ఇస్రాయీల్ జాతివారు ‘సబ్త్’ (సబ్బత్) నియమాన్ని అతిక్రమించడం – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ ۙ لَا تَأْتِيهِمْ ۚ كَذَٰلِكَ نَبْلُوهُم بِمَا كَانُوا يَفْسُقُونَ

“(ఇస్రాయీల్ జాతివారు) శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేని కావు, వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము.” (7:163)

ఇస్రాయీల్ ప్రజలు వారంలో ఒక రోజు తమ పనులన్నింటినీ మానుకోవాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) బోధించారు. అలా పనులన్నింటినీ మానుకునే రోజును ‘సబ్బత్’ అంటారు. సబ్బత్ రోజున అన్ని పనులు మానుకుని కేవలం అల్లాహ్ ను ఆరాధించవలసి ఉంది. అల్లాహ్ తమపై కురిపించిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించవలసి ఉంది. ఈ విధంగా చేయడం వల్ల వారి హృదయాలు పరిశుద్ధమవుతాయని ఆయన బోధించారు. యూదులు శనివారాన్ని తమ సబ్బత్ రోజుగా ఎన్నుకున్నారు. ఈ సంప్రదాయాన్ని అనేక తరాలు ఆచరించాయి.

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) కాలంలో ఎలాత్ ప్రాంతంలో కొందరు ఇస్రాయీల్ ప్రజలు నివసించేవారు. ఎలాత్ ఎర్ర సముద్ర తీరాన ఉన్న ఒక పట్టణం. వారంతా చేపలు పట్టే జాలర్లు. సబ్బత్ రోజున సముద్రంలో చేపలు రెండు శిలల మధ్య గుమిగూడి గుంపులు గుంపులుగా కనబడడాన్ని వాళ్ళు చూశారు.

సబ్బత్ రోజున జాలర్ల వలలు తమను ఏమీ చేయవన్న విషయం వాటికి తెలిసినట్లు, ఆ రోజునే అవి తీరానికి వచ్చి ఊరించేవి. వాటిని చూసి కొందరు జాలర్లు నిగ్రహాన్ని కోల్పోయారు. అత్యా శతో చివరకు వాళ్ళు సబ్బత్ నియమాన్ని అతిక్రమించాలని నిర్ణయించుకున్నారు.