https://youtu.be/nGfCiZJbC8Q [42 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 15 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా ఆధ్యాత్మికత గురించి, అనైతిక వ్యవహారశైలి గురించి, అనైతికత వల్ల వాటిల్లే వినాశాల గురించి వివరించింది. ఇందులోని మొదటి ఆయతులో ఈ సూరా పేరుకు సంబంధించిన పదం ప్రస్తావనకు వచ్చింది. ఈ సూరా మానవుల ఆధ్యాత్మిక విధులను గుర్తు చేసింది. అల్లాహ్ కు గల ప్రత్యేకమైన సృష్టి సామర్ధ్యాన్ని వర్ణిస్తూ, సూర్యచంద్రుల ప్రకాశం, భూమి, అద్భుతమైన రోదసీ (అంతరిక్ష) వ్యవస్థల సృష్టి గురించి తెలియజేసింది. మానవులందరికీ ఇష్టమొచ్చిన మార్గాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉందని, మంచిగా గాని, చెడుగా గాని వ్యవహరించే స్వేచ్ఛ ఉందని, ఏ మార్గాన నడవాలన్నది మనమే నిర్ణయించుకోవాలని తెలియజేస్తూ, అనైతికంగా వ్యవహరించి, అల్లాహ్ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితంగా దైవాగ్రహానికి గురి కావలసి వస్తుందని ఈ సూరా తెలియజేసింది.
91:1 وَالشَّمْسِ وَضُحَاهَا
సూర్యుని సాక్షిగా! దాని ఎండ సాక్షిగా! [1]
91:2 وَالْقَمَرِ إِذَا تَلَاهَا
(సూర్యుణ్ణి) వెంబడిస్తూ వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా! [2]
91:3 وَالنَّهَارِ إِذَا جَلَّاهَا
(సూర్యుణ్ణి) దేదీప్యమానం చేసినప్పటి పగటి సాక్షిగా! [3]
91:4 وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا
(సూరీడును) క్రమ్ముకున్నప్పటి రాత్రి సాక్షిగా! [4]
91:5 وَالسَّمَاءِ وَمَا بَنَاهَا
ఆకాశం సాక్షిగా! దాని (అద్భుత) నిర్మాణం సాక్షిగా! [5]
91:6 وَالْأَرْضِ وَمَا طَحَاهَا
భూమి సాక్షిగా! దాన్ని సుగమం చేసిన ప్రక్రియ సాక్షిగా! [6]
91:7 وَنَفْسٍ وَمَا سَوَّاهَا
ఆత్మ సాక్షిగా! దాన్ని తీర్చిదిద్దిన వాని సాక్షిగా! [7]
91:8 فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا
మరి (ఆయన) దానికి చెడునూ, చెడు నుంచి తప్పించుకుని మసలుకునే ప్రేరణను ఇచ్చాడు. [8]
91:9 قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا
దానిని (అంతరాత్మను, మనసును) పరిశుద్ధ పరచుకున్నవాడు సాఫల్యం పొందాడు. [9]
91:10 وَقَدْ خَابَ مَن دَسَّاهَا
దాన్ని అణచి పెట్టినవాడు నష్టపోయాడు. [10]
https://youtu.be/um6dFm0nPek
91:11 كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا
సమూదు (జాతి) వారు తమ పొగరు మూలంగా (వారి ప్రవక్తను) ధిక్కరించారు. [11]
91:12 إِذِ انبَعَثَ أَشْقَاهَا
అప్పుడు వారిలోని ఒక పెద్ద దౌర్భాగ్యుడు (వారి తలబిరుసుపోకడలకు సారధిగా) నిలబడ్డాడు. [12]
91:13 فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا
“మీరు దేవుని ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ళ వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని దైవప్రవక్త వారిని హెచ్చరించాడు. [13]
91:14 فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا
కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి (చంపేశారు).[14] అంతే! వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. [15] వారందరినీ సమానం (నేలమట్టం) చేశాడు. [16]
91:15 وَلَا يَخَافُ عُقْبَاهَا
దాని పరిణామాలను గురించి ఆయన ఏమాత్రం భయపడడు. [17]
Footnotes:
[1] ఎండ సాక్షిగా అనటానికి బదులు పగటిసాక్షిగా అని కూడా అనవచ్చు.
[2] ఒక మాసంలో మొదటి 15 రోజులు చంద్రుడు సూర్యుణ్ణి వెంటాడుతూనే ఉదయిస్తాడు. సూర్యుడు అస్తమించగానే చంద్రుడు ఉదయిస్తాడు.
[3] ఇక్కడ చీకటి గురించి వేరుగా ప్రస్తావించలేదు. కాని పగటి వెలుగు రాత్రి చీకటి తెరలను చీల్చుకుంటూ వస్తుంది (ఫతుల్ ఖదీర్).
[4] క్రమ్ముకుంటూ వచ్చే రాత్రి కూడా గమనించదగినదే. అది సూర్యుణ్ణి తెరమరుగు చేయటంతో పాటు అన్నివైపులా గాఢాంధకారం అలుముకునేలా చేస్తుంది.
[5] లేదా ఆకాశాన్ని నిర్మించినవాని సాక్షిగా!
[6] లేదా భూమిని సుగమం చేసిన వాని సాక్షిగా!
[7] లేదా ఆత్మను సంస్కరించిన తీరు సాక్షిగా!
[8] ఇక్కడ ‘ప్రేరణ’ అంటే అర్థం ఏమిటి? మంచి ఏదో, చెడు ఏదో మనిషికి స్పష్టంగా బోధపరచటం కావచ్చు. లేదా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా చూపించిన మార్గం కావచ్చు. లేదా మానవ నైజంలోనే మంచీ చెడులను పరికించే గుణాన్ని ప్రోదిచేసి ఉండవచ్చు. మానవుడు మంచిని అనుసరించి చెడుల నుంచి తన్ను కాపాడుకోవాలన్నదే దీని ఉద్దేశం.
[9] అంటే – షిర్కు నుండి, పాపాల నుండి, నైతికపు రుగ్మతల నుండి తన ఆత్మను ప్రక్షాళనం చేసుకుని, పరలోక సాఫల్యం పొందిన వాడన్నమాట.
[10] అంటే తన అంతరాత్మ ప్రబోధాన్ని అణచివేసినవాడు, దాన్ని కప్పిపుచ్చినవాడు, దాన్ని దాని మానాన వదలివేసినవాడు, అంతరంగాన్ని దైవాజ్ఞాపాలన కోసం సంసిద్ధం చేయనివాడు, సత్కార్యాల వైపు మరలనివాడు. ఇలాంటివాడు దారి తప్పి నష్టపోయినవానితో సమానం.
[11] ‘తుగ్ యాన్’ అంటే హద్దుమీరిపోవటం అన్నమాట. ఈ దుర్మార్గం వల్లనే వారు తమ ప్రవక్త మాటలను పెడచెవిన పెట్టారు.
[12] వాడిపేరు ఖుదార్ బిన్ సాలిఫ్ అని ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. దైవధిక్కార వైఖరిలో వాడు పోషించిన కీలకపాత్ర కారణంగా సమూదు జాతిలోని పొగరు బోతులంతా వాణ్ణి తమ నాయకునిగా ఎన్నుకున్నారు.
[13] అంటే ఆ ఒంటెకు ఎలాంటి కీడు తలపెట్టరాదని దైవప్రవక్త (హజ్రత్ సాలెహ్) వారికి సూచించారు. త్రాగునీరు కోసం ఆ ఒంటెకు కేటాయించబడిన ‘వంతు’ విషయంలో కూడా ఆటంకం సృష్టించరాదని నచ్చజెప్పారు. త్రాగునీరు కోసం సమూద్జా తికి ఒక రోజు, దేవుని సూచనగా ఉన్న ఆ ఆడ ఒంటెకు ఒక రోజు వంతులు వేయబడ్డాయి. కాని ఆ దుర్మార్గులు ఆ సూచనను సయితం ధిక్కరించారు.
[14] ఒంటెను చిత్రహింసలు పెట్టి చంపే ఆ తంతునంతా ఖుదార్ ఒక్కడే నిర్వహించాడు. అయితే ఆ మహాపరాధంలో ఆ జాతి వారంతా అతనికి అండగా నిలిచిన కారణంగా వారంతా అపరాధులుగానే ఖరారు అయ్యారు. ఈ ఉదంతం ద్వారా స్పష్టమయ్యే ఒక సూత్రప్రాయమైన విషయం ఏమిటంటే, ఒక చెడుకు పాల్పడేవారు కొద్దిమందే అయినప్పటికీ సమాజ సభ్యులంతా దాన్ని ఖండించే బదులు సుముఖత తెలిపితే లేక తెలిసీ తెలియనట్లుగా వదలివేస్తే, అప్పుడు దేవుని దృష్టిలో ఆ సమాజ సభ్యులంతా ఆ చెడులో భాగస్థులుగానే పరిగణించబడతారు.
[15] అంటే చాలా భయంకరమైన విపత్తును వారిపైకి అవతరింపజేశాడు.
[16] ఆ విపత్తును ఏ కొద్దిమంది కొరకు గాకుండా అందరికీ వర్తించే విధంగా చేశాడు. ఆ జాతిలోని పిన్నలు – పెద్దలు, స్త్రీలు – పురుషులు అందరూ ఆ దెబ్బకు ఠా అన్నారు.
[17] వారిని ఆ విధంగా నాశనం చేసినందుకు ఎవరయినా తనపై ప్రతీకారం తీర్చుకుంటారన్న భయం దైవానికి లేదు. ప్రతీకారం తీర్చుకునేదెవరు? ఆ శక్తి ఎవరికుందని? ప్రతీకారం తీర్చుకోవాలంటే సమ ఉజ్జీ అయి ఉండటం అవసరం. కాని విశ్వప్రభువుతో సరితూగగల వాడెవడున్నాడని?
—
30వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ అమ్మ – యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3P1gmLLtmLJ_qczbvpmWWr