627. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:-
కొందరు అన్సార్ ముస్లింలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి కొంత ధనం అర్ధించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఇచ్చారు. కానీ వారు మళ్ళీ అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండోసారి కూడా ఇచ్చారు. ఇలా ఇస్తూపోయారు, చివరికి ఆయన దగ్గర ఉన్నదంతా హరించుకుపోయింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు :
“నా దగ్గరున్న ధనసంపద (ఎంతైనా) మీ కివ్వడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మీకు ఇవ్వకుండా నేను ఏదీ దాచుకోను. కాని (ఒక విషయం గుర్తుంచుకోండి) దానం అడగకుండా ఉండే వాడికి దేవుడు అలాంటి పరిస్థితి రాకుండా కాపాడుతాడు. నిరపేక్షా వైఖరిని అవలంబించే వాడికి దేవుడు అక్కరలేనంత ప్రసాదిస్తాడు. సహనం వహించే వాడికి సహనశక్తి ప్రసాదిస్తాడు. (దైవానుగ్రహాలలో) సహనానికి మించిన మహాభాగ్యం లేదు.”