[డౌన్ లోడ్ PDF]
ఖుత్బా యందలి ముఖ్యాంశాలు
[1] మక్కా ముకర్రమ మహత్యాలు
[2] మదీనా మునవ్వర మహత్యాలు
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
ఎందరో అదృష్టవంతులు ఈ రోజుల్లో బైతుల్లాహ్ హజ్ (అల్లాహ్ గృహం సందర్శన) యాత్రను పురస్కరించుకొని బిజీగా వున్నారు. అల్లాహ్ వారందరికీ మరియు మనందరికీ ఆమోదయోగ్యమయ్యే హజ్ ను అనుగ్రహించుగాక! మరియు మాటిమాటికి (పలుసార్లు) హరమైన షరీఫైన్ (మక్కా, మదీనాల) సందర్శన అవకాశాన్ని కలిగించుగాక! ఆమీన్!!
నేటి ఖుత్బాలో ఇన్షా అల్లాహ్ మేము హరమైన షరీఫైన్ల కొన్ని మహత్యాలు వివరిస్తాం. కాగా, రాబోయే శుక్రవారం ఖుత్బాలో హజ్ విధిత్వము, దాని మహత్యాలు, విశేషాలను క్షుణ్ణంగా వివరిస్తాం.
అన్నిటి కన్నా ముందుగా మేము పవిత్ర మక్కా పట్టణ మహత్యాలను గురించి వివరిస్తాం. ఎందుకంటే, హజ్ యాత్రలోని ఆచారాలన్నీ మక్కా ముకర్రమ లోనే ఆచరించబడతాయి. పవిత్ర మక్కా పట్టణం యావత్ భూభాగంలో అన్నిటికన్నా శ్రేష్ఠమైన పట్టణం. ఈ పట్టణమే అల్లాహు కు అన్నిటికన్నా ప్రియ మైనది. అందుకే అల్లాహ్, అందరికన్నా శ్రేష్ఠమైన తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఈ పట్టణంలోనే పుట్టించాడు మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇక్కడే దైవదౌత్యాన్ని అనుగ్రహించాడు.
అల్లాహ్ ఈ పట్టణం ప్రాధాన్యత, మహత్యాన్ని దృష్టిలో వుంచుకొని దీని పేరుతో ప్రమాణం చేశాడు.
وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ
“శాంతియుతమైన ఈ నగరం (మక్కా) సాక్షిగా!”. (తీన్ 95:3)
لَا أُقْسِمُ بِهَٰذَا الْبَلَدِ
“ఈ నగరం (మక్కా) తోడుగా (నేను చెబుతున్నాను)!”. (బలద్ 90:1)
అబ్దుల్లా బిన్ అదీ (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం ఆయన, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ‘అల్ హజ్వర’ అనే ప్రదేశంలో నిలబడి (మక్కా పట్టణాన్ని సంబోధిస్తూ) ఇలా సెలవీయడం చూశారు-
‘అల్లాహ్ సాక్షి! నువ్వు అల్లాహ్ యొక్క శ్రేష్ఠమైన మరియు ఆయనకు అత్యంత ప్రియమైన భూభాగానివి. ఒకవేళ నన్ను నీ నుండి బయటికి తీసి వుండకపోతే, నేను ఎప్పుడూ నిన్ను వదిలే వాణ్ణి కాను‘. (తిర్మిజీ: 3925, సహీహ్ -అల్బానీ)
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పవిత్ర మక్కా పట్టణాన్ని సంబోధిస్తూ ఇలా సెలవిచ్చారు:
“నువ్వు ఎంత చక్కటి పట్టణానివి మరియు నాకెంత ప్రియమైన దానివి! ఒకవేళ నా జాతి గనక, నిన్ను వదిలి పెట్టడానికి నన్ను బలవంత పెట్టి వుండకపోతే, నేను నీ వద్ద తప్ప మరే భూభాగంలోనూ ప్రశాంతత పోందేవాణ్ణి కాదు”. (తిర్మిజి: 3926, సహీహ్ -అల్బానీ)
ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ప్రార్థన
పవిత్ర మక్కా పట్టణం గురించి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) చేసిన ప్రార్ధన (దుఆ)ను అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా వివరించాడు:
وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِّنَ النَّاسِ ۖ فَمَن تَبِعَنِي فَإِنَّهُ مِنِّي ۖ وَمَنْ عَصَانِي فَإِنَّكَ غَفُورٌ رَّحِيمٌ رَّبَّنَا إِنِّي أَسْكَنتُ مِن ذُرِّيَّتِي بِوَادٍ غَيْرِ ذِي زَرْعٍ عِندَ بَيْتِكَ الْمُحَرَّمِ رَبَّنَا لِيُقِيمُوا الصَّلَاةَ فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ وَارْزُقْهُم مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَشْكُرُونَ
“ఇబ్రాహీమ్ ఇలా వేడుకున్నాడు: నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతిభద్రతల నగరంగా చేయి. నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు. నా ప్రభూ! అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి. కనుక నన్ను అనుసరించిన వాడే నా వాడు. కానీ ఎవరైనా నాకు అవిధేయత చూపితే నువ్వు అమితంగా క్షమించేవాడవు, కనికరించేవాడవు. మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో, నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను. మా ప్రభూ! వారు నమాజును నెలకొల్పేం దుకు (ఇక్కడ వదలిపెట్టాను) కనుక ప్రజలలో కొందరి మనసులు వారివైపు మొగ్గేలా చేయి. వారికి తినటానికి పండ్లు, ఫలాలను ప్రసా దించు- వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు”. (ఇబ్రాహీమ్ 14: 35-37)
ఈ ఆయతులలో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) – “మక్కా నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయమని ప్రార్ధించారని” అల్లాహ్, తెలియజేశాడు.
దానికి కారణం ఏమిటంటే, శాంతి వున్నప్పుడే, ప్రశాంతంగా అల్లాహు ను ఆరాధించడం సాధ్యమవుతుంది. ఒకవేళ శాంతి లేకుండా ఎల్లప్పుడూ భయాం దోళనలు, అరాచక పరిస్థితులు నెలకొని వుంటే ఆరాధనలో ఏకాగ్రత లోపిస్తుంది.
తదుపరి, ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) దుఆ చేస్తూ సెలవిచ్చిందేమిటంటే, ఆయన సంతానంలో కొందరిని వృక్ష జల వనరులు లేని ఎడారి లోయలో వసింపజేశారు. తద్వారా వారు నమాజు నెలకొల్పవచ్చని – కనుక ఓ అల్లాహ్ ప్రజలలో కొందరి మనసులను వారి వైపునకు మొగ్గేలా చేయి. బహుశా ఈ దుఆ ఫలితమే కావచ్చు, దాదాపు ప్రతి ముస్లిం హృదయంలో ఈ పట్టణం గురించి ప్రేమ వుంది మరియు ప్రతి ముస్లిం మాటిమాటికీ దీనిని సందర్శించడానికి ఇష్టపడుతుంటాడు.
ఇక్కడ మీకు సహీహ్ బుఖారీలోని ఒక సుదీర్ఘ హదీసును వివరించడం ఉచితమని పిస్తోంది. దానిలో ఇబ్రాహీమ్ (అలైహి స్సలాం) తన సంతానంలో కొందరిని మక్కా ముకర్రమ ఎలా తెచ్చి వసింప జేశారు అన్న దాని గురించి వివరంగా ఉల్లేఖించబడింది. మరైతే ఆ హదీసును వినండి!
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:
“స్త్రీలలో మొదటి సారిగా వడ్డాణం ఉపయోగించినవారు హాజిరా. తద్వారా సారా కు ఆమె గురించి తెలియకుండా ఉండటానికి. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) హాజిరా ను, ఆమె కొడుకు ఇస్మాయీల్ (అలైహిస్సలాం)ను అక్కడి నుండి తీసుకెళ్ళారు. ఆ సమయంలో హాజిరా, ఇస్మాయీల్ (అలైహిస్సలాం)కు పాలుపడుతుండేవారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వారిద్దరినీ బైతుల్లాహ్ దగ్గర ఎత్తైన స్థలం వద్ద నేడు జమ్ జమ్ నీళ్ళు వున్న చోట, ఒక పెద్ద వృక్షం క్రింద కూర్చో బెట్టారు. ఆ సమయంలో అక్కడ ఒక్క మనిషి కూడా లేదు, నీటి సౌకర్యం కూడా లేదు. ఆయన వారికి ఖర్జూరాలు కలిగిన ఒక సంచి మరియు నీళ్ళు కలిగిన ఒక తోలు సంచి ఇచ్చి వెళ్ళసాగారు. హాజిరా ఆయన వెనుకనే వస్తూ ఇలా అడిగారు: “ఓ ఇబ్రాహీమ్! మమ్మల్ని ఏ మాత్రం జన సంచారం లేని, నీటి సౌకర్యం లేని లోయలో విడిచి వెళుతున్నారు?” హాజిరా పలు సార్లు ఇలా అడిగారు, కానీ ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. దీనితో ఆమె, మీకిలా చెయ్యమని అల్లాహ్ ఆజ్ఞాపించాడా? అని అడిగారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జవాబిస్తూ ‘అవును’ అని అన్నారు. ఆమె – “అలాగా! (అయితే వెళ్ళండి), అల్లాహ్ మమ్మల్ని వృధా చేయడు” అని చెప్పి తిరిగి వచ్చేసారు.
ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) అక్కణ్ణుంచి బయలుదేరి ఒక ఇసుక దిబ్బ పైకి చేరుకున్నారు. అక్కడి నుండి ఆయన వారిని చూడలేరు. తదుపరి, ఆయన బైతుల్లాహ్ వైపు తిరిగి తన చేతులెత్తి ఇలా ప్రార్థించారు: “మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో, నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను….”
