1.5 శుచి, శుభ్రతల ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
శుచి, శుభ్రతల ప్రకరణం [PDF]

134 – حديث أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لاَ يَقْبَلُ اللهُ صَلاةَ أَحَدِكُمْ إِذَا أَحْدَثَ حَتَّى يَتَوَضَّأَ
__________
أخرجه البخاري في: 90 كتاب الحيل: 2 باب في الصلاة

134. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- మీలో ఎవరి వుజూ (ముఖం కాళ్ళు చేతుల పరిశుభ్రత) అయినా భంగమయితే అతను (తిరిగి) వుజూ చేయనంతవరకు అతను చేసే నమాజును అల్లాహ్ స్వీకరించడు.

[సహీహ్ బుఖారీ : 90వ ప్రకరణం – హీల్, 2వ అధ్యాయం – ఫిస్సలాత్]

135 – حديث عُثْمَانَ بْنِ عَفَّانَ دَعَا بِإِنَاءٍ فَأَفْرَغَ عَلَى كَفَّيْهِ ثَلاَثَ مِرَارٍ فَغَسَلَهُمَا، ثُمَّ أَدْخَلَ يَمِينَهُ فِي الإِنَاءِ، فَمَضْمَضَ وَاسْتَنْشَقَ، ثُمَّ غَسَلَ وَجْهَهُ ثَلاَثًا، وَيَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ ثَلاَثَ مِرَارٍ، ثُمَّ مَسَحَ بِرَأْسِهِ، ثُمَّ غَسَلَ رِجْلَيْهِ ثَلاَثَ مِرَارٍ إِلَى الْكَعْبَيْنِ، ثُمَّ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هذَا ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ لاَ يُحَدِّثُ فِيهِمَا نَفْسَهُ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 24 باب الوضوء ثلاثًا ثلاثًا

135. హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్పాన్ (రదియల్లాహు అన్హు) గురించి ఉల్లేఖకులు ఇలా తెలిపారు: హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఒక చెంబులో నీళ్ళు తెప్పించి, మొదట తన రెండు ముంజేతులపై నీళ్ళు పోసి కడుక్కున్నారు. తరువాత కుడి చేతిని చెంబులో ముంచి, (పిడికెడు నీళ్ళతో) నోరు పుక్కిలించారు. అలాగే ముక్కులోకి నీళ్ళు ఎక్కించి శుభ్రపరచుకున్నారు. ఆ తరువాత మూడుసార్లు ముఖం కడుక్కున్నారు. దాని తరువాత మూడుసార్లు చేతులు మోచేతుల దాకా కడుక్కున్నారు. దాని తర్వాత తడి చేతులతో తల తుడుచుకున్నారు. ఆ పై రెండు కాళ్ళు చీలమండలం వరకు మూడుసార్లు కడుక్కున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని తెలిపారు – “ఎవరు నా పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతులు నమాజు చేస్తారో అతని (ఆ తరువాయి నమాజు వరకు) జరగబోయే పాపాలు క్షమించబడతాయి.” *

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 24వ అధ్యాయం – అల్ ఉజూయె సలాసన్ సలాసా]

* ఇక్కడ ‘పాపాలు’ అంటే చిన్న చిన్న పాపాలని అర్థం; పెద్ద పాపాలు కాదు. (అనువాదకుడు)

136 – حديث عَبْدِ الله بْنِ زَيْدٍ سُئِلَ عَنْ وُضُوءِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَدَعَا بِتَوْرٍ مِنْ مَاءٍ، فَتَوَضَّأَ لَهُمْ وُضُوءَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَكْفَأَ عَلَى يَدِهِ مِنَ التَّوْرِ، فَغَسَلَ يَدَيْهِ ثَلاَثًا، ثُمَّ أَدْخَلَ يَدَهُ فِي التَّوْرِ، فَمَضْمَضَ وَاسْتَنْشَقَ، وَاسْتَنْثَرَ بِثَلاَثِ غَرَفَاتٍ، ثُمَّ أَدْخَلَ يَدَهُ فَغَسَلَ وَجْهَهُ ثَلاَثًا، ثُمَّ غَسَلَ يَدَيْهِ مَرَّتَيْنِ إِلَى الْمِرْفَقَيْنِ، ثُمَّ أَدْخَلَ يَدَهُ فَمَسَحَ رَأْسَهُ، [ص:58] فَأَقْبَلَ بِهِمَا وَأَدْبَرَ مَرَّةً وَاحِدَةً، ثُمَّ غَسَلَ رِجْلَيْهِ إِلَى الْكَعْبَينِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 39 باب غسل الرجلين إلى الكعبين

136. హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా వుజూ చేసేవారని అడిగితే, హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ఒక చెంబులో నీళ్ళు తెప్పించారు. దాంతో వుజూ చేసి, ప్రశ్నించిన వ్యక్తికి ప్రవక్త వుజూ పద్దతి చూపారు.

మొదట ఆయన చెంబులో నుంచి నీళ్ళు వంచి మూడుసార్లు ముంజేతులు కడుక్కున్నారు. తరువాత చెంబులో చేతిని ముంచి, మూడుసార్లు నీళ్ళతో నోరు పుక్కిలించారు. అలాగే మూడు సార్లు ముక్కులోకి నీరు ఎక్కించి చీది శుభ్రపరుచుకున్నారు. తరువాత చెంబులో నుంచి నీళ్ళు తీసుకొని మూడుసార్లు ముఖం కడుక్కున్నారు. ఆ తరువాత చెంబులో నుంచి నీళ్ళు తీసుకొని రెండు చేతులు మోచేతుల వరకు మూడుసార్లు కడుక్కున్నారు. ఆ తరువాత చెంబులో నుంచి నీళ్ళు తీసుకొని (తడి చేతులతో) తల తుడుచుకున్నారు. అప్పుడు మొదట తన రెండు చేతుల్ని తల ముందు భాగం నుంచి వెనక భాగం వరకు పోనిస్తూ తుడుచుకున్నారు. తరువాత తల వెనుక భాగం నుంచి ముందు భాగం వరకు రానిచ్చి తుడుచుకున్నారు. ఈ విధంగా ఆయన ఒకసారి మాత్రమే (మసహ్) చేశారు. ఆ తరువాత రెండు కాళ్ళు చీలమండలం వరకు కడుక్కున్నారు.

[సహీహ్ బుఖారీ:4వ ప్రకరణం – వుజూ, 39వ అధ్యాయం – గస్లి ర్రిజ్ లైని ఇలల్ కాబైన్]

137 – حديث أَبِي هُرَيْرَةَ عَنِ النَّبيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ: مَنْ تَوَضَّأَ فَلْيَسْتَنْثِرْ، وَمَنِ اسْتَجْمَرَ فَلْيُوتِرْ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 25 باب الاستنثار في الوضوء

137. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- వుజూ చేసుకునే వ్యక్తి ముక్కులో నీళ్ళు పోసుకొని చీది శుభ్రపరచుకోవాలి. అలాగే మట్టి పెడ్డలతో మర్మాంగ్రం శుభ్రపరచుకునే వ్యక్తి మట్టి పెడ్డలు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 25వ అధ్యాయం – అల్ ఇస్తిన్ సారి ఫిల్ వుజూ ]

138 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا اسْتَيْقَظَ أَحَدُكُمْ مِنْ مَنَامِهِ فَتَوَضَّأَ فَلْيَسْتَنْثِرَ ثَلاَثًا فَإِنَّ الشَّيْطَانَ يَبِيتُ عَلَى خَيْشُومِهِ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 11 باب صفة إبليس وجنوده

138. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: షైతాన్ నిద్రించేవాడి ముక్కు దూలం మీద రాత్రి గడుపుతాడు. అందువల్ల నిద్ర నుండి లేచిన వ్యక్తి మూడుసార్లు ముక్కు చీది శుభ్రపరచుకోవాలి.

[సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్ , 11వ అధ్యాయం – సిఫలిల్ ఇబ్లీస వజునూదిహీ]

139 – حديث عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ تَخَلَّفَ عَنَّا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي سَفْرَةٍ سَافَرْنَاهَا فَأَدْرَكَنَا، وَقَدْ أَرْهَقَتْنَا الصَّلاَةُ، وَنَحْنُ نَتَوَضًّأُ، فَجَعَلْنَا نَمْسَحُ عَلَى أَرْجُلِنَا، فَنَادَى بِأَعْلَى صَوْتِهِ: وَيْلٌ لِلأَعْقَابِ مِنَ النَّارِ مَرَّتَيْنِ أَوْ ثَلاَثًا
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 3 باب من رفع صوته بالعلم

139. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ప్రయాణం చేస్తుంటే ఆయన ప్రయాణంలో వెనక పడ్డారు. అయితే ఆ తరువాత (ఎలాగో) మమ్మల్ని చేరుకున్నారు. అది నమాజు వేళ మించిపోతున్న సమయం. అంచేత (త్వరత్వరగా) మేము వుజూ చేస్తూ ఆ తొందర్లో మేము కాళ్ళు కడుక్కోవడానికి బదులు, వాటిని తడి చేతులతో తుడుచుకోసాగాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది చూసి “జాగ్రత్త! (వుజూ సందర్భంలో తడవని) కాలి మడమలు నరకాగ్నితో నాశన మవుతాయి” అని బిగ్గరగా మూడుసార్లు అన్నారు.

[సహీహ్ బుఖారీ: 3వ ప్రకరణం – ఇల్మ్, 3వ అధ్యాయం – మన్ ర్రఫ అసౌతహు బిల్ ఇల్మ్ ]

140 – حديث أَبِي هُرَيْرَةَ كَانَ يَمُرُّ وَالنَّاسُ يَتَوَضَّؤُونَ مِنَ الْمِطْهَرَةِ؛ فَقَالَ: أَسْبِغُوا الْوُضوءَ، فَإِنَّ أَبَا الْقَاسِمِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: وَيْلٌ لِلأَعْقَابِ مِنَ النَّارِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 29 باب غسل الأعقاب

140. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఎక్కడికో పోతూ ఉంటే ఒక చోట కొందరు వ్యక్తులు చెంబుతో వుజూ చేసుకుంటూ ఉండటం కన్పించింది. అప్పుడు ఆయన వారిని ఉద్దేశించి “(నీటితో తడవని) కాలి మడమలకు నరకాగ్నితో నాశనం ఉందని అబుల్ ఖాసిం (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుంటే నేను విన్నాను. అందువల్ల మీరు (ప్రవక్త) పద్ధతి ప్రకారం సమగ్రంగా వుజూ చేయండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 29వ అధ్యాయం – గస్లిల్ అఖాబ్)

141 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: إِنِّي سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ إِنَّ أُمَّتِي يُدْعَوْنَ يَوْمَ الْقِيَامَةِ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارٍ الْوُضُوءِ، فَمَنِ اسْتَطَاعَ مِنْكُمْ أَنْ يُطِيلَ غُرَّتَهُ فَلْيَفْعَلْ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 3 باب فضل الوضوء، والغر المحجلون من آثار الوضوء

141. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను: “ప్రళయ దినాన నా అనుచర సమాజాన్ని (కర్మ విచారణ కోసం) పిలవడం జరుగుతుంది. అప్పుడు వారి ముఖాలు, కాళ్ళు, చేతులు వుజూ ప్రభావంతో తెల్లగా, మహోజ్వలంగా ఉంటాయి. అందువల్ల మీలో ఎవరైనా తమ తెలుపు, తేజస్సులను వృద్ధి చేసుకోదలిస్తే వారు వుజూలో పూర్తిగా ముఖం కడుక్కొని అలా వృద్ధి చేసుకోవచ్చు.”

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 3వ అధ్యాయం – ఫజ్లిల్ వుజూయి వల్ గుర్రల్ ముహజ్జలూన్]

142 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لَوْلاَ أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي أَوْ عَلَى النَّاسِ لأَمَرْتُهُمْ بِالسِّوَاكِ مَعَ كُلِّ صَلاَةٍ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 8 باب السواك يوم الجمعة

142. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నా అనుచర సమాజానికి లేక ప్రజలకు కష్టమవుతుందని నేను భావించకపోతే, ప్రతి నమాజుకు ముందు మిస్వాక్ (బ్రష్)చేసుకోవాలని వారిని ఆదేశించేవాడ్ని”.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 8వ అధ్యాయం – అల్ మిస్వాకి యౌముల్ జుమా]

143 – حديث أَبِي مُوسى قَالَ: أَتَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَوَجَدْتُهُ يَسْتَنُّ بِسِوَاكٍ بِيَدِهِ، يَقُولُ: أُعْ أُعْ وَالسِّوَاكُ فِي فِيهِ كَأَنَّهُ يَتَهَوَّعُ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 73 باب السواك

143. హజ్రత్ అబూ మూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళాను. అప్పుడు ఆయన చేతిలో మిస్వాక్ (పనుదోముపుల్ల) పట్టుకొని పల్లు తోముకుంటున్నారు. (ఆ తరువాత) దాన్ని నోట్లో పెట్టుకొని వాంతి చేసుకుంటున్నట్లు వావ్ వావ్ అనసాగారు.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 73వ అధ్యాయం – అల్ మిస్వాక్]

144 – حديث حُذَيْفَةَ قَالَ كَانَ النَّبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا قَامَ مِنَ اللَّيْلِ يَشُوص فَاهُ بِالسِّوَاكِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 73 باب السواك

144. హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రివేళ తహజుద్ నమాజ్ కోసం నిద్ర నుండి లేవగానే పనుదోము పుల్లతో గట్టిగా పల్లు తోముకునేవారు.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 73వ అధ్యాయం – అల్ మిస్వాక్)

145 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْفِطْرَة خَمْسٌ أَوْ خَمْسٌ [ص:60] مِنَ الْفِطْرَةِ: الْخِتَانُ، وَالاِسْتِحْدَادُ، وَنَتْفُ الإِبْطِ، وتَقْلِيمُ الأَظْفَارِ، وَقَصُّ الشَّارِبِ
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 63 باب قص الشارب

145. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు: “ప్రకృతికి అనుగుణమైన అయిదు విషయాలు ఉన్నాయి. (1) ఖత్నా (వడుగు) చేయడం, (2) నాభి క్రింది వెండ్రుకలు తీసివేయడం, (3) చంకలోని వెండ్రుకలు తొలగించడం, (4) గోళ్ళు కత్తిరించడం, (5) మీసాలు కత్తిరించడం.”

[సహీహ్ బుఖారీ : 77వ ప్రకరణం – లిబాస్, 63వ అధ్యాయం – ఖస్సిషారిబ్)

146 – حديث ابْنِ عُمَرَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: خَالِفُوا الْمُشْرِكِينَ، وَفِّرُوا اللِّحَى وَأَحْفُوا الشَّوَارِبَ
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 64 باب تقليم الأظفار

146. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:- “మీ వేషధారణ బహుదైవారాధకులకు భిన్నంగా ఉండేలా చూసుకోండి. గడ్డం పెంచండి, మీసాలు కత్తిరించండి.”

[సహీహ్ బుఖారీ : 77వ ప్రకరణం – లిబాస్, 64వ అధ్యాయం – తఖ్లీ ముల్ అజ్ ఫార్ )

147 – حديث ابْنِ عُمَرَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أنْهِكوا الشَّوَارِبَ وَأَعْفُوا اللِّحَى
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 65 باب إعفاء اللحى

147. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు:- “మీసాలు కత్తిరించండి, గడ్డాలు పెంచండి.”

[సహీహ్ బుఖారీ : 77వ ప్రకరణం – లిబాస్, 65వ అధ్యాయం – ఈఫావుల్లుహా]

148 – حديث أَبِي أَيُّوبَ الأَنْصَارِيِّ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا أَتَيْتمُ الْغَائِطَ فَلاَ تَسْتَقْبِلُوا الْقِبْلَةَ وَلاَ تَسْتَدْبِرُوهَا، وَلكِنْ شَرِّقُوا أَوْ غَرِّبُوا
قَالَ أَبُو أَيُّوبَ: فَقَدِمْنَا الشَّأْمَ فَوَجَدْنَا مَرَاحِيضَ بُنِيَتْ قِبَلَ الْقِبْلَةِ، فَنَنْحَرِفُ وَنَسْتَغْفِرُ اللهَ تَعَالَى
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 29 باب قبلة أهل المدينة وأهل الشام والمشرق

148. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “మీరు మలమూత్రాల కోసం వెళ్ళినప్పుడు మీ ముఖం, వీపు ఖిబ్లా (కాబా గృహం) వైపుకు ఉండేలా కూర్చోకండి; తూర్పు లేక పడమర వైపు ఉండేలా కూర్చోండి.”

ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత హజ్రత్ అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: “ఆ తరువాత మేము సిరియా వెళ్తే అక్కడ మల మూత్ర విసర్జనకై నిర్మించిన గుంటలు ఖిబ్లా దిశగా ఉండటం వల్ల, మేము చేసేది లేక వాటి మీదనే కూర్చునేవాళ్ళము. కాకపోతే కాస్త ముఖం పక్కకు తిప్పుకునే వాళ్ళం. అల్లాహ్ ను క్షమాపణ కోరుకునేవాళ్ళం.”

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 29వ అధ్యాయం – ఖిబ్లతి అహ్లిల్ మదీనతి వ అహ్లిష్షామి వల్ మష్రిఖ్ ]

149 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّهُ كَانَ يَقولُ: إِنَّ نَاسًا يَقُولُونَ إِذَا قَعَدْتَ عَلَى حَاجَتِكَ فَلاَ تَسْتَقْبِلِ الْقِبْلَةَ وَلاَ بَيْتَ الْمَقْدِسِ، فَقَالَ عَبْدُ اللهِ بْنُ عُمَرَ لَقَدِ ارْتَقَيْتُ يَوْمًا عَلَى ظَهْرِ بَيْتٍ لَنَا، فَرَأَيْتُ رسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى لَبِنَتَيْنِ مُسْتَقْبِلاً بَيْتَ الْمَقْدِسِ لِحَاجَتِهِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 12 باب من تبرز على لبنتين

149. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- మలమూత్ర విసర్జన కోసం కూర్చుంటే ఖిబ్లా (కాబా) వైపుగాని, బైతుల్ మఖ్ దిస్ వైపుగాని ముఖం లేదా వీపు పెట్టి కూర్చోకూడదని అంటారు కొందరు. కాని ఓ రోజు నేను ఇంటి కప్పు మీద ఎక్కి చూస్తే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు ఇటుకల మీద కాళ్ళు పెట్టి బైతుల్ మఖ్ దిస్ వైపుకు తిరిగి కూర్చొని మల (మూత్ర) విసర్జన చేస్తూ ఉండటం కన్పించింది.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 12వ అధ్యాయం – మన్ తబర్రజ అలా లబిన తైన్]

150 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ ارْتَقَيْتُ فَوْقَ ظَهْرِ بَيْتِ حَفْصَةَ لِبَعضِ حَاجَتِي فَرَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْضِي حَاجَتَهُ مُسْتَدْبِرَ الْقِبْلَةِ مُسْتَقْبِلَ الشَّامِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 14 باب التبرز في البيوت

150. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి నేను ఏదో పని కోసం ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) గారి ఇంటి మీది కెక్కాను. ఎక్కి చూస్తే (దూరాన ఓ చోట) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖిబ్లా (కాబా) వైపు వీపు, సిరియా వైపు ముఖం పెట్టి మల(మూత్ర) విసర్జన చేయడం కన్పించింది.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 14వ అధ్యాయం – అత్త బర్రుజు ఫిల్ బుయూత్]

151 – حديث أَبِي قَتَادَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا شَرِبَ أَحَدُكُمْ فَلاَ يَتَنَفَّسْ فِي الإِنَاءِ، وَإِذَا أَتَى الْخَلاَءَ فَلاَ يَمَسَّ ذَكَرَهُ بِيَمِينِهِ وَلاَ يَتَمَسَّحْ بِيَمِينِهِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 18 باب النهي عن الاستنجاء باليمين

151. హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- “నీళ్ళు త్రాగుతున్నప్పుడు నీళ్ళ పాత్రలోకి శ్వాస వదలకూడదు. అలాగే మలమూత్ర విసర్జన సమయంలో కుడిచేత్తో మర్మాంగాన్ని పట్టుకోకూడదు. కుడిచేత్తో మూత్రశుద్ధి చేయకూడదు”.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 18వ అధ్యాయం – అన్నహి అనిల్ ఇస్తిన్జాయి బిల్ యమీన్]

152 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُعْجِبُهُ التَّيَمُّنُ فِي تَنَعُّلِهِ وَتَرَجُّلِهِ وَطُهُورِهِ، وَفِي شَأْنِهِ كُلِّهِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 21 باب التيمن في الوضوء والغسْل

152. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఏ పనయినా కుడివైపు నుండి ప్రారంభించడమంటే ఎంతో ఇష్టం. చివరికి ఆయన చెప్పులు తొడుక్కున్నా, తల దువ్వుకున్నా, మూత్ర శుద్ధి చేసినా కుడివైపు నుండే ప్రారంభిస్తారు. .

[సహీహ్ బుఖారీ: 4వ ప్రకరణం – వుజూ, 31వ అధ్యాయం – అత్తయిమ్ముని ఫిల్ వుజూయి వల్ గుస్ల్]

153 – حديث أَنَسٍ، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْخُلُ الْخَلاَءَ فَأَحْمِلُ أَنَا وَغُلاَمٌ [ص:62] إِدَاوَةً مِنْ مَاءٍ وَعَنَزَةً؛ يَسْتَنْجِي بِالْمَاءِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 17 باب حمل العنزة مع الماء في الاستنجاء

153. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మలమూత్ర విసర్జన కోసం బయలుదేరినప్పుడు నేను, మరొక అబ్బాయి కలసి ఒక బొక్కెన నీళ్ళు, ఒక ఈటె తీసుకొని ఆయన వెంట వెళ్ళేవారము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ నీళ్ళతో శుద్ధి చేసుకునేవారు.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 17వ అధ్యాయం – హమ్లుల్ అనజతి మఅల్ మాయి ఫిల్ ఇస్తిన్జా.]

154 – حديث أَنسِ بْنِ مَالِكٍ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا تَبَرَّزَ لِحَاجَتِهِ أَتَيْتُهُ بِمَاءٍ فَيَغْسِلُ بِهِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 56 باب ما جاء في غسل البول

154. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మలమూత్ర విసర్జన కోసం దూరంగా నిర్జన ప్రదేశం వైపుకు వెళ్తారు. అప్పుడు నేను ఆయన దగ్గరికి నీళ్ళు తీసికెళ్తాను. దాంతో ఆయన శుద్ధి చేసుకునే వారు.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 56వ అధ్యాయం- మాజాఅ ఫీగస్లిల్ బౌల్)

155 – حديث جَرِيرٍ بْنِ عَبْدِ اللهِ بَالَ ثُمَّ تَوضَّأَ وَمَسَحَ عَلَى خُفَّيْهِ ثُمَّ قَامَ فَصَلَّى، فسُئِلَ فَقَالَ: رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَنَعَ مِثْلَ هذَا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 25 باب الصلاة في الخفاف

155. హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ఓసారి మూత్ర విసర్జన తరువాత వుజూ చేస్తూ మేజోళ్ళ మీద ‘మసా’ చేశారు (అంటే తడి చేత్తో తుడిచారు.) ఆ తరువాత ఆయన లేచి నమాజు చేశారు. ఆయనగారి ఈ ఆచరణాసరళి గురించి అడిగితే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చేయడాన్ని తాను చూశానని ఆయన సమాధానమిచ్చారు.

[సహీహ్ బుఖారీ: 8వ ప్రకరణం – సలాత్, 25వ అధ్యాయం – అస్సలాతి ఫిల్ ఖిఫాఫ్ ]

156 – حديث حُذَيْفَةَ، قَالَ: رَأَيْتُنِي أَنَا وَالنَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَتَمَاشَى، فَأَتَى سُبَاطَةَ قَوْمٍ خَلْفَ حَائِطٍ فَقَامَ كَمَا يَقُومُ أَحَدُكُمْ، فَبَالَ، فَانْتَبَذْتُ مِنْهُ، فَأَشَارَ إِلَيَّ فَجِئْتُهُ، فَقُمْتُ عِنْدَ عَقِبِهِ حَتَّى فَرَغَ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 61 باب البول عند صاحبه والتستر بالحائط

156. హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ప్రయాణం చేస్తున్నాను. (దారిలో) ఆయన ఒక తెగవారి కసువు దిబ్బ సమీపంలోని ఒక గోడ చాటుకు వెళ్ళి అందరూ నిలబడినట్లే నిలబడ్డారు. అలా నిలబడి మూత్ర విసర్జన చేయడం ప్రారంభించారు. * ఆ సమయంలో నేను కొంచెం పక్కకు తప్పుకున్నాను. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను (చేత్తో) సైగ చేసి దగ్గరికి పిలిచారు. నేను వెళ్ళి ఆయన వెనకాల మూత్ర విసర్జన పని ముగించుకునే దాకా నిల్చున్నాను.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 61వ అధ్యాయం – అల్ బౌలి ఇన్ద సాహిబిహి వత్త సత్తురుబిల్ హాయిత్]

* నిల్చొని మూత్ర విసర్జన చేసే విషయంలో హదీసు ఉల్లేఖకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) నుండి సంగ్రహించిన ఒక కథనం ప్రకారం ఇలా చేయడం నిషిద్ధం. కాని ధర్మవేత్తలు దీన్ని గురించి రెండు హదీసుల్ని పరిశీలించి ఒక మధ్యే మార్గాన్ని నిర్ణయించారు. దాని ప్రకారం నేల బురదగా ఉంటే, మలిన బిందువులు పైన పడే ప్రమాదం ఉంటే, లేదా బట్టలు పాడయిపోయే సూచనలుంటే అలాంటి చోట నిలబడి మూత్రం పోయరాదు. అలాగే కూర్చొని పోయలేని వ్యాధిగ్రస్తులు, వికలాంగులు కూడా నిలబడి మూత్ర విసర్జన చేయవచ్చు. ఇవేమీ లేకుండా నిలబడి మూత్ర విసర్జన చెయ్యడం మక్రూహ్ (అవాంఛనీయం) అవుతుంది. కనుక ఇలాంటి చర్యకు దూరంగా ఉండాలి.

157 – حديث الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ خَرَجَ لِحَاجَتِهِ فَاتَّبَعَهُ الْمُغِيرَةُ بِإِدَاوَةٍ فِيهَا مَاءٌ، فَصَبَّ عَلَيْهِ حِينَ فَرَغَ مِنْ حَاجَتِهِ، فَتَوَضَّأَ وَمَسَحَ عَلَى الْخُفَّيْنِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 48 باب المسح على الخفين

157. హజ్రత్ ముగైరా బిన్ షాబ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి మలమూత్ర విసర్జన కోసం వెళ్తుంటే నేను ఓ బొక్కెనలో నీళ్ళు తీసుకొని ఆయన వెనకాల బయలుదేరాను. ఓ చోట ఆయన మల (మూత్ర) విసర్జన ముగించుకున్నారు. ఆ తరువాత నేను (ఆయన చేతుల మీద) నీళ్ళు పోశాను. దాంతో ఆయన వుజూ చేశారు. వుజూ సందర్భంలో మేజోళ్ళ మీద ‘మసా’ చేశారు. (అంటే తడి చేత్తో తుడుచుకున్నారు.)

[సహీహ్ బుఖారీ: 4వ ప్రకరణం – వుజూ, 48వ అధ్యాయం – అల్ మస్ హి అలల్ ఖుఫ్పైన్)

158 – حديث الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ قَالَ: كُنْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي سَفَرٍ، [ص:63] فَقَالَ: يَا مُغِيرَةُ خُذِ الإِدَاوَةَ؛ فَأَخَذْتُهَا، فَانْطَلَقَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَتَّى تَوَارَى عَنِّي؛ فَقَضَى حَاجَتَهُ وَعَلَيْهِ جُبَّةٌ شَأْمِيَّةٌ، فَذَهَبَ لِيُخْرِجَ يَدَهُ مِنْ كُمِّهَا فَضَاقَتْ، فَأَخْرَجَ يَدَهُ مِنْ أَسْفَلِهَا، فَصَبَبْتُ عَلَيْهِ فَتَوَضَّأَ وُضُوءَهُ لِلصَّلاَةِ، وَمَسَحَ عَلَى خُفَّيْهِ ثُمَّ صَلَّى
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 7 باب الصلاة في الجبة الشأمية

158. హజ్రత్ ముగైరా బిన్ షాబ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ప్రయాణం చేస్తుంటే ఓ చోట ఆయన (ఆగి) “ముగైరా! తోలుతిత్తిలో నీళ్ళు సిద్ధంగా ఉంచు” అని చెప్పి వెళ్ళారు. అలా కనుచూపు మేరదాటి (నిర్జన ప్రదేశంలోకి) పోయి కాలకృత్యం తీర్చుకుని వచ్చారు. ఆ సమయంలో ఆయన పొడుగు చేతుల సిరియన్ చొక్కా ధరించి ఉన్నారు. చొక్కా చేతులు బిగుతుగా ఉండటం వల్ల ఆయన దాని క్రింది నుంచి చేతులు బయట తీశారు. అప్పుడు నేను ఆయన చేతుల మీద నీళ్ళు పోశాను. దాంతో ఆయన వుజూ చేశారు. వుజూ చేస్తున్నప్పుడు మేజోళ్ళ మీద మసా చేశారు. (అంటే తడిచేత్తో తుడుచుకున్నారు.) ఆ తరువాత నమాజు చేశారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 7వ అధ్యాయం – అస్సలాతి ఫిల్ జుబ్బతి ష్షామియ్య ]

159 – حديث الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ رضي الله عنه، قَالَ: كُنْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ذَاتَ لَيْلَةٍ فِي سَفَرٍ، فَقَالَ: أَمَعَكَ مَاءٌ قُلْتُ: نَعَمْ؛ فَنَزَلَ عَنْ رَاحِلَتِهِ، فَمَشَى حَتَّى تَوَارَى عَنِّي فِي سَوَادِ اللَّيْلِ، ثُمَّ جَاءَ، فَأَفْرَغْتُ عَلَيْهِ الإِدَاوَةَ، فَغَسَلَ وَجْهَهُ وَيَدَيْهِ وَعَلَيْهِ جُبَّةٌ مِنْ صُوفٍ فَلَمْ يَسْتَطِعْ أَنْ يُخْرِجَ ذِرَاعيْهِ مِنْهَا، حَتَّى أَخْرَجَهُمَا مِنْ أَسْفَلِ الْجبَّةِ، فَغَسَلَ ذِرَاعَيْهِ، ثُمَّ مَسَحَ بِرَأْسِهِ، ثُمَّ أَهْوَيْتُ لأَنْزِعَ خُفَّيْهِ، فَقَالَ: دَعْهُما فَإِنِّي أَدْخَلْتُهُمَا طاهِرَتَيْنِ فَمَسَحَ عَلَيْهِمَا
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 11 باب جبة الصوف في الغزو

159. హజ్రత్ ముగైరా బిన్ షాబ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ సారి ప్రయాణంలో నేను రాత్రి వేళ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాను. ఆయన నన్ను పిలిచి “నీ దగ్గర నీళ్ళేమయినా ఉన్నాయా?” అని అడిగారు. నేను ఉన్నాయన్నాను. అప్పుడాయన వాహనం నుంచి క్రిందికి దిగి ఒక వైపుకు వెళ్ళిపోయారు. అలా చీకటిలో నాకు కనపడనంత దూరం వెళ్ళిపోయారు. తిరిగొచ్చిన తరువాత ఆయన చేతులపై నేను నీళ్ళు పోయడం మొదలెట్టాను. ఆయన ముంజేతులు, ముఖం కడుక్కున్నారు. కాని ఆ తరువాత చేతులు పూర్తిగా కడుక్కోవడానికి చొక్కా చేతులు పైకి జరపడానికి ప్రయత్నిస్తే లోపల ధరించిన ఉన్ని బనియన్ వల్ల అవి బిగుతుగా ఉండి పైకి పోలేదు. అప్పుడాయన చొక్కా క్రింది నుంచి చేతులు బయటికి తీసి కడుక్కున్నారు. తరువాత తల ‘మసా’ చేసుకున్నారు. (అంటే తడి చేత్తో తుడుచుకున్నారు.) ఆ తరువాత నేను ఆయన కాళ్ళ నుండి మేజోళ్ళు తీసేద్దామని క్రిందికి వంగాను. ఆయన నన్ను వారిస్తూ “ఉండనివ్వు. నేను కాళ్ళు కడుక్కునే మేజోళ్ళు తొడుగుకున్నాను” అని చెప్పి మేజోళ్ళ మీద ‘మసా’ చేశారు.

[సహీహ్ బుఖారీ : 77వ ప్రకరణం – లిబాస్, 11వ అధ్యాయం – జుబ్బతిసూఫి ఫిల్ గజూ)

160 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا شَرِبَ الْكَلْبُ فِي إِنَاءِ أَحَدِكُمْ فَلْيَغْسِلْهُ سَبْعًا
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 33 باب الماء الذي يغسل به شعر الإنسان

160. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- ఏదైనా పాత్రలో నుంచి కుక్క నీళ్ళు త్రాగితే ఆ పాత్రను ఏడు సార్లు కడగాలి.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 33వ అధ్యాయం]

161 – حديث أَبِي هُرَيْرَةَ أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ يَبُولَنَّ أَحَدُكُمْ في الْمَاءِ الدَّائِمِ الَّذِي لاَ يَجْرِي ثُمَّ يَغْتَسِلُ فِيهِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 68 باب البول في الماء الدائم

161. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- నిలకడగా (ప్రవహించకుండా) ఉన్న నీటిలో మూత్ర విసర్జన చేయకూడదు. మూత్ర విసర్జన తరువాత అందులో స్నానం కూడా చేయకూడదు.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 68వ అధ్యాయం – అల్ బౌలిఫిల్ మాయిద్దాయిమ్]

162 – حديث أَنَسِ بْنِ مَالِكٍ أَنَّ أَعْرَابِيًّا بَالَ فِي الْمَسْجِدِ فَقَامُوا إِلَيْهِ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تُزْرِمُوهُ ثُمَّ دَعَا بِدَلْوٍ مِنْ مَاءٍ فَصُبَّ عَلَيْهِ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 35 باب الرفق في الأمر كله

162. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి ఓ దేశ దిమ్మరి మస్జిద్ లోనే మూత్రం పోయసాగాడు. అది చూసి జనం అతడ్ని వారించడానికి లేచి వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అతడ్ని ‘ మూత్రం పోసుకోనివ్వండి” అన్నారు. అతను మూత్రం పోసిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక చేద నీళ్ళు తెప్పించి ఆ స్థలంలో పోశారు.

[సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 35వ అధ్యాయం – అర్రిఫ్ ఖి ఫిల్ అమ్రి కుల్లిహీ]

163 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُؤْتَى بِالصِّبْيَانِ، فَيَدْعُو لَهُمْ، فَأُتِيَ بِصَبِيٍّ فَبَالَ عَلَى ثَوْبِهِ، فَدَعَا بِمَاءٍ فَأَتْبَعَهُ إِيَّاهُ وَلَمْ يَغْسِلْهُ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 3 باب الدعاء للصبيان بالبركة ومسح رؤوسهم

163. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు తమ పసి పిల్లలను తీసుకు వచ్చేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పిల్లల కోసం దుఆ (వేడుకోలు) చేసేవారు. ఒకసారి ఒక పిల్లవాడ్ని ఆయన దగ్గరకు తెచ్చారు. ఆ పిల్లవాడు ఆయన బట్టలపై మూత్రం పోశాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నీళ్ళు తెప్పించి బట్టలు జాడించి కడిగివేశారు.*

[సహీహ్ బుఖారీ : 80వ ప్రకరణం – అద్దావాత్, 3వ అధ్యాయం – అద్దుఆయి లిస్సిబ్యాని బిల్ బర్కతి….]

* పిల్లల మూత్రం విషయంలో ధర్మవేత్తల మధ్య మూడు విధాల అభిప్రాయాలున్నాయి. (1) హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), అతాబిన్ అబీ రబాహ్ (రహిమహుల్లాహ్), హసన్ బస్రి (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ ప్రభృతులతో పాటు అహఁలే హదీస్ విద్వాంసుల అభిప్రాయం ప్రకారం మగపిల్లవాడు మూత్రం పోసిన చోట నీళ్ళు చిలికిస్తే చాలు, కడగనవసరం లేదు. అయితే ఆడపిల్ల మూత్రం పోస్తే మాత్రం తప్పకుండా కడిగివేయాలి. (2) ‘షాజ్’ ధర్మం ప్రకారం ఆడపిల్లలయినా, మగపిల్లవాడయినా సరే మూత్రం పోస్తే నీళ్ళు చిలకరిస్తే చాలు. (3) ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం, ఆడపిల్లలయినా, మగపిల్లవాడయినా మూత్రం పోస్తే తప్పకుండా కడిగివేయాలి. ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్) అభిప్రాయం కూడా అదే. ఈ అభిప్రాయభేదాలన్నీ కేవలం పాలుత్రాగే పిల్లల విషయంలోనే. ఆ తర్వాత అన్నం తదితర ఇతర ఆహార పదార్థాలు తినడం ప్రారంభించిన దగ్గర్నుంచి ఆడపిల్లయినా, మగపిల్లవాడయినా సరే మూత్రం పోస్తే తప్పనిసరిగా కడిగివేయాలి. ఇది ధర్మవేత్తలందరి అభిప్రాయం.

164 – حديث أُمِّ قَيْسٍ بِنْتِ مِحْصَنٍ أَنَّهَا أَتَتْ بِابْنٍ لَهَا صَغِيرٍ لَمْ يَأْكُلِ الطَّعَامَ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَجْلَسَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حِجْرِهِ فَبَالَ عَلَى ثَوْبِهِ، فَدَعَا بِمَاءٍ فَنَضَحَهُ وَلَمْ يَغْسِلْهُ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 59 باب بول الصبيان

164. హజ్రత్ ఉమ్మె ఖైస్ బిన్త్ ముహ్సిన్ (రదియల్లాహు అన్హా) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి ఇంకా అన్నం కూడా తిననటువంటి ఒక పసి పిల్లవాడ్ని తీసుకొని వెళ్ళాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పిల్లవాడ్ని తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. అంతలో ఆ పిల్లవాడు ఆయన బట్టలపై మూత్రం పోశాడు. అప్పుడు ఆయన నీళ్ళు తెప్పించి బట్టలు జాడించి కడిగివేశారు.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 59వ అధ్యాయం – బౌలిస్సిబ్యాన్]

165 – حديث عَائِشَةَ سُئِلَتْ عَنِ الْمَنِيِّ يُصِيبُ الثَّوْبَ، فَقَالَتْ: كُنْتُ أَغْسِلُهُ مِنْ ثَوْبِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَيَخْرُجُ إِلَى الصَّلاَةِ وَأَثَرُ الغَسْلِ فِي ثَوْبِهِ، بُقَعُ الْمَاءِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 64 باب غسل المني وفركه، وغسل ما يصيب المرأة

165. ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారిని అడగటం జరిగింది: “బట్టల పై వీర్యం పడిపోతే ఏం చేయాలి?” అని. దానికామె ఇలా సమాధానమిచ్చారు. “నేను (అలాంటప్పుడు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బట్టలను ఉతికి వేస్తాను. వారు ఆ బట్టలే ధరించి నమాజుకు వెళ్తారు. అప్పుడు ఆ బట్టల పై ఉతుకుడు గుర్తులు, తడి అలాగే ఉండేవి.”

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 64వ అధ్యాయం – గస్లిల్ మనియ్యి వఫర్కిహీ వగస్లిమాయుసీబు మినల్ మర్అతి]

166 – حديث أَسْماءَ قَالَتْ: جَاءتِ امْرَأَةٌ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَتْ: أَرَأَيْتَ إِحْدَانَا تَحِيضُ فِي الثَّوْبِ كَيْفَ تَصْنَعُ قَالَ: تَحُتُّهُ ثُمَّ تَقْرُصُهُ بِالْمَاءِ وَتَنْضَحُهُ ثُمَّ تُصَلي فِيهِ

166. హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హా) కథనం:- ఓ సారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి ఓ స్త్రీ వచ్చి “స్త్రీ తన బట్టల పై రుతు రక్తం అంటుకున్నప్పుడు ఏం చేయాలి?” అని అడిగింది. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మొదట ఆ రక్తం మరకల్ని గీకి వేయాలి. తరువాత నీళ్ళు పోసి రుద్ది కడిగివేయాలి. ఆ తరువాత ఆ బట్టలు ధరించే నమాజు చేయవచ్చు” అని సమాధానమిచ్చారు.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 63వ అధ్యాయం – గస్లిద్దమ్]

167 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: مَرَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِقَبْرَيْنِ، فَقَالَ: إِنَّهُمَا لَيُعَذَّبَانِ، وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ؛ أَمَّا أَحَدُهُمَا فَكَانَ لاَ يَسْتَبْرِى مِنَ الْبَوْلِ؛ وَأَمَّا الآخَرُ فَكَانَ يَمْشِي بِالنَّمِيمَةِ ثُمَّ أَخَذَ جَرِيدَةً رَطْبَةً فَشَقَّهَا نِصْفَيْنِ، فَغَرَزَ فِي كلِّ قَبْرٍ وَاحِدَةً قَالُوا يَا رَسُولَ اللهِ لِمَ فَعَلْتَ هذَا قَالَ: لَعَلَّهُ يُخَفَّفُ عَنْهُمَا مَا لَمْ يَيْبَسَا
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 56 باب ما جاء في غسل البول

167. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి రెండు సమాధుల మధ్య నుంచి నడుస్తూ “ఈ రెండు సమాధుల వాసులు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షకు పెద్ద కారణం ఏదీ లేదు. వారిద్దరిలో ఒకడు మూత్రం (చుక్కలు) వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు. రెండవ వ్యక్తి చాడీలు చెబుతూ తిరుగుతుండేవాడు. అంతే” అని తెలియజేశారు. తరువాత ఆయన ఓ పచ్చటి మండ తీసుకొని, దాన్ని మధ్యకు చీల్చి రెండు భాగాలు చేశారు. ఆ రెండింటినీ ఆ రెండు సమాధుల పై నాటారు. అనుచరులు అది చూసి “దైవప్రవక్తా! మీరిలా ఎందుకు చేశారు”అని అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఇలా చేయడం వల్ల ఈ మండలు ఎండిపోనంతవరకు వీరి (సమాధి) శిక్ష కొంత వరకు తగ్గిపోవచ్చని భావిస్తున్నాను” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 56వ అధ్యాయం – మాజా అఫీ గస్లిల్ బౌల్)

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
శుచి, శుభ్రతల ప్రకరణం [PDF]