ప్రళయదినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి? [మరణానంతర జీవితం – పార్ట్ 21 & 22] [ఆడియో & టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

మరణాంతర జీవితం – పార్ట్ 21 & 22 [ఆడియో] [43:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, ఈనాటి శీర్షిక ప్రళయ దినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి?

దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు హదీసులను పరిశీలిస్తే, అందులో తూకం చేయబడేటివి మూడు విషయాలు అని మనకు తెలుస్తున్నాయి. మొదటిది, స్వయంగా మనిషిని కూడా తూకం చేయడం జరుగుతుంది. రెండవది, మనిషి యొక్క కర్మలను తూకం చేయడం జరుగుతుంది. మూడవది, మనిషి కర్మ పత్రాలు, వాటిని కూడా తూకం చేయడం జరుగుతుంది.

ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటి? లాభం ఏమిటంటే, ఈ మూడిటిలో ఏ ఒకటైనా గాని లేదా ఈ మూడిటిని కూడా తూకం చేయబడే సందర్భంలో, ఇంతకుముందే కొంచెం మనం తెలుసుకున్నట్లు, విశ్వాసం మరియు సత్కార్యాలు ఉన్నప్పుడే మన పల్యాలు బరువుగా ఉంటాయి. మరియు ఎవరి పల్యాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. మరి ఎవరి పల్యాలు తేలికగా ఉంటాయో వారు నరకంలో చేరుతారు.

దీని గురించి ఆయతులు సూరె అన్ఆమ్ లో, సూరె అంబియాలో, సూరతుల్ ముఅ్‌మినూన్ లో మరియు అల్ ఖారిఆ సూరాలో ఉన్నాయి:

فَاَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِيْنُهٗ فَهُوَ فِيْ عِيْشَةٍ رَّاضِيَةٍ
“ఎవరి కర్మ పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను తనకు నచ్చిన, మెచ్చిన జీవితం గడుపుతూ ఉంటాడు స్వర్గంలో.”

وَاَمَّا مَنْ خَفَّتْ مَوَازِيْنُهٗ فَاُمُّهٗ هَاوِيَةٌ
“మరియు ఎవరి కర్మ పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని స్థానం హావియా ఉంటుంది.”

وَمَآ اَدْرٰىكَ مَا هِيَهْ
“ఆ హావియా అంటే ఏమి తెలుసు నీకు?”

نَارٌ حَامِيَةٌ
“అది భగభగ మండే నరకాగ్ని.”

అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ దాని నుండి రక్షించు గాక. ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఒక దొంగ, ఇక్కడే దగ్గర ఎక్కడో కెమెరాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు అని అర్థం అవుతుందో, అతడు దొంగతనానికి మరీ ప్రయత్నం చేస్తాడా? చేయడు కదా. అలాగే ఎల్లప్పుడూ ఆ సృష్టికర్త మనల్ని చూస్తూ ఉన్నాడు, కర్మ పత్రాల్లో మనం చేసే ప్రతి పని రాయబడుతూ ఉన్నది, రేపటి రోజు వీటన్నిటినీ కూడా తూకం చేయడం జరుగుతుంది—ఇలాంటి భయం ఎంత మనకు ఎక్కువగా ఉంటుందో, ఇలాంటి విషయాలు ఎంత మనకు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయో, అంతే మనం పాపాల నుండి దూరం ఉండి పుణ్యాలు చేయగలుగుతాము. ఈ పరలోకానికి సంబంధించిన, మరణానంతర జీవితానికి సంబంధించిన ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇన్ని ఎపిసోడ్లు మీ ముందు తెలియజేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటి? ఇహలోక జీవితం మనకు ఒకేసారి లభిస్తుంది. దీన్ని గనక మనం సద్వినియోగం చేసుకొని విశ్వాస మార్గం అవలంబించి సత్కార్యాలలో ఇంకా ముందుకు ఎగసిపోతూ ఉంటేనే మనకు లాభం ఉంటుంది లేదా అంటే మనం చాలా నష్టంలో పడిపోతాము.

మొదటి విషయం, స్వయంగా మానవులను కూడా అందులో తూకం చేయడం. దీనికి సంబంధించిన హదీసుల్లో హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తలా అన్హు గారి యొక్క హదీస్ చాలా ముఖ్యమైనది. అలాగే సహీ బుఖారీలో లావుపాటి మనిషిని తూకం చేయడం జరుగుతుంది అని ఏదైతే ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నామో ఆ హదీస్ కూడా చాలా ముఖ్యమైనది. ఆ రెండు హదీసులను మీరు కలిపి వాటిని గ్రహించే ప్రయత్నం చేయండి. ఒక దానిలో విశ్వాసం వల్ల శరీరం బక్కగా ఉన్నా విశ్వాసం మూలంగా ఎంత బరువు ఏర్పడుతుందో, మరియు మరొక హదీసు ద్వారా శరీరం ఎంత లావుగా ఉన్నా విశ్వాసం లేనందుకు ఎంత తేలికగా ఉందో తెలుస్తుంది.

ముందు అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తలా అన్హు గారి యొక్క హదీస్. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్, ఇబ్ను హిబ్బాన్, ముస్తద్రక్ హాకిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహాలో కూడా దీనిని పేర్కొన్నారు. హదీస్ నంబర్ 2750.

عَنِ ابْنِ مَسْعُودٍ أَنَّهُ كَانَ يَجْتَنِي السِّوَاكَ مِنَ الأَرَاكِ وَكَانَ دَقِيقَ السَّاقَيْنِ فَجَعَلَتِ الرِّيحُ تَكْفَؤُهُ فَضَحِكَ الْقَوْمُ مِنْهُ

“ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖన ప్రకారం, ఆయన ఒక సందర్భంలో ‘అరాక్’ అనే ఒక చెట్టు మీద ఎక్కి మిస్వాక్ తీసుకోవడానికి దానిని తెంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన యొక్క పిక్కలు (మొకాళ్ళ నుండి కింది భాగం) చాలా సన్నంగా ఉండినవి. అయితే దాని మూలంగా గాలి వీస్తున్నప్పుడు అతను దాని మీద కదిలి పడిపోయేటువంటి ప్రమాదం ఉండేది. ఆ విషయాన్ని, ఆ సంఘటనను చూసిన సహాబాలకు నవ్వు వచ్చేసింది.” సామాన్యంగా ఇలాంటి పరిస్థితి అవుతుంది కదా. నవ్వు వచ్చేసింది.

فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: مِمَّ تَضْحَكُونَ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నవ్వినది చూసి, “మీరు ఎందుకు నవ్వుతున్నారు?” అని అడిగారు.

قَالُوا: يَا نَبِيَّ اللَّهِ، مِنْ دِقَّةِ سَاقَيْهِ
వారు సమాధానంలో చెప్పారు, “ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా, ఇబ్నే మసూద్ యొక్క ఈ సన్నని పిక్కలను చూసి మాకు నవ్వు వచ్చేసింది. అందుకే మేము నవ్వాము,” అని అన్నారు.

فَقَالَ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ، لَهُمَا أَثْقَلُ فِي الْمِيزَانِ مِنْ أُحُدٍ
అప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు, “నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆయన మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇబ్నే మసూద్ రదియల్లాహు తలా అన్హు గారి యొక్క ఆ రెండు సన్నని పిక్కలు ప్రళయ దినాన త్రాసులో ఏదైతే తూకం చేయడం జరుగుతుందో, అప్పుడు ఉహద్ పర్వతం కంటే ఎక్కువగా బరువు గలవిగా ఉంటాయి.” అల్లాహు అక్బర్.

గమనించండి. ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనకు ఖురాన్ పట్ల ఉన్న ప్రేమ, ఇంకా వేరే సత్కార్యాల కారణంగా ఉహద్ పర్వతం ఏదైతే మదీనాలో ఉందో, ఇంచుమించు ఏడు కిలోమీటర్ల పొడుగులో, రెండు నుండి మూడు కిలోమీటర్ల వెడల్పులో, ఇంచుమించు 700 నుండి 1000 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ పర్వతం కంటే మరీ ఎక్కువగా బరువు గలవిగా ఉంటాయి అతని యొక్క ఆ రెండు పిక్కల భాగం. అయితే సోదరులారా, మనం ఇహలోకంలో కేవలం మన శరీరం గురించి, మన ఈ భౌతికాయాని గురించే అన్ని రకాల అందచందాలు, అన్ని రకాల ఆరోగ్యాలు, అన్ని రకాల విషయాల గురించి మాత్రమే కాదు మనం ఇక్కడ ప్రాధాన్యతను ఇచ్చేది. మనం ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మనం శ్రద్ధ ఇవ్వాల్సి ఉంది.

మరొక హదీస్, సహీ బుఖారీలోనిది:

إِنَّهُ لَيَأْتِي الرَّجُلُ الْعَظِيمُ السَّمِينُ يَوْمَ الْقِيَامَةِ لَا يَزِنُ عِنْدَ اللَّهِ جَنَاحَ بَعُوضَةٍ
“ఒక లావుపాటి మనిషి ప్రళయ దినాన హాజరవుతాడు. కానీ అల్లాహ్ వద్ద ఆ త్రాసులో అతని యొక్క బరువు దోమ యొక్క రెక్క బరువు అంత కూడా ఉండదు.”కావాలంటే మీరు ఖురాన్ ఆయతు చదవండి అని అబూ హురైరా రదియల్లాహు అన్హు సూరె కహఫ్ లోని ఆయతు చదివారు:
فَلَا نُقِيْمُ لَهُمْ يَوْمَ الْقِيٰمَةِ وَزْنًا
“ఆ రోజు మేము వారికి ఏ మాత్రం బరువు ఉండనివ్వము.”

ఈ విధంగా సోదరులారా సోదరీమణులారా, త్రాసులో తూకం చేయబడే మూడు విషయాల్లో మొదటి విషయం గురించి మనం తెలుసుకున్నాము, మనిషిని తూకం చేయడం జరుగుతుంది. ఇక రెండో విషయం ఏమిటి? మనిషి చేసే అటువంటి కర్మలు. సత్కార్యాలు మరియు దుష్కార్యాలు. ఈ సత్కార్యాలు దుష్కార్యాలు ఎలా తూకం చేయబడతాయి? అవి అయితే ఒక సామానుగా, భౌతికాయంగా వాటికి ఒక ఆకారం అనేది లేదు కదా అని కొందరికి ఇలాంటి ఆలోచన వస్తుంది కదా. అయితే ఇన్షా అల్లాహ్, దాని సమాధానం ఇప్పుడే మీకు తెలియజేస్తాను. మహాశయులారా, కర్మలను కూడా త్రాసులో తూకం చేయడం జరుగుతుంది. కర్మలు అంటే విశ్వాసం కూడా వస్తుంది. సుభానల్లాహ్, అల్హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ ఇలాంటి సద్వచనాలు, ఇలాంటి జిక్ర్ స్మరణలు ఏదైతే మనం స్మరిస్తూ ఉంటామో అవి కూడా వస్తాయి. నమాజ్, రోజా, జకాత్, హజ్, తల్లిదండ్రుల సేవ, బీదవారి పట్ల ఏదైతే మనం సద్వర్తన పాటిస్తామో ఇవన్నీ కూడా వస్తాయి. ఈ విధంగా మన లావాదేవీలు ఏదైతే మనం సత్కార్య రూపంలో చేసుకుంటామో, ఒకరికి ఏదైనా అప్పు ఇచ్చాము అంటే అతని నుండి వడ్డీ తీసుకోకుండా అతనికి ఏదైనా అవసరం ఉంటే మరింత వ్యవధిని ఇవ్వడం, ఇలాంటి విషయాలు కూడా వస్తాయి. దుష్కార్యాలలో వ్యభిచారాలు, షిర్క్, కుఫర్ ఇంకా బిద్అత్ మరియు అల్లాహ్ కు ఇష్టం లేని మాటలు ఏదైతే నోటితో మాట్లాడతామో, ఇవన్నీ కూడా కర్మల్లో లెక్కించబడతాయి.

అయితే వీటన్నిటినీ కూడా తూకం చేయబడతాయి. వీటన్నిటినీ తూకం చేయడం అనేది సత్యం. ఏదైనా ఒక వస్తువు ఉండేది ఉంటే దాన్ని ఇలా పెట్టి తూకం చేయడం జరుగుతుంది కానీ, ఇవన్నీ కూడా వస్తువు మాదిరిగా లేవు కదా, ఎలా తూకం చేయడం జరుగుతుంది అన్న సందేహంలో మనం పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ కర్మలను కూడా తూకం చేస్తాను అని అంటున్నాడు. ఉదాహరణకు, الطُّهُورُ شَطْرُ الإِيمَانِ وَسُبْحَانَ اللَّهِ تَمْلَأُ الْمِيزَانَ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, “పరిశుభ్రత సగం ఈమాన్ (విశ్వాసం), మరియు సుభానల్లాహ్ అనే ఈ పదం, అనే ఈ సద్వచనం, అనే ఈ స్మరణ త్రాసును నింపుతుంది” అని అన్నారు. ప్రవక్త చెప్పారు, అల్లాహ్ చేస్తాడు, మనం మన కళ్లారా ఆ రోజు వెళ్ళిన తర్వాత చూస్తాము. అందు గురించి ఇందులో సందేహ పడవలసిన అవసరం లేదు.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు:

مَا شَيْءٌ أَثْقَلُ فِي مِيزَانِ الْعَبْدِ يَوْمَ الْقِيَامَةِ مِنْ حُسْنِ الْخُلُقِ
“మనిషి త్రాసులో అత్యంత బరువైన విషయం, మనిషి ఒకరి పట్ల పాటించే సద్వర్తన (హుస్నుల్ ఖులుక్).”

అంటే ఈ సద్వర్తన అనేది త్రాసులో బరువుగా ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. దానిని మనం విశ్వసించాలి. సందేహపడవలసిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఎంత జ్ఞానం ఇవ్వబడిందో, అంత జ్ఞానంలో మనకు ఈ విషయం అర్థం అవుతలేదు కావచ్చు. కానీ ఆ రోజు వెళ్ళిన తర్వాత మన కళ్లారా మనం చూసుకుంటాము. అయినా ఈ రోజుల్లో కూడా ఎన్నో విషయాల్ని మనం కళ్లారా చూడలేకపోతాము, మనం మన చేతితో పట్టుకోలేకపోతాము. కానీ వాటిని కూడా తూకం చేయడం జరుగుతుంది, కొలవడం జరుగుతుంది, వాటి యొక్క బరువులు తెలపడం జరుగుతుంది. ఇవన్నీ అల్లాహ్ ఇచ్చిన అల్ప జ్ఞానం కల మనిషి సైన్స్ అన్న పేరు మీద, టెక్నాలజీ డెవలప్మెంట్ అన్న పేరు మీద తయారు చేస్తున్నాడు. మనం చూస్తున్నాము, నమ్ముతున్నాము. కానీ మనిషికి ఇచ్చిన ఈ జ్ఞానం ఆ సృష్టికర్తయే. ఆయన చెప్పిన మాట మీద ఎందుకు మనకు నమ్మకం కలగడం లేదు?

30-40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం, గాలిని తూకం చేయడం, గాలి యొక్క స్పీడ్ తెలపడం, వాయువు ఏదైతే మనం టైర్లలో నింపుతామో అది ఎంత పరిమాణంలో ఉన్నదో ఇవన్నీ చెప్పడం, ఈనాటి కాలం కంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న ప్రజలకు ఇవన్నీ విషయాలు చెప్తే వారు నమ్మేవారా? ఎందుకంటే వారు వారి కళ్లారా ఆ విషయాల్ని చూడలేదు కదా. అయితే ఏం తెలుస్తుంది? కనబడని విషయాన్ని నమ్మకూడదు అని కాదు. ఇలాంటి విషయాలు ఈ రోజు మనకు ఏవైతే స్పష్టమవుతున్నాయో, వీటి ద్వారా పరలోకానికి సంబంధించిన, అగోచరంలో ఉంచిన ఆ విషయాల్ని అల్లాహ్ తెలుపుతున్నాడు, ప్రవక్త తెలుపుతున్నారు, వారు ఏ మాత్రం (నవూదుబిల్లా అస్తఫిరుల్లా) అబద్ధం పలికే వారు కాదు, ఏ మాత్రం మాటల్లో సందేహం అనేది ఉండదు అని మనం ఖచ్చితంగా నమ్మాలి.

ఇలాంటి హదీసులు ఎన్నో ఉన్నాయి. ప్రవక్త మహానీయా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, మనిషి ఎప్పుడైతే సమాధిలో పెట్టబడతాడో, విశ్వాసుడు సత్కార్యాలు చేసే వాడయేది ఉంటే అతని సత్కార్యాలన్నీ కూడా ఒక అందమైన మనిషి రూపంలో వస్తాయి. ఒకవేళ అతను అవిశ్వాసి, దుష్కార్యాలు చేసే వాడయేది ఉంటే, అతని దుష్కార్యాలు అన్నీ కూడా ఒక చెడ్డ మనిషి, అందవికారంగా ఉండే మనిషి రూపంలో వస్తాయి. వినండి ఆ హదీతులు.

ముస్నద్ అహ్మద్, అబూ దావూద్, ముస్తద్రక్ హాకిం మరియు ఇబ్నే ఖుజైమా లోని హదీసు, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామిఅ లో దీనిని పేర్కొన్నారు. హదీస్ నంబర్ 1676.

فَيُنَادِي مُنَادٍ فِي السَّمَاءِ أَنْ صَدَقَ عَبْدِي فَأَفْرِشُوهُ مِنَ الْجَنَّةِ وَأَلْبِسُوهُ مِنَ الْجَنَّةِ وَافْتَحُوا لَهُ بَابًا إِلَى الْجَنَّةِ
“ఆకాశం నుండి ఒక పిలుపు విన వస్తుంది, నా దాసుడు సరియైన సమాధానం పలికాడు, సత్యం మాట చెప్పాడు. అతనికి స్వర్గం యొక్క పడక వేయండి. స్వర్గం యొక్క దుస్తులు అతనికి ధరింపజేయండి. మరియు స్వర్గం వైపునకు ఒక ద్వారం అతని సమాధిలో నుండి తెరవండి.”

فَيَأْتِيهِ مِنْ رَوْحِهَا وَطِيبِهَا وَيُفْسَحُ لَهُ فِي قَبْرِهِ مَدَّ بَصَرِهِ
“ద్వారం ఏదైతే స్వర్గం వైపునకు తెరవబడిందో అక్కడి నుండి అక్కడి యొక్క మందహాసమైన గాలులు వీస్తూ ఉంటాయి. సువాసన వస్తూ ఉంటుంది. అతని దృష్టి ఎంత దూరం పడుతుందో అంత దూరం వరకు అతని సమాధి విశాలంగా చేయబడుతుంది.”

وَيَأْتِيهِ رَجُلٌ حَسَنُ الْوَجْهِ حَسَنُ الثِّيَابِ طَيِّبُ الرِّيحِ
“అతని వద్దకు ఒక మనిషి వస్తాడు. అందమైన ముఖం, అందమైన దుస్తులు, సువాసన వస్తూ ఉంటుంది.”

فَيَقُولُ: أَبْشِرْ بِالَّذِي يَسُرُّكَ، هَذَا يَوْمُكَ الَّذِي كُنْتَ تُوعَدُ
ఆ వచ్చే మనిషి అంటాడు, “నిన్ను ఆనందంలో ముంచి వేసే అటువంటి శుభవార్తను నీవు అందుకో. ఈ రోజు గురించే నీతో వాగ్దానం చేయడం జరుగుతూ ఉండేది.”

ఆ మనిషి అంటాడు, “مَنْ أَنْتَ (నీవు ఎవరివి)? فَوَجْهُكَ الْوَجْهُ يَجِيءُ بِالْخَيْرِ (నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీవు ఏదో శుభవార్త, మేలు తీసుకొని వస్తున్నావు).”

فَيَقُولُ: أَنَا عَمَلُكَ الصَّالِحُ
అప్పుడు అతను అంటాడు, “నేను నీ యొక్క సత్కర్మల్ని.” అల్లాహు అక్బర్. గమనించారా? అల్లాహు తాలా సత్కర్మలన్నిటినీ ఎలా ఒక అందమైన మనిషి రూపంలో తీసుకొని వచ్చాడో? అది కూడా సమాధిలో ప్రళయం సంభవించే వరకు అతనితో ఉండడానికి. అయితే చెప్పే విషయం ఏంటి? ఈ విధంగా కర్మలను కూడా ఒక ఆకారం ఇవ్వడం జరగవచ్చు. ఆ ఆకారాలను తూకం చేయడం జరగవచ్చు. లేదా అల్లాహ్ ఆ రోజు తనకిష్టమైన రీతిలో రూపంలో కర్మలను తూకం చేస్తాడు. ఆ విషయాన్ని మనం తప్పకుండా నమ్మాలి, స్వీకరించాలి, దాని గురించి మనం సిద్ధపడాలి.

మరొక హదీస్ చాలా ముఖ్యమైనది. సమాధి శిక్షల నుండి ఎలా రక్షణ పొందగలుగుతాము అన్న ఒక కార్యక్రమం ఇంతకుముందే మనం విని ఉన్నాము. అందులో కూడా ఈ హదీస్ ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ రోజు అదే హదీసు ద్వారా మనకు మరో విషయం బోధపడుతుంది, ఈనాటి శీర్షికకు సంబంధించిన విషయం. కర్మలను స్వయంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తనకిష్టమైన ఏదైనా ఆకారం ఇవ్వొచ్చు లేదా తనకిష్టమైన రీతిలో వాటికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తూకం చేయవచ్చు. మనిషిని ఎప్పుడైతే సమాధిలో పెట్టడం జరుగుతుందో, అప్పుడు నమాజ్ అతని తలాపులో ఉంటుంది. ఉపవాసం అతని కుడి వైపున ఉంటుంది. విధిధానం అతని ఎడమ వైపున ఉంటుంది. మరియు దాన ధర్మాలు, ప్రజల పట్ల చేసిన మేలు, మరియు వారికి ఉపకారాలు చేయడం, ఇవన్నీ కూడా అతని పాదాల వైపున ఉంటుంది. సమాధిలో శిక్ష తల వైపున వస్తున్నప్పుడు నమాజ్ అంటుంది, ఇటు నుంచి రావడానికి నీకు ఏ అవకాశం ఏ దారి లేదు. కుడి వైపు నుండి వస్తుంది, అప్పుడు ఉపవాసం అంటుంది ఇటువైపు నుండి రావడానికి నీకు ఏ మార్గం లేదు. ఎడమ వైపు నుండి వస్తుంది, అప్పుడు జకాత్, విధిదానం అంటుంది ఇటువైపు నుండి రావడానికి నీకు ఏ మార్గం లేదు. పాదాల వైపు నుండి శిక్ష వస్తుంది, అటు ఉన్న దాన ధర్మాలు, ప్రజల పట్ల ఉపకారము, మేలు ఇవన్నీ కూడా అంటాయి ఇటువైపు నుండి రావడానికి నీకు ఏ మార్గం లేదు.

ఈ విధంగా మహాశయులారా, సమాధిలో ఈ సత్కర్మలకు ఇలాంటి ఆకారాలు ఇచ్చి మనిషికి శిక్షించబడకుండా ఉండడానికి ఇలా రక్షణగా నిలుస్తాయి. అయితే దీని ద్వారా కూడా తెలిసిన విషయం ఏంటి? అల్లాహ్ సదాచరణకు, దుష్కర్మలకు తనకిష్టమైన ఆకారాలు ప్రసాదిస్తాడు. దీనికి సంబంధించిన మరో విషయం. అంటే ఆకారాలు తూకం చేయబడతాయి. వీటికి సంబంధించిన ఆధారాలు మరియు మూడో విషయం, కర్మ పత్రాలు తూకం చేయబడతాయి. ఇవి రెండు ఇన్షా అల్లాహ్, తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు.


(రెండవ భాగం)

అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వనుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక, గతంలో “త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి?” అనే దాని యొక్క తరువాయి భాగం. మహాశయులారా, అల్లాహు తాలా కర్మలను అలాగే త్రాసులో పెట్టవచ్చు, ఏదైనా ఆకారం ఇవ్వచ్చు, అతని యొక్క ఇష్టం. కానీ దీని గురించి వచ్చి ఉన్న హదీసులు మనం తెలుసుకుందాము.

హదీసులను ఎప్పుడైతే మనం వింటున్నామో, కనీసం రెండు లాభాలు మనం పొందే ప్రయత్నం చేయాలి. ఒకటి, ఏ కర్మలు త్రాసులో తూకం చేయడం జరుగుతుందో తెలుసుకుంటూ, త్రాసులో మన కర్మలు పెట్టే విషయం, ఆ విశ్వాసం మనలో మరింత బలంగా ఉండాలి. రెండవది, ఏ కర్మలు త్రాసులో తూకం చేయబడుతున్నాయో, వాటి ద్వారా బరువు పెరుగుతూ ఉంటే అలాంటి సత్కార్యాలను గుర్తుంచుకొని అలాంటి సత్కార్యాలు ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ బరువును తగ్గించేటువంటి దుష్కార్యాలు ఏమైనా ఉండేది ఉంటే, అలాంటి కార్యాలను వదులుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి సద్భాగ్యం అల్లాహ్ మనకు ప్రసాదించాలనే ఇలాంటి సద్భావంతో ఈ హదీసు నేను మీ ముందు ఉంచుతున్నాను శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి.

అబూ దావూద్, తిర్మిజీ, ముస్నద్ అహ్మద్, ఇబ్నే హిబ్బాన్ లోని హదీస్, సహీహుల్ జామిఅ లో షేఖ్ అల్బానీ రహిమహుల్లా పేర్కొన్నారు. 5726 హదీస్ నంబర్.

مَا مِنْ شَيْءٍ يُوضَعُ فِي الْمِيزَانِ أَثْقَلُ مِنْ حُسْنِ الْخُلُقِ وَإِنَّ صَاحِبَ حُسْنِ الْخُلُقِ لَيَبْلُغُ بِهِ دَرَجَةَ صَاحِبِ الصَّوْمِ وَالصَّلَاةِ
“ప్రళయ దినాన త్రాసులో సద్వర్తన కంటే మరేదీ కూడా బరువుగా ఉండదు. మరియు సద్వర్తన గల వ్యక్తి తన సద్వర్తన కారణంగా నఫిల్ నమాజులు, నఫిల్ ఉపవాసాలు పాటించే వ్యక్తి కన్నా ఎక్కువ గొప్ప స్థానానికి ఎదుగుతాడు.”

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీసులో సద్వర్తన తూకం చేయడం జరుగుతుంది అని తెలిసింది. అది చాలా బరువుగా ఉంటుంది అని తెలిసింది. కానీ ఇక్కడ ఒక పదం ఏదైతే వచ్చిందో “సద్వర్తన కంటే మరేదీ ఎక్కువగా బరువుగా ఉండదు” అని, అంటే ఇది “లా ఇలాహ ఇల్లల్లాహ్” తర్వాత అన్న విషయం మర్చిపోకూడదు. అన్నిటికంటే బరువుగా, దానిని మించి మరేదీ బరువుగా ఉండని విషయం ఏదైనా ఉంటే అది లా ఇలాహ ఇల్లల్లాహ్ ను ఇఖ్లాస్ (స్వచ్ఛతతో), మనశ్శుద్ధితో, సంకల్ప శుద్ధితో పఠించడం, దాని ప్రకారం ఆచరించడం.

ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ 223 లో ఉంది:

الطُّهُورُ شَطْرُ الْإِيمَانِ وَسُبْحَانَ اللهِ تَمْلَأُ الْمِيزَانَ
“పరిశుభ్రత సగం విశ్వాసం, మరియు సుబ్ హా నల్లాహ్ త్రాసును నింపేస్తుంది.”

ఈ విధంగా సుబ్ హా నల్లాహ్ అనే వచనం త్రాసులో పెట్టడం జరుగుతుంది, దాని వల్ల అది నిండిపోతుంది అని కూడా మనకు తెలుస్తుంది.

ఇక మరొక విషయం గమనించండి. చూడడానికి మనకు ఏ మాత్రం విలువ లేని విషయంగా ఏర్పడవచ్చు, కానీ అదే కార్యం ఒక మనిషి అల్లాహ్ సంతృప్తికి, స్వచ్ఛమైన మనస్సుతో పాటిస్తూ ఉంటే, అది అతని కొరకు ఎంత గొప్పగా ఉంటుందో, త్రాసులో ఎంత బరువుగా ఉంటుందో దానిని గమనించడానికి ఈ హదీస్ పై శ్రద్ధ వహించండి.

సహీ బుఖారీలో 2853 వ హదీస్ నంబర్ మరియు ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఈ హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు:

مَنِ احْتَبَسَ فَرَسًا فِي سَبِيلِ اللَّهِ إِيمَانًا بِاللَّهِ وَتَصْدِيقًا بِوَعْدِهِ فَإِنَّ شِبَعَهُ وَرِيَّهُ وَرَوْثَهُ وَبَوْلَهُ فِي مِيزَانِهِ يَوْمَ الْقِيَامَةِ
“అల్లాహ్ పై విశ్వాసంతో, అల్లాహ్ వాగ్దానాన్ని సత్యమని నమ్ముతూ, అల్లాహ్ మార్గంలో ఒక గుర్రాన్ని పెంచుతూ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఆ గుర్రానికి ఏ మేత పెడతాడో, త్రాగడానికి ఏ నీళ్లు ఇస్తాడో, తర్వాత ఆ గుర్రం ఏ మల మూత్ర విసర్జన చేస్తుందో, ఇవన్నీ కూడా ప్రళయ దినాన ఆ మనిషి త్రాసులో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇదంతా కూడా అతని కొరకు పుణ్యంలో లెక్కించడం జరుగుతుంది.”

అల్లాహు అక్బర్. ఇక గమనించండి, ఏ మేత ఇక్కడ పెట్టడం జరిగిందో, దానిని నమిలి తిని అది అరిగిపోతుంది కూడా కదా. లాభదాయకమైన విషయం శరీరంలో నరనరాల్లో రక్తంలో చేరుతుంది. వృధా అయిన విషయం బయటికి వెళ్ళిపోతుంది. నీళ్లు త్రాగిన తర్వాత శరీరంలో ఎక్కడ ఏ లాభం కలిగించాలో కలిగించి మిగితది బయటికి వెళ్ళిపోతుంది. కానీ మనిషి యొక్క విశ్వాసం, మనిషి యొక్క నమ్మకం, ఇలాంటి సత్కార్యాల గురించి, గుర్రాలు పెంచడం, అల్లాహ్ వాటి గురించి ఏ వాగ్దానం తెలిపాడో దానిని సత్యంగా నమ్మడం, ఇది ఎంత గొప్ప విషయమో, అల్లాహ్ కు ఎంత ఇష్టకరమైన విషయమో, అందు గురించి అలాంటి మనిషికి పుణ్యాలు పెరగాలి, సత్కార్యాలు పెరగాలి, అతని యొక్క త్రాసు బరువుగా ఉండాలి, అతను సాఫల్యం పొందే వారిలో కలవాలి. అందుకని అల్లాహు తాలా ఇహలోకంలో ఆ మనిషి ఆ గుర్రానికి ఏ మేత ఇచ్చాడో, ఏ నీళ్లు ఇచ్చాడో అవన్నీ కూడా తూకం చేయబడతాయి, తర్వాత అది మల మూత్ర విసర్జన ఏదైతే చేసిందో అదంతా కూడా తూకంలో పెట్టబడి దాని యొక్క బరువు ఏదైతే పెరుగుతుందో, ఈ మూలంగా… కానీ ఇక్కడ గమనించాలి విషయం. అల్లాహ్ పై విశ్వాసం మరియు అల్లాహ్ వాగ్దానాన్ని సత్యంగా నమ్ముతూ అల్లాహ్ మార్గంలో అల్లాహ్ సంతృప్తి కొరకు ఈ కార్యం చేసిన వారి యొక్క ఆ త్రాసు బరువే పెరుగుతుంది.

ప్రళయ దినాన కర్మలకు ఒక ఆకారం ఇవ్వడం జరుగుతుంది లేదా అల్లాహ్ ఇష్టమైన రీతిలో వాటి ద్వారా ఏ పని ఎలా తీసుకోవాలో తీసుకుంటాడు. ఈ విషయంలో మన నమ్మకం మరింత ఎక్కువగా పెరగడానికి హజ్రత్ అబూ దర్ రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీస్ చాలా బాగుంది. ఇబ్ను హిబ్బాన్ మరియు ముస్తద్రక్ హాకిం లో ఉంది ఈ హదీస్. షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుత్ తర్గిబ్ లో పేర్కొన్నారు. హదీస్ నంబర్ 876.

ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని, “నరకము నుండి కాపాడే ఆచరణ ఏది?” అని అడిగాను అని హజ్రత్ అబూ దర్ రదియల్లాహు తలా అన్హు తెలియబరుస్తున్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “అల్లాహ్ పై విశ్వాసం.”
ఆ తర్వాత, “ఏది?” అని నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగాను.

ప్రవక్త (స) ఏం సమాధానం ఇచ్చారు? అబూ దర్ రదియల్లాహు తలా అన్హు గారు అడిగిన ప్రశ్నకు, ప్రవక్త (స) “అల్లాహ్ పై విశ్వాసం” అని తెలిపారు. ఆ తర్వాత అబూ దర్ అడిగారు, “ప్రవక్తా, విశ్వాసం తర్వాత ఆచరణ కూడా అవసరమా?” అప్పుడు ప్రవక్త (స) చెప్పారు, “అల్లాహు తాలా నీకు ఏదేది ప్రసాదించాడో, నీకు ఏ దాని మీద అర్హత కలిగించాడో దానిలో నుండి ప్రజలకు ఇస్తూ ఉండు. ప్రజల పట్ల నువ్వు ఖర్చు పెడుతూ ఉండు.” అబూ దర్ అడిగారు, “ప్రవక్తా, ఎవరైనా స్వయంగా బీదవాడై అతని వద్ద ఏమీ లేకుండా ఉండి అతను ఎవరికీ ఏమీ ఇవ్వలేకపోతే ఎలా మరి?” అప్పుడు ప్రవక్త చెప్పారు, “మంచిని ఆదేశించాలి, చెడు నుండి వారించాలి అని.” అబూ దర్ అంటున్నారు, నేను అడిగాను, “మంచిని ఆదేశించే, చెడు నుండి వారించే శక్తి అతనిలో లేనిచో?” దానికి సమాధానంగా ప్రవక్త తెలిపారు, “ఏ మనిషి ఏ మాత్రం పని చేసుకోలేడో, అలాంటి వానికి ఏదైనా పని చేసి సహాయం చేయాలి.” అప్పుడు నేను అడిగాను, “ఆ మనిషి అది కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే మరి అతని గురించి వేరే మార్గం ఏంటి?” అప్పుడు ప్రవక్త చెప్పారు, “ఎవరైనా బాధితునికి సహాయం చేయాలి అని.”నేనన్నాను, “అతడే స్వయంగా బలహీనుడై ఏ బాధితునికి సహాయం చేసే స్థితిలో లేకుంటే ఎలా మరి?”అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఏమీ అబూ దర్, నీ తోటివానికి నీవు ఏ కార్యము, ఏ మేలు కార్యము చేయనియ్యవా? అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండుమని చెప్పు.” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.అప్పుడు నేను అడిగాను, “ప్రవక్తా, వీటిలో ఏ ఒక్క కార్యం చేసినా అతను స్వర్గంలో ప్రవేశిస్తాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు. “ఏ విశ్వాసి అయినా ఈ సద్గుణాల్లో ఏవైతే నేను తెలిపాను, ఈ సద్గుణాల్లో ఏ ఒక సద్గుణం చేసినా, ఆ సద్గుణం అతని చెయ్యి పట్టుకొని అతనిని స్వర్గంలోకి తీసుకు వెళ్తుంది.”

అల్లాహు అక్బర్. మన ఈనాటి శీర్షికకు ఇక్కడ ఈ మూల విషయం. ఆ సద్గుణం, ఆ సత్కార్యం మనిషి ఏదైతే చేస్తాడో అది స్వయంగా ఆ మనిషి చేతిని పట్టుకొని స్వర్గంలోకి తీసుకు వెళ్తుంది.

అయితే మహాశయులారా, ప్రళయ దినాన కర్మలు మాట్లాడతాయి, పరస్పరం గర్వపడతాయి, ఆ కర్మలు చేసిన వారి చెయ్యిని పట్టుకొని స్వర్గంలోకి తీసుకువెళ్తాయి, వాటిని తూకం చేయబడుతుంది. ఇందులో మనం ఎలాంటి సంకోచానికి గురి కాకూడదు.

ఇక మూడో విషయం. మూడో విషయం ఏదైతే త్రాసులో తూకం చేయడం జరుగుతుందో, అది మన కర్మ పత్రాలు. అల్లాహు తాలా కర్మ పత్రాలను కూడా త్రాసులో తూకం చేయడానికి అనుమతిస్తాడు, అవి అందులో తూకం చేయడం జరుగుతుంది. మనం గుర్తుంచుకోవాలి:

مَا يَلْفِظُ مِنْ قَوْلٍ اِلَّا لَدَيْهِ رَقِيْبٌ عَتِيْدٌ
“మనిషి ఏ మాట మాట్లాడినా, వెంటనే దానిని అందుకొని రాసి భద్రపరుచుకోవడానికి అక్కడ సిద్ధమై ఉన్నారు దైవదూతలు.”

كِرَامًا كَاتِبِيْنَ يَعْلَمُوْنَ مَا تَفْعَلُوْنَ
“గౌరవనీయులైన లేఖకులు ఉన్నారు. మీరు ఏమీ చేస్తున్నా గానీ అది వారికి తెలుస్తుంది, వారు వాటిని భద్రపరుస్తారు.”

ఈ విషయం ఖురాన్ లో ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే ఒక ఆఫీసులో కెమెరాలు ఉన్నప్పుడు అక్కడ పనిచేసే వారు “మన యజమాని మనల్ని గమనిస్తూ ఉన్నాడు, మనం ఎక్కడ ఏం చేసినా గానీ నోట్ చేసుకొని తర్వాత మనల్ని మందలిస్తాడు. మనకు జీతం ఇచ్చే సందర్భంలో మనం చేసే తప్పుల్ని లెక్కించి మన యొక్క జీతంలో ఏదైనా కటింగ్ కూడా చేస్తాడు” అన్నటువంటి భయం ఉంటుందో, వారు ఎంత శ్రద్ధగా పనిచేస్తారండీ? ఇలా దైవదూతలు మన వెంట ఉండి మనం చేసే ప్రతి కర్మ, మనం మాట్లాడే ప్రతి మాట వారు నోట్ చేస్తూ ఉంటారు. మరి మనం ఎందుకు ఇంత నిర్భయంగా జీవిస్తున్నాము? ఇవన్నీ కర్మ పత్రాలు ఏవైతే తయారవుతాయో, వాటిని కూడా త్రాసులో పెట్టడం జరుగుతుంది. దీని గురించి ఎన్నో సాక్షాధారాలు ఉన్నాయి కానీ, ఇంతకుముందు సంక్షిప్తంగా వినిపించిన ఒక హదీస్, దానిని ఇప్పుడు మీరు వివరంగా వినే ప్రయత్నం చేయండి.

తిర్మిజీ మరియు ఇబ్నే మాజా లోని హదీస్ ఇది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహాలో పేర్కొన్నారు, హదీస్ నంబర్ 135.

إِنَّ اللَّهَ سَيُخَلِّصُ رَجُلًا مِنْ أُمَّتِي يَوْمَ الْقِيَامَةِ عَلَى رُءُوسِ الْخَلَائِقِ
“ప్రళయ దినాన అల్లాహు తాలా నా అనుచర సంఘంలో నుండి ఒక వ్యక్తిని ప్రజలందరి ముందుకు హాజరు పరుస్తాడు. అతని ముందు అతని 99 కర్మ పత్రాలను తెరుస్తాడు. దాని పొడవు ఎంత ఉంటుందంటే ఎంత దూరమైతే అతని దృష్టి చేరుకుంటుందో అంత దూరం ఉంటుంది.” అప్పుడు అల్లాహు తాలా అతనితో ప్రశ్నిస్తాడు, “ఈ 99 ఫైళ్లలో ఏ పాపాలైతే నువ్వు చూస్తున్నావు, ఇందులో నా లేఖకులు నీపై ఏమైనా దౌర్జన్యం చేశారా? ఇందులో ఉన్న ఏదైనా పాపాన్ని నీవు తిరస్కరించగలుగుతావా?” ఈ ప్రశ్నలకు ఆ మనిషి, “లేదు ఓ అల్లాహ్, నేను ఏ ఒక్క పాపాన్ని తిరస్కరించను, అబద్ధం పలకను. మరియు నీ లేఖకులు, భద్రంగా ఉండే అటువంటి నీ రక్షకులు, వారు కూడా ఎలాంటి అన్యాయం చేయలేదు.” అప్పుడు అల్లాహ్ మరీ అడుగుతాడు, “నీ వద్ద ఏదైనా సాకు ఉందా? లేక నీ వద్ద ఏదైనా పుణ్యం ఉందా?” అప్పుడు అతడు అంటాడు, “ఓ అల్లాహ్, నా వద్ద ఏముంది? ఇంత 99 ఫైళ్లే కనబడుతున్నాయి, ఇక నా వద్ద… ఈ 99 ఫైళ్లు మొత్తం పాపాలతో నిండి ఉన్నాయి. ఎక్కడైనా మూలకి ఏదైనా పుణ్యం ఉన్నా గానీ వీటి ముందుంగట ఏం లాభం?” అన్నట్లుగా అతను భావిస్తాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు, “ఈ రోజు నా వైపు నుండి ఎవరిపై ఎలాంటి అన్యాయం, దౌర్జన్యం జరగదు.”

అప్పుడు ఒక చిన్న ముక్క వెలికి వస్తుంది. దాని మీద أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ అని రాసి ఉంటుంది. అల్లాహు తాలా ఆ మనిషితో అంటాడు, “నీవు త్రాసు వద్దకు వచ్చేసయి.” త్రాసు ఒక పల్లెంలో 99 ఫైళ్లు పెట్టడం జరుగుతుంది. మరో పల్లెంలో ఆ చిన్న ముక్క పెట్టడం జరుగుతుంది. ఆ మనిషి అంటాడు, “ఈ ఫైళ్ల ముందు ఇంత చిన్న ముక్క ఏం బరువు ఉంటుంది?” కానీ ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో, ఈ ముక్క ఏ పల్లెంలో ఉందో ఆ పల్లెం బరువుతో కిందికి వంగిపోతూ ఉంటుంది. మరియు ఆ 99 ఫైళ్లు ఉన్న ఆ పల్లెం తేలికగా అయి మీదికి లేసిపోతుంది. వాస్తవం ఏమిటంటే, فَلاَ يَثْقُلُ مَعَ اسْمِ اللَّهِ شَىْءٌ “అల్లాహ్ పేరు గల వస్తువు పై మరే వస్తువు కూడా బరువుగా ఉండదు, బరువుగా రాదు.”

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీసు ద్వారా మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి. అందులో మన ఈ శీర్షికకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం 99 ఫైళ్లు, అవి కర్మ పత్రాలు, త్రాసులో పెట్టడం జరుగుతుంది, తూకం చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం తిరస్కరించకూడదు. ఈ విషయాన్ని కూడా మనం నమ్మాలి. ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం చాలా కష్టతరమైన విషయం, ప్రజలపై వచ్చి పడే ఆపదల్లో అతి పెద్ద ఆపద. ఈ విషయాలన్నిటినీ కూడా మనం నమ్మి స్వీకరించి ఇహలోక జీవితం ఒక్కసారి మాత్రమే ఏదైతే మనకు ప్రసాదించబడినదో దానిని సద్వినియోగం చేసుకొని సత్కర్మలు పెంచుకునే ప్రయత్నం చేయాలి, విశ్వాసంతో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాట మీద నడుస్తూ అప్పుడే మహాశయులారా మనం ఇహలోకంలో, పరలోకంలో సాఫల్యులలో కలిసి అదృష్టవంతులలో కలిసి ఎల్లకాలం ఆ పరలోక జీవితం ఏదైతే ఉందో దానిలో మనం సుఖంగా జీవించే అవకాశం కలుగుతుంది.

అల్లాహ్ మనందరికీ ఇలాంటి విషయాలను గట్టిగా బలంగా నమ్మి మన యొక్క జీవితం సత్కార్యాలలో గడిపే ప్రయత్నం చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. అయితే మహాశయులారా, మన పుణ్యాల త్రాసు ఏ సత్కార్యాలతో బరువు గలదిగా ఉంటుందో, ఇది ఒక మెయిన్ టాపిక్ మరి కొద్ది రోజులలో మీ ముందుకు రానుంది. వాటిని కూడా మీరు చూస్తూ మన యొక్క త్రాసును బరువు చేయడానికి అలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి.

అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. వ ఆఖిరు దవానానిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]