ఇటు హాజిరా, ఇస్మాయీల్ (అలైహిస్సలాం)కు పాటు పట్టి నీళ్ళు త్రాగిస్తూ వున్నారు. చివరికి ఆ నీళ్ళు అయిపోయాయి. దీనితో ఇద్దరూ దాహార్తులై పోయారు. పిల్లవాడు దాహంతో కొట్టుమిట్టాడడం ఆమె గమనించారు. పిల్లవాడి పరిస్థితి చూసి ఆమె చలించిపోయారు. చుట్టూ ఆమె దృష్టి సారించారు. సఫా కొండ ఆమెకు దగ్గరగా కనిపించింది. దీనితో ఆమె దాని పైకి ఎక్కి తదుపరి లోయలోకి దిగారు, తద్వారా జన సంచారం ఏదైనా కనబడుతుందేమో అని అటూ ఇటూ చూశారు. కానీ ఆమెకు ఎవరూ కనిపించలేదు. ఆమె సఫా కొండ నుండి దిగి లోయలోకి వచ్చేశారు. తన వస్త్రాన్ని కాస్త పైకి లేపి కష్టాల్లో ఉన్న వ్యక్తి లాగా పరుగెత్తుతూ లోయను దాటి మర్వా కొండ పైకి వచ్చేశారు. తదుపరి దానిపై నిలబడి, జన సంచారం ఏమైనా కనబడుతుందేమో అని అటూ ఇటూ చూశారు. కానీ ఆమెకు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. ఈ స్థితిలోనే ఆమె సఫా, మర్వాల మధ్య ఏడు సార్లు ప్రదక్షిణ చేశారు.
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. “అప్పటి నుంచే ప్రజలు సఫా, మర్వాల తవాఫ్ (ప్రదక్షిణ) ప్రారంభించారు”.
ఆమె ఏడవ సారి పరుగెత్తుతూ, మర్వాపైకి ఎక్కినప్పుడు ఒక శబ్దాన్ని విన్నారు. ఆమె తన మనసులో – నిశ్శబ్దంగా వుండి ముందు ఆ మాటలు వినాలనుకొని మనసును అటువైపు కేంద్రీకరించారు. తదుపరి ఆమె – మేము నీ మాటలు విన్నాం, మాకు నీవేమైనా సహాయం చేయగలవా? అని అడిగారు. ఆ సమయంలో ఆమె జమ్ జమ్ ఉన్న స్థానంలో ఒక దైవదూతను చూసారు. అతను తన కాలితో లేదా తన రెక్కతో భూమిని త్రవ్వగా దాని నుండి నీళ్ళు బయటకి వచ్చాయి. హాజిరా ఆ నీటిని నియంత్రించే ఉద్దేశ్యంతో చేతులతో అడ్డుకట్ట వేసి, తన వద్దనున్న తోలు సంచిని నీళ్ళతో నింపుకున్నారు. ఆమె చేతులలో నీళ్ళు నింపి బయటకు తీయగానే నీళ్ళు మరింత వేగంగా భూమి నుండి బయటికొచ్చేవి.
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్, ఇస్మాయీల్ తల్లిపై కరుణించుగాక! ఆమె ఒకవేళ జమ్ జమ్ ను యధావిధిగా వదిలిపెట్టి వుంటే (లేదా ఇలా సెలవిచ్చారు) తన చేతులతో దానిని మాటిమాటికి తీసి వుండక పోతే జమ్ జమ్ ఒక ప్రవహించే కాలువ లాగా వుండేది.
తదుపరి హాజిరా ఆ నీళ్ళు త్రాగారు మరియు పిల్లవాడికి పాలు పట్టారు. దైవదూత ఆమెతో – మీరు భయపడకండి, ఇక్కడ అల్లాహ్ గృహం వుంది. ఈ పిల్లవాడు మరియు ఇతని తండ్రి దానిని నిర్మిస్తారు. ప్రస్తుతం కాబా గృహం వున్న స్థలం ఆ సమయంలో నేల నుండి కొంత ఎత్తుగా వున్నది. వర్షపు నీరు దాని ఇరు ప్రక్కల నుండి ప్రవహించేది.
కొంత కాలం గడిచాక ‘జుర్ హుమ్’ తెగవారు లేదా వారి కుటుంబీకులు (కదా అనబడే) మార్గం ద్వారా ప్రయాణిస్తూ అక్కడి నుండి వెళుతూ మక్కా లోయలో బస చేశారు. అక్కడ ఒక పక్షి ఎగురుతూ వుండడం చూసి ఈ పక్షి (సాధారణంగా) నీళ్ళున్న స్థలంలోనే తిరుగుతూ వుంటుంది. కానీ మనకీ ప్రదేశం గురించి బాగా తెలుసు, ఈ ప్రదేశంలో నీరు ఎక్కడా లభించదు అనుకొని ఎక్కడైనా నీరు లభిస్తుందేమో చూసి రమ్మని ఒక వ్యక్తిని పంపించారు. అతను నీళ్ళున్న ఆ స్థలాన్ని కనుక్కొని తిరిగి వెళ్ళి తన తెగ వారికి తెలియజేశాడు. దీనితో వారంతా అక్కడికి చేరుకున్నారు. హాజిరా నీళ్ళ వద్దే కూర్చుని వున్నారు. వాళ్ళు ఆమెను, మేమిక్కడ బస చేయడానికి మీరు అనుమతిస్తారా? అని అడిగారు. ఆమె -సరే, కాని ఈ నీటిపై మీకు ఏ విధమైన ఆధికారం ఉండదు అని జవాబిచ్చారు. వాళ్ళు సరే, మంచిది అని అన్నారు.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: ఇస్మాయీల్ (అలైహిస్సలాం) తల్లి కూడా మనషులు అక్కడ స్థిరపడాలనే కోరుకునేవారు. ఇలా వారంతా అక్కడ స్థిరపడ్డారు మరియు తమ కుటుంబీకులను కూడా పిలిపించుకున్నారు. దీనితో అక్కడ ఎన్నో ఇళ్ళు వెలిసాయి (నిర్మించబడ్డాయి). ఇటు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) కూడా యౌవన దశకు చేరుకుని, వారి నుండే అరబీ భాషను నేర్చుకుని వాళ్ళ దృష్టిలో ఒక మంచి యువకుడిగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు ఆయనను ప్రేమిస్తూ తమ కుటుంబంలోని ఒక యువతినిచ్చి ఆయనతో వివాహం జరిపించారు. ఆ తర్వాత ఆయన తల్లి (హాజిరా) మరణించారు.
ఒకసారి, ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన భార్యను, కుమారుణ్ణి చూడడానికి వచ్చారు. ఆ సమయంలో ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఇంట్లో లేరు. ఆయన, అతని భార్యతో అతని గురించి అడగ్గా ఆమె – ఉపాధి అన్వేషణలో బయటికి వెళ్ళారు అని అంది. ఆయన “జీవితం ఎలా గడుస్తోంది?” అని అడిగారు. ఆమె – ఎంతో కష్టంగా గడుస్తోంది అని చెప్పి, కష్టాల గురించి ఆయనకు ఫిర్యాదు చేసింది. ఆయన నీ భర్త తిరగి వచ్చాక, నా సలాములు అతనికి అందజేయి మరియు తన ఇంటి గుమ్మాన్ని మార్చుకోమని చెప్పు అని చెప్పి వెళ్లిపోయారు.
ఇస్మాయీల్ (అలైహిస్సలాం) తిరిగొచ్చి, తన ఇంటికి అతిథిగా ఎవరో వచ్చి వెళ్ళారని గ్రహించి, భార్యతో, ఇంటికెవరైనా వచ్చారా? అని అడిగారు. అవునండి, ఒక ముసలివాడు వచ్చి వెళ్ళాడు. మీ గురించి అడగ్గా, నేను అతనికి వివరించాను. తదుపరి ఆయన, జీవితం ఎలా గడుస్తుందని అడిగారు. అతి కష్టంగా గడుస్తోందని నేను చెప్పాను. ఆమెను ఇస్మాయీల్ (అలైహిస్సలాం) – ఇంకేమైనా చెప్పారా అని అడిగారు. ఆమె – మీకు సలాం చెప్పి, ఇంటి గుమ్మం మార్చుకోమని చెప్పారు అని అన్నారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) -ఆయన మా తండ్రి గారు. ఆయన నన్ను, నిన్ను వదులుకోమని ఆజ్ఞాపించారు. కనుక, నువ్వు మీ ఇంటి వారి వద్దకు వెళ్ళిపో అని అన్నారు.
తదుపరి ఆయన, ఆమెకు విడాకులిచ్చి వేరే యువతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత, అల్లాహ్ తలచినంత కాలం ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన దేశంలోనే వుండిపోయారు. తదుపరి ఆయన మరోసారి ఇక్కడికి (మక్కా) రాగా, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) అప్పుడు ఇంట్లో లేరు. ఆయన, అతని భార్యతో ఇస్మాయీల్ (అలైహిస్సలాం) గురించి ఆడిగారు.
ఆమె – జీవినోపాధి నిమిత్తం బయటకు వెళ్ళారు అని అన్నారు.
ఆయన – జీవితం ఎలా గడుస్తోంది, ఎలా వున్నారు అని అడిగారు.
ఆమె – అల్లాహ్ దయ వల్ల చాలా బాగా గడుస్తోంది అనిన్నారు.
ఆయన – ఏం తింటున్నారు అని అడిగారు.
ఆమె – మాంసం అన్నారు.
ఆయన – ఏం త్రాగుతున్నారు అని అడిగారు.
ఆమె – నీళ్ళు అని అన్నారు.
ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఇలా దుఆ చేశారు: “ఓ అల్లాహ్ ! వీరి మాంసంలో, నీటిలో శుభాన్ని ప్రసాదించు”. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: ఆ రోజుల్లో మక్కాలో ఆహార ధాన్యాలు దొరికేవి కావు. ఒకవేళ దొరికితే, ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) వాటిలో కూడా శుభాన్ని ప్రసాదించమని ప్రార్థించేవారు. ఇక మక్కా తప్ప ఇతర ప్రదేశాల వారు కేవలం ఈ రెండు వస్తువులనే ఆహారంగా ఉపయోగిస్తే (ఆరోగ్య మరియు స్వభావ పరంగా) అవి వారికి సరిపోవు.
ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) (తన కోడలితో) ఇలా అన్నారు: నీ భర్త వచ్చాక నా సలాములు అతనికి అందజేయి మరియు ఇంటి గుమ్మం బాగుంది. దీనిని కాపాడుకోమని చెప్పు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) వచ్చాక భార్యతో, ఈ రోజు ఇంటికెవరైనా వచ్చారా? అని అడిగారు. ఆమె అవునండి, సంతోషంగా కనబడే ఒక ముసలివారు వచ్చారు. చాలా మంచి వ్యక్తి ఆయన. మీ గురించి అడగ్గా నేను చెప్పేసాను. ఇంకా మీ జీవితం ఎలా గడుస్తోందని అడిగారు. నేను, చాలా బాగా గడుస్తోందని చెప్పాను. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఇంకా ఏమైనా చెప్పారా? అని అడిగారు. ఆమె – అవునండి, మీకు సలామ్ చెప్పమన్నారు మరియు ఇంటి గుమ్మం చాలా బాగుంది, దీనిని కాపాడుకోమని చెప్పారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం) – ఆయన మా నాన్న గారు, ఆయన నాకు, నిన్ను నా వద్దే వుంచుకోమని ఆజ్ఞాపించారు అని అన్నారు.
అల్లాహ్ తలచినంత కాలం గడిచాక ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మళ్లీ (మక్కా) విచ్చేశారు. ఆ సమయంలో ఇస్మాయీల్ (అలైహిస్సలాం) జమ్ జమ్ వద్ద ఒక చెట్టు క్రింద కూర్చొని తన బాణాలను సరి చేసుకుంటున్నారు. తన తండ్రిని చూసి ఎంతగానో సంతోషిస్తూ నిలబడ్డారు మరియు తండ్రీ కొడుకు లిద్దరూ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. తదుపరి, ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) – ఓ ఇస్మాయీల్! అల్లాహ్ నాకు ఆజ్ఞాపించాడు. ఆ పనికి నువ్వు నాకు సహాయం చేస్తావా? అని అడిగారు. ఆయన, తప్పకుండా చేస్తాను అని అన్నారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఒక ఎత్తైన స్థలాన్ని చూపిస్తూ, “ఇక్కడ ఒక గృహాన్ని నిర్మించమని అల్లాహ్ నాకు ఆజ్ఞాపించాడు” అని అన్నారు.
ఇస్మాయీల్ (అలైహిస్సలాం) రాళ్ళు తీసుకొచ్చేవారు మరియు ఇబ్రాహీం (అలైహిస్సలాం) నిర్మాణం చేస్తూ వున్నారు. గోడలు ఎత్తుగా నిర్మించబడ్డాక, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) ఒక రాయి (మఖామె ఇబ్రాహీమ్) ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఆ రాయిపై ఎక్కి నిర్మాణం చేసేవారు మరియు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) రాళ్ళు ఇస్తూ వుండేవారు. ఇద్దరూ ఇలా ప్రార్థించేవారు: ‘మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు. సర్వం తెలిసిన వాడవు’(బఖర: 127). (బుఖారీ: 3364)
క్లుప్తంగా ఈ సుదీర్ఘ హదీసులో తెలియజేయబడినదేమిటంటే, ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) తన సంతానంలో కొందరిని మక్కా ముకర్రమ కు తీసుకొచ్చి బస చేయించారు. దీనితో పాటు తెలిసిన మరో విషయమేమిటంటే, ఆయన తన పుత్ర రత్నంతో కలసి కాబా గృహాన్ని నిర్మించారు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
“ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం), ఇస్మాయీల్ (అలైహిస్సలాం) – ఇద్దరూ (కాబా) గృహ పునాదులను, గోడలనూ లేపుతూ ఇలా ప్రార్థించేవారు: మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు సర్వం వినేవాడవు, సర్వం తెలిసిన వాడవు“. (బఖర 2: 127)
దీని ద్వారా తెలిసిందేమిటంటే, కాబా గృహాన్ని మొట్ట మొదటగా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మరియు ఇస్మాయీల్ (అలైహిస్సలాం)లు నిర్మించారు. కొంత మంది విశ్లేషకులు అనేదేమిటంటే, దీనిని మొదటి సారి ఆదమ్ (అలైహిస్సలాం) నిర్మించారు. మరి కొంత మంది దీనిని మొదటి సారి దైవదూతలు నిర్మించగా, ఆదమ్ (అలైహిస్సలాం) దానిపై గోపురాన్ని నిర్మించారని, ఆ సమయంలో దైవదూతలు ఆయనతో, మేము మీ కన్నా ముందు ఈ గృహం తవాఫ్ చేసాము అని చెప్పారని…. పేర్కొన్నారు. మరి కొంత మంది వివరించిందేమిటంటే, నూహ్ (అలైహిస్సలాం) పడవ కూడా 40 రోజుల వరకు దీని తవాఫ్ చేసింది.
కానీ, హాఫిజ్ ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: ఈ విషయాలన్నీ బనీ ఇస్రాయీల్ ద్వారా ఉల్లేఖించబడ్డాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా-కాబా గృహం, ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)కు ముందు కూడా వుండేది అని నిరూపించడానికి ఒక్క ప్రామాణిక ఉల్లేఖనం కూడా దొరకదు. (ఖససుల్ అంబియా, ఇబ్నె కసీర్ : 157వ పేజీ)
కాబా గృహం అల్లాహ్ యొక్క మొదటి గృహం
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ
“నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (అల్లాహ్) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది. సమస్త లోకాలకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీమ్ (ఇబ్రాహీమ్ నిలబడిన స్థలం) ఉన్నది. అందులో ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరైనా (ఈ ఆజ్ఞను శిరసావహించడానికి) నిరాకరిస్తే, అల్లాహ్కు సమస్తలోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు”. (ఆలి ఇమ్రాన్ 3 : 96-97)
ఈ ఆయత్ లో అల్లాహ్, కాబా గృహం యొక్క 5 మహత్యాలను వివరించాడు:
1) కాబా గృహానికి – అల్లాహ్ యొక్క ప్రప్రథమ గృహం అనే గౌరవం ప్రాప్తమై వుంది.
అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను – ఈ భూమిపై నిర్మించబడిన మొట్టమొదటి మస్జిద్ ఏది? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – ‘మస్జిదుల్ హరామ్‘ అని జవాబిచ్చారు. ఆయన ఆ తర్వాత? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – ‘మస్జిదె అఖ్సా’ అని అన్నారు. ఆయన – ఈ రెండు మస్జిద్ ల మధ్య ఎంత వ్యవధి ఉంది? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – 40 సంత్సరాలు అని అన్నారు. (బుఖారీ: 3366, 3425, ముస్లిం: 520)
2) రెండవ మహత్యమేమిటంటే, ఈ గృహం ఎంతో శుభప్రదమైనది.
3) మూడవది – ఈ గృహం సమస్త లోకాలకు మార్గదర్శకం.
4) నాల్గవది – దీనిలో అల్లాహ్ సూచనలు ఎన్నో వున్నాయి (ఉదా॥ కు జమ్ జమ్ వగైరా)
అందులో ఒక సూచన ‘మఖామె ఇబ్రాహీమ్’. ఇదొక రాయి. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) దీనిపై నిలబడి కాబా గృహం గోడలను పైకెత్తారు (నిర్మించారు).
(5) ఐదవది – ఈ గృహంలోకి ప్రవేశించే వ్యక్తి శాంతిని పొందుతాడు.
కాబా గృహం ఒక మహోన్నతమైన ఆరాధనా స్థలం
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ وَعَهِدْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ
“మేము ఈ గృహాన్ని (కాబా గృహాన్ని) మానవులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతి నిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీమ్ నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. నా గృహాన్ని(సందర్శించి) ప్రదక్షిణ చేసే వారికోసం, అక్కడ ఏతెకాఫ్ పాటించే వారికోసం, రుకూ, సజ్జాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచాలి”. (బఖర 2: 125)
‘మానవులందరి పుణ్యక్షేత్రం’ అంటే – ఈ గృహం ప్రజలు మాటిమాటికీ సందర్శించి వెళ్ళే స్థలం అన్నమాట. ఇలా, ఉమ్రా మరియు హజ్జ్ ల సంకల్పంతో ప్రజలు ఎన్నో సార్లు ఈ గృహాన్ని సందర్శిస్తూ వుంటారు మరియు అల్లాహ్ ను ఆరాధించి పుణ్య ఫలాన్ని కూడా పొందుతూ ఉంటారు.
ఇంకా ఇలా సెలవిచ్చాడు:
جَعَلَ اللَّهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيَامًا لِّلنَّاسِ
“గౌరవ ప్రద గృహమైన ‘కాబా’ను అల్లాహ్ ‘మానవ మనుగడ’ సాధనంగా చేశాడు”. (మాయిద 5:97)
మౌలానా అబ్దుర్రహ్మాన్ కైలానీ రహిమహుల్లాహ్ ఈ ఆయతును విశ్లేషిస్తూ ఇలా పేర్కొన్నారు. ‘మానవ మనుగడ’ పదానికి మూడు వేర్వేరు అర్థాలు తీసుకోవచ్చు. ఆ మూడు అర్థాలు కూడా సరైనవే.
1) మానవులు అంటే ఆ కాలంలోని మరియు దానికి ముందు, తర్వాత ప్రళయం వరకూ రాబోయే మానవులందరూ అని అర్థం.
ఈ అర్థాన్ని గనక తీసుకుంటే, తెలిసేదేమిటంటే, సమస్త లోకాల అస్తిత్వం కాబా గృహంపైనే ఆధారపడి వుంది. అంటే, కాబా గృహం మరియు దానిని గౌరవించే వారు వున్నంత వరకు ఈ లోకం మిగిలి ఉంటుంది. అల్లాహ్ ఈ లోకాన్ని అంతమొందించాలని భావించినప్పుడు ప్రప్రథమంగా ఈ గృహాన్ని భూమిపై నిర్మించినట్లే, ఇది ఆకాశం పైకి లేపబడుతుంది. ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ ఈ అర్థానికే ప్రాధాన్యత ఇచ్చారు మరియు ఈ ఆయతునే పురస్కరించుకొని ఈ హదీసు తీసుకొచ్చారు:
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“(ప్రళయానికి ముందు) చిన్న పిక్కలు కలిగిన ఒక (సాధారణ) నల్ల జాతీయుడు కాబాను కూల్చేస్తాడు”. (బుఖారీ: 1591, 1596, ముస్లిం: 2909)
ఈ హదీసు ద్వారా తెలిసే రెండో విషయం ఏమిటంటే, ఈ నల్లజాతీయుడి కన్నా ముందుగా ఎంతటి బలమైన, పటిష్టమైన శత్రువైనా, కాబా గృహాన్ని కూలగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో సఫలీకృతుడు కాలేడు. అల్లాహ్, ఏనుగుల వారిని (అబ్రహ మరియు అతని సైన్యం) తుదముట్టించినట్లే, కాబా గృహాన్ని నష్టం కలిగించటానికి ప్రయత్నించే ప్రతి వ్యక్తిని లేదా జాతిని లేదా ప్రభుత్వాన్ని అంతమొందిస్తాడు.
2) మానవులు- దీని అర్థం ‘అరబ్బులు’ అని తీసుకుంటే అప్పుడు ఇలా అర్థం చేసుకోవచ్చు. అరబ్బులు నిషిద్ధ మాసాల్లో పూర్తి స్వేచ్ఛతో ప్రయాణం చేసేవారు. ప్రత్యేకించి, ఖుర్బానీ ఇచ్చే సంకల్పంతో ఖుర్బానీ పట్టాలు ధరింప జేసిన పశువులను తీసుకొని వేళ్ళేటప్పుడు. ఎందుకంటే, అరబ్బు జాతులన్నీ ఇలాంటి పశువులను గౌరవించేవి. వీటన్నిటికీ (ప్రశాంత వాతావరణానికి) కాబా గృహ పవిత్రతే మూల కారణం. హజ్ మరియు ఉమ్రా చేసేవారు, వ్యాపార బృందాలు మూడింట ఒక వంతు సంవత్సరం (4 నెలలు) ఎంతో ప్రశాంతంగా (ఏవిధమైన భయం లేకుండా) ప్రయాణించేవారు. ఇలా, కాబా గృహం యావత్ దేశపు నాగరిక, సామాజిక జీవితానికి ఆధారంగా నిలిచి వుంది.
3) మానవులు-ఒకవేళ దీని అర్థం ‘మక్కా మరియు దాని చుట్టు ప్రక్కల వుండేవాళ్ళు’ అని తీసుకుంటే, అప్పుడు ఇలా అర్ధం చేసుకోవచ్చు: ఎడారి లోయలో వున్న కాబా గృహం, మక్కా మరియు దాని చుట్టు ప్రక్కల నివసించే వారికి జీవనోపాధిగా మారి వుంది. ప్రపంచ నలుమూలల నుండి హజ్ మరియు ఉమ్రాల కొరకు వచ్చే వారికి నివాసం, భోజనం మరియు రవాణా సౌకర్యాలను కలుగజేయడం ద్వారా ఇక్కడ నివసించేవారు సంవత్సరం మొత్తానికి సరిపోయేంతగా, పైగా అంతకన్నా ఎక్కువగానే సంపాదిస్తూ వుంటారు. అంతేకాక, వారికి ఇతర సామాజిక, రాజకీయాల ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయి. (తౌసీరుల్ ఖురాన్ : 1వ సంపుటం, 565వ పేజీ)
పవిత్ర మక్కాలో కీడును తలపెట్టాలను కొనే వారి కోసం తీవ్రమైన హెచ్చరిక
పవిత్ర మక్కా ముకర్రమ అల్లాహ్ దృష్టిలో ఎంత పవిత్రమైనది మరియు ప్రియమైనదంటే, దీనిలో కీడును లేదా అల్లరి చేయాలని కేవలం సంకల్పించు కుంటేనే అలాంటి వారికి అల్లాహ్ బాధాకరమైన శిక్షను గురించి హెచ్చరిక చేశాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ الَّذِينَ كَفَرُوا وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِي جَعَلْنَاهُ لِلنَّاسِ سَوَاءً الْعَاكِفُ فِيهِ وَالْبَادِ ۚ وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ
ఇంకా ‘నిశ్చయంగా ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్ మార్గం నుండి, మస్జిదె హరామ్ నుండి (జనులను అడ్డుకుంటున్నారో, అక్కడ అన్యాయంగా అడ్డుదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాం. వాస్తవానికి మేము దానిని సర్వ మానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము. స్థానికులకు, బయటి నుంచి వచ్చే వారికి కూడా (ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది)”. (హజ్ 22: 25)
ఏనుగుల వారు మరియు కాబా గృహ సంరక్షణ
యమన్ దేశపు గవర్నర్ (అబ్రహ) తన ఏనుగుల సైన్యంతో కాబా గృహంపై దాడి చేయడానికి వచ్చినప్పుడు, అల్లాహ్ తన గృహాన్ని రక్షించాడు మరియు దాడి చేసిన సైన్యాన్ని చిన్న చిన్న పక్షుల ద్వారా తుదముట్టించాడు. ఇది (ఈ సంఘటన) కూడా ఈ గృహం మహత్యానికి సూచనే.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيل وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ. فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍ
చూడలేదా? ఏమిటి, వాళ్ళ కుట్రను (ఆయన) భగ్నం చేయలేదా? వాళ్ళపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్ళను కురిపించసాగాయి. ఎట్టకేలకు, ఆయన వారిని- తిని, (తొక్కివేసిన) తొక్కు మాదిరిగా చేసేశాడు”. (105. ఫీల్ సూరా)
ఈ సంఘటన వివరాలు క్లుప్తంగా ఇవి:
యమన్ దేశంలో ఇథియోపియా వాసుల క్రైస్తవ ప్రభుత్వము స్థాపించబడి ఉండేది. అబ్రహ అనే వ్యక్తి దానికి గవర్నరుగా వుండేవాడు. అతను బైతుల్లాహ్ యొక్క గౌరవం, ఔన్నత్యాన్ని చూసి అసూయ చెందే వాడు. అరబ్బు జగత్తులో కాబా గృహానికి గల స్థానం, ‘సనా’ పట్టణానికి కూడా వుండాలని కోరుకునేవాడు. తద్వారా కాబా గృహం కారణంగా మక్కా ఖురైషీయులకు లభిస్తున్న రాజకీయ, నాగరిక, వ్యాపార మరియు సామాజిక ప్రయోజనాలు అతని ప్రభుత్వానికి కూడా లభించాలని (అతని ఉద్దేశ్యం). ఈ ఉద్దేశ్యంతోనే అతను సనా పట్టణంలో ఒక అద్భుతమైన చర్చిని నిర్మించాడు. ఈ చర్చి చూడటానికి కాబా గృహం కన్నా ఎంతో గొప్పగా వుండేది. అయినప్పటికీ ప్రజలు దీని వైపునకు మరల లేదు. పైగా ఒక రోజు దానిలో ఎవరో గుప్తంగా మలవిసర్జన చేశారు. దీనితో అతని (అబ్రహ)కి కాబా గృహంపై దాడి చేసి, దానిని తుదముట్టించడానికి సాకు దొరికింది. దీనితో అతను 60 వేల మందితో కూడుకున్న ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఈ సైన్యంలో 13 ఏనుగులు కూడా వున్నాయి. ఈ సైన్యం యమన్ నుండి బయలు దేరింది. మార్గంలో దానిని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ ఓటమి పాలయ్యారు. చివరికి అతను మినా మరియు ముజ్దలిఫా మధ్య ‘ముహస్సిర్ లోయ’కు చేరుకొని అక్కడే బిడారాలు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే కొంత లూటీ కూడా చేశాడు. ఆ రోజుల్లో అబ్దుల్ ముత్తలిబ్ (దైవప్రవక్త తాతగారు) కాబా గృహానికి ‘ప్రధాన ముతవల్లీ’ గా వుండేవారు. ఆయనకు చెందిన 200 ఒంటెలను కూడా అతను (అబ్రహ) స్వాధీన పరచుకున్నాడు. తదుపరి, అతను మక్కా వాసులకు, తను వారితో పోట్లాడడానికి రాలేదని, కేవలం కాబా గృహాన్ని కూల్చడానికే వచ్చానని, మీతో చర్చలు జరపడానికి కూడా సిద్దమేనని కబురు పంపాడు.
ఈ ఆహ్వానంపై, అబ్దుల్ ముత్తలిబ్ అతన్ని కలవడానికి వెళ్ళారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది:
అబ్రహ : మీరేం కోరు కుంటున్నారు?
అబ్దుల్ ముత్తలిబ్: (మీరు స్వాధీనం చేసుకున్న) నా ఒంటెలు తిరిగి ఇచ్చేయమని కోరుకుంటున్నాను. ఇది విని అబ్రహ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకంటే ఆయన కాబా గృహం గురించి ఏ మాత్రం మాట్లాడలేదు.
అబ్రహ: మీరు కాబా గృహం గురించి మాట్లాడుతారని నేను అనుకు న్నాను.
అబ్దుల్ ముత్తలిబ్: ఒంటెల యజమాని నేను కనుక నేను వాటి గురించి మాత్రమే మాట్లాడగలను. ఇక కాబా గృహం విషయానికి వస్తే దాని క్కూడా ఒక యజమాని వున్నాడు. ఆయనే దానిని రక్షిస్తాడు.
అబ్రహ ఒంటెలు తిరిగి అప్పజెప్పగా, అబ్దుల్ ముత్తలిబ్ వాటిని తీసుకుని వెళ్ళిపోయారు.
ఇటు, అబ్రహ కాబా వైపుకు అడుగులు వేయడానికి నిశ్చయించు కున్నాడు. కానీ, అన్నింటికన్నా ముందు, అబ్రహ ప్రయాణిస్తున్న ఏనుగు కాబా గృహం వైపునకు వెళ్ళడానికి తిరస్కరించింది. దాని శరీరాన్ని ఎన్నో బాణాలతో గ్రుచ్చినప్పటికీ అది మిగతా అన్ని దిక్కుల వైపుకైతే నడిచేది కానీ, కాబా గృహం వైపుకు వెళ్ళడానికి ససేమీరా అంది. ఈ తరుణంలో అల్లాహ్ సముద్రం వైపు నుండి పక్షులను గుంపులు గుంపులుగా ఆ ప్రదేశానికి పంపించాడు. ప్రతి పక్షి నోటిలో మరియు రెండు కాళ్ళలో ఒక్కో కంకర్రాయి వుంది. ఆ పక్షులు ఆ కంకర్రాళ్ళను అబ్రహా సైన్యంపై పడవేసి దానిని సర్వనాశనం చేసాయి. (తఫ్సీర్ తైసీరుల్ ఖుర్ఆన్ మౌలానా అబ్దుర్రహ్మాన్ కైలానీ)
మక్కా ముకర్రమ పవిత్రత, నిషేధాలు
మక్కా ముకర్రమ ఎంతో పవిత్రమైన, నిషేధిత పట్టణం. అందుకే దీని పవిత్రతను కాపాడడం విధి. దీని నిషేధాలను దృష్టిలో వుంచుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మక్కా విజయం నాడు కొన్ని ప్రత్యేక ఆదేశాలను జారీ చేస్తూ ఇలా సెలవిచ్చారు.
“నిశ్చయంగా భూమ్యాకాశాలు సృష్టించబడినప్పటి నుండి అల్లాహ్ ఈ పట్టణాన్ని, నిషేధిత పట్టణంగా ఖరారు చేశాడు మరియు ప్రళయం వరకు దీనిని ఇలాగే వుంచుతాడు. నాకు ముందు, ఏ వ్యక్తికీ ఇక్కడ యుద్ధం చేసే అనుమతి లేదు. నాక్కూడా రోజులోని కొంత వ్యవధి వరకు మాత్రమే అనుమతించబడింది. తదుపరి ప్రళయం వరకు ఇది నిషేధిత పట్టణం గానే వుంటుంది. అందుకే ఇక్కడ వృక్షాలు నరకకూడదు. దీనిలోని జంతువులను వేటాడ కూడదు, దీనిలో క్రింద పడివున్న వస్తువును, దాని గురించి ప్రజలలో ప్రకటించాలనుకొనే వ్యక్తి మాత్రమే లేపాలి. దీనిలోని గడ్డి కోయకూడదు“.
దీనిపై అబ్బాస్ (రదియల్లాహు అన్హు- ఓ దైవ ప్రవక్తా! కేవలం ‘ఇజర్’ గడ్డిని కోయడానికి అనుమతించండి. ఎందుకంటే దీని ద్వారా కంసాలివాళ్ళు మరియు కమ్మరి వాళ్ళు ప్రయోజనం పొందుతూ వుంటారు. అదేగాక, మక్కా వాసులు దీనిని తమ ఇళ్ళ కప్పులపై వాడుతూ వుంటారు అని అన్నారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – “సరే, కేవలం ఇజఖర్ గడ్డిని కోయడానికి మాత్రమే అనుమతి వుంది” అని అన్నారు. (బుఖారీ: 1834, ముస్లిం: 1353)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే:
(1) మక్కా ముకర్రమలో యుద్ధం నిషేధించబడింది. పైగా అవసరం ఏమీ లేనప్పుడు ఆయుధాలు లేపడం కూడా వారించబడింది.
(2) మక్కా ముకర్రమ లో వృక్షాలు, మొక్కలు నరకడం మరియు గడ్డి కోయడం కూడా నిషిద్దం. కొన్ని అవసరాల రీత్యా కేవలం ‘ఇజఖర్’ గడ్డిని కోసే అనుమతి వుంది.
(3) మక్కా ముకర్రమ లో జంతువులు, పక్షులను వేటాడటం నిషిద్ధం. అంతేకాదు, వాటిని గెదమడం కూడా నిషేధమే.
(4) మక్కా ముకర్రమ లో క్రింద పడివున్న వస్తువును లేపడం కూడా సరికాదు. ఎత్తేవాడు దాని గురించి ప్రకటించి తదుపరి దాని యజమాని వద్దకు చేర్చాలని సంకల్పిస్తే అది వేరే విషయం.
బైతుల్లాహ్ తవాఫ్ (ప్రదక్షిణం) మహత్యం
యావత్ ప్రపంచంలో కేవలం కాబా గృహం తవాఫ్ మాత్రమే షరీయత్తు పరంగా ఉచితమైనది. అది తప్ప మరే గృహం (లేదా సమాధి) తవాఫ్ పూర్తిగా నిషిద్ధం.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బైతుల్లాహ్ యొక్క తవాఫ్ మహత్యం గురించి వివరిస్తూ ఇలా సెలవిచ్చారు:
“(తవాఫ్ చేస్తున్నప్పుడు) వేసే ప్రతి అడుగుకుగాను 10 పుణ్యాలు లిఖించబడతాయి, 10 పాపాలు తొలగించబడతాయి మరియు 10 అంతస్థులు (స్థానాలు) పెంచబడతాయి“. (అహ్మద్, సహీహ్ అత్తర్బ్ వ తర్హిబ్ లిల్ అల్బానీ: 1139)
పుణ్యఫలాన్ని ఆశించి సందర్శించే మూడు మస్జిదులలో మస్జిదుల్ హరామ్ కూడా ఒకటి
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“పుణ్యఫలాన్ని ఆశించి కేవలం మూడు మస్జిదుల వైపునకు ప్రయాణం చేయవచ్చు. అవి మస్జిదుల్ హరామ్, మస్జిద్ అఖ్సా మరియు నా ఈ మస్జిద్ (మస్జిద్ నబవి)”. (బుఖారీ: 1188, ముస్లిం: 1397)
ఈ హదీసు ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే, పుణ్యఫలాన్ని ఆశించి కేవలం ఈ మూడు మస్జిదుల వైపునకు మాత్రమే ప్రయాణం చేయవచ్చు. అంతే తప్ప మరే, ఇతర మస్జిద్ వైపునకు గానీ, మజార్ (సమాధి) వైపునకు గానీ పుణ్య ఫలాన్ని ఆశించి ప్రయాణం చేయడం షరీయత్తు పరంగా సరైనది కాదు.
మస్జిదుల్ హరామ్ లో నమాజు మహత్యం
మస్జిదుల్ హరామ్ ని ఒక్క నమాజ్, ఇతర మస్జిదుల లక్ష నమాజుల కన్నా ఉత్తమమైనది.
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “….మరియు మస్జిదుల్ హరామ్ లోని ఒక్క నమాజు, ఇతర మస్జిదుల లక్ష నమాజుల కన్నా ఉత్తమమైనది.” (ఇబ్నె మాజా: 1406, అహ్మద్: 14735, 15306, సహీహ్- అల్బానీ)
అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే, ఆయన మనందరినీ మాటిమాటికీ కాబా గృహాన్ని సందర్శించే సద్బుద్ధిని ప్రసాదించుగాక!
రెండవ ఖుత్బా
మొదటి ఖుత్బాలో మేము మక్కా ముకర్రమ మహత్యాలను గూర్చి వివరించాము, రండి, ఇక మదీనా మునవ్వర మహత్యాలు కూడా వినండి!
మదీనా మునవ్వర – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఆయన సహాబాలు హిజ్రత్ చేసిన నగరం. హిజ్రత్ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అక్కడ 10 సం||లు గడిపారు. ఈ వ్యవధిలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అక్కడ మొట్టమొదటి ఇస్లామీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్వయంగా దానిని పాలించారు. గొప్ప సహాబాలైన అబూ బక్ర్, ఉమర్, అలీ వగైరా…….” (రజియల్లాహు అన్హుమ్)లు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలహాదారులుగా వున్నారు. మదీనా మునవ్వర నుంచే ఇస్లామీయ సైన్యాలు బయలుదేరి అల్లాహ్ కలిమ (సద్వచనం) ప్రాబల్యం నిమిత్తం తిరస్కారులతో (అవిశ్వాసులతో) యుద్ధాలు చేసేవారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాలో వున్న కాలంలోనే ధర్మానికి సంబంధించిన ఎక్కువ ఆదేశాలు అవతరించాయి. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం కూడా ఈ నగరంలోనే జరిగింది మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇక్కడే ఖననం చేయబడ్డారు.
మదీనా మునవ్వర మహత్యాలు
(1) మదీనా మునవ్వర పేర్లు
అజ్ఞాన కాలంలో దీనిని ‘యస్రిబ్‘ అని పిలిచేవారు. మేము ఖుర్ఆన్ మరియు హదీసులలో ఈ మహోన్నత నగరం గురించి వచ్చిన పేర్లను మీకు వివరిస్తాం.
1) మదీనా. అల్లాహ్ ఈ శుభప్రద నగరం పేరును ఖుర్ఆన్ ఇలా వివరించాడు:
…مَا كَانَ لِأَهْلِ الْمَدِينَةِ وَمَنْ حَوْلَهُم مِّنَ الْأَعْرَابِ أَن يَتَخَلَّفُوا عَن رَّسُولِ اللَّهِ
“దైవప్రవక్తను విడిచి వెనుక ఉండిపోవడం మదీనాలో నివసించే వారికి……” (తౌబా 9: 120)
2) తౌబహ్. మదీనా మునవ్వర కు ఈ పేరు కూడా స్వయంగా అల్లాహ్ యే పెట్టాడు.
జాబిర్ బిన్ సముర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.
“నిశ్చయంగా మదీనా పేరును అల్లాహ్ ‘తౌబహ్’ గా పెట్టాడు”. (ముస్లిం: 1385)
3) తయ్యబహ్. మదీనా మునవ్వర కు ఈ పేరు స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెట్టారు. జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా ఇది (అంటే మదీనా మునవ్వర) తయ్యబహ్ (అంటే పవిత్రమైనది). వెండి త్రుప్పును కొలిమి ఎలా వేరు చేస్తుందో అపవిత్రాన్ని ఈ నగరం వేరు చేస్తుంది”. (బుఖారీ: 1884, ముస్లిం: 1384)
4) అద్దార్. మదీనా మునవ్వర ను అల్లాహ్ ఈ పేరుతో ఖుర్ఆన్ ప్రస్తావించాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَالَّذِينَ تَبَوَّءُوا الدَّارَ وَالْإِيمَانَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمْ حَاجَةً مِّمَّا أُوتُوا وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
“వీరి కంటే ముందే అద్దార్ (మదీనా)లోనూ, విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు (వారికి కూడా ఈ సొమ్మ వర్తిస్తుంది); వారు ఇల్లూ వాకిలిని వదిలి తమ వైపునకు వలస వచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా తమ అంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యత నిస్తారు. వాస్తవానికి తమలోని స్వార్థ ప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు”. (హష్ర్ 59 :9)
ఈ ఆయతులో మదీనా మునవ్వరను ‘అద్దార్‘ అని పిలవడం జరిగింది. దీనిలో మదీనా వాసుల మహత్యాలు కూడా వివరించబడ్డాయి. తమ ముహాజిర్ సహోదరులు మదీనా మునవ్వర విచ్చేసినప్పుడు వారు ఎంతగానో సంతోషించి హృదయానికి హత్తుకున్నారు. వారక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎంతగా సహాయపడ్డారంటే, తమ సంపదలో, ఇళ్ళలో మరియు తోటలలో వారిని కూడా భాగస్వాములుగా చేసుకున్నారు. త్యాగానికి సంబంధించి ఎల్లప్పుడూ గుర్తుండిపోయే ఉదాహరణలు నెలకొల్పారు. మహత్తరమైన రెండు ఉదాహరణలు మీకు వివరిస్తాం.
(1) అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికొచ్చి ఇలా విన్నవించుకున్నాడు: ఓ దైవప్రవక్తా! నేను బాగా ఆకలితో వున్నాను. దానితో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సతీమణుల వద్దకు కబురు పంపారు. కానీ వారి దగ్గర ఏమీ దొరకలేదు. (ముస్లింలోని ఉల్లేఖనంలో ఇలా వుంది – ఆయన (సల్లల్లాహు మీకు అలైహి వసల్లం) తన ఒక భార్య వద్దకు కబురు పంపగా ఆమె సత్యాన్నిచ్చి పంపిన ఆ శక్తిమంతుని సాక్షి! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు అని జవాబిచ్చారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండో భార్య వద్దకు కబురు పంపగా ఆమె దగ్గర్నుండి కూడా ఇదే సమాధానం వచ్చింది. చివరికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భార్యలందరి వద్దకు కబురు పంపగా, అందరి దగ్గర్నుంచి – మా దగ్గర నీళ్ళు తప్ప మరే వస్తువూ లేదు అన్న సమాధానమే వచ్చింది).
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
‘ఈ రోజు రాత్రి ఆతిథ్యమిచ్చే వ్యక్తి ఎవరైనా వున్నారా? అల్లాహ్ అతన్ని కరుణించుగాక!” అని అడిగారు. ఇది విని, ఒక అన్సారీ సహాబీ లేచి నిలబడి, ఓ దైవప్రవక్తా! నేనిస్తాను అని పలికి, ఆ వ్యక్తి (అతిథి)ని తన ఇంటికి తీసుకొని పోయి భార్యతో – ఇతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతిథి, కనుక నీ వద్ద ఏ వస్తువు ఉన్నా ఇతనికి తినిపించు అని అన్నారు.
ఆమె – అల్లాహ్ సాక్షి! ఈ రోజు నా దగ్గర కేవలం పిల్లలకు సరిపోయేంత భోజనం మాత్రమే వుంది! అని అన్నారు.
అన్సారీ సహాబీ – (పిల్లలను ఎలాగోలా బుజ్జగిస్తూ) వాళ్ళు భోజనం అడిగినప్పుడు నిద్రపుచ్చు. మేమిదద్దరం (అతిథి మరియు నేను) భోజనం చేస్తున్నప్పుడు నువ్వు కూడా వచ్చి (అతిథి ముందు భోంచేస్తున్నట్లు నటించి) తదుపరి దీపాన్ని సరి చేసే ఉద్దేశ్యంతో దానిని ఆర్పేయి. ఇలా ఈ రాత్రి మనమేమీ తినకుండా గడిపేద్దాం అని అన్నారు. అతని భార్య ఇలాగే చేసింది. (వారిద్దరూ అలాగే కూర్చొని వున్నారు మరియు అతిథి మాత్రం భోజనం చేశాడు).
మరుసటి రోజు తెల్లారాక ఆ అన్సారీ సహాబీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి రాగా, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు- “ఫలానా పురుషుడు మరియు స్త్రీ పట్ల అల్లాహ్ ఎంతో సంతోషించాడు లేదా ఇలా సెలవిచ్చారు – అల్లాహ్ వారిని చూసి నవ్వాడు”.
ముస్లిం లోని ఉల్లేఖనంలో దీని పదాలు ఇలా వున్నాయి:
‘నిన్న రాత్రి మీరు మీ అతిథి పట్ల ప్రవర్తించిన తీరు పట్ల అల్లాహ్ ఎంతో సంతోషించాడు. తదుపరి అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యత నిస్తారు... (హష్ర్:9). (బుఖారీ: 4889, ముస్లిం: 2054)
(2) అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) (హిజ్రత్ చేసి) మా వద్దకు (మదీనాకు రాగా, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన మరియు సాద్ బిన్ రబియా (రదియల్లాహు అన్హు) లను సోదరులుగా ఖరారు చేశారు. సాద్ (రదియల్లాహు అన్హు) ఎంతో ధనవంతులు. ఆయన (తన ముహాజిర్ సోదరులు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ తో) ఇలా అన్నారు – “మదీనా అన్సారులందరిలోనూ నేనెక్కువ ధనవంతుణ్ణని వారందరికీ తెలుసు. నేను కోరుకొనేదేమిటంటే, నా సంపదనంతా మనిద్దరి మధ్య రెండు భాగాలుగా చేస్తాను. అంతేకాక, నాకిద్దరు భార్యలున్నారు. వారిద్దరిలో మీకు మంచిగా తోచే ఆమెను నేను విడాకులు ఇస్తాను. ఇద్దత్ గడువు పూర్తి చేసాక మీరు ఆమెను వివాహం చేసుకోండి.” దీనిపై, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) – అల్లాహ్ మీ ఇంటి వారిలో శుభాన్ని ప్రసాదించుగాక! అని అన్నారు. తదుపరి ఆయన, అన్నిటికన్నా విలువైన నెయ్యి, పనీర్లకు యజమాని అయిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి వివాహం కూడా చేసుకున్నారు. (బుఖారీ: 3781)
మదీనా అన్సారుల త్యాగనిరతికి ఈ రెండు వృత్తాంతాలు ఎంతో చక్కటి ఉదాహరణలు.
5) పటిష్ఠమైన కవచం.
మదీనా మునవ్వర పటిష్ఠమైన కవచం అని కూడా పిలువబడింది.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నేను కలలో చూసిందేమిటంటే, నేనొక పటిష్ఠమైన కవచం (కోట)లో వున్నాను. ఇలా కవచాన్ని మదీనాతో పోల్చారు”. (అహ్మద్: 2445, 14787)
(2) మదీనా మునవ్వర మహత్యాలు
1) మదీనా మునవ్వర పట్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రేమ
ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన నగరాన్ని (మదీనా మునవ్వర) ఎంతగానో ప్రేమించేవారు.
ఆయెషా (రజి అల్లాహు అన్హా) కథనం: మేము మదీనా మునవ్వరకు విచ్చేసినప్పుడు అక్కడ అంటు వ్యాధులు వ్యాపించి వున్నాయి. దీనితో, అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) మరియు బిలాల్ (రదియల్లాహు అన్హు)లు వ్యాధిగ్రస్తులై పోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహాబాలు వ్యాధిగ్రస్తులవడం చూసి ఇలా ప్రార్ధించారు: “ఓ అల్లాహ్ ! మేము మక్కాను ప్రేమించినట్లుగానే, మా హృదయాల్లో మదీనా ప్రేమను కలుగజేయి, పైగా దాని కన్నా ఎక్కువగా (ప్రేమ కలుగజేయి). ఓ అల్లాహ్! మా ‘సా’ మరియు ‘ముద్ద్’ (కొలతలు)లలో శుభాన్ని ప్రసాదించు. ఈ ప్రదేశాన్ని (మదీనా మునవ్వర) మా కోసం ఆరోగ్యమైన ప్రదేశంగా చెయ్యి మరియు వ్యాధులను ‘జుహ్ ఫా’ (ఒక ప్రదేశం) వైపునకు మళ్ళించు”. (బుఖారీ: 1889, ముస్లిం: 1376)
అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రయాణం నుంచి మదీనా మునవ్వర తిరిగి వెళుతున్నప్పుడు దాని గోడలు కనిపించడం మొదలు పెట్టగానే, దాని మీది ప్రేమతో తన వాహనాన్ని వేగవంతం చేసేవారు. (బుఖారీ: 1902, 1886)
మదీనా అన్సారుల పట్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రేమ:
1) అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక అన్సారీ స్త్రీ తన పిల్లవాణ్ణి తీసుకుని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెతో సంభాషిస్తూ ఇలా సెలవిచ్చారు – “నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తిమంతుని సాక్షి! నాకు అందరికన్నా ఎక్కువ ప్రియులు మీరే”. (బుఖారీ: 3786)
2) అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: కందకం రోజు మదీనా అన్సారులు ఇలా అనసాగారు – “జిహాద్ గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతులపై ప్రమాణం చేసిన వాళ్ళం మేము! మేమిక బ్రతికున్నంత వరకూ ఈ వాగ్దానం పై స్థిరంగా వుంటాం!
దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ : “ఓ అల్లాహ్! పరలోక జీవితం తప్ప మరో జీవితం లేదు. కనుక నువ్వు ముహాజిర్లు మరియు అన్సారుల ఔన్నత్యాన్ని పెంచు” అని ప్రార్ధించారు. మరి కొన్ని ఉల్లేఖనాలలో- అన్నారులు మరియు ముహాజిర్లను మన్నించు అని రాగా, ఇంకా కొన్ని ఉల్లేఖనాలలో – అన్సారులు, ముహాజిర్లను (తగువిధంగా) బహుకరించు అని వచ్చింది. (బుఖారీ: 3795,3796, ముస్లిం: 1805)
3) అలాగే, అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, మక్కా విజయం నాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాలె గనీమత్ (యుద్ధ ప్రాప్తి) పంపిణీ చేశారు. దీనిపై మదీనా అన్సారులు అయిష్టతను వ్యక్తం చేయగా, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఇలా సెలవిచ్చారు:
“ప్రజలు యుద్ధ ప్రాప్తిని తమ ఇళ్ళకు తీసుకెళుతున్నప్పుడు, మీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను మీ ఇళ్ళకు తీసుకెళ్ళడం మీకిష్టం కాదా? (బాగా గుర్తుంచుకోండి!) ఒకవేళ ప్రజలంతా ఒక లోయలో వెళుతూ, అన్సారులు మరో లోయలో వెళితే, నేను అన్సారులు వెళ్ళే లోయలో వెళతాను”. (బుఖారీ: 3778, ముస్లిం: 1059)
4) బరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“కేవలం విశ్వాసి మాత్రమే అన్సారులను ప్రేమిస్తాడు. వారిని ద్వేషించేవాడు కపట విశ్వాసి అయిఉంటాడు. వారిని ప్రేమించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. వారిని ద్వేషించే వారిని అల్లాహ్ కూడా ద్వేషిస్తాడు”. (బుఖారీ: 3783, ముస్లిం: 75)
2) మదీనా మునవ్వర పవిత్రత, నిషేధాలు
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా మునవ్వరను నిషేధిత, గౌరవించదగ్గ నగరంగా ఖరారు చేశారు.
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “నిశ్చయంగా ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) మక్కా పట్టణాన్ని నిషేధిత పట్టణంగా ఖరారు చేసి మక్కా వాసుల కోసం ప్రార్థించారు. ఆయన మక్కా పట్టణాన్ని నిషేధిత పట్టణంగా ఖరారు చేసినట్లే నేను మదీనా నగరాన్ని నిషేధిత పట్టణంగా ఖరారు చేస్తున్నాను. ఇబ్రాహీం (అలైహిస్సలాం) మక్కా వాసులు శుభం కోసం ఎలాగైతే ప్రార్థించారో, నేను కూడా మదీనావాసులు కొలతలలో (సా మరియు ముద్దె) దాని కన్నా రెట్టింపు శుభాన్ని ప్రసాదించమని ప్రార్థించాను”. (బుఖారీ: 2129, ముస్లిం: 1360)
ఈ హదీసు ద్వారా నిర్ధారించబడిన విషయాలేమిటంటే, మదీనా మునవ్వర ఒక నిషేధిత పవిత్ర నగరం మరియు ఇక్కడ మక్కా పట్టణం కన్నా రెట్టింపు శుభం ప్రాప్తిస్తుంది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా ఇబ్రాహీం (అలైహిస్సలాం) మక్కా నగరాన్ని ఎలాగైతే నిషేధిత పట్టణంగా ఖరారు చేసారో, అలాగే నేను కూడా మదీనా మునవ్వరను నిషేధిత పట్టణంగా ఖరారు చేస్తున్నాను. దీని నిషేధ హద్దులు, నల్లటి రాళ్ళు కలిగిన రెండు మైదానాల మధ్య వున్నాయి. కనుక, దీనిలో వృక్షాలు నరకకూడదు, వేటాడకూడదు”. (ముస్లిం: 1362)
3) మదీనా మునవ్వర లో శుభం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రార్థన
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రార్థిస్తూ ఇలా అన్నారు:
“ఓ అల్లాహ్ ! మదీనా మునవ్వర లో మక్కా పట్టణం కన్నా రెట్టింపు శుభాన్నివ్వు“. (బుఖారీ: 1885, ముస్లిం: 1369)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు (పంట) మొదటి ఫలాన్ని తీసుకొచ్చినప్పుడు ఇలా ప్రార్ధించేవారు: “ఓ అల్లాహ్! మా మదీనాలో శుభాన్ని ప్రసాదించు, మా ఫలాల్లో, మా ‘సా’ మరియు ‘ముద్ద్’ లలో శుభాన్ని ప్రసాదించు. ఒక శుభంతో పాటు మరొక శుభాన్ని (రెట్టింపు శుభాన్ని) ప్రసాదించు.” (ముస్లిం: 1373) 4)
మదీనా మునవ్వర లో నివాసం మహత్యం
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఒకవేళ వారు తెలుసుకోగలిగితే, మదీనా వారి కొరకు ఉత్తమమైనది. ఏ వ్యక్తి అయినా దీనిని పట్టించుకోకుండా దీని బయటకు వెళ్ళిపోతే, అల్లాహ్ అతని స్థానంలో అతని కన్నా ఉత్తమమైన వ్యక్తిని తీసుకువస్తాడు. ఏ వ్యక్తి అయినా ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ, దీనిని తన నివాసంగా చేసుకుంటాడో అలాంటి వ్యక్తికి ప్రళయం నాడు నేను సిఫారసు చేస్తాను లేదా అతని గురించి సాక్ష్యమిస్తాను”. (ముస్లిం: 1363)
5) మదీనా మునవ్వర లో మరణం మహత్యం
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా మదీనాలో (వచ్చి) మరణించగలిగే స్థోమత కలిగి వుంటాడో అతను తప్పకుండా ఇలా చేయాలి. ఎందుకంటే మదీనా మునవ్వరలో మరణించే వారి కోసం నేను సిఫారసు చేస్తాను”. (అహ్మద్, తిర్మిజీ: 3917, ఇబ్నె మాజ, సహీహుల్ జామె అస్సగీర్: 6015)
అంటే, ఏ వ్యక్తి అయినా, తన మరణం వచ్చే వరకు మదీనా మునవ్వరలో గడపగలిగే స్థోమత కలిగి ఉంటాడో అతను తప్పకుండా ఇలా చేయాలి. ఎందుకంటే, మదీనా మునవ్వరలో మరణించిన కారణంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు భాగ్యానికి అతను నోచుకుంటాడు.
ఈ కారణం చేతనే ఉమర్ (రదియల్లాహు అన్హు ) ఇలా ప్రార్ధించేవారు:
“ఓ అల్లాహ్! నీ మార్గంలో వీర మరణాన్ని నాకు ప్రసాదించు. నాకు నీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నగరంలో మరణం ఇవ్వు”. (బుఖారీ: 1890)
6) మదీనా మునవ్వర లో విశ్వాసం (ఈమాన్) కుచించుకు పోవడం
ప్రళయానికి ముందు విశ్వాసం కుచించుకుపోయి మదీనా మునవ్వర లో వుండిపోతుంది.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నిశ్చయంగా పాము తన పుట్టలోకి కుచించుకోయినట్లే, విశ్వాసం కూడా మదీనా వైపునకు కుచించుకు పోతుంది”.(బుఖారీ: 1876, ముస్లిం: 147)
7) మదీనా మునవ్వర ప్రజలను ప్రక్షాళన చేస్తుంది
అబూ హురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇలా సెలవిస్తుండగా విన్నారు.
“నాకు ఒక బస్తీ గురించి (దాని వైపునకు హిజ్రత్ చేయమని) ఆజ్ఞాపించబడింది. అది ఇతర బస్తీలను తినేస్తుంది (అంటే అక్కడి నుండి బయలు దేరే సైన్యం ఇతర బస్తీలపై విజయం సాధిస్తుంది). ప్రజలు దానిని ‘యస్రిబ్’ అని పిలుస్తారు. వాస్తవానికి అది మదీనా. కొలిమి, త్రుప్పును ప్రక్షాళన చేసినట్లే అది కూడా ప్రజలను ప్రక్షాళన చేస్తుంది”. (బుఖారీ: 1871, ముస్లిం: 1382)
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరై ఇస్లాంపై ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద బైత్ (ప్రమాణం) చేశాడు. రెండవ రోజు అతను వచ్చేసరికి జ్వరంతో వున్నాడు. అతను – నా ప్రమాణం నాకు తిరిగి ఇచ్చేయండి అని అడిగాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనికి తిరస్కరించారు. అతను మూడు సార్లు దీని గురించి మొరపెట్టుకున్నాడు మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతిసారీ దానిని తిరస్కరిస్తూ పోయారు. దీనితో అతను మదీనా విడిచి వెళ్ళిపోయాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట్లాడుతూ- “మదీనా కొలిమి లాంటిది. అది అపవిత్రత నుండి పవిత్రతను వేరు చేస్తుంది” అని వివరించారు. (బుఖారీ: 1883, ముస్లిం: 1383)
ఈ హదీసు అర్థం ఏమిటంటే, మదీనాలో కేవలం చిత్తశుద్ధి కలిగిన విశ్వాసులు మాత్రమే వుండగలరు. తమ విశ్వాసంలో చిత్తశుద్ధి లోపించినవారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. (షరహ్ ముస్లిం లిన్నవవీ)
ఈ అర్థానికి మరో హదీసు ద్వారా కూడా బలం చేకూరుతుంది.
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “మదీనా వాసులారా! మీరు ‘యౌముల్ ఖలాస్’ ను గుర్తుకు తెచ్చుకోండి“. వాళ్ళు-యౌముల్ ఖలాస్ అంటే ఏమిటి? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: “దజ్జాల్ వస్తాడు. వచ్చి ‘జుబాబ్’ అనే ప్రదేశంలో దిగుతాడు. తదుపరి మదీనాలోని ప్రతి ముష్రిక్ పురుషుడు, ప్రతి ముష్రిక్ స్త్రీ, ప్రతి తిరస్కార (కాఫిర్) పురుషుడు, ప్రతి తిరస్కార స్త్రీ, ప్రతి కపట విశ్వాస పురుషుడు, ప్రతి కపట విశ్వాస స్త్రీ, ప్రతి అశ్లీల పురుషుడు, ప్రతి అశ్లీల స్త్రీ, ఇలా అందరూ అతన్ని కలవడానికి వెళ్ళిపోతారు. కేవలం (చిత్తశుద్ధిగల) విశ్వాసులు మాత్రమే మదీనాలో వుండిపోతారు. ఆ దినమే ‘యౌముల్ ఖలాస్’ దినం”. (తబ్రానీ – ఔసత్: 2186)
8) మదీనా వాసులకు కీడు తలపెట్టాలని భావించే వారికి తీవ్రమైన హెచ్చరిక
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
‘ఏ వ్యక్తి అయినా మదీనా గురించి చెడుగా ఆలోచిస్తే, నీటిలో ఉప్పు కరిగే విధంగా అల్లాహ్ అతన్ని కరిగిస్తాడు”. (బుఖారీ: 1877, ముస్లిం: 1387)
9) మదీనా మునవ్వర ఖర్జూరాల మహత్యం
ఇంతకు ముందు మేమొక హదీసును వివరించాం. దానిలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనా మునవ్వర ఫలాలలో శుభాన్ని గురించి ప్రార్థించారు. ఆ ఫలాలలో ఖర్జూరాలు కూడా వున్నాయి.
దీనికి అదనంగా, సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా ఉదయం పూట నల్లటి రాళ్ళ రెండు మైదానాల మధ్య (మదీనా మునవ్వర)లోని ఖర్జూరాలలో ఏడింటిని గనక తింటే, ఆ రోజంతా అతనికి ఏ అపాయం జరుగదు”. (ముస్లిం: 2047)
“ఏ వ్యక్తి అయినా ఉదయం పూట ఏడు ‘అజ్వా’ ఖర్జూరాలు గనక తింటే, ఆ రోజంతా అతనికి విషం ద్వారా గానీ, తాంత్రిక విద్య ద్వారా ఏ నష్టమూ వాటిల్లదు”. (బుఖారీ: 5445, ముస్లిం: 2047)
10) మదీనా మునవ్వర లో దుష్కార్యానికి ఒడిగట్టేవానికి తీవ్రమైన హెచ్చరిక
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా దీని (మదీనా మునవ్వర)లో దుష్కార్యానికి ఒడిగడతాడో, అతనిపై అల్లాహ్, ఆయన దూతలు మరియు ప్రజలందరి శాపం పడుతుంది. ఇక ప్రళయం రోజు అల్లాహ్, అతని ఫర్జు ను కూడా స్వీకరించడు, నఫిల్ను కూడా స్వీకరించడు“. (దాని ఒక అర్థం ఏమిటంటే, అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని కూడా స్వీకరించడు మరియు అతను ఇచ్చివున్న దానిని కూడా స్వీకరించడు).
11) ప్లేగు మరియు దజ్జాల్ నుండి మదీనా మునవ్వర సంరక్షణ
అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“మసీహ్ దజ్జాల్ ప్రాబల్యం మదీనా మునవ్వర లో ప్రవేశించ లేదు. ఆ రోజు దానికి ఏడు ద్వారాలు వుంటాయి. ప్రతి ద్వారం లోనూ దైవదూతలు కాపలా కాస్తూ వుంటారు”. (బుఖారీ: 1879)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“మదీనా మునవ్వర ద్వారాల వద్ద దైవదూతలు నియమించబడి వుంటారు. దీనిలోకి ప్లేగు వ్యాధి మరియు దజ్జాల్లు ప్రవేశించ లేరు“. (బుఖారీ: 1880)
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“దజ్జాల్ ప్రతి నగరంలోకి ప్రవేశిస్తాడు. కేవలం మక్కా, మదీనాలు తప్ప. ఈ రెండు నగరాలలోని ప్రతి ద్వారం వద్ద దైవదూతలు బారులుగా నిలబడి వీటి కాపలా కాస్తుంటారు. తదుపరి మదీనా తన లోపల (నివాసం) వున్న వారితోపాటు మూడు సార్లు, కంపిస్తుంది. దీని ద్వారా అల్లాహ్ ప్రతి తిరస్కారిని, కపట విశ్వాసిని ఈ నగరం నుండి బయటికి పంపించేస్తాడు”. (బుఖారీ: 1881)
మదీనా మునవ్వర లో అన్నిటి కన్నా ముఖ్యమైన ప్రదేశం ‘మస్జిదె నబవి’.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా దీని భూమిని కొన్నారు మరియు దీని పునాది కూడా స్వయంగా ఆయనే తన స్వహస్తాలతో వేసారు.
ఈ మస్జిద్ గురించి ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
لَّمَسْجِدٌ أُسِّسَ عَلَى التَّقْوَىٰ مِنْ أَوَّلِ يَوْمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِ
“తొలి నాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది”. (తౌబా 9: 108)
అయితే, ఈ ఆయతులో వివరించబడిన మస్జిద్ గురించి అభిప్రాయ బేధాలు వున్నాయి. కొందరు దీనిని ‘మస్జిద్ నబవి’ అని తీసుకుంటే, మరి కొంత మంది దీని అర్థం ‘మస్జిదె ఖుబా’ అని అన్నారు. కానీ, సహీహ్ ముస్లింలో అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఉల్లేఖించబడిన హదీసు ద్వారా తెలిసేదేమిటంటే, ఇది ‘మస్జిద్ నబవి’ గురించే చెప్పబడింది. (సహీహ్ ముస్లిం: 1398)
పుణ్య ఫలాన్ని ఆశిస్తూ షరీయత్తు పరంగా ప్రయాణం చేయగలిగే మూడు మస్జిద్లలో ‘మస్జిద్ నబవి’ కూడా ఒకటి.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“పుణ్య ఫలాపేక్షతో కేవలం మూడు మస్జిద్ల వైపునకు ప్రయాణం చేయవచ్చు. అవి ‘మస్జిదుల్ హరామ్’, ‘మస్జిద్ అఖ్సా’ మరియు నా ఈ మస్జిద్ (మస్జిదె నబవీ)“. (బుఖారీ: 1188, ముస్లిం: 1397)
మస్జిదె నబవిలో ఒక్క నమాజు మహత్యం
అబూ హురైరా (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నా ఈ మస్జిద్ (మస్జిదె నబవి) యొక్క ఒక్క నమాజ్, మస్జిదుల్ హరామ్ తప్ప ఇతర మస్జిదులలోని 1000 నమాజుల కన్నా ఉత్తమమైనది”. (బుఖారీ: 1190, ముస్లిం: 1394)
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మస్జిదె నబవి లో ఒక్క నమాజు మహత్యం దీని కన్నా ఎక్కువగా ఉందని మరియు దీనితో పాటు దానిలో 40 నమాజుల మహత్యం గురించి ఉల్లేఖించబడిన హదీసులన్నీ పరంపరల రీత్యా బలహీనమైనవి.
—
ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్