9వ అధ్యాయం – విశ్వాసం “లా ఇలాహ ఇల్లల్లాహ్” సమ్మతితో ప్రారంభం
16.హజ్రత్ ముసయ్యబ్ (రది అల్లాహు అన్హు) కథనం :- అబూతాలిబ్కు మరణ సమయం ఆసన్నమయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని చూడటానికి వచ్చారు. ఆ సమయంలో అబూ తాలిబ్ దగ్గర అబూ జహల్ బిన్ హెషామ్, అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్య బిన్ ముగైరా కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూతాలిబ్ని ఉద్దేశించి “పెదనాన్నా! (ఇప్పటికైనా) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని అంగీకరించండి. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని ‘నేను అల్లాహ్ దగ్గర మీకు అనుకూలంగా సాక్ష్యమిస్తాను” అని అన్నారు.
అబూజహల్, అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యా ఈ మాటలు విని “అబూ తాలిబ్! మీరు అబ్దుల్ ముత్తలిబ్ అనుసరించిన మతాన్ని వదలిపెడ్తారా?” అని అడిగారు. ఆ తరువాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని అంగీకరించవలసిందిగా మాటిమాటికీ అబూతాలిబ్కు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే అబూజహల్, అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యాలు కూడా తమ మాటను అనేకసార్లు ఉద్ఘాటించారు. చివరికి అబూతాలిబ్ వారిద్దరితో “నేను అబ్దుల్ ముత్తలిబ్ మతాన్నే అంటిపెట్టుకొని ఉంటాను” అని చెప్పేశారు. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని ఒప్పుకోవడానికి ఆయన నిరాకరించారు.
అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (పెదనాన్న మీది ప్రేమను చంపుకోలేక) “అల్లాహ్ సాక్షి! అల్లాహ్ నన్ను వారించనంతవరకు నేను మీ పాప క్షమాపణ కోసం ప్రార్ధన చేస్తూ ఉంటాను” అని అన్నారు. అప్పుడు ఈ ఆయత్ అవతరించింది:
مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَن يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ وَلَوْ كَانُوا أُولِي قُرْبَىٰ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمْ أَنَّهُمْ أَصْحَابُ الْجَحِيمِ
“బహు దైవారాధకులు (సత్యాన్ని తిరస్కరించి) నరకానికి అర్హులయ్యారని స్పష్టంగా తెలిసిన తరువాత వారు దగ్గరి బంధువులయినా సరే, వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ను ప్రార్ధించడం దైవప్రవక్తకు, విశ్వాసులకు ఎంత మాత్రం శోభించదు.” (ఖుర్ఆన్ : 9:113)
[సహీహ్ బుఖారీ: 23వ ప్రకరణం – శవ సంస్కారం, 81వ అధ్యాయం – ఇజ్ఖాలల్ ముష్రికు ఇందల్ మౌతి లా ఇలాహ ఇల్లల్లాహ్]
[అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు), vol 2, విశ్వాస ప్రకరణం]
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి
https://teluguislam.net/whatsapp/
ఇతరములు: [విశ్వాసము]