దైవ దూతల పట్ల విశ్వాసం – సలీమ్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దైవ దూతల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీమ్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/MiDl95p280k [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాస మూలస్తంభాలలో రెండవది అయిన దైవదూతల పట్ల విశ్వాసం గురించి వివరించబడింది. దైవదూతలు ఎవరనేది, వారి లక్షణాలు, వారి పుట్టుక, వారి సంఖ్య, మరియు వారి శక్తి సామర్థ్యాల గురించి చర్చించబడింది. దైవదూతలు కాంతితో సృష్టించబడినవారని, వారు పాపాలు చేయరని, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను ఆరాధిస్తారని చెప్పబడింది. వారి సంఖ్య అపారమని, ప్రతిరోజు 70,000 మంది దైవదూతలు ‘బైతే మామూర్’లో ఆరాధన చేస్తారని హదీసు ద్వారా వివరించబడింది. చివరగా, జిబ్రీల్, మీకాయీల్, ఇస్రాఫీల్, మల‌కుల్ మౌత్ వంటి కొంతమంది ముఖ్యమైన దైవదూతల పేర్లు, వారి బాధ్యతల గురించి కూడా తెలియజేయబడింది.

అల్ హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని రెండవ ముఖ్యాంశం, దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం.

ఇంతకు ముందు కూడా మనము హదీసు విని ఉన్నాం, జిబ్రీల్ అలైహిస్సలాం, దైవదూత, మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్ గురించి, విశ్వాసం గురించి తెలియజేస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, దైవదూతలను విశ్వసించటం, దైవ గ్రంథాలను విశ్వసించటం, దైవ ప్రవక్తలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి-చెడు విధివ్రాతను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని సమాధానం ఇచ్చినప్పుడు, దైవదూత, “మీరు చెప్పింది నిజమే” అని ధ్రువీకరించారు.

అయితే, ప్రవక్త వారు తెలియజేసిన ఆరు విషయాలలో నుంచి రెండవ విషయం దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

దైవదూతలు ఎవరు? దైవదూతల లక్షణాలు ఏమిటి? దైవదూతల పుట్టుక ఎలా జరిగింది? దైవదూతల సంఖ్య ఎంత? దైవదూతల శక్తి సామర్థ్యాలు ఏమిటి? కొంతమంది దైవదూతల పేర్లు మరియు బాధ్యతలు, ఇవన్నీ విషయాలు ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

ముందుగా, దైవదూతలు ఎవరు అనేది తెలుసుకుందాం. దైవదూతలు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. మానవులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, జంతువులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, పక్షులు ఒక ప్రాణి, జలచరాలు ఒక ప్రాణి. అలాగే, దైవదూతలు కూడా అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. దైవదూతలు మానవుల కంటికి కనిపించరు. అయితే, దైవదూతలు ఉన్నారు అనేది వాస్తవము కాబట్టి, ఆ వాస్తవాన్ని మనము నమ్మాలి, విశ్వసించాలి.

దైవదూతల లక్షణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దైవదూతలు పుణ్యాత్ములు, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను స్మరిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు. అల్లాహ్ ఆదేశాలను అతిక్రమించటం, పాపాలకు పాల్పడటం దైవదూతలకు రాదు. ఖురాన్ గ్రంథం, ఆరవ అధ్యాయం 66వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు:

لَّا يَعْصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ
[లా య’సూనల్లాహ మా అమరహుమ్ వ యఫ్’అలూన మా యు’మరూన్]
అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏ మాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాటిస్తారు, పాలిస్తారు.

చూశారా? అల్లాహ్ వారికి ఇచ్చిన బాధ్యత వారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించటం వారికి రాదు. పాపాలు చేయటం, అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించటం వారికి రానే రాదు.

దైవదూతలకు మానవుల లాంటి లక్షణాలు ఉండవు. ఉదాహరణకు, కామం, ఆకలి, దప్పిక, అలసట, నిద్ర మొదలైన అవసరాలు దైవదూతలకు ఉండవు. ఇవన్నీ మానవులకు ఉంటాయి, కానీ దైవదూతలకు అలాంటి అవసరాలు, లక్షణాలు లేవు అని తెలుపబడింది.

మరి దైవదూతల పుట్టుక ఎలా జరిగింది అని మనం చూచినట్లయితే, దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో సృష్టించాడు. మానవులను దేనితో సృష్టించాడు? మట్టితో మానవులను సృష్టించాడు. ఇది మనం తెలుసుకొని ఉన్నాం ముందు ప్రసంగాలలో. దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో పుట్టించాడు, నూర్, కాంతితో పుట్టించాడు. మనం చూచినట్లయితే, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

خُلِقَتِ الْمَلَائِكَةُ مِنْ نُورٍ
[ఖులిఖతిల్ మలాయికతు మిన్ నూర్]
దైవదూతలు నూర్ అనగా కాంతితో పుట్టించబడ్డారు, సృష్టించబడ్డారు.

దైవదూతలలో ఆడ-మగ అనే లింగభేదము లేదు. కావున, దైవదూతల మధ్య వివాహాలు జరగవు. వివాహాలు జరగవు కాబట్టి, వారిలో వంశపరంపర కూడా లేదు. ఇది దైవదూతల గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం.

ఇక, దైవదూతల సంఖ్య ఎంత ఉంది? మానవులను ఫలానా దేశంలో ఇంతమంది ఉన్నారు, ఫలానా దేశంలో అంతమంది జనాభా ఉన్నారు మానవులు అని లెక్కింపు అనేది మనం చూస్తూ ఉంటాం. మరి, దైవదూతల లెక్కింపు ఎవరైనా చేశారా? దైవదూతలు ఎంతమంది ఉన్నారు? అంటే, మనం చూచినట్లయితే, దైవదూతల సంఖ్య చాలా ఎక్కువ. అది ఎలాగంటే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రెండు హదీసులు మీ ముందర నేను ఉంచుతున్నాను చూడండి.

మేరాజ్ యాత్రలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆకాశాల పైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ‘బైతే మామూర్’ ఒక పుణ్యక్షేత్రము ఆకాశాల పైన ఉంది, అది చూపించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడుతూ, “ఓ దైవ ప్రవక్తా, ఈ బైతే మామూర్‌లో ప్రతి రోజూ 70,000 మంది దైవదూతలు ఆరాధనలో పాల్గొంటారు. ఒక్కసారి ఆ బైతే మామూర్ పుణ్యక్షేత్రంలో ఆరాధన ముగించుకొని ఆ 70,000 మంది దైవదూతలు బయటికి వచ్చేస్తే, మళ్ళీ వారికి అక్కడ వెళ్లి ఆరాధన చేసుకోవడానికి వంతు రాదు. అంటే ప్రళయం వచ్చేస్తుంది గానీ, ఒక్కసారి అక్కడ ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత, ఆ దైవదూతలకు మరొకసారి అక్కడ అవకాశం దొరకదు, వారి వంతు రాదు,” అన్నారు. ఆ ప్రకారంగా ఎంతమంది దైవదూతలు ఉన్నారో మనము ఇట్టే ఆలోచించవచ్చు.

మరొక ఉల్లేఖనంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

مَا فِيهَا مَوْضِعُ أَرْبَعِ أَصَابِعَ إِلَّا وَمَلَكٌ قَائِمٌ أَوْ رَاكِعٌ أَوْ سَاجِدٌ
[మా ఫీహా మౌదివు అర్‌బయి అసాబిఇన్ ఇల్లా వ మలకున్ ఖాయిమున్ అవ్ రాకివున్ అవ్ సాజిదున్]
దీని అర్థం ఏమిటంటే, ఆకాశం దైవదూతలతో నిండి కిటకిటలాడుతున్నది. ప్రతి నాలుగు వ్రేళ్లంతటి స్థానంలో ఒక దైవదూత ఖియాంలో, రుకూలో, సజ్దాలో నిమగ్నమై ఉన్నాడు.

అంటే, ప్రతి బెత్తెడు, నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక్కొక్క దూత నిలబడి ఉన్నాడు ఆకాశం మీద అంటే, ఆకాశం ఎంత పెద్దది? అంత పెద్ద ఆకాశంలో ప్రతి నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక దైవదూత నిలబడి ఉన్నారంటే, మరి వారి సంఖ్య ఎంత? మనం లెక్క చేయలేము. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మనం లెక్క చేయలేము. నక్షత్రాల కంటే బహుశా దైవదూతలు ఎక్కువ ఉన్నారేమో. కాబట్టి, దైవదూతల సరైన లెక్కింపు ఎవరికీ తెలియజేయబడలేదు. వారి లెక్కింపు అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ఈ విషయం కూడా మనము గట్టిగా విశ్వసించాలి, నమ్మాలి.

ఇక, దైవదూతల శక్తి సామర్థ్యాల గురించి మనము చూచినట్లయితే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప గొప్ప శక్తులు ప్రసాదించాడు. దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. కొంతమంది దైవదూతలకు రెండు రెక్కలు ఉంటాయి, మరికొంత మందికి నాలుగు, ఆ తర్వాత అలాగే ఎంత పెద్ద దైవదూత ఉంటే అన్ని ఎక్కువ రెక్కలు వారికి ఉంటాయి అని తెలుపబడింది. మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథం 35వ అధ్యాయం, ఒకటవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

جَاعِلِ ٱلْمَلَٰٓئِكَةِ رُسُلًا أُو۟لِىٓ أَجْنِحَةٍ مَّثْنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَ ۚ يَزِيدُ فِى ٱلْخَلْقِ مَا يَشَآءُ
[జాయిలిల్ మలాయికతి రుసులన్ ఉలీ అజ్నిహతిమ్ మస్నా వ సులాస వ రుబాఅ. యజీదు ఫిల్ ఖల్కి మా యషా]
ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు.

అంటే దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. వారి రెక్కలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతూ పోయాడు అన్న విషయము ఇక్కడ తెలుపబడింది. మనము బుఖారీ, ముస్లింలో ఉన్న ఉల్లేఖనాన్ని చూసినట్లయితే, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “మేరాజ్ యాత్రలో భాగంగా నేను ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో నేను ఆయనను చూశాను.” జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త వారు ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో చూశారు. నిజ స్వరూపంలో చూసినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, జిబ్రీల్ అలైహిస్సలాం వారికి ఆరు వందల రెక్కలు ఉన్నాయి. అల్లాహు అక్బర్! ఆరు వందల రెక్కలు ఆయన ఒక్కరికే ఉన్నాయంటే, ఆయన ఎంత గొప్ప, పెద్ద దైవదూతనో మనము అర్థం చేసుకోవచ్చు.

అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రూపాలు ధరించే శక్తి కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ రూపము ధరించి వచ్చి దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. కొన్ని సందర్భాలలో ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు శిష్యులు, సహాబాలు కూడా జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మానవ రూపంలో చూశారు. అలాంటి ఉదాహరణలు మనము ప్రసంగాలలో విని ఉన్నాం.

అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వేగంగా కదిలే, ప్రయాణించే శక్తి ఇచ్చాడు. దైవదూతలు భూమి ఆకాశాల మధ్య రాకపోకలు జరుపుతూ ఉంటారు. భూమి ఆకాశాల మధ్య ఎంతో, భూమి ఆకాశాల మధ్య ఎంతో దూరము ఉంది. అంత దూరాన్ని వారు క్షణాలలో ఛేదించేస్తూ ఉంటారు. వారు అంత స్పీడుగా, వేగంగా వస్తూ వెళుతూ ఉంటారు. అంత వేగంగా కదిలే శక్తి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతలకు ఇచ్చి ఉన్నాడు. ఇవి దైవదూతల యొక్క లక్షణాలు, దైవదూతల యొక్క శక్తి సామర్థ్యాలు.

ఇక, కొంతమంది దైవదూతల పేర్లు మరియు వారి బాధ్యతల ప్రస్తావన కూడా గ్రంథాలలో వచ్చి ఉంది. అవి తెలుసుకొని ఇన్ షా అల్లాహ్ మాటను ముగిద్దాం.

దైవదూతలలో జిబ్రీల్ అలైహిస్సలాం వారు దైవదూతలందరిలో గొప్పవారు మరియు దైవదూతలందరికీ ఆయన నాయకుడు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. మరి జిబ్రీల్ అలైహిస్సలాం వారి యొక్క బాధ్యత ఏమిటంటే, అల్లాహ్ వద్ద నుండి వాక్యాలు తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. అలాగే, ఇతర బాధ్యతలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చినప్పుడు, ఆ బాధ్యతలు కూడా ఆయన నెరవేర్చేవారు. ముఖ్యంగా, దైవ వాక్యాలు అల్లాహ్ నుండి తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు వినిపించటము ఆయన నిర్వహించిన గొప్ప బాధ్యత.

మీకాయీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూత. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వర్షం కురిపించే బాధ్యత ఇచ్చాడు. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఎక్కడ, ఎంత వర్షం కురిపించమని ఆదేశిస్తాడో, ఆయన ఆ ప్రదేశంలో అంత వర్షం కురిపిస్తూ ఉంటారు.

ఇస్రాఫీల్ అలైహిస్సలాం అని ఒక దైవదూత ఉన్నారు. ఆయన ప్రళయ దినాన అల్లాహ్ ఆదేశంతో శంఖంలో ఊదుతారు. ఆ శంఖం ఊదబడిన తర్వాత ప్రళయం సంభవిస్తుంది.

మల‌కుల్ మౌత్ అనే ఒక దైవదూత ఉన్నారు. మల‌కుల్ మౌత్ దైవదూత ప్రాణాలు హరిస్తూ ఉంటారు.

‘ముఅఖ్ఖిబాత్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవుల రక్షణ కొరకు నియమించబడి ఉన్నారు. మానవులు నిద్రపోతున్నప్పుడు, నిద్ర లేచి నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, స్థానికంగా ఉంటున్నప్పుడు, ఎల్లవేళలా ఆ దైవదూతలు వారి రక్షణలలో, రక్షణలో నియమించబడి ఉన్నారు. అలాంటి దైవదూతలను ‘ముఅఖ్ఖిబాత్’ అంటారు.

అలాగే, ‘ఖజనతుల్ జన్నహ్’, స్వర్గంలో కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారికి ‘ఖజనతుల్ జన్నహ్’ అంటారు. స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశిస్తారో, ఆ ‘ఖజనతుల్ జన్నహ్’ అనే దైవదూతలు స్వర్గవాసులని స్వర్గంలో వచ్చేటప్పుడు సాదరంగా ఆహ్వానిస్తారు.

అలాగే, ‘ఖజనతున్ నార్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు నరకంలో నియమించబడి ఉన్నారు. నరకవాసులు నరకంలో వెళ్ళిపోయిన తర్వాత, ఆ బాధలు భరించక, ఆ నరకంలో ఉన్న దూతలను, “మాకు చావు ఇచ్చేయమని అల్లాహ్‌తో కోరమని” వేడుకుంటారు. ఆ ప్రకారంగా ‘ఖజనతున్ నార్’ అనే కొంతమంది దైవదూతలు నరకంలో నియమించబడి ఉన్నారు.

అలాగే, ‘సయ్యాహీన్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు భూమండలం మొత్తము తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరైనా, ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దైవ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠిస్తూ ఉంటే గనక, ఆ దరూద్ వారు సేకరించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వెళ్ళి వినిపిస్తారు.

అలాగే, ‘కిరామన్ కాతిబీన్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవులు చేసే కర్మలన్నీ లిఖిస్తూ ఉంటారు. మంచి కార్యము, చెడు కార్యము, వారు చేసే పని, వారు మాట్లాడే ప్రతి మాట, వారు నమోదు చేస్తూ ఉంటారు. వారిని ‘కిరామన్ కాతిబీన్’ దైవదూతలు అంటారు.

ఇవి దైవదూతల గురించి మనము తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనమందరికీ సంపూర్ణ విశ్వాసులుగా, ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30622

దేవదూతలు (ملائِكة‎) – మెయిన్ పేజీ
https://teluguislam.net/angels/

దైవ గ్రంథాల పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దైవ గ్రంథాల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/L5UicLobEHE [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో విశ్వాసం యొక్క మూడవ ముఖ్యమైన అంశం గురించి వివరిస్తారు: దైవ గ్రంథాలను విశ్వసించడం. ప్రారంభంలో, అతను అల్లాహ్ యొక్క ఏకత్వం మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. దైవ గ్రంథాలు అంటే ఏమిటి, అవి ఎందుకు అవతరింపబడ్డాయి, మరియు ఖురాన్ ప్రకారం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అనే విషయాలను చర్చిస్తారు. ఈ గ్రంథాలలో ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క సహీఫాలు, తౌరాత్, జబూర్, ఇంజీల్ మరియు ఖురాన్ ఉన్నాయి. ఒక ముస్లింగా ఖురాన్‌ను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని ప్రత్యేకతలను కూడా వివరిస్తారు. చివరిగా, పూర్వ గ్రంథాల పట్ల ఒక ముస్లిం యొక్క వైఖరి ఎలా ఉండాలి, అంటే వాటి అసలు రూపాన్ని విశ్వసించడం, కానీ కాలక్రమేణా వాటిలో జరిగిన మార్పులను గుర్తించడం గురించి వివరిస్తారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, ఈమాన్ ముఖ్యాంశాలలోని మూడవ ముఖ్యాంశం దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

దైవ గ్రంథాలు అంటే ఏమిటి?
మొత్తం ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీద అవతరించబడ్డాయి?
ఖురాన్ లో ఎన్ని గ్రంథాల ప్రస్తావన వచ్చి ఉంది?
మనము ఏ గ్రంథాన్ని అనుసరించాలి?
అలాగే పూర్వపు అవతరింపబడిన గ్రంథాల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి?

ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ మనము ఈ ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం.

ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవ ప్రవక్త జిబ్రయీల్ (అలైహిస్సలాం) వారు మానవ ఆకారంలో వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతూ విశ్వాసం అంటే ఏమిటి ఓ దైవ ప్రవక్త అని అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరు విషయాలను నమ్మటం, విశ్వసించటం ఈమాన్ అంటారు అని ఆరు విషయాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధివ్రాతలను విశ్వసించటం. మొత్తం ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని విశ్వాసం ఈమాన్ అంటారు అని ప్రవక్త వారు తెలియజేశారు కదండీ. అందులో మూడవ విషయం, మూడవ విషయం దైవ గ్రంథాల పట్ల విశ్వాసం అని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ దైవ గ్రంథాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

అసలు ఈ దైవ గ్రంథాలు అని వేటిని అంటారు అంటే, చూడండి మానవులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భూమండలం మీద పంపించిన తర్వాత మానవులు వారి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చిత్తం ప్రకారము జీవించాలి అనేది మానవుల మీద అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక బాధ్యత నిర్ణయించాడు. మరి మానవులకు ఏ పని అల్లాహ్ చిత్తం ప్రకారము జరుగుతుంది మరియు ఏ పని అల్లాహ్ చిత్తానికి విరుద్ధంగా జరుగుతుంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తేనే కదా వారు తెలుసుకుంటారు. లేదంటే మానవులు చేసే ఏ పని అల్లాహ్ కు నచ్చుతున్నది ఏ పని అల్లాహ్ కు నచ్చటం లేదు అనేది వారికి ఎలా తెలుస్తుందండి? అలా తెలియజేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భూమండలంలో నివసిస్తున్న మానవుల్లోనే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో వారి వద్దకు దైవదూత ద్వారా వాక్యాలు పంపించాడు.

ఆ వాక్యాలలో మానవులు ఏ పనులు చేస్తే పుణ్యం అనిపించుకుంటుంది, ఏ పనులు చేస్తే పాపం అనిపించుకుంటుంది, వారు ఏ విధంగా జీవించుకుంటే ప్రశాంతంగా జీవిస్తారు, ఏ విధంగా చేస్తే వారు పాపాలకు, అక్రమాలకు పాల్పడి అశాంతికి గురయ్యి అల్లకల్లోలానికి గురైపోతారు, తర్వాత ఏ పనిలో వారికి పుణ్యము దక్కుతుంది, ఏ పనిలో వారికి పాపము దక్కుతుంది అనే విషయాలన్నీ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వాక్యాలలో ప్రవక్తల వద్దకు పంపించగా, ప్రవక్తలు ఆ దైవ వాక్యాలన్నింటినీ వారి వారి యుగాలలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవో ఆ సౌకర్యాల ప్రకారము వాటన్నింటినీ ఒకచోట భద్రపరిచారు. అది ఆకులు కావచ్చు, చర్మము కావచ్చు, వేరే విషయాలైనా కావచ్చు. అలా భద్రపరచబడిన ఆ దైవ వాక్యాలన్నింటినీ కలిపి దైవ గ్రంథము అంటారు. దైవ గ్రంథంలో మొత్తం దైవ నియమాలు ఉంటాయి, అల్లాహ్ వాక్యాలు ఉంటాయి, ఏది పాపము, ఏది పుణ్యము, ఏది సత్కార్యము అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులో వివరంగా విడమరిచి తెలియజేసి ఉంటాడు.

అయితే మొత్తం ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీదికి అవతరించబడ్డాయి అంటే వాటి సరైన సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. మనకు అటు ఖురాన్ లో గాని, అటు ప్రామాణికమైన హదీసు గ్రంథాలలో కానీ ఎక్కడా కూడా ఎన్ని దైవ గ్రంథాలు భూమండలం మీద అవతరించబడ్డాయి అనేది పూర్తి దైవ గ్రంథాల సంఖ్యా వివరాలు తెలుపబడలేదు.

సరే మరి ఖురాన్ గ్రంథంలో ఎన్ని దైవ గ్రంథాల ప్రస్తావన వచ్చి ఉన్నది అని మనం చూచినట్లయితే, ఖురాన్ లో ఇంచుమించు ఐదు గ్రంథాల గురించి ప్రస్తావన వచ్చి ఉంది.

ఒకటి, సుహుఫు ఇబ్రాహీం – ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన కొన్ని సహీఫాలు, గ్రంథాలు. వాటిని సుహుఫు ఇబ్రాహీం అంటారు. రెండవది తౌరాత్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. మూడవది, జబూర్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. నాలుగవది ఇంజీల్ గ్రంథము. ఈ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) వారికి ఇచ్చి ఉన్నాడు. ఇక ఐదవ గ్రంథము, ఖురాన్ గ్రంథము. ఈ ఖురాన్ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చి ఉన్నాడు. ఖురాన్ లో ఈ ఐదు గ్రంథాల గురించి ప్రస్తావన వచ్చి ఉన్నది.

ఇక హదీసులలో మనం చూచినట్లయితే, ప్రవక్త షీస్ (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహీఫాలు ఇచ్చి ఉన్నాడు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అలాగే ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహీఫాలు ఇచ్చి ఉన్నాడు అని ప్రవక్త వారు మనకు తెలియజేసి ఉన్నారు.

మనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులము కదండీ. మరి మనము ఏ గ్రంథాన్ని అనుసరించాలి అంటే, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులము కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడిన ఖురాన్ గ్రంథాన్ని అనుసరించాలి. ఖురాన్ గ్రంథాన్ని అనుసరించటం మనందరి బాధ్యత.

మరి ఈ ఖురాన్ గ్రంథం యొక్క కొన్ని ప్రత్యేకతలు దృష్టిలో ఉంచుకోండి. ఖురాన్ గ్రంథము చివరి ఆకాశ గ్రంథము, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడింది. ఖురాన్ గ్రంథము అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే అది అవతరింపజేయబడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కల్పితాలకు గురి కాకుండగా సురక్షితంగా ఉంది. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా అది సురక్షితంగానే ఉంటుంది. ఖురాన్ గ్రంథము చదివి, అర్థం చేసుకుని ఆచరించటము ప్రతీ విశ్వాసి యొక్క కర్తవ్యము.

ఖురాన్ అల్లాహ్ వాక్యము కాబట్టి దానిని ప్రేమాభిమానాలతో మనము చదవటంతో పాటు ఎంతో గౌరవించాలి మరియు ఆచరించాలి. నేడు ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతి భాషలన్నింటిలో కూడా ఖురాన్ యొక్క అనువాదము చేయబడి ఉన్నది కాబట్టి విశ్వాసి, మానవుడు ప్రపంచపు ఏ మూలన నివసించిన వాడైనా సరే అతను అతనికి ఏ భాష వస్తుందో ఆ భాషలోనే ఖురాన్ గ్రంథాన్ని చదివి అల్లాహ్ ఏమి తెలియజేస్తున్నాడు మానవులకి అనేది తెలుసుకొని అల్లాహ్ ను విశ్వసించి అల్లాహ్ తెలియజేసిన నియమాల అనుసారంగా జీవించుకోవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది.

ఇక చివర్లో ఖురాన్ కంటే పూర్వము దైవ గ్రంథాలు అవతరించబడ్డాయి కదా, ఆ దైవ గ్రంథాల పట్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. చూడండి, ఖురాన్ కంటే ముందు ప్రవక్తలకు దైవ గ్రంథాలు ఇవ్వబడ్డాయి, ఇది వాస్తవం. ఈసా (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, దావూద్ (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, మూసా (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది, ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారికి గ్రంథం ఇవ్వబడింది కదా. మరి ఆ గ్రంథాల పట్ల మన వైఖరి ఏమిటంటే అవన్నీ దైవ గ్రంథాలు అని మనం విశ్వసించాలి. అలాగే అవి ప్రవక్తల వద్ద పంపబడిన రోజుల్లో సురక్షితంగానే ఉండేవి. వాటిలో మొత్తము దైవ వాక్యాలే ఉండేవి. కానీ ఆ ప్రవక్తలు మరణించిన తర్వాత ఆ ప్రవక్తల అనుచరులు ఆ ఆ గ్రంథాలలో కల్పితాలు చేసేశారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు కాబట్టి, అవి సురక్షితమైన గ్రంథాలు కావు, సురక్షితమైన రూపంలో నేడు ప్రపంచంలో ఎక్కడా నిలబడి లేవు అని మనం తెలుసుకోవాలి. అలాగే విశ్వసించాలి కూడా.

మనం చూచినట్లయితే నేడు తౌరాత్ గ్రంథము అని ఒక గ్రంథం కనిపిస్తుంది. నేడు మనం చూస్తున్న ఆ తౌరాత్ గ్రంథము ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వారికి ఇవ్వబడిన అలనాటి కాలంలో ఉన్న వాక్యాలతో నిండిన గ్రంథము కాదు. అది నేడు మన దగ్గరికి చేరే సరికి చాలా కల్పితాలకు గురైపోయి ఉంది. ఆ విషయాన్ని మనం నమ్మాలి. అలాగే ఇంజీల్ గ్రంథము అని ఒక గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) వారికి ఆ రోజుల్లో ఇవ్వబడిన ఆ ఇంజీల్ గ్రంథము అది అలాగే నేడు భద్రంగా లేదు. మన సమయానికి వచ్చేసరికి అవి చాలా కల్పితాలకు గురై మన దగ్గరికి చేరింది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఒక్క ఖురాన్ గ్రంథము మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలము నుండి నేటి వరకు ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా సురక్షితంగా ఉంది, సురక్షితంగా ఉంటుంది.

ఇక పూర్వపు గ్రంథాలలో కొన్ని విషయాలు ఉన్నాయి కదా, అవి మూడు రకాల విషయాలు. ఒక రకమైన విషయాలు ఏమిటంటే అవి సత్యాలు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ధ్రువీకరించి ఉన్నారు. ఆ విషయాలను మనం అవి సత్యాలు అని ధ్రువీకరించాలి. కొన్ని విషయాలు ఎలాంటివి అంటే అవి అసత్యాలు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారు. అవన్నీ అసత్యాలు అని మనము వాటిని ఖండించాలి. మరి కొన్ని విషయాలు ఎలాంటివి అంటే వాటి గురించి అటు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గాని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గాని మనకు వాటి గురించి ఏమీ తెలియజేయలేదు. అలాంటి విషయాల గురించి మనం కూడా నిశ్శబ్దం పాటించాలి. అవి సత్యము అని ధ్రువీకరించకూడదు, అసత్యాలు అని ఖండించనూ కూడదు. ఎందుకంటే వాటి గురించి సరైన సమాచారము మనకు ఇవ్వబడలేదు కాబట్టి మనము వాటిని ధ్రువీకరించము అలాగే ఖండించము. నిశ్శబ్దం పాటిస్తాము. ఇది ఒక విశ్వాసి పూర్వపు గ్రంథాల పట్ల ఉండవలసిన వైఖరి.

ఇక నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ దైవ గ్రంథాల పట్ల సరైన అవగాహన కలిగి మరియు దైవ గ్రంథాలను ఏ విధంగా అయితే విశ్వసించాలని తెలుపబడిందో ఆ విధంగా విశ్వసించి నడుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

దైవ గ్రంధాలపై విశ్వాసం (మెయిన్ పేజీ):
https://teluguislam.net/belief-in-books/

దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో | టెక్స్ట్]

దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/4EZatwSP2Lo [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి మనం తెలుసుకోబోతున్నాం. దైవ ప్రవక్తలు అంటే ఎవరు, వారి సంఖ్య, ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన 25 మంది ప్రవక్తల పేర్లు, మరియు వారిలో ఐదుగురు ముఖ్యమైన ప్రవక్తల (ఉలుల్ అజ్మ్) గురించి చర్చించబడింది. ప్రవక్తలందరూ అల్లాహ్ చేత ఎన్నుకోబడిన మానవులని, వారు దైవత్వాన్ని పంచుకోరని స్పష్టం చేయబడింది. చివరి ప్రవక్త అయిన ముహమ్మమ్ సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ మానవాళికి మార్గదర్శకుడని, నేటి ప్రజలు ఆయనను అనుసరించాలని ఉద్బోధించబడింది. ప్రవక్తలకు ఇవ్వబడిన మహిమలు (అద్భుతాలు) వారి సొంత శక్తి కాదని, అవి అల్లాహ్ యొక్క శక్తి ద్వారా ప్రదర్శించబడ్డాయని కూడా వివరించబడింది.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
“సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (1:2)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ
దైవప్రవక్తలలో అత్యంత శ్రేష్ఠుడు, దైవసందేశహరులలో అత్యుత్తముడైన మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన అనుచరులందరిపై శాంతి శుభాలు వర్షించుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
“మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

ఆ హదీస్ పదేపదే మనం వింటూ వస్తున్నాము చూడండి, జిబ్రీల్ అలైహిస్సలాం వారు, దైవదూత, మానవ ఆకారంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, విశ్వాసం (ఈమాన్) అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, ఆకాశ గ్రంథాలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధి వ్రాతలను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని తెలియజేసినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, మీరు నిజం చెప్పారు అని ధ్రువీకరించారు.

ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆ ఆరు విషయాలలో నుంచి ఒక విషయం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం కలిగి ఉండటం.. కాబట్టి ఈ ప్రసంగంలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలు దైవ ప్రవక్తల పట్ల తెలుసుకుందాం.

ముందుగా, దైవ ప్రవక్తలు అంటే ఎవరు? అది తెలుసుకుందాం. దైవ ప్రవక్తలు అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచంలో మానవులు ఎప్పుడెప్పుడైతే మార్గభ్రష్టత్వానికి గురయ్యారో, ఆ సందర్భములో మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, మానవులలో నుంచే ఒక భక్తుడిని ఎన్నుకున్నాడు. ఆ భక్తుని వద్దకు దూతల ద్వారా దైవ వాక్యాలు పంపించగా, ఆ దైవ వాక్యాలు దూతల ద్వారా పొందిన ఆ ఎన్నుకోబడిన దైవభక్తులు ప్రజలకు ఆ దైవ వాక్యాలు బోధించారు, వినిపించారు. అల్లాహ్ వైపుకి, అల్లాహ్ మార్గం వైపుకి ప్రజలను ఆహ్వానించారు. ఆ తర్వాత, ఏ విధంగా అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలో ఆచరించి చూపించారు. అలా చేసిన వారిని, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించి, అల్లాహ్ మార్గంలో ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపించిన ఆ అల్లాహ్ తరఫున ఎన్నుకోబడిన భక్తులను దైవ ప్రవక్తలు అంటారు, బోధకులు అంటారు, నబీ, రసూల్ అని అరబీలో కూడా అంటారు.

అయితే, ఈ ప్రపంచంలో ఎంతమంది దైవ ప్రవక్తలు వచ్చారు అంటే, ఈ ప్రపంచంలో ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం వద్ద నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నాటికి ఇంచుమించు 1,24,000 మంది దైవ ప్రవక్తలు వేరేవేరే యుగాలలో, ప్రపంచంలోని భూమండలంలోని వేరేవేరే ప్రదేశాలలో అవసరాన్నికి తగ్గట్టుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిస్తూ వచ్చాడు. మొదటి దైవ ప్రవక్త పేరు ఆదం అలైహిస్సలాం. అంతిమ దైవ ప్రవక్త పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

ఇక, ఖుర్‌ఆన్ గ్రంథంలో ఎంతమంది దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉంది అని మనం చూసినట్లయితే, ధార్మిక పండితులు లెక్కించి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఖుర్‌ఆన్ గ్రంథంలో 25 దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉన్నది. ఎవరు వారు అంటే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయీల్ అలైహిస్సలాం, ఇస్ హాఖ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, ధుల్ కిఫ్ల్ అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, ఇలియాస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం, అల్ యస అలైహిస్సలాం, జకరియ్యా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మొత్తం 25 దైవ ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్ గ్రంథంలో వచ్చి ఉంది. వారి పేర్లన్నీ మీ ముందర నేను ఇప్పుడు వినిపించటం జరిగింది.

ఇక ఈ 1,24,000 ప్రవక్తలలో నుంచి 25 ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్‌లో వచ్చింది కదా, వారందరిలో నుంచి ఐదుగురు దైవ ప్రవక్తలకు, ప్రవక్తలందరి మీద ఒక గౌరవ స్థానం ఇవ్వబడింది. వారిని అరబీ భాషలో “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని బిరుదు ఇవ్వబడింది ప్రత్యేకంగా. తెలుగు భాషలో దానికి అనువాదము సహనమూర్తులు అని, వజ్ర సంకల్పము గల ప్రవక్తలు అని అనువాదం చేసి ఉన్నారు. వజ్ర సంకల్పము గల దైవ ప్రవక్తలు అన్న బిరుదు పొందిన ప్రవక్తలు ఎంతమంది అంటే ఐదు మంది ఉన్నారు. ఆ ఐదు మంది ఎవరంటే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ఐదు మందిని “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని తెలియజేయడం జరిగింది.

ఇక, మనము ఏ ప్రవక్తను అనుసరించాలి? నేడు ప్రపంచంలో ఉన్నవారు, ప్రజలందరూ ఏ ప్రవక్తను అనుసరించాలి అంటే, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ప్రపంచంలో పుట్టిన వారము కాబట్టి, నేడు మన మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే బాధ్యత వేయబడి ఉన్నది. మనమంతా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులు అని అంటారు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనము ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త. ఇక ప్రళయం వరకు మరొక ప్రవక్త ఎవరూ రాజాలరు. ఆయనే చివరి ప్రవక్త. ఎవరైనా నేను ప్రవక్తను అని ఇప్పుడు గానీ, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత గానీ ఎవరైనా ప్రకటన చేస్తే, అతను అబద్ధం పలుకుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ప్రళయం వరకు ప్రవక్తలు రారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఖుర్‌ఆన్‌లో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, ఇంకా అల్లాహ్ తరఫు నుంచి ప్రవక్తలు రారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి ప్రవక్త కాదండి, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే ముందు వచ్చిన ప్రవక్తలు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి, ఒక ప్రదేశానికి మాత్రమే ప్రవక్తలుగా పంపించబడేవారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ప్రపంచానికి ప్రవక్తగా చేసి పంపించాడు కాబట్టి, భూమండలంలో ఏ మూలన నివసిస్తున్న వారైనా సరే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించాలి.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వ ప్రవక్తల నాయకుడిగా చేసి ఉన్నాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శాసనము ఇచ్చి ఉన్నాడు. ఆ శాసనాన్ని మనము అనుసరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము ప్రవక్తగా అభిమానించాలి, ఆయనను గౌరవించాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, అంటే ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకోవాలి. ఏ విషయాలు అయితే ఆయన చేయమని మనకు తెలియజేశారో, అవన్నీ మనము పుణ్యకార్యాలు, సత్కార్యాలు అని తెలుసుకొని వాటిని అమలు పరచాలి. ఏ విషయాల నుండి అయితే ఆయన వారించాడో, ఆగిపోమని తెలియజేశారో, ఆ విషయాల జోలికి వెళ్ళకుండా మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే, ఆయన ఏ విషయాల గురించి అయితే వారించారో అవన్నీ దుష్కార్యాలు, పాపాలు కాబట్టి వాటికి మనము దూరంగా ఉండాలి.

ఇక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వము కొంతమంది ప్రవక్తలు వచ్చారు కదా. ఆ ప్రవక్తల గురించి మన విశ్వాసం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వైఖరి కలిగి ఉండాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, చాలా చక్కగా మరియు జాగ్రత్తగా ఆలోచించండి.

ప్రవక్తలందరూ కూడా మానవులు అని మనము విశ్వసించాలి. అలాగే, ప్రవక్తలందరూ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తరఫున ఎన్నుకోబడిన వారు అని వారందరినీ మనము గౌరవించాలి. అలాగే ప్రవక్తలందరి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతల ద్వారా వాక్యాలు పంపించగా, వారు ఆ వాక్యాలు ప్రజలకు తూచా తప్పకుండా పూర్తిగా వివరించారు. వారు ఆ బాధ్యతలో రవ్వంత కూడా జాప్యము చేయలేదు, పూర్తిగా ఆ కార్యాన్ని వారు నిర్వహించారు అని మనము విశ్వసించాలి.

అలాగే ప్రవక్తలందరూ కూడా మానవులలోనే ఉత్తములు, పుణ్యాత్ములు, సజ్జనులు అని కూడా మనము గౌరవించాలి. అలాగే, ధర్మ ప్రచారపు మార్గంలో ప్రవక్తలు బాధలు ఎదుర్కొన్నారు, విమర్శలు ఎదుర్కొన్నారు, హింసలు భరించారు, చివరికి ప్రాణత్యాగాలు కూడా కొంతమంది ప్రవక్తలు చేశారు. అవన్నీ మనకు చరిత్రలో తెలుపబడి ఉన్నాయి కాబట్టి, వారందరూ గొప్ప దైవభీతిపరులు, భక్తులు మరియు అల్లాహ్ వారికి అప్పగించిన కార్యము కోసము అవమానాలు భరించిన వారు, బాధలు భరించిన వారు, ప్రాణత్యాగాలు చేసిన వారు అని వారి భక్తి గురించి మనము తెలుసుకోవాలి, అలాగే వారిని భక్తులు అని మనం వారిని గౌరవించాలి.

ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు. ప్రవక్తలను కించపరచటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అనుమతి లేదు. ప్రవక్తలందరినీ గౌరవించాలి, ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు.

మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, చివర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్వం వచ్చిన ప్రవక్తలందరి శాసనాలు మన్సూఖ్ చేయబడ్డాయి, అనగా రద్దు చేయబడ్డాయి. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనం మాత్రమే అమలుపరుచుకోవటానికి అనుమతి ఇవ్వబడి ఉంది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకొని విశ్వసించాలి మిత్రులారా.

ఇక చివరిలో, ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చి ఉన్నాడు, ఆ మహిమల గురించి తెలుసుకొని మాటను ముగిద్దాం. చూడండి, ప్రవక్తలలో కొన్ని ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సందర్భానుసారంగా కొన్ని మహిమలు ఇచ్చాడు. ఉదాహరణకు, మూసా అలైహిస్సలాం వారి కాలంలో అలనాటి ప్రజలు మూసా అలైహిస్సలాం వారితో మహిమలు అడిగినప్పుడు, ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు కొన్ని మహిమలు ఇచ్చాడు. అందులో ఒక మహిమ ఏమిటంటే చేతికర్ర. అది కింద పడవేస్తే పెద్ద సర్పంలాగా మారిపోతుంది, మళ్లీ ముట్టుకుంటే అది మామూలు కర్రగా మారిపోతుంది. అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ఒక మహిమ.

అలాగే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మహిమలు ఇచ్చారు. ఆయన పుట్టుకతో గుడ్డివారిగా ఉన్న వారిని స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే, పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్న వారికి కంటి చూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చేసేవాడు. కఠినమైన వ్యాధిగ్రస్తులను కూడా ఆయన స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే వారందరికీ స్వస్థత లభించేది. అంటే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా మహిమలు ఇచ్చాడు. ఆయన అల్లాహ్ తో దుఆ చేయగా చంద్రుడు రెండు ముక్కలయ్యాడు. ఆయన వేళ్ళ మధ్య నుండి నీళ్లు ప్రవహించాయి. ఇలా అవన్నీ ఇన్ షా అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అన్న ప్రసంగంలో మనం వింటే వివరాలు తెలుస్తాయి. కాకపోతే, ఈ మహిమల గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మహిమలు ప్రవక్తల సొంత శక్తులు కానే కావు. వారు అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన శక్తితో అవన్నీ ప్రజల ముందర చేసి చూపించాడు.

ప్రవక్తలు దేవుళ్ళు కారు, దేవునిలో భాగస్థులు కారు, దేవునికి సరిసమానులు కూడా కారు. అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు. ప్రవక్తలు అల్లాహ్ లో భాగము కాదు, అల్లాహ్ కుమారులు కాదు మరియు అల్లాహ్ కు సరిసమానులు కాదు. వారు మానవులు, మానవులలోనే ఉత్తములు, అల్లాహ్ ద్వారా ఎన్నుకోబడిన వారు.

ప్రవక్తలను ప్రతి ప్రవక్తను వారి వారి సమాజం వారు అనుసరించాల్సిన బాధ్యత ఉండేది. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, రండి అల్లాహ్ వైపు, రండి అల్లాహ్ ను విశ్వసించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించండి. అల్లాహ్ మరియు ప్రవక్త చూపించిన మార్గం, ఇస్లాం మార్గంలో వచ్చి చేరండి. మీకు అందరికీ ఇదే నా ఆహ్వానం.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనలందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

وَجَزَاكُمُ اللهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్)
“అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక.”

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
“మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30611

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets/

భూకంపాలు, వరదలు మరియు ఇస్లాం సిద్ధాంతాలు – సలీం జామి’ఈ [వీడియో]

భూకంపాలు, వరదలు మరియు ఇస్లాం సిద్ధాంతాలు – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NClr-TiBAc4 [25 నిముషాలు]

ఈ వీడియోలో తెలుసుకోవలసిన విషయాలు:

1- భూకంపాలు సంభవించేలా చేస్తున్నది ఎవరు ?
2- సునామీలు, భూకంపాలు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తాయి ?
3- అభం శుభం తెలియని పిల్లలు వీటి వల్ల మరణిస్తున్నారు వారు చేసిన పాపం ఏమిటి ?
4- దైవ వాక్యాలు బోధించే పండితులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు వారి నేరం ఏమిటి ?
5- ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక విశ్వాసి గా మన బాధ్యత ఏమిటి ?
6- పదే పదే ఎక్కువగా భూకంపాలు సంభవించటం దేనికి సంకేతం ?
7- పూర్తి భూమి కంపించే రోజు రానుందా ?

“మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది”. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్.
https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

యూదులు, ప్రవక్త ﷺ జీవిత కాలం లో – సలీం జామి’ఈ [వీడియో]

యూదులు, ప్రవక్త (స) జీవిత కాలం లో – సలీం జామి’ఈ [వీడియో]
https://youtu.be/FklHh-21N8E [32 నిముషాలు]

ఖురాన్ & సున్నత్ నుండి దుఆలు – డాక్టర్ సయీద్ అల్ ఖహ్తానీ [పుస్తకం]

అజ్జిక్రు వద్దుఆఉ మినల్ కితాబి వస్సున్న
 రచన/కూర్పు: ఫఖీర్ ఇలల్లాహ్ డాక్టర్ సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ
(1408 హిజరి షాబాన్ లో సవరించబడినది)

[అరబిక్ బుక్ డౌన్లోడ్ లింక్]

విషయ సూచిక

స్త్రీల సహజ రక్త సంభంధిత ఆదేశాలు – ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉసైమీన్ [పుస్తకం]

రచన: ఫజీలతుష్షేక్ అల్లామ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్
(అల్లాహ్ ఆయనను,ఆయన తల్లిదండ్రులను మరియు సమస్తముస్లింలను మన్నించుగాక!)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం.

సమస్త స్తుతులు అల్లాహ్’కు మాత్రమే అంకితం, మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనతో సహాయం అర్ధిస్తున్నాము, ఆయనతో మన్నింపులు వేడుకుంటున్నాము మరియు ఆయన వైపుకు మాత్రమే మరలుతున్నాము!అలాగే మా హృదయాల కీడు నుండి, దుష్కర్మల నుండి అల్లాహ్’తో శరణు వేడుకొంటున్నాము.ఎవరికైతే అల్లాహ్ సన్మార్గం చూపుతాడో అతన్ని ఎవరు మార్గభ్రష్టుడిగా మార్చలేరు, ఎవరినైతే ఆయన మార్గబ్రష్టుడిగా చేస్తాడో అతనికెవరూ సన్మార్గం చూపరు.ఇంకా అల్లాహ్ తప్ప మరో నిజఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను.మరియు ముహమ్మద్ ఆయన యొక్క దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను.ఆయనపై,ఆయన కుటుంబీకులపై,ఆయన సహచరులపై మరియు ప్రళయదినం వరకు ఆయనను అత్యుత్తమంగా అనుసరించే అనుచరసమాజం పై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక!

అమ్మాబాద్! నిస్సందేహంగా స్త్రీలు క్రమంగా సహజ రుతుస్రావం, ఇస్తిహాజా మరియు (నిఫాస్) పురిటిరక్తానికి లోనవుతూ ఉంటారు, ఇది ప్రధాన అంశాలలో ఒకటి కనుక దీనికి సంబంధించిన ఆదేశాలను వివరించడం, అవగాహన కల్పించడం మరియు విజ్ఞులు చెప్పిన విషయాలలో తప్పుడు వివరణల నుండి సరైన జ్ఞానం వైపుకు మార్గదర్శనం చేయడం చాలా అవసరం.కాబట్టి ప్రముఖులు చెప్పిన మాటల్లో సమంజసమైనవి లేక బలహీనమైనవి ఏమిటి అని ఖరారు చేయడంలో మేము ఖుర్ఆను మరియు సున్నతు మార్గాన్ని అవలంభిస్తాము.

  • 1-ఎందుకంటే ఈ రెండు ప్రధాన మూలాలు, వీటి ఆధారంగానే షరీఅతుకు సంబంధించిన ఆదేశాలు, ఆరాధనలు మరియు విధులు దాసులకు నిర్దేశించ బడతాయి.
  • 2-ఈ విధంగా ఖుర్ఆను మరియు సున్నతులను ఆధారం చేసుకోవడం వలన మనసుకు శాంతి చేకూరుతుంది,హృదయాలు తెరుచుకుంటాయి ఆత్మకు తృప్తికలుగుతుంది మరియు బాధ్యతలు తీరుతాయి.
  • 3- కావున ఈ రెండు కాకుండా ఇతర మూలాల కోసం సాక్ష్యం తీసుకోబడింది కానీ వాటినే సాక్ష్యంగా పరిగణించబడదు.

ఎందుకంటే,ప్రామాణిక అభిప్రాయం ప్రకారం, హుజ్జతు (రుజువు) కేవలం అల్లాహ్ వాక్కుయగు ఖుర్ఆను మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలలో మాత్రమే ఉంది, అలాగే పండితులగు సహాబాల తీర్పులలో ఉంది, ఆయితే ఆ తీర్పులు ఖుర్ఆను మరియు సున్నత్ లకు విరుద్ధంగా ఉండకూడదు.అలాగే మరొక సహాబీ అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉండకూడదు ఒకవేళ అది ఖుర్ఆను మరియు సున్నతులకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అప్పుడు ఖుర్ఆను సున్నతులోని ఆదేశాన్ని పాటించడం తప్పనిసరి అవుతుంది.ఒకవేళ ఈ సహాబీ అభిప్రాయానికి మరొక సహాబీ అభిప్రాయం విరుద్ధంగా ఉంటే, అప్పుడు ఈ రెండు అభిప్రాయాల మధ్య తర్జీహ్ అవసరం పడుతుంది ఆ రెండింటిలో ప్రాధాన్యత పర్చబడ్డ రాజిహ్ అభిప్రాయం తీసుకోబడుతుంది

.لقوله تعالى: {فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللّهِ وَالْيَوْمِ الآخِرِ ذَلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلا } [النساء:59].
అల్లాహ్ సెలవిచ్చాడు:{“ఒకవేళ ఏ విషయంలోనయినా మీ మధ్య వివాదం తలెత్తితే దానిని అల్లాహ్ మరియు ప్రవక్త వైపునకు మరల్చండి -మీకు నిజంగానే అల్లాహ్ పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అనివార్యం).ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది”.}(అల్ నిసా:59)

ఇది స్త్రీల సహజ రక్తసంబంధిత విషయాలు మరియు ఆదేశాలను వివరించే చిరుపుస్తకం, వీటిని వివరించే పుస్తకం చాలా అవసరం.

ఈ పుస్తకం క్రింది అధ్యాయాలను కలిగి ఉంది:

‘కలిమా’లోని కోణాలన్నీ మీకు తెలిసి వుండాలి | ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు 

అసలు ‘కలిమా‘ అంటే ఏమిటి? 

లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్” 

అనువాదం: అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్య దైవం లేడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త, సందేశహరులు”. 

– కలిమా అంటే ఇదే! 

మీ విశ్వాసానికి బలం ‘కలిమా’ భావం 

ఇస్లాంలో ప్రవేశించటానికి ఏకైక ద్వారం కలిమా. ‘కలిమా’ను ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా విశ్వాసం బలపడుతుంది. తద్వారా ఇతరులకు కూడా ఇస్లాం గురించి చక్కగా బోధించటానికి వీలవుతుంది. 

ఇస్లాంలో ప్రవేశించటానికి బాప్తిజం (Baptism) అవసరం లేదు 

ఈ పాఠంలో చెప్పబడిన ప్రకారంగా కలిమా (సద్వచనం)ను మనసా, వాచా, కర్మణా పఠించిన వారెవరైనా ముస్లింలు అవుతారు. ముస్లిం కావటానికి మతపెద్దల ద్వారా బాప్తిజము పొందవలసిన అవసరం లేదు. మరే పూజలూ, ఆచారాలు ఇస్లాంలో ప్రవేశించటానికి అవసరం ఉండవు. 

సద్వచనం (కలిమా) సారాంశం 

విశ్వాసానికి (ఈమాన్ కు) మూలమైన “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్” అనే కలిమాలో రెండు అంశాలున్నాయి. 

ఒకటి : లా ఇలాహ ఇల్లల్లాహ్
రెండవది: ముహమ్మదు రసూలుల్లాహ్

‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటే అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్య దైవం లేడని అర్థం. ఇందులో కూడా రెండు భావనలు ఇమిడి ఉన్నాయి. 

1) తిరస్కరణ (మనఃపూర్వకంగా నిరాకరించటం) 
2) ధృవీకరణ (మనసారా ఒప్పుకుంటూ పైకి గట్టిగా చెప్పటం) 

మొదటిది: 

దైవత్వం అనేది మహోన్నతుడైన అల్లాహ్ కు స్వంతం. కాబట్టి ఒక్కడైన అల్లాహ్ ను కాదని వేరెవరికయినా దైవత్వాన్ని ఆపాదించటాన్ని కలిమా (సద్వచనం)లోని ఈ భాగం ఖండిస్తుంది. ఉదాహరణకు: దైవదూతలు, ప్రవక్తలు, పుణ్యపురుషులు, వలీలు, స్వాములు, విగ్రహాలు, ప్రపంచ రాజ్యాధికారులు – వీరెవరూ దేవుళ్ళు కారు. కాబట్టి వీరిలో ఏ ఒక్కరూ ఆరాధనలకు, సృష్టి దాస్యానికి అర్హులు కారు. 

రెండవది : 

కలిమాలోని రెండవ భాగం ప్రకారం అల్లాహ్ మాత్రమే నిజ ఆరాధ్య దైవం. కనుక ఈ మొత్తం కలిమాను అంగీకరించిన వారు అల్లాహ్ యే నిజ ఆరాధ్య దైవమని నమ్మి నడుచుకోవాలి. తమ సమస్త ఆరాధనలను, ఉపాసనలను ఆయనకే ప్రత్యేకించుకోవాలి. దైవత్వంలో అల్లాహ్ కు భాగస్వామిగా వేరొకరిని నిలబెట్టకూడదు. అంటే అల్లాహ్ ఆరాధనతో పాటు ఇతరులను ఆరాధించకూడదు. 

ముహమ్మదుర్రుసూలుల్లాహ్ అంటే… 

“ఓ అల్లాహ్ ! ముహమ్మద్ (సఅసం) నీ సందేశహరుడు” అని నోటితో పలకటమేగాక హృదయపూర్వకంగా ఈ వాక్కును విశ్వసించటం. అంటే అల్లాహ్ ఆజ్ఞలను శిరసావహించిన మీదట, అంతిమ దైవప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన మార్గమే అనుసరణీయమని మీరు మాటిస్తు న్నారు. 

అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు- 

(ఓ ప్రవక్తా) వారికి చెప్పు: 

దివ్యఖుర్ఆన్లోని పై వాక్యాల ద్వారా బోధపడేదేమిటంటే ఇస్లాం ధర్మంలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఇతరత్రా వ్యక్తుల అభిప్రాయాలు అల్లాహ్ గ్రంథానికి (ఖుర్ఆను), దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి, ఆయన సూచించిన చట్టాలకు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు, ఆరాధనా పద్ధతులకు, ప్రవచనాలకు (ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్త సున్నతుకు) అనుగుణంగా ఉంటే స్వీకరిం చాలి. లేదంటే వాటిని త్రోసిపుచ్చాలి. 

‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ మన నుండి కోరేదేమిటి? 

1. జ్ఞానం: అల్లాహ్ యే సిసలైన ఆరాధ్యదైవమని మనం తెలుసుకోవాలి. మన ఆరాధనలు, ఉపాసనలు ఆయనకు మాత్రమే ప్రత్యేకించ బడాలి. అల్లాహ్ తప్ప వేరితర దేవుళ్ళంతా మిథ్య, అసత్యం, బూటకం. వారిలో ఏ ఒక్కరూ లాభంగానీ, నష్టంగానీ కలిగించ లేరన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. 

2. దృఢ నమ్మకం: అల్లాహ్ ఒక్కడే నిజదైవమనీ, దైవత్వం ఆయనకే సొంతమని విశ్వసించటంలో ఎలాంటి సందేహానికి, సంకోచానికి, ఊగిసలాటకు తావు ఉండరాదు. 

3. సమ్మతి, అంగీకారం: ఈ ప్రకటనతో ముడిపడి ఉన్న నియమ నిబంధనలను, షరతులన్నింటినీ ఒప్పుకోవాలి. 

4. సమర్పణ : అల్లాహ్ యే ప్రభువు, పోషకుడనీ, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ తరఫున మానవ మార్గదర్శకత్వం నిమిత్తం పంపబడిన ఆఖరి ప్రవక్త అనే విషయానికి కట్టుబడి ఉంటానని మాట ఇవ్వాలి. ఆ మాటను కడదాకా నిలబెట్టుకోవాలి. దానిపట్ల ఆత్మసమర్పణా భావంతో మసలుకోవాలి. 

5. నిజాయితి: కలిమా కోరే అంశాలను మనస్ఫూర్తిగా, నిజాయితీగా నెరవేర్చాలి. 

6. చిత్తశుద్ధి : అల్లాహ్ ను ఆరాధించే విషయంలో ఎలాంటి కల్మషం, కపటత్వం ఉండకూడదు. నిష్కల్మషమైన మనసుతో ధర్మాన్ని అల్లాహ్ ప్రత్యేకించుకుని మరీ ఆరాధించాలి. అన్ని రకాల ఆరాధనలను కేవలం అల్లాహు మాత్రమే అంకితం చేయాలి. 

7. ప్రేమ: మహోన్నతుడైన అల్లాహు ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, వారికి విధేయులై ఉండే సాటి సోదరులందరినీ, అనగా ముస్లింలందరినీ హృదయపూర్వకంగా ప్రేమించాలి. 

మొత్తమ్మీద అర్థమయ్యేదేమిటంటే అల్లాహ్ కు ఆజ్ఞాబద్ధులై నడుచు కోవాలి. ఆయనకు విధేయత చూపాలి. ఆయన చేయమన్న దానిని చేయాలి. చేయకూడదన్న దానికి దూరంగా ఉండాలి. అప్పుడే మన మనస్సుల్లో విశ్వాస (ఈమాన్) బీజం నాటుకుంటుంది. అల్లాహ్ కు విధేయత చూపటమంటే ఆయన్ని ప్రేమించటం, ఆయన విధించే శిక్షలకు భయపడటం, ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఆశపడటం, క్షమాపణకై ఆయన్ని వేడుకోవటం, మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశాలను, ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించటం. 

అల్లాహ్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు షరీఅతును (ఇస్లామీయ చట్టాలను, ధార్మిక నియమావళిని) ఇచ్చి పంపాడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) షరీఅతు రాకతో గతకాలపు చట్టాలు, ధార్మిక నిబంధనలు అన్నీ రద్దయిపోయాయి. ఇప్పుడు ఈ షరీఅతు అన్ని విధాలుగా గత షరీఅతులన్నిటి కంటే సమున్నతంగా, సంపూర్ణంగా ఉంది. 

ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]
సంకలనం : అబ్దుల్ అజీజ్ సాలెహ్ అష్ షౌమార్,సౌదీఅరేబియా. ఈ పుస్తకం షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారి మూలరచన “అద్దురూసుల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఉమ్మహ్” యొక్క వ్యాఖ్యానంతో కూడుకున్న పుస్తక సంకలనం

రబీ ఉల్ అవ్వల్ నెలలోని కల్పితాచరణలు – ముహమ్మద్ జాకిర్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

రబీ ఉల్ అవ్వల్ నెలలోని కల్పితాచరణలు – ముహమ్మద్ జాకిర్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/hnKnm_DP4eo [34 నిముషాలు]

హృదయాన్ని నిర్మల హృదయంగా మార్చే కార్యాలు – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]

హృదయాన్ని నిర్మల హృదయంగా మార్చే కార్యాలు
(హృదయ ఆచరణలు – 4వ భాగం)

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/EBJjib6Qhmo [10 నిముషాలు]
హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) [2 గంటల 8 నిముషాలు]

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్.

సోదరులారా! ఈరోజు మనము తెలుసుకోబోయే అంశము హృదయ ఆచరణలు నాలుగవ భాగం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన ధార్మిక సోదరీమణులారా! ఈరోజు మనము తెలుసుకోబోయే విషయము మన హృదయాలను ఏ విధంగా మనం నిర్మలమైన హృదయాలుగా, భక్తి కలిగిన హృదయాలుగా, ఉత్తమ హృదయాలుగా మార్చుకోవాలి. ఆ విధంగా మన హృదయాలను మార్చటానికి ఏ ఆచరణ మనము చేయాలి. ఆ ఆచరణలో కొన్ని బయటకు కనిపించే ఆచరణలు ఉన్నాయి మరికొన్ని బయటకు కనిపించని ఆచరణలు ఉన్నాయి. అందులో కొన్ని వాజిబ్ (కచ్చితంగా చేయాల్సిన ఆచరణలు) మరికొన్ని ముస్తహబ్బాత్ (అభిలషణీయమైన ఆచరణలు).

ఇబ్నె ఖయ్యీమ్ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు, అల్లాహ్ యొక్క దాసులు చేసే సత్కార్యాలు అనగా అల్లాహ్ యొక్క దాస్యము మరియు అల్లాహ్ యొక్క విధేయత మొదలైనవి. వాటి ప్రభావం మనిషి జీవితములో కనిపిస్తుంది. ఇలా చెప్పటం జరిగింది:

إِنَّ لِلْحَسَنَةِ نُورًا فِي الْقَلْبِ، وَقُوَّةً فِي الْبَدَنِ، وَضِيَاءً فِي الْوَجْهِ، وَزِيَادَةً فِي الرِّزْقِ، وَمَحَبَّةً فِي قُلُوبِ الْخَلْقِ
ఇన్న లిల్ హసనతి నూరన్ ఫిల్ ఖల్బ్, వ కువ్వతన్ ఫిల్ బదన్, వ జియా అన్ ఫిల్ వజ్హ్, వ జియాదతన్ ఫిర్రిజ్క్, వ మహబ్బతన్ ఫీ ఖలూబిల్ ఖల్క్
ఎవరైతే సత్కార్యాలు చేస్తారో వారి హృదయాలలో అల్లాహ్ ఒక వెలుగును, కాంతిని జనింపజేస్తాడు. వారి శరీరంలో శక్తి మరియు బలము జనిస్తుంది. వారి ముఖవర్చస్సుపై ఒక రకమైన కాంతి వెలుగు జనిస్తుంది. వారి ఉపాధిలో వృద్ధి మరియు శుభము కలుగుతుంది. మరియు ప్రజల హృదయాలలో వారిపై ప్రేమను కలిగించటం జరుగుతుంది.

మరియు అదే విధంగా దుష్కార్యాలు, పాప కార్యాల యొక్క ప్రభావం కూడా మనిషి జీవితంపై పడుతుంది. ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో వారి హృదయం చీకట్లతో నిండిపోతుంది. శరీరం బలహీనపడిపోతుంది. ఉపాధి లాక్కోబడుతుంది. మరియు ప్రజల హృదయాలలో వారిపై ద్వేషాన్ని కలిగించటం జరుగుతుంది.

చూస్తున్నాము కదా సోదరులారా ఏ విధంగా పాప కార్యాల ప్రభావం మన జీవితాలలో ఉంటుందో. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఆయన రక్షణలో ఉంచు గాక ఆమీన్.

ఆ తర్వాత సోదరులారా మన హృదయాలను మనము నిర్మలమైన హృదయాలుగా మార్చుకోవటానికి దోహదపడే మరికొన్ని ఆచరణలలో ఒక మహోన్నత ఆచరణ ఇంతకుముందు ప్రస్తావించబడిన విధంగా అల్లాహ్ యొక్క జిక్ర్ ప్రియులారా. అల్లాహ్ యొక్క నామస్మరణ ప్రియులారా. ఖురాన్ యొక్క పారాయణం ప్రియులారా. ఖురాన్ యొక్క పారాయణంతో మన హృదయాలు సంస్కరించబడతాయి ప్రియులారా.

సలఫ్‌కు చెందిన వారిలో సులైమాన్ అల్ ఖవ్వాస్ రహమహుల్లాహ్ జిక్ర్ కు సంబంధించి ఆయన తెలియజేస్తున్నారు:

لِلْقَلْبِ بِمَنْزِلَةِ الْغِذَاءِ لِلْجَسَدِ
లిల్ ఖల్బి బి మన్జిలతిల్ గిజాయి లిల్ జసద్
అల్లాహ్ స్మరణ హృదయానికి ఎలాంటిది అంటే శరీరానికి ఆహారము లాంటిది.

ఏ విధంగానైతే శరీరానికి ఆహారము లేకపోతే శరీరం బలహీనపడిపోతుందో హృదయానికి అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే హృదయం బలహీనపడిపోతుంది ప్రియులారా. ఆ తర్వాత ఒక వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి ముందు ఎంత మంచి ఆహారం పెట్టినా అది అతని వ్యాధి మూలంగా అందులో అతనికి రుచి అనిపించదు. అదే విధంగా మన హృదయాలలో ప్రాపంచిక భోగ భాగ్యాలు, ప్రాపంచిక ప్రేమ మనం ఉంచుకొని మనము కూడా ఎంత జిక్ర్ చేసినా ఆ జిక్ర్ హృదయానికి మాధుర్యము కలిగించదు ప్రియులారా. ఎందుకంటే పెదవులపై అయితే అల్లాహ్ యొక్క జిక్ర్ చేయబడుతుంది, కానీ హృదయాలలో ప్రాపంచిక వ్యామోహం ఉంది ప్రియులారా. అందుకే సులైమాన్ అల్ ఖవ్వాస్ రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు,

دواء القلب خمسة أشياء
దవావుల్ ఖల్బి ఖమ్సతు అష్ యా
హృదయానికి చికిత్స ఐదు విషయాలలో ఉంది.

ప్రతిదానికి మందు ఉన్నట్లే హృదయానికి కావలసిన మందు ఐదు విషయాలలో ఉంది.

మొదటి విషయం ప్రియులారా:

قِرَاءَةُ الْقُرْآنِ بِالتَّدَبُّرِ
ఖిరాఅతుల్ ఖుర్ఆని బిత్తదబ్బుర్
ఖురాన్ గ్రంథాన్ని ఆలోచిస్తూ ఏకాగ్రతతో అవగాహన చేసుకుంటూ మనం ఖురాన్ గ్రంథాన్ని పఠించాలి.

ఈరోజు సోదరులారా మనం కేవలం ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, దాని అర్థము చేసుకోవటానికి, దాని యొక్క అర్థము తెలుసుకోవటానికి మనం ప్రయత్నము చేయటం లేదు ప్రియులారా. లేదు సోదరులారా మనం ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో పఠిస్తూ కచ్చితంగా దాని యొక్క అర్థము కూడా మనకు తెలిసిన భాషలో తెలుసుకోవటానికి ప్రయత్నము చేయాలి.

ఆ తర్వాత రెండవ విషయం ప్రియులారా:

خَلَاءُ الْبَطْنِ
ఖలావుల్ బతన్
పొట్టలో కాస్త ఖాళీ స్థలం ఉంచాలి.

మనం భుజించాలి, పొట్ట నిండాలి కానీ ప్రియులారా మరీ ఎక్కువగా తిని ఆరాధన చేయలేనంతగా మనం మన పొట్టను నింపకూడదు ప్రియులారా. అల్లాహ్ త’ఆలా ప్రవక్తలతో అంటూ ఉన్నారు,

يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا
యా అయ్యుహర్రుసులు కులూ మినత్ తయ్యిబాతి వ’అమలూ సాలిహా
ఓ ప్రవక్తలారా పరిశుద్ధమైన వాటి నుండి తినండి మరియు సత్కార్యాలు చేయండి.

కాబట్టి సోదరులారా మనం తినాలి కానీ మరీ అంతగా తినకూడదు ఆరాధన చేయలేనంతగా. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మనిషికి అల్లాహ్ యొక్క జ్ఞాపకం వస్తుంది ప్రియులారా, మనిషికి అల్లాహ్ గుర్తుకు వస్తాడు. మనం మన నడుం నిలబడటానికి ఎంత అవసరమో అంత తినాలి ప్రియులారా, తద్వారా మనం అల్లాహ్‌ను ఆరాధించగలగాలి.

ఆ తర్వాత హృదయ చికిత్సకు సంబంధించిన విషయాలలో మూడవ విషయం:

قِيَامُ اللَّيْلِ
ఖియాముల్లైల్
రాత్రి పూట ఆరాధన

ప్రియులారా రాత్రి పూట ఆరాధన, తహజ్జుద్ ఆరాధన, అల్లాహ్ ముందు రాత్రి పూట నిలబడాలి. ఇది కూడా మన హృదయాలకు ఒక మంచి చికిత్స ప్రియులారా.

ఆ తర్వాత సోదరులారా నాలుగవ మాట:

التَّضَرُّعُ عِنْدَ السَّحَرِ
అత్తదర్రువు ఇందస్ సహర్
సహ్రీ సమయములో అల్లాహ్‌ను వేడుకోవాలి

ఇది చాలా గొప్ప విషయం ప్రియులారా అనగా సహ్రీ సమయములో అల్లాహ్‌ను వేడుకోవాలి. సహ్రీ సమయములో అల్లాహ్ ముందు మన విషయాలను అల్లాహ్ ముందు అడగాలి ప్రియులారా. అనేకమందికి ఈ భాగ్యం లభించదు. కొంతమంది పడుకుంటారు, కొంతమంది మేల్కొని ఉన్నా కూడా ఆ సమయాన్ని వృధా చేస్తారు. ఫోన్లో అనవసర విషయాలలో సమయాన్ని వృధా, ఇతరత్రా విషయాలలో కూడా మనం సమయాన్ని వృధా చేస్తాం. లేదు ప్రియులారా, సహ్రీ సమయం కూడా అత్యంత శుభాలతో కూడిన సమయం ప్రియులారా. ఆ సమయములో మనం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను కడు దీనంగా వేడుకోవటానికి అది ఉత్తమ సమయం.

ఆ తర్వాత హృదయ చికిత్సకు సంబంధించిన విషయాలలో ఐదవ మాట ప్రియులారా:

مُجَالَسَةُ الصَّالِحِينَ
ముజాలసతుస్ సాలిహీన్
ఉత్తమ వ్యక్తుల సాంగత్యం

ఉత్తమ వ్యక్తులతో మనం కూర్చోవాలి, ఉత్తమ వ్యక్తులతో గడపాలి ప్రియులారా.

ఈ విధంగా సోదరులారా మన హృదయానికి సంబంధించిన చికిత్సలో ఖురాన్ గ్రంథాన్ని అవగాహనతో అర్థము చేసుకుంటూ మనం పఠించాలి ప్రియులారా. అదే విధంగా పొట్టను కాస్త ఖాళీగా ఉంచాలి ప్రియులారా. ఆ తర్వాత ఖియాముల్లైల్ రాత్రి పూట అల్లాహ్ ముందు మనము నమాజులో నిలబడాలి సోదరులారా. నాలుగవ మాట సహ్రీ సమయములో అల్లాహ్ ముందు మనము కడు దీనంగా వేడుకోవాలి ప్రియులారా. ఐదవ మాట మంచి వారి సాంగత్యములో మనం మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి ప్రియులారా.

ఈ విధంగా మనం మన హృదయానికి చికిత్స చేయగలం, దానిని సంస్కరించుకోగలం, దానిని అల్లాహ్ వైపునకు మరలే హృదయంగా, నిర్మలమైన హృదయంగా తయారు చేసుకోవటంలో ఇన్షా అల్లాహ్ త’ఆలా మనం ముందుకు వెళ్ళగలం ప్రియులారా.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక, మనందరికీ అల్లాహ్ త’ఆలా మనల్ని మనం సంస్కరించుకునే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

హృదయ ఆరాధనలు:
https://teluguislam.net/ibadah-of-heart/

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb