ప్రతి సున్నతును ప్రేమించే వ్యక్తి విన వలసిన మాటలు. ఏ సత్కార్యం సున్నత్ అవుతుంది, ఎప్పుడు సున్నతు అవుతుంది. ఈ ఆరు షరతులు లేకుంటే జాగ్రత్త సుమా! బిద్అత్ (నూతన ఆచారం) లో పడే ప్రమాదం ఉంది..
[ 32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ఆరాధనలలో నూతన కల్పితాలు. దీనిలో ఆరు విధాలున్నాయి.
1. ఆరాధనల యొక్క ప్రధాన నియమాలలో కల్పించే నూతన కార్యాలు.
అంటే; అసలు ఇస్లాం ధర్మంలో లేని నూతన ఆరాధనలు. కొన్ని నఫిల్ నమాజులను లేక ఉపవాసాలను స్వయాన నిర్ధారించుకొని పాటించడం. లేక ధర్మంలో లేని నూతన పండుగలను కల్పించుకోవడం. మీలాద్ షరీఫ్, లేక మేరాజున్నబీ, లేక షాబాన్ నెలలో 15వరోజున జరుపుకొనే పండుగలు. మరియు ఆ రాత్రులను తహజ్జుద్ నమాజ్ మరియు పగలు ఉపవాసం పాటించడం వంటి ఆరాధనలు బిద్అత్ ఆరాధనలే.
నమాజ్ చేయడం మరియు ఉపవాసాలు పాటించడం ధర్మం అయినప్పటికి ఆ రోజులను మరియు ఆ రాత్రులను ప్రత్యేకించి ఆరాధనలు పాటించడం వల్ల బిద్అత్గా భావించబడతాయి.
2. ఆరాధనగా ధర్మం నిర్ణయించిన వస్తువులను చెల్లించడం.
అంటే; ఎవరైన గుర్రాన్ని లేక జింకను ఖుర్బానిగా చెల్లిస్తే స్వీకరించబడదు. ఎందుకంటే ఖుర్బాని కొరకు చెల్లించవలసిన జంతువులు: ఒంటెలు, ఎద్దులు, ఆవులు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు మాత్రమే.
అలాగే “ఫిత్రా దానం” ధాన్యం రూపంలో చెల్లించాలి. దానికి బదులు ఎవరైన డబ్బురూపంలో చెల్లిస్తే సున్నత్ విధానానికి విరుద్ధం.
3.ధర్మపరంగా నిర్ణయించబడిన ఆరాధనలలో పెంచడం లేక తగ్గించడం.
అంటే; అల్లాహ్ అదేశించిన కొన్ని ప్రత్యేక ఆరాధనలలో అదనపు విషయాలను చేర్చటం జుహ్ర్ లేక అస్ర్ లేక ఇషా నమాజ్ 4 రకాతులకు బదులు అయిదు రకాతులుగా హెచ్చించడం లేక తగ్గించడం.
4. ఆరాధనలను నూతన పద్ధతులలో పాటించడం.
అంటే; అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపిన పద్ధతిలో కాకుండా వేరే క్రొత్త పద్ధతులలో ఆరాధించటం. ఉదాహరణకు; అల్లాహ్ నామస్మరణ సామూహికంగా హెచ్చు స్వరంతో మరియు వివిధ రాగాలతో చేయడం, లేక ఆరాధలను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానంకంటే కఠోరమైన విధానంలో చేయడం. అంటే ఎండలో నిలబడి నమాజు పాటించడం. లేక ఆరాధన క్రమాన్ని పాటించకపోవడం. అంటే వుజూ చేసేటప్పుడు ముందు కాళ్ళు కడిగి తరువాత ముఖం కడగటం వంటి క్రమం తప్పే పద్దతులు.
5. ఆరాధన సమయాన్ని తప్పడం.
ఉదాహరణకు: బక్రీద్ పండుగ నమాజ్ తరువాత ఖుర్బాని చెయ్యడం సాంప్రదాయం, కాని ఎవరైనా పండుగ నమాజుకు ముందే ఖుర్బాని చేస్తే అది ఆమోదయోగ్యమైన ఆచారం కాదు.
6,ఇస్లాం కేటాయించిన స్థలంలోనే ఆరాధన పాటించాలి.
అంటే; ఏతెకాఫ్ కొరకు మసీదులోనే బస చేయడం ధర్మం. కాని ఎవరైన స్త్రీలు తమ ఇంట్లో నమాజు పాటించే స్థలంలో ఏతెకాఫ్ చేస్తే ధర్మం కాదు.
లేక హజ్ విధిని నెరవేర్చుటకు అరఫా మైదానంలో విధిగా బసచేయాలి, అరఫా మైదానంలో బస చేయని పక్షంలో అతని హజ్ నెరవేరదు.
ముఖ్య గమనిక: ఆరాధనలు అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం పొందాలంటే, దానిలో రెండు షరతులు తప్పనిసరిగా ఉండాలి.
ఒకటి; “అల్ ఇఖ్లాస్” (చిత్తశుద్ధి) అంటే; ప్రతి కార్యాన్ని అల్లాహ్ ప్రసన్నత పొందాలనే ఆకాంక్షతో చేయడం. కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
“మరియు వారికి ఇచ్చిన ఆదేశం, వారు అల్లాహ్నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్రచిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని…” (సూరతుల్ బయ్యినహ్:5)
ఎవరైనా అల్లాహ్ ప్రసన్నత కాకుండా ఇతరుల మెప్పు పొందుటకై ఆరాధనలు పాటిస్తే అది షిర్క్ అవుతుంది.
రెండవది; అల్లాహ్ మరియు ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) గారి విధేయత.
అంటే; ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసుల వెలుగులోనే మనం ఆరాధనలను పాటించాలి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి విధేయతను మనం సరైన రీతిలో పాటించాలంటే, పైన ఇవ్వబడిన ఆరు షరతులకు అనుగుణంగా మన ఆరాధన విధానాలు ఉండాలి. అప్పుడే మన ఆరాధనలకు అల్లాహ్ వద్ద స్వీకార ముద్ర పడుతుంది.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
బిద్అత్ (నూతనాచారం) – Bidah
- [నూతనాచారం]
- బిద్అత్ (నూతనచారము) – “దైవ ప్రవక్త ధర్మము” పుస్తకము నుండి (ఖలీలుల్ రహ్మాన్)
- కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు– హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)
- ఇస్లాం ధర్మం సంపూర్ణమయింది. కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు [Video]