ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో| టెక్స్ట్]

ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) – చేప కడుపులో సజీవంగా మిగిలిన మనిషి
(800-750 క్రీ.పూ)

ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://youtu.be/fDVp3h9FRXI [31నిముషాలు]

ఈ ఉపన్యాసంలో, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర వివరించబడింది. ఇందులో యూనుస్ (అలైహిస్సలాం) వారి తండ్రి పేరు, ఖురాన్లో ఆయనకు ఇవ్వబడిన బిరుదులు, మరియు ఆయన నీనెవా పట్టణ ప్రజల వైపుకు ప్రవక్తగా పంపించబడిన వివరాలు ఉన్నాయి. నీనెవా ప్రజలు ఆయన సందేశాన్ని తిరస్కరించినప్పుడు, ఆయన అల్లాహ్ అనుమతి లేకుండానే కోపంతో ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత, నీనెవా ప్రజలు తమపైకి రాబోతున్న దైవ శిక్షను చూసి పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకోగా, అల్లాహ్ వారిని క్షమించారు. మరోవైపు, ఓడలో ప్రయాణిస్తున్న యూనుస్ (అలైహిస్సలాం) వారిని తుఫాను కారణంగా సముద్రంలోకి విసిరివేయగా, ఒక పెద్ద చేప ఆయనను మింగేసింది. చేప కడుపులోని చీకట్లలో ఆయన అల్లాహ్‌ను ప్రార్థించగా, అల్లాహ్ ఆయన ప్రార్థనను అంగీకరించి, ఆయనను రక్షించారు. ఈ సంఘటనల ద్వారా పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత, దుఆ యొక్క శక్తి, మరియు దైవ సందేశాన్ని బోధించడంలో సహనం ఎంత అవసరమో వివరించబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకుందాం.

యూనుస్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు మత్తా. కాబట్టి, ఆయనను యూనుస్ బిన్ మత్తా అని పిలుస్తూ ఉంటారు. అలాగే, ఆయనకు జున్నూన్ అనీ, అలాగే సాహిబుల్ హూత్ అనీ బిరుదులతో ఖురాన్‌లో ప్రస్తావించబడి ఉంది.

ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు. ఈ నీనెవా పట్టణము ఎక్కడ ఉంది అంటే, ఇరాక్ దేశంలోని ఉత్తర దిశన దజలా అనే ఒక నది ఉంది. ఆ నదికి ఒక వైపు మూసిల్ అనే పట్టణం ఉంటే, ఆ మూసిల్ పట్టణానికి ఎదురుగా నదికి మరో వైపు ఈ నీనెవా పట్టణం ఉంది. మధ్యలో నది, ఒక వైపు నీనెవా పట్టణము, మరోవైపు మోసెల్ పట్టణము ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఈ నీనెవా పట్టణం ఉంది.

ఆ రోజుల్లోనే నీనెవా పట్టణ ప్రజల సంఖ్య లక్ష కంటే ఎక్కువగా ఉండేది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆ పట్టణ ప్రజల సంఖ్య గురించి కూడా ప్రస్తావించి ఉన్నాడు. మనం చూచినట్లయితే, ఖురాన్‌లోని 37వ అధ్యాయం, 147వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
మరి మేమతన్ని ఒక లక్షమంది, అంతకన్నా ఎక్కువ మంది వైపుకే (ప్రవక్తగా) పంపాము..” (37:147)

అనగా, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడే సమయానికి నీనెవా పట్టణ ప్రజల సంఖ్య లక్ష కంటే ఎక్కువగా ఉంది ఆ రోజుల్లోనే అని ఖురాన్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు.

అయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు ఆ నీనెవా పట్టణ ప్రజల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వారికి బోధిస్తే, వారు యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని పట్టించుకోలేదు, విశ్వసించలేదు. యూనుస్ అలైహిస్సలాం వారు చాలా రోజుల వరకు, చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి దైవ వాక్యాలు వారికి బోధిస్తూ ఉన్నా, వారు మాత్రము ససేమిరా అంటూ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని అసలు విశ్వసించనే లేదు.

చివరికి, ఒక రకంగా యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది, మీ మీద అల్లాహ్ శిక్ష వచ్చి పడుతుంది, ఎన్ని విధాలుగా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెబుతూ ఉన్నా మీరు పట్టించుకోవట్లేదు, విశ్వసించట్లేదు కాబట్టి మీ మీద శిక్ష వచ్చి పడుతుంది అల్లాహ్ తరఫున అని హెచ్చరించి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ పట్టణ ప్రజలని శిక్షించాలని నిర్ణయించాడు. ఆ విషయం యూనుస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేయగా, యూనుస్ అలైహిస్సలాం వారు చివరిసారిగా వెళ్లి పట్టణ ప్రజలకు, మీ మీద ఫలానా సమయంలో ఫలానా దినములో దైవ శిక్ష వచ్చి పడుతుంది అని చెప్పి, అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్లిపోయాడు.

ఒక రకంగా చెప్పాలంటే, యూనుస్ అలైహిస్సలాం వారికి కోపం వచ్చి ఉంది, పట్టణ ప్రజలు ఆయన మాటను విశ్వసించలేదు అని. కాబట్టి, మీ మీద దైవ శిక్ష వచ్చి పడే రోజు సమీపంలో ఉంది అని చెప్పి హెచ్చరించేసి కోపంగా ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఆ విషయం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో తెలియజేసి ఉన్నాడు.

وَذَا النُّونِ إِذ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ
చేపవాడు (యూనుస్‌ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు.” (21:87)

చేపవాడు అనగా యూనుస్ అలైహిస్సలాం కోపగించుకొని వెళ్ళిపోయినప్పటి స్థితిని జ్ఞప్తికి తెచ్చుకోండి. మేము తనను కష్ట దశలోకి నెట్టమని అతను భావించాడు. కోపగించుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరిపోయి ఏకంగా సముద్రపు ఒడ్డుకి చేరాడు. సముద్రపు ఒడ్డున అప్పటికే సామాను మొత్తం మోసుకొని బయలుదేరటానికి ఒక పడవ సిద్ధంగా ఉంటే, ఆ పడవ ఆయన ఎక్కేశాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని చెప్తున్నాడు అంటే, మా ఆజ్ఞ రాకముందే ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళాలని మా తరఫు నుంచి అనుమతి రాకముందే ఆయన, అల్లాహ్ నాకు కష్టంలోకి నెట్టడులే అని భావించి బయలుదేరిపోయాడు.

బయలుదేరిన తర్వాత, ఇక్కడ పట్టణ ప్రజల విషయం ఏమి జరిగిందో తెలుసుకొని తర్వాత యూనుస్ అలైహిస్సలాం వారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ, పట్టణ ప్రజలు కొద్ది రోజుల తర్వాత చూస్తే, ఒక నల్లటి మేఘము ఆ నీనెవా పట్టణం వైపుకి వస్తూ ఉంది. ఆ నల్లటి మేఘంలో నిప్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది చూసి వారు అర్థం చేసుకున్నారు, యూనుస్ ఏ శిక్ష గురించి అయితే మమ్మల్ని హెచ్చరించాడో ఆ శిక్ష అదిగో అక్కడ వస్తూ ఉంది అని వారు అర్థం చేసుకొని, వెంటనే ఆ పట్టణ పెద్దల వద్దకు వెళ్లి, ఇదిగో దైవ శిక్ష వస్తూ ఉంది, ఇప్పుడు ఏమి చేయాలి అని వారు వెళ్లి అడిగితే, అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమన్నారంటే, మనకు పూర్వము ప్రవక్తల అనుచర సమాజాన్ని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలను వారు తిరస్కరించిన కారణంగా శిక్షించాడు. వాళ్లు దైవ శిక్షకు గురయ్యి మట్టి కలిసిపోయారు. అదే విధంగా అల్లాహ్ శిక్ష మన మీద కూడా రాబోతుంది. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే, అందరూ ఇళ్ల నుండి బయలుదేరండి, ఒక మైదానంలో ప్రోగవ్వండి అని ఆదేశించారు.

ఇళ్ల నుండి పిల్లా, పెద్ద, ఆడ, మగ అందరూ కూడా చిరిగిపోయిన, అతుకులు వేయబడిన బట్టలు ధరించి మైదానంలో వచ్చి ప్రోగయ్యారు. అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమి చేశారంటే, మనుషులందరినీ విడివిడిగా నిలబెట్టేశారు. చివరికి తల్లి, బిడ్డలను కూడా విడివిడిగా నిలబెట్టేసి, ప్రతి ఒక్కడూ అతను నిలబడిన స్థానంలోనే అల్లాహ్‌కు చిత్తశుద్ధితో ప్రార్థిస్తూ, క్షమాపణ వేడుకుంటూ ఈ శిక్ష మా మీద నుంచి తొలగించమని కోరుకుందాము, ప్రార్థిద్దాము అని చెప్పారు. అలాగే జరిగింది. ప్రజలందరూ కూడా మైదానంలో నిలబడ్డారు, నిలబడి అల్లాహ్‌తో ఏడుస్తూ ప్రార్థనలు చేశారు. మూడు రోజుల వరకు ఆ మేఘాలు ఆ పట్టణం మీద సంచరించాయి అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. ప్రజలు కూడా మూడు రోజుల వరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఏడుస్తూ క్షమాభిక్ష వేడుకున్నారు అని కూడా తెలపబడింది.

వారందరూ చిత్తశుద్ధితో, పశ్చాత్తాపపడి, క్షమాపణ వేడుకొని విశ్వాసము ఎప్పుడైతే పొందటానికి సిద్ధపడ్డారో, అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, వారి మీద సంచరిస్తూ ఉన్న ఆ శిక్షను తొలగించేశాడు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ దయవల్ల ఆ శిక్ష తొలిగిపోయింది. శిక్ష తొలిగిపోయిన తర్వాత, అక్కడ యూనుస్ అలైహిస్సలాం వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యూనుస్ అలైహిస్సలాం వారు ఎప్పుడైతే పడవ ఎక్కేశారో, కోపగించుకొని వెళ్లి, అల్లాహ్ ఆజ్ఞ రాకముందే ఎప్పుడైతే ఆయన పడవ ఎక్కేసి బయలుదేరిపోయారో, పడవ సముద్రం మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు, తూఫాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ పంపించేశాడు. తూఫాన్ కారణంగా పెద్ద అలలు వస్తూ ఉంటే, పడవ నీట మునిగే ప్రమాదము పొంచి వచ్చింది. అప్పుడు ఆ పడవలో ఉన్న వారు పడవ మునిగిపోరాదని పడవలో ఉన్న భారము తగ్గించేయండి అంటూ అందులో ఉన్న సామాగ్రి తీసి నీటిలో పడవేశారు. అయినా గానీ బరువు తగ్గలేదు. ఇంకా బరువు తగ్గించాలి. కాబట్టి మనుషుల్లో నుంచే కొంతమందిని ఇప్పుడు పడవలో నుంచి బయటికి తోసి వేయాల్సి వచ్చింది. అయితే ఎవరిని తోసి వేయాలి? దాని కోసము వారు ప్రణాళిక ఏమని రచించారంటే, చీటీలు వేద్దాం. ఎవరి పేరు వస్తుందో వారిని నీటిలో పడవేద్దామని చీటీలు వేసి చీటీ ఎత్తితే, యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వచ్చింది.

యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వస్తే, వారు యూనుస్ అలైహిస్సలాం వారు బోధకులు కాబట్టి గౌరవిస్తూ, ఈయనను వద్దు అని రెండవ సారి మళ్లీ చీటీ ఎత్తారు. మళ్లీ ఆయన పేరే వచ్చింది. మూడవసారి చీటీ ఎత్తారు. మూడవసారి కూడా ఆయన పేరే వచ్చింది. ఆ విధంగా మూడు సార్లు చీటీ ఎత్తినప్పుడు ఆయన పేరే వస్తే, అప్పుడు విషయం అర్థమైపోయింది. యూనుస్ అలైహిస్సలాం వారినే ఇక్కడి నుంచి ఇంకా నీటిలో పడవేయాలని. ఆ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారిని నీటిలో పడవేయగా, అల్లాహ్ ఆజ్ఞతో ఒక పెద్ద చేప వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారిని మ్రింగేసింది. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పడవ ఎక్కిన విషయము తెలియజేశాడు, ఆ తర్వాత పడవలో చీటీలు వేయబడిన విషయము కూడా తెలియజేశాడు.

మనం చూచినట్లయితే ఖురాన్‌లోని 37వ అధ్యాయం 140వ వాక్యంలో ఈ విధంగా తెలపబడి ఉంది,

إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
అతను (తన జనుల నుండి) పలాయనం చిత్తగించి నిండు నౌక వద్దకు చేరుకున్నప్పుడు, (37:140)

యూనుస్ అలైహిస్సలాం తన జనుల నుండి పలాయనం చిత్తగించి, నిండు నౌక వద్దకు చేరుకున్నాడు. నౌక వద్దకు చేరుకొని, నౌకలో బయలుదేరితే తూఫాను వచ్చింది, అప్పుడు చీటీలు వేయబడ్డాయి. చూడండి 37వ అధ్యాయం 141వ వాక్యంలో తెలపబడింది,

فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
చీటీలు వేయటం జరిగింది. చివరకు అతనే ఓడిపోయాడు..” (37:141)

చీటీలు వేయటం జరిగింది, చివరకు అతనే ఓడిపోయాడు. అనగా యూనుస్ అలైహిస్సలాం వారే ఓడిపోయారు. ఆయనకే నీటిలో పడవేయటం జరిగింది. ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగింది. 37వ అధ్యాయం 142వ వాక్యంలో చూడండి,

فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ
తరువాత అతన్ని చేప మ్రింగేసింది. అప్పుడు అతను తన్ను తానే నిందించుకోసాగాడు. (37:142)

తర్వాత చేప అతన్ని మ్రింగేసింది, అప్పుడు అతను తన్ను తాను నిందించుకోసాగాడు. యూనుస్ అలైహిస్సలాం వారిని ఏ చేప అయితే వచ్చి మింగిందో, ఆ చేపకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. నీవు యూనుస్ అలైహిస్సలాం వారి శరీరానికి ఎలాంటి గాయము కాకుండా చూసుకోవాలి. అలాగే ఆయన శరీరంలోని ఒక్క ఎముక కూడా విరగరాదు అని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి, చేప యూనుస్ అలైహిస్సలాం వారిని నమలలేదు, ఎలాంటి గాయము కలగకుండా మింగింది, ఆయన చేప కడుపులోకి వెళ్లిపోయాడు.

వెళ్లిన తర్వాత, చేప యూనుస్ అలైహిస్సలాం వారితో సముద్ర లోతుల్లోకి వెళ్ళింది. అప్పుడు యూనుస్ అలైహిస్సలాం వారు, అల్లాహ్ ఆజ్ఞ రాకముందే నేను తొందరపడి వచ్చేసానే, తప్పు చేశాను కదా అని అప్పుడు గ్రహించి, చేప గర్భం నుండి, అంటే చేప కడుపు నుండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను తలుచుకొని ఆయన ప్రార్థించాడు. ఆయన ఏమని ప్రార్థించాడో, ఆ పలుకులు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో ప్రస్తావించి ఉన్నాడు. 21వ అధ్యాయం 87వ వాక్యంలో అక్కడ మనం చూచినట్లయితే,

فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ
అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు. (21:87)

అనగా, అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాడ్ని” అని మొరపెట్టుకున్నాడు. చీకట్లలో నుంచి ఆయన ప్రార్థన చేశాడు అంటే, ఏ చీకటి? ధార్మిక పండితులు మూడు విషయాలు తెలియజేశారు. ఒకటి, ఆయన ప్రార్థన చేసే సమయానికి రాత్రి అయ్యి ఉండింది, రాత్రి చీకటి. రెండవది, చేప ఆయనను తీసుకొని సముద్ర లోతుల్లోకి వెళ్ళింది కాబట్టి, సముద్ర లోతుల్లో అక్కడ చీకటి ఉంది. రెండు. మూడో విషయం ఏమిటంటే, చేప గర్భంలో, చేప కడుపులో ఆయన ఉన్నాడు కదా, అక్కడ కూడా చీకటి ఉంది. ఈ విధంగా, మూడు చీకట్లలో నుంచి ఆయన అల్లాహ్‌కు ప్రార్థన చేశారు.

అలాంటి చోటు నుంచి కూడా ఆయన అల్లాహ్‌ను తలుచుకుంటూ ఉంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వినే శక్తి కలిగిన వాడు, ఆయన ప్రార్థనను విన్నాడు. విని, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మన్నించి, ఆయన ప్రార్థనను ఆమోదించి, ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని, కష్టాన్ని తొలగించాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 37వ అధ్యాయం, 143, 144 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నాడు.

فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
ఒకవేళ అతను గనక (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే….పునరుత్థానదినం వరకు చేప కడుపులోనే ఉండిపోయేవాడు. (37:143-144)

فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُنجِي الْمُؤْمِنِينَ
అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము.” (21:88)

అల్లాహు అక్బర్! ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత నిరాశ చెంది ఉంటే, నాకు చేప మింగేసింది, ఇక నాకు బయట పడే మార్గమే లేదులే అని నిరాశ చెంది ఉంటే, అల్లాహ్‌కు తలుచుకోకుండా ఉండి ఉంటే, ఆయన ప్రళయం వరకు అక్కడే ఉండిపోయేవాడు. కానీ, అక్కడి వెళ్లి కూడా ఆయన అల్లాహ్ మీద నమ్మకం ఉంచి, అల్లాహ్ వింటాడు అని భావించి, వాస్తవానికి అల్లాహ్ వింటున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విని, ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని తొలగించాడు. ఎలా తొలగించాడు అంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, అల్లాహ్ ఆజ్ఞతో చేప సముద్రపు ఒడ్డుకి వచ్చి ఆయనను కక్కేయగా, ఆయన మళ్లీ కడుపులో నుంచి సముద్ర ఒడ్డుకి వచ్చి పడ్డారు.

అయితే చేప కడుపులో ఆయన ఎన్ని రోజులు గడిపారు అంటే, ధార్మిక పండితులు మూడు రకాల విషయాలు తెలియజేసి ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే, ఆయన మూడు రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు, ఏడు రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు, 40 రోజులు గడిపారు అని మరికొందరు తెలియజేసి ఉన్నారు. అయితే మూడు రోజులు గడిపారన్న విషయము ఎక్కువగా ప్రచారంలో ఉంది. అసలు విషయము అల్లాహ్‌కు తెలుసు. ఏది ఏమైనప్పటికిని, యూనుస్ అలైహిస్సలాం వారు వచ్చి మళ్ళీ సముద్ర ఒడ్డున పడ్డారు. ఆయన సముద్ర ఒడ్డుకి చేరుకునే సమయానికి, ఆయన అనారోగ్యానికి, అస్వస్థతకు గురై ఉన్నారు. మూడు రోజులు చేప కడుపులో ఉన్నారు కదా, కాబట్టి ఆయన అస్వస్థతకు గురై ఉన్నారు. ఖురాన్‌లో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు. 37వ అధ్యాయం 145వ వాక్యాన్ని మనం చూచినట్లయితే,

فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ
తరువాత మేమతన్ని (సముద్ర తీర) మైదానంలో పడవేశాము. అప్పుడతను అస్వస్థతకు గురై ఉన్నాడు.” (37:145)

ఆయన ఆరోగ్యము సరిగా లేదు, అస్వస్థతకు గురై ఉన్నారు. ఆయన లేచి నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, అంతగా ఆయన అస్వస్థతకు, అనారోగ్యానికి, బలహీనతకు గురై ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయ తలచి అడవుల్లో నివసిస్తున్న జింకను లేదా ఒక గొర్రెను ఆదేశించగా, ఆ గొర్రె వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారు ఉన్న చోట నిలబడితే, ఆ గొర్రె పాలు లేదా జింక పాలు ఆయన తాగేవారు. అలాగే, ఎక్కడైతే యూనుస్ అలైహిస్సలాం వారు పడి ఉన్నారో, ఆ ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీగ లాంటి ఒక మొక్కను అక్కడ మొలకెత్తించాడు. ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు స్వస్థత లభించింది, అలాగే ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు నీడ కూడా లభించింది అని తెలపబడి ఉంది. మనం చూచినట్లయితే 37వ అధ్యాయం 146వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు,

وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
అతనికి నీడనిచ్చే ఒక తీగచెట్టును అతనిపై మొలకెత్తించాము.” (37:146)

ఆ తీగ చెట్టు ఏమి చెట్టు అంటే, కొంతమంది ధార్మిక పండితులు సొరకాయ తీగ అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్‌కే తెలుసు. మొత్తానికి ఒక తీగ చెట్టును అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మొలకెత్తించాడు. ఆ ఆకులతో మరియు ఆ చెట్టు నీడతో ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత ప్రసాదించాడు.

ఆ తర్వాత, ఆయన ఎప్పుడైతే ఆరోగ్యవంతుడయ్యాడో, స్వస్థత పొందిన తర్వాత, ఆయన మళ్ళీ అక్కడి నుంచి నీనెవా పట్టణానికి వెళ్ళాడు. అప్పటికే ఆ సంఘటన మొత్తం జరిగి ఉంది. దైవ శిక్ష మేఘాల రూపంలో రావటం, ప్రజలందరూ మైదానంలో ప్రోగయ్యి అల్లాహ్‌ను తలుచుకొని ఏడ్చి, పశ్చాత్తాపము చెంది, క్షమాపణ కోరుకోవటం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి శిక్షను తొలగించటం, ఇదంతా అప్పటికే సంభవించి ఉంది. వారి మీద ఉన్న శిక్ష తొలగించబడింది అన్న విషయము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లోని 10వ అధ్యాయం, 98వ వాక్యంలో ప్రస్తావించి ఉన్నాడు.

لَمَّا آمَنُوا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
“… వారు (యూనుస్‌ జాతి ప్రజలు) విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకూ జీవనలాభం పొందే అవకాశం వారికి కల్పించాము.” (10:98)

ఆ విధంగా, యూనుస్ అలైహిస్సలాం వారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రజలందరూ కూడా విశ్వాసం పొందారు. యూనుస్ అలైహిస్సలాం ఆ పట్టణ ప్రజలకు దైవ నిబంధనలు నేర్పుకుంటూ అక్కడ జీవితం గడిపారు. ఈ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర క్లుప్తంగా మీ ముందర వివరించబడింది.

ఇక రండి, యూనుస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక వ్యక్తికి సన్మార్గం దక్కింది. అది ఎలాగా? అది కూడా విందాం ఇన్షాఅల్లాహ్.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో దైవ వాక్యాలు ప్రజలకు బోధిస్తున్న సమయంలో, మక్కా వెలుపల వెళ్లి దైవ వాక్యాలు బోధిద్దామని తాయిఫ్ పట్టణానికి వెళ్లారు. ఇది చాలా ప్రచారంలో ఉన్న సంఘటన. అందరికీ తెలిసి ఉంటుంది ధార్మిక పండితుల నోట విని ఉంటారు. అయితే ఈ ప్రస్తావనలో మన అంశానికి సంబంధించిన విషయం మనం తెలుసుకుందాం. అదేమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ పట్టణానికి వెళ్లారు. అక్కడ ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. ప్రజలు వినకుండా, తిరస్కరించి, చివరికి కుర్రాళ్ళు మరియు పెద్దలు అందరూ కలిసి ఆయనకు రాళ్లతో కొట్టటము, ఆయన స్పృహ కోల్పోయి పడిపోవటము, ఆ తర్వాత బానిస ఆయనను తీసుకెళ్లి ఒక తోటలో రక్తము, గాయాలు శుభ్రపరిచిన తర్వాత, ఆయనకు స్పృహ రావటము, ఆ తర్వాత దైవదూత జిబ్రీల్ వచ్చి, మీరు అనుమతి ఇస్తే ఈ పట్టణ ప్రజలని రెండు పర్వతాల మధ్య నుజ్జు నుజ్జు చేసేస్తాను, అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వద్దు అని నిరాకరించడము, ఇదంతా జరిగిన చోటనే మరొక ముఖ్యమైన సంఘటన జరిగి ఉంది.

అదేమిటంటే, ఏ తోటలోకి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీసుకెళ్లి ఆ బానిస గాయాలు శుభ్రం చేస్తున్నాడో, రక్తం శుభ్రం చేస్తున్నాడో, ఆ తోట వచ్చి రబియా అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండేవారు, ఉత్బా మరియు షైబా అని, ఆ ఇద్దరు కుమారులది అది. ఆ సమయానికి వారిద్దరూ కూడా అక్కడ ఉన్నారు తోటలో. ప్రవక్త వారి పరిస్థితి చూసి, వారు జాలిపడి, వారి వద్ద ఒక బానిస ఉండేవాడు, అతని పేరు అద్దాస్. అతని పిలిపించి కొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చి తీసుకెళ్లి ఆ వ్యక్తికి ఇవ్వండి అని చెబితే, అప్పుడు అద్దాస్ అనే బానిస ద్రాక్ష పండ్లు తీసుకెళ్లి ప్రవక్త వారికి ఇచ్చాడు.

అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ‘బిస్మిల్లాహ్‘ అని ఆ ద్రాక్ష పండ్లు తినటం ప్రారంభించారు. అది విని అద్దాస్‌కు ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రదేశంలో ‘బిస్మిల్లాహ్’ అనే పలుకులు పలికే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఈ పలుకులు పలుకుతున్నారు అంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉందే అని చెప్పాడు.

అప్పుడు ప్రవక్త వారు ఆ వ్యక్తితో ఏమని అడిగారంటే, “అయ్యుల్ బిలాది అంత యా అద్దాస్, వ మా దీనుకా?” (ఓ అద్దాస్, నీవు ఏ పట్టణ వాసివి మరియు నీవు ఏ మతస్థుడివి?) అని అడిగితే, అతను అన్నాడు, “నేను ఒక క్రైస్తవుడిని, నేను నీనెవా పట్టణానికి చెందిన వ్యక్తిని” అని చెప్పాడు. చూశారా, నీనెవా పట్టణ ప్రస్తావన వచ్చేసింది ఇక్కడ.

ఇప్పుడు, నీనెవా పట్టణ ప్రస్తావన ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారో, అప్పుడు వెంటనే ఆయన ఏమన్నారంటే, “ఓహో, నీవు నా సోదరుడైన యూనుస్ బిన్ మత్తా అనే ప్రవక్త పట్టణానికి చెందిన వ్యక్తివా?” అని అడిగారు.

ఆ మాట వినగానే అద్దాస్‌కు ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయింది. ఎందుకంటే మక్కాలో ఉంటున్న ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఈ దూరదర్శనాలు, ఈ టెలివిజన్లు, వేరే వేరే చోట్ల నుంచి ఏ ప్రదేశం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని తెలుసుకునే విషయాలు లేవు. ప్రవక్త వారు కూడా దూరపు ప్రయాణాలు ఆ రోజుల్లో చేసి లేరు. కాబట్టి, ఆయన ఆశ్చర్యపడుతూ, “యూనుస్ బిన్ మత్తా గురించి, నీనెవా పట్టణం గురించి మీకు ఎలా తెలుసండి?” అని అడిగితే, అప్పుడు ప్రవక్త వారు అన్నారు,

“జాక అఖీ, కాన నబియ్యన్ వ అన నబి.” (అతను నా సోదరుడు. అతను ఒక ప్రవక్త మరియు నేను కూడా ఒక ప్రవక్తనే.)

యూనుస్ బిన్ మత్తా ఒక ప్రవక్త అయ్యా, నేను కూడా ఒక ప్రవక్తనే. కాబట్టి, ఒక ప్రవక్తగా ఆ ప్రవక్త గురించి నాకు తెలుసు అని చెప్పారు. ఆ మాట వినగానే క్రైస్తవుడైన ఆ అద్దాస్ ప్రవక్త వారి చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు, నుదుటను ముద్దు పెట్టుకుంటున్నాడు. దూరం నుంచి ఇద్దరు యజమానులు చూసి, “అదో, ఈ ముహమ్మద్ వారి మాటల్లో ఇతను కూడా పడిపోయాడు. ఆ ముహమ్మద్ వారి మాటల ప్రభావం ఇతని మీద కూడా పడిపోయింది” అని చెప్పి వారు మాట్లాడుకుంటున్నారు. తర్వాత, అద్దాస్ యజమానుల వద్దకు వెళితే, అప్పుడు వారిద్దరూ, “ఏమయ్యా, ద్రాక్ష పండ్లు ఇచ్చేసి వచ్చేయ్ అని మేము చెబితే, నీవేమో వెళ్లి అతని చేతులు ముద్దు పెట్టుకుంటున్నావు, నుదుట ముద్దు పెట్టుకుంటున్నావు. ఏంటిది?” అని అడిగితే, అప్పుడు ఆ అద్దాస్ ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అతను అన్నాడు, “లఖద్ అఖ్బరనీ బి అమ్రిన్ మా యఅలముహూ ఇల్లా నబీ.” (ఈయన నాకు ఒక విషయం గురించి తెలియజేశారు. ఆ విషయము ఒక ప్రవక్తకు తప్ప ఇతరులకు అది తెలియదు) అని చెప్పారు.

చూశారా, ఆయన ప్రవక్త అన్న విషయము బానిస అయిన క్రైస్తవుడు అద్దాస్ అర్థం చేసుకున్నాడు. తర్వాత చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, కొద్ది రోజుల తర్వాత ఆ అద్దాస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో హాజరయ్యి అతను ఇస్లాం స్వీకరించాడు అని కూడా తెలుపబడింది.

అయితే మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, యూనుస్ బిన్ మత్తా ప్రవక్త వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే చాలా సంవత్సరాల క్రితము వచ్చి వెళ్ళిన వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడూ కూడా ఆ నీనెవా పట్టణానికి ప్రయాణం చేసి వెళ్లి చూసి రాలేదు. ఒక ప్రవక్తగా ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన చరిత్ర ప్రస్తావించారు కాబట్టి, ఆయన తెలుసుకొని, గుర్తుపట్టి ఆ క్రైస్తవ బానిసకు ఆ విషయాలు తెలియజేసినప్పుడు, వెంటనే ఆ బానిస ఆ విషయాన్ని గ్రహించి ప్రవక్త వారి శిష్యుడిగా మారాడు. కాబట్టి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన దైవ ప్రవక్త అని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యం.

ఇక రండి, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనము తెలుసుకోవలసిన ఒకటి, రెండు, మూడు విషయాలు చెప్పి నేను ఇన్షాఅల్లాహ్ నా మాటను ముగిస్తాను.

ఒక విషయం ఏమిటంటే, పశ్చాత్తాపము చెందటం వలన మనిషి పాపాలు తొలిగిపోవటంతో పాటు, అతని మీద ఉన్న శిక్షలు, దుఃఖాలు కూడా తొలిగిపోతాయి అని మనకు తెలపబడింది. నీనెవా పట్టణ ప్రజల మీద దైవ శిక్ష వచ్చి పడుతూ ఉంటే, వారు పశ్చాత్తాపం పొందారు. వారు పశ్చాత్తాపం పొందిన కారణంగా, వారి పాపము మన్నించబడింది, వారిపై వస్తున్న, వారిపై పడబోతున్న శిక్ష కూడా తొలగించబడింది. కాబట్టి, పశ్చాత్తాపము చెందాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అనుచర సమాజానికి “పశ్చాత్తాపం పొందుతూ ఉండండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు” అని తెలియజేసి ఉన్నారు.

అలాగే యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, విశ్వాసి అల్లాహ్‌తో దుఆ చేసుకుంటూ ఉండాలి. అతను మేఘాలలో ప్రయాణిస్తూ ఉన్నా, నీటి మీద ప్రయాణిస్తూ ఉన్నా, లేదా భూమి మీద ప్రయాణిస్తూ ఉన్నా, నీటి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, గాలిలో ప్రయాణిస్తూ ఉన్నా, భూమి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నా సరే, ఈ సర్వం అల్లాహ్ ది. ఈ సర్వానికి మొత్తానికి రాజు, రారాజు, అధిపతి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆయన ఆజ్ఞ ప్రతిచోట చెల్లుతుంది. కాబట్టి, విశ్వాసి ఎక్కడ ఉన్నా, అల్లాహ్‌ను తలుచుకుంటూ, అల్లాహ్‌ను వేడుకుంటూ, అల్లాహ్‌కు దుఆ చేసుకుంటూ ఉండాలి. చూడండి యూనుస్ అలైహిస్సలాం వారు నీటి లోపల, చేప కడుపులో ఉండి ఆయన దుఆ చేస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన దుఆను విన్నాడు, ఆమోదించాడు, సమస్యను పరిష్కరించి ఆయనకు గట్టెక్కించాడు. కదా? కాబట్టి, ఎక్కడ ఉన్నా నిరాశ చెందకూడదు. ప్రతిచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వింటున్నాడు, చూస్తున్నాడు. ఆయన జ్ఞానము ప్రతిచోట ఉంది అని మనము గమనించాలి.

అలాగే, యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక బోధకుడు దైవ వాక్యాలు బోధిస్తున్నప్పుడు విసుగు చెందరాదు. యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజలు యూనుస్ అలైహిస్సలాం వారి మాటను పెడచెవిన పెట్టేస్తున్నారు కాబట్టి, ఆయన మాటను వారు పట్టించుకోవట్లేదు కాబట్టి, యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దైవ ఆజ్ఞ రాకముందే, అనుమతి రాకముందే ఆయన వెళ్లిపోయారు. ఒక రకంగా విసుగు చెందారు, కోపగించుకున్నారు. కాబట్టి, ఈ లక్షణము ఒక బోధకునికి సరికాదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ అదే మాట తెలియజేసి ఉన్నాడు. చూడండి,

فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ الْحُوتِ
“కనుక నీ ప్రభువు తీర్పు వచ్చే వరకు ఓపిక పట్టు. చేపవాని మాదిరిగా అయిపోకు.” (68:48)

చేపవాడు అంటే యూనుస్ అలైహిస్సలాం వారే. యూనుస్ అలైహిస్సలాం వారు ఎలాగైతే విసుగు చెంది, కోపగించుకొని వెళ్ళిపోయారో, అలా చేయకు అని చెప్పారు. కాబట్టి, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు బోధించే వ్యక్తిలో విసుగు చెందడం అనే లక్షణము ఉండకూడదు.

ఇవి ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్నందరినీ ప్రవక్తల జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన పాఠాలు అన్నీ నేర్చుకొని, తెలుసుకొని, మమ్మల్ని మనము సంస్కరించుకొని అల్లాహ్ మార్గం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

యూనుస్ ను చేప మ్రింగేసింది. అప్పుడు అతను తన్న తానే నిందించుకోసాగాడు. ఒకవేళ అతను (అల్లాహ్) పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే… పునరుత్థానదినం వరకు చేప కడుపు లోనే ఉండిపోయేవాడు (37: 142-144)

నైనవాహ్ పట్టణ ప్రజలు విగ్రహారాధకులు. వారి జీవన విధానం సిగ్గు లజ్జ లేకుండా ఉండేవి. వారి వద్దకు ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం)ను అల్లాహ్ పంపించాడు. వారిని సంస్కరించ డానికి, అల్లాహ్ ను ఆరాధించేలా వారిని తీర్చిదిద్దడానికి ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) వచ్చారు. తమ ఆరాధనా విధానంలో యూనుస్ జోక్యం వారికి నచ్చలేదు. “మా తాతముత్తాతలు ఈ దేవుళ్ళనే ఆరాధించారు. మేము వీటిని చాలా కాలంగా ఆరాధిస్తున్నాము. మాకు ఎలాంటి హాని కలుగలేదు” అని వారు ఆయన మాటలను తిరస్కరించారు.

విగ్రహారాధన ఎంత అవివేకమైనదో, అల్లాహ్ ఆరాధనలోని ఔచిత్య మెంత గొప్పదో ఆయన వారికి నచ్చజెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు. కాని వారు ఆయన మాటలు వినలేదు. తమ విధానాలు మార్చుకోనట్లయితే అల్లాహ్ శిక్ష విరుచుకుపడుతుందని ఆయన వారిని హెచ్చరించారు. అయినా వారు లక్ష్యపెట్టలేదు. తాము ఏ శిక్షకూ భయపడమని అన్నారు. ఆ శిక్ష ఏంటో రానీ చూద్దాం అన్నారు. నిరాశకు గురయిన యూనుస్ (అలైహిస్సలాం) వారితో, “అలా అయితే నేను మిమ్మల్ని మీ దురదృష్టానికి వదలి వేస్తున్నాను” అన్నారు. ఆ తర్వాత ఆయన అల్లాహ్ శిక్ష ఇక ఆ పట్టణాన్ని చుట్టుకుంటుందని భయపడి ఆ పట్టణాన్ని వదలి వెళ్ళిపోయారు.

ఆయన పట్టణం వదలి వెళ్ళిన వెంటనే అక్కడి ఆకాశం ఎర్రగా మంటలా మారిపోయింది. ఈ దృశ్యం చూసి ప్రజలు భయపడ్డారు. ఆద్, సమూద్, నూహ్ జాతి ప్రజల వినాశం గుర్తుకు తెచ్చుకున్నారు. తమకు కూడా అలాంటి గతి పట్టనుందా! అన్న ఆలోచన వారిలో నెమ్మదిగా ధార్మిక విశ్వాసాన్ని సృజించింది. వారంతా ఒక కొండపై గుమిగూడారు. అల్లాహ్ కారుణ్యం కోసం, ఆయన క్షమా భిక్ష కోసం ప్రార్థించడం ప్రారంభించారు. వారి మొరలతో కొండలు ప్రతిధ్వనించాయి. నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం వాతావరణమంతా అలముకుంది. అల్లాహ్ వారిపై తన ఆగ్రహాన్ని తొలగించి వారిని మరలా అనుగ్రహించాడు. భయంకరమైన తుఫాను శిక్ష తప్పుకోగానే వారు యూనుస్ ప్రవక్తను మళ్ళీ రావలసిందిగా కోరారు. ఆయన వచ్చి తమకు సరియైన మార్గం చూపించాలని కోరారు.

ఈలోగా యూనుస్ ప్రవక్త (అలైహిస్సలాం) ఒక పడవలో ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు కొంతమంది ప్రయాణీకులు ఉన్నారు. సముద్రంలో ప్రయాణమైన తర్వాత తీవ్రమైన తుఫాను గాలికి పడవ చిగురుటాకులా వణకి పోసాగింది. పర్వతాల వంటి అలల తాకిడికి పడవ తలక్రిందులైపోతోంది. పడవలో చాలా సామాను ఉంది. ప్రయాణీకులు తమ సామాన్లను పడవ నుంచి బయటకు విసరివేసారు. అయినా పడవలో బరువు చాలా ఎక్కువ ఉంది. ఇంకా బరువు తగ్గించకపోతే పడవకు ప్రమాదం. కాబట్టి కనీసం ఒక వ్యక్తిని సముద్రం లోకి విసిరేస్తే బరువు తగ్గుతుందని మిగిలిన వాళ్ళు బ్రతుకుతారని అనుకున్నారు. అందరూ చీటీలు వేశారు. ఈ లాటరీలో యూనుస్ ప్రవక్త పేరు వచ్చింది.

యూనుస్ ప్రవక్త గురించి వారికి తెలుసు. చాలా మంచివారు, గౌరవ నీయుడు. అటువంటి మనిషిని సముద్రంలో వదిలేయడానికి వాళ్ళు ఇష్టపడ లేదు. అందువల్ల వాళ్ళు మళ్ళీ లాటరీ వేశారు. రెండవసారి కూడా యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది. చివరిసారిగా చూద్దామని మూడవసారి వేశారు. అప్పుడు కూడా యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది. ఇందులో అల్లాహ్ అభీష్టం ఉందని యూనుస్ ప్రవక్త గుర్తించారు. ఆయన అల్లాహ్ అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదలివేశారు. ఒక ప్రవక్తగా ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారు.

ప్రయాణీకులు తనను సముద్రంలో వదిలేయక ముందే ఆయన లేచి అల్లాహ్ పేరు స్మరిస్తూ సముద్రంలోకి దూకారు. భారీ అలల్లో ఆయన కలసిపోయారు.

యూనుస్ (అలైహిస్సలాం) కళ్ళు తెరిచేసరికి తాను తడితడిగా మెత్తగా ఉన్న ఒక నేలపై ఉన్నట్లు భావించారు. తన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా మూసివేయబడిన ఒక గుహలా ఉంది. అంతా చాలా చీకటిగా ఉంది. కాని చాలా మృదువుగా, మెత్తగా ఉంది. ఆయనకు కుదుపులు తగులుతున్నాయి. అలల్లో పడవకు తగిలే కుదుపుల వంటివి. తాను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్లు ఆయన గుర్తించారు. తుఫాను సముద్రంలో ఆయన్ను కాపాడడానికి గాను అల్లాహ్ ఆయన్ను ఒక చేప మింగేసేలా చేశాడు. ఆయన వెంటనే అల్లాహ్ ను తలచుకుని తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. “అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు. ఔన్నత్యం ఆయనదే. నిస్సందేహంగా నేను తప్పు చేశాను” అన్నారు. అనంత కరుణామయుడు, అపారంగా క్షమించేవాడయిన అల్లాహ్ ఈ ప్రార్ధనను ఆలకిం చాడు. ఆ వెంటనే తాను బలవంతంగా బయటకు తోయబడిన అనుభూతి యూనుస్ (అలైహిస్సలాం)కు కలిగింది. ధడాలున ఆయన మెత్తని నేలపై వచ్చిపడ్డారు. ఆయన్ను బయటకు కక్కేసేలా అల్లాహ్ ఆ చేపకు ఆజ్ఞాపించాడు. యూనుస్ (అలైహిస్సలాం) వెంటనే అల్లాహ్ కు కృతజ్ఞతలు చెల్లించారు.

ఆయన ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నారు. బలహీనంగా, ఒంటరిగా మిగిలి పోయారు. ఆయన పెద్ద పెద్ద ఆకులున్న ఒక పొదలో పడి ఉన్నారు. ఎండ వేడిమి నుంచి ఆ ఆకులు రక్షణ కల్పిస్తున్నాయి. అక్కడ చాలా సొరకాయలు ఉన్నాయి. వాటితో ఆయన తన ఆకలిని తీర్చుకున్నారు. నెమ్మదిగా ఆయన శక్తిని పుంజు కున్నారు. తన స్వస్థలం నైనవాహ్ కు  ప్రయాణమయ్యారు. అక్కడ ప్రజల్లో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందించారు. ప్రజలంతా ఆయన్ను చాలా ఆదరంగా స్వాగతించారు. తామంతా నిజమైన దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించామని ఆయనకు తెలిపారు. వారంతా కలసి అల్లాహ్ కు కృతజ్ఞతా సూచకంగా ప్రార్ధనలు చేశారు. (చదవండి దివ్య ఖుర్ ఆన్  6:86-57, 21:87-88 37:139-158)

యూనుస్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు అప్పగించబడిన పనిని మధ్యలో విడిచి పెట్టి పట్టణాన్ని వదలి వెళ్ళిపోయారు. ఆయన అల్లాహ్ ను మార్గదర్శనం కొరకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్లక్ష్యానికి శిక్షను అనుభవించారు. తమపై శిక్ష విరుచుకుపడే సూచనలు కనబడగానే దుర్మార్గులు తమ తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాభిక్ష అర్ధిస్తూ కారుణ్యం కోసం ప్రార్ధంచారు. అల్లాహ్ తన ఆగ్రహాన్ని ఉపసంహరించుకుని వారిని సురక్షితంగా విడిచిపెట్టాడు. 

యూనుస్ ప్రవక్త (అలైహిస్సలాం) విషయంలోనూ ఇదే జరిగింది. అల్లాహ్ ఆయన్ను ఒక విచిత్రమైన, భయంకరమైన సంఘటనకు గురిచేశాడు. ఆయన తన తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. అల్లాహ్ కరుణ చూపి ఆయన్ను కాపాడాడు.

ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) చేసిన సరళమైన, చిన్న ప్రార్ధన చాలా ప్రాముఖ్యం కలిగినది

హజ్రత్ సాద్ బిన్ అబీ వక్కాస్ ఉటంకం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “కష్టాల్లో ఉన్న ముస్లిం యూనుస్ ప్రవక్త చేసిన ప్రార్ధనతో అల్లాహ్ కు  మొరపెట్టుకుంటే అల్లాహ్ ప్రతిస్పందిస్తాడు. ఇది అల్లాహ్ చేసిన వాగ్దానంగా భావించబడుతుంది” – లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక , ఇన్ని కుంతు మినజ్ఞాలిమీన్.

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

దొంగతనం మరియు ఇస్లాం బోధనలు [వీడియో & టెక్స్ట్]

దొంగతనం మరియు ఇస్లాం బోధనలు
https://youtu.be/htWndMP8VBQ [55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, దొంగతనం మరియు దానిపై ఇస్లామీయ బోధనల గురించి వివరించబడింది. దొంగతనం ఇస్లాంలో ఒక ఘోరమైన పాపంగా పరిగణించబడుతుందని, దానిని నివారించడానికి ఖురాన్ మరియు హదీసులలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వక్త తెలియజేశారు. సూరహ్ అల్-మాయిదాలోని ఆయతులను ఉటంకిస్తూ, దొంగతనం చేసిన స్త్రీపురుషులకు ఇస్లామీయ ప్రభుత్వం విధించే శిక్ష గురించి, మరియు పశ్చాత్తాపపడితే అల్లాహ్ క్షమించే కారుణ్యం గురించి వివరించారు. దొంగతనం యొక్క చెడు ప్రభావాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని సంఘటనలను ఉదాహరణలుగా చూపిస్తూ, ఈ చెడు గుణానికి దూరంగా ఉండాలని, ధర్మబద్ధమైన జీవితం గడపాలని ప్రబోధించారు. ఈ నేరానికి పాల్పడిన వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో ఎదురయ్యే తీవ్రమైన పరిణామాల గురించి కూడా హెచ్చరించారు.

అల్ హందులిల్లాహ్.

الْحَمْدُ لِلَّهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، أَمَّا بَعْدُ: فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ، وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ، وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ

సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభిల్లుతాయి. మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము, ఆయననే క్షమాపణ వేడుకుంటున్నాము. మా ఆత్మల కీడుల నుండి, మా దుశ్చర్యల నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము. అల్లాహ్ మార్గదర్శకత్వం వహించినవానిని ఎవరూ మార్గభ్రష్టతకు గురిచేయలేరు. ఆయనచే మార్గభ్రష్టతకు గురైనవానికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు. అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. ఆ తర్వాత, నిశ్యయంగా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం, ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. కార్యాలలోకెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. ప్రతి కొత్త కల్పన ఒక బిద్అత్ (ధర్మభ్రష్టత). ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత. ప్రతి మార్గభ్రష్టత నరకానికి దారితీస్తుంది.

أعوذ بالله السميع العليم من الشيطان الرجيم
(అవూజు బిల్లాహిస్ సమీఇల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్)
సర్వశ్రోత, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాన్ నుండి.

وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
దొంగతనం చేసినది – పురుషుడైనా, స్త్రీ అయినా – ఉభయుల చేతులూ నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లాహ్‌ తరఫున విధించబడిన శిక్ష. అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా. (5:38)

فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّهَ يَتُوب عَلَيْهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్‌ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను. (5:39)

أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَن يَشَاءُ وَيَغْفِرُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్‌దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచినవారిని క్షమిస్తాడు. అల్లాహ్‌ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు.(5:40)

సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు, అన్ని రకాల గొప్పతనాలు కేవలం ఏకైక సృష్టికర్త మరియు మనందరి ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి.

ప్రియ వీక్షకుల్లారా! సోదర సోదరీమణులారా! ఈరోజు మన అంశం దొంగతనం మరియు ఇస్లామీయ బోధనలు. దొంగతనం మరియు ఇస్లామీయ బోధనలు ఈ అంశాన్ని పురస్కరించుకొని నేను సూరతుల్ మాయిదా, సూర నెంబర్ ఐదు, ఆయత్ నంబర్ 38 నుండి 40 వరకు మూడు ఆయతులు తిలావత్ చేశాను. నేను తిలావత్ చేసినటువంటి ఈ ఆయతుల అనువాదం ముందు మీరు వినాలని ఆ తర్వాత మనం ఇన్షా అల్లాహ్ మన అంశంలో మరికొన్ని వివరాలు తెలుసుకుందాము.

దొంగతనం చేసినది పురుషుడైనా స్త్రీ అయినా ఉభయుల చేతులు నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం, అల్లాహ్ తరఫున విధించబడిన శిక్ష, అల్లాహ్ సర్వాధిఖ్యుడు, వివేచనాశీలి కూడా. (5:38)

పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్‌ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను. (5:39)

ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్‌దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచినవారిని క్షమిస్తాడు. అల్లాహ్‌ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు. (5:40)

పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపం చెంది, ఇక్కడ ఈ అనువాదం చాలా శ్రద్ధగా గమనించండి.

فَمَن تَابَ مِن بَعْدِ ظُلْمِهِ
ఈ దుర్మార్గానికి పాల్పడిన తర్వాత పశ్చాత్తాపపడి

అని ఇక్కడ అరబీలో అల్లాహుతాలా ఖురాన్ లో జుల్మ్ అన్న పదం చెప్పాడు. దీనికి పాపం అన్న ఒక భావం కూడా వస్తుంది. మరియు సర్వసామాన్యంగా జుల్మ్, హక్కు గల వారి నుండి వారి హక్కును దోచుకోవడం, తీసుకోవడం, లాక్కోవడం మరియు అలాగే దౌర్జన్యం, అన్యాయం ఈ భావాల్లో కూడా వస్తుంది.

అల్లాహ్ ఏమంటున్నాడు? ఈ దౌర్జన్యానికి ఈ పాపానికి దొంగతనం లాంటి చెడ్డ గుణానికి పాల్పడిన తర్వాత నిజంగా అతను పశ్చాత్తాపం చెంది అల్లాహ్ వైపునకు మరలి క్షమాపణ కోరుకొని وَأَصْلَحَ (వ అస్లహ) తన నడవడికను సరిదిద్దుకున్న వాని వైపుకు అల్లాహ్ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడు. ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహ్ దే నన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచిన వారిని క్షమిస్తాడు. అల్లాహ్ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు.

సోదర మహాశయులారా! మనం ఏ అంశంపై చదవదలుచుకున్నా, వినదలుచుకున్నా, ఏ అంశం పైనైనా మనం మాట్లాడదలుచుకున్నా, ఖురాన్ మరియు హదీసులో దాని గురించి ఏముంది? సహాబాలు ఆ అంశాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? దీనిని మనం అన్నింటికంటే ముందు పెట్టి ఆ అంశాన్ని పరిశీలించాలి, అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి.

ఈ ఆయత్ యొక్క వివరణ ఇన్షా అల్లాహ్ మరి కొన్ని క్షణాల్లో ముందుకు రానున్నది. అయితే రండి. మన ఈనాటి అంశం దొంగతనం మరియు ఇస్లాం బోధనలు. ఈ రోజుల్లో ఎన్నో రకాల రంగాలలో దొంగతనం యొక్క ఎన్నో రకాలు చాలా ప్రబలిపోయి ఏవైతే ఉన్నాయో, దానిని అంతమొందించి, ఈ చెడు గుణాన్ని నిర్మూలించాలంటే ఇస్లాం మాత్రమే సరియైన మంచి పరిష్కారం. అయితే ఒక రెండు పలుకుల్లో చెప్పాలంటే దొంగతన నిర్మూలానికి, దొంగతనం లాంటి చెడు గుణం దూరం కావడానికి ఇస్లామే సరియైన పరిష్కారం.

ఎందుకంటే ఇస్లాం ధర్మం అన్ని రకాల ప్రజలపై ఉన్నటువంటి భారాలను దించి వేయడానికి, వారు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక రుగ్మతలను, వారు ఏ సామాజిక రుగ్మతలలో కొట్టుమిట్టాడుతున్నారో చాలా ఇబ్బందికి మరియు కష్టానికి గురై ఉన్నారో వాటి మంచి ఉత్తమ పరిష్కారం ఇస్లాం తెలియజేసింది. ఇస్లాం కొన్ని హద్దులు, ఉదాహరణకు, దొంగతనానికి, వ్యభిచారానికి, ఏ ఆధారం లేకుండా ఒకరిపై వారి మానభంగం, వారి యొక్క పరువు విషయంలో జోక్యం చేసుకొని అపనిందలు వేసే వారిపై కొన్ని రకాల శిక్షలు ఏదైతే విధించినదో, మరియు ఇస్లామీయ పరిభాషలో వాటిని الْحُدُود (అల్ హుదూద్) అని అంటారో, ఈ హద్దులు ఏవైతే నిర్ణించబడ్డాయో, ఈ శిక్షలు ఏవైతే నిర్ణయించబడ్డాయో, ఎవరి మనసులలో రోగాలు ఉన్నాయో అవి బాగుపడడానికి, జనులపై అల్లాహ్ వైపు నుండి కరుణగా అవి వచ్చాయి. మరియు చివరికి హత్యకు బదులుగా హత్య అన్నటువంటి ఏ హక్కైతే ఇస్లాం ప్రభుత్వాలకు ఇచ్చినదో, ఇందులో కూడా బుద్ధిమంతులకు, జ్ఞానవంతులకు ఎంతో గొప్ప గుణపాఠం ఉన్నది.

وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ
(వలకుమ్ ఫిల్ ఖిసాసి హయాతున్ యా ఉలిల్ అల్బాబ్)
ఇందులో వాస్తవానికి ఒక జీవనం ఉన్నది. