[46 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
[సూరా అన్ నస్ర్]
110:1 إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ
ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్ హ్
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు,
110:2 وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا
వ రఅయ్ తన్నాస యద్ ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్ వాజా
ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు,
110:3 فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا
ఫసబ్బిహ్ బిహమ్ ది రబ్బిక వస్ తగ్ ఫిర్ హు, ఇన్నహూ కాన తవ్వాబా
నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు, మన్నింపుకై ఆయన్ని ప్రార్ధించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించే వాడు.
[క్రింది వ్యాఖ్య అహ్ సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]
ఈ సూరా మదీనా కాలానికి చెందినది. ఇందులో మొత్తం ౩ ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా విశ్వాసులకు హామీ ఇవ్వబడిన అల్లాహ్ సహాయం గురించి ప్రస్తావించింది. మొదటి ఆయతులో వచ్చిన నస్ర్ (సహాయం) అన్న ప్రస్తావననే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రజలు తండోపతండాలుగా సత్యధర్మాన్ని స్వీకరిస్తారని ఈ సూరా తెలిపింది. అల్లాహ్ ఔన్నత్యాన్ని స్తుతిస్తూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ, ఆయన సన్నిధిలో పొరబాట్లకు క్షమాపణ కోరుకుంటూ విధేయంగా ఉండాలని ఈసూరా ఉద్బోధించింది.
ఖుర్‌ఆన్ అవతరణా క్రమం ప్రకారం ఇది చివరి సూరా (సహీహ్ ముస్లిం – వ్యాఖ్యాన ప్రకరణం). ఈ సూరా అవతరించినప్పుడు; దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణకాలం సమీపించిందని, అందుకే అల్లాహ్ స్తోత్రం, క్షమాపణ గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆజ్ఞాపించబడిందని కొంతమంది సహాబీలకు అర్ధమైపోయింది. బుఖారీలో ప్రస్తావించబడిన హజ్రత్ ఇబ్నె అబ్బాస్, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్‌హుమా)ల సంఘటనే దీనికి నిదర్శనం. ( అన్ నస్ర్ సూరా వ్యాఖ్యానం).
“అల్లాహ్ సహాయం” ( نَصْرُ اللَّهِ ) అంటే మిథ్యావాదంపై, మిథ్యావాదులపై ఇస్లాం మరియు ముస్లింలకు లభించిన తిరుగులేని ఆధిక్యం. “విజయం” అంటే మక్కా విజయం అన్నమాట! మక్కా నగరం దైవప్రవక్త జన్మస్థలం. కాని అవిశ్వాసులు ఆయన్ని అక్కడ ప్రశాంతంగా ఉందనివ్వలేదు. ఆయన్ని ఆయన ప్రియసహచరులను వలసపోక తప్పని పరిస్థితులను సృష్టించారు. కాని దైవప్రవక్త హిజ్రీ శకం 8వ ఏట మక్కాలో విజేతగా తిరిగి వచ్చినప్పుడు జనులు జట్లు జట్లుగా వచ్చి ఇస్లాంలో ప్రవేశించసాగారు. అంతకు ముందు ఈ విధంగా భారీ సంఖ్యలో ప్రజలు ఇస్లాంలో చేరేవారు కాదు. మక్కా విజయం తరువాత పరిస్థితి అనూహ్యంగా మారింది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)అల్లాహ్ నిజ ప్రవక్త అనీ, ఇస్లాం నిజధర్మమని ప్రజలు తెలుసుకున్నారు. తమ మోక్షానికి ఇస్లాం తప్ప మార్గాంతరంలేదని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు.
ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! అల్లాహ్ సందేశాన్ని జనులకు చేరవేయవలసిన నీ బాధ్యత పూర్తికావచ్చింది. నీవు ఇహలోకం నుండి ప్రస్థానం చేయవలసిన సమయం కూడా దగ్గర పడింది. కాబట్టి నువ్వు సాధ్యమైనంత ఎక్కువగా అల్లాహ్ స్తోత్రంలో నిమగ్నుడవైఉండు. పొరపాట్ల మన్నింపు కోసం నీ ప్రభువును వేడుకుంటూ ఉండు. ఈ దైవోపదేశాన్నిబట్టి అవగతమయ్యే దేమిటంటే జీవితపు చరమదశలో మనిషి వీలైనంతఅధికంగా దైవధ్యానం చేయాలి. క్షమాభిక్షకై వేడుకుంటూ ఉండాలి.
ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/
You must be logged in to post a comment.