మీలాదున్ నబీ ﷺ ఉత్సవాలు జరుపుకొనుట ధర్మమేనా కాదా?

బిస్మిల్లాహ్

[ఈ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/meelad-un-nabee
[PDF] [14 పేజీలు]

మహాశయలారా! మీలాదున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉత్సవాలు జరుపుకొనుట ధర్మమేనా కాదా అన్న సందేహాన్ని దూరము చేసుకొనుటకు ఈ క్రింది విషయాల్ని చదువుతే చాలా బావుంటుంది.

1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ఇలా ఉందిః

(مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ )
ఎవరు మా ఈ ధర్మంలో లేని విషయాన్ని కొత్తగా పుట్టిస్తాడో అది రద్దు చేయ బడుతుంది“. (బుఖారి 2697, ముస్లిం 1718).

సోదరా! మీలాదున్నబీ ఉత్సవం ప్రవక్త కాలంలో కనీసం ఒక్కసారైనా జరగలేదు. అంతే కాదు బుఖారి (2651) మరియు ముస్లిం (2533)లోని హదీసు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మూడు కాలల గురించి అవి ఉత్తమమైనవి అని తెలిపారో ఆ కాలాల్లో కూడా ముస్లింలు మీలాదున్నబీ జరుపుకో లేదు. అందుకే నలుగురు ఖులఫాయే రాషిదీన్ హయాంలోగాని, ఆ తర్వాత 70 సంవత్సరాల వరకు ఉన్న సహాబాల కాలంలోగాని లేదా వారి శిశ్యులైన తాబిఈన్ కాలంలోగాని ఆ తర్వాత నలుగురు గొప్ప ఇమాముల కాలంలోగాని మీలాదున్నబీ ఉత్సవాలు జరిగినట్లు చరిత్ర పుటల్లో ఏ ఒక్క చిన్నపాటి ఆధారం అయినా లభించదు.

అందుకే పండితులు దీనిని దురాచారం అంటారు.

మరో విధంగా గ్రంహించగలుగుతే: సహాబాలు (ప్రవక్త సహచరులు) ప్రవక్త పట్ల మనకంటే అధికంగా ప్రేమగలవారన్న విషయంలో ఏలాంటి సందేహం లేదు కదా? అయితే వారు దీనిని పాటించనప్పుడు మనం పాటించడం ఎంత వరకు సమంజసం?

2. మనం దీనిని ఉత్సవంగా జురుపుకుంటున్నామంటే, సంవత్సరంలో ఎన్ని ఉత్సవాలు జరుపుకోటానికి ప్రవక్త మనకు ఆదేశించారన్నది ఎప్పుడైనా ఆలోచించామా? అబూదావూదు (1134), నిసాయీ (1556)లోని ఈ హదీసును గమనించండిః

عَنْ أَنَسٍ قَالَ: قَدِمَ رَسُولُ الله ﷺ الْمَدِينَةَ وَلَـهُمْ يَوْمَانِ يَلْعَبُونَ فِيهِمَا فَقَالَ: (مَا هَذَانِ الْيَوْمَانِ) قَالُوا كُنَّا نَلْعَبُ فِيهِمَا فِي الْجَاهِلِيَّةِ فَقَالَ رَسُولُ اللهِ ﷺ: (إِنَّ اللهَ قَدْ أَبْدَلَكُمْ بِهِمَا خَيْرًا مِنْهُمَا يَوْمَ الْأَضْحَى وَيَوْمَ الْفِطْرِ).

అనస్ బిన్ మాలిక రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చినప్పుడు, వారు (సంవత్సరంలో) రెండు రోజులు ఆటపాటల్లో గడుపుకునే వారు. ఈ రెండు రోజుల సంగతేమిటి? అని ప్రవక్త వారిని అడిగినప్పుడు వారన్నారుః మేము అజ్ఞానకాలం నుండి ఈ రెండు రోజులు ఆటపాటల్లో గడుపుకునేవాళ్ళము. అప్పుడు ప్రవక్త చెప్పారుః “ఆ రెండు రోజులకు బదులుగా అల్లాహ్ మీ కొరకు వాటికంటే మేలైన మరో రెండు రోజులు ప్రసాదించాడు. అవి: ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హా” (అంటే రమజాను పండుగ మరియు బక్రీద్ పండుగ).

గ్రహించండి సోదరులారా! ఈ రెండు పండుగలు వారు జరుపుకునే ఉత్సవాల కంటే మేలైనవని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అయితే మీలాదున్నబీ గురించి ప్రవక్త ఏమైనా చెప్పారా? అందుకే దానిని ప్రతి సంవత్సరం ఉత్సంగా జరుపుకోవడం, ఆ దినానికంటూ ఓ ప్రత్యేకత ఇవ్వడం ఏ మాత్రం ధర్మం కాదు. ఇంతే కాదు ఇస్లాం ధర్మం సంపూర్ణం అయింది గనుక అందులో అదనంగా చేర్చడానికి ఏ అవకాశమూ లేదు. చదవండి అల్లాహ్ ఆదేశం:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الإِسْلاَمَ دِيناً]. {المائدة 3}
ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను. (మాఇద 5: 3).

ఈ స్పష్టమైన ఆయతు చదివిన తర్వాత కూడా మీలాదున్నబీ చేయాలనే దృఢ నమ్మకం మీద ఉన్నామంటే ఇక ఈ క్రింది మూడిట్లో ఏదైనా ఒక ప్రమాదంలో పడినట్లేః

  • 1. అల్లాహ్ ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు కాని మీలాదున్నబీ గురించి చెప్పడం మరచిపోయాడు. అందుకే ఈ రోజు మేము చేస్తున్నాము. (అస్తగ్ఫిరుల్లాహ్, నఊజు బిల్లాహ్).
  • 2. అల్లాహ్ దీని ఆదేశమిచ్చాడు కాని ప్రవక్త తెలుపడం లేదా చేయడం మరచిపోయారు. (అస్తగ్ఫిరుల్లాహ్, నఊజు బిల్లాహ్).
  • 3. ప్రవక్త దాని గురించి చెప్పారు, లేదా దానిని చేశారు కాని సహాబాలందరు కలసి దానిని తమ వెనకవారికి తెలుపలేదు. వారూ స్వయంగా దానిని పాటించలేదు. (అస్తగ్ ఫిరుల్లాహ్, నఊజు బిల్లాహ్).రవ్వంతైనా విశ్వాసమున్న ముస్లిం ఇలా ఊహించగలడా?

3. ఈ రోజుల్లో సామాన్యంగా 12వ రబీఉల్ అవ్వల్ కే ప్రవక్త జన్మదినం అని అదే రోజు మీలాదున్నబీ ఉత్సవం జురుపు కుంటారు. అయితే 12కే ప్రవక్త మరణించారన్నది తిరుగులేని సత్యం. అయితే మీలాద్ చేసే వారు ప్రవక్త జన్మదిన వేడుకోలు జరుపుకుంటారా? లేదా తద్దినాలు జరుపుకుంటారా?

4. ఆ దినాన్ని పండుగరోజుగానే సామాన్య ప్రజలు భావిస్తున్నారు. అయితే పండుగరోజున ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త నివారించారు. (బుఖారి 1990, ముస్లిం 1137). అలాగే జుమా రోజు వారపు పండుగ అందుకని ఆ రోజు ఉపవాసం కూడా నివారించడం జరిగింది. చూడండిః ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబా.

ఇక సోమవారం నాటి ఉపవాసం గురించి ప్రవక్తను అడిగినప్పుడు అది నేను జన్మించిన రోజు అలాగే నాపై తొలివహీ అవతరించిన రోజు అని చెప్పారు. (ముస్లిం 1162). అంటే ప్రవక్త పుట్టిన రోజు సోమవారం వచ్చినప్పుడల్లా ఉపవాసం ఉడడం ప్రవక్త సంప్రదాయం. అయితే ఆ దినాన్ని పండుగగా చేసుకోవడానికి ఏమిటి బలమైన సబబు?.

5. మీలాద్ చేయకూడదనడానికి పై ఆధారాలే కాకుండా మరో బలమైన ఆధారం ఏమిటంటే క్రైస్తవులు క్రిస్మిస్ డే జరుపుకున్నట్లు మరియు ఇతరులు తమ ప్రవక్తల లేదా గొప్ప వ్యక్తుల జన్మదినాలు జరుపుకున్నట్లు అయిపోతుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇతరుల పోలికలను అవలంబించుట నుండి నివారించారు. అంతేకాదు, అలా పాటించేవారు వారిలోనే కలసిపోతారని కూడా హెచ్చరించారు. చూడండిః అబూదావూద్ 4031.

మీలాద్ పై సంక్షిప్తంగా చారిత్రక దృష్టి:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభకాలంలో, సహాబాలు, తాబిఈన్ మరియు ఇమాముల సద్కాలాల్లో లేని ఈ మీలాద్ ఎప్పుడు మరెందుకు పుట్టింది? అన్న ప్రశ్న తలెత్తవచ్చు, అయితే శ్రద్ధగా చదవండి: అల్లాహ్ యొక్క గొప్ప దయతో దినదినానికి ఇస్లాం ధర్మం పురోగతిని చూస్తూ ఓర్వలేని ఇస్లాం శత్రువులు ఇస్లాం, మరియు ముస్లింలకు వ్యెతిరేకంగా ఏదో పన్నాగం పన్నుతునే ఉన్నారు. వాటిలోని ఓ పన్నాగమే ఇలాంటి దురాచారాలు.

ఉబైదియ్యీన్ అన్న పేరుగాంచిన దుర్మార్గులు, దుండగులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంవారి సుకుమార్తె అయిన ఫాతిమ రజియల్లాహు అన్హా వంశంలో వస్తారన్న భ్రమ ప్రజలకు కలిగేలా ఫాతిమీయ్యీన్ అన్న మారు పేరు పెట్టుకొని, 362వ హిజ్రీలో మిస్ర్ (EGYPT) దేశాన్ని కైవసం చేసుకున్నారు. సుమారు 567వ సంవత్సరం వరకు వారి ప్రభుత్వం అక్కడ కొనసాగింది. మీలాద్ బిద్అత్ వారి కాలంలోనే వారి ప్రోద్బలంతో మొదలయ్యింది. వారు బహిరంగంగా సహాబాలను ప్రత్యేకంగా అబూ బక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్ రజియల్లాహు అన్హుంలను చెప్పరాని విధంగా దూషించేవారు. 381వ హిజ్రీలో మిస్ర్ లో ఒక వ్యక్తి వద్ద ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ గారి మువత్త హదీసు గ్రంథం ఉన్నందు వల్ల అతన్ని విపరీతంగా బాధించి ఊరంతా తింపారు. ఇంకా ఎన్నో అఘాయిత్యాలు వారు జరిపారు. అయితే ఆ కాలంలో సరియైన ఉలమాలు కరువయి పోయారా, వారు అలాంటి దురాచారాలకు ఏమీ అడ్డుగోడగా నిలవలేదా అని ఎవరికైనా అనుమానం రావచ్చు, అయితే ఆ కాలంలోని ధర్మపండితులు ఆ దురాచారాల నుండి వారించారు, వాటికి ఎదురుగా నిలబడ్డారు. కాని ప్రభుత్వ పరంగా ఈ దురాచారానికి సపోర్ట్ లభించడం వల్ల అది ప్రభలిపోయింది. ఈ వివరాలన్నిటినీ ఈ పాంఫ్లేటులో వ్రాయడానికి స్థలం సరిపోదు. వివరాలు కోరినవారు హాఫిజ్ ఇబ్ను కసీర్ రచణ ‘అల్ బిదాయ వన్నిహాయ’లో 402వ సంవత్సరంలోని సంఘటనలు చదవండి.

ఆ తర్వాత హిజ్రీ అరవ శతాబ్దంలో ఇరాఖ్ లోని మూసిల్ అన్న ప్రాంతంలో అబూ సఈద్ కౌకబూరీ అన్న రాజు ఈ బిద్అత్ ను పునరారంభించాడు. ఆ రోజు దూబారా ఖర్చులతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. భారత ఖండంలో ముఘల్ పరిపాలన కాలంలో ఈ బిద్అత్ కాళ్ళు మోపింది.

కొందరు మీలాద్ చేయుట ధర్మం అని కొన్ని కుంటి సాకులు తీసుకొచ్చి చూడండి మేము కూడా ఖుర్ఆన్ ద్వారా రుజువు చేస్తామని ప్రజల్ని మోసగిస్తారు. రండి వాటి వాస్తవికతను కూడా సంక్షిప్తంగా తెలుసుకుందాము.

వారి వద్ద ఉన్న ఆధారాల్లో వారి భ్రమ ప్రకారం అతి గొప్ప ఆధారం ఖుర్ఆన్ యొక్క సూర యూనుస్ లోని 58వ ఆయతుః

[قُلْ بِفَضْلِ اللهِ وَبِرَحْمَتِهِ فَبِذَلِكَ فَلْيَفْرَحُواْ هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ]

“ఇలా తెలియజేయండి: (ప్రజలు) అల్లాహ్ యొక్క ఈ అనుగ్రహం మరియు ఆయన ఈ కారుణ్యం వల్ల సంబరపడాలి. ఇది వారు కూడబెట్టే వాటన్నిటికంటే ఉత్తమమైనది”. (సూర యూనుస్ లోని 58వ ఆయతు)

దీని వ్యాఖ్యానంలో వారు ఇలా అంటారు: అల్లాహ్ అనుగ్రహం, కారుణ్యం లభించినప్పుడు సంతోషపడాలని ఆదేశించడం జరిగింది. అయితే ప్రవక్త మొత్తం విశ్వానికే కారుణ్యమూర్తి అన్న విషయం జగమెరిగినదే, అందుకే ఆయన జన్మదినాన మేము సంతోష సభలు ఏర్పాటు చేస్తాము’.

అయితే దీని సమాధానం శ్రధ్దగా చదవండిః

1. ఈ ఆయతు ఈ రోజు మనపై అవతరించలేదు. ఆ నాడు ప్రవక్త పై అవతరించింది. దీని అవతరణ తర్వాత ప్రవక్త 10, 11 సంవత్సరాలు, ఆ తర్వాత సహాబాలు వంద సంవత్సరాలు జీవించారు. అయితే వారు ఈ ఆయతు యొక్క ‘ఈ’ భావం తెలుసుకో లేకపోయారా? లేదా తెలిసికూడా పాటించలేదా?

2. దీనికి ముందు ఉన్న 57వ ఆయతును కలిపి చదువుతే కూడా వారి భ్రమ తొలిగిపోతుంది.

అసలే ప్రవక్త మరియు ఆయన సహచరులు ఇంకా ఇమాములు మీలాద్ చేయనప్పుడు, ఆధారాల పేరిట ఎన్ని విషయాలు తెచ్చినా అవి సరితూగవు.

మహాశయులారా! ఖుర్ఆన్ అవతరింపజేసింది అల్లాహ్ యే. దాని అర్థభావాలను ప్రవక్తకు తెలిపింది కూడా అల్లాహ్ యే. (చూడండి సూర ఖియామ 75:19). ఆ తర్వాత ప్రవక్త సహాబాలకు తెలియజేశారు. అందుకు మనం అజ్ఞానంగా పాటిస్తున్న దురాచారాలను విడనాడడంలోనే మనకు మోక్షం లభిస్తుంది. వాటిని దురాచారం అని తెలుసుకోకుండా వాటిని ధర్మ కార్యాలని భావించి, ఇతరులపై అవి రుద్దుటకు కుంటి సాకులను వెతికి తేవడం అత్యంత పాపకార్యం.

అల్లాహ్ మనందరికి ఆయనకు ఇష్టమైన రీతిలో ప్రవక్త అనుకరణ భాగ్యం, మరియు అన్ని రకాల బిద్అత్ (దురాచారా)లకు దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక! అమీన్!!

మీలాదున్ నబీ గురించిన ప్రశ్నలు – షేఖ్ ఇబ్ను ఉసైమీన్ (రహిమహుల్లాహ్)

మీలాదున్ నబీ (ప్రవక్త గారి పుట్టిన రోజు పండగ) ఉత్సవం జరుపుకునేవారితో కూర్చుండుట

షేఖ్ గారు! మీలాదున్ నబీ ఉత్సవం బిద్అత్ అని మీరు తెలిపారు, అయితే ఈ బిద్అత్ చేస్తూ మస్జిదులో ప్రవక్త చరిత్ర గురించి ప్రసంగాలు చేసేవారి వద్ద కూర్చుండేవారి గురించి ఏమిటి ఆదేశం అని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ గారిని ప్రశ్నించడం జరిగింది.

జవాబు:

ఎవరు బిద్అత్ లో పాల్గొంటారో వారికి దానికి తగిన పాపం కలుగుతుంది. వారి ఆ మీలాద్ ఉత్సవంలో పాల్గొనుట ఏ ముస్లింకి తగదు, జాయెజ్ లేదు. ఎందుకనగా అది బిద్అత్. ఏ బిద్అత్ గురించైతే ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) అది దుర్మార్గం (మార్గభ్రష్టత్వం) అని తెలియబరచారో అలాంటి బిద్అత్ లో, వారితో కూర్చుండుట మనిషి ఎలా ఇష్టపడతాడు?

(లిఖాఉల్ బాబిల్ మఫ్ తూహ్ 131/17)


మీలాదున్ నబీ ఉత్సవం జరుపుకునే మరియు అది జరుపుకోవాలని ఆహ్వానించే వారి పట్ల మన బాధ్యత ఏమిటి?

షేఖ్ గారు! ఒక ఖతీబ్ (ప్రసంగీకుడు) గత జుమా ఖుత్బాలో వారు ప్రక్కన ఉన్న రాష్టంలో మీలాద్ జరుపుకోటానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశాడు. అయితే మేము ఆ రాష్టంలో వలసదారులం, మా బాధ్యత ఏమిటి? (అని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ గారిని ప్రశ్నించడం జరిగింది)

జవాబు:

ఇది సత్యం కాదు, బిద్అత్ అని నీవు స్పష్టపరిచగలిగితే చాలా మంచిది. అల్లాహ్ దయ వల్ల మీలాద్ ఉత్సవం బిద్అత్ అని నిరూపించడం చాలా సులభం. ఎలా అనగా నీవు చాలా సులభంగా ప్రశ్నించగలుగుతావు (ప్రశ్నించి చూడు): మీలాద్ ఉత్సవం ప్రవక్త చేశారా? ఖలీఫాలు చేశారా? సహాబాలు చేశారా? తాబిఈన్లు చేశారా? నలుగురు ఇమాములు చేశారా? అతను గనక ‘అవును’ అంటే, దలీల్ (ప్రూఫ్, రుజువు) చూపించమను. చూపించు దలీల్! అతను గనక ‘దలీల్ లేదు, కాని ప్రజలు చేస్తుంటారు’ అని అంటే, నీవు చెప్పు: ప్రజలు చేసేది దలీల్ కాదు. ప్రజలు ఎన్నో బిద్అత్ పనులు చేస్తున్నారు, వాటికి ఏ దలీల్ లేదు. ప్రవక్త చేయలేదు, ఖలీఫాలు చేయలేదు, సహాబాలు చేయలేదు, తాబిఈన్లు చేయలేదు, ఇమాములు చేయలేదు, అందుకు అది కచ్ఛితంగా అధర్మం, అసత్యం. ఎందుకని వారు (అంటే ప్రవక్త, ఖలీఫాలు, సబాలు…) చేయలేదు, ఇది చేయాలని ప్రజలకు తెలుపలేదు? వారికి దాని గురించి తెలియదా? లేక వారు గర్వాహంకారంతో తిరస్కరించారా? ఈ విధంగా వారితో నీవు మాట్లాడావు, చర్చించావంటే వారిని ఖండించినట్లే


మీలాదున్నబీ ఉత్సవం జరుపుకోవడం ద్వారా ముస్లిముల మధ్య ఐక్యత ఏర్పడుతుందా? 

అల్లాహు అక్బర్! ఇది సరియైన మాట కాదు. దీని వల్ల ప్రజలు మరింత విభజనకు గురి అవుతారు. గుర్తించుకోండి! బిద్అత్ ద్వారా ఐక్యత ఏర్పడడం అసాధ్యం. మరో ముఖ్య విషయం ఏమిటంటే: హృదయాలు కలుపుటకు, ఐక్యతకు అల్లాహ్ తెలుపని విషయాన్ని కనుగొన్నవారై బిద్అత్ ను పుట్టించిన పాపంలో పడతారు. మన మధ్య ఐక్యత, మన హృదయాలు పరస్పరం కలిసి ఉండుటకై అల్లాహ్ ప్రతి రోజు ఐదు పూటల నమాజు విధిగావించాడు. దానిని మనం అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త పద్ధతిలో నెరవేర్చామంటే సరిపోతుంది. దాని ద్వారా హృదయాల్లో ఐక్యత జనిస్తుంది.

(లిఖాఉల్ బాబిల్ మఫ్ తూహ్ 37/12, 1/416, 4/2).


మీలాద్ ఉత్సవం ప్రవక్త జ్ఞాపకార్థం చేయవచ్చా?

మీలాద్ ఉత్సవం ప్రవక్త జ్ఞాపకార్థం చేస్తున్నామని, అందుకు ఇది బిద్అత్ కాదు మంచి విషయం అని కొందరనుకుంటారు, అలాంటి వారికి షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ ఇచ్చిన జవాబు యొక్క సారాంశం మీకు తెలుగులో తెలుపుతున్నాము:

న్యాయంగా ఆలోచించండి, మనం ప్రతి రోజు అయిదు సార్లు ‘అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్’ అని ప్రవక్తను గుర్తు చేయట్లేదా? వుజూ చేసిన ప్రతీ సారి ప్రవక్తను గుర్తు చేయట్లేదా? ప్రతి నమాజులో ‘అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ దహు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు’ అని ప్రవక్తను గుర్తు చేయట్లేదా? ఒక్కమాటలో చెప్పాలంటే ఏ సత్కార్యం చేసినా ఇఖ్లాస్ తో పాటు ముతాబఅ (ప్రవక్త అనుసరణ) తప్పనిసరి, ఇవి రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ సత్కార్యం అల్లాహ్ వద్ద ఆమెదించబడదు. ఇలా ఒక్క రోజులో అనేక సార్లు అల్ హందు లిల్లాహ్! మనం ప్రవక్తను నాలుకతో గుర్తు చేస్తున్నాము, ఆచరణ పరంగా గుర్తు చేస్తున్నాము, అలాంటప్పుడు స్వయం ప్రవక్త, సహాబా, తాబిఈన్, ఇమాములు చేయని, ఇంకా బిద్అత్ లో పరిగణించబడే దానిని సంవత్సరంలో ఒక్కసారి జరుపుకుంటే ఏమిటి లాభం? లాభమేమీ ఉండదు, పాపమే మహా భయంకరంగా ఉంటుంది.

(లిఖాఉల్ బాబిల్ మఫ్ తూహ్ లో ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలు తెలిపారు, ఉదాహరణకు చూడవచ్చు 37/12, 66/10, 131/7లో).


మీలాదున్నబీ ఉత్సవం ప్రవక్త గారి మీద ప్రేమతో  జరుపుకుంటున్నట్టా?

మీలాదున్నబీ ఉత్సవం ప్రవక్త ప్రేమలో జరుపుకుంటాము, ప్రవక్త ప్రేమ గలవారే సన్మార్గంపై ఉన్నారు అని అనేవారు చాలా ముఖ్యమైన ఓ విషయం గమనించాలి. ప్రవక్త ప్రేమ మనపై విధిగా ఉంది, కేవలం విధియే కాదు, మన తల్లిదండ్రుల, సంతానం ప్రేమకంటే ఎక్కువగా ఉండాలి. కాని ప్రవక్త ప్రేమ అంటే ప్రవక్తకు అధిగమించి ముందుకు దూసుకెళ్ళడమా? ఆయన చెప్పనిది, చేయనిది చేసి ప్రేమ అని చాటుకోవడమా? కాదు, కాదు, ముమ్మాటికి కాదు. చదవండి అల్లాహ్ ఈ ఆదేశాన్ని: (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (ఆలి ఇమ్రాన్ 3:31). అల్లాహ్ మరో చోట ఇలా తెలిపాడు: కనుక అల్లాహ్‌ను విశ్వసించండి. సందేశహరుడు, నిరక్షరాసి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి – ఆ ప్రవక్త అల్లాహ్‌ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతన్ని అనుసరించండి. తద్వారా మీరు సన్మార్గం పొందుతారు. (ఆరాఫ్ 7:158).

మీలాద్ ఉత్సవం జరుపుకునే ఓ సోదరా! మరో విషయం గమనించు: నీవు అబు బక్ర్ , ఉమర్ , ఉస్మాన్ ,అలీ మరియు సహాబా (రజియల్లాహు అన్హుం)ల కంటే ఇంకా తాబిఈన్, తబఎ తాబిఈన్ల కంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమిస్తావా? నీవు ‘అవును’ అంటే నీకంటే అబద్ధపుకోరు మరొకడు లేడు. ‘లేదు’ అంటే, వారు చేయనిది నీవు చేయకు, వారు మీలాద్ చేశారా? లేదు, ముమ్మాటికి వారు చేయలేదు. ఇది హిజ్రీ నాల్గవ శతాబ్దంలో మొదలయిన బిద్అత్. ఇంతకంటే ముందున్నవారు చేయలేదంటే, వారు అజ్ఞానులా? లేదా వారు తెలిసి కూడా చేయలేదా? లేదా వారికి ప్రవక్త పట్ల ప్రేమ లేదా? నిజం ఏమిటంటే వారు అజ్ఞానులు కారు, తెలిసి కూడా వ్యతిరేకించలేదు, వారికి అధికమైన ప్రేమ ఉండింది. కాని ప్రవక్త చేయలేదు, చేయమని చెప్పలేదు గనకనే వారు చేయలేదు. అదే మనకు కూడా సరిపోయేది అంటే చేయకపోవడం.

(లిఖాఉల్ బాబిల్ మఫ్ తూహ్ 131/7, మజ్మూ ఫతావా 7/204).

ప్రేమ ఉంది అని మనిష్టమున్నట్లు చేయడం ధర్మం కాదు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇష్టమున్నట్లు చేయడమే నిజమైన ప్రేమ. సహీ హదీసులో వచ్చిన ఒక చిన్న సంఘటన గమనించండి: ఒక సందర్భంలో ప్రవక్త వుజూ చేస్తున్నప్పుడు క్రింద పడుతున్న నీళ్ళను సహాబాలు తమ చేతుల్లో తీసుకుంటూ తమ శరీరాలపై తుడుచు- కోవడం మొదలెట్టారు, ప్రవక్త ఇది చూసి, ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగారు, ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ప్రేమలో’ అని వారన్నారు, అప్పుడు ప్రవక్త చెప్పారు: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మిమ్మల్ని ప్రేమించాలని మీరు కోరుతుంటే: అమానతు హక్కుదారులకు ఇవ్వండి, మాట్లాడినప్పుడు సత్యమే పలకండి, పొరుగువారి పట్ల ఉత్తమంగా మసలుకోండి. (సహీహా: అల్బానీ 2998). ఈ హదీసులో మచ్చుకు మూడు విషయాలు తెలుపబడ్డాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రవక్త చెప్పనిది, చేయనిది చేయకుండా ఉండడమే నిజమైన ప్రేమ.


సంకలనం : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

బిద్అత్ (నూతనాచారం) – Bidah

%d bloggers like this: