పవిత్ర ఖుర్ఆన్ పరిచయం – హబీబుర్రహ్మాన్ జామిఈ
https://youtu.be/ztbp2wtF5do [6 min]
ఈ ప్రసంగంలో ఖురాన్ గురించి వివరించబడింది. ఖురాన్ అంటే అల్లాహ్ వాక్యం, యావత్ మానవాళికి మార్గదర్శకం, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం అని నిర్వచించబడింది. ఇది అల్లాహ్ తరఫున జిబ్రయీల్ దూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడింది. ‘ఖురాన్’ అనే పదానికి ‘ఎక్కువగా పఠించబడేది’ అని అర్థం. రమజాన్ మాసంలో ఖురాన్ అవతరణ ప్రారంభమైందని, అందుకే ఈ మాసానికి, ఖురాన్‌కు మధ్య బలమైన సంబంధం ఉందని సూరహ్ బఖర మరియు సూరహ్ జుమర్ వాక్యాల ఆధారంగా వివరించబడింది.
ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అద అమ్మా బ’అద్.
అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఖురాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఖురాన్ అంటే ఏమిటి?
قُرْآن كَلَامُ الله
(ఖురాన్ కలాముల్లాహ్)
ఖురాన్, అల్లాహ్ యొక్క వాక్కు.
ఖురాన్ అల్లాహ్ వాక్యం. ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకం. ఖురాన్ సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం. ఖురాన్ అల్లాహ్ గ్రంథం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని జిబ్రయీల్ దూత ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సర్వ మానవుల కొరకు అవతరింపజేశాడు.
అభిమాన సోదరులారా! ఈ ఖురాన్ గ్రంథం ధర్మ పండితులు రాసుకున్న పుస్తకం కాదు. ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వయంగా చెప్పిన మాటలు కావు. ఖురాన్ గ్రంథం అల్లాహ్ వాక్యం.
ఖురాన్ అవతరణ విధానం
జిబ్రయీల్ దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. ఎవరికోసం అవతరింపజేశాడు? సర్వమానవుల సన్మార్గం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడు.
అలాగే ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడినది. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసు 63 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రవక్త పదవి లభించింది. అంటే, 63 సంవత్సరాలలో 40 తీసేస్తే మిగిలింది 23 సంవత్సరాలు. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. ఈ 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ అవతరింపజేయబడినది.
‘ఖురాన్’ పదం యొక్క అర్థం
ఖురాన్ అనే పదానికి శాబ్దిక అర్థం, ఎక్కువగా పఠించబడేది. ప్రపంచంలోనే ఎక్కువగా చదవబడే, పఠించబడే గ్రంథం ఖురాన్.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుజ్ జుమర్‌లో ఇలా తెలియజేశాడు:
تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِ
(తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్)
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది. (39:1)
ఈ ఖురాన్ ఎవరి తరఫున జరిగింది? అల్లాహ్ తరఫున. ఈ గ్రంథావతరణ, ‘తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్‘ – ఈ గ్రంథావతరణ సర్వాధికుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా తెలియజేశాడు, సూరా నెంబర్ రెండు:
شَهْرُ رَمَضَانَ الَّذِيْٓ اُنْزِلَ فِيْهِ الْقُرْاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الْهُدٰى وَالْفُرْقَانِ
రమజాను నెల – మానవులందరికీ మార్గదర్శకమైన ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల అది. అందులో సన్మార్గంతోపాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలున్నాయి. (2:185)
రమదాన్ నెల, ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం, అందులో సన్మార్గంతో పాటు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. అంటే, రమజాన్ ఖురాన్ అవతరింపజేయబడిన నెల, అంటే రమజాన్ మాసంలో ఖురాన్ అవతరింపజేయబడినది.
ఇంతకుముందు ఒక మాట విన్నాం, 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ వచ్చింది, మరి ఇది రమజాన్ నెలలో ఖురాన్ అవతరించింది అంటే, దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రమజాన్ మాసంలో తొలి ఆకాశంలో బైతుల్ ఇజ్జత్ అనే ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ఖురాన్ రమజాన్ మాసంలోనే పెట్టాడు. అక్కడ నుండి ఈ భూమండలంలోకి అవసరానుసారం, సందర్భం ప్రకారం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు పంపిస్తూ ఉన్నాడు. రెండో అర్థం, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జబల్ నూర్, హిరా గుహలో ఉన్నప్పుడు మొదటి దైవవాణి, ఖురాన్ అవతరణ ప్రారంభం అయ్యింది రమజాన్ మాసంలో.
ఈ విధంగా ఖురాన్ ప్రారంభం అయ్యింది అది రమజాన్ మాసంలోనే. కావున ఈ రమజాన్ మాసం, ఖురాన్ మాసం. అభిమాన సోదరులారా, ఇన్ షా అల్లాహ్, ఖురాన్ గురించి మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి మాట ఇదే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.