ఖుత్బా యొక్క ముఖ్యాంశాలు:
1) రజబ్ మాసం నిషేధిత మాసాల్లో ఒకటి
2) రజబ్ మాసంలోని కొన్ని బిద్అత్ (కొత్తపోకడ)లు
3) సలాతుల్ రగాయిబ్
4) రజబ్ మాసంలో ప్రత్యేక ఉపవాసాలు
5) రజబ్ మాసపు 27వ రాత్రి ఆరాధన లేదా మరుసటి దినపు ఉపవాసం
6) రజబ్ మాసంలో ఉమ్రా చేయడం ఉత్తమమా?
7) రజబ్ కే కుండే (రజబ్ మాసపు నైవేద్య వంటకాలు)
ఇస్లామీయ సోదరులారా! నిషేధిత నాలుగు మాసాల్లో రజబ్ మాసం కూడా ఒకటి.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ
“నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతోంది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా: 36)
అంటే మొదట్నుంచి అల్లాహ్ దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు. అందులో నాలుగు నెలలు నిషేధిత మాసాలు.
ఈ నాలుగు నిషిద్ధ మాసాలు ఏవి?
దీని వివరణ మనకు సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ బక్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక సం॥ పన్నెండు నెలలు కలిగి వుంది. వీటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి. వీటిలో మూడేమో ఒకదాని తర్వాత మరొకటి వచ్చేవి. అవేమంటే – జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు ముహర్రం. ఇక నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ నెలల మధ్య వచ్చే రజబ్ -ఏ-ముజిర్.” (బుఖారీ – తౌబా సూరహ్ తఫ్సీర్)
ఈ హదీసులో రజబ్ మాసాన్ని ‘ముజిర్’ తెగతో జోడించి చెప్పబడింది. కారణం ఏమిటంటే ఇతర తెగల కన్నా ఈ తెగ రజబ్ మాసాన్ని ఎక్కువగా గౌరవిస్తూ మితి మీరి ప్రవర్తించేది.
ప్రియులారా! ఇంతకు ముందు పేర్కొన్న – నాలుగు నిషిద్ధ మాసాలను గూర్చి తెలిపే తౌబా సూరాలోని ఆయతును అల్లాహ్ వివరించాక (ప్రత్యేకంగా) “మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి” అని ఆజ్ఞాపించాడు.
దౌర్జన్యం విషయానికొస్తే అది సం॥ పొడుగునా, ఎల్లవేళలా వారించ బడింది. కానీ, ఈ నాలుగు మాసాల్లో – వాటి గౌరవాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొని అల్లాహ్ ప్రత్యేకంగా, ‘దౌర్జన్యం చేసుకోకండి’ అని వారించాడు.
ఇక్కడ “దౌర్జన్యం” అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటంటే – ఈ మాసాల్లో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోడాలు చేయకండి అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
”నిషిద్ధ మాసాల్లో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికిలా చెప్పు – ఈ మాసాలలో యుద్ధం చెయ్యటం మహాపరాధం.” (బఖర : 217)
అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల నిషేధాన్ని గుర్తించి వాటిలో యుద్ధాలు, గొడవలకు స్వస్తి పలికేవారు. అరబ్బీభాషలో ‘రజబ్’ అన్న పదం ‘తర్జీబ్‘ నుండి వచ్చింది. దీని అర్థం ‘గౌరవించడం‘ అని కూడా. ఈ మాసాన్ని ‘రజబ్’ అని పిలవడానికి కారణం అరబ్బులు ఈ మాసాన్ని గౌరవించేవారు. ఈ మాసంలో విగ్రహాల పేరు మీద జంతువులు బలి ఇచ్చేవారు. ఈ ఆచారాన్ని ‘అతీరా’ అని పిలిచేవారు. తదుపరి ఇస్లాం వచ్చాక అది కూడా వీటి గౌరవాన్ని, పవిత్రతను యధావిధిగా వుంచి వీటిలో గొడవ పడడాన్ని పెద్దపాపంగా ఖరారు చేసింది. కానీ, రజబ్ మాసంలో తలపెట్టే ‘అతీరా’ కార్యాన్ని పూర్తిగా నిషేధించింది.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఇస్లాంలో ‘ఫరఅ’ లేదు మరియు ‘అతీరా” కూడా లేదు.” (బుఖారీ : 5473, ముస్లిం :1976)
‘ఫరఅ‘ అంటే-అజ్ఞాన కాలంలో ప్రజలు విగ్రహాల కొరకు జిబహ్ చేసే (బలి ఇచ్చే) ఒంటె, ఆవు మరియు మేకలకు మొదటి కాన్పులో జన్మించిన పిల్లలు. ఇక ‘అతీరా‘ అంటే – రజబ్ మాసంలో ప్రజలు తమ విగ్రహాల కొరకు బలి ఇచ్చే పశువులు. ఈ ఆచారాన్ని ‘రజబియా‘ అని కూడా పిలిచేవారు.
ప్రియ సోదరులారా! ఈ హదీసు ద్వారా రూఢీ అయ్యే ఇంకో విషయమేమిటంటే – అల్లాహ్ యేతరుల కోసం జంతువులు బలియివ్వడం నిషిద్దం మరియు ఇస్లాం నుంచి బహిష్కరణకు గురిచేసే పెద్ద షిర్క్. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“మీ కొరకు నిషేధించబడిన వస్తువులు ఇవి: మృత పశువు, రక్తం, పంది మాంసం, అల్లాహ్ పేరు గాక యితరుల పేరు ఉచ్చరించవడినది, గొంతు పిసకబడటం వల్ల మృతి చెందిన పశువు, దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తయిన స్థలం నుంచి క్రింద పడి చనిపోయినది లేక కొమ్ము తగలడం వల్ల చనిపోయినది, క్రూర మృగాలు చీల్చి తినగా చనిపోయిన పశువు (ఇవన్నీ మీకు హరామ్ గావించబడ్డాయి) కానీ ఒకవేళ మీరు ‘జిబహ్’ చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు. అలాగే ఆస్థానాల వద్ద బలి యిచ్చినవి కూడా నిషిద్ధమే. అదేవిధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించు కోవడం కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాపకార్యాలు.” (మాయిద : 3)
ఈ ఆయతులో ‘మా ఉహిల్ల లిగైరిల్లాహ్’ అని పేర్కొని అల్లాహ్ యేతరుల కోసం బలియిచ్చే అన్ని జంతువులను నిషిద్ధం చేయడం జరిగింది. అలాగే ‘వమా జుబిహ అలన్నుసుబ్’ అని పేర్కొని షిర్క్క కేంద్రంగా మారిన అస్థానాల వద్ద, దర్బార్ల, మజార్ల వద్ద జిబహ్ చెయ్యబడే జంతువులన్నీ నిషేధించడం జరిగింది.
పైగా ఇస్లాంలో నైతే – షిర్క్ జరిగే స్థలాల్లో, అల్లాహ్ పేరు ఉచ్చరించి జిబహ్ చేసినప్పటికీ అలాంటి పశువులు కూడా హరామ్ గావించబడ్డాయి.
సాబిత్ బిన్ జిహాక్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి ‘బవానా’ అనే స్థలంలో ఒంటెను జిబహ్ చేస్తాడని మొక్కుబడి చేసుకున్నాడు. తదుపరి, అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి, (విషయం వివరించి) నేను నా మొక్కుబడిని తీర్చుకోనా? అని అడిగాడు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో “అక్కడ అజ్ఞాన కాలంలో ఏ విగ్రహమైనా పూజింపబడేదా? అని అడిగారు. అతను ‘లేదండి’ అని జవాబిచ్చాడు. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో – నీవు మ్రొక్కుబడిని తీర్చుకో. ఎందుకంటే అల్లాహ్ కు అవిధేయత చూపడానికి మ్రొక్కుబడి తీర్చుకోవద్దు. అలాగే తనకు స్థోమత లేని (తను చేయలేని) మ్రొక్కుబడిని కూడా తీర్చుకోవద్దు. (అబూ దావూద్ – సహీహ్ అల్బానీ)
ఈ హదీసు ద్వారా రుజువైన విషయమేమంటే – ఉర్సులాంటి ఉత్సవాలు జరిగే స్థలాలలో, అల్లాహ్ యేతరులు పూజింపబడే స్థలాల్లో అల్లాహ్ పేరు ఉచ్చరించి కూడా పశువులను జిబహ్ చేయకూడదు మరియు అలాంటి స్థలాల్లో ఎలాంటి మ్రొక్కుబడిని తీర్చుకోకూడదు.
ఎందుకంటే బవానా అనే స్థలంలో ఒంటెను జిబహ్ చేసి తన మ్రొక్కుబడిని తీర్చుకోవడానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అనుమతి అడిగిన ఆ సహాబి ఉద్దేశ్యం నిస్సందేహంగా అల్లాహ్ పేరుతో జిబహ్ చెయ్యాలనే అయినప్పటికీ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి – అక్కడ ఏదైనా విగ్రహం పూజింపబడేదా? అక్కడ ఉర్సు /మేళాలు లాంటి వేమన్నా జరుగుతాయా లాంటి పలు ప్రశ్నలు వేసి, అక్కడ ఇలాంటి పనులేవీ జరగడం లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే అతనికి తన మ్రొక్కుబడిని తీర్చుకొనే అనుమతి ఇచ్చారు. ఒకవేళ అక్కడ అల్లాహ్ యేతరులు ఎవరైనా పూజింపబడుతూ వుంటే లేదా అక్కడ ఉర్సు వగైరా ఉత్సవాలు జరుగుతూ వుంటే ఖచ్చితంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతి ఇచ్చేవారు కాదు.
దీని ద్వారా బోధ పడిందేమిటంటే – ఇలాంటి స్థలాల్లో అల్లాహ్ పేరు ఉచ్చరించి కూడా పశువులను జిబహ్ చెయ్యకూడదు. కనుక ముస్లిములందరూ ఇలాంటి పనుల నుండి శాశ్వతంగా దూరంగా వుండాలి.
ఇస్లామీయ సోదరులారా!
అల్లాహ్ ఆజ్ఞ – ‘మీ పై దౌర్జన్యం చేసుకోకండి’ -లో ‘దౌర్జన్యం’ అంటే మరో అర్థమేమిటంటే – మీరు ప్రత్యేకించి ఈ నాలుగు మాసాల్లో అల్లాహ్ అవిధేయతకు దూరంగా వుండండి. ఎందుకంటే ఈ వ్యవధిలో అవిధేయత వల్ల దొరికే పాపఫలం ఎన్నో రెట్లు అధికమవుతుంది.
హాఫిజ్ ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్, ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇలా ఉల్లేఖించారు:
“దౌర్జన్యాన్ని అల్లాహ్ సంవత్సరంలోని పన్నెండు నెలలూ నిషేధించాడు. తదుపరి వాటిలోని నాలుగు నెలలను ‘ప్రత్యేకం’ చేశాడు. ఎందుకంటే – వీటిలో (నాలుగు మాసాల్లో) చెడు మరియు అవిధేయతల పాపఫలం అధికమవుతుంది మరియు మంచి, సదాచరణల పుణ్యఫలం పెరుగుతుంది”.
ఇమామ్ ఖతాదా రహిమహుల్లాహ్ – ‘మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి’ గురించి ఇలా వివరించారు:
“నిషిద్ధ మాసాల్లో దౌర్జన్య పాపం, దాని భారం ఇతర మాసాల కంటే ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. వాస్తవానికి దౌర్జన్య పాపఫలం ఎల్లప్పుడూ అధికంగానే వుంటుంది. కానీ, అల్లాహ్ తన ఇష్ట ప్రకారం ఏ మాసంలోనైనా దౌర్జన్య పాపఫలాన్ని అధికం చేయవచ్చు. ఇదెలాగంటే – దైవ దూతల్నుండి అల్లాహ్, సందేశం చేరవేసే దూతల్ని ఎన్నుకొన్నాడు. గ్రంథాలలో, ఖురానును ఎన్నుకున్నాడు. యావత్ భూమిలో మసీదులను ఎన్నుకొన్నాడు. ఇలాగే మాసాల్లో రమజాన్ మాసాన్ని, నాలుగు నిషిద్ధ మాసాలను ఎన్నుకొన్నాడు, దినాలలో శుక్రవారాన్ని ఎన్నుకున్నాడు మరియు రాత్రిళ్ళలో లైలతుల్ ఖద్ర్ ను ఎన్నుకొన్నాడు. అల్లాహ్ తన ఇష్ట ప్రకారం దేనికైనా ఘనతను ప్రసాదించగలడు. కనుక అల్లాహ్ ఘనతను ప్రసాదించిన దానికి మీరు కూడా ఘనమైనదని భావించండి”. (తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 2/468)
ఈ సంక్షిప్త వివరణ సారమేమిటంటే రజబ్ నెల నిషిద్ధ మాసాల్లో ఒకటి. కనుక దీని గౌరవప్రతిష్ఠతలను యథావిధిగా వుంచుతూ ప్రత్యేకించి ఈ నెలలో పాపకార్యాలకు దూరంగా వుండాలి. కానీ, నేడు కొందరు ముస్లిముల పరిస్థితి ఎలా వుందంటే – ఈ మాసంలో వారు ఎన్నో క్రొత్త ఆచారాల (బిద్అత్) ను సృష్టించుకున్నారు. వాటిని (బిద్అత్ లను) వారు గొప్పసదాచరణలనీ, ధర్మంలో అంతర్భాగమని భావించి ఆచరిస్తున్నారు. మరి చూడబోతే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ‘ఖుత్బా – ఏ హాజత్’ లో ఇలా సెలవిచ్చారు: “(అల్లాహ్) స్తోత్రం తర్వాత! నిశ్చయంగా అత్యుత్తమ వాక్కు అల్లాహ్ గ్రంథం, అత్యుత్తమ పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పద్ధతి. అన్నింటి కన్నా చెడ్డ కార్యాలేమిటంటే ధర్మంలో క్రొత్తగా సృష్టించబడే ఆచారాలు(బిద్అత్ లు) మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టతకు ఆనవాలు.” (ముస్లిం : 867)
ఆయెషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకార్త దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: ”ఏ వ్యక్తి అయినా మా ఈ ధర్మంలో లేని క్రొత్త పోకడ (బిద్అత్)ను ప్రవేశపెడితే అది రద్దు గావించబడుతుంది (స్వీకరించ బడదు).” (బుఖారీ : 2697, ముస్లిం : 1718)
ముస్లిం లోని మరొక ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి:“ఏ వ్యక్తి అయినా మేము ఆజ్ఞాపించని క్రొత్త ఆచరణను పాటిస్తే అది (అల్లాహ్ సమక్షంలో) తిరస్కరించ బడుతుంది.”
ఈ హదీసుల ద్వారా తెలిసేదేమిటంటే – ధర్మంలో ప్రతి క్రొత్త పోకడ బిద్అత్ మరియు ప్రతి క్రొత్త ఆచారం తిరస్కరించబడుతుంది. (స్వీకరించబడదు)
ఇక మనం రజబ్ మాసంలో సృష్టించబడ్డ కొన్ని బిద్అత్ లను గూర్చి చర్చించుకుందాం.
1) సలాతుర్రగాయిబ్
రజబ్ మాసంలో ఒక బిద్అత్ ‘సలాతుర్రగాయిబ్’ పేరుతో ప్రజల్లో ప్రసిద్ధిగాంచి వుంది. ప్రజలు తమ వైపు నుంచి సృష్టించి, దానిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆపాదించిన దీని స్వరూపాన్ని ముందు మీకు వివరిస్తాం. తదుపరి దీని గురించి ముహద్దిసీన్ (హదీసువేత్తలు)ల అభిప్రాయాలు మీ ముందుంచుతాం.
‘సలాతుర్రగాయిబ్’ గురించి వివరించబడే హదీసులో మొదట్లో ఇలా వుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: రజబ్ అల్లాహ్ మాసం, షాబాన్ నా మాసం మరియు రమజాన్ నా ఉమ్మత్ మాసం. తదుపరి, ఆ హదీసులో రజబ్ మాసపు కొన్ని విశిష్ఠతలు చెప్పబడిన తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని ఆయన వైపునకు కొన్ని విషయాలు ఆపాదించబడ్డాయి. అవేమిటంటే – ఏ వ్యక్తి అయినా రజబ్ మాసపు మొదటి గురువారం నాడు ఉపవాసముండి, శుక్రవారం రాత్రి మగ్రిబ్, ఇషాల మధ్య రెండు, రెండు రకాతుల చొప్పున 12 రకాత్లు -ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత మూడు సార్లు ఖద్ర్ సూరా, 12 సార్లు ఇఖ్లాస్ సూరా- చదివి, నమాజు పూర్తయిన తర్వాత 70సార్లు ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదున్నబీ ఉల్ ఉమ్మీ వ అలా ఆలిహి’ అని దరూద్ పఠించి, ఆ తర్వాత సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు – ‘సుబ్బూహు ఖుద్దూసు రబ్బుల్ మలాయికతి వర్రూహు’ అని పఠించి, తదుపరి తలపై కెత్తి ‘రబ్బిగ్ఫర్ వర్హమ్ వతజావజ్ అమ్మా తాలమ్ ఇన్నక అన్తల్ అజీజుల్ అజీమ్’ అని 70 సార్లు ప్రార్థించి, తదుపరి రెండవ సజ్జాలోకి వెళ్ళి ఇలానే చేసి, ఆ తర్వాత అతను అల్లాహ్ ను ఏది కోరినా అది ప్రసాదించబడుతుంది.
ఈ కాల్పనిక, తప్పుడు హదీసు గురించి హదీసువేత్తల వివరణలు ఇలా వున్నాయి :
1) ఇబ్నుల్ జౌజి రహిమహుల్లాహ్ ఈ హదీసును ‘అల్ మౌజుఆత్’ నందు పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు: ఈ హదీసు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరుతో (క్రొత్తగా) సృష్టించబడింది. అబద్ధాలకోరుగా పేరుగాంచిన ‘ఇబ్నె జహజమ్’ ను దీని వెనుక కుట్రదారుడుగా హదీసు వేత్తలు ఖరారు చేశారు. నేను, మా షేఖ్ అబ్దుల్ వహ్హాబ్ అల్ హాఫిజ్ నోటితో విన్నదేమిటంటే – దీని ఉల్లేఖకులు అపరిచితులు. స్వయంగా నేను కూడా ఎన్నో గ్రంథాలను తిరగేసాను, కానీ వీరి గురించి నాకు ఏ మాత్రం సమాచారం దొరకలేదు. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం- 438 పేజి)
ఇమామ్ జహబీ, ఇబ్నుల్ జౌజి మాటలకు అదనంగా ఈ మాట కూడా జోడించి పేర్కొన్నారు: “ఈ హదీసును ఉల్లేఖించినవారు బహుశా పుట్టనే లేదేమో!” (తల్ ఖీస్ అల్ మౌజుఆత్ : 247వ పేజి)
అలాగే, ఇబ్నుల్ జౌజి ‘అస్సలాతుల్ అర్ ఫియ’ గురించి కాల్పనిక హదీసును పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు: ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం అనుమానం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు (మజ్ హూల్) మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కల్గిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజును చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు, ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గురించే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)
2) ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: రజబ్ మాసంలో మొదటి శుక్రవారం రాత్రి చదివే ‘సలాతుర్రగాయిబ్’ గురించి ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులు. మెజారిటీ ఉలమాల దృష్టిలో ఇది నాల్గవ శతాబ్దం తర్వాత ఉద్భవించిన ఒక బిద్అత్. (లతాయిఫుల్ మారిఫ్ ఫీమాలిమవాసిముల్ ఆమ్ మినల్ వజాయిఫ్-123 పేజి)
3) ఇమామ్ నవవీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’గా పేరు గాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషా ల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజు మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వాటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక, (అల్ మజ్ఞ్ముఅ లిన్నవవీ : 3వ సంపుటం, 379పేజీ)
4) ముహమ్మద్ బిన్ తాహిర్ అల్ హిందీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’ ఏమాత్రం సందేహం లేని కాల్పనిక, అసత్య ఆచరణ. (తజ్కిరతుల్ మౌజుఆత్: 44వ పేజీ)
5) ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు: ఈ హదీసును కాల్పనిక తప్పుడు హదీసని నిర్దారించడంలో హదీసువేత్తలందరూ ఏకీభవించారు. ఇది కాల్పనికమవడంలో హదీసు విషయ పరిజ్ఞానం స్వల్పంగా వున్న వారికి సైతం ఏమాత్రం సందేహం లేదు. ఫీరోజాబాదీ మరియు మఖ్ దిసీలు కూడా – హదీసువేత్తలందరి దృష్టిలో ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అని స్పష్టం చేశారు.
6) మౌలానా అబ్దుల్ హై లక్నోవీ ఇలా పేర్కొన్నారు: సలాతుర్రగాయిబ్ కు సంబంధించిన హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు. ఈ విషయంలో హదీసువేత్తలందరూ లేదా మెజారిటీ హదీసు వేత్తల మధ్య ఏకాభిప్రాయం వుంది. కనుక, దీనిని వ్యతిరేకించే వారిని ఏ మాత్రం నమ్మలేం. వారెవరైనా కావచ్చు. (అల్ ఆసారుల్ మర్ ఫ్యూ అ : 74వ పేజీ)
వీరితోపాటు సుయూతీ, ఇబ్నె ఇరాక్ మరియు అల్ కర్మి మొ॥వారు కూడా దీనిని మౌజుఆత్ (కాల్పనికమైనవి)లో చేర్చారు. (అల్ లఆలి అల్ మస్నూఅ : 2వ సంపుటం, 47వ పేజి, తనజిహుష్షరియ : 2వ సంపుటం, 90వ పేజీ, అల్ ఫవాయెదుల్ మౌజుఅ: 72 పేజీ)
(2) రజబ్ ప్రత్యేక ఉపవాసాలు
రజబ్ మాసంలో (ప్రజలు) సృష్టించుకున్న బిద్అత్ లలో మరో బిద్అత్ ఏమిటంటే – ఈ మాసంలో ఉపవాసాలకు ప్రత్యేక శ్రేష్ఠతలను కల్పించుకొని, ప్రత్యేకంగా ఉపవాసాలుండడం. వాస్తవానికి ఈ మాసంలో ఉపవాసాల గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ప్రామాణికంగా ఏదీ నిరూపించబడలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఈ మాసంలో ప్రత్యేకించి ఉపవాసాలు వుండేవారన్న విషయం కూడా నిర్ధారించబడిలేదు.
అల్లామా ఇబ్నుల్ జౌజి రహిమహుల్లాహ్, ఇమామ్ సాజీ అల్ హాఫిజ్ ద్వారా ఇలా ఉల్లేఖించారు: ఇమామ్ అబ్దుల్లా అల్ అన్సారీ రజబ్ మాసంలో ఉపవాసాలు వుండేవారు కాదు మరియు దీనిపై ఆయన ఇలా చెప్పేవారు – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా రజబ్ మాసపు శ్రేష్ఠత గురించి లేదా దీనిలో ఉపవాసాల శ్రేష్ఠత గురించి ఏదీ నిరూపించబడి లేదు. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 578-579 పేజీలు)
హాఫిజ్ ఇబ్నె హజర్ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: రజబ్ మాసం శ్రేష్ఠత లేదా దీనిలో ఉపవాసాల శ్రేష్ఠత లేదా దీనిలో ప్రత్యేక దినపు ఉపవాస శ్రేష్ఠత లేదా ప్రత్యేక రాత్రి జాగారపు శ్రేష్ఠత – వీటి గురించి ఒక్క సహీహ్ హదీసు (ప్రామాణిక హదీసు) కూడా ఉల్లేఖించబడిలేదు. నాకు ముందు ఇదే విషయాన్ని ఇమామ్ అబూ ఇస్మాయీల్ అల్ హరవీ కూడా సెలవిచ్చారు. తదుపరి ఆయన ఇలా పేర్కొన్నారు: రజబ్ శ్రేష్ఠత లేదా దాని ఉపవాసాల శ్రేష్ఠత లేదా దానిలో ఏదైనా ప్రత్యేక దినపు ఉపవాస శ్రేష్ఠతల గురించి స్పష్టంగా ఉల్లేఖించబడ్డ హదీసులను పరిశీలిస్తే అవి రెండు రకాలుగా కనిపిస్తాయి. అవి బలహీనమైనవి లేదా కాల్పనికమైనవి (తప్పుడు హదీసులు).
ఇమామ్ షౌకానీ – అలీ బిన్ ఇబ్రాహీం అల్ అతార్ ద్వారా ఇలా ఉల్లేఖించారు: “రజబ్ ఉపవాసాల గురించి ఉల్లేఖించబడ్డ విషయాలన్నీ కాల్పనికమైనవి, బలహీనమైనవి మరియు ఏ ఆధారం లేనివి”. (అల్ ఫవాయెదుల్ మజ్ముఆ : 392వ పేజీ)
మరి ఒక్క హదీసు కూడా ప్రామాణికంగా నిరూపించబడిలేనప్పుడు, కేవలం కాల్పనిక, తప్పుడు హదీసులను ఆధారంగా చేసుకొని రజబ్ మాసంలో ఉపవాసాలకు ప్రత్యేక శ్రేష్ఠతను కల్పించడం ఏమాత్రం సరైనది కాదు.
రజబ్ మాసంలోని ఉపవాసాల శ్రేష్టతను గురించి ఉల్లేఖించబడే ఒక కాల్పనిక, తప్పుడు హదీసు ఇది: రజబ్ మాసం ఎంతో మహోన్నతమైన మాసం. ఏ వ్యక్తి అయినా దీనిలో ఒక రోజు ఉపవాసముంటే, అల్లాహ్ అతని కోసం 1000సం||ల ఉపవాసాలు లిఖిస్తాడు. ఎవరైన రెండు రోజులు ఉపవాసముంటే, అల్లాహ్ అతని కోసం 2000 సం||ల ఉపవాసాలు లిఖిస్తాడు. ఎవరైనా మూడు రోజులు ఉపవాసముంటే, అల్లాహ్ అతని కొరకు 3000 సం||ల ఉపవాసాలు లిఖిస్తాడు. ఎవరైనా ఏడు రోజులు ఉపవాసముంటే, అతని కొరకు నరకద్వారాలు మూసివేయబడతాయి. అతను ఏ ద్వారం గుండా అయినా స్వర్గంలోకి ప్రవేశించవచ్చు. ఎవరైనా 15 రోజులు ఉపవాసముంటే, అతని చెడులను (పాపాలను) పుణ్యాలుగా మార్చడం జరుగుతుంది మరియు ప్రకటన చేసే వాడొకడు ఆకాశం నుండి – అల్లాహ్ నిన్ను క్షమించేశాడు, ఇక క్రొత్తగా నువ్వు నీ ఆచరణలను ప్రారంభించవచ్చు అని ప్రకటన చేస్తాడు. ఎవరైనా వీటి కన్నా ఎక్కువ రోజులు ఉపవాసముంటే, అల్లాహ్ అతనికి ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాడు.
ఈ హదీసును ఇబ్నుల్ జౌజి ‘అల్ మౌజుఆత్’ లో ఉల్లేఖించారు. అలాగే జహబీ కూడా దీనిలో ఇద్దరు ఉల్లేఖకులు (అలీ బిన్ యజీద్ మరియు హారూన్ బిన్ అన్తర) పట్ల ఆక్షేపణ చూపి దీనిని మౌజుఆత్ (కాల్పనికమైనవి)లో చేర్చారు.
సుయూతీ కూడా వీరిద్దరి వివరణతో ఏకీభవించారు. ఇబ్న్ ఇరాక్ అయితే మరో ఉల్లేఖకుడు (ఇస్ హాఖ్ బిన్ ఇబ్రాహీం అల్ ఖతలీ) పట్ల ఆక్షేపణ తెలుపుతూ ఈ కాల్పనిక హదీసుకు అసలు రూపకర్త ఇతనే అని హాఫిజ్ ఇబ్నె హజర్ నిర్ధారించి, నిస్సందేహంగా ఇదొక కాల్పనిక, తప్పుడు హదీసని ఖరారు చేశారని వివరించారు. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 578-579 పేజీలు, తల్ఖీస్ అల్ మౌజుఆత్ : 277 పేజీ, అల్ లాలి : 2వ సంపుటం, 97-98 పేజీలు, తన్జీహుష్షరీయ : 2వ సంపుటం, 152 పేజీ)
అలాగే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని ఈ హదీసు కూడా ఉల్లేఖించబడుతూ వుంటుంది: ఎవరైనా రజబ్లో ఒక రోజు ఉపవాసముండి, దానిలో 4 రకాతుల నమాజును – మొదటి రకాతులో 100 సార్లు ఆయతుల్ కుర్సీ, రెండవ రకాతులో 100 సార్లు ఇల్లాస్ సూరా – చదివితే, స్వర్గంలో అతని నివాసం చూపనంత వరకు అతనికి మరణం రాదు. దీని గురించి ఇబ్నుల్ జౌజి ఇలా పేర్కొన్నారు: “ఇది దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు మీద సృష్టించబడ్డ హదీసు. దాదాపు దీని ఉల్లేఖకులందరూ అపరిచితులే.” (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 435వ పేజి)
ఇలాగే రజబ్ ఉపవాసాల గురించి మరో హదీసు కూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆపాదించబడుతూ వుంటుంది. అదేమిటంటే- ఎవరైనా రజబ్లో మూడు రోజులు ఉపవాసముంటే, అల్లాహ్ అతనికి పూర్తి నెల ఉపవాసాల పుణ్యాన్ని లిఖిస్తాడు. ఎవరైనా 15 రోజులు ఉపవాసముంటే, అల్లాహ్ అతని పట్ల తన సంతృప్తిని లిఖిస్తాడు. ఎవరికైతే అల్లాహ్ తన సంతృప్తిని లిఖిస్తాడో అతన్ని శిక్షించడు. ఇక ఎవరైనా నెల మొత్తం ఉపవాసముంటే అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది. దీని గురించి ఇబుల్ జౌజి ఇలా వివరించారు: ఈ హదీసు ప్రామాణికమైనది కాదు. ఎందుకంటే దీని ప్రారంభంలో ‘అబాన్’ అనే ఒక ఉల్లేఖకుడు వున్నాడు. ఇతని గురించి షేబా ఇలా సెలవిచ్చారు – నేను ‘అబాన్’ నుండి (హదీసులు) ఉల్లేఖించడం కన్నా వ్యభిచారం చేయడమే ఉత్తమమని భావిస్తాను. (అల్ మౌజుఆత్: 2వ సంపుటం, 579 పేజీ)
రజబ్ మాసాన్ని పురస్కరించుకొని మింబర్లు, వేదికల నుండి వినిపించబడే లేదా పుస్తక రూపంలో ముద్రించబడే ఈ హదీసులే కాక ఇలాంటి ఎన్నో ఇతర హదీసులున్నాయి. మరిచూడబోతే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చి వున్నారు: “ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా నాపై అబద్ధమాడితే తన నివాసం, నరకమని అతను గట్టిగా నమ్మాలి.” (బుఖారీ:1291, ముస్లిం :4)
ఈ హదీసు ముతవాతిర్ (అనేక ప్రామాణిక పరంపరల ద్వారా ఉల్లేఖించబడిన) హదీసు. 98 మంది సహాబాలు దీనిని ఉల్లేఖించారని ఇబ్నుల్ జౌజి పేర్కొన్నారు.ఇబ్నుస్సలామ్ కొంత మంది హదీసువేత్తల ద్వారా – దీనిని 62 సహాబాలు ఉల్లేఖించారని పేర్కొన్నారు. వీరిలో ‘అష్రయే ముబష్షిరా ‘ (తమ జీవితంలోనే దైవ ప్రవక్త ద్వారా స్వర్గ శుభవార్త పొందిన పది మంది సహాబాలు) కూడా వున్నారు. ముల్లా అలీ ఖారీ సుయూతీ ద్వారా ఉల్లేఖించినదేమిటంటే – ఇది 100 కన్నా ఎక్కువ సహాబాల ద్వారా ఉల్లేఖించబడింది.
అందుకే ఇమామ్ నవవీ ఇలా సెలవిచ్చారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరుతో అబద్దాలు సృష్టించడం హరామ్ మరియు ఘోరమైన పాపాలలో అతి ఘోరమైనది. ఘోరమైన (పెద్ద) చెడు కార్యాలలో అత్యంత ఘోరమైన చెడు కార్యం. (ఇలా అబద్ధాలు సృష్టించడం) ఇస్లామీయ ఆజ్ఞలు, ప్రోత్సహించే మరియు భయపెట్టే విషయాలలో ఏ విషయంలోనైనా కావచ్చు. దీనిపై ముస్లిములందరి మధ్య ఏకాభిప్రాయం వుంది. కేవలం ‘కరామియ’ వర్గం తప్ప. ఇదొక బిద్అతీ వర్గం. (షరహ్ సహీహ్ ముస్లిం: 1వ సంపుటం, 67వ పేజీ)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన పేరుతో హదీసులు సృష్టించడాన్ని చాలా గట్టిగా వారించి, అతని నివాసం నరకమని హెచ్చరించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “నాపై అబద్ధాన్ని సృష్టించకండి. ఎందుకంటే, నాపై అబద్ధాలు సృష్టించేవాడు తప్పకుండా నరకంలోకి ప్రవేశిస్తాడు.” (బుఖారీ : 106)
”ఎవరైతే నేను చెప్పని విషయాన్ని నాకు ఆపాదిస్తాడో, అతని నివాస స్థలం నరకం”. (బుఖారీ : 109)
కాల్పనిక, తప్పుడు హదీసులను ఉల్లేఖించడం కూడా హరామ్
కాల్పనిక తప్పుడు హదీసుల వాస్తవిక స్థాయి గురించి వివరించకుండా – అంటే ఇది కాల్పనిక హదీసు అని గట్టిగా చెప్పకుండానే-దానిని ఉల్లేఖించడం అంటే, ఆ కాల్పనిక హదీసును స్వయంగా సృష్టించినట్లే అవుతుంది. ఇలా చేసేవాళ్ళు (కాల్పనిక హదీసును సృష్టించినవాడు మరియు దానిని ఉల్లేఖించినవాడు) ఇద్దరూ దాని చెడు పర్యవసాన శ్రేణిలోకి వచ్చేస్తారు (అంటే – ఉద్దేశ్యపూర్వకంగా ఒక కాల్పనిక, తప్పుడు హదీసును సృష్టించి మొట్టమొదటగా దానిని ఉల్లేఖించిన వాడు ఎంతటి పాపాత్ముడవుతాడో, దాని వాస్తవిక స్థితిని స్పష్టంగా వివరించకుండా దానిని తదుపరి ఉల్లేఖించినవాడు కూడా అంతే పాపాత్ముడవుతాడు).
ఈ విషయంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చాలా స్పష్టంగా సెలవిచ్చివున్నారు: “ఏ వ్యక్తి అయినా ఒక హదీసును, ఇది కాల్పనిక, తప్పుడు హదీసని తెలిసిన తర్వాత కూడా దానిని ఉల్లేఖిస్తాడో- అతను కూడా అసత్యవాదులలో ఒకడిగా పరిగణించబడతాడు”. (ముస్లిం : ముఖద్దమ)
ఈ కారణం వల్లనే, హదీసు వేత్తలందరూ ముక్తకంఠంతో, కాల్పనిక తప్పుడు హదీసులు ఉల్లేఖించడాన్ని హరామ్ గా ఖరారు చేశారు. ఆ హదీసులు (ఇస్లామీయ) ఆజ్ఞలు, వ్యవహారాలకు సంబంధించినవి కానివ్వండి లేదా ప్రోత్సహించే, భయపెట్టే విషయాలకు సంబంధించినవి కానివ్వండి.
ఈ విషయంలో ఖతీబుల్ బగ్దాదీ ఇలా పేర్కొన్నారు: హదీసువేత్త (ముహద్దిస్)పై తప్పనిసరి (విధి)గా వున్న విషయమేమిటంటే – “అతను కాల్పనిక, తప్పుడు హదీసులలో దేనిని కూడా ఉల్లేఖించకూడదు. ఇక యెవరైనా ఈ పని చేస్తే అతను మహాపరాధానికి పాల్పడినవాడై అసత్యవంతుల సమూహంలో చేరిపోతాడు”. (ఫత్హుల్ ముగైస్ అస్సఖావీ: 1వ సంపుటం,275వ పేజీ)
ఇమామ్ నవవీ ఇలా పేర్కొన్నారు:- ఏ వ్యక్తి అయినా ఒక హదీసు గురించి, ఇది కాల్పనిక తప్పుడు హదీసని తెలిసినా లేదా దాని గురించి ఎక్కువ అనుమానం కలిగినా-దాని వాస్తవిక స్థితి- అంటే ఇది కాల్పనిక హదీసు అని స్పష్టంగా చెప్పకుండా- ఆ హదీసును ఉల్లేఖించడం హరామ్ మరియు (ఇలా చేసినవాడు) దాని చెడు పర్యవసానశ్రేణిలోకి వచ్చేస్తాడు, తదుపరి అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)పై అసత్యం పలికే వారి సమూహంలో చేరిపోతాడు.
అందుకే రజబ్ మాసం లేదా ఇతర మాసాల గురించి వచ్చిన కాల్పనిక హదీసులను (ప్రజలలో) ఉల్లేఖించకుండా జాగ్రత్తపడాలి మరియు ఈ కాల్పనిక, తప్పుడు హదీసుల వాస్తవికతను వివరించి ప్రజలను ఈ విషయంలో జాగ్రత్త పడేలా చేయాలి.
(3) రజబ్ నెల 27వ రాత్రి ఆరాధన మరియు మరుసటి రోజు ఉపవాసం
ప్రజల్లో నేడు బాగా ప్రసిద్ధి గాంచి వున్న ఒక విషయమేమింటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చెందిన ‘ఇస్రా వ మేరాజ్’ (మేరాజ్ యాత్ర) అద్భుతం రజబ్ నెల 27వ రాత్రి జరిగింది అని. అందుకే వారు ఈ రాత్రి ప్రత్యేకంగా ఆరాధన చేసి మరుసటి రోజు ఉపవాసముండడం ఎంతో అభిలషణీయం అని అనుకుంటారు!
ఈ విషయంలో తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయమేమిటంటే- ‘ఇస్రా వ మేరాజ్’ తేదీ గురించి (ఇస్లామీయ విద్వాసుల మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలున్నాయి.
హాఫిజ్ ఇబ్నె హజర్ రహిమహుల్లాహ్ ‘ఫత్ హుల్ బారీ –షరహ్ సహీహ్ బుఖారీ’ నందు దీని గురించి పదికి పైగా వేర్వేరు వచనాలను సంగ్రహించారు. దీనిలో ఒక వచనం ఏమిటంటే ఇది హిజ్రత్ (మదీనా ప్రస్థానం)కు 1 సం|| ముందుగా (రబీఉల్ అవ్వల్ మాసం, దైవ దౌత్యపు 12వ సం|| ) జరిగింది. ఇది ఇబ్నె సాద్ వగైరా॥ల వచనం. ఇదే మాటను ఇమామ్ నవవీ కూడా పూర్తి నమ్మకంతో అన్నారు. ఇబ్నె హజమ్ అయితే దీనిని ‘ఇజ్మా’ (ఏకాభిప్రాయం)గా ఖరారు చేశారు. కానీ దీనిని ‘ఇజ్మా’ అనడం సరైనది కాదు. వీరితో పాటు ఇబ్నె అబీ అజల్ ఇజ్ హనఫీ కూడా ఈ తేదీనే (అంటే హిజ్రత్కు 1 సం॥ ముందు) పూర్తి నమ్మకంతో పేర్కొన్నారు. (షరహ్ అఖీదా తహావియా : 224 పేజీ)
రెండవ వచనం ఏమిటంటే ఇది (మేరాజ్ యాత్ర) హిజ్రత్కు 8 నెలలు ముందు (రజబ్ నెల, దైవదౌత్యపు 12వ సం॥) జరిగింది. ఇక మూడవ మాట ఏమిటంటే – ఇది హిజ్రత్కు 6 నెలలు ముందుగా జరిగింది. నాల్గవ మాట ఏమిటంటే – ఇది హిజ్రత్కు 11 నెలలు ముందుగా జరిగింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కోవిధంగా సెలవిచ్చారు. (ఫత్ హుల్ బారీ : 7వ సంపుటం, 257పేజీ)
మౌలానా సఫీవుర్ రహ్మాన్ ముబారక్ పూరి రహిమహుల్లాహ్ ఈ కాలపు తన ప్రసిద్ధ గ్రంథం ‘అర్రహీఖుల్ మఖ్తూమ్’ లో జీవిత చరిత్రకారుల ఆరు వచనాలను సంగ్రహించారు. దానిలో ఒకటి అల్లామా మన్సూర్ పూరీ రహిమహుల్లాహ్ నుండి సంగ్రహించారు. అదేమిటంటే- ఈ సంఘటన దైవ దౌత్యపు 10వ యేట రజబ్ నెల 27న జరిగింది. కానీ ఆయనే దీనిని సత్యమని నమ్మడానికి తిరస్కరించారు. ఎందుంటే – ఖదీజా (రజిఅల్లాహు అన్హ) ఐదు పూటల నమాజ్ విధి(ఫర్జ్)గా నిర్ణయించబడడానికి ముందు, అంటే దైవదౌత్యపు 10వ యేట రమజాన్ మాసంలో మరణించారు. మరి ఐదు పూటల నమాజ్ అయితే మేరాజ్ యాత్రలో విధిగా నిర్ణయించబడింది. అందుకే ఆయన దృష్టిలో మేరాజ్ యాత్ర ఆమె నిర్యాణం తరువాత జరిగి వుండాలి, ముందుగా కాదు. ఈ ప్రాతిపదిక మీదనే ఆయన (ఖదీజా రదియల్లాహు అన్హ నిర్యాణానికి) ముందుగా ఈ సంఘటన జరిగిందని పేర్కొన్న మరో రెండు వచనాలను కూడా సరైనవి కావని నిర్థారించారు.
ఇక మిగిలిన మూడు వచనాలు (దైవదౌత్యపు 12వ యేట రమజాన్ మాసం నందు, దైవ దౌత్యపు 13వ యేట ముహర్రం మాసం నందు, దైవ దౌత్యపు 13వ యేట రబీఉల్ అవ్వల్ మాసం నందు) విషయాని కొస్తే, ఆయన వీటిలో ఒకదాని మీద మరో దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఆధారమేదీ లభ్యం కాలేదు అని సెలవిచ్చారు. ఇక దీని గురించి ఆయన మాటల్లో చెప్పా లంటే – ఇస్రా సూర అవతరణ పూర్వపరాలను దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే ఈ సంఘటన (దైవ ప్రవక్త) మక్కా జీవితం ఆఖరి దశలో జరిగింది. (అర్రహీఖుల్ మఖ్తూమ్ : 197వ పేజీ)
ఇలా, సత్యానికి దగ్గరగా వుందని మాకనిపించే విషయమేమిటంటే- ఎంతో మహెూన్నతమైన ఈ సంఘటన, హిజ్రత్కు 1 సం॥ ముందు రబీఉల్ అవ్వల్ మాసం, దైవదౌత్యపు 12వ యేట జరిగింది. దీనికి ఆధారం – ఇమామ్ జుహ్రి మరియు ఇమామ్ ఉర్వా బిన్ జుబైర్ల ఈ మాట – హిజ్రత్కు 1 సం॥ ముందు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను బైతుల్ మఖ్దిస్ వైపునకు యాత్ర గావించడం జరిగింది.
వారి ఈ మాటను మూసా బిన్ ఉఖ్బా తన ‘మగాజీ’ అను గ్రంథంలో పేర్కొన్నారు. ఈయన సహీహైన్ (బుఖారీ, ముస్లిం గ్రంథాలు) లోని హదీసుల ఉల్లేఖకులు కూడా. ఆయన గ్రంథం గురించి ఇబ్నె మయీన్ ఇలా సెలవిచ్చారు: చారిత్రక గ్రంథాలలో మూసా బిన్ ఉఖ్బా – తను జుహ్రీ నుండి ఉల్లేఖించి సంగ్రహించిన గ్రంథం సత్య గ్రంథాలలో ఒకటి. ఇలాగే ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ మరియు ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ లు కూడా దీని ప్రామాణికతను నిర్ధారించారు. (సహీ ఉతీరతున్నబవియ- 1వ సంపుటం, 274వ పేజీ, అస్సీరతున్నబవియ ఫీ జాఅల్ మసాదిరుల్ అస్లియ – 1వ సంపుటం, 269వ పేజీ)
ఇదే మాటకు హాఫిజ్ అబ్దుల్ గనీ అల్ మఖ్ దిసి కూడా తన చారిత్రక గ్రంథంలో ప్రాధాన్యమిచ్చినట్లు హాఫిజ్ ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ పేర్కొన్నారు. (అల్ బిదాయ వన్నిహాయ- 3వ సంపుటం, 109వ పేజీ)
బహుశా హాఫిజ్ ఇబ్నుల్ ఖయ్యూం రహిమహుల్లాహ్ కూడా దీని వైపునకే మ్రొగ్గుచూపారు. కారణం, ఆయన తన ‘జాదుల్ మఆద్’ నందు జుహ్రీ గారి ఈ మాటను అన్నింటి కన్నా ముందుగా పేర్కొన్నారు. దీనితో పాటు ఆయన ఇబ్నె అబ్దుల్ బర్ర్ గారి ఈ సంఘటన హిజ్రత్కు 1 సం॥ 2 నెలల ముందుగా జరిగింది – అన్నమాటను పేర్కొన్నారు. (జాదుల్ మఆద్-3వ సంపుటం, 37వ పేజీ)
కనుక (పై విషయాలన్నింటి ద్వారా తెలిసిందేమిటంటే) నేడు సామాన్య ప్రజానీకంలో బాగా ప్రాచుర్యం పొంది వున్న – ‘ఈ సంఘటన రజబ్ నెల 27వ రాత్రి జరిగింది’ అన్న విషయం సరైనది కాదు. ఎందుకంటే ఈ విషయం ఒక్క ప్రామాణిక ఉల్లేఖనం ద్వారా కూడా నిర్ధారించబడలేదు.
ఇక రెండో విషయమేమిటంటే – ఒకవేళ ఇది నిజమని ఒప్పుకున్నా, అంటే ఈ రాత్రే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మేరాజ్ చేయించబడిందని ఒప్పుకున్నా, దీనిలో ప్రత్యేకంగా ఆరాధించి, దాని మరుసటి రోజు ఉపవాసముండాలన్న విషయం ఎక్కడుంది?
ఈ విషయంలో మా దృష్టికోణం చాలా స్పష్టంగా వుంది. అదేమిటంటే-ఒకవేళ స్వయానా మన ప్రియ దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రాత్రి ప్రత్యేకంగా ఆరాధించివుంటే దానిని మనం కూడా తప్పకుండా చేయాలి. ఒకవేళ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెయ్యకపోతే మనం కూడా చేయకూడదు. అంతేగాక, కనీసం ఈ సంఘటన తర్వాత సహాబాలు ఈ రాత్రి ప్రత్యేకంగా ఆరాధించివుంటే దానికి సంబంధించిన ఆధారాలు మాకు సమర్పిస్తే, మేము కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ రాత్రి ప్రత్యేకంగా ఆరాధిస్తాం. కానీ, ఒకవేళ దీని ఆధారాలు లేకపోతే నిస్సందేహంగా లేవు – మరి ఈ కాల్పనిక తప్పుడు ఆచారాలకు స్వస్తి పలికి వాస్తవిక ధర్మానికనుగుణంగా ఆచరించాలి.
ఇక మూడవ విషయమేమిటంటే 27వ రాత్రి ఆరాధన లేదా 27 నాటి ఉపవాసం శ్రేష్ఠతల గూర్చి వివరించబడే విషయాలన్నీ అసత్యాలు, వాటిలో ఏమాత్రం వాస్తవం లేదు. మౌలానా అబ్దుల్ హై లక్నోవీ ఇలా పేర్కొన్నారు: భారతీయ ఉపఖండంలో పేరుగాంచిన – ‘షబే మేరాజ్ రోజు ఉపవాసం ఉండడం 1000 ఉపవాసాలతో సమానం’- అన్న మాటలో ఏ మాత్రం వాస్తవం లేదు. (అల్ ఆసారుల్ మర్ఫూఅ : 77వ పేజీ)
ఆఖరిగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనందరినీ సరైన ధర్మం ప్రకారం ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు మన అంతం కూడా దీనిపైనే అగుగాక! మనందరికీ ఆయన బిద్అత్ లు సృష్టించడం లేదా సృష్టించబడిన బిద్అత్ లపై ఆచరించడం వంటి విషయాల నుండి దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!!
రెండవ ఖుత్బా
రజబ్ లోని బిద్అత్ లను పురస్కరించుకొని ఈ మాటలు కూడా వినండి! కొంత మంది ఈ నెలలో ఉమ్రా చేయడం ఉత్తమమని భావిస్తారు. వాళ్ళ ఈ తలంపు ఎందుకోసం సరైనది కాదంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి సల్లం) ద్వారా ఈ నెలలో ఉమ్రా ప్రత్యేకత గురించి ఏమాత్రం నిరూపించ బడిలేదు. అలాగే ఆయన స్వయానా ఈ నెలలో ఉమ్రా చేసినట్లు ఆధారాలు కూడా లేవు.
ఉర్వా బిన్ జుబైర్ కథనం: నేను మరియు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆయెషా (రదియల్లాహు అన్హ) కుటీరం ముందు కూర్చొని వున్నాం. నేను ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) తో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రజబ్ నెలలో ఉమ్రా చేసారా? అని అడిగాను. దానికాయన అవునని జవాబిచ్చారు. తదుపరి నేనీ విషయం ఆయెషా (రదియల్లాహు అన్హ) కు తెలుపగా ఆమె- ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ను అల్లాహ్ క్షమించుగాక! అల్లాహ్ సాక్షి! దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రజబ్ నెలలో ఉమ్రా ఎప్పుడూ చేయలేదు. మరి చూడబోతే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పుడు ఉమ్రా చేయడానికి వెళ్ళినా ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్ను) ఆయనకు తోడుగా వుండేవారు. (అయినప్పటికీ ఆయన ఈ విషయం మరిచిపోయారు!) ఆయెషా (రదియల్లాహు అన్హ) ఈ మాటలంటున్నప్పుడు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కూడా ఆమె మాటలు విన్నారు. అయినప్పటికీ ఆయన మౌనంగా వుండిపోయారు. (అంటే ఆమె మాటలను ఖండించలేదు.) (ముస్లిం:1225, నసాయి : 4222, ఇబ్నె మాజ: 2998, సహీహ్ అల్బానీ)
అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాలుగు ఉమ్రాలు చేశారు. అవన్నీ జిల్ ఖాదా నెలలో చేసినవే. కేవలం ఒకటి తప్ప. అది ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ తో కలిపి చేశారు. మొదటి ఉమ్రా హుదైబియా నుండి జిల్ ఖాదా నెలలో, రెండవ ఉమ్రా దాని తరువాత సం॥ జిల్ ఖాదా నెలలోనే, మూడవది హునైన్ యుద్ధ ప్రాప్తి పంపకం చేసిన ‘జుఆరానా’ అనే ప్రదేశం నుండి, అది కూడా జిల్ ఖాదా నెలలోనే. ఇక నాల్గవ ఉమ్రా ఆయన హజ్ తో కలిపి చేశారు. (బుఖారీ: 1778, 1780, ముస్లిం : 1253)
దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రజబ్ మాసంలో ఉమ్రా ఎప్పుడూ చేయలేదు. కనుక ఈ నెలలో ఉమ్రా చేయడం ఉత్తమం అని భావించడం సరైనది కాదు.
రజబ్ లోని నైవేద్య వంటకాలు (రజబ్ కే కుండే)
రజబ్ నెలలో ఆచరించే మరో బిద్అత్ కూడా వుంది. అదేమిటంటే ఇమామ్ జాఫర్ సాదిక్ రహిమహుల్లాహ్ పేరుతో నైవేద్య వంటకాలు (రజబ్ కే కుండే) చేయడం. భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి “దాస్తానే అజీబ్” పేరుతో ఒక కథను ప్రచురించాడని చెబుతూ వుంటారు. దానిలో అతను జాఫర్ సాదిక్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారని పేర్కొన్నాడు – ఏ వ్యక్తి అయినా రజబ్ 22వ తేదీ నాడు, నా నైవేద్యం పేరుతో వంటకాలు (కుండే) చేసి, నా ద్వారా తన అవసరాన్ని వేడుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఒకవేళ నెరవేరకపోతే ప్రళయం రోజు నా కొంగు వుంటుంది మరియు అతని చేయి. (అంటే నా కొంగు పట్టుకుని అతను స్వర్గంలో వెళ్తాడు)
కాస్త ఆలోచించండి! దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిర్యాణం తర్వాత 1400 సం॥ల తర్వాత సృష్టించబడిన ఆచారం ధర్మం యొక్క అంతర్భాగం కాగలదా?
ఇమామ్ జాఫర్ సాదిక్ గారి వసీయతు వెలుగులోకి రావడానికి 1400 సం॥ పట్టిందా? ఇమామ్ జాఫర్ రహిమహుల్లాహ్ లాంటి మహోన్నత వ్యక్తి తన పేరు మీద వంటకాలు చేసి నైవేద్యం పెట్టి మ్రొక్కుబడి తీర్చుకోమని వసీయతు చేయగలరా? మరి చూడబోతే – అల్లాహ్ యేతరుల కొరకు మ్రొక్కుబడి చేసుకోవడం పూర్తిగా హరామ్! ఎందుకంటే – మ్రొక్కుబడి ఒక ఆరాధన మరియు సమస్త ఆరాధనలు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించడం తప్పనిసరి. కనుక, ఇమామ్ జాఫర్ సాదిక్ లాంటి మహోన్నత వ్యక్తి నుండి – షిర్క్ కలిగి వున్న ఇలాంటి ఆచరణ చేయమని వసీయతు చేశారని భావించడం ఊహకందని విషయం.
మరి కొంచెం (లోతుగా ఆలోచించండి! రజబ్ 22వ తారీఖుతో ఇమామ్ జాఫర్ సాదిక్ రహిమహుల్లాహ్ కు గల సంబంధం ఏమిటి? ఆ రోజు ఆయన జన్మించనూ లేదు మరియు మరణించనూ లేదు! అసలు విషయం ఏమిటంటే ఆరోజు ముఆవియా (రదియల్లాహు అన్హు) మరణించారు. ఆయన గురించి చెడుగా మాట్లాడేవారు, తాము స్వయంగా కల్పించిన ఈ రోజు నైవేద్యం వంటకాలు చేయండి – అన్న విషయాన్ని ఇమామ్ జాఫర్ సాదిక్ రహిమహుల్లాహ్ కు ఆపాదించారు.ఏది ఏమైనా ఇదొక అసత్యపు కట్టుకథ. కనుక ముస్లిములందరూ ఈ దురాచారం నుండి దూరంగా వుండాలి.
అల్లాహ్ మనందరినీ తౌహీద్ (ఏక దైవారాధన)పై నిలకడగా వుంచుగాక! మరియు బహుదైవారాధన విశ్వాసాలు మరియు దృష్టి కోణాల నుండి దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!
—
ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్