జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలు, ఘనతలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

అంశము: జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలు, ఘనతలు         

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి, ఎల్లవేళలా ఆయన భయాన్ని కలిగి ఉండండి మరియు తెలుసుకోండి! అల్లాహ్ యే ఈ సృష్టి ప్రదాత. ఆయన ఎవరిని కోరుతాడో వారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు, వారు మనుషులైనా లేక ప్రదేశమైనా, లేక ఏదైనా సందర్భం అయినా, లేక ఏదైనా ఆరాధన అయినా అది ఆయన వివేకంపై ఆధారపడి ఉంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ
(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.) (అల్ ఖసస్ 28:68)

మరియు నిశ్చయంగా అల్లాహ్ నమాజులలో జుమా నమాజును ఎంచుకున్నాడు. మరియు దానికి కొన్ని ప్రత్యేకతలను ప్రసాదించాడు. మరియు కొన్ని సున్నతులను మరికొన్ని ఆచరణలను అభిలషణీయం (ముస్తహబ్)గా నిర్వచించాడు.

1. జుమా ప్రార్థన ఇస్లాం యొక్క అతి ముఖ్యమైన విధులలో ఒకటి మరియు ముస్లింల గొప్ప సమావేశాలలో ఒకటి.

2. జుమా నమాజ్ యొక్క సున్నతులు:- (గుసుల్ చేయడం) అనగా తప్పనిసరిగా తలస్నానం చేయడం, సువాసనలు పూసుకోవడం, మరియు మిస్వాక్ చేయడం, మంచి పరిశుభ్రమైన దుస్తులు ధరించడం సున్నత్ ఆచరణ లోనివి.  అబూ దర్దా (రదియల్లాహు అన్హు) గారి హదీసు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు; “ఎవరైతే జుమ్అహ్ రోజు తలస్నానం చేసి, మంచి అందమైన దుస్తులు ధరించి మరియు పరిమళాలు పూసుకొని ప్రశాంతంగా జుమా నమాజ్ కొరకు బయలుదేరుతాడో దారి మధ్యలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని వేధించకుండా ఉండి, మస్జిద్ చేరుకుని తన అదృష్టం కొద్ది నఫిల్ నెరవేర్చి ఇమామ్ కొరకు వేచి చూస్తూ ఉంటాడో’ అతని రెండు జుమాల మధ్య పాపాలు క్షమించబడతాయి.” (అహ్మద్)

సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు; “మనిషి శుక్రవారం నాడు తలంటు పోసుకొని, వీలైనంతవరకు పరిశుద్ధతను పాటించి, నూనె రాసుకొని లేక తన ఇంట్లో ఉన్న పరిమళాన్ని పూసుకుని, ఆ తర్వాత మస్జిద్ కి వెళ్లి అక్కడ ఏ ఇద్దరి మధ్య నుంచి కూడా తోసుకొని వెళ్ళకుండా (ఎక్కడో ఒక చోట) తన అదృష్టంలో వ్రాసివున్న నమాజు చేసుకొని ఆ తర్వాత ఇమామ్ ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చినప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటే ఆ శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు అతని వల్ల జరిగే పాపాలు మన్నించబడతాయి”. (బుఖారి)

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “జుమ్అహ్ నాడు గుసుల్ (తలంటు స్నానం) చేయటం ప్రతి వయోజనుడికి తప్పనిసరి (వాజిబ్) మరియు వారు మిస్వాక్ చేయాలి మరియు ఒకవేళ పరిమళం ఉంటే పూసుకోవాలి” (బుఖారీ-ముస్లిం)

3. జుమ్అహ్  యొక్క మరొక సున్నత్ ఏమిటంటే నమాజు కొరకు ప్రత్యేకమైన దుస్తులు ఏర్పాటు చేసుకోవాలి. ఆధారం: ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త వారు శుక్రవారం రోజున ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు, అయితే ప్రజలు రోజు వినియోగించే దుస్తువులను ధరించి ఉన్నారు అప్పుడు అలాంటి వారిని ఉద్దేశించి ఇలా అన్నారు “ఈ రోజు మీరు (ప్రజలు) గనక అవకాశం ఉండి ఉంటే రోజూ ధరించే దుస్తులు కాకుండా జుమా నమాజు కొరకు ప్రత్యేకమైన దుస్తులు ఏర్పాటు చేసుకోండి” అని అన్నారు.(అబూ దావుద్)

ఈ హదీసు ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే జుమా నమాజ్ కొరకు అన్నిటికంటే అందమైన దుస్తులను ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది.

4. జుమా నమాజ్ యొక్క అభిలషణీయమైన (ముస్తహబ్) కార్యాలలో ఒకటి మస్జిదును పరిమళింప చేయాలి.  ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా ఆజ్ఞాపించారు – “మీరు మధ్యాహ్నం వేళ జుమా రోజున మస్జిదె నబవిని సువాసనలతో పరిమళింప చేయండి”. (ముస్నద్)

5. జుమా నమాజ్ యొక్క సున్నతులలో ఒకటి జుమా నమాజ్ కొరకు త్వరపడటం, మరియు కాలినడకన మస్జిదుకు వెళ్లడం. ఇది ఉత్తమమైన ఆచరణ.

ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త  ప్రవచనం, “జుమా రోజు స్నానం చేయించి, తాను కూడా స్నానం చేసి, ఉదయాన్నే ప్రారంభ సమయంలో మస్జిద్ కు వాహనంపై రాకుండా నడచి వచ్చి, ఇమాముకు దగ్గరగా కూర్చొని శ్రద్ధగా ఖుత్బా విని ఎటువంటి చెడుపని చేయకుండా ఉంటే, అతని ప్రతి అడుగుకు బదులు సంవత్సరమంతా ఉపవాసాలు మరియు రాత్రంతా ఆరాధనలు చేసినంత పుణ్యం లభిస్తుంది.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి)

దైవప్రవక్త  ప్రవచనంలో గుసుల్ చేయించమని ఉంది, అనగా తన భార్యతో సంభోగించడం. దీని వివరణ అహ్మద్ గారు ఇలా తెలియజేశారు; మరియు ఇందులో ఉన్నటువంటి వివేకాత్మకమైన విషయాన్ని కూడా తెలియపరిచారు, సంభోగం వలన మనిషి మనసుకు ప్రశాంతత లభిస్తుంది  దాని వలన ఒక నమాజికి నమాజులో ఉపశమనం లభిస్తుంది.

మరొక వివరణ ఏమిటంటే తలను శుభ్రంగా కడగడం, తలంటి స్నానం చేయడం ఎందుకంటే మామూలుగా మనం తలకు నూనె రాస్తాము అందువలన గుసుల్ స్నానం చేసే ముందు తలను శుభ్రంగా కడగమని ఆజ్ఞాపించబడింది.

జుమా నమాజ్ కొరకు త్వరగా మస్జిద్ చేరుకోవడానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే శుక్రవారం రోజు లైంగిక అశుద్ధావస్థ నుండి పరిశుద్ధత పొందటానికి చేస్తున్నంత చక్కగా ‘గుస్ల్’ (స్నానం) చేసి జుమా నమాజ్ చేయటానికి త్వరగా వెళతాడో అతను ఒక ఒంటెను బలి ఇచ్చినట్లుగా పరిగణించబడతాడు. అతని తర్వాత రెండవ వేళలో (ఆ విధంగా స్నానం చేసి) వెళ్ళే వ్యక్తి ఒక ఆవును బలి ఇచ్చినట్లుగా భావింపబడతాడు. ఆ తర్వాత మూడో వేళలో వెళ్ళే వాడికి కొమ్ములు తిరిగిన పొట్టేలును బలి ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఇక నాల్గవ వేళలో వెళ్ళేవాడు ఒక కోడిని బలిచ్చినట్లుగా, ఐదవ వేళలో వెళ్ళేవాడు ఒక గ్రుడ్డును దానం చేసినట్లుగా పరిగణించ బడతాడు. ఆ తర్వాత ఇమామ్ (ఖుత్బా ఇవ్వడానికి) బయలుదేరి రాగానే దైవదూతలు (హాజరు వేయటం ఆపి) ఖుత్బా వినటానికి మస్జిద్లోకి వచ్చేస్తారు”.(బుఖారీ-ముస్లిం)

6. జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలలో మరొకటి ఏమిటంటే; నమాజ్ కొరకు మస్జిద్ వైపు రావాలి మరియు ఇమామ్ మింబర్ పై ఎక్కక మునుపే నఫిల్ నమాజులు ఆచరించాలి. అది సూర్యుడు నడి నెత్తిపై నుండి వాలే సమయంలోనైనా సరే అనివార్యం (మక్రూహ్) కాదు దీని ఆధారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి హదీసు ద్వారా మనకు అర్థమవుతుంది, ఇప్పుడే మనం దాన్ని చదివి ఉన్నాము “అతని అదృష్టంలో ఎంత నమాజ్ అయితే ఉందో దాన్ని ఆచరించాలి” ఇది ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) గారి మాట మరియు ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్)గారు కూడా ఇలానే అన్నారు.

8. జుమా నమాజ్ యొక్క సున్నతులలో ఒకటేమిటంటే ఖుత్బా సమయంలో మౌనంగా ఉండాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.” (బుఖారి- ముస్లిం)

9. జుమా నమాజు యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఆ రెండు రకాతులలో సూర జుమా మరియు సూర మునాఫిఖూన్ లేక సూర ఆలా మరియు సూర గాషియా పఠించాలి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ సూరాలను జుమా నమాజులో చదివేవారు. ఇమామ్ ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) గారు జుమా రోజున ఈ రెండు సూరాలు పఠించడం వెనుక ఉన్న వివేకాన్ని తెలియపరుస్తూ ఇలా అన్నారు; ఈ సూర జుమా నమాజ్ కొరకు  త్వరపడడానికి మరియు దాని కొరకు వచ్చే అడ్డంకులు తొలగించుకోవడానికి మరియు అతి ఎక్కువగా అల్లాహ్ ను స్మరించడం యొక్క ఆదేశాన్ని కలిగి ఉంది, దీని వలన ప్రజలకు ఇహపరాల సాఫల్యం లభిస్తుంది మరియు అల్లాహ్ స్మరణను మరవడం ద్వారా ఇహపరాల జీవితం వినాశనానికి లోనవుతుంది, రెండవ రకాతులో మునాఫిఖూన్ పటించబడుతుంది దీనికి గల కారణం ఏమిటంటే ఉమ్మతును దీని వలన కలిగే వినాశనం నుంచి హెచ్చరించడానికి మరియు ప్రజల యొక్క సిరిసంపదలు వారిని జుమా ఆరాధన నుంచి ఏమరపాటుకు లోను కాకుండా చేయడానికి ఒకవేళ ప్రజలు అలా చేస్తే వారు తప్పకుండా నష్టానికి లోనవుతారు. మరియు అదే విధంగా ఈ సురా పఠించడానికి గల కారణం ప్రజలను దానధర్మాలు చేయడం కొరకు ప్రేరేపించడం, మరియు అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆ మరణం గురించి అవగాహన కలుగచేయడం, ఆ మరణ సమయంలో ప్రజలు కొంత సమయం కావాలని కోరుకుంటారు కానీ వారి ఆ కోరిక అస్సలు నెరవేరదు.

10. జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒకటి ఏమిటంటే ఎవరైతే దీనిని విడిచిపెడతారో వారి కొరకు హెచ్చరిక ఉంది. అబూ జాద్ జమ్రి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియజేశారు; “ఏ వ్యక్తి అయితే ఏ కారణం లేకుండా మామూలుగా భావించి మూడు జుమా నమాజులను విడిచిపెడతాడో అల్లాహ్ అతని హృదయంపై (మొహర్) సీలు వేస్తాడు.” (అహ్మద్)

11. జుమా నమాజ్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఎవరైతే ప్రజల మెడలపై నుండి గెంతుతారో మరియు అనవసరమైన కార్యాలకు పాల్పడతారో వారు ఘోరంగా నష్టానికి లోనవుతారు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఎవరైతే వ్యర్ధమైన పనికి పాల్పడ్డారో లేక ప్రజల మెడలపై నుంచి గెంతారో అలాంటి వారికి జుమా పుణ్యఫలం లభించదు వారికి జుహర్ నమాజ్ పుణ్యం మాత్రమే లభిస్తుంది”.(అబూ దావుద్)

కావున ఎవరైతే జుమా నమాజుకి వస్తారో  వారు దాని గొప్పదనాన్ని తప్పక తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క గొప్ప సూచనల లోనిది, ఇమామ్ ప్రసంగించేటప్పుడు మనిషి తన అవయవాల పట్ల జాగ్రత్త వహించాలి, అనవసరంగా కుదపరాదు అనగా రాళ్లతో పుల్లలతో ఆడుకోవడం లేక నేలపై గీతలు గీయడం లేక మిస్వాక్ చేయడం ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి.  ఇది జుమా యొక్క మర్యాదలలో ఒకటి మరియు అదే విధంగా మౌనం వహించడం కూడా జుమాయొక్క మర్యాదలలోనిదే. ఇలా చేయకుంటే జుమాయొక్క పుణ్య ఫలం లో కొరత ఏర్పడుతుంది లేక పూర్తి పుణ్యఫలాన్ని కోల్పోయిన వారమవుతాం మరియు  జుమా జుహర్ గా మారుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “మీరు ప్రసంగ సమయంలో మీ తోటి వ్యక్తితో నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పడం కూడా వ్యర్థ మైన పనికి పాల్పడినట్లే”.

12. జుమా నమాజ్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే జుమా నమాజు తర్వాత నాలుగు రకాతులు నమాజ్ చదవడం (ముస్తహబ్) అనగా అభిలషణీయం. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియజేశారు; “ఏ వ్యక్తి అయితే జుమా నమాజు చదువుతాడో అతను దాని తర్వాత నాలుగు రకాతుల నఫిల్ నమాజ్ చదవాలి.”(ముస్లిం)

13. జుమా నమాజు యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇమామ్ ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) తెలియచేశారు; జుమా నమాజుకు ఇతర నమాజుల కంటే గొప్ప ప్రత్యేకత ఉంది, అదేమిటంటే ఇందులో ప్రజలు ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో సమావేశం అవుతారు, ఒక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది, ఆ సమయంలో ఖురాన్ పారాయణం బిగ్గరగా చేయరాదు, ఇలాంటి ఎన్నో షరతులు ఇందులో ఉన్నాయి. (జాదుల్ మఆద్)

ఓ అల్లాహ్ దాసులారా! ఇవి జుమా నమాజుకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు. వీటి ద్వారానే ఇతర నమాజుల కంటే ఈ జుమా నమాజ్ కు ప్రాముఖ్యత లభించింది, మరియు అల్లాహ్ దగ్గర ఇది గొప్ప ప్రాధాన్యత కలది, కనుక మనం తప్పకుండా వీటిపై ఆచరించాలి, మరియు ఈ ఆచరణకై అల్లాహ్ యొక్క సహాయాన్ని కోరుతూ ఉండాలి, మరియు అల్లాహ్ తో ఈ ఆచరణల పుణ్యఫలాన్ని ఆశించాలి.

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

రెండవ ఖుత్బా

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. మరియు దైవదూతలకు కూడా ఇదే ఆజ్ఞాపించాడు. అల్లాహ్ ఇలా అన్నాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు మరియు ప్రేమించు.ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి: ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్