తఫ్సీర్ సూరతుల్ బఖర – ఆయతులు 30 – 46 [వీడియో]

బిస్మిల్లాహ్

[34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

2. సూరా అల్ బఖర (ఆయతులు 30 – 46)

2:30  وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً ۖ قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۖ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ

“నేను భువిలో ప్రతినిధిని చేయబోతున్నాను” అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు, “భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు (ప్రభూ)? నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాము కదా!” అని వారన్నారు. దానికి అల్లాహ్‌, “నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు” అని అన్నాడు.

2:31  وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ

(తరువాత) అల్లాహ్‌ ఆదంకు అన్ని (వస్తువుల) పేర్లనూ నేర్పి, వాటిని దూతల ముందుంచాడు. “ఒకవేళ మీరు చెప్పేదే నిజమయితే, కాస్త వీటి పేర్లు చెప్పండి?” అన్నాడు.

2:32  قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ

వారంతా ఇలా అన్నారు : “(ఓ అల్లాహ్‌!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!”

2:33  قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ

అప్పుడు అల్లాహ్‌, “ఓ ఆదం! వీటి పేర్లేమిటో నువ్వు తెలుపు” అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లాహ్‌ ఇలా ప్రకటించాడు: “భూమ్యాకాశాలలో గోప్యంగా వున్నవన్నీ నాకు తెలుసనీ, మీరు బహిర్గతం చేసేవీ, దాచి పెట్టేవీ అన్నీ నాకు తెలుసని (ముందే) నేను మీకు చెప్పలేదా?”

2:34  وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ

“మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి” అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి, అవిధేయులలో చేరిపోయాడు.

2:35  وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ

(తరువాత) మేము, “ఓ ఆదం! నువ్వూ, నీ భార్య – ఇద్దరూ- స్వర్గంలో ఉండండి, మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి, త్రాగండి. కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు” అని చెప్పాము.

2:36  فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ

కాని షైతాన్‌ వారిని పెడత్రోవ పట్టించి, అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: “దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ది పొందవలసి ఉంది.”

2:37  فَتَلَقَّىٰ آدَمُ مِن رَّبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ

అప్పుడు ఆదం (అలైహిస్సలాం) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని (పశ్చాత్తాపం చెందారు.) అల్లాహ్‌ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను.

2:38  قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.”

2:39  وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ

ఎవరయితే దానిని నిరాకరించి, మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు. వారందులో కలకాలం పడి ఉంటారు.

2:40  يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ

ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి.

2:41  وَآمِنُوا بِمَا أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ

మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి.

2:42  وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ

సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి.

2:43  وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ

(ఇస్రాయీలు సంతతి వారలారా!) మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, (నా సన్నిధిలో) రుకూ చేసే వారితోపాటు మీరూ రుకూ చేయండి.

2:44  أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ

ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కాని మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?

2:45  وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى الْخَاشِعِينَ

మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమయిన పనే. కాని (అల్లాహ్‌కు) భయపడేవారికి (ఇది సులువైనపని).

2:46  الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ

(ఎందుకంటే) ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందనీ, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందనీ వారు నమ్ముతారు.


ఖురాన్ వ్యాఖ్యానం : అహ్సనుల్ బయాన్

%d bloggers like this: