సహాబాల (ప్రవక్త సహచరులు) మహత్యం | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/virtues-of-sahaba
[PDF] [27 పేజీలు]

ఖుత్బాయందలి ముఖ్యాంశాలు:

  • 1) సహాబీ పరిచయం. 
  • 2) దివ్య ఖుర్ఆన్ వెలుగులో సహాబాల మహత్యం. 
  • 3) హదీసుల వెలుగులో సహాబాల మహత్యం. 
  • 4) అన్సారీ సహాబాల మహత్యం. 
  • 5) బదర్ వాసుల (బదర్ యుద్ధంలో పాల్గొన్నవారి) మహత్యం. 
  • 6) ఉహద్ వాసుల మహత్యం. 
  • 7) బైతే రిజ్వాన్ లో పాలుపంచుకున్న సహాబాల మహత్యం. 
  • 8) సహాబాల గురించి ‘అహఁలే  సున్నత్ వల్ జమాత్’ విశ్వాసము. 

ముస్లిం సహోదరులారా! 

నేటి ప్రసంగంలో మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబా(సహచరు)ల మహత్యం మరియు గొప్పతనాలను గూర్చి వివరిస్తాము. 

  • స్వయంగా అల్లాహ్ తన ఆఖరి గ్రంథం దివ్య ఖుర్ఆన్లో ప్రశంసించిన సహాబాలు, అంతేగాక, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎన్నో హదీసులలో తన సహచరులను గూర్చి కొనియాడారు. 
  • అందరికన్నా ముందుగా దైవవాణి (వహీ) ద్వారా సంబోధించబడ్డ సహాబాలు. 
  • మన ప్రియ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తమ కళ్ళతో దర్శించి, ఆయన ఆదేశాలను స్వయంగా తమ చెవులతో విన్న సహాబాలు.
  • దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఒక్కొక్క సున్నత్ ను గుర్తుంచుకొని ఈ అనుచర సమాజానికి చేరవేసిన సహాబాలు.  
  • ఇస్లాం ధర్మం నిమిత్తం తమ సర్వస్వాన్నీ, తమ ప్రాణాలను సయితం ధారపోసిన మరియు (అల్లాహ్, ఆయన ప్రవక్త) విధేయతలో ఆదర్శంగా నిలిచిన సహాబాలు. వారి ఆదర్శాలు లోకమున్నంత వరకు చదవబడుతూ, వినబడుతూ వుంటాయి. 

సహాబీ పరిచయం:

సహాబాల మహత్యం, గొప్పతనాలను గూర్చి వివరించడానికి ముందు ‘సహాబీ’ అంటే ఎవరు? అన్న దానిని గూర్చి వివరించాలను కుంటున్నాం. 

హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ‘సహాబీ’ ని గూర్చి వివరిస్తూ సహాబీ అంటే –

విశ్వాసపు స్థితిలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను కలిసి, చివరికి ఇస్లాం ధర్మం పైనే మరణించిన వ్యక్తి”.

తదుపరి దీనిని గూర్చి విపులంగా వివరిస్తూ హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు :

“ఈ నిర్వచనం రీత్యా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవ దౌత్యాన్ని విశ్వసించి, ఆయనను కలిసి, ఆపై ఇస్లాం ధర్మం పైనే స్థిరంగా వుండి, అదే స్థితిలో మరణించిన ప్రతి వ్యక్తి ‘సహాబీ’ అనబడతాడు. అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో గడిపిన వ్యవధి తక్కువైనా, ఎక్కువైనా ఫరవాలేదు. ఇంకా అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఏ విషయమైనా ఉల్లేఖించినా, ఉల్లేఖించకపోయినా, ఆయనతోపాటు ఏదైనా యుద్ధంలో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఫర్వాలేదు. ఒకవేళ అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తన కళ్ళతో చూసినా, లేక గ్రుడ్డివాడైన కారణంగా తన కళ్ళతో ఆయన్ను వీక్షించలేకపోయినా ఫర్వాలేదు. ఈ అన్ని స్థితులలో కూడా అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబీ అని అనబడతాడు. కానీ విశ్వసించిన తర్వాత, తిరిగి అవిశ్వాసం వైపునకు మరలిపోయిన వ్యక్తి మాత్రం ‘సహాబీ’గా గుర్తించబడడు.”  (అల్ ఇసాబఫీ మారిఫతుస్సహాబా : 1 సంపుటం, 7-8 పేజీలు) 

దివ్య ఖుర్ఆన్ వెలుగులో సహాబాల మహత్యం

‘సహాబీ’ అంటే ఎవరో మనకు తెలిసన తర్వాత, ఇక రండి, దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ వీరిని ఎలా చిత్రీకరించాడో మరియు ఎలా ప్రశంసిం చాడో చూద్దాం . 

وَٱلسَّـٰبِقُونَ ٱلْأَوَّلُونَ مِنَ ٱلْمُهَـٰجِرِينَ وَٱلْأَنصَارِ وَٱلَّذِينَ ٱتَّبَعُوهُم بِإِحْسَـٰنٍۢ رَّضِىَ ٱللَّهُ عَنْهُمْ وَرَضُوا۟ عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّـٰتٍۢ تَجْرِى تَحْتَهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًۭا ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

1)“ముహాజిర్లలో, అన్సారులలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తర్వాత, చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలను అల్లాహ్ వారి కొరకు సిద్ధం చేసి వుంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం కూడా అదే.” (తౌబా : 100) 

ఈ ఆయతులో అల్లాహ్ మూడు రకాల మనుషులను గూర్చి వివరించాడు. 

1) ముహాజిర్లు – అల్లాహ్ ధర్మం కోసం తమ పూర్వీకుల ప్రదేశాన్ని, తమ సంపదను వదిలి మదీనాకు వలస వెళ్ళిన వారు. 

2) మదీనా అన్సారులు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మరియు ముహాజిర్ సహాబాలను మనఃపూర్వకంగా సహాయం చేసే నిమిత్తం తమ సర్వస్వాన్ని ధారపోసిన వారు. 

అల్లాహ్ వీరి (ముహాజిర్లు, అన్సారులు)లో హిజ్రత్ (వలస) చేయడంలో, విశ్వసించడంలో ముందంజ వేసిన వారిని గూర్చి వివరించాడు. అంటే – అందరికన్నా ముందు హిజ్రత్ చేసి మరియు అందరికన్నా ముందు విశ్వసించి, ఇతరుల కోసం ఆదర్శప్రాయంగా నిలిచినవారు. 

3) ఇలా (ధర్మం విషయంలో) ముందంజ వేసిన వారిని పూర్తి చిత్తశుద్ధితో మరియు ప్రేమతో అనుసరించి వారి అడుగుజాడల్లో నడిచినవారు. వీరిలో సహాబాల తర్వాత వచ్చినవారు, తాబయీలు మరియు ప్రళయం వరకు రాబోయే వారందరూ – ఎవరైతే వారిని (ముందంజ వేసిన వారిని) సత్యానికి కొలమానంగా భావించి వారిని అనుసరిస్తారో – చేరివున్నారు. 

మూడు రకాల వ్యక్తులను గూర్చి వివరించిన తర్వాత అల్లాహ్ వీరికి రెండు శుభవార్తలను వినిపించాడు. 

  • ఒకటేమో – అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. అంటే – వారి పొరపాట్లను మన్నించడంతోపాటు వారి సత్కార్యాలను స్వీకరించాడు. 
  • రెండవది – వారి కోసం స్వర్గాలను తయారుచేశాడు. వాటిలో వారు ఎల్లప్పుడూ ఉండగలరు మరియు వాటి అనుగ్రహాలను ఆస్వాదించగలరు.

ముహమ్మద్ బిన్ కాబ్ అల్ ఖుర్తుబీ ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ సహాబాలందరినీ మన్నించాడు మరియు తన గ్రంథంలో వారి కోసం స్వర్గాన్ని ‘తప్పనిసరి’ (వాజిబ్)గా ఖరారు చేశాడు. వారిలోని పుణ్యాత్ముల కొరకూ మరియు పొరపాటుదారులకు కూడా”. తదుపరి ఆయన దివ్య ఖుర్ఆన్లోని ఈ ఆయతే (తౌబా:100) పఠించారు. ఆ తర్వాత ఇలా అన్సారు: “దీనిలో అల్లాహ్, సహాబాల పట్ల ప్రసన్నుడవడం మరియు వారికోసం స్వర్గ ప్రకటన గురించి వివరించాడు. ఈ విధంగా, వారిని అనుసరించే వారి కోసం కూడా ఇవే బహుమానాలు వున్నాయి. కానీ షరతు ఏమిటంటే- వారిని పూర్తి చిత్తశుద్ధితో, ప్రేమతో అనుసరించాలి.” (అద్దరుల్ మషూర్ : 4/272) 

2) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

لَّقَد تَّابَ ٱللَّهُ عَلَى ٱلنَّبِىِّ وَٱلْمُهَـٰجِرِينَ وَٱلْأَنصَارِ ٱلَّذِينَ ٱتَّبَعُوهُ فِى سَاعَةِ ٱلْعُسْرَةِ مِنۢ بَعْدِ مَا كَادَ يَزِيغُ قُلُوبُ فَرِيقٍۢ مِّنْهُمْ ثُمَّ تَابَ عَلَيْهِمْ ۚ إِنَّهُۥ بِهِمْ رَءُوفٌۭ رَّحِيمٌۭ

“ప్రవక్త వైపునకూ, కష్టకాలంలో ప్రవక్తను వెన్నంటి వున్న ముహాజిర్లు, అన్సారుల వైపుకూ అల్లాహ్ (దయాభావంతో) మరలాడు. వారిలో కొందరి హృదయాలు తడబాటుకు లోనైనప్పుడు, ఆ తరువాత ఆయన వారి పొరపాటును మన్నించాడు. నిశ్చయంగా ఆయన వారి యెడల వాత్సల్యం కలవాడు, కరుణామయుడు.” (తౌబా: 117) 

ఈ ఆయత్ లో అల్లాహ్ ప్రత్యేకంగా – కష్టకాలంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు తోడుగా నిలిచిన ముహాజిర్ మరియు అన్సారీ సహాబాలను ప్రశంసించాడు. ఇక్కడ కష్టకాలం అంటే – తబూక్ యుద్ధ సమయం. ఆ సమయంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా తయారయ్యాయంటే – సహాబాలకు తినడానికేం దొరకలేదు సరికదా త్రాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా లభ్యం కాలేదు. ఎండ తీవ్రత కూడా విపరీతంగా వుంది. (యుద్ధంలో) పాల్గొన్న వారు ఎక్కువ మంది కాగా వారి కోసం ప్రయాణ సాధనాలు మాత్రం తక్కువగా వున్నాయి. అయినప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితులలోనూ సహాబాలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను వీడలేదు మరియు ప్రతి కష్టాన్ని ఓర్పుతో సహించారు. 

ఉమర్ (రదియల్లాహు అన్హు)ను ఈ ‘కష్టకాలం‘ను గూర్చి అడిగినప్పుడు ఆయన ఇలా వివరించారు: 

మేం తీవ్రమైన ఎండలో బయలుదేరాం. దారిలో దాహం వేసి ఒక చోట ఆగాం, దాహం తీవ్రత వల్ల మా గొంతులు మా నుండి వేరైపోతాయా అన్న అనుభూతి కలిగింది. పరిస్థితి ఎలా తయారయ్యిందంటే – మాలో ఎవరైనా ఒంటెను జిబహ్ చేస్తే, దాని పేడను పిండి, దాని నుండి వచ్చే నీటిని అతను త్రాగేవాడు. పరిస్థితి ఇంకా విషమించే సరికి, (ఇక ఆగలేక) అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో – ‘ఓ దైవ ప్రవక్తా! అల్లాహ్ మీ ప్రార్థనను స్వీకరిస్తాడు. కనుక మీరు మా కోసం ప్రార్థించండి’ అని విన్నవించుకున్నారు. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (ప్రార్థన నిమిత్తం) చేతులెత్తారు. ఇంకా చేతుల్ని క్రిందికి దించకముందే మాపై మేఘాలు క్రమ్ముకున్నాయి మరియు వర్షం ప్రారంభమైంది. సహాబాలందరూ తమ పాత్రలను నింపుకున్నారు. తదుపరి మేమంతా అక్కణ్ణుండి బయలుదేరాం. అప్పుడు తెలిసింది – వర్షం కేవలం మేము ఆగిన చోటే కురిసింది అని”.  (తఫ్సీర్ ఖుర్తుబీ : 8/279 & తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 2/522) 

ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం : “తబూక్ యుద్ధ ప్రయాణంలో అన్నపానీయాల కొరత ఎంత తీవ్రంగా పరిణమించిందంటే – ఒక ఖర్జూరాన్ని రెండు భాగాలు చేసి ఇద్దరు సహాబాలు పంచుకొనేవారు మరియు దాహం తీవ్రత మూలంగా, దాహం తీర్చుకోవడానికి సహాబాలు ఒకే ఖర్జూరాన్ని మాటి మాటికీ నమలసాగారు.” 

కాగా, అబూ హురైరా, అబూ సయీద్ (రదియల్లాహు అన్హుమ్)లు ఇలా సెలవిచ్చారు:

మేము తబూక్ యుద్ధంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వున్నాం. ఈలోగా ప్రజలు తీవ్ర ఆకలిబాధకు గురై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను – ఓ దైవప్రవక్తా! మీరు గనక మాకు అనుమతి ఇస్తే మా ఒంటెలను జిబహ్ చేసుకుంటాము అని విన్నవించుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి అనుమతి ఇచ్చేశారు. కానీ, ఉమర్ (రదియల్లాహు అన్హు) వచ్చి ఆయనతో ఇలా అన్సారు. “ఓ దైవప్రవక్తా! వీరొకవేళ ఒంటెలను జిబహ్ చేసేస్తే మనకు ప్రయాణ సాధనాలు తగ్గిపోతాయి, అలా కాక, మీరు వీరి దగ్గర వున్న ఆహారాన్ని ఒక్క చోట జమ చేయమని వీరికాదేశించి తదుపరి (దానిలో) శుభం కొరకు మీరు అల్లాహ్ ను ప్రార్థిస్తే బాగుంటుందేమో! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనికి ‘సరే’ అన్సారు. తర్వాత, ఒక దుప్పటిని ఆయన, నేలపై పరచమని ఆదేశించి ప్రజలతో – “మీ దగ్గర (తినడానికి) వున్న వస్తువేదైనా సరే తెచ్చి ఈ దుప్పటి మీద వుంచండి” అని పురమాయించారు. ఇలా, ఓ వ్యక్తి వచ్చి గుప్పెడు యవలు(జొ) దాంట్లో వేస్తే, మరో వ్యక్తి వచ్చి గుప్పెడు ఖర్జూరాలు దాంట్లో వేసేవాడు. ఇంకో వ్యక్తి వచ్చి యవలు(జొ) రొట్టె యొక్క చిన్న ముక్కను దాంట్లో చేర్చేవాడు. ఇలా, దుప్పటిలో కొంత ఆహార సామగ్రి తయారయ్యింది. తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (దానిలో) శుభం కోసం అల్లాహ్ ను ప్రార్థించి ప్రజలతో ఇలా అన్సారు. “ఇప్పుడు మీరు దీనిలో నుండి తీసుకొని తినండి”. సైనిక బలమంతా తమ తమ పళ్ళాలతో ఆహారం నింపుకొని కడుపునిండా భుజించారు. 

అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రకటించారు: – “అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు మరియు నేను అల్లాహ్ ప్రవక్తను అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇక ఏ వ్యక్తి అయినా వీటిని గూర్చి ఏ మాత్రం సంశయం లేకుండా ఈ రెండు సాక్ష్యాలతో గనక అల్లాహ్ ను కలిస్తే అల్లాహ్ అతణ్ణి తప్పకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”.(ముస్నద్ అహ్మద్ : 3/11, నెం.11090, సహీ ముస్లిం : కితాబుల్ ఈమాన్ : 44) 

ప్రియ శ్రోతలారా! 

తబూక్ యుద్ధ సమయంలో సహాబాలు ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను గూర్చి ఇంత విపులంగా చర్చించడంలోగల ఉద్దేశ్యమేమిటంటే – సహాబాలు ఎంత పటిష్టమైన విశ్వాసం కలిగి వున్నారో మరియు ఎలాంటి సహన స్థయిర్యాలు కలిగివున్నారో మరియు ఇస్లాం ధర్మం కోసం వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో మనం గ్రహించగలగడానికి. అందుకే అల్లాహ్ వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాడు మరియు తన దివ్యగ్రంథంలో “నేను వారిపట్ల ప్రసన్ను అయ్యాను, వారు నా పట్ల ప్రసన్నులయ్యారు” అని ప్రకటించాడు. 

3) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُلِ ٱلْحَمْدُ لِلَّهِ وَسَلَـٰمٌ عَلَىٰ عِبَادِهِ ٱلَّذِينَ ٱصْطَفَىٰٓ

“(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు: ప్రశంసలన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి. ఆయన ఎన్నుకున్న దాసులపై శాంతి కురియుగాక!” (నమ్ల్ : 59) 

ఈ ఆయత్ లో అల్లాహ్, శాంతిని కురిపించి తనకు ప్రియమైన వారుగా ఖరారు చేసిన దాసులు ఎవరంటే- ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ప్రకారం వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోసం ఎన్నుకోబడిన సహాబాలు. 

ఇమామ్ ఇబ్నె జరీర్ అత్తబరీ (రహిమహుల్లాహ్) కథనం: అల్లాహ్ చే ఎన్నుకోబడిన దాసులు అంటే – అల్లాహ్ తన ప్రవక్త కొరకు ఎన్నుకున్న వారు మరియు ఆయనకు సహచరులుగా, మంత్రులుగా (సలహాదారులు) చేయబడిన వారు. (జామె అల్ బయాన్:2/20, మి హుజుస్సున్నహ్ లి ఇబ్నె తైమియా: 1/156) 

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: 

“ఏ వ్యక్తి అయినా (ఎవరినైనా) అనుసరించాలనుకొంటే – అతను – ఈ లోకం విడిచిపోయిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాల సున్నత్ పై నడవాలి. ఈ అనుచర సమాజపు అత్యుత్తమ వ్యక్తులు వారు. అందరికన్నా ఎక్కువగా పవిత్ర హృదయులు, ధార్మిక పరిజ్ఞానం కలవారు మరియు అందరికన్నా తక్కువగా మొహమాట పడేవారు. అల్లాహ్ వారిని తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు తోడుగా మరియు తన ధర్మాన్ని రాబోయే తరాల వారికి చేర వేయడానికి ఎన్నుకున్నాడు. కనుక, మీరందరూ వారి గుణగణాలను మరియు పద్ధతులనే స్వీకరించండి. ఎందుకంటే వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు సహచరులుగా, రుజమార్గంపై నడిచే వారుగా వున్నారు”. (హులియా అల్ ఔలియా : 1/305-306) 

అలాగే, అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: 

“అల్లాహ్ తన దాసుల హృదయాల్లోకి తొంగిచూడగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) హృదయాన్ని అందరికన్నా ఉత్తమమైనదిగా కనుగొన్నాడు. అందుకే ఆయనను తన కోసం ఎన్నుకొని దైవ దౌత్యాన్ని ప్రసాదించాడు. తదుపరి, మళ్ళీ తన దాసుల హృదయాల్లోకి తొంగిచూడగా సహాబాల హృదయాలను అందరి కన్నా శ్రేష్టమైనవిగా కనుగొన్నాడు. అందుకే వారికి తన ప్రవక్త యొక్క మంత్రి మండలి దర్జాను ప్రసాదించాడు.” (అల్ ముస్నద్: 1/379, షరహస్సున్నహ్ :1/214) 

(4) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

مُّحَمَّدٌۭ رَّسُولُ ٱللَّهِ ۚ وَٱلَّذِينَ مَعَهُۥٓ أَشِدَّآءُ عَلَى ٱلْكُفَّارِ رُحَمَآءُ بَيْنَهُمْ ۖ تَرَىٰهُمْ رُكَّعًۭا سُجَّدًۭا يَبْتَغُونَ فَضْلًۭا مِّنَ ٱللَّهِ وَرِضْوَٰنًۭا ۖ سِيمَاهُمْ فِى وُجُوهِهِم مِّنْ أَثَرِ ٱلسُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِى ٱلتَّوْرَىٰةِ ۚ وَمَثَلُهُمْ فِى ٱلْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْـَٔهُۥ فَـَٔازَرَهُۥ فَٱسْتَغْلَظَ فَٱسْتَوَىٰ عَلَىٰ سُوقِهِۦ يُعْجِبُ ٱلزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ ٱلْكُفَّارَ ۗ وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ مِنْهُم مَّغْفِرَةًۭ وَأَجْرًا عَظِيمًۢا

“ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట వున్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, పరస్పరం కరుణామయులుగానూ వుంటారు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్నీ నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖార విందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో వుంది. ఇంజీలులో కూడా వీరి ఉపమానం వుంది. అది ఒక పంట పొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తర్వాత అది లావు అయ్యింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది. రైతులను అలరించ సాగింది. వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని. వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసివున్నాడు.” (ఫతహ్ : 29) 

ఈ ఆయత్ లో అల్లాహ్ సహాబాల ఎన్నో గుణగణాలను తెలియజేశాడు: 

  • 1) వారు అవిశ్వాసులపై కఠినులుగా వుంటారు. 
  • 2) పరస్పరం కరుణామయులుగా వుంటారు. 
  • 3) రుకూ, సజ్దాల స్థితిలో వుంటారు, 
  • 4) అల్లాహ్ కృపను, ఆయన ప్రసన్నతను చూరగొనే ఉద్దేశ్యం కలిగి వుంటారు. 
  • 5) వారి సజ్దాల మూలంగా వారి ముఖాలపై ప్రత్యేక ప్రభావం వుంటుంది. 
  • 6) వారికి లభించిన ఖ్యాతి ఎలాంటిదంటే – వారి ఖ్యాతి మరియు మహత్యాలను గురించిన వర్ణన గత ఆకాశ గ్రంథాలలో కూడా లభిస్తుంది. 
  • 7) వారి ఉపమానం – ఆరంభంలో బలహీనంగా వుండి తర్వాత బలం చేకూర్చుకున్న ఒక పంట పొలం లాంటిది. ఇదే విధంగా సహాబాలు కూడా ఆరంభంలో బలహీనులుగా వున్నారు. తర్వాత బలాఢ్యులుగా తయారయ్యారు. వారి ప్రభావం క్రమేపీ పెరుగుతూ పోయినందువల్ల అవిశ్వాసులు వారిని ద్వేషించుకొనే వారు మరియు వారి గురించి భయభ్రాంతులకు లోనయ్యేవారు. 

ఇలాంటి గుణ విశేషాలు కలిగి వుండడంతో పాటు, విశ్వాసము, సదాచరణలతో తమను తాము సింగారించుకున్న సహాబాలకు క్షమాపణను, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. 

హాఫిజ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ ఆయత్ ను విశ్లేషిస్తూ:

ఒక వ్యక్తి గనక నమాజ్ చదివే వాడయితే, అందులోనూ ప్రత్యేకంగా తహజుద్ నమాజును సైతం చదివేవాడయితే, దాని ప్రభావం మూలంగా అతని ముఖం ప్రకాశిస్తూ వుంటుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలను ఉల్లేఖించారు. ఒకవేళ అతని అంతరంగం పవిత్రంగా మారితే, అల్లాహ్ అతని బాహ్యాన్ని సయితం అందంగా రూపుదిద్దుతాడు. తద్వారా అతను ప్రజలలో ప్రియమైన వాడైపోతాడు”. 

తదుపరి హాఫిజ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఇలా పేర్కొన్నారు: 

సహాబాల సంకల్పంలో చిత్తశుద్ది వుండేది మరియు ఆచరణలు కూడా మంచిగా వుండేవి. అందుకే వారిని చూసిన వారెవరైనా, వారి వ్యక్తిత్వంతో, గుణగణాలతో తప్పకుండా ప్రభావితులయ్యేవారు.” 

ఇమామ్ మాలిక్ ఇలా సెలవిచ్చారు. 

నా వద్దకు ఈ విషయం చేరింది. సిరియాను జయించిన సహాబాలను (అక్కడి) క్రైస్తవులు చూసినప్పుడు అప్రయత్నంగా వారి నోటి నుండి ఈ మాటలు వచ్చేవి: అల్లాహ్ సాక్షి! వీరు (సహాబాలు) మా హవారీల (సహాయకులు) కన్నా ఉత్తములు, నిస్సందేహంగా వారు తమ మాటల్లో సత్యవంతులు. ఎందుకంటే – ఈ అనుచర సమాజపు – గొప్పతనం మునుపటి గ్రంథాల్లో తెలియజేయబడింది. ఈ అనుచర సమాజపు శ్రేష్టమైన వ్యక్తులు సహాబాలే మరి.” (తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 4 / 261) 

హదీసుల వెలుగులో సహాబాల మహత్యం

ప్రియ శ్రోతలారా! 

సహాబాల మహత్యం, శ్రేష్టతల గురించి మేము కేవలం నాలుగు ఆయతులు మరియు వాటి క్లుప్త విశ్లేషణ వివరించాం. వాస్తవానికి దివ్యఖుర్ఆన్ వారి మహత్యాలతో, సువర్ణనలతో నిండి వుంది. కానీ మేము క్లుప్తంగా వివరించి ముందుకు సాగుతున్నాం. 

ఇక దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట – గర్వించదగ్గ అయన శిష్యుల సువర్ణనను విందాం: 

1) అబూ మూసా (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: 

నక్షత్రాలు ఆకాశానికి సురక్షిత కవచం లాంటివి. అందుకే నక్షత్రాలు రాలిపోయిన తర్వాత ఆకాశం కూడా – దానికి వాగ్దానించబడినట్లు – మిగిలి వుండదు. నేను నా సహాబాలకు సురక్షిత కవచాన్ని, నేను మరణించాక, నా సహాబాలపై – వారికి వాగ్దానించబడిన సమయం వచ్చేస్తుంది. అలాగే నా సహాబాలు ఈ అనుచర సమాజునికి సురక్షిత కవచం వంటివారు. అందుకే నా సహాబాలు మృతి చెందాక నా అనుచర సమాజంపై దానికి వాగ్దానించబడిన విషయం అవతరిస్తుంది”. (సహీ ముస్లిం : కితాబ్ ఫజాయెల్ సహాజా: 2531) 

ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ హదీసును విశ్లేషిస్తూ ఇలా పేర్కొ న్నారు: 

నక్షత్రాలు మిగిలి వున్నంత వరకు ఆకాశం కూడా మిగిలి ఉంది. ప్రళయానికి ముందు నక్షత్రాలు కాంతి హీనమై పడిపోయినప్పుడు ఆకాశం కూడా బ్రద్దలైపోతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉనికి ఆయన సహాబాల కొరకు సురక్షిత కవచంగా వుండేది. ఆయన మరణించిన వెంటనే సహాబాలపై పరీక్షల విలయం తాండవించింది. అలాగే, సహాబాల ఉనికి ఈ అనుచర సమాజానికి సురక్షిత కవచంగా వుండేది. వారు నిర్యాణం చెందిన వెంటనే ఈ అనుచర సమాజంపై ఉపద్రవాలు విరుచుకుపడ్డాయి. క్రొత్త ఆచారాలు (బిద్అత్ లు) వెలుగు చూసాయి మరియు (వీటి కారణంగా) ఈ అనుచర సమాజం చెల్లా చెదురై పోయింది”. (షరహ్ ముస్లిం – నవవీ : 16/83) 

2) అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో – “అందరికన్నా శ్రేష్టమైన ప్రజలు ఎవరు?” అని ప్రశ్నించబడింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “నా తరం వారు (అందరికన్నా శ్రేష్టులు), తదుపరి వారి తర్వాత వచ్చేవారు, తదుపరి వారి తర్వాత వచ్చేవారు” అని సెలవిచ్చారు. (సహీ బుఖారీ : కితాబుల్ షహాదత్ : 2652, సహీ ముస్లిం: కితాబుల్ ఫజాయెల్ సహాబా : 2533) 

3) అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోదించారు: 

నా సహచరులను తిట్టకండి (దుర్భాషలాడకండి). నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తి స్వరూపని సాక్షి! మీరొకవేళ ఉహద్ పర్వతమంత బంగారం (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసినా, వారి ఒక ముద్ద్ కే కాదు, అర ముద్ద్ కు కూడా సమానం కాజాలదు.” (సహీ బుఖారీ : 2641, 3673. సహీ ముస్లిం : 2540) 

దీని అర్థం ఏమిటంటే – సహాబాల తర్వాతి వారు ఖర్చు చేసే ఎంతో ధనం కన్నా, ఒక సహాబీ కటిక బీదరికంలో కూడా కొద్దో గొప్పో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసింది అల్లాహ్ వద్ద ఎక్కువ పవిత్రతకు మరియు పుణ్యఫలానికి యోగ్య మైనది. 

4) అబ్దుర్రహ్మాన్ అల్ జహనీ (రదియల్లాహు అన్హు) కథనం: 

మేమొకసారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్ద కూర్చొని వున్నాం. అకస్మాత్తుగా ఇద్దరు రౌతులు అక్కడికి విచ్చేసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర కూర్చున్నారు. వారిలో ఒకడు బైత్ (ప్రమాణం) చేయదలిచి తన చేతిని ముందుకు చాపి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) తో ఇలా అడిగాడు – “ఓ దైవప్రవక్తా! మిమ్మల్ని చూసి, (తదుపరి) విశ్వసించి, ధృవీకరించి, మిమ్మల్ని అనుసరించే వ్యక్తి గురించి మీ అభిప్రాయమేమిటి?” దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “అతని కొరకు ‘తూబా’ (స్వర్గంలోని ఒక రకమైన చెట్టు పేరు) వుంది అని అన్సారు”. (ఇది విని) ఆ వ్యక్తి ప్రమాణం చేసి వెనక్కు జరిగాడు. తర్వాత రెండో వ్యక్తి ముందుకు వచ్చి ప్రమాణం (బైత్) చేయదలిచి మొదటి వ్యక్తి అడిగిన ప్రశ్నే అడిగాడు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈసారి కూడా – “అతని కొరకు తూబా వుంది, తదుపరి అతని కొరకు తూబా వుంది” అని అన్సారు. (ముస్నద్ అహ్మద్ : 17388, తబ్రానీ : 22/742, బజ్జార్ : 2769 – (కషఫుల్ ఇస్తార్), మజ్మఉజవాయిద్ : 1/18, హసన్ పరంపరతో) 

సహాబాల మహత్యం గురించి ఎన్నో హదీసులు, హదీసు గ్రంథాల్లో లభ్యమవుతాయి. పైగా, షేఖుల్ ఇస్లామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) కథనం ఏమిటంటే – 

“సహాబాల మహత్యం, ప్రశంసల గురించి, అలాగే, వారి తరానికి ఇతర తరాలపై గల ఔన్నత్యం గురించి వచ్చిన హదీసులు ‘మషూర్’. (ఎంతో ప్రాచుర్యం పొందిన) స్థాయికే కాదు, ముతవాతిర్ (ఎంతోమంది ఉల్లేఖించిన) స్థాయికి చేరి వున్నాయి. అందుకే వారిలో (సహాబాలలో) చెడుగులను, దోషాలను వెలికితీయడం వాస్తవానికి దివ్య ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో దోషాలను వెలికి తీయడమే అవుతుంది”. (మజ్ముఆ ఫతావా : 4/430) 

ఈ మహత్యాలు దాదాపు సహాబాలందరి కొరకు వున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక మహత్యాలు మాత్రం కొందరు ప్రత్యేక సహాబాల కోసమే వున్నాయి. వాటిలో కొన్నింటిని గూర్చి మేము మీకు వివరించదలిచాం. 

1) మదీనా అన్సారుల మహత్యం:

మదీనా అన్సారులను గూర్చి వివరిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَٱلَّذِينَ تَبَوَّءُو ٱلدَّارَ وَٱلْإِيمَـٰنَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِى صُدُورِهِمْ حَاجَةًۭ مِّمَّآ أُوتُوا۟ وَيُؤْثِرُونَ عَلَىٰٓ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌۭ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِۦ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ

ఇకపోతే, వీరి (ముహాజిర్లు) కంటే ముందే ఈ ప్రదేశం (మదీనా)లో స్థానికులుగా వుండి (ముహాజిర్ల రాకకు పూర్వమే) విశ్వసించి వున్నవారు (వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది). వారు ఇల్లూ, వాకిలిని వదిలి తమ వైపునకు వలసవచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా, దానిపై తమ అంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో వున్నప్పటికీ తమపై వారికే ప్రాధాన్యత ఇస్తారు. వాస్తవానికి తమ స్వార్థప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడిన వారే కృతార్థులు.” (హష్ర్ : 9) 

ఈ ఆయత్ లో అల్లాహ్, మదీనా అన్సారుల కొన్ని గుణగణాలను వివరించాడు మరియు వారిని గూర్చి “మక్కా ముహాజిర్లు మదీనాకు రావడానికి ముందే వీరు విశ్వసించారు” అని సాక్ష్యం ఇచ్చాడు. వారిలో పరోపకారం, త్యాగ గుణం ఎంతగా వుండేదంటే – హిజ్రత్ చేసి మదీనాకు వచ్చిన సహచరులను వారు మనస్ఫూర్తిగా ప్రేమించేవారు. ఒకవేళ యుద్ధ ప్రాప్తిలో ఏదైనా ముహాజిర్లకు ఇవ్వబడితే, దానిపై తమ హృదయాలలో ఏ మాత్రం అసూయ కలిగి వుండే వారు కారు. స్వయానా తమ ఇళ్ళల్లో కటిక బీదరిక స్థితి వున్నప్పటికీ తమపై మరియు తమ అవసరాలపై వారికి (ముహాజిర్లకు), వారి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఎల్ల వేళలా వారిని కనిపెట్టుకొని వుండేవారు. మదీనా అన్సారుల పరోపకార గుణం, త్యాగనిరతిని గూర్చిన ఎన్నో ఉదాహరణలు లభ్యమై వున్నప్పటికీ, మేమిక్కడ కేవలం రెండు ఉదాహరణలను ప్రస్తావించదలిచాం. 

1) అబూ హురైరా (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికొచ్చి (మరో ఉల్లేఖనంలో ఆ వ్యక్తి స్వయానా అబూ హురైరానే అని వుంది) ఓ దైవ ప్రవక్తా! నేను ఆకలితో వున్నాను! అని విన్నవించుకున్నాడు. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సతీమణుల ఇళ్ళల్లో దర్యాప్తు గావించారు కానీ, అక్కడ ఏమీ లభించలేదు. 

(మరో ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సతీమణులలో ఒక్కొక్కరి ఇంట్లో దర్యాప్తు గావించారు. ప్రతి ఇంటి నుండి, ‘మా దగ్గర కేవలం నీళ్ళు తప్ప మరేదీ తినడానికి లేదు’ అన్న జవాబు వచ్చింది) 

తదుపరి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహచరులతో ఇలా అడిగారు: ఇతణ్ణి ఆతిథ్యమిచ్చే వారెవరైనా వున్నారా? అల్లాహ్ అతడి స్థితిపై కరుణించుగాక! దీనిపై ఒక అన్సారీ సహాబీ (అబూ తల్హా) ఓ దైవప్రవక్తా! ‘నేనితనికి ఆతిథ్యమిస్తాను’ అని అన్సారు. తదుపరి ఆ అతిథిని తీసుకొని తన ఇంటికి వచ్చి, భార్యతో- ‘ఈ వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతిథి. కనుక తినడానికి నీ దగ్గర వున్నదాన్ని ఇతనికి పెట్టు మరియు ఇతణ్ణి ఆదరించు’ అని అన్సారు. ఆమె జవాబిస్తూ – ‘అల్లాహ్ సాక్షి! నా దగ్గర కేవలం పిల్లలకు సరిపడ భోజనం మాత్రమే వుంది’ అని అంది. దీనిపై అబూ తల్హా – ‘అలాగైతే ఓ పని చేయి, పిల్లలు భోజనం కోసం అడిగినప్పుడు (వారిని ఎలాగోలా బుజ్జగించి) పడుకోబెట్టు. మేమిద్దరం (నేను, అతిథి) భోజనానికి కూర్చున్నప్పుడు నువ్వు లాంతరును ఆర్పేయి. ఇలా ఈ రాత్రి మనమిద్దరం ఏమీ తినకుండానే పడుకొందాం’ (మరియు మన అతిథి తినగలుగుతాడు) అని అన్సారు.

{మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఉమ్మె సులైమ్ (రజి అల్లాహు అన్హ) లాంతరును బాగు చేస్తున్నట్లు చేసి దాన్ని ఆర్పేసారు. ఇలా వారిద్దరు {భార్యా భర్తలు) తమ అతిథి ముందు వారు కూడా భోజనం చేస్తున్నట్లు నటించారు. కానీ వాస్తవానికి వారు భోజనం చేయలేదు. రాత్రంతా ఆకలితోనే వున్నారు) 

మరుసటి రోజు ఉదయం అబూ తల్హా (రదియల్లాహు అన్హు)  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) సన్నిధికి రాగానే, దైవప్రవక్త – “ఫలానా పురుషుడు మరియు ఫలానా స్త్రీని చూసి అల్లాహ్ ఎంతగానో సంతోషించాడు లేదా వారిని చూసి నవ్వాడు” అని పలికారు. తదుపరి అల్లాహ్ ఈ ఆయత్ ను అవతరింపజేశాడు: “తాము స్వయంగా అగత్యపరులైనప్పటికీ, తమపై ఇతరులకే ప్రాధాన్యత ఇస్తారు”. (హష్ర్: 9) (సహీ బుఖారీ: కితాబుత్తఫ్సీర్ : 4889, 3798 సహీ ముస్లిం : 2054) 

2) అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) (హిజ్రత్ చేసి) మా దగ్గరకి (మదీనా) వచ్చేసినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన మరియు సంపన్నుడిగా వున్న సాద్ బిన్ రబియ (రదియల్లాహు అన్హు) ల మధ్య సోదర బాంధవ్యాన్ని నెలకొల్పారు. దీనిపై సాద్ బిన్ రబియ, అబ్దుర్రహ్మాన్ బిన్  ఔఫ్ తో ఇలా అన్సారు. “నేను అన్సారులలో అందరికన్నా ధనవంతుణ్ణి. ఈ విషయం అన్సారులందరికీ తెలుసు. నేను నా సంపదను రెండు భాగాలుగా చేస్తాను. ఓ భాగం నా కోసం మరియు ఓ భాగం మీ కోసం. అంతేగాక, నాకు ఇద్దరు భార్యలు కూడా వున్నారు. వారిద్దరిలో మీకు ఎవరు నచ్చితే నేనామెకు విడాకులిచ్చేస్తాను. ఆమె తన ఇద్దత్ గడువు పూర్తి చేసుకున్నాక మీరామెను వివాహం చేసుకోండి”. దీనిపై అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ స్పందిస్తూ : “అల్లాహ్ మీ ఇంటి వారిలో, మీ సంపదలో శుభాన్ని ప్రసాదించుగాక! అని ప్రార్థించారు”

అనస్ (రదియల్లాహు అన్హు)  కథనం : ఆ తర్వాత అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ నెయ్యి మరియు పనీర్ లకు యజమాని అయిపోయారు. తదుపరి కొద్దికాలం తర్వాతే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ఆయన (వస్త్రాలు)పై పసుపు మేనిమి ఛాయలు వుండడం చూసి “ఇదేమిటి” అని అడిగారు, ఆయన జవాబిస్తూ – ‘నేనొక విత్తనం బరువంత బంగారం ఇచ్చి ఒక అన్సారీ స్త్రీనివివాహం చేసుకున్నాను’ అని అన్సారు. దానిపై, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి “మరి నీవు వలీమా విందు చేయి, కనీసం ఒక మేకపోతును జిబహ్ చేసి అయినా సరే” అని హితబోధ చేశారు. {సహీ బుఖారీ : 3780, 3781) 

ఈ రెండు సంఘటనలు, మదీనా అన్సారుల పరోపకార గుణం మరియు వారి త్యాగనిరతిని గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఇవిగాక, వీరి విశిష్టతలను గూర్చిన మరిన్ని హదీసులు వినండి: 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఒకవేళ అన్సారులు గనక ఓ లోయలో నడుస్తూ ఉంటే (మరియు ఇతరులు వేరే లోయలో నడుస్తూ వుంటే) నేను కూడా అన్సారుల లోయలో నడుస్తాను. ఒకవేళ హిజ్రత్ వుండి వుండకపోతే నేను కూడా అన్సారులలో ఒకడిగా అయి వుండేవాణ్ణి”. (సహీ బుఖారీ : 3779) 

అనస్ (రదియల్లాహు అన్హు)  కథనం : మక్కా విజయం నాడు దైవప్రవక్త – (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖురైష్ ప్రజలకు యుద్ధ ప్రాప్తి (మాలె గనీమత్)ని ఇవ్వడం చూసి అన్సారులు: “అల్లాహ్ సాక్షి! ఇదెంతో ఆశ్చర్యకరమైన విషయం ! మా కరవాలాల ద్వారా ఇంకా ఖురైష్ రక్తం ప్రవహిస్తూనే వుంది. అయినా, మా సొమ్ము (యుద్ధప్రాప్తి) కూడా వారికే ఇవ్వబడుతోంది!” అని అనసాగారు. ఈ విషయం , దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) వరకు చేరగా, ఆయన అన్సారులను పిలిచి, “నాకు మీ దగ్గర్నుండి చేరిన విషయం ఏమిటీ?” అని అడిగారు. అనస్ (రదియల్లాహు అన్హు)  కథనం: వారు (అన్సారులు) అబద్దం పలికేవారు కారు. అందుకే వారు దైవప్రవక్తతో, “మీ దగ్గరికి చేరిన విషయం నిస్సందేహంగా మేము పలికినదే” అని స్వీకరించారు. దీనిపై, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ప్రజలు తమ ఇళ్ళకు యుద్ధ ప్రాప్తిని తీసికెళితే, మీరేమో స్వయం దైవప్రవక్తను మీ ఇళ్ళకు తీసుకెళ్ళడం మీ కిష్టం లేదా? ఒకవేళ అన్సారులు ఏదైనా లోయలో నడుస్తూ వుంటే (మరియు ఇతరులు వేరే లోయలో నడుస్తూ వుంటే) నేను కూడా అన్సారుల లోయలో నడుస్తాను”. {సహీ బుఖారీ :3778, సహీ ముస్లిం : 1069) 

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒక అన్సారీ స్త్రీ తన పిల్లవాడితో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి రాగా ఆయన ఆ స్త్రీ తో సంభాషించారు. తదుపరి ఆమెతో: “నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తిమంతుని సాక్షి! ఇతరులందరి కన్నా మీరు (అన్సారులు) నాకు ఎక్కువ ప్రియులు అని అన్సారు”. {సహీ బుఖారీ ; 3786, సహీ ముస్లిం : 2509) 

ఇలాగే, అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం కందకం (యుద్ధం) రోజు మదీనా అన్సారులు ఇలా పలుకుతూ వున్నారు: ” దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతులపై, మరణించే వరకు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేస్తామని ప్రమాణం చేసిన వారము మేమే.” దీనికి జవాబుగా – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అంటూ వున్నారు: “ఓ అల్లాహ్! పరలోక జీవితమే అసలైన జీవితం. అన్సారులు, ముహాజిర్లకు గౌరవ ఔన్నత్యాలను ప్రసాదించు.” (సహీ బుఖారీ : 3796)  

2) బద్ర్ వాసుల విశిష్టత 

హాతిబ్ బిన్ అబీ బలా (రదియల్లాహు అన్హు) వృత్తాంతం చివర్లో ఇలా ఉంది : ఉమర్ (రదియల్లాహు అన్హు)  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో – హాతిబ్ అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు, విశ్వాసుల పట్ల కృతఘ్నత చూపాడు, కనుక మీరు అనుమతిస్తే నేనతని శిరస్సును శరీరం నుండి వేరు చేస్తాను అని అడగగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

బహుశా అల్లాహ్ బద్ర్  వాసులపై (కారుణ్యంతో) దృష్టి సారించాడు”. తిరిగి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “మీ ఇష్టం వచ్చింది చేస్తూ ఉండండి, నేను మిమ్మల్ని క్షమించాను“. మరోఉల్లేఖనంలో ఇలా ఉంది: “మీ కోసం స్వర్గం తప్పని సరి (వాజిబ్)అయిపోయింది”. (సహీ బుఖారీ : 3007, సహీ ముస్లిం : 2494) 

రఫా బిన్ రాఫె అల్ జర్ ఖీ బద్ర్ వాసులలోని వారైన తన తండ్రి ద్వారా ఇలా ఉల్లేఖించారు: 

జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఓసారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి విచ్చేసి, ఆయనతో: మీ దృష్టిలో బద్ర్  వాసుల స్థాయి ఎంతటిది? అని అడిగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ “(నా దృష్టిలో) వారు యావత్తు ముస్లిములందరిలోకెల్లా ఉత్తములు‘ అని అన్సారు. దీనిపై జిబ్రయీల్ (అలైహిస్సలాం) మాట్లాడుతూ: “అలాగే దైవదూతలలో కూడా, బద్ర్ యుద్ధంలో పాల్గొన్న దైవదూతలు అందరికన్నా శ్రేష్టులు” అని అన్సారు. – (సహీ బుఖారీ : 3992) 

3) ఉహద్ వాసుల విశిష్టత 

ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“మీ సహోదరులు ఉహద్ యుద్ధంలో షహీదులయినపుడు అల్లాహ్ వారి ఆత్మలను పచ్చరంగు కలిగిన పక్షుల శరీరాలలో ప్రవశింపజేశాడు. అవి స్వర్గంలోని కాలువల వద్దకు వెళ్ళి, అక్కడి ఫలాలను భుజించి తిరిగి అర్ష్ క్రింద వ్రేలాడబడి వున్న బంగారపు లాంతర్ల వైపునకు వచ్చేస్తాయి. తమ నిద్రాహారాలలో వారు పూర్తి ఆనందాన్ని ఆస్వాదించాక ఇలా అనడం ప్రారంభించారు. ‘మేం స్వర్గంలో జీవించి వున్నాం, మాకు ఆహారం ప్రసాదించబడుతుంది’ అన్న విషయాన్ని మా సహోదరులకు ఎవరు చేరవేస్తారు? తద్వారా వారు జిహాద్ నుండి ముఖం త్రిప్పుకోకుండా  వుండడానికి మరియు యుద్ధ సమయంలో రణరంగం నుండి పారిపోకుండా వుండగలగడానికి. దీనిపై అల్లాహ్ వారితో ఇలా అన్నాడు- మీ తరఫు నుండి నేను వారికి ఈ విషయాన్ని చేరవేస్తాను. తదుపరి అల్లాహ్ ఈ ఆయతను అవతరింపజేశాడు: 

وَلَا تَحْسَبَنَّ ٱلَّذِينَ قُتِلُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ أَمْوَٰتًۢا ۚ بَلْ أَحْيَآءٌ عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ

“అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అని అనకండి. వాస్తవానికి వారు సజీవులు. తమ ప్రభువు వద్ద జీవికను పొందు తున్నారు.” (ఆలి ఇమ్రాన్ : 169)

 (అబూ దావూద్ : 2520, ముస్నద్ అహ్మద్ : 2384, హసన్ – అల్ బానీ, సహీ అబూ దావూద్ : 2199) 

4) రిజ్వాన్ ప్రమాణం (బైతె రిజ్వాన్)లో పాలుపంచుకొన్న సహాబాల విశిష్టత

హుదైబియా ప్రాంతంలో రిజ్వాన్ ప్రమాణం (బైతె రిజ్వాన్) నందు పాలు పంచుకొని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతులపై ప్రమాణం చేసిన సహాబాల గురించి అల్లాహ్ ‘ సూరహ్ ఫతహ్’లోని ఎన్నో ఆయతులలో ప్రశంసించాడు.  అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

لَّقَدْ رَضِىَ ٱللَّهُ عَنِ ٱلْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ ٱلشَّجَرَةِ فَعَلِمَ مَا فِى قُلُوبِهِمْ فَأَنزَلَ ٱلسَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَـٰبَهُمْ فَتْحًۭا قَرِيبًۭا وَمَغَانِمَ كَثِيرَةًۭ يَأْخُذُونَهَا ۗ وَكَانَ ٱللَّهُ عَزِيزًا حَكِيمًۭا

“(ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ వున్నప్పుడు అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో వున్న దానిని ఆయన తెలుసుకున్నాడు. అందువల్ల వారిపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. ఇంకా సమీపంలోనే లభించే విజయాన్ని కూడా అనుగ్రహించాడు. ఇంకా ఎన్నో విజయసొత్తులను కూడా! వాటిని వారు స్వంతం చేసుకుంటారు. అల్లాహ్ అపార శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు.” (ఫతహ్ : 18 – 19)

అంతేగాక, జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హుదైబియా రోజు మాతో ఇలా అన్సారు. “ఈ రోజు మీరు యావత్ భూభాగంలో నివసించే మనుష్యులందరి కన్నా ఉత్తములు. ఆ రోజు మేము మొత్తం 1400 మంది వున్నాం” (సహీ బుఖారీ: 4154, సహీ ముస్లిం : కితాబుల్ అమారా : 1856) 

ఉమ్మె బషీర్ (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. 

ఈ వృక్షం క్రింద (నాతో) ప్రమాణం చేసిన వృక్షవాసులలో ఎవ్వరు కూడా ఇన్షా అల్లాహ్ (దైవం తలిస్తే) నరకంలోకి వెళ్ళరు”. (సహీ ముస్లిం : కితాబుల్ ఫజాయెల్ సహాబా : 2496) 

ఈ హదీసులో “ఇనాల్లాహ్” అన్న పదం కేవలం మర్యాద పూర్వకంగా – (అల్లాహ్ యెడల) గౌరవ సూచకంగా వాడబడినదే తప్పా వారిలో ఏ సహబీ కూడా నరకంలోకి వెళ్ళడు అన్న విషయం మాత్రం పూర్తిగా సత్యం. (నవవీ — షరహ్ ముస్లిం: 60-85) 

ఈ హదీసులే కాకుండా, ఖలీఫాలలో ప్రతి ఒక్కరి విశిష్టతలను గూర్చి, అలాగే ఇతర సహాబాల విశిష్టతలను తెలియజేసే హదీసులు ఎన్నో హదీసు గ్రంథాల్లో నిక్షిప్తమై వున్నాయి. వాటన్నింటిని వివరించడానికి ఇక్కడ అవకాశం లేదు, ఆఖరిగా – 

అల్లాహ్ మనల్నందరినీ పూర్తి చిత్తశుద్ధితో, ప్రేమతో సహాబాలను అనుసరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! 

రెండవ ఖుత్బా : సహాబాల గురించి ‘అహఁలే  సున్నత్ వల్ జమాత్’ విశ్వాసము

మొదటి ఖుత్బాలో మేము ఏ సహాబాల విశిష్టతలను, ప్రత్యేకతలను గూర్చి వివరించామో వారిని గూర్చి మన విశ్వాసం ఎలా వుండాలి? మరియు ఈ విషయంలో అహఁలే సున్నత్ వల్ జమాత్ విశ్వాసం ఎలా ఉండేది? రండి — వీటిని గూర్చి తెలుసుకుందాం. 

(1) సహాబాలను ప్రేమించడం మరియు వారి కోసం ప్రార్థించడం వాజిబ్ (తప్పనిసరి). 

అహఁలే సున్నత్ వల్ జమాత్ విశ్వాసం ఏమిటంటే – సహాబాలను ప్రేమించటం తప్పనిసరి, వారి కోసం ప్రార్థించటం అవశ్యము మరియు వారి యెడల ద్వేష భావం కలిగి వుండడం నిషేధం. ఎందుకంటే – అల్లాహ్ వారికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాన్నిధ్యాన్ని ప్రసాదించడంతోపాటు తన ధర్మ సహాయం నిమిత్తం ఆయనతోపాటు జిహాద్ కొరకు ఎన్నుకున్నాడు. 

సూరహ్ హష్ర్ లో అల్లాహ్ ముహాజిర్లు మరియు అన్సార్లను గురించి వివరించిన తర్వాత ఇలా సెలవిచ్చాడు: 

وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

“వారి తర్వాత వచ్చిన వారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు: మా ప్రభూ! మమ్మల్ని క్షమించు, మా కన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు.” (హష్ర్ : 10) 

సహాబాలను ప్రేమించడం తప్పనిసరి అని అనడానికి ఈ ఆయత్ ఒక చక్కటి నిదర్శనం. ఎందుకంటే – అల్లాహ్ – సహాబాల తర్వాత వచ్చే వారిని కూడా ‘ఫై’ సొమ్ము (శత్రువుతో తలపడకుండానే ప్రాప్తమయిన సొమ్ము)కు అర్హులుగా నిర్ణయించాడు. కానీ, దీని కోసం విధించిన ఒక షరతు ఏమిటంటే – వారు సహాబాలను ప్రేమించే వారై వుండాలి. ఈ కారణం మూలంగానే ఇమామ్ మాలిక్ దృష్టిలో సహాబాల పట్ల ద్వేష భావం కలిగి వుండేవారు ‘ఫై’ సొమ్ముకు అర్హులు కారు. (అల్ జామె అల్ కలామ్ అల్ ఖుర్ఆన్ : 18/32) 

ఈ ఆయతునుద్దేశించి ఆయెషా (రజి అల్లాహు అన్న కథనం: దైవప్రవక్త – (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాల మన్నింపు కోసం ప్రార్థించమని ప్రజలకు ఆజ్ఞాపించబడింది. కానీ ప్రజలు మాత్రం వారి గురించి చెడుగా పలకడం ఆరంభించారు. (సహీ ముస్లిం : 3022) 

బరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్సారీలను ఉద్దేశించి ఇలా సెలవిచ్చారు. 

కేవలం నిజమైన విశ్వాసులే వీరిని ప్రేమించగలుగుతారు. వీరిని ద్వేషించేవాడు కపట విశ్వాసే అవుతాడు. వారిని ప్రేమించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. వారిని ద్వేషించే వారిని అల్లాహ్ ద్వేషిస్తాడు”. (సహీ బుఖారీ : 3783, సహీ ముస్లిం : కితాబుల్ ఈమాన్ : 75) 

కనుక తెలిసిందేమిటంటే – విశ్వాసుల లక్షణం ఏమిటంటే – వారు సహాబాలను ప్రేమిస్తారు, వారి కోసం ప్రార్థిస్తారు మరియు తమ హృదయాలను వారిని ద్వేషించడం నుండి పవిత్రంగా వుంచుతారు. 

ఇమామ్ అబూ జాఫర్ అత్తహావీ (రహిమహుల్లాహ్) సహాబాలను గూర్చి అహఁలే సున్నత్ వల్ జమాత్ విశ్వాసాన్ని వివరిస్తూ ఇలా “సెలవిచ్చారు: 

“మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను ప్రేమిస్తాము, వారిని ప్రేమించడంలో ఏ ఒక్కరి విషయంలో కూడా అతిశయోక్తిని ప్రదర్శించము. అంతేగాక, ఏ ఒక్కరితో విముక్తిని కూడా ప్రకటించుకోము. సహాబాలను ద్వేషించే ప్రతి వ్యక్తినీ, వారిని చెడుగా చిత్రీకరించే ప్రతి ఒక్కరినీ మేము కూడా ద్వేషిస్తాము. మేమైతే సహాజూలను మంచి తలంపుతో స్మరించు కుంటాము. వారిని ప్రేమించడం ధర్మం, విశ్వాసం మరియు ఎహ్ సాన్ లలో ఓ ముఖ్య భాగం అనీ మరియు వారిని ద్వేషించడం, తిరస్కారానికి (కుఫ్ర్), కాపట్యానికి (నిఫాక్) మరియు అవిధేయతలకు చిహ్నమని భావిస్తాము.” (షరహ్ అఖీదా తహావియ : 467 పేజీ) 

షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు: అహఁలే సున్నత్ వల్ జమాత్ నిబంధనలలో ఒక నిబంధన ఏమిటంటే — వారు తమ హృదయాలను సహాబాల ద్వేషం నుండి మరియు తమ నాలుకలను వారి దోషాలను వెలికితీయడం నుండి సురక్షితంగా వుంచుతారు.

 2) అహఁలే సున్నత్ వల్ జమాత్ సహాభాల కోసం స్వర్గాన్ని గూర్చిన సాక్ష్యం ఇస్తారు 

మేము ఈ ఖుత్బా ఆరంభంలో సూరహ్ తౌబా, ఆయత్ నెం.100 ద్వారా – అల్లాహ్ ముహాజిర్లు, అన్సారులు మరియు వారిని అనుసరించేవారి పట్ల ప్రసన్నుడైన విషయం మరియు వారి కొరకు స్వర్గాన్ని గూర్చి వాగ్దానం చేసిన విషయం నిరూపించాము. అందుకే అహఁలే సున్నత్ వల్ జమాత్ సహాబాలందరికోసం స్వర్గాన్ని గూర్చిన సాక్ష్యమిస్తారు. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రత్యేకంగా పేర్లు తీసుకొని ‘స్వర్గవాసులు’ అని ఖరారు చేసిన సహాబాలను కూడా అహఁలే సున్నత్ వల్ జమాత్ స్వర్గాన్ని గూర్చిన సాక్ష్యం ఇస్తారు. 

ఉదాహరణకు — ‘అష్రా ముబష్షరా’ (శుభవార్త పొందిన పది మంది) గురించి ఇలా సెలవిచ్చారు: 

“అబూ బక్ర్ స్వర్గంలో వున్నారు. ఉమర్ స్వర్గంలో వున్నారు. ఉస్మాన్ స్వర్గంలో వున్నారు. అలీ స్వర్గంలో వున్నారు. తల్హా స్వర్గంలో వున్నారు. జుబైర్ స్వర్గంలో వున్నారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ స్వర్గంలో వున్నారు. సాద్ బిన్ అబీ వఖాస్ స్వర్గంలో వున్నారు. సయీద్ బిన్ జుబైర్ స్వర్గంలో వున్నారు మరియు అబూ ఉబైదా బిన్ జర్రాహ్ (రదియల్లాహు అన్హు మ్) స్వర్గంలో వున్నారు.” (తిర్మిజి, ముస్నద్ అహ్మద్, సహీ ఉల్ జామె లిల్ అల్ బానీ : 50) 

ఇలాగే, ఇంకా ఎంతో మంది సహాబాల పేర్లు తీసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) వారిని స్వర్గవాసులుగా ఖరారు చేశారు. అయితే, కేవలం కొంతమంది పేర్లు తీసుకోవడం వల్ల మిగతా సహాబాలు స్వర్గవాసులు కారు అని భావించరాదు. వాస్తవానికి కొంతమంది పేర్లు తీసుకోవడం అనేది సహాబాలలో వారి విశిష్టతకు నిదర్శనం మాత్రమే. ఎందుకంటే- సహాబాలందరి కోసం అల్లాహ్ స్వర్గాన్ని గూర్చి వాగ్దానం చేసిన విషయాన్ని మేము దివ్య ఖుర్ఆన్ ద్వారా ముందే నిరూపించి వున్నాం.  

3) సహాబాలందరూ విశ్వాసపాత్రులు మరియు నమ్మదగినవారు 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَكَذَٰلِكَ جَعَلْنَـٰكُمْ أُمَّةًۭ وَسَطًۭا لِّتَكُونُوا۟ شُهَدَآءَ عَلَى ٱلنَّاسِ وَيَكُونَ ٱلرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًۭا

“అదే విధంగా మేము మిమ్మల్ని ఒక న్యాయశీల సమాజం (ఉత్తమమైన) (ఉమ్మతే వసత్)గా చేశాము. మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం.” (బఖర : 143) 

ఉమ్మతే వసత్” అంటే అత్యధిక విశ్లేషకులు “ఉత్తమమైన, అన్నిటికన్నా శ్రేష్టమైన, విశ్వాసపాత్రమైన, నమ్మదగిన సమాజం” అని విశ్లేషించారు. (తఫ్సీర్ జా మె అల్ బయాన్ : 2/7, తఫ్సీర్ అల్ ఖుర్తుబీ : 2/153, తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 1/335) 

ఈ ఆయత్ లో ప్రప్రథమంగా సంబోధించబడ్డవారు – ధర్మ ప్రచార బాధ్యత మోపబడిన సహాబాలే. ఈ విషయాన్నే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِٱلْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ ٱلْمُنكَرِ وَتُؤْمِنُونَ بِٱللَّهِ

మానవుల కోసం ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్ట సమాజం మీరు. మీరు మంచి విషయాలకి ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. ఇంకా మీరు అల్లాహ్ ను విశ్వసిస్తారు.” (ఆలి ఇమ్రాన్:110) 

అంతేగాక, హజ్జతుల్ విదా (వీడ్కోలు హజ్) సందర్భంగా, దైవప్రవక్త – (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాల పెద్ద సమూహాన్ని ఉద్దేశించి: “జాగ్రత్త! మీలో ఇక్కడ వున్నవారు, ఇక్కడ లేని వారికి ధర్మాన్ని చేరవేయండి!” అని పలికారు”. (సహీ బుఖారీ : 105, సహీ ముస్లిం : కితాబుల్ ఫసామ : 1679) 

ఈ ఆయత్ మరియు హదీసుల ద్వారా రూఢి అయిన విషయమేమిటంటే – సహాబాలు అమానతుదారులు, విశ్వాసపాత్రులు, మరియు నమ్మదగినవారు. అందుకే వారిపై ఎంతో ముఖ్యమైన ధర్మ ప్రచార బాధ్యతలు మోపబడ్డాయి. ఒకవేళ వారిలో ఈ గుణగణాలు వుండకపోతే, ఈ బాధ్యతలు మోపబడి వుండేవి కావు. 

అంతేకాక, అల్లాహ్ – “న్యాయశీల సమాజం” అని అన్న తర్వాత “ప్రజలపై సాక్షులుగా వుంటారు” అని తెలియజేశాడు. అంటే దీని అర్థం – అల్లాహ్ వద్ద వారి సాక్ష్యం స్వీకరించబడుతుంది అన్నమాట. ఇది కూడా వారు న్యాయశీలురు, విశ్వాసపాత్రులు మరియు నమ్మదగిన వారు కావడానికి ఒక నిదర్శనం. అలాకాని పక్షంలో, వారి సాక్ష్యం కూడా స్వీకరించబడి వుండేది కాదు!! 

ఇమామ్ ఖర్తుబీ (రహిమహుల్లాహ్) సూరహ్ ఫతహ్ యొక్క ఆఖరి ఆయత్ “ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట వున్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, పరస్పరం కరుణామయులుగానూ వుంటారు…..” గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా సెలవిచ్చారు.. 

సహాబాలందరూ న్యాయశీలురు, విశ్వాసపాత్రులు మరియు నమ్మదగిన వారు. అల్లాహ్ మిత్రులు మరియు ఆయన ప్రియతమ దాసులు. అల్లాహ్ సృష్టిలో దైవప్రవక్తలు, సందేశహరుల తర్వాత అందరికన్నా శ్రేష్టులు. ఇదే అహఁలే సున్నత్ వల్ జమాత్ ఇమాముల అభిమతం. కానీ, ఓ వర్గం ఈ వాదన సరైనది కాదు అని అంటూ, “ సహాబాలు కూడా సాధారణ మనుష్యుల లాంటి వారే, కనుక వారి విశ్వాస పాత్రతను గూర్చి కూడా తప్పనిసరిగా చర్చించాలి” అని అంటుంది. కానీ, వీరి తర్కం సరైనది కాదు. ఎందుకంటే — స్వయంగా అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడైన విషయాన్ని ప్రకటించి, వారి కోసం స్వర్గం మరియు మన్నింపుల వాగ్దానం చేసివున్నాడు”. (తఫ్సీర్ అల్ ఖర్తుబీ  : 16/399) 

4) నలుగురు ఖలీఫాలు – అబూబక్ర్, తర్వాత ఉమర్, తర్వాత ఉస్మాన్, తర్వాత అలీ (రదియల్లాహు అన్హుమ్) 

సహాబాలందరిలో ఉత్తమమైన సహాబీ అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు). మొట్టమొదటి ఖలీఫా కూడా ఆయనే. అహఁలే సున్నత్ వల్ జమాత్ ఈ విషయంలో ఏకాభిప్రాయం కలిగివున్నారు. ఆయనకు దొరికిన ఈ అధికారం స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) గారి ఎన్నో హదీసుల ద్వారా గ్రహించ బడింది. 

అదెలా అంటే – తన జీవితపు ఆఖరి రోజుల్లో అనారోగ్య స్థితికి గురైనప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రజలకు నమాజ్ చేయించమని అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)కే ఆజ్ఞాపించారు. మరి ఏ వ్యక్తి అయితే ఆయన (దైవ ప్రవక్త) జీవితంలోనే ఇమామ్ అవడానికి అర్హుడయ్యాడో, ఆయన మరణం తర్వాత కూడా ఖలీఫా (ఉత్తరాధికారి) అవడానికి అందరికన్నా ఎక్కువ అర్హుడు అన్న విషయానికి ఇదొక చక్కటి నిదర్శనం. 

అంతేకాక, సహీ బుఖారీలో జుబైర్ బిన్ మతామ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒక స్త్రీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నధికి వస్తే, ఆయన ఆ స్త్రీ ని మళ్ళీ (మరో సమయంలో తర్వాత) రమ్మని ఆజ్ఞాపించారు. దీనిపై ఆ స్త్రీ : ఒకవేళ నేను వచ్చినపుడు మీరే గనక లేకపోతే? అని అడిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ: “ఒకవేళ నేను లేకపోతే అబూ బక్ర్ దగ్గరికెళ్ళు” అని అన్సారు. (సహీ బుఖారీ : 3659) 

ఖిలాఫత్ కొరకు మొట్టమొదటి హక్కుదారులు అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) అని అనడానికి ఈ హదీసు ఒక స్పష్టమైన ప్రమాణం. ఈ విషయాన్ని గ్రహించే, “సఖీఫా బనూ సాగ” సమ్మేళనంలో పాల్గొన్న ముహాజిర్లు మరియు అన్సారులందరూ అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) వద్ద బైత్ (ప్రమాణం) చేశారు. ఈ విషయమే సహీ బుఖారీలో ఉల్లేఖించబడింది. (సహీ బుఖారీ : 3668) 

ఇదే విధంగా, అహఁలే సున్నత్ వల్ జమాత్ ఉమ్మడి విశ్వాసం ఏమిటంటే – అబూ బక్ర్ తర్వాత రెండవ ఖలీఫా ఉమర్, తదుపరి మూడవ ఖలీఫా ఉస్మాన్, ఆ తర్వాత నాల్గవ ఖలీఫా అలీ (రదియల్లాహు అన్హుమ్) . (అఖీదా అహఁలే సున్నత్ వల్ జమాత్ ఫీ సహాబా : 2/514) 

5) సహబాలను గూర్చి చెడుగా పలకడం నిషేధించబడింది 

అహఁలే సున్నత్ వల్ జమాత్ దృష్టిలో సహాబాలను గూర్చి చెడుగా పలకడం, వారిని దుర్భాషలాడడం నిషేధించబడింది. ఈ నిషేధం దివ్య ఖుర్ఆన్ మరియు హదీసుల ఎన్నో ఆధారాల ద్వారా నిరూపించబడింది: 

1. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَٱلَّذِينَ يُؤْذُونَ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ بِغَيْرِ مَا ٱكْتَسَبُوا۟ فَقَدِ ٱحْتَمَلُوا۟ بُهْتَـٰنًۭا وَإِثْمًۭا مُّبِينًۭا

తప్పు చేయని విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు (చాలా పెద్ద) అభాండాన్ని, స్పష్టమైన పాప భారాన్ని మోసిన వారవుతారు.” (అహ్ జాబ్ : 58) 

ఈ ఆయత్ లో “విశ్వాసులను” గూర్చి వివరించబడింది. మరి ఈ అనుచర సమాజపు ప్రప్రథమ విశ్వాసులు సహాభాలే. వారిని తూలనాడడం ద్వారా బాధించడం అనేది దివ్య ఖుర్ఆన్ భాషలో ‘అభాండమూ మరియు మహా పాపమూను.’ 

2. ఖుత్బా ఆరంభంలో మేము వివరించిన, సూరహ్ ఫతహ్ లోని ఆఖరి ఆయత్ “ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. —-” దీనిలో సహాబాల పట్ల ద్వేష భావం కలిగి వుండడం, వారిని గూర్చి చెడుగా పలకడం అనేవి ముస్లిములకు శోభించదు అని అనడానికి ఇదొక చక్కటి నిదర్శనం. ఎందుకంటే – ఇలా చేయడం అవిశ్వాసుల పని కాబట్టి. 

3. సహాబాల శ్రేష్టతను గూర్చిన కొన్ని హదీసులను మేము మొదటి ఖుత్బాలో వివరించాము. దానిలో ఒక హదీసు అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించింది. దీని ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలను గూర్చి దుర్భాషలాడటాన్ని (గట్టిగా) వారించారు. వారిని తూలనాడడం నిషేధించబడింది అని అనజునికి ఇదొక స్పష్టమైన ప్రమాణం. 

4. ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “సహాబాలను తూలనాడే వ్యక్తిపై అల్లాహ్ శాపం, దైవదూతల శాపం మరియు యావత్ ప్రజల శాపం అవతరించుగాక!” (తబ్రానీ – అల్ కబీర్ & అస్సహీహ-ఆల్ బానీ : 234) 

ఈ హదీసులో – సహాబాలను దుర్భాషలాడే మరియు వారి పట్ల క్రోధాన్ని కలిగి వున్న వ్యక్తిని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శాపగ్రస్తుడిగా ఖరారు చేశారు. మరి ఈ కార్యాలలో నిమగ్నమై వున్నవారు స్వయంగా తామే ఆలోచించుకోవాలి – వారిని గూర్చి దైవప్రవక్త ఏమని నిర్ణయించారో!! 

5. జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయెషా (రదియల్లాహు అన్హ) తో ఇలా అనబడింది. ప్రజలు దైవప్రవక్త సహాబాలను గూర్చి చెడుగా పలుకుతున్నారు. చివరికి అబూ బక్ర్, ఉమర్ (రదియల్లాహు అన్హు)మ్)లను కూడా వదల్లేదు! దీనిపై ఆయెషా (రదియల్లాహు అన్హ)  స్పందిస్తూ : “మీరు దీనికి ఆశ్చర్యపడుతున్నారా? వాస్తవానికి వారి ఆచరణ సమాప్తమయ్యింది. కానీ, అల్లాహ్ ఇష్టపడిందేమిటంటే వారి (పుణ్య) ప్రతిఫలం మాత్రం సమాప్తం కాకూడదు. (జామె అల్ ఉసూల్ : 9/408) 

ఈ ఆధారాలన్నింటి ద్వారా స్పష్టమైన విషయమేమిటంటే – సహాబాల విషయంలో మన హృదయాలను వారిని ద్వేషించడం నుండి పరిశుద్ధంగా వుంచడం మరియు మన నాలుకలను వారిని గూర్చి చెడు పలకడంనుండి సురక్షితంగా వుంచడం అనేది ఒక ఆవశ్యకమైన విషయం. అలా కాని పక్షంలో, ఈ విషయం గుర్తుంచుకోవాలి! 

సహాబాలను గూర్చి చెడు పలుకుతూ, వారి దోషాలను ఎత్తిచూపే వ్యక్తి వాస్తవానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దోషాలను ఎత్తి చూపుతాడు. ఎందుకంటే – స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి (సహాబాలకు) (స్వర్గపు) శుభవార్తలు ఇచ్చారు. మరియు వారిని అమానుతుదారులు, విశ్వాసపాత్రులుగా ఖరారు చేశారు. 

అంతేకాదు, ఆ వ్యక్తి వాస్తవానికి అల్లాహ్ పై కూడా వేలెత్తి చూపుతాడు. కారణం – అల్లాహ్ యే వారిని (సహాబాలను) తన ప్రవక్త (సహచరిత్వం) కోసం ఎన్నుకున్నాడు. వారిని తన ప్రసన్నతతో అనుగ్రహించాడు మరియు వారికి స్వర్గాన్ని గూర్చి వాగ్దానం చేశాడు. 

అంతేకాదు, ఆ మాటకొస్తే, ఆ వ్యక్తి దైవధర్మం పైనే నిందమోపుతాడు. ఎందుకంటే – ఈ ధర్మాన్ని నకలు చేసినవారు ఈ సహాబాలే మరి. అందుకే సహాబాలలో దోషాలను ఎత్తి చూపడం అనేది ఎంతో గంభీరమైన విషయం. కనుక దీని నుండి వెంటనే పశ్చాత్తాపం చెందడం తప్పనిసరి. 

అల్లాహ్ మనందరిరినీ – సహాబాలను నిజాయితీగా ప్రేమించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!  

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

%d bloggers like this: