(నఫిల్) స్వచ్చంద దానాల రకాలు! – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

(నఫిల్) స్వచ్చంద దానాల రకాలు!
https://youtu.be/2WVvL9Ip-l4 [11 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నఫిల్ సదకా (ఐచ్ఛిక దాతృత్వం) యొక్క వివిధ రూపాలను ఇస్లాంలో వివరించబడ్డాయి. సదకా కేవలం ధనంతో ఇచ్చేది మాత్రమే కాదని, ప్రతి మంచి పని ఒక సదకా అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీస్ ద్వారా స్పష్టం చేయబడింది. చిరునవ్వుతో పలకరించడం, దారి చూపడం, అల్లాహ్ ను స్మరించడం (తస్బీహ్, తహమీద్, తక్బీర్), మంచిని ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం వంటివి కూడా సదకాగా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి తన కుటుంబంపై ఖర్చు చేయడం కూడా సదకా అని చెప్పబడింది. చివరగా, వ్యక్తి మరణించిన తర్వాత కూడా పుణ్యం లభించే మూడు రకాల సదకాల గురించి వివరించబడింది: సదకా-ఎ-జారియా (నిరంతర దానధర్మం), ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం, మరియు తల్లిదండ్రుల కోసం ప్రార్థించే సజ్జనులైన సంతానం.

إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అ దహు, అమ్మా బ’అద్)
నిశ్చయంగా, సర్వస్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్ కే శోభాయమానం. ఆయన తర్వాత ఏ ప్రవక్తా రారో, అట్టి ప్రవక్తపై అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు శాంతి కురియుగాక. ఆ తర్వాత.

ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ సోదరులారా, మనం గత ఎపిసోడ్లలో జకాత్ గురించి తెలుసుకుందాం.

ఈరోజు, నఫిల్ సదకా రకాలు తెలుసుకుందాం. సదకా అంటే కేవలం ధనంతో, డబ్బుతో కూడుకున్నది మాత్రమే కాదు అని మనకు తెలుస్తుంది, బోధపడుతుంది, మనము ఖురాన్ మరియు హదీస్ గమనిస్తే. నఫిల్ సదకా చాలా రకాలు ఉన్నాయి. ధనంలో కూడా ఉన్నాయి, ధనం కాకపోయినా. ఉదాహరణకు, బుఖారీ, ముస్లింలో ఓ హదీస్ ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
(కుల్లు మ’అరూఫిన్ సదఖహ్)
ప్రతి మంచి పని ఒక సదకా (దానం).

మంచి పని ఏమిటి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చిరునవ్వుతో మాట్లాడినా అది మంచి పని ఇస్లాం దృష్టిలో, అది కూడా సదకా. ఒక వ్యక్తికి దారి చూపినా సదకా, మంచి పని.

ఒక హదీస్ లో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తక్బీర్, తస్బీహ్, తహమీద్, తహ్లీల్ ఇవి కూడా సదకా అని చెప్పారు. అంటే, అల్లాహు అక్బర్ అని పలకటం, సుబ్ హానల్లాహ్ అని పఠించటం, అల్ హమ్దులిల్లాహ్ అని అనటం, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకటం, అస్తగ్ ఫిరుల్లాహ్ అని చెప్పటం కూడా సదకా. అల్లాహు అక్బర్ ఒక సదకా. ఒక్కసారి సుబ్ హానల్లాహ్ అంటే ఒక సదకా. ఒక్కసారి అల్ హమ్దులిల్లాహ్ అంటే ఒక్క సదకా. ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఒక్క సదకా. ఒక్కసారి అస్తగ్ ఫిరుల్లాహ్ అంటే ఒక్క సదకా.

ఇది సామాన్యంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ పలికినా, చెప్పినా మాట ఇది. కాకపోతే రమజాన్ మాసం ప్రత్యేకమైన మాసం. రమదాన్ మాసంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతి పుణ్యానికి ఎన్నో రెట్లు పెంచి, అధికం చేసి అల్లాహ్ ప్రసాదిస్తాడు. కావున దీన్ని మనము మహాభాగ్యంగా భావించుకొని ఈ రమదాన్ మాసంలో ప్రతి వ్యక్తి దగ్గర డబ్బు ఉండదు. డబ్బు రూపంలో, బంగారం రూపంలో, వెండి రూపంలో, ధన రూపంలో, భూమి రూపంలో, వ్యాపార రూపంలో జకాత్ చెల్లించడానికి ప్రతి వ్యక్తి అర్హుడు కాకపోవచ్చు. కాకపోతే ఈ రూపాలలో, జిక్ర్ ద్వారా సదకా, దీనిని మనము మహాభాగ్యంగా భావించుకొని ఈ మాసంలో అత్యధికంగా మనము ఈ రకానికి సంబంధించిన సదకా చేసుకోవాలి.

అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

اَلأَمْرُ بِالْمَعْرُوفِ وَالنَّهْيُ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ
(అల్ అమ్ రు బిల్ మ’అరూఫ్ వ నహ్యు అనిల్ మున్కర్ సదఖహ్)
మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడు నుండి నివారించడం కూడా సదకా.

మంచిని ఆజ్ఞాపించటం, చెడుని ఆపటం కూడా సదకా. మంచి చేయమని చెప్పటం కూడా సదకా అవుతుంది. చెడుని ఆపటం కూడా సదకా అవుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.

అభిమాన సోదరులారా, ఓ హదీస్ లో ఇలా ఉంది:

إِمَاطَتُكَ الْحَجَرَ وَالشَّوْكَ وَالْعَظْمَ عَنِ الطَّرِيقِ لَكَ صَدَقَةٌ
(ఇమాతతుకల్ హజర్ వష్షౌక్ వల్ అజ్మ్ అనిత్తరీఖి సదఖతున్ లక్)
దారి నుండి రాయిని, ముల్లును మరియు ఎముకను తొలగించడం నీ కోసం సదకా అవుతుంది.

దారి నుండి రాళ్లను, ఆ దారి నుండి ముళ్ళను, అలాగే ఎముకల్ని, దారి నుండి తొలగించడం నీ కోసం సదకా అవుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అంధులకి దారి చూపటం, అలాగే చెవిటి, మూగ వారికి విషయం బోధపరచడం కూడా సదకా అవుతుంది.

అలాగే ఏదైనా ప్రాణికి నీరు త్రాపించడం కూడా సదకా. కష్టాల్లో, అవసరాల్లో ఉన్న వారికి సహాయపడటం సదకా. చివరికి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

نَفَقَةُ الرَّجُلِ عَلَى أَهْلِهِ صَدَقَةٌ
(నఫఖతుర్రజులి అలా అహ్లిహీ సదఖహ్)
ఒక వ్యక్తి తన కుటుంబంపై చేసే ఖర్చు కూడా సదకా.

వ్యక్తి తన ఇంటి వారిని, భార్యా పిల్లలను పోషించటం కూడా సదకా అన్నారు. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ ఆదేశానుసారం, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారం, ఆయన సున్నత్ ని అనుసరిస్తూ ఎవరైతే చిత్తశుద్ధితో, మంచి సంకల్పంతో దైవ ప్రసన్నత కోసం భార్యను పోషిస్తే, పిల్లల్ని పోషిస్తే, అది కూడా సదకా క్రిందకి లెక్కించబడుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే ఇంకో హదీస్ లో:
مَا مِنْ مُسْلِمٍ يَغْرِسُ غَرْسًا … إِلاَّ كَانَ مَا أُكِلَ مِنْهُ لَهُ صَدَقَةً
(మా మిన్ ముస్లిమిన్ యగ్రిసు గర్సన్ … ఇల్లా కాన మా ఉకిల మిన్హు లహూ సదఖహ్)
ఏ ముస్లిమైనా ఒక మొక్కను నాటితే… దాని నుండి తినబడిన ప్రతి దానికీ అతనికి సదకా పుణ్యం లభిస్తుంది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే ఒక చెట్టును నాటుతాడు. నాటిన తర్వాత, ఆ చెట్టు నుంచి ప్రయోజనం పొందే, లాభం పొందే ఆ ప్రతి వ్యక్తికి బదులుగా ఆ చెట్టు నాటిన వ్యక్తికి సదకా వస్తుంది. సదకా అంత పుణ్యం వస్తుంది. అంటే, ఏ వ్యక్తి అయితే చెట్టు నాటుతాడో, చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు ద్వారా కొందరు నీడ తీసుకుంటారు, నీడలో కూర్చుంటారు, విశ్రాంతి తీసుకుంటారు. అది కూడా సదకా. ఆ చెట్టు ఫలం ఎవరైతే తింటారో అది కూడా సదకా క్రిందికి వస్తుంది.

అభిమాన సోదరులారా, అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, దారి నుండి హాని కలిపించే, ఇబ్బంది కలిగించే వస్తువును తొలగించటం కూడా సదకా క్రిందికి వస్తుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఇక చివర్లో, మూడు రకాల సదకా ఉంది. అది వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మూడు రకాల సదకాలు ఉన్నాయి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

إِذَا مَاتَ ابْنُ آدَمَ انْقَطَعَ عَمَلُهُ إِلاَّ مِنْ ثَلاثٍ
(ఇదా మాత ఇబ్ను ఆదమ ఇన్ఖత’అ అమలుహు ఇల్లా మిన్ సలాస్)
ఆదం సంతతి వాడు (మానవుడు) మరణించినప్పుడు, అతని కర్మలు మూడు విషయాలు తప్ప ఆగిపోతాయి.

ఆదం సంతతికి చెందినవాడు అంటే ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, చనిపోయిన తర్వాత కర్మలు అంతమైపోతాయి. ఇప్పుడు అతనికి పాపం, పుణ్యం అనేది ఉండదు, మనిషి చనిపోయాడు. చనిపోక ముందు వరకే కదా, పాపం చేస్తున్నాడు, పుణ్యం చేస్తున్నాడు, సదాచరణ చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. ఇలా కర్మలు చేయటం అనేది చావు వరకు. చనిపోయిన తర్వాత ప్రతిఫలం మాత్రమే గాని, కర్మ అనేది ఉండదు.

ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, అతని అమల్ (కర్మ) ఇన్ఖతా అయిపోతుంది, కట్ అయిపోతుంది. మూడు విషయాలు తప్ప అన్నారు ప్రవక్త గారు, ఇది గమనించాల్సిన విషయం. మూడు విషయాలు తప్ప.

ఒకటి,

صَدَقَةٌ جَارِيَةٌ
(సదఖతున్ జారియహ్)
నిరంతరం కొనసాగే దానం (సదకా-ఎ-జారియా).

ఎటువంటి సదకా అంటే అది జారియాగా ఉండాలి, కంటిన్యూగా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ ఉన్నంతకాలం, ఆ మస్జిద్ లో నమాజ్ జరిగేంతకాలం ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మస్జిద్ నిర్మించడం, మద్రసా నిర్మించడం, వృక్షాలు నాటటం, బావి త్రవ్వించడం, ఈ విధంగా. దీనికి సదకా జారియా అంటారు. పుణ్యం లభిస్తూనే ఉంటుంది, అది ఉన్నంత వరకు.

రెండవది,

عِلْمٌ يُنْتَفَعُ بِهِ
(ఇల్మున్ యున్తఫ’ఉ బిహీ)
ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం.

ప్రజలకు విద్యాబోధన చేయటం, విద్య నేర్పించటం, ప్రజలకు సన్మార్గం చూపే గ్రంథాలు రాయటం, విద్యార్థులను తయారు చేయటం. అంటే, జ్ఞానం అన్నమాట. ఏ వ్యక్తి అయితే జ్ఞానం వదిలిపోతాడో, విద్య వదిలిపోతాడో. అది చాలా రకాలుగా ఉండవచ్చు. ఒకటి, తన విద్యార్థులను వదిలి వెళ్ళాడు, నేర్పించి పోయాడు. ఖురాన్ ని, హదీస్ ని, అల్లాహ్ వాక్యాలను, ప్రవక్త గారి ప్రవచనాలను, దీన్ నేర్పించి పోయాడు. అతని శిష్యులు వేరే వారికి నేర్పుతారు, వారు వేరే వారికి నేర్పుతారు. ఈ చైన్ సాగుతూనే ఉంటుంది ప్రళయం వరకు. అప్పటి వరకు ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి రాసిపోయాడు, కొన్ని గ్రంథాలు, కొన్ని పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు చదివి చాలా మంది సన్మార్గం పొందుతున్నారు, మంచి విషయాలు నేర్చుకుంటున్నారు, పాపం నుంచి ఆగిపోతున్నారు. మరి ఆ పుస్తకం ఉన్నంతవరకు, ఆ పుస్తకాల ద్వారా నేర్చుకునే వారందరి వల్ల ఆ వ్యక్తికి పుణ్యం పోతూనే ఉంటుంది.

మూడవది,

وَلَدٌ صَالِحٌ يَدْعُو لَهُ
(వలదున్ సాలిహున్ యద్’ఊ లహూ)
అతని కోసం ప్రార్థించే సజ్జనుడైన సంతానం.

తల్లిదండ్రుల మన్నింపు కొరకు ప్రార్థించే సదాచార సంపన్నులైన సంతానాన్ని వదిలి వెళ్ళటం. అంటే అమ్మ నాన్న కోసం దుఆ చేసే సంతానం. మరి సంతానం అమ్మ నాన్న కోసం దుఆ ఎప్పుడు చేస్తారండీ? వారికి మనము ఆ విధంగా తయారు చేయాలి, నేర్పించాలి. వారికి దీన్ నేర్పించాలి, హలాల్ నేర్పించాలి, హరాం అంటే ఏమిటో తెలియజేయాలి, ఖురాన్ నేర్పించాలి, ఇస్లాం అంటే ఏమిటో వారికి నేర్పించాలి. వారికి మనము నేర్పిస్తే, అటువంటి సంతానం అమ్మ నాన్న కోసం దుఆ చేస్తూ ఉంటుంది. ఆ సంతానం దుఆ చేస్తూ ఉంటే, దాని పుణ్యం అమ్మ నాన్న చనిపోయినా కూడా పుణ్యం పోతూనే ఉంటుంది. ఈ మూడు రకాల సదకాలు మనిషి మరణం తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. సదకా జారియా, రెండవది ఇల్మ్, మూడవది సంతానం.

అభిమాన సోదరులారా, రమదాన్ కి సంబంధించిన మరెన్నో విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

وَصَلَّى اللهُ عَلَى نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ
(వ సల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ సహ్ బిహీ అజ్ మ’ఈన్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43591