1705. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ క్రింది సూక్తుల్ని పఠించారు:
“ఆయనే మీ (హృదయ ఫలకం) పై ఈ గ్రంధాన్ని అవతరింపజేసినవాడు. ఇందులో రెండు రకాల సూక్తులున్నాయి. ఒకటి ముహ్కమాత్ (స్పష్టమైనవి). ఇవి గ్రంథానికి పునాదులు వంటివి. రెండు : ముతషాబిహాత్ (అస్పష్టమైనవి). వక్రబుద్ధి కలవారు కలహాలు సృష్టించే ఉద్దేశ్యంతో ఎల్లప్పుడూ అస్పష్టమయిన సూక్తుల వెంటే పడతారు. వాటికి లేనిపోని అర్ధాలు ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. నిజానికి వాటి అసలు భావం ఆల్లాహ్ కి తప్ప మరెవరికీ తెలియదు. దీనికి భిన్నంగా విషయ పరిజ్ఞానంలో స్థిత ప్రజ్ఞులయినవారు ‘మేము వీటిని నమ్ముతున్నాము. ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే’ అని అంటారు. అసలు ఏ విషయం ద్వారానయినా బుద్దిమంతులే గుణపాఠం గ్రహించగలరు” (ఆలి ఇమ్రాన్ : 7)
ఆ తరువాత ఆయన ఈ విధంగా ప్రవచించారు : “మీరెప్పుడయినా దివ్య ఖుర్ఆన్ లోని ఈ అస్పష్టమయిన సూక్తుల వెంటబడి ఆరా తీయడానికి ఎవరైనా ప్రయత్నిచడం చూస్తే, అల్లాహ్ (ఖుర్ఆన్ లో) వారిని గురించే ప్రస్తావించాడని తెలుసుకొని వారికి దూరంగా ఉండండి”.