తఫ్సీర్ సూరతుల్ బఖర – ఆయతులు 47 – 61 [వీడియో]

బిస్మిల్లాహ్

[45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

2. సూరా అల్ బఖర (ఆయతులు 47 – 61)

47  يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ

ఓ ఇస్రాయీలు (యాఖూబు) సంతతి వారలారా! నేను మీపై కురిపించిన అనుగ్రహాన్నీ, (నాటి) సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి (కాస్త) నెమరు వేసుకోండి.

2:48  وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ

ఎవరూ ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసూ స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సాయం అందజేయబడని ఆ దినానికి భయపడండి.

2:49  وَإِذْ نَجَّيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ

(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి) ఫిరౌను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి, కూతుళ్ళను మాత్రం విడిచి పెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభువు తరఫునుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది.

2:50  وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنتُمْ تَنظُرُونَ

అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి, మిమ్మల్ని సురక్షితంగా (ఆవలి ఒడ్డుకు) చేరవేశాము. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరౌనీయులను అందులో ముంచివేశాము.

2:51  وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ

(జ్ఞాపకం చేసుకోండి) మేము మూసా (అలైహిస్సలాం)కు నలభై రాత్రుల వాగ్దానం చేసి (అతన్ని పిలిచి) నప్పుడు, అతను వెళ్ళిన తరువాత మీరు ఆవు దూడను పూజించటం మొదలెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు.

2:52  ثُمَّ عَفَوْنَا عَنكُم مِّن بَعْدِ ذَٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ

అయినప్పటికీ మేము మిమ్మల్ని మన్నించి వదలిపెట్టాము – అలాగయినా కృతజ్ఞులవుతారేమోనని!

2:53  وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ

ఇంకా మేము మూసాకు, మీ మార్గదర్శకత్వం నిమిత్తం గ్రంథాన్నీ, గీటురాయినీ ప్రసాదించాము.

2:54  وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ عِندَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ

(గుర్తు చేయి) మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. (ఈ ఘోర కృత్యానికి పాల్పడిన) మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది.” మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు.

2:55  وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنتُمْ تَنظُرُونَ

మీరు మూసాతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి : “ఓ మూసా! మేము అల్లాహ్‌ను కళ్ళారా చూడనంతవరకూ నిన్ను విశ్వసించము.” (మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా) మీరు చూస్తుండగానే (మీపై) పిడుగు పడింది.

2:56  ثُمَّ بَعَثْنَاكُم مِّن بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ

అయితే (ఈసారయినా) మీరు కృతజ్ఞులవుతారేమోనన్న ఉద్దేశంతో చనిపోయిన మిమ్మల్ని తిరిగి బ్రతికించాము.

2:57  وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۖ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ

మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మీపై మన్న్‌, సల్వాలను (ఆహారంగా) దించాము. “మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి” (అని చెప్పాము. కాని, వారు ఆ అనుగ్రహాలు అనుభవించి కృతజ్ఞులయ్యే బదులు కృతఘ్నత చూపటం మొదలుపెట్టారు). వారు మాకెలాంటి అన్యాయం చేయలేదు, కాకపోతే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటూ పోయారు.

2:58  وَإِذْ قُلْنَا ادْخُلُوا هَٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ ۚ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ

(ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి). “ఈ పురములో ప్రవేశించండి. అక్కడ మీకు ఇష్టమైన చోట, కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కాని నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు ‘సజ్దా’ చేస్తూ మరీ పోవాలి. పోతున్నప్పుడు ‘హిత్తతున్‌’అని నోటితో పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాము, సదాచార సంపన్నులకు మరింతగా అనుగ్రహిస్తాము” అని మేము మీతో అన్నాము.

2:59  فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنزَلْنَا عَلَى الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ

కాని దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చి వేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి (దుర్మార్గం), ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము.

2:60  وَإِذِ اسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِ فَقُلْنَا اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ ۖ فَانفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ ۖ كُلُوا وَاشْرَبُوا مِن رِّزْقِ اللَّهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ

మూసా (అలైహిస్సలాం) తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు, “నీ చేతి కర్రతో ఆ (కొండ) రాతిపై కొట్టు” అని మేమన్నాము. (అలా కొట్టగా) దాన్నుండి పన్నెండు ఊటలు పెల్లుబికాయి. వారిలోని ప్రతి తెగవారూ తమ తమ నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. (అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాము:) “అల్లాహ్‌ (మీకు ప్రసాదించిన) ఉపాధిని తినండి, త్రాగండి. భువిలో అలజడిని రేపుతూ తిరగకండి.”

2:61  وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نَّصْبِرَ عَلَىٰ طَعَامٍ وَاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنبِتُ الْأَرْضُ مِن بَقْلِهَا وَقِثَّائِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ۖ قَالَ أَتَسْتَبْدِلُونَ الَّذِي هُوَ أَدْنَىٰ بِالَّذِي هُوَ خَيْرٌ ۚ اهْبِطُوا مِصْرًا فَإِنَّ لَكُم مَّا سَأَلْتُمْ ۗ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّهِ ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ الْحَقِّ ۗ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ

(జ్ఞాపకం చేసుకోండి,) “ఓ మూసా! ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించము. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పుదినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసినదిగా నీ ప్రభువును ప్రార్థించు” అని మీరు డిమాండు చేసినప్పుడు అతనిలా అన్నాడు: “మీరు శ్రేష్ఠమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? (సరే!) ఏదయినా పట్టణానికి వెళ్ళండి. అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి.” దాంతో వారిపై పరాభవం, దారిద్య్రం రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి ఈ దురవస్థకు కారణమేమిటంటే వారు అల్లాహ్‌ ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి అవిధేయతకు, బరితెగించిన పోకడకు పర్యవసానం మాత్రమే!


ఖురాన్ వ్యాఖ్యానం : అహ్సనుల్ బయాన్

%d bloggers like this: