయి. ఒక భాగం – ఇస్రా అని పిలువబడే ‘మస్జిదుల్ హరామ్’ నుండి ‘మస్జిదె అఖ్సా’ వరకు సాగిన ప్రయాణానికి సంబంధించినది. ఇక రెండవ భాగం – ‘మస్జిదె అఖ్సా’ నుండి ఆకాశాల కన్నా పైకి, అల్లాహ్ కోరుకున్నంత వరకు సాగిన ప్రయాణం. దీనిలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు స్వర్గనరకాలతో పాటు, ఎన్నో అల్లాహ్ సూచనలు చూపించడం జరిగింది, ఎన్నో ప్రవక్తలను పరిచయం చేయడం జరిగింది మరియు ఐదు పూటల నమాజ్ విధి (ఫర్జ్) గా చేయబడ్డాయి – దీనినే ‘మేరాజ్‘ అని పిలుస్తారు.

ఇమామ్ తహావీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు : మేరాజ్ అనేది సత్యం. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మెలకువ స్థితిలో, శరీర సమేతంగా సంచరింపజేయడం జరిగింది మరియు ఆకాశాల వరకూ, ఇంకా వాటికన్నా పైకి అల్లాహ్ కోరుకున్నంత వరకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అల్లాహ్ తాను కోరుకున్నట్లుగా ఆయనను గౌరవించి, తాను కోరుకున్న దానిని ఆయనకు ‘వహీ’ చేశాడు.

‘ఇస్రా’ గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ

“తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదుల్ హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకునిపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే మేమతనికి మా (శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు.” (బనీ ఇస్రాయీల్ 17:1)

ఈ ఆయత్ ‘సుబ్ హాన’ అన్న పదంతో అల్లాహ్ ప్రారంభించాడు. దీని శాబ్దిక అర్థం ఏమిటంటే – ఆయన (అల్లాహ్) అన్ని లోపాలకు అతీతుడు. కానీ, అరబ్బీ భాషలో దీనిని ‘ఆశ్చర్యాన్ని‘ వెలిబుచ్చే సందర్భాలలో కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా అల్లాహ్ శక్తిసామర్థ్యాలకు గాను ఆశ్చర్యం ప్రకటించబడుతోంది – ఆ శక్తిసామర్థ్యాలు ఏమిటంటే – అల్లాహ్ తన దాసుణ్ణి, ఆ రోజుల్లో 40 రేయింబవళ్ళలో పూర్తి చేయగలిగే ప్రయాణాన్ని రాత్రికి రాత్రే పూర్తి చేయించాడు. దీనిని వెల్లడించిన శైలి కూడా – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మెలకువతో, శరీర సమేతంగా మేరాజ్ చేయించడం జరిగిందని నిరూపిస్తోంది. ఎందుకంటే – ఒకవేళ నిద్ర స్థితిలో, ఆత్మరూపంలో ఈ ప్రయాణం జరిగి వుంటే, దాని కోసం ‘సుబ్ హాన’ పదాన్ని ఉపయోగించి ఆశ్చర్యం ప్రకటించాల్సిన అవసరం వుండేది కాదు.

ఇదేగాక, అల్లాహ్ దీనిలో అబ్ద్ (దాసుడు) పదాన్ని వాడాడు. అంటే ఆయన దాసుణ్ణి సంచారం గావించాడు. ఈ పదం కూడా ఆత్మ, శరీరం – రెండింటినీ కలిపి వాడబడుతుంది. కేవలం ఆత్మ కోసం కాదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కలలో కాకుండా మెలకువతో శరీర సమేతంగా మేరాజ్ యాత్ర చేయించి గౌరవించడం జరిగిందనడానికి ఇది రెండవ ఆధారం.

ఇక దీని మూడవ ఆధారం ఏమిటంటే – ఒకవేళ ‘ఇస్రా వ మేరాజ్’ సంఘటన కలలో జరిగివుంటే, మరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కలను జనాలకు వివరించినప్పుడు వారు దానిని (నమ్మకుండా) తిరస్కరించేవారు కాదు. కనుక మక్కా అవిశ్వాసుల తిరస్కరణ ద్వారా మనకు తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో తన కలను వివరించలేదు, వారితో స్పష్టంగా తనకు మెలకువ స్థితిలో, శరీర సమేతంగా ‘ఇస్రా వ మేరాజ్’ చేయించడం జరిగిందని చెప్పారు.అందుకే వారు- మక్కా నుండి ఏలియా (బైతుల్ మఖ్దిస్)కు మేము 40 రేయింబవళ్ళలో పూర్తి చేసే యాత్రను ఈయన రాత్రికి రాత్రే అక్కడికెళ్ళి తిరిగి వచ్చేశారు! అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను పరిహసించారు.

హాఫిజ్ ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు:

ముందు వారు, వెనుక వారిలో మెజారిటీ విద్వాంసుల అభిమత మేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఆత్మ మరియు శరీరంతో కలిపి ‘ఇస్రా’ యాత్ర చేయించడం జరిగింది. మేరాజ్ యాత్రలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వాహనంపై కూర్చోవడం, పైకి వెళ్ళడం మొదలైన విషయాలు కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. (అల్ బిదాయా వన్నిహాయ -3వ సంపుటం, 113-114 పేజీలు)

ఈ ఆయతును పురస్కరించుకొని మరో విషయం కూడా తెలుసుకోండి!

‘మున్కిరీనె హదీస్’ (సత్యానికి దూరంగా వున్న ఒక వర్గం) ‘ఇస్రా వ మేరాజ్’ అద్భుతాన్ని ఒక సామాన్య కథలాగా ఖరారు చేస్తూ, ఈ ఆయతులో మస్జిదె అఖ్సా అంటే మస్జిద్ నబవీ అని, ఇక్కడ హిజ్రత్ గురించి సూచించడం జరిగిందని చెబుతూ వుంటారు!

ఇది వారి స్పష్టమైన అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే హిజ్రత్ అనేది రాత్రిలోని కొంత భాగంలో పూర్తి కాలేదు. దానికెన్నో రోజులు పట్టాయి. దాని ఆరంభం రాత్రి వేళ కాకుండా మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా వున్న సమయంలో అయ్యింది. అంతేగాక, ఆ సమయంలో మస్జిదె నబవీ అస్తిత్వం ఇంకా లేదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్ చేసి మదీనాకు చేరుకున్న తర్వాత దానిని నిర్మించారు. దీనితో పాటు ఈ సూరా మక్కీ సూరా (మక్కా కాలంలో అవతరించబడిన సూరా), మదనీ సూరా కాదు. అందుకే దీనిని – మక్కా కాలంలో జరిగిన సంఘటన లాగానే అర్థం చేసుకోవాలి. మదీనా కాలంలో నిర్మించబడిన మస్జిద్ గురించి మక్కీ సూరాలో ఎలా వస్తుంది? (తఫ్సీర్ మౌలానా అబ్దుర్రహ్మాన్ కీలానీ)

ఈ విషయంలో (ఇస్లామీయ) విద్వాంసుల మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలున్నాయి.

హాఫిజ్ ఇబ్నె హజర్ రహిమహుల్లాహ్ ‘ఫత్ హుల్ బారీ – షరహ్ బుఖారీ’ నందు దీని గురించి పదికి పైగా వేర్వేరు వచనాలను సంగ్రహించారు. దీనిలో ఒక వచనం ఏమిటంటే ఇది హిజ్రత్ (మదీనా ప్రస్థానం) కు 1 సం॥ ముందుగా (రబీఉల్ అవ్వల్ మాసం, దైవ దౌత్యపు 12 సం॥) జరిగింది. ఇది ఇబ్నె సాద్ వగైరా||ల వచనం. ఇదే మాటను ఇమామ్ నవవీ కూడా పూర్తి నమ్మకంతో అన్నారు. ఇబ్నె హజమ్ అయితే దీనిని ఖరారు చేశారు. కానీ దీనిని ఇజ్మా (ఏకాభిప్రాయం)గా అనడం సరైనది కాదు, వీరితో పాటు ఇబ్నె అబీ అజిల్ ఇజ్ హనఫీ కూడా ఈ తేదీనే (అంటే హిజ్రత్కు 1 సం॥ ముందు) పూర్తి నమ్మకంతో పేర్కొన్నారు. (షరహ్ అఖీదా తహావియ : 224 పేజీ)

రెండవ వచనం ఏమిటంటే – ఇది (మేరాజ్ యాత్ర) హిజ్రత్కు 8 నెలలు ముందు (రజబ్ నెల, దైవ దౌత్యపు 12 వ సం||) జరిగింది. ఇక మూడవ మాట ఏమిటంటే – ఇది హిజ్రత్కు 6 నెలలు ముందుగా జరిగింది. నాల్గవ మాట ఏమిటంటే – ఇది హిజ్రత్కు 11 నెలలు ముందుగా జరిగింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలవిచ్చారు. (ఫత్ హుల్ బారీ: 7వ సంపుటం, 257వ పేజీ)

మౌలానా సఫీవుర్ రహ్మాన్ ముబారక్ పూరీ రహిమహుల్లాహ్ ఈ కాలపు తన ప్రసిద్ధ గ్రంథం ‘అర్రహీఖుల్ మఖ్తూమ్’ లో జీవిత చరిత్రకారుల ఆరు వచనాలను సంగ్రహించారు. దానిలో ఒకటి అల్లామా మన్సూర్ పూరీ రహిమహుల్లాహ్ నుండి సంగ్రహించారు. అదేమిటంటే – ఈ సంఘటన దైవ దౌత్యపు 10వ యేట రజబ్ నెల 27న జరిగింది. కానీ ఆయనే దీనిని సత్యమని నమ్మడానికి తిరస్కరించారు. ఎందుకంటే – ఖదీజా (రదియల్లాహు అన్న) ఐదు పూటలు నమాజ్ విధి (ఫర్జ్) గా నిర్ణయించబడడానికి ముందే అంటే, దైవ దౌత్యపు 10వ యేట రమజాన్ మాసంలో మరణించారు. మరి ఐదు పూటల నమాజ్ అయితే మేరాజ్ యాత్రలో విధిగా నిర్ణయించబడింది. అందుకే ఆయన దృష్టిలో మేరాజ్ యాత్ర ఆమె నిర్యాణం తరువాత జరిగి వుండాలి, ముందుగా కాదు. ఈ ప్రాతిపదిక మీదనే ఆయన (ఖదీజా రదియల్లాహు అన్హ నిర్యాణానికి) ముందుగా ఈ సంఘటన జరిగిందని పేర్కొన్న మరో రెండు వచనాలను కూడా సరైనవి కావని నిర్ధారించారు.

ఇక మిగిలిన మూడు వచనాలు (దైవ దౌత్యపు 12వ యేట రమజాన్ మాసం నందు, దైవ దౌత్యపు 13వ యేట ముహర్రమ్ మాసం నందు, దైవదౌత్యపు 13వ యేట రబీఉల్ అవ్వల్ మాసం నందు) విషయానికొస్తే, ఆయన – వీటిలో ఒకదాని మీద మరో దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఆధారమేదీ లభ్యం కాలేదు అని సెలవిచ్చారు. ఇక దీని గురించి ఆయన మాటల్లో చెప్పాలంటే ఇస్రా సూర అవతరణ పూర్వాపరాలను దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే ఈ సంఘటన (దైవ ప్రవక్త) మక్కా జీవితం ఆఖరి దశలో జరిగింది.
(అర్రహీఖుల్ మఖ్తూమ్: 197వ పేజీ)

ఇలా, సత్యానికి దగ్గరగా వుందని మా కనిపించే విషయమేమిటంటే – ఎంతో మహోన్నతమైన ఈ సంఘటన, హిజ్రత్కు 1 సం॥ ముందు రబీవుల్ అవ్వల్ మాసం, దైవ దౌత్యపు 12వ యేడు నందు జరిగింది. దీనికి ఆధారం ఇమామ్ జుహ్రి మరియు ఇమామ్ ఉర్వా బిన్ జుబైర్ ల ఈ మాట – హిజ్రత్ కు 1 సం॥ ముందు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను బైతుల్ మఖ్దిస్ వైపునకు యాత్ర గావించడం జరిగింది.

వాస్తవమేమిటంటే – ఈ మహోన్నతమైన సంఘటన గురించి సహీహైన్ మరియు ఇతర హదీసు గ్రంథాల్లో దాదాపు 25 మంది సహాబాల ద్వారా ఉల్లేఖించబడ్డ ఎన్నో హదీసులు వున్నాయి. ఒకవేళ ఎవరైనా, కేవలం ఒకటి రెండు హదీసులు మాత్రమే తన ముందుంచుకుంటే అతను ఖచ్చితంగా ఈ సంఘటనను గూర్చి పూర్తిగా తెలుసుకోలేడు. ఎందుకంటే ఏ ఒక్క హదీసులోనూ దీనిని గూర్చి సంపూర్ణంగా ఉల్లేఖించబడలేదు. అదీగాక, వీటిలో కొన్ని ప్రామాణికమైనవైతే మరి కొన్ని బలహీన మరియు స్వీకరించలేని హదీసులు కూడా వున్నాయి. కనుక, కేవలం ప్రామాణిక హదీసులు వెలుగులోనే ఈ అద్భుతానికి సంబంధించిన వివరాలు (మీకు) వివరించడానికి మేం ప్రయత్నిస్తాం. వల్లాహు వలీ ఉతౌఫీఖ్ (కేవలం అల్లాహ్ యే సద్దుద్ధిని ప్రసాదిస్తాడు).

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:

నేను మక్కాలో మా ఇంట్లో నిద్రపోతున్నాను. (హాఫిజ్ ఇబ్నె హజర్, తబ్రానీ నుండి ఉల్లేఖించిన మరో ఉల్లేఖనం ప్రకారం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రాత్రి ఉమ్మె హాని రదియల్లాహు అన్హ ఇంట్లో వున్నారు. మరి ఆ ఇంటిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇల్లని ఎందుకన్నట్లు? ఎందుకంటే (ఆ రోజుల్లో) దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడే నివాసముండేవారు)

(ఈలోగా) ఇంటి పైకప్పు తొలగించబడింది. (ఆపై) జిబ్రయీల్ (అలైహిస్సలాం) అవతరించి నన్ను కాబా గృహం దగ్గర ‘హతీమ్’ (కాబా ప్రక్కన గల ఖాళీ స్థలం, అయినప్పటికీ ఇది కూడా కాబాలోని అంతర్భాగమే) వద్దకు తీసుకొచ్చారు. (అక్కడ నేను కొంత సేపు విశ్రాంతి తీసుకున్నాను) నాకు కునుకు రాసాగింది. పూర్తిగా నిద్రపోని లేదా పూర్తిగా మేల్కొని లేని స్థితిలో నేనున్నానప్పుడు. ఈ లోగా పలికేవారెవరో ఇలా పలికారు- ముగ్గురిలో ఒక్కడు, ఇద్దరు (హమ్జా, జాఫర్) వ్యక్తుల మధ్యవున్నవాడు (ఇతనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం). తదుపరి నన్ను లేపి (జమ్ జమ్ వైపునకు) తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ విశ్వాసం, వివేకంతో నింపివున్న ఒక బంగారపు పాత్ర తేబడింది. తదుపరి నా ఛాతీని నాభి క్రింది వెంట్రుకల వరకు కోసి, నా హృదయాన్ని బయటికి తీసి, దానిని జమ్ జమ్ నీటితో కడిగి, దానిలో విశ్వాసం (ఈమాన్) మరియు వివేకాలను నింపి దానిని తిరిగి యథావిధిగా పెట్టేసి మూసివేయడం జరిగింది. (బుఖారీ: 349, 3207, 3887, ముస్లిం :164)

హృదయం తెరవడాన్ని గురించి వివరించిన ఈ సంఘటన ప్రామాణిక హదీసులలో వుంది. కనుక దీనిని అనుమానించడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. అయినా ఇలా జరగడం మొదటిసారేం కాదు. ఇంతకు ముందు కూడా కనీసం రెండు సార్లు ఇలా జరిగింది. మొదటి సారి బాల్యంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హలీమా సాదియా ఇంట్లో పోషింప బడుతున్నప్పుడు, రెండవ సారి – దైవ దౌత్యం ప్రసాదించ బడినప్పుడు. ఈ విషయాన్ని హాఫిజ్ ఇబ్నె హజర్ ‘ఫత్ హుల్ బారీ’ యందు వివరించారు. బహుశా ఇలా చేయడంలో గల మర్మం – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు రాబోయే రోజుల్లో సంభవించే సంఘటనల కోసం తయారు చెయ్యడం కావచ్చు. వాస్తవం అల్లాహ్ తెలుసు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:

తదుపరి నా దగ్గరికి ‘బురాఖ్’ అని పిలువబడే ఒక తెల్ల రంగు జంతువు తీసుకురావడం జరిగింది. అది గాడిద కన్నా పెద్దది, కంచర గాడిద కన్నా చిన్నదిగా వుంది. దాని ఒక్క అడుగు అది చూడగలిగే హద్దు వరకు పోయేది. నన్ను దానిపై కూర్చోబెట్టడం జరిగింది (ముస్లిం: 164)

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: ‘ఇస్రా’ రాత్రి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు బురాఖ్ ను – ముక్కుతాడు, జీను వేయబడివున్న స్థితిలో తీసుకురావడం జరిగింది. అది కాస్త అల్లరి చేస్తుండడంతో జిబ్రయీల్ (అలైహిస్సలాం) దానితో – ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు అల్లరి చేస్తున్నావా? వాస్తవానికి అల్లాహ్ దృష్టిలో ఆయన కన్నా నీకు ప్రియమైన రౌతు మరొకరు లేరు. ఇది వినగానే దానికి ముచ్చెమటలు పోసాయి. (తిర్మిజీ : 313, సహీహ్ – అల్బానీ)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:

తదుపరి నేను బురాఖ్ ఎక్కి బైతుల్ మఖ్దిస్ చేరుకున్నాను. (ఆ తర్వాత నేను క్రిందికి దిగి) నా వాహనాన్ని గత ప్రవక్తలు కట్టేసిన చోటే కట్టేసి, ఆ తర్వాత మసీదు లోపలికి వెళ్ళి అందులో 2 రకాతులు నమాజ్ చదివాను. (ముస్లిం : 162)

షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ‘సహీహ్ గా ఖరారు చేసిన ఇబ్నె జరీర్ ఉల్లేఖనంలో ఈ పదాలు వున్నాయి: “నేను ప్రవక్తలకు నమాజ్ చేయించాను”.(అల్ ఇస్రా వల్ మేరాజ్ 14)

ఇక్కడ రెండు మూడు విషయాలు ఎంతో గమనించదగ్గవి:

అందులో మొదటిది – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను మస్జిదుల్ హరామ్ నుండి మస్జిద్ అఖ్సాకు తేవడం జరిగింది. అక్కడ ఆయన రెండు రకాతులు నమాజ్ చేశారు. దీని ద్వారా – మస్జిద్ అఖ్సా ఒక మహత్యం గల మసీదని, నమాజ్ చేసే సంకల్పంతో అక్కడికి ప్రయాణం చేయవచ్చని తెలిసింది.

దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఇలా సెలవిచ్చివున్నారు. పుణ్య ఫలాపేక్షతో కేవలం మూడు మస్జిదుల వైపునకు ప్రయాణం చేయవచ్చు. అవి మస్జిదుల్ హరామ్, మస్జిదె అఖ్సా మరియు నా ఈ మస్జిద్ (మస్జిదె నబవి). (బుఖారీ : 1188, ముస్లిం: 1397)

ఇది (మస్జిదె అఖ్సా) ఎలాంటిదంటే – అల్లాహ్ వాక్కు ప్రకారం దాని పరిసరాలు సైతం శుభవంతమైనవైతే, ఇక దాని శుభాన్ని గురించి ఏం చెప్పాలి! ఈ మస్జిదే ముస్లిముల కొరకు మొదటి ఖిబ్లాగా వుండేది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయనను విశ్వసించిన సహాబాలు మదీనాకు వలస (హిజ్రత్) వెళ్ళిన తర్వాత 16 లేదా 17 నెలల వరకు దీని వైపునకు తిరిగే నమాజు చేసేవారు. కనుక ఈ మస్జిద్ ఎంతో మహోన్నతమైనది.

కానీ, ఎంతో దురదృష్టకరమైన విషయమేమిటంటే – నేడు ఈ మస్జిద్ ప్రతి ఈ రోజూ దాని నిషేధితాలనూ, పవిత్రతనూ ఉల్లంఘించే యూదుల ఆధీనంలో వుంది. స్వయానా బైతుల్ మఖ్దిస్ మరియు పాలస్తీనాకు చెందిన ముస్లిములు సైతం అక్కడ నమాజు చదవడానికి ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. ఎన్నో హద్దులను దాటి, అపవిత్ర యూదుల స్వీయ షరతులను అంగీకరించిన తర్వాతే వారికి మస్జిదె అఖ్సా గుమ్మం త్రొక్కే అవకాశం దొరుకుతుంది. ఈ పరిస్థితుల్లో ఇతర ఇస్లామీ దేశాల వాళ్ళు అక్కడికెళ్ళి నమాజ్ చేయాలని ఆలోచించగలరా! మేము అల్లాహ్ ను వేడుకునేదేమిటంటే – ఆయన ఈ మస్జిద్ను – దౌర్జన్యపరులు, ఆక్రమణదారులైన యూదుల ఆధీనం నుండి స్వేచ్ఛను ప్రసాదించడం ద్వారా మనక్కూడా దానిలో నమాజు చదివే అవకాశం కల్పించుగాక! ఆమీన్!!

ఇక రెండవ విషయమేమిటంటే- మస్జిదె అఖ్సాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాయకత్వం (ఇమామత్)లో దైవ ప్రవక్తలు, సందేశహరులు నమాజు చదివారు. దీని ద్వారా తెలిసిందేమిటంటే -మన ప్రియప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇతర దైవప్రవక్తలు, సందేశహరులందరి కన్నా శ్రేష్ఠులు. అందుకే ఆయన సమక్షంలో ఇతరులెవరూ నాయకులు (ఇమామ్) కాలేరు. కేవలం ఆయనే (దానికి అర్హులు).

దీని ద్వారా తెలిసే మరో విషయమేమిటంటే- దైవ ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే. అది ఇస్లాం ధర్మం. ఈ ధర్మమే అల్లాహ్ కు ఇష్టమైనది.

అల్లాహ్ సెలవిచ్చాడు:

وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَيرِينَ (85)

“ఎవరైనా ఇస్లాం ను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు”. (ఆలి ఇమ్రాన్: 85)

దీని ద్వారా తెలిసే మరో విషయం ఏమిటంటే – ఆఖరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవదౌత్యం లభించాక ఇక ఆయనే ‘ఇమామె ఆజమ్’ (ప్రధాన నాయకులు) మరియు ఆయన ధర్మశాస్త్ర (షరీయత్తు) అనుసరణే తప్పనిసరి. ఆయనపై అవతరించిన గ్రంథమే సన్మార్గానికి మూలం. కనుక, దీనిని (ఖురాన్) వదిలి ఇతర గ్రంథాలను ఉదా|| తౌరాత్, ఇన్జీలు (గ్రంథాలను) సన్మార్గానికి మూలంగా భావించడం మార్గభ్రష్టతే.

ఇక మూడో విషయమేమిటంటే- బైతుల్ మఖ్దిస్ లో దైవ ప్రవక్తలందరూ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాయకత్వంలో నమాజు చదివిన సంఘటన గురించి ఇది మేరాజ్కు ముందు జరిగిందా లేక తర్వాతనా? అన్న విషయంలో ధార్మిక పండితులు మధ్య అభిప్రాయ భేదాలున్నాయి.

హాఫిజ్ ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ తన ‘తఫ్సీర్’ లో మరియు బాగా ప్రాచుర్యం పొందిన ‘అల్ బిదాయ వన్నిహాయ’లో వెలిబుచ్చిన దృష్టి కోణమేమిటంటే-దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మేరాజ్ నుండి తిరుగు ప్రయాణ మైనప్పుడు ఇతర ప్రవక్తలు కూడా ఆయనతో పాటు వచ్చి బైతుల్ మఖ్దిస్ లో ఆయన వెనుక నమాజు చేశారు. బహుశా ఇది ఆ రోజు ఫజర్ నమాజు కావచ్చు.

ఇక వేరే ఇతర అన్వేషకుల దృష్టి కోణం ఏమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మేరాజ్ యాత్ర ఆరంభంలోనే ప్రవక్తలకు నాయకత్వం (ఇమామత్) వహించే భాగ్యాన్ని ప్రసాదించడం జరిగింది. వీరిలో (ఈ దృష్టి కోణం కలిగిన వారిలో) హాఫిజ్ ఇబ్నుల్ ఖయ్యూం, హాఫిజ్ ఇబ్నె హజర్, ఇబ్నె అజిల్ ఇజ్ హనఫీలు ముఖ్యులు. మేము ఇబ్నె జరీర్ ద్వారా వివరించిన ఉల్లేఖనం, ఈ దృష్టి కోణానికి బలాన్ని చేకూరుస్తుంది. వాస్తవం అల్లాహ్ కే తెలుసు. (జాదుల్ మిఆద్: 3వ సంపుటం, 30వ పేజీ, ఫత్ హుల్ బారీ, 7వ సంపుటం, 256వ పేజీ, షరప్ అఖీదా తహావియ : 224వ పేజీ)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

తదుపరి నేను (మస్జిదె అఖ్సా నుండి) బయటి కొచ్చాక జిబ్రయీల్ (అలైహిస్సలాం) నా ముందు రెండు పాత్రలుంచారు. ఒకదానిలో మద్యం మరియు రెండో దానిలో పాలు వున్నాయి. నేను పాలను ఇష్ట పడడం చూసి జిబ్రయీల్ (అలైహిస్సలాం) నాతో మీరు ‘సహజత్వాన్ని (ఫిత్ రత్) ఇష్టపడ్డారు అని అన్నారు. దీని ద్వారా తెలిసిందేమిటంటే – ఇస్లామ్ సహజ (ప్రకృతి) ధర్మం. ఎందుకంటే పాలు స్వచ్చమైనవి (దానిలో కల్తీ వుండదు), కానీ మద్యాన్ని మాత్రం ద్రాక్ష పళ్ళు వగైరాలను మార్చి తయారు చేస్తారు. అంతేగాక, మద్యం మనిషి యొక్క బుద్ధిమాంద్యాలను కూడా మార్చేస్తుంది, వాటిని కప్పేస్తుంది. పాలు మాత్రం మనిషి పుట్టుక నుంచే అతని స్వభావంలో ఇమిడి వుంది.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

తదుపరి మేము (నేను, జిబ్రయీల్ అలైహిస్సలాం) ప్రయాణం చేస్తూ ప్రాపంచిక ఆకాశం వరకు చేరుకున్నాం. (ముస్లిం : 164)

మరో ఉల్లేఖనంలో ఇలా వుంది. తదుపరి జిబ్రయీల్ (అలైహిస్సలాం) నన్ను ప్రాపంచిక ఆకాశం వైపునకు తీసుకెళ్ళారు. (ముస్లిమ్ : 162)

ఇంకో ఉల్లేఖనంలో ఇలా వుంది: తదుపరి జిబ్రయీల్ (అలైహిస్సలాం) నా చేయి పట్టుకొని నన్ను ప్రాపంచిక ఆకాశం వైపునకు తీసుకెళ్ళారు.(బుఖారీ: 349, ముస్లిం : 163)

ఈ మూడు ఉల్లేఖనాలు ప్రామాణికమైనవి. వీటి ద్వారా స్పష్టంగా తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం) సహాయంతో పైకి వెళ్ళారు. హాపిజ్ ఇబ్నె హజర్ ‘ఫత్ హుల్ బారీ’లో సంగ్రహించిన కొన్ని ఉల్లేఖనాల ద్వారా ఒక అందమైన నిచ్చెన (ఆకాశం వైపునకు) ఏర్పాటు చేయబడగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని సహాయంతో పైకి వెళ్లారని తెలుస్తుంది. వాస్తవం అల్లాహ్ కే తెలుసు, (ఫత్ హుల్ బారీ: 7వ సంపుటం, 264వ పేజి)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు.

జిబ్రయీల్ (అలైహిస్సలాం) తలుపు తట్టారు. ఎవరు మీరు? అని అడగడం జరిగింది. ఆయన – ‘జిబ్రయీల్’ అని అన్నారు. మీతో పాటు ఎవరున్నారు? అని అడగడం జరిగింది. ఆయన – ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని చెప్పారు. ఆయనను పిలవడం జరిగిందా? అని అడగబడింది. ఆయన – అవును, ఆయనను పిలవడం జరిగింది. అని అన్నారు. (అలాగైతే) ఆయనకు సుస్వాగతం, ఆయన రాక శుభకరమగుగాక! అని అనడం జరిగింది.

తదుపరి, ఆకాశ ద్వారం తెరువబడింది. మేము మొదటి ఆకాశం పైకి వెళ్ళి, ఆదమ్ (అలైహిస్సలాం) సమీపం నుండి వెళ్లసాగాం. జిబ్రయీల్ (అలైహిస్సలాం) నాతో – ఈయన మీ తండ్రి గారు, వీరికి సలాం చేయండి అని చెప్పారు. నేనాయనకు సలాం చేశాను. ఆయన దానికి జవాబిచ్చి ఇలా అన్నారు – మంచి కుమారునికి, మంచి ప్రవక్తకు సుస్వాగతం. తదుపరి ఆయన నా కోసం మంచిని కాంక్షిస్తూ దుఆ చేశారు. ఆయన ఇరు వైపులా కొన్ని నీడలుండడం నేను చూశాను. ఆయన (ఆదమ్ అలైహిస్సలాం) తన కుడి వైపునకు చూసినప్పుడు నవ్వుతున్నారు మరియు ఎడవ వైపునకు చూసినప్పుడు ఏడుస్తారు. దీని గురించి నేను జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను అడగ్గా ఆయన జవాబిస్తూ- ఆయనకు ఇరు వైపున వున్నవి ఆయన సంతానం ఆత్మలు. కుడి వైపున్నవి స్వర్గ వాసుల ఆత్మలు మరియు ఎడమ వైపువి నరకవాసుల ఆత్మలు. అందుకే ఆయన కుడి వైపు చూసినప్పుడు ఆనందంతో పొంగి పోతారు మరియు ఎడవ వైపు చూసినప్పుడు బాధపడి ఏడుస్తారు.(బుఖారీ: 349, ముస్లిం: 163)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)తో పాటు రెండవ ఆకాశానికి చేరుకోగా, మొదటి ఆకాశం లాగానే జిబ్రయీల్ (అలైహిస్సలాం) తలుపు తట్టారు. ప్రశ్నలూ, సమాధానాలు పూర్తయ్యాక ద్వారం తెరువబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు స్వాగతం పలుకబడింది. – ఇక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈసా (అలైహిస్సలాం)ను ఆయన పిన తల్లి కొడుకైన యహ్యా (అలైహిస్సలాం)ను కలవడం జరిగింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి సలాం చేశారు. వారు కూడా జవాబిచ్చి, స్వాగతం పలికారు మరియు ఆయన కోసం ప్రార్థించారు.

తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడవ ఆకాశానికి చేరుకోగా, మొదటి ఆకాశం లాగే జిబ్రయీల్ (అలైహిస్సలాం) తలుపు తట్టారు. ద్వారాపాలకులతో సంభాషించిన తర్వాత ద్వారం తెరువబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు స్వాగతం పలుకబడింది. ఈ ఆకాశం పైన జిబ్రయీల్ (అలైహిస్సలాం) యూసుఫ్ (అలైహిస్సలాం)తో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు పరిచయం చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) యూసుఫ్ (అలైహిస్సలాం) కు సలాం చేశారు. ఆయన జవాబిచ్చి, స్వాగతం పలికి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోసం దుఆ చేశారు.

ఆయన గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: నేను చూసిందేమిటంటే సగం సౌందర్యం యూసుఫ్ (అలైహిస్సలాం) కు ఇవ్వబడింది. (ముస్లిం : 162)

తదుపరి నాల్గవ ఆకాశంపైన గూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మొదటి ఆకాశంలాగే స్వాగతం లభించింది. ఈ ఆకాశంపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇద్రీస్ (అలైహిస్సలాం)ను పరిచయం చేయడం జరిగింది. ఆయన దైవ ప్రవక్తకు మంచి సోదరా, మంచి ప్రవక్తా! అని స్వాగతం పలికి ఆయన కోసం దుఆ చేశారు.

తదుపరి ఐదవ ఆకాశంపైన గూడా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఎంతో సంతోషంతో స్వాగతం లభించింది. ఇక్కడ ఆయనకు హారూన్ (అలైహిస్సలాం) పరిచయం చేయబడ్డారు. ఆయన కూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు స్వాగతం పలికి, మంచి సోదరుడు, మంచి ప్రవక్త కోసం దుఆ చేశారు.

తదుపరి జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఆరవ ఆకాశానికి తీసుకెళ్ళారు. అక్కడ కూడా ఆయనకు మొదటి ఆకాశాల లాగా ఘనస్వాగతం లభించింది. తదుపరి మూసా (అలైహిస్సలాం)ను పరిచయం చేయడం జరిగింది. ఆయన కూడా ఇతర ప్రవక్తల లాగ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను సాదరంగా స్వాగతం పలికి ఆయన కోసం దుఆ చేశారు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:

నేను ముందుకు సాగబోతున్నప్పుడు మూసా (అలైహిస్సలాం) ఏడ్వడం మొదలుపెట్టారు. మీరెందుకు ఏడుస్తున్నారు? అని ఆయనను అడగడం జరిగింది. ఆయన జవాబిస్తూ – ఓ నా ప్రభూ! ఈ అందమైన యువకుణ్ణి నీవు నా తర్వాత (దైవ దౌత్యం నిమిత్తం) పంపావు. ఈయన అనుచర సమాజపు (ఉమ్మత్) ప్రజలు నా ఉమ్మత్ ప్రజల కన్నా ఎక్కువగా స్వర్గంలో ప్రవేశిస్తారు!

తదుపరి జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఏడవ ఆకాశానికి తీసుకెళ్ళారు. అక్కడ కూడా మొదటి ఆకాశాల లాగ ఘనస్వాగతం లభించింది. అక్కడ ఆయనకు ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను పరిచయం చేయడం జరిగింది. ఆయన కూడా ఇతర ప్రవక్తల లాగా సాదరంగా ఆహ్వానం పలికి మంచి ప్రవక్తకు స్వాగతం పలికారు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు:

ఇబ్రాహీం (అలైహిస్సలాం) ‘బైతుల్ మామూర్’ ను అనుకొని కూర్చొని వున్నారు. అక్కడికి ప్రతి రోజూ 70,000 దైవదూతలు ప్రవేశిస్తారు. (ఒక సారి వచ్చి వెళ్ళాక) వారికి మరోసారి రావడానికి అవకాశం వుండదు. (ముస్లిం: 162)

అయితే, సహీహ్ బుఖారీలో ఇలా వుంది. అల్ బైతుల్ మామూర్ ప్రతిరోజూ 70,000 దైవ దూతలు నమాజు చదువుతారు. (ఒక సారి వచ్చి) వారు తిరిగి వెళ్ళాక ఇక ప్రళయం రోజు వరకు వారు తిరిగి రాలేరు. (బుఖారీ: 3207)

ఖతాదా ఇలా అంటున్నారు : దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారని మాకు చెప్పబడింది. అల్ బైతుల్ మామూర్ అనేది కాబాకు సమాంతరంగా ఆకాశంలో వున్న ఒక మస్జిద్. అది ఒకవేళ క్రింద పడితే కాబా గృహం మీద పడుతుంది.

అలీ (రదియల్లాహు అన్హు) ను ‘అల్ బైతుల్ మామూర్’ గురించి అడగ్గా ఆయన ఇలా సెలవిచ్చారు: అది బైతుల్లాహ్ (కాబా గృహం)కు సమాంతరంగా ఆకాశంలో వున్న అల్లాహ్ గృహం. భూమి మీద కాబా గృహానికి వున్న పవిత్రతే ఆకాశంలో దానికి వుంది. (ఈ రెండు ఉల్లేఖనాలు హాఫిజ్ ఇబ్నె హజర్ ‘ఫత్ హుల్ బారీ’ లో సంగ్రహించారు. – ఫత్ హుల్ బారీ – 6వ సంపుటం, 379వ పేజీ)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:

తదుపరి నా ముందు మూడు పాత్రలు వుంచబడ్డాయి. ఒక దాంట్లో మద్యం, మరో దాంట్లో పాలు, ఇంకో దానిలో తేనె వున్నాయి. నేను పాల గిన్నెను త్రాగాను. దీనిపై జిబ్రయీల్ (అలైహిస్సలాం) నాతో – మీరు మరియు మీ అనుచర సమాజం ప్రజలు (ఉమ్మత్) ‘సహజత్వం’ పై వున్నారు. (బుఖారీ : 3887, ముస్లిం : 5610)

సహీహైన్ లోని మరో ఉల్లేఖనంలో పాలు మరియు మద్యం గురించి మాత్రమే ప్రస్తావించబడింది. దానిలో అదనంగా ఈ పదాలు కూడా వున్నాయి జాగ్రత్త! ఒకవేళ మీరు మద్యం గిన్నెను ఎత్తివుంటే, మీ ఉమ్మత్ ప్రజలు మార్గ భష్టులై పోయేవారు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు:

తదుపరి నన్ను ఇంకా పైకి ‘సిద్రతుల్ మున్తహా’ వైపునకు తీసుకెళ్ళడం జరిగింది. (నేను దానిపై క్షుణ్ణంగా దృష్టి సారించి చూడగా) దాని ఆకులు ఏనుగు చెవుల లాగా మరియు దాని ఫలాలు ‘హిజ్ర్’ ప్రాంతపు కుండలలాగా కనిపించాయి. తదుపరి అల్లాహ్ ఆజ్ఞననుసరించి ఏదో వస్తువు దానిని కప్పివేయగా అది ఎంత అందంగా తయారయిందంటే అల్లాహ్ సృష్టితాలలో ఎవరు కూడా దాని సౌందర్యాన్ని వర్ణించలేరు. దాని మొదళ్ళ నుండి (వేర్ల భాగం) నాలుగు కాలువలున్నాయి. రెండు గోచరించేవి, మరో రెండు అగోచరమైనవి. (వీటి గురించి) నేను జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను అడగ్గా ఆయన – రెండు అగోచర కాలువలు స్వర్గంలో వున్నాయి మరియు గోచరమైన కాలువలు ‘ఫరాత్‘ మరియు ‘నైలు‘ అని పలికారు. (బుఖారీ: 3207, 3887, ముస్లిం : 162,164)

సహీహ్ ముస్లింలోని మరో ఉల్లేఖనంలో ఇలా వుంది: ‘సిద్రతుల్ మున్తహా’ ఎలాంటి ప్రదేశమంటే – భూమి నుండి పైకి లేపబడే వస్తువు ఇక్కడికే తేబడి స్వీకరించడం జరుగుతుంది. అలాగే పై నుంచి క్రిందికి దించబడే వస్తువు కూడా ఇక్కడికే తేబడి స్వీకరించడం జరుగుతుంది. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ఇజ్ యగ్ షస్సిద్రత మా యగ్ షా’ను విశ్లేషిస్తూ దానిని బంగారపు సీతాకోకచిలుకలు కప్పివేస్తాయి అని వివరించారు.(ముస్లిం : 173)

‘సిద్రతుల్ మున్తహా’ వద్ద దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను ఆయన అసలు ఆకారంలో రెండవ సారి చూశారు. (దీని గురించి) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَقَد رَاهُ نَزْلَةً أُخْرَى عِنْدَ سِدْرَةِ الْمُنْتَهَى عِنْدَهَا جَنَّةُ الْمَأْوَى إِذْ يَغْشَى السدرة ما يغشى مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغَى لَقَدْ رَأى مِنْ أَيْتِ رَبِّهِ الكبرى

“ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అతణ్ణి (జిబ్రయీల్ అలైహిస్సలాం) ను మరో సందర్భంలో కూడా చూసి ఉన్నాడు. సిద్రతుల్ మున్తహా దగ్గర. అక్కడే ‘జన్నతుల్ మావా’ కూడా వుంది. అప్పుడు సిద్రాను ఆవరించే వస్తువేదో ఆవరిస్తూ వుంది. (అతని చూపు తప్పిపోనూ లేదు. హద్దు దాటి పోనూ లేదు. నిస్సందేహంగా అతను తన ప్రభువు యొక్క గొప్ప సూచనలు (కొన్నింటిని) తిలకించాడు.” (నజ్మ్ : 13–18)

అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) “వలఖద్ రఆహు నజ్లతన్ ఉఖ్రా” గురించి విశ్లేషిస్తూ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీని గూర్చి ఇలా సెలవిచ్చారని వివరించారు – నేను (దైవ ప్రవక్త) జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను సిద్రతుల్ మున్తహా వద్ద (అతని అసలు ఆకారంలో) చూడగా (ఆయనకు) 600 రెక్కలున్నాయి.

ఇలాగే, ఆయెషా (రదియల్లాహు అన్హ) మరియు అబూ హురైరా (రదియల్లాహు అన్హు)లు గూడా ‘వలఖద్ రఆహు నజ్లతన్ ఉఖ్రా’ గురించి ఇలాగే విశ్లేషిస్తూ దీని అర్థం జిబ్రయీల్ (అలైహిస్సలాం) అని వివరించారు. (ముస్లిం : 175, 176)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను మొదటి సారి (ఆయన అసలు ఆకారంలో) తన దైవ దౌత్యపు ఆరంభ దశలో చూసారు. దీని గూర్చి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. “మరి అతను సమీపించ సాగాడు…. అలా అలా వాలుతూ వచ్చాడు. చివరికి అతను రెండు ధనస్సులంత దూరాన లేక అంత కన్నా తక్కువ దూరంలో వుండి పోయాడు.”(నజ్ : 8-9)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు :

తదుపరి నన్ను స్వర్గంలో ప్రవేశింపజేయడం జరిగింది. (నేను దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా) దానిలో ఎంతో ఉత్తమమైన ముత్యాల కుటీరాలు వున్నాయి, దాని మట్టి కస్తూరిది. (బుఖారీ: 349, ముస్లిం: 163)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా కూడా వివరించారు: నేను స్వర్గంలో విహరిస్తూ, రెండు వైపులా ముత్యాల కుటీరాలు గల ఒక కాలువ వద్దకు చేరుకున్నాను. నేను జిబ్రయీల్ (అలైహిస్సలాం)తో – ఇదేమిటి? అని అడగ్గా, ఆయన జవాబిస్తూ- ఇది అల్లాహ్ మీకు ప్రసాదించిన కౌసర్ కాలువ అని వివరించారు. నేను దాని లోకి చేతితో కొట్టి చూడగా దాని మట్టి కస్తూరిది. (బుఖారీ : 6581, అహ్మద్)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు: తదుపరి నన్ను ఇంకా పైకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నేను కలములు నడుస్తున్న శబ్దాన్ని విన్నాను. (బుఖారీ : 349, ముస్లిం : 163)

అంటే – అల్లాహ్ నిర్ణయాలను, ఆజ్ఞలను దైవదూతలు లిఖించే ప్రదేశం వరకు నన్ను తీసుకెళ్ళడం జరిగింది.

ఇబ్నె అజల్ ఇజ్ హనఫీ రహిమహుల్లాహ్ ఇలా వివరించారు :

‘తమ కళ్ళతో ఈ ప్రపంచంలో అల్లాహ్ ను ఎవ్వరూ చూడలేరు’ అన్న విషయంలో అనుచర సమాజం (ఉమ్మత్) ఏకాభిప్రాయంతో వుంది. దీనిపై ఎలాంటి భేదాభిప్రాయం లేదు. కేవలం మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విషయంలో మాత్రం భేదాభిప్రాయం వుంది. వీరిలో కొందరు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ను చూశారన్న దానితో విభేదించగా మరి కొందరు దానిని స్వీకరించారు. (షరహ్ అఖీదా తహావియ-196వ పేజీ)

తదుపరి ఆయన ఖాజీ ఇయ్యాజ్ ద్వారా ప్రస్తావించిన దేమిటంటే – ఈ విషయంలో స్వయానా సహాబాల మధ్య సైతం భేదాభిప్రాయాలు వున్నాయి. ఆయెషా (రదియల్లాహు అన్హ), అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) మరియు అబూ హురైరా (రదియల్లాహు అన్హు) లు దీనితో విభేదించగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ద్వారా ఆయన దీనిని స్వీకరించారని ఉల్లేఖించబడింది.

ఖాజీ ఇయ్యాజ్ కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను చూశారనడానికి స్పష్టమైన ఆధారం ఒక్కటి కూడా లేదు. కేవలం నజ్మ్ సూరాలోని రెండు ఆయతులు తప్ప. కానీ వీటి విశ్లేషణలో కూడా భేదాభిప్రాయాలు వున్నాయి.

ప్రియ సోదరులారా!

ఈ భేదాభిప్రాయాన్ని దాని చోటనే వుండనివ్వండి. కానీ స్పష్టమైన, ప్రమాణికమైన ఆధారాల ద్వారా తెలిసేదేమిటంటే – మేరాజ్ రాత్రి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ను చూడలేదు.

వాటిలో కొన్ని ఆధారాలు ఇవి:

(1) మస్రూఖ్ కథనం: నేను ఆయెషా (రదియల్లాహు అన్హ) వద్ద కూర్చొని వుండగా, ఆమె నాతో ఇలా అన్నారు – ఓ అబూ ఆయెషా! (ఇది మస్రూఖ్ కునియత్ – మారు పేరు) మూడు విషయాలున్నాయి – వీటిపై ఎవరైనా తన వైపు నుండి ఏదైనా మాట్లాడితే అతను అల్లాహ్ పై అభాండం మోపిన వాడవుతాడు. నేనామెతో – ఆ విషయాలు ఏవి? అని అడగ్గా, ఆమె జవాబిస్తూ- ఎవరైనా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను చూసారు అని అంటే అతను అల్లాహ్ పై పెద్ద అభాండం మోపాడు అని అన్నారు. మస్రూఖ్ కథనం – తలగడను ఆనుకొని కూర్చొని వున్న నేను ఆయెషా (రదియల్లాహు అన్హ) మాటలు విని నిటారుగా కూర్చున్నాను. తదుపరి ఆమెతో – ఓ విశ్వాసులు మాతృమూర్తి! నాకు మాట్లాడడానికి అనుమతించండి.

అల్లాహ్ (ఖురానులో)

وَلَقَد رَاهُ بِالْأُفُقِ الْمُبِينِ .
“అతనా సందేహహరుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూసి వున్నాడు”. (తక్వీర్ : 23)

وَلَقَدْ رَاهُ نَزْلَةٌ أُخْرَى
“ఆయన, అతణ్ణి మరో సందర్భంలో కూడా చూనివున్నాడు” (:13)

అని సెలవిచ్చాడుగా మరి? అని అడిగాను.

ఆమె ఇలా వివరించారు – వీటి గురించి అందరి కన్నా ముందుగా నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అడిగాను. ఆయన జవాబిస్తూ అది జిబ్రయీల్ (అలైహిస్సలాం) గురించి వచ్చిన ప్రస్తావన. నేనాయనను ఆయన అసలు రూపంలో రెండు సార్లు చూశాను. (ఈ విషయమే ఖురానులో ప్రస్తావించబడింది) అని వివరించారు.

తదుపరి ఆయెషా (రదియల్లాహు అన్హ) నాతో – నువ్వు “ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు” (అన్అమ్ : 103) అన్న అల్లాహ్ ఆజ్ఞ వినలేదా అని అడిగారు. తదుపరి ఆమె – “ఏ మానవమాత్రుని తోనూ, అల్లాహ్ (నేరుగా) సంభాషించడం అనేది జరగదు. అయితే వహీ ద్వారా లేదా తెర వెనుక నుంచీ లేదా ఒక దూతను పంపటం ద్వారా (ఇది సంభవమే). మరి ఆ దూత అల్లాహ్ ఆజ్ఞననుసరించి అల్లాహ్ కోరిన సందేశాన్ని (వహీ రూపంలో) అందజేస్తాడు. నిశ్చయంగా ఆయన మహెూన్నతుడు, వివేకవంతుడు” (అష్ షూరా : 51) అన్న అల్లాహ్ వాక్కును కూడా నువ్వు వినలేదా అని అడిగారు…. (ముస్లిం : 177)

సహీహ్ బుఖారీలోని ఉల్లేఖనం ప్రకారం – మస్రూఖ్, ఆయెషా (రదియల్లాహు అన్హును ఇలా అడిగారు – ఓ మాతృమూర్తి! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువును చూశారా?

ఆమె జవాబిస్తూ -ఈ ప్రశ్న విని నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేను నీకు మూడు విషయాలు చెబుతున్నా. వీటి గురించి ఎవరైనా (తమ వైపు నుండి) ఏదైనా చెబితే అతను అబద్ధాలగోరుడు, అందులో మొదటి విషయం నీతో ఎవరైనా – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను చూశారని చెబితే అతను పచ్చి అబద్ధాల గోరుడు….. (బుఖారీ : 4855)

(2) అబూ జర్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మీరు మీ ప్రభువును చూశారా? అని అడిగాను. ఆయన జవాబిస్తూ – ఆయన సర్వం కాంతి మయం, నేనాయనను ఎలా చూడగలను? అని వివరించారు. (ముస్లిం : 178)

(3) అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా మధ్య నిలబడి ఐదు విషయాలు వివరించారు. నిశ్చయంగా అల్లాహ్ కు నిద్ర రాదు. ఆయన మహత్యానికి, గొప్పతనానికి – నిద్రపోవడం అనుచితమైనది. ఆయన త్రాసును క్రిందికి దించుతాడు మరియు పైకి లేపుతాడు. రాత్రి ఆచరణ (రాబోయే) పగటి ఆచరణ కన్నా ముందుగా ఆయన వైపునకు లేపబడుతుంది. అలాగే పగటి ఆచరణ (రాబోయే) రాత్రి ఆచరణ కన్నా ముందుగా పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన ముందు కాంతి (తెరలాగ) అడ్డుగా వుంది. ఆయన గనక దానిని తొలగిస్తే ఆయన ముఖ తేజస్సు సృష్టితాలన్నింటీనీ కాల్చి బూడిద చేసేస్తుంది.(ముస్లిం : 179)

ఈ ఆధారాలన్నింటి ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – తన కళ్ళతో ఈ ప్రపంచంలో అల్లాహ్ ను చూడడం ఏ వ్యక్తికీ సాధ్యం కాదు. ప్రవక్తకు కూడా. దీనికి సంబంధించిన మరో ఆధారం మూసా (అలైహిస్సలాం) వృత్తాంతం.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَمَّا جَاءَ مُوسَى لِمِيقَاتِنَا وَكَلَّمَهُ رَبُّهُ ” قَالَ رَبِّ ارِي انْظُرُ إِلَيْكَ قَالَ لَنْ تَرَينِي وَلَكِن انظر إلَى الْجَبَلِ فَإِنِ اسْتَقَرَّ مَكَانَهُ فَسَوْفَ تَرَينِي فَلَمَّا تَجَلَّى رَبُّهُ لِلْجَبَلِ جَعَلَهُ دَنَا وَخَرَّ مُوسى صَعِقَا فَلَمَّا أَفَاقَ قَالَ سُبْحَنَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا أَوَّلُ الْمُؤْمِنِينَ (43)

“మేము నిర్ధారించిన సమయానికి మూసా (అలైహిస్సలాం) వచ్చి, అతని ప్రభువు అతనితో సంభాషించిన తర్వాత అతను – నా ప్రభూ! నాకు నీ దర్శనం కలిగించు. నేను ఓ సారి నిన్ను చూస్తాను అని విన్నవించుకోగా, ఎట్టి పరిస్థితులలోనూ నువ్వు నన్ను చూడలేవు. అయితే అదిగో! ఆ కొండవైపు దృష్టి సారించు. అది గనక యథాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు అని ఆయన సెలవిచ్చాడు. ఆ తరువాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దానిని తుత్తునియలు చేసేసింది. మూసా స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే- (ప్రభూ) నీవు పరమ పవిత్రుడవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాప పడుతున్నాను. అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తు న్నాను అని మనవి చేసుకున్నాడు”. (ఆరాఫ్: 143)

ఇక నజ్మ్ సూరాలోని రెండు ఆయతుల –“మరి అతను సమీపించ సాగాడు… అలా అలా వాలుతూ వచ్చాడు. చివరికి అతను రెండు ధనస్సులంత దూరాన లేక అంత కన్నా తక్కువ దూరాన ఉండిపోయాడు. తరువాత అతడు దైవదాసునికి అందజేయవలసిన సందేశాన్ని అందజేశాడు” (నజ్మ్ : 8-10)ల విషయానికొస్తే, వీటిని విశ్లేషిస్తూ సహీహైన్ (బుఖారీ, ముస్లిం)లో ఆయెషా (రదియల్లాహు అన్హ) మరియు అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అను)లు వీటి అర్థం – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను చూడడం అని వివరించారు.(బుఖారీ : 3232,3235, ముస్లిం : 174, 177)

అయితే, ప్రళయం రోజు మాత్రం అల్లాహ్ విశ్వాసులకు తన దర్శన భాగ్యం కలుగజేస్తాడు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

وجُوهٌ يَوْمين ناضِرَة إلى ريْهَا نَاظِرَة
“ఆ రోజు ఎన్నో ముఖాలు (ఆహ్లాదకరంగా) తాజాగా వుంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ వుంటాయి”. (ఖియామహ్ : 22, 23)

అబూ హురైరా (రదియల్లాహు అను) కథనం: కొందరు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇలా అడిగారు – ఓ దైవ ప్రవక్తా ! ప్రళయం రోజు మేము అల్లాహ్ ను చూడగలుగుతామా? దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ-14వ తేదీ రాత్రి చంద్రుణ్ణి చూడడంలో మీకేమైనా కష్టం కలుగుతుందా? అని అడిగారు. వాళ్ళు లేదు అని అన్నారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)- మేఘాలు లేనప్పుడు సూర్యుని (కనిపించే) విషయంలో మీకేమైనా అనుమానం వుందా? అని అడిగారు. సహాబాలు-లేదు అని జవాబిచ్చారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – ఇలాగే మీరు కూడా మీ ప్రభువును చూడగలుగుతారు అని వివరించారు.(బుఖారీ: 806, ముస్లిం : 182)

సుహైబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు స్వర్గవాసులందరూ స్వర్గంలో ప్రవేశించాక అల్లాహ్ వారినుద్దేశించి- మీకు ఇంకా ఏమైనా కావాలా? అని అడుగుతాడు, వారు – నువ్వు మా ముఖాలను ప్రకాశ వంతం చేయలేదా? మమ్మల్నందరినీ నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదించి స్వర్గంలోకి ప్రవేశింపజేయలేదా? (మాకు ఇంత కన్నా ఇంకేం కావాలి?) అని జవాబిస్తారు. తదుపరి అల్లాహ్ తన ముందు అడ్డుగా వున్న తెరను తొలగిస్తాడు. ఆపై వారికి (స్వర్గవాసులకు) తన ప్రభువును దర్శించడం కన్నా ప్రియమైనదేదీ వుండదు. (ముస్లిం : 181)

అల్లాహ్ మనందరికీ స్వర్గంలో ప్రవేశింపజేసి మనక్కూడా తన దర్శన భాగ్యం కలుగుజేయుగాక!

ఇలా (మొత్తం చర్చ ద్వారా) మనకు తెలిసిందేమిటంటే – జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను సిద్రతుల్ మున్తహా ను దాటి అల్లాహ్ ఆజ్ఞలను, నిర్ణయాలను వ్రాస్తున్న కలముల చప్పుడు వినబడే ప్రదేశం వరకు తీసుకెళ్ళారు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు : తదుపరి అల్లాహ్ తాను వహీ చేయదలుచుకున్నది నావైపునకు వహీ చేశాడు మరియు 50 నమాజులు విధిగా చేశాడు.

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: నేను తిరిగి వస్తూ మూసా (అలైహిస్సలాం) దగ్గరికి చేరుకున్నాను. ఆయన నన్ను – మీ ప్రభువు మీ ఉమ్మత్ పై దేనిని విధిగా చేశాడు? అని అడిగారు, నేను జవాబిస్తూ- రేయింబవళ్ళలో 50 నమాజులు అని అన్నాను. ఆయన- మీరు తిరిగి మీ ప్రభువు వద్దకెళ్ళి వీటిలో తగ్గింపు కోసం అడగండి, ఎందుకంటే మీ ఉమ్మత్ దీనిని ఆచరించే శక్తి కలిగి వుండదు. నేను బనీ ఇస్రాయీల్ను పరీక్షించి వున్నాను అని అన్నారు. దీనితో నేను తిరిగి నా ప్రభువు వైపుకు వెళ్ళి – ఓ నా ప్రభూ! నా ఉమ్మత్ పై (ఈ విధిని) కాస్త తగ్గించు అని వేడుకున్నాను. దీనిపై అల్లాహ్ 5 నమాజులు తగ్గించాడు. తదుపరి నేను మూసా (అలైహిస్సలాం) దగ్గరికి చేరుకోగానే ఆయన – ఏమయ్యింది? అని నన్ను అడిగారు. నేను అల్లాహ్ 5 నమాజులు తగ్గించాడు అని చెప్పాను. ఆయన నాతో మీ ఉమ్మత్ దీనిని కూడా ఆచరణలో పెట్టే శక్తి కలిగి వుండదు, మీరు మళ్ళీ వెళ్ళి తగ్గింపు కోసం అడగండి అని అన్నారు.

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు:

నేను నా ప్రభువు వైపుకు, మూసా (అలైహిస్సలాం)కు మధ్య పలుమార్లు రావడం, పోవడం జరిగింది. ప్రతీసారీ అల్లాహ్ 5 నమాజులు తగ్గిస్తూ పోయాడు. చివరికి అల్లాహ్ నాతో – ఓ ముహమ్మద్ ! ఇక రేయింబవళ్ళలో ప్రతి రోజూ 5 నమాజులు వున్నాయి. ప్రతి నమాజ్ 10 నమాజులతో సమానం అంటే (సంఖ్యా పరంగా 5 నమాజులైనప్పటికీ పుణ్యపరంగా మాత్రం 50 నమాజులు). (ముస్లిం : 162)

మరో ఉల్లేఖనంలో ఇలా వుంది – అల్లాహ్ పదేసి చొప్పున నమాజులు తగ్గిస్తూ పోయి చివరిగా 5 నమాజులు తగ్గించి చివరికి 5 నమాజులు వుంచాడు. ఆ సమయంలో కూడా మూసా (అలైహిస్సలాం) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను (అల్లాహ్ వైపుకు) వెళ్ళి మరిన్ని నమాజులు తగ్గించమని కోరండని చెప్పారు. దానికి నేను ఇప్పుడైతే (తగ్గించమని అడగడానికి) నాక్కూడా సిగ్గేస్తుంది. నేను దీనికి సంతృప్తి చెంది, శిరసావహిస్తున్నాను అని అన్నాను. దీనితో కేకవేసే వారొకరు కేకవేసి ఇలా పలికారు – నేను నా ఆజ్ఞను జారీ చేశాను మరియు నా దాసులకు (నమాజులను) తగ్గించాను. ఒక్క పుణ్యానికి గాను నేను వారికి అలాంటివే 10 పుణ్యాలు ఇస్తాను. (బుఖారీ: 3207)

ఇస్లామీయ సోదరులారా! రేయింబళ్ళలోని 5 నమాజలు మేరాజ్ కానుక. ఈ అద్భుత సంఘటన (మేరాజ్) ద్వారా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఔన్నత్యముతో పాటు నమాజుల ప్రాముఖ్యత మరియు విధిత్వం కూడా రుజువవుతుంది. దివ్య ఖురాన్లో అల్లాహ్ విశ్వాసులకు నమాజును క్రమం తప్పకుండా స్థాపిస్తూ వుండమని మాటి మాటికీ తాకీదు చేశాడు. నమాజును త్యజించిన వారికి, సోమరితనంతో దానిని నెరవేర్చని వారికి నరక శిక్షను గురించి ప్రస్తావించాడు.

నస్అలుల్లాహుల్ అఫ్వ వ ఆఫియ

మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దైవాజ్ఞలన్నీ ఈ భూమి మీదే అవతరించి విధిగా గావించబడ్డాయి. నమాజ్ మాత్రం ఆకాశాలపైన విధిగా గావించబడింది. స్వయంగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా జీవితాంతం నమాజ్ చదివి, తన ఉమ్మత్ కు ఆఖరి వసీయతుగా నమాజ్ ను క్రమం తప్పకుండా పాటిస్తూ వుండండని, మీ ఆధీనంలో వున్న వారి హక్కులను నెరవేర్చండి – అనే ఉద్బోధించారు.

అందుకే, ప్రతి ముస్లిం – మేరాజ్ సంఘటన ద్వారా తన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకొని, ఈ మేరాజ్ కానుక (నమాజ్) విధిత్వాన్ని హృదయ పూర్వకంగా గుర్తించి క్రమం తప్పకుండా దానిని ఆచరణలో పెడుతూ వుండాలి. ఎందుకంటే – దీనిలో కంటి చలువ, హృదయ ప్రశాంతత ఇమిడి వున్నాయి. అల్లాహ్ ను స్తుతించడానికి ఇదొక గొప్ప మాధ్యమం. అందుకే దీనిని ‘ఉమ్ముల్ ఇబాదాత్’ (ఆరాధనల తల్లి) అని మరియు ‘విశ్వాసి మేరాజ్’ అని అంటారు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు: నమాజుల విధిత్వంతోపాటు ఈ విషయం కూడా నా వైపునకు వహీ చేయబడింది. ఎవరైనా ఏదైనా మంచి పనిని చేయాలని సంకల్పించుకొని తదుపరి దానిని ఆచరించలేకపోతే, అతనికి (అతని సంకల్పానికి ప్రతిఫలంగా) ఒక పుణ్యం లభించబడుతుంది. ఒకవేళ అతను దానిని ఆచరణలో పెడితే అప్పుడు అతనికి 10 పుణ్యాలు లిఖించబడతాయి. అలాగే, ఎవరైనా ఏదైనా చెడు పని చేయాలని సంకల్పించుకొని తదుపరి దానిని ఆచరణలో పెట్టకపోతే అతనికి ఏ పాపం లిఖించబడదు. ఒకవేళ అతను దానిని ఆచరణలో కూడా పెడితే అప్పుడు అతనికి ఒక పాపం లిఖించబడుతుంది. (ముస్లిం : 162)

అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మూడు బహుమతులు ఇవ్వబడ్డాయి. – (1) ఐదు నమాజులు (2) బఖర సూరా ఆఖరి రెండు ఆయతులు (3) ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ (అనుచర సమాజం)లో షిర్క్ చేయని ప్రతి వ్యక్తి పెద్ద పాపాలు క్షమించబడ్డాయి.

మొదటి బహుమతి – ఐదు నమాజులు. దీని గురించి మేము ఇంతకు ముందే క్లుప్తంగా వివరించాం.

ఇక రెండవ బహుమతి – బఖర సూరా యొక్క ఆఖరి రెండు ఆయతులు వీటి మహత్యం గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. ఏ వ్యక్తి అయినా రాత్రి బఖర సూరా యొక్క ఆఖరి రెండు ఆయత్లు పఠిస్తే అవి ఆ రాత్రికి (అతని కోసం) సరిపోతాయి. (బుఖారీ, ముస్లిం)

ఇక మూడవ బహుమతి – ఏకదైవారాధన (తౌహీద్)పై మరణించిన ప్రతి వ్యక్తి పెద్ద పాపాలు క్షమించబడుట. దీని అర్థం ఏమిటంటే – అల్లాహ్ తాను తలుచుకొంటే అతణ్ణి ఏ మాత్రం శిక్షించకుండా క్షమిస్తాడు లేదా అతని పెద్ద పాపాల మేరకు అతణ్ణి శిక్షించి తదుపరి నరకం నుండి బయటకు తీసి స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. కొంత మంది అవిధేయ ఏకదైవారాధకుల గురించి అహ్లెసున్నత్ వల్ జమాఅత్ విశ్వాసం ఇదే. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు వున్నాయి.

(1) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:

నన్ను విహరింపజేయబడిన రాత్రి (మేరాజ్) నాకు అత్యుత్తమ సువాసన అనుభూతి కలిగింది. నేను – ఓ జిబ్రయీల్! ఈ ఉత్తమ సువాసన ఏంటి? అని అడిగాను. ఆయన – ఇది ఫిరౌన్ కూతురికి జడవేసిన స్త్రీ మరియు ఆమె సంతానం సువాసన అని అన్నారు. నేను దాని వృత్తాంతం ఏమిటి? అని అడిగాను.

ఆయన- ఆమె ఒక రోజు ఫిరౌన్ కూతురికి జడవేస్తుండగా, ఆమె చేతి నుండి దువ్వెన జారి క్రింద పడింది. దీనిపై ఆమె ‘బిస్మిల్లాహ్’ అని పలికింది. ఫిరౌన్ కూతురు మా నాన్నా? అని అడిగింది. ఆ స్త్రీ – కాదు, ఆయన అల్లాహ్, నీ తండ్రికి కూడా ప్రభువు (ఆయనే) ఫిరౌను కూతురు – (మరైతే) ఈ విషయం మా నాన్నకు చేరవేయనా? ఆ స్త్రీ – అలాగే, చేరవేయి అని అంది.

తదుపరి ఫిరౌను కూతురు ఈ విషయాన్ని ఫిరౌనుకు చేరవేసింది. ఫిరౌను స్త్రీని పిలిచి- నేను తప్ప నీకు మరో ప్రభువు వున్నాడా? అని అడిగాడు. అవును (వున్నాడు) ఆయనే అల్లాహ్. ఆయన నాకూ, నీకూ ప్రభువు. ఇది విని (ఆగ్రహంతో) ఫిరౌను – ఒక పెద్ద రాగి పాత్రలో నూనె వేడి చేయమని ఆజ్ఞాపించాడు. తదుపరి ఆమెను, ఆమె సంతానాన్ని దానిలో వేయమని ఆదేశించాడు. దీనిపై ఆ స్త్రీ అతనితో – నా దొక విన్నపం! అంది. అతను – ఏమిటది? అని అడిగాడు. ఆమె – మరణించాక నా ఎముకలు, నా సంతానం ఎముకలు అన్నింటినీ ఒకే చోట కలిపి పూడ్చిపెట్టు అని అంది. అతను – సరే మంచిది అని అన్నాడు. తదుపరి అతని ఆదేశం మేరకు ఆమె సంతానాన్ని ఒక్కొక్కరిగా, సలసల కాగుతున్న నూనెలో వేయడం జరిగింది. చివరికి పాలు త్రాగే చిన్న పిల్లవాడి వంతు వచ్చింది. ఇది చూసి ఆమె కొంచెం అధైర్యపడి, వెనక్కు జరగడం చూసి ఆ పాలు త్రాగే పిల్లవాడు ఇలా పలికాడు – అమ్మా! (నూనెలోకి)దూకేయ్! ఎందుకంటే ఇహలోక శిక్ష పరలోక శిక్ష కన్నా తక్కువ. ఇది విని ఆమె కూడా (దానిలోకి) దూకేసింది. (అహ్మద్, ఇబ్నె హిబ్బాన్, అల్బానీ- ఇస్రావ మేరాజ్)

(2) అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. ఇస్రా వ మేరాజ్ రాత్రి నేను ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను కలిసాను. ఆయన నాతో – ఓ ముహమ్మద్ ! మీ అనుచర సమాజానికి నా తరఫు నుండి సలాములు తెలియ జేయండి మరియు స్వర్గపు మట్టి ఎంతో ఉన్నతమైనదని, దాని నీళ్ళు ఎంతో తియ్యగాను, దాని నేల పూర్తిగా సమతలం (చదునైన మైదానం) గానూ వుందని మరియు ‘సుబహానల్లాహి, వల్ హమ్దులిల్లాహి వలాయిలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్’ (స్మరణ) ద్వారా దానిలో వృక్షారోపణం చేయవచ్చని కూడా తెలియజేయండి. (తిర్మిజీ : 3462, సహీహ్ – అల్బానీ)

(3) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు:

నా ప్రభువు నాకు మేరాజ్ చేయించినప్పుడు నేను రాగితో చేయబడిన గోర్లు కలిగివుండి, వాటితో తమ ముఖాన్ని, ఛాతీని పీక్కుంటున్న కొందరు వ్యక్తుల సమీపం నుండి పోతూ – ఓ జిబ్రయీల్! వీళ్లెవరు? అని అడగ్గా, ఆయన – వీళ్ళు ఇతరుల మాంసం తినేవారు (చాడీలు చెప్పేవారు) మరియు ఇతరుల మాన, మర్యాదల గురించి చెడుగా మాట్లాడేవారు అని అన్నారు. (అల్బానీ – ఇస్రా వ మేరాజ్, అహ్మద్)

(4) అనస్ (రదియల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: మేరాజ్ రాత్రి నేను కొంత మంది పెదాలను అగ్ని కత్తెరతో కత్తిరించడం చూసి – ఓ జిబ్రయీల్! ఎవరు వీళ్ళు? అని అడగ్గా – ఆయన – వీళ్ళు మీ అనుచర సమాజంలోని వక్తలు. వీరు ప్రజలకైతే మంచిని గూర్చి బోధిస్తారు కానీ స్వయంగా వారు మాత్రం మరిచిపోతుండేవారు. మరి చూడబోతే వారు అల్లాహ్ గ్రంథాన్ని కూడా పారాయణం చేస్తారు. అయినప్పటికీ వీరికి బుద్ది లేదా? (అల్బానీ – ఇస్రా వ మేరాజ్, అహ్మద్, అల్ బగవీ)

ఇవన్నీ ప్రామాణిక పరంపరలతో ఉల్లేఖించబడిన ఇస్రా వ మేరాజ్ అద్భుతానికి సంబంధించిన సంఘటనలు. మేము యథాతథంగా వీటిని మీకు వివరించాము.

అల్లాహ్ మనందరినీ ఎంతో మహోన్నతమైన ఈ అద్భుతం మరియు దీనిలో ప్రస్తావించబడిన అగోచర విషయాలన్నింటినీ విశ్వసించి, వాటి ఉద్దేశ్యాలను పరిపూర్ణం చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!

హాఫిజ్ ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ తన ‘తఫ్సీర్’ లో ఇలా ప్రస్తావించారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్ నుంచి తిరుగు ప్రయాణమైనప్పుడు, ఇతర ప్రవక్తలు కూడా ఆయనతో పాటు వచ్చి బైతుల్ మఖ్దిస్ లో ఆయన వెనుక నమాజ్ చేశారు. బహుశా అది ఆరోజు ఫజర్ నమాజు కావచ్చు……

తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బైతుల్ మఖ్దిస్ నుండి బయలు దేరి బురాఖ్ పై ఎక్కి ప్రయాణం చేసి సూర్యోదయానికి ముందుగా చీకటిలోనే మక్కా చేరుకున్నారు. (తఫ్సీర్ ఇబ్నె కసీర్ 3వ సంపుటం, 32వ పేజీ

బహుశా ఆయన ఆధారం – సహీహ్ ముస్లింలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించిన ఈ హదీసు కావచ్చు:

“నన్ను నేను పరికించి చూసుకోగా నేను ప్రవక్తల సమూహంలో వున్నాను. అకస్మాత్తుగా నేను మూసా (అలైహిస్సలాం)ను నిలబడి నమాజ్ చేస్తుండడం చూశాను. (నేనాయనను నిశితంగా పరిశీలించి చూస్తే) ఆయన సన్నగా, ఉంగరాల జుట్టుతో షనూఅ తెగ వారిలాగా కనిపించారు. తదుపరి నేను ఈసా (అలైహిస్సలాం)ను కూడా నలబడి నమాజ్ చేస్తుండడం చూశాను. ఆయనకు దగ్గరిగా పోలివున్నవారు ఉర్వా బిన్ మద్ అస్సఖఫీ. మళ్ళీ నేను – ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను కూడా నిలబడి నమాజ్ చేయడం చూశాను. ఆయనకు దగ్గరిగా పోలివున్న వారు మీ ఈ సహచరులే (అంటే స్వయంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నమాట)”. (ముస్లిం : 172)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఇస్రా వ మేరాజ్’ తర్వాత మక్కాకు తిరిగి వస్తున్నప్పుడు ఖురైషీయుల ఒక సమూహం నుండి వెళ్ళారు. ఆ సమూహానికి చెందిన ఒక ఒంటె అదృశ్యమయ్యింది. (దారి తప్పింది). దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మక్కా అవిశ్వాసులకు ఆ సమూహం గురించి మరియు దాని ఆగమన సమయం గురించి ముందే తెలియజేయగా ఆయన చెప్పినట్లే జరిగింది. అయినప్పటికీ అవిశ్వాసులు ఈ మహోన్నత సంఘటనను విశ్వసించడానికి తిరస్కరించారు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: నన్ను విహరింపజేయడం జరిగిన రాత్రి నాటి సూర్యోదయానికి నేను మక్కాలో వున్నాను. ఈ విషయమై ప్రజలు నన్ను తిరస్కరిస్తారేమో అని ఆందోళనకు గురయ్యాను.అందుకే నేను జనాలతో వేరయిపోయి ఒంటరిగా విచార వదనంతో కూర్చొనివున్నాను. ఇదే తరుణంలో అల్లాహ్ శత్రువు అబూ జహల్ నా సమీపం నుండి వెళుతూ, నన్ను చూసి, నా దగ్గరి కొచ్చి కూర్చొని వేళాకోళంగా ఇవ్వాళ ఏమైనా కొత్త విషయం వుందా? అని అడిగాడు. నేను – వుంది అని అన్నాను. ఏమిటది అని అడిగాడు. నేను – గత రాత్రి నన్ను విహరింపజేయడం జరిగింది అని అన్నాను. అతను – ఎక్కడికి అని అడిగాడు. నేను – బైతుల్ మఖ్దిస్ అని అన్నాను. అతను – అక్కడ విహరించి ఉదయం వరకు మా దగ్గరిక్కూడా వచ్చేశారా? అని అడిగాడు. నేను – అవును అని అన్నాను.

నా జాతి వారిని నా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఈ విషయం వారి ముందుంచడానికి బహుశా నేను తిరస్కరిస్తానేమో అని భావించి అతను నా మాటను తిరస్కరించలేదు. అందుకే ఇలా అన్నాడు – ఒకవేళ మీ జాతి వారిని మీ వద్దకు తీసుకొస్తే వారి ముందు కూడా ఈ విషయం చెప్పండి. నేను – సరే అన్నాను. తదుపరి అతడు బనూ కాబ్ బిన్ లూయీని పిలిచాడు. వారంతా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర గుమిగూడారు.అబూ జహల్ మీరు నాకు చెప్పిన విషయాన్నే మీ జాతి వారికి కూడా వినిపించండి అని అన్నాడు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విహరింపజేయడం జరిగింది అని అన్నారు. ప్రజలు – ఎక్కడికి అని అడిగారు. గత రాత్రి నన్ను ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – బైతుల్ మఖ్దిస్ అని అన్నారు. ప్రజలు – మరైతే ఉదయాన్నే మీరు మా మధ్య వున్నారు? ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అవును అని అన్నారు.

దీనిపై కొందరు చప్పట్లు కొట్టడం ప్రారంభించగా మరి కొందరు ఆశ్చర్యచకితులై తల పట్టుకున్నారు.తదుపరి వారు మీరు మస్జిదె అఖ్సా గురించి వివరించగలరా? అది ఎలా వుంది? అని అడిగారు. వారిలో కొందరు (గతంలో) మస్జిదె అఖ్సాకు ప్రయాణం చేసి, దానిని దర్శించి వున్నారు.

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు: నేను మస్జిదె అఖ్సా గురించి – అది ఇలా వుంది, అలా వుంది అని వివరించే సమయంలో దానికి సంబంధించిన కొన్ని విషయాలలో నాకు సందేహం కలిగింది. ఈలోగా నేను చూసిందేమిటంటే మస్జిద్ అఖ్సా ను అఖీల్ ఇంటికి దగ్గరగా తెచ్చి నిలబెట్టడం జరిగింది. నేను నా కళ్ళతో దాని వైపు చూస్తూ దాని గురించి వివరించసాగాను. ఆఖరికి వాళ్ళంతా – అల్లాహ్ సాక్షిగా! మస్జిదె అఖ్సాకు సంబంధించినంత వరకు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ విషయంలోనూ అసత్యం పలకలేదు అని ఒప్పుకున్నారు. (అహ్మద్, నసాయి, అస్సహీహ : 3021)

అబూ హురైరా (రదియల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

నేను కాబా యొక్క హతీమ్ లో వుండగా ఖురైషీయులు నన్ను ఇస్రా సంఘటన గురించి ప్రశ్నిస్తూ బైతుల్ మఖ్దిస్ గురించి నేను మరిచిపోయిన విషయాలు అడిగారు. ఆ రోజు ఆందోళనకు గురైనట్లు నేనెప్పుడూ ఆందోళనకు గురికాలేదు. ఈ లోగా అల్లాహ్ యే బైతుల్ మఖ్దిస్ ను నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆ తర్వాత వాళ్ళడిగిన ప్రశ్నలకు నేను బైతుల్ మఖ్దిస్ ను చూస్తూ జవాబిచ్చుకుంటూ పోయాను. (ముస్లిం : 172)

ఖురైషీయుల పరిస్థితి ఇలా వుంది.

కానీ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ను విశ్వసించిన వారి పరిస్థితి ఎలా వుందంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఈ సంఘటనను విని వెంటనే వారు దానిని (సత్యమని) నిర్ధారించారు.

జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఖురైషీయులలో కొంత మంది అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) దగ్గరికొచ్చి ఆయనతో ఇలా అన్నారు – ఒకే రాత్రి బైతుల్ మఖ్దిస్ వెళ్ళి తిరిగి మక్కాకు వచ్చేశానని మీ సహచరుడు వాదించడాన్ని మీరు ఒప్పుకుంటారా? అబూ బక్ర్ (రదియల్లాహు అన్పు) వారితో- నిజంగానే ఆయన ఇలా చెప్పారా? అని అడిగారు. వాళ్ళు – అవును, నిజంగానే ఇలా చెప్పారు అని అన్నారు.అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) – అలా అయితే (ఆయనే గనక చెప్పి వుంటే) ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సత్యం పలికారు అని జవాబిచ్చారు.

మరో ఉల్లేఖనంలో ఇలా వుంది: అబూ బక్ర్ (రదియల్లాహు అను) వారికిలా జవాబిచ్చారు – “(బైతుల్ మఖ్దిస్ యే కాదు) అంత కన్నా దూరంగా వున్న విషయాలను, ఆకాశం నుండి వహీ అవతరించిందని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చే సమాచారాన్ని సైతం నేను (సత్యమని) నిర్ధారిస్తాను” అందుకే ఆయనను సిద్దీఖ్ (సత్యవంతుడు) అని పిలవడం జరిగింది. (దలాయలున్నబవియ లిల్ బైహఖీ, ఇస్రా వ మేరాజ్ అల్బానీ – 60, 61 పేజీలు – సహీహ్)

ఆఖరుగా ఈ అద్భుత సంఘటన వెనుక గల ముఖ్యమైన ఉద్దేశ్యాలలో కొన్నింటిని గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం.

(1) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఈ అద్భుతం ప్రసాదించబడిన సమయంలో ఆయన సతీమణి ఖదీజా (రదియల్లాహు అన్హ) మరియు బాబాయి అబూ తాలిబ్ లు మరణించిన కారణంతో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో దుఃఖంలో వున్నారు. అంతేగాక, తాయిఫ్ వాసుల దుష్ప్రవర్తన కూడా ఆయన మనస్సును కలచివేసింది. అలాంటి సమయంలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ‘ఇస్రా వ మేరాజ్’ ద్వారా ఉపశమనం కలిగించబడింది. భూలోక వాసులు మీ పట్ల దురుసుగా ప్రవర్తించినా ఆకాశవాసులు మాత్రం మీకు ఘనస్వాగతం పలుకుతారన్న భావాన్ని ఆయనకు కలుగజేయడం జరిగింది.

(2) బైతుల్ మఖ్దిస్ లో (నమాజులో) ప్రవక్తలందరికీ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నిలబెట్టడం ద్వారా ఆయన శ్రేష్ఠత నిరూపించబడింది.

(దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో ఇతర ప్రవక్తలందరూ ముఖ్తదీలుగా మారి ఆయనను అనుసరించారు. కానీ, నేటి ముస్లిములలో కొందరు ఆచరణ రీత్యా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అనుసరించడం మాని ఆయన ఉమ్మత్ కు చెందిన కొందరు ఇమాములను అనుసరించడం కడు శోచనీయం!-అనువాదకుడు)

(3) ఛాతీని తెరవడం ద్వారా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్వాసాన్ని మరింతగా పెంచి, దానిని తాజాగా, మరింత బలోపేతం చేయడం జరిగింది.

(4) ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఆకాశాలపైకి తీసుకెళ్ళి అల్లాహ్ యొక్క మహెూన్నత సూచనలను చూపించడం జరిగింది. స్వర్గంలో విహరింపజేయడం జరిగింది. నరక శిక్షను అనుభవిస్తున్న వారిని చూపించడం జరిగింది. సిద్రతుల్ మున్తహా వగైరా॥లను దర్శింపజేయడం జరిగింది. నిశ్చయంగా ఇలాంటి అగోచర విషయాల పట్ల (ఈ యాత్ర) ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)లో దృఢ నమ్మకం కలిగేలా చేసింది.

(5) ఈ మహోన్నత యాత్రలో అల్లాహ్ రేయింబవళ్ళలో 5 నమాజులు విధిగా చేయడం-ఇస్లాం మౌలికాంశాలలో దీనికి గల ప్రాధాన్యతను సూచిస్తుంది.

అల్లాహ్ మనందరికీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అద్భుతాలన్నింటినీ విశ్వసించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు ప్రళయం రోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు మరియు ఆయన చేతుల మీదుగా కౌసర్ సరస్సు నీళ్ళు త్రాగే భాగ్యాలను ప్రసాదించుగాక! ఆమీన్!

వ ఆఖిరుద్దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్