1480. హజ్రత్ ఉఖ్బా బిన్ ఆమిర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉహుద్ అమరగతుల కోసం ఎనిమిది సంవత్సరాల తరువాత (జనాజా) నమాజ్ చేశారు. చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి అందరికీ వీడ్కోలు చెబుతున్న విధంగా ఈ నమాజు చేశారు. ఆ తరువాత మస్జిద్ లో వేదిక ఎక్కి ఇలా ఉద్బోధించారు –
“నేను సారధిగా, జట్టు నాయకుడిగా మీకు ముందుగా వెళ్తున్నాను. నేను మీకు సాక్షిని, పర్యవేక్షకుడిని. ఇక మీరు నన్ను కౌసర్ సరస్సు దగ్గర కలుసుకుంటారు. నేనిక్కడ నిలబడి కూడా దాన్ని (కౌసర్ సరస్సుని) చూడగలుగుతున్నాను. నేను వెళ్ళిన తరువాత మీరు మళ్ళీ బహుదైవారాధకులై పోతారేమోనన్న భయమిప్పుడు నాకు ఏమాత్రం లేదు. కాని నా భయమల్లా మీరు ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకుపోతారేమోనన్నదే.”