అల్లాహ్ కారుణ్య చాయలోకి ఆ ఏడుగురు! [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ కారుణ్య చాయలోకి ఆ ఏడుగురు!
https://youtu.be/Fp0v2wzd9M0 [13 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం గురించి మరియు ఆ కఠినమైన రోజున అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయలో (అర్ష్ నీడలో) ఆశ్రయం పొందే ఏడుగురు వ్యక్తుల గురించి వివరించబడింది. ఆ రోజు యొక్క తీవ్రత ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వర్ణించబడింది. ఆ ఏడుగురు అదృష్టవంతులు: 1. న్యాయమైన పాలకుడు, 2. అల్లాహ్ ఆరాధనలో యవ్వనాన్ని గడిపిన యువకుడు, 3. హృదయం మస్జిద్‌లకు అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి, 4. అల్లాహ్ కొరకు ఒకరినొకరు ప్రేమించుకుని, ఆయన కొరకే కలిసి, ఆయన కొరకే విడిపోయే ఇద్దరు వ్యక్తులు, 5. ఉన్నతమైన మరియు అందమైన స్త్రీ పాపానికి ఆహ్వానించినప్పుడు “నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను” అని చెప్పే వ్యక్తి, 6. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా గోప్యంగా దానం చేసే వ్యక్తి, 7. ఏకాంతంలో అల్లాహ్‌ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి.

إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బ’అద, అమ్మా బ’అద్)

అభిమాన సోదరులారా! కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)

ఈరోజు మనం ప్రళయ భీభత్సం, ఆ రోజున అల్లాహ్ కారుణ్య ఛాయలో ఉంచబడే ఆ ఏడుగురి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ప్రియ వీక్షకుల్లారా! ప్రళయం అనేది ఒక భయంకరమైన విషయం. అది చాలా కఠినమైన రోజు. ఆ రోజు సర్వాధిపతి అయిన అల్లాహ్ సమక్షములో ప్రతి ఒక్కరూ హాజరు కావలసి ఉన్నది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ ముతఫ్ఫిఫీన్‌లో ఇలా తెలియజేశాడు,

لِيَوْمٍ عَظِيمٍ
(లి యౌమిన్ అజీమ్)
ఒక మహాదినాన… (83:5)

يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ
(యౌమ యఖూమున్నాసు లి రబ్బిల్ ఆలమీన్)
ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు. (83:6)

ప్రజలందరూ సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సమక్షంలో హాజరుపడతారు. ఆ ప్రళయం గురించి, ఆ రోజు ఏ విధంగా భయంకరమైనదిగా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుంది, ప్రజలు వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, శారీరక స్థితి ఎలా ఉంటుంది, ఎటువంటి భయాందోళనలకు గురిఅయి ఉంటారు అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయం యొక్క కఠినత గురించి సూరతుల్ హజ్‌లో తెలియజేశాడు.

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ
(యా అయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. (22:1)

إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ
(ఇన్న జల్ జలతస్సా’అతి షై ఉన్ అజీమ్)
నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం.(22:1)

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ
(యౌమ తరౌనహా తద్ హలు కుల్లు ముర్ది’అతిన్ అమ్మా అర్ద’అత్)
ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. (22:2)

وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا
(వ తద’ఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా)
గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. (22:2)

وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ
(వ తరన్నాస సుకారా వమాహుమ్ బి సుకారా వలాకిన్న అదాబల్లాహి షదీద్)
ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)

ఈ ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయం యొక్క భయంకరమైన ఆ స్థితిని తెలియపరిచాడు. అంటే, ఆ రోజు ఎటువంటి భయంకరమైన రోజు అంటే తల్లి తన బిడ్డను, పాలు తాగే బిడ్డను, పసికందును మరిచిపోతుంది అంటే ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది. అలాగే గర్భిణి యొక్క గర్భం పోతుంది అంటే ఆ భయం ఏ విధంగా ఉంటుంది. మానవులు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు అంటే వారు ఏమైనా మద్యం సేవించారా? లేదు. కానీ ఆ భయం వలన వారి స్థితి, వారి ముఖాలు, వారి శరీరం ఎలా ఉంటుంది అంటే వారు మత్తులో ఉన్నారు అనిపిస్తుంది కానీ, వాస్తవానికి వారు మత్తులో ఉండరు, అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినమైనది.

అభిమాన సోదరులారా, అటువంటి ప్రళయం రోజు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ పర్వతాలను ఎగరేస్తాడు. గుట్టలు, వృక్షాలు, చెట్లు, భవనాలు, ఇళ్లు ఏవీ ఉండవు. మరి నీడ? నీడ ఉండదు. ఈరోజు మనం ఒక మంచి ఇంట్లో ఉంటూ, కరెంట్ ఉంటూ, కేవలం ఫ్యాన్ ఉంటే సరిపోవటం లేదు, ఏసీ కావాలి. కాకపోతే ఆ రోజు ఇల్లు లేదు. ఎటువంటి నీడా ఉండదు. అల్లాహ్ కారుణ్య నీడ తప్ప. అల్లాహ్ అర్ష్ నీడ తప్ప. ఏ నీడా ఉండదు. మరి ఆ నీడ, అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయలో ఎవరు ఉంటారు? ఆ నీడ ఎవరికి దక్కుతుంది? అనే విషయం గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో సెలవిచ్చారు. అది బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది.

سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لا ظِلَّ إِلا ظِلُّهُ
(సబ్’అతున్ యుదిల్లు హుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహు)
ఆ రోజున, ఆయన నీడ తప్ప మరే నీడ లేని రోజున ఏడు రకాల మనుషులకు అల్లాహ్ తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.

కేవలం ఏడు రకాల కోవకు చెందిన వారు మాత్రమే ప్రళయ దినాన, ఆ భయంకర రోజున, ఎటువంటి నీడ ఉండదు అల్లాహ్ నీడ తప్ప, ఆ అల్లాహ్ యొక్క నీడలో ఏడు రకాల మనుషులకు ఆ నీడ దక్కుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరు? తెలుసుకుందాం.

  1. న్యాయమైన పాలకుడు

    إِمَامٌ عَادِلٌ
    (ఇమామున్ ఆదిలున్)
    న్యాయం చేసే నాయకుడు

    న్యాయం చేసే పరిపాలకుడు, న్యాయం చేసే నాయకుడు. దేశానికి నాయకుడు కావచ్చు, రాజు కావచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ తన తమ పరిధిలో ఇది వర్తిస్తుంది న్యాయం చేసేది. అమ్మ, తల్లి అనేది తన పరిధిలో, నాన్న అనేవాడు తన పరిధిలో, ప్రిన్సిపాల్ తన పరిధిలో, యాజమాన్యం తన పరిధిలో ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఈ దీనికి వర్తిస్తారు, న్యాయం చేసేవారు. న్యాయం చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు. మొదటి వారు.
  2. అల్లాహ్ ఆరాధనలో యవ్వనాన్ని గడిపిన యువకుడు

    وَشَابٌّ نَشَأَ فِي عِبَادَةِ اللَّهِ تَعَالَى
    (వ షాబ్బున్ నష’అ ఫీ ఇబాదతిల్లాహి త’ఆలా)
    యవ్వనంలో, యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపే యువకుడు.

    ఏ యువకుడైతే తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపాడో, అటువంటి యువకులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు. వృద్ధాప్యంలో మనిషికి కోరికలు ఎక్కువగా ఉండవు, ఎముకలు బలహీనమైపోతాయి, దాదాపు ఆ వయసులో ఎక్కువ కాంక్షలు ఉండవు కాబట్టి అది ఏదీ గొప్పతనం కాదు వృద్ధాప్యంలో ఎక్కువగా పుణ్యాలు చేయటము. మంచి విషయమే, అది గొప్ప విషయం కాదు యువకులతో పోల్చుకుంటే. అందుకు ప్రత్యేకంగా యువకుల గురించి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, యవ్వనాన్ని అల్లాహ్ మార్గంలో, యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. అటువంటి యువకులకు ప్రళయ దినాన అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయ దక్కుతుంది.
  3. హృదయం మస్జిద్‌లకు అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి

    وَرَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
    (వ రజులున్ ఖల్బుహు ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్)
    మనసంతా మస్జిద్‌లోనే ఉండే వ్యక్తి.

    మనసంతా మస్జిద్‌లోనే ఉండే వ్యక్తి అంటే దానికి అర్థము, పనులు, ఉద్యోగాలు వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి మస్జిద్‌లోనే ఉండిపోవాలా అని కాదు. మనసంతా మస్జిద్‌లోనే ఉండే మనిషి అంటే, వ్యాపారం చేస్తూ, వ్యవసాయం చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ మనసు మాత్రం ఒక నమాజ్ తర్వాత ఇంకో నమాజ్ గురించి ఆలోచనలో ఉంటుంది. మనసు ఏముంటుంది? అసర్ నమాజ్ ఎప్పుడు అవుతుంది? అసర్ నమాజ్ చేసుకుంటే మగ్రిబ్ నమాజ్ సమయం గురించి, మగ్రిబ్ అయిపోతే ఇషా గురించి. ఈ విధంగా ఒక నమాజ్ అయిన తర్వాత ఇంకో నమాజ్ గురించి ఎదురు చూస్తాడు. మనసులో అదే ఆలోచన ఉంటుంది. ఇది దానికి అర్థం, మనసంతా మస్జిద్‌లో ఉండే మనిషి.
  4. అల్లాహ్ కొరకు ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు

    وَرَجُلانِ تَحَابَّا فِي اللَّهِ اجْتَمَعَا عَلَيْهِ وَتَفَرَّقَا عَلَيْهِ
    (రజులాని తహాబ్బా ఫిల్లాహిజ్తమ’ఆ అలైహి వ తఫర్రఖా అలైهِ)
    ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే, పరస్పరం కలుసుకుంటే అల్లాహ్ కోసమే కలుసుకుంటారు. వారిద్దరూ విడిపోతే అల్లాహ్ కోసమే విడిపోతారు.

    అంటే స్వార్థం ఉండదు. స్వార్థం లేకుండా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం. కలిసినా అల్లాహ్ ప్రసన్నత, విడిపోయినా అల్లాహ్ ప్రసన్నత.
  5. పాపానికి ఆహ్వానిస్తే తిరస్కరించే వ్యక్తి

    అందం, అంతస్తు గల స్త్రీ చెడు వైపుకి ఆహ్వానిస్తే:

    إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
    (ఇన్నీ అఖఫుల్లాహ రబ్బల్ ఆలమీన్)
    “నేను సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతున్నాను” అని చెప్పేవాడు.

    ఈ చెడు కార్యానికి పాల్పడను, వ్యభిచారం చేయను, నాకు అల్లాహ్ భయం ఉంది అని చెప్పేవాడు. ఇంత అవకాశం వచ్చాక, అందం, అంతస్తు రెండూ ఉన్న స్త్రీ, ఒకవైపు అందం ఉంది, ఇంకోవైపు అంతస్తు ఉంది, అటువంటి స్త్రీ స్వయంగా ఆహ్వానిస్తుంది చెడు వైపుకి. అటువంటి సమయంలో, “ఇన్నీ అఖాఫుల్లాహ్, నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను” అనే చెప్పే వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.
  6. గోప్యంగా దానం చేసే వ్యక్తి

    رَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةٍ فَأَخْفَاهَا حَتَّى لا تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ
    (రజులున్ తసద్దఖ బి సదఖతిన్ ఫ అఖ్ఫాహా హత్తా లా త’అలమ షిమాలుహు మా తున్ఫిఖు యమీనుహు)
    గోప్యంగా దానం చేసేవాడు. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియదు.

    అంత రహస్యంగా, గోప్యంగా దానం చేసే వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు. కారుణ్య ఛాయ దక్కుతుంది. అంటే, ప్రదర్శనా బుద్ధితో కాకుండా, ప్రజల మెప్పు కోసం కాకుండా, కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే దానం చేసే వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయ దినాన తన నీడను ప్రసాదిస్తాడు.
  7. ఏకాంతంలో అల్లాహ్‌ను స్మరించి ఏడ్చే వ్యక్తి

    وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ
    (రజులున్ దకరల్లాహ ఖాలియన్ ఫ ఫాదత్ ఐనాహు)
    ఏకాంతములో అల్లాహ్‌ను గుర్తు చేసుకుని కన్నీరు కార్చే వ్యక్తి.

    ఏకాంతంలో ఉన్నారు, అతను ఎవరికీ చూడటం లేదు, ఎవరూ అతనికీ చూడటం లేదు, ఆ స్థితే లేదు. ఏకాంతంలో ఉన్నాడు, అల్లాహ్ గుర్తుకు వచ్చాడు. అల్లాహ్ శిక్ష గుర్తుకు వచ్చింది, అల్లాహ్ వరాలు గుర్తుకు వచ్చాయి, తన వాస్తవం ఏమిటో తెలుసుకున్నాడు, కుమిలిపోతూ ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అటువంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.

ప్రియ వీక్షకుల్లారా, చివర్లో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ మనల్ని ప్రళయ దినాన ఈ ఏడుగురిలో మనకి కూడా చేర్పించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42341