మీలాదున్నబీ – సంభాషణ (Milad-un-Nabee)

బిస్మిల్లాహ్
టైటిల్: మీలాదున్నబీ – సంభాషణ – Download

అనువాదకులు : సలీం సాజిద్ అల్ మదనీ
పునర్విచారకులు : అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్ ఖమర్

క్లుప్త వివరణ: ఇది ఇద్దరూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన సంభాషణా రూపంలో రచించబడినది – వారిలో ఒకరు మీలాదున్నబీ వేడుకలను తాతముత్తాతల పరంగా వస్తున్న ఆచారంగా భావిస్తూ ఆచరిస్తున్నవారు, ఇంకొకరు సరైన ఇస్లామీయ జీవన విధానం తెలిసిన వారు. ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే, తమలో చోటుచేసుకున్న బిదాఅత్ లను అంటే అపోహలను దూరం చేసుకుని, ఇస్లాం ధర్మపు అసలైన పద్ధతిలో జీవించే మార్గదర్శకత్వం పొందగలరని ఆశిస్తున్నాం.


బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను

జునైద్: అస్సలాము అలైకుమ్

అబ్దుల్లాహ్: వ అలైకుమ్ అస్సలామ్. ఏంటి పొద్దున ఇలా వచ్చారు? ఇవ్వాళ షాపు దగ్గరికి వెళ్ళలేదా?

జునైద్: ఇవ్వాళ మిలాదున్నబీ కదా! బజార్లో దుకాణాలన్నీ కూడా మూసే ఉంటాయి.

అబ్దుల్లాహ్: అంటే మీరు ఈ రోజు పండుగ జరుపుకుంటున్నారన్న మాట.

జునైద్: ఎందుకని అడిగారు? మీరు జరుపుకోవటం లేదా?

అబ్దుల్లాహ్: ఇస్లాంలో మనకు పండుగలు రెండే కదా!

1) ఈదుల్ ఫిత్ర్
2) ఈదుల్ అజహా

జునైద్: ఈ మూడో పండుగ, ఈదె మీలాదున్నబీ కూడా ఉంది కదా!

అబ్దుల్లాహ్: అలాగా! మరయితే ఈదె మీలాదున్నబీ రోజున మనం ఈద్గాహ్ కు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నామా?

జునైద్: ఈదె మీలాదున్నబీ రోజునయితే ఈద్గాలో చేసే ప్రార్థనలే లేవు కదా?

అబ్దుల్లాహ్: మరి మిగతా రెండు పండుగ రోజుల్లో నమాజులు ఎందుకు చేస్తున్నాం?!

జునైద్: అవి చేయాలి కాబట్టి చేస్తున్నాం.

అబ్దుల్లాహ్: అదే; అవి ఎందుకు చేయాలి అని అడుగుతున్నాను.

జునైద్: ఎందుకంటే ఆ నమాజులు చేయమని మనకు ఆజ్ఞాపించబడింది.

అబ్దుల్లాహ్: ఈదె మీలాద్నుబీ రోజున నమాజు చేయాలని ఆజ్ఞాపించబడలేదా మరి?!

జునైద్: ఆజ్ఞాపించబడలేదేమో! అందుకనేగా ఎవరూ ఆ రోజు ఈద్గాహ్ కు వెళ్ళి నమాజ్ చేయనిది!

అబ్దుల్లాహ్: నమాజు సంగతి పక్కన పెడదాం. అసలు మీలాదున్నబీ జరుపుకోవాలని ఎక్కడైనా రాసి ఉందా?

జునైద్: అలాంటి ఆజ్ఞ ఉన్నట్టు నేనెక్కడా వినలేదు. అలాగని జరుపుకోరాదని కూడా ఎక్కడా లేదుగా?!

అబ్దుల్లాహ్: మరి ఆ రోజు పండుగ నమాజు జరుపుకో రాదని మాత్రం ఎక్కడయినా ఉందా?!

జునైద్: లేదు, అలాంటిదేమీ లేదు.

అబ్దుల్లాహ్: మరి మీరు ఆరోజు పండుగ ప్రార్థన ఎందుకు చేయరు?

జునైద్: అసలు మీరు ఏం చెప్పదలచుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి.

అబ్దుల్లాహ్: నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే ఇస్లాంలో ఈ పండుగకు సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవు. ఒకవేళ ఈ పండుగ గనక నిజంగా ఉండి ఉంటే ఇతర రెండు పండుగల్లాగా ఈ పండుగ రోజు కూడా నమాజు చేయబడేది. హదీసుల్లో దాని ప్రాధాన్యత వివరించబడేది. దాని ఆదేశాల గురించి, నియామాల గురించి దైవప్రవక్త వివరించి ఉండేవారు.

జునైద్: అంటే ఈ పండుగ జరుపుకునేవారు తప్పు చేస్తున్నారని నీ అభిప్రాయమా?

అబ్దుల్లాహ్: ముస్లింల ఆచరణ పేరు ఇస్లాం కాదు, ఖుర్ఆన్ హదీసుల వివరణే ఇస్లాం. ఖుర్ఆన్ హదీసుల ద్వారా రూఢీ కానిది ఇస్లాం ధర్మం కాదు. ఎవరయినా ఖుర్ఆన్ హదీసుల ద్వారా రూఢీ కాని దానిని ధర్మంగా భావిస్తున్నట్లయితే అతను ధర్మంలో కల్పితానికి పాల్పడుతున్నాడన్న మాట. అది ఘోరనేరం. దాన్ని ‘బిద్అత్’ అంటారు. బిద్అత్ లకు దూరంగా ఉండమని దైవ ప్రవక్త (సల్లల్లా హు అలైహి వ సల్లం) తన అనుచర సమాజాన్ని ఎంతగానో హెచ్చరించారు.

జునైద్: దైవప్రవక్త సహచరుల (సహాబాల) వారి శిష్యుల (తాబయీన్ల) కాలంలో ఎవరయినా ఈ పండుగ జరుపుకునేవారా?

అబ్దుల్లాహ్: ప్రసక్తే లేదు. సహాబాల, తాబయీన్ల తర్వాత ఏ ఇమామూ, ఏ హదీసువేత్త కూడా ఈ పండుగ జరుపుకోలేదు. అహెలె-సున్నత్ కు చెందిన నలుగురు ఇమాముల్లో ఎవరూ కూడా అసలు ఈ పేరు సైతం వినలేదు. ఈ కొత్త పోకడ (బిద్అత్) హిజ్రీ  శకం 625 నుంచి మొదలైంది.

జునైద్: అది సరే. నాదొక చిన్న సందేహం. ఒక ముస్లిం తనకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల ఎంతో ప్రేమ ఉందని చెప్పుకుంటూ ఆయన పుట్టిన రోజున, ఆయన గౌరవార్థం ఏ కార్యమూ చేయకుండా గడిపేయటం భావ్యమా చెప్పండి?!

అబ్దుల్లాహ్: అవునండీ, అదే భావ్యం. ఎందుకంటే సహాబాలుగాని, వారి శిష్యులుగాని, సలఫ్ పండితులుగాని ఈ పండుగ జరుపుకున్నట్లు మీకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఇకపోతే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల ప్రేమాభిమానాల సంగతి! ఖుర్ఆన్ గ్రంధాన్ని, దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) చూపిన విధానాన్ని అనుసరించటం ద్వారా అవి వ్యక్తమవు తాయిగాని ఆయన పుట్టిన రోజు పండుగ జరుపుకోవటం ద్వారా కాదు. క్రీ.శ. 625కు పూర్వం గడిచిన ప్రజలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద ప్రేమ లేదంటారా? దైవప్రవక్త ( సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ కాలాన్ని ఉత్తమ కాలంగా అభివర్ణించారు మరి!

జునైద్: క్రైస్తవులు తమ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ పండుగ (ఈద్ మిలాద్) జరుపు కుంటారు. మన ప్రవక్త, ప్రవక్తలందరిలో కెల్లా గొప్పవారు. అలాంటప్పుడు మన ప్రవక్త పుట్టిన రోజును మనం జరుపుకోకుండా ఎలా ఉంటాం?

అబ్దుల్లాహ్: క్రైస్తవులు తమ ప్రవక్తను ‘దేవుడు’, దేవుని కుమారుడు అంటారు. మరి వారికి పోటీగా మనం కూడా మన ప్రవక్తను ‘దేవుడు,’ ‘దేవుని కుమారుడు’ అని అందామా? మీరు విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకనేగా ఖుర్ఆన్, హదీసులు క్రైస్తవుల్ని మార్గ విహీనులుగా ఖరారు చేస్తున్నాయి. వాళ్లంతా తమ ప్రవక్త బోధనలకు వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు. క్రిస్మస్ కూడా క్రైస్తవులు తాము స్వయంగా కల్పించుకున్న ఆచారమే తప్ప ఈసా ప్రవక్త దాని గురించి బోధించలేదు.

జునైద్: మిలాదున్నబీ పండుగ దురాచారమయితే కాదు కదా! అది మంచి ఆచారమే కదా!

అబ్దుల్లాహ్: అది మంచి ఆచారమే అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహ చరులు ఆ పండుగ ఎందుకు జరుపుకోలేదు? ఆ కాలంలో పండుగ జరుపుకోవటానికి వారి దగ్గర డబ్బులు లేకనా? సంవత్సరానికి రెండు పండుగలు జరుపుకునేవారికి ఇంకొక్క పండుగ భారమవుతుందా?

జునైద్: ప్రవక్త సహచరుల కాలంలో జరగని చాలా పనులు ఈ కాలంలో జరుగుతున్నాయి. ఈ రోజు మనం మోటారు వాహనాల్లో, విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం. మరి మీరు ప్రవక్త సహచరుల ఇస్లాంను అనుసరిస్తూ గాడిదలపై, గుర్రాలపైనే స్వారీ చేయవచ్చు కదా!

అబ్దుల్లాహ్: అయ్యా! విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల వల్ల ఇస్లాం కల్పితం కాదు. ధర్మంలో నూతన పోకడల వల్ల ఇస్లాం కల్పితం అవుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచిం చారు: “ఎవరైనా ధర్మంలో ఏదైయిన కొత్త విషయాన్ని సృష్టిస్తే దాన్ని తిరస్కరించాలి” (సహీహ్ బుఖారి, ముస్లిం). దీని గురించి వివరిస్తూ హాఫిజ్ ఇబ్నెహజర్ (రహిమహుల్లాహ్) ఏమన్నారో చూడండి: “నూతన విషయం అంటే ధర్మంలో నూతన విషయం. ధర్మంలో ఎవరైనా నూతన విషయాలను జొప్పిస్తే దాన్ని తిరస్కరించాలన్నమాట” (ఫత్ హుల్ బారీ 5/322). దీని ద్వారా అర్థమయ్యిందేమిటంటే ప్రతి కొత్త విషయం ఖండించదగింది కాదు. ధర్మంతో, ధర్మజ్ఞానంతో సంబంధం ఉన్న వినూత్న కల్పితాలు మాత్రమే ఖండించదగినవి. అలాంటి కొత్త విషయాలను ధర్మంలో భాగంగా, పుణ్యప్రదంగా భావించి చేస్తే అలాంటి నూతన విషయాలన్నీ ఖండించదగినవే. ఇకపోతే ప్రాపంచిక విషయాలంటారా?! వాటి గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు! “ఆయన గుర్రాలనూ, కంచర గాడిదలనూ, గాడిదలనూ సృష్టించాడు. వారు వాటిపై స్వారీ చేయటానికి, అవి మీ జీవితాలకు శోభను చేకూర్చటానికి, ఆయన ఇంకా చాలా వస్తువులను (మీ ప్రయోజనం కొరకు) సృష్టిస్తాడు. వాటిని గురించి మీకసలు తెలియనే తెలియదు.” (సూరయె నహ్లి:8). ఆ కాలంలో ప్రజలకు తెలియని వస్తువులను, వాహనాలను కూడా ఉపయోగించవచ్చని పై ఆయతుల్లో అల్లాహ్ స్వయంగా సెలవిస్తున్నాడు. అంటే ధర్మ సమ్మతమైన రీతిలో విజ్ఞాన శాస్త్రం ద్వారా ఉనికిలోకి వచ్చిన వినూత్న ఆవిష్కరణ లన్నిటినీ మనం ఉపయోగించవచ్చన్నమాట.

జునైద్: మరి సంతానం కలిగినప్పుడు వేడుక ఎందుకు జరుపుకుంటారు?

అబ్దుల్లాహ్: ఎందుకంటే సంతానం కలిగిన ఏడవ రోజున ‘అఖీఖా’ చేయమని షరీఅతు (ఇస్లామీయ ధర్మ శాస్త్రం) స్వయంగా ఆదేశించింది. ఏ పని చేయమని అయితే షరీఅత్ ఆదేశిస్తుందో అది ధర్మమైపోతుంది.

ఇప్పుడు చెప్పండి! రబీవుల్ అవ్వల్ 12వ తేదిన పండుగ జరుపమని షరీఅత్ ఆదేశించిందా? లేక అలా చేయమని ఎవరైనా బోధించి ఉన్నారా? లేదు. షరీఅత్ లో అటువంటి ఆజ్ఞ ఏదీ లేదు, ప్రవక్తగాని ఆయన సహచరులుగాని దీని గురించి బోధించలేదు. అదీగాక సంతానం పుట్టినప్పుడు ఒక్కసారి మాత్రమే వేడుక జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కాదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలై హి వ సల్లం) ప్రతి సంవత్సరం పుడుతూ ఉంటారా ఏమి? సంతానం పుట్టిన తర్వాత ఏదో రోజు వేడుక జరుపుకుంటారు. అదే రోజు వేడుక జరుపుకోవటమనేది ఎక్కడా లేదు. అదీ ఆ ఒక్క రోజు! ప్రతి యేడు కాదు!

జునైద్: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టినప్పుడు అబూలహబ్ ఒక బానిసరాలిని విడుదల చేశాడని చెబుతారు?!

అబ్దుల్లాహ్: చేశాడు.. నిజమే! అది ఎందుకు? తనకు భాతృజుడు కలిగాడన్న ఆనందంతో అతను అలాచేశాడు. అంతేగాని ప్రపంచంలో ఒక గొప్ప ప్రవక్త పుట్టాడని అతను బానిసరాలిని విడుదల చేయలేదు సుమా! అది గుర్తుంచుకోవాలి. అతను చేసిన ఈ పని పుణ్యప్రదమైనదే అయితే తనకు ప్రవక్త పదవీ బాధ్యతలు లభించిన తరువాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మళ్లీ ఎప్పుడన్నా అలా చేయమని ఆదేశించారా? ప్రపంచంలోని ఇతర జనాల్లాగే అబూలహబ్ కూడా తనకు భాతృజుడు కలిగాడని తెలియగానే సంబరపడ్డాడు. ఏ ఇంట పిల్లవాడు పుట్టినా ఆ ఇంటి వారికి ఆనందం కలగటమనేది సహజం. అతను ఆ రోజును పండుగగా తలచి బానిసను విడుదల చేయలేదు. దైవప్రవక్త పదవీ బాధ్యతల పట్ల అబూలహబ్ కు ప్రేమ ఉన్నట్లయితే అతను జీవితాంతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ద్వేషిస్తూ ఉండేవాడు కాదు. అతన్ని, అతని భార్యను శపిస్తూ ఖుర్ఆన్లో ఒక సూరా సాంతం అవతరించేది కాదు. అలాంటప్పుడు అబూలహబ్ చేసినదాన్ని సమర్ధిస్తూ మిలాదున్నబీ పండుగ జరుపుకుంటున్నట్లయితే అది దైవప్రవక్త సంప్రదాయం కాదు, అబూలహబ్ సంప్రదాయం.

జునైద్: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టిన తేది విషయంలో చరిత్రకారుల్లో విభిన్న అభిప్రాయాలున్నాయని చెబుతుంటే విన్నాను. అసలు వాస్తవం ఏమిటి?

అబ్దుల్లాహ్: అల్లాహ్ అభీష్టం మేరకే అలా జరిగింది. ఇస్లాం ధర్మాన్ని స్వచ్ఛంగా ఉంచటానికి, ఇస్లాంలో ఇటువంటి కల్పనలు జరగకుండా ఉండటానికి అల్లాహ్ వారిని ఒకే అభిప్రాయం మీద నిలబడనీయలేదు. ఇప్పటివరకూ మేము చెబుతూ వస్తున్నది కూడా అదే కదా! పూర్వం ప్రజలు ఈ పండుగ జరుపుకునేవారు కాదు. తర్వాత కాలంలోనే ఈ ఆచారం సృష్టించబడింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాని, ఆయన సహచరులు గాని రబీవుల్ అవ్వల్ 12వ తేదిన పండుగ జరుపుకొని ఉన్నట్లయితే ముస్లింలందరూ ఆ తేదిని బాగా గుర్తు పెట్టుకునేవారు. ఇక ఆ తర్వాత ఆ తేది విషయంలో ముస్లింల మధ్య భేదాభిప్రాయమే నెలకొని ఉండేది కాదు.

జునైద్: సరే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టినరోజు పండుగ మొదటి నుంచి జరుపు కోవటం జరగలేదని నేను ఒప్పుకుంటున్నాను. మరి నేటి వైజ్ఞానిక యుగంలోనూ దైవప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వ సల్లం) గారి నిజమైన పుట్టిన తేది కనుగొనబడ లేదేమిటి?

అబ్దుల్లాహ్: చూడండి! ఆయన మరణించిన తేది రబీవుల్ అవ్వల్ 12 అన్న విషయంలో అందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇకపోతే ఆయన పుట్టిన తేది గురించి జరిపిన ఆధునిక పరిశోధనల్లో తేలిందేమిటంటే ఆయన పుట్టింది రబీవుల్ అవ్వల్ 9వ తేదిన. ఖాజీ సులైమాన్ గారి ‘రహ్మతుల్లిల్ ఆలమిన్’ గ్రంధంలో, మౌలానా షిబ్లీ నోమానీ గారి “సీరతున్నబీ” గ్రంథంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి.

జునైద్: అసలు ఈ మిలాదున్నబీ పండుగ ఎక్కణ్ణుంచి ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది?

అబ్దుల్లాహ్: ఇదెక్కడి వింతండి బాబూ? ఒక విషయాన్ని వారు కనిపెట్టి దాని ఆధారాలు మమ్మల్ని అడుగుతున్నారు. ఏమైనా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలం నుంచి – ఇమాములు, హదీసువేత్తలకాలం వరకు ఈ పండుగ ఆనవాళ్లు కూడా చరిత్రలో కనిపించవు. ఈ ఆచారం హిజ్రీ  శకం 625 నుంచి ప్రారంభమైంది. ధర్మజ్ఞానం లేని కొందరు మనుషులు ఈ ఆచారానికి శ్రీకారం చుట్టారు.

జునైద్: నిజంగా ఇది అన్యాయమే కదా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు చేయని పనిని మనమెందుకు చేయాలి?

అబ్దుల్లాహ్: జజాకల్లాహ్ ఖైరా! నేను చెప్పిన విషయం మీరు అర్థం చేసుకున్నందుకు అల్లాహ్  నాకు మేలు చేయాలని కోరుకుంటున్నాను.

జునైద్: మీరు చెప్పిన మాట అర్థమయింది. ఇంకొక చిన్న సందేహం. ఈ పండుగ జరుపుకునేవారు సామాన్యంగా మంచి ఉద్దేశ్యంతోనే చేస్తారు. మరో వైపు హదీసులో ఇలా ఉంది కదా! “ఆచరణలన్నీ సంకల్పం (ఉద్దేశం) పైనే ఆధారపడి ఉంటాయి”.

అబ్దుల్లాహ్: మీకు ఏదైనా సహీహ్ హదీసు చూపించి అది నా ఆచరణలకు భిన్నంగా ఉందని చెబితే అటువంటి సమయంలో వారు “మా మౌల్వీ సాహెబ్ గారు అలాగే చేస్తాము” అని చెప్పి దాటవేస్తారు. ఇప్పుడు మీకు సహీహ్ హదీసు గుర్తొచ్చింది. కాని మేమలా చేయము. ఆ హదీసు నూటికి నూరు పాళ్లు కరెక్టే. కాని బిద్అత్ అంటే ఏమిటో తెలుసా? ఆ ఆచరణ మంచి ఉద్దేశంతోనే చేయబడుతుంది. కాని అసలు ఆ పనిమాత్రం చెడ్డదై ఉంటుంది. స్వీకారానికి అనర్హమై ఉంటుంది. అల్లాహ్ సమక్షంలో ఒక పని స్వీకృతికి నోచుకోవాలంటే ఒకటి: ఆ పని మంచి ఉద్దేశంతో చేయ బడి ఉండాలి. రెండు: అది సున్నత్ కు అనుగుణంగా జరిగి ఉండాలి. ఈ రెండు నియమాల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ ఆచరణ స్వీకరించబడదు. ఖుర్ఆన్ హదీసుల్లో చాలా చోట్ల ఈ విషయం పస్తావించబడింది.

జునైద్: మిలాదున్నబీ పండుగ చేస్తే అసలు ఎటువంటి పుణ్యం లభించదంటారా?

అబ్దుల్లాహ్: అసలు దాని ఉనికే ఇస్లాంలో లేనప్పుడు అది పుణ్యకార్యం ఎలా అవుతుంది చెప్పండి. పైగా ఇదొక బిద్అత్ (కొత్త పోకడ). ధర్మంలో కొత్త పోకడలకు పాల్పడటం సామాన్యమైన నేరం కాదు సుమా! మీరు పుణ్యం ఏమిటి అని అడుగుతున్నారు. అసలు పరలోకంలో ఇటువంటి వారికి కౌసర్ సరస్సు నీళ్ళు కూడా లభించవు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా వారిని తమ దగ్గరకు రానీరు. ఒక హదీసు ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పి ఉన్నారు:

“ప్రళయదినాన నేను నా అనుచర సమాజం వారికి కౌసర్ సరస్సు నుంచి నీళ్లు త్రాపుతూ ఉంటాను. అప్పుడు నా అనుచర సమాజంలోని కొందరిపై దైవదూతలు లాఠీచార్జీ చేస్తుంటారు (వుజూ ప్రభావం మూలంగా వారి కాళ్ళు, చేతులు ప్రకాశిస్తూ ఉంటాయి). వారు ఏం తప్పు చేశారని వాళ్ళని కొడ్తున్నారు అని నేను అడుగుతాను. వాళ్లను నా దగ్గరికి రానీయండి వారు నా అనుచరులే అని అంటాను. అప్పుడు దూతలు సమాధానం ఇస్తారు: “ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీ తదనంతరం వీళ్ళు ధర్మంలో ఎటువంటి మార్పులు చేశారో మీకు తెలియదు”. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వాళ్ళని దూరంగా తరిమేయండి. ఎందుకంటే నా తదనంతరం వాళ్ళు నా ధర్మంలో మార్పులు చేశారు. అందులో కొత్త ఆచారాలు కల్పించారు” అని విసుక్కుంటారు.”

జునైద్: అమ్మో! విషయం చాలా భయంకరమైనదే! మీరు నాకు ఈ హదీసు వినిపించి నా కళ్లు తెరిపించారు. మీరు నాకు సరైన మార్గం చూపినందుకు అల్లాహ్ మీకు మేలు చేయుగాక! ఇన్షా అల్లాహ్ నేను కూడా నా స్నేహితులు, బంధువులందరికీ ఈ విషయం తెలియజేసి వారికి సరైనమార్గం చూపుతాను. వారు అన్ని రకాల బిద్అత్ లను, దురాచారాలను వదలిపెట్టి సరైన మార్గంలో నడిచేలా చేస్తాను.

అబ్దుల్లాహ్: అల్లాహ్ మనందరికి సత్కార్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమిన్

రాసినవారు: మౌలానా అబ్దుల్ ఖుద్దూస్ సలఫీ ముహమ్మద్ సలీమ్ సాజిద్ అల్ మదనీ రియాద్.
పున:పరిశీలించిన వారు: షేఖ్ అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్

%d bloggers like this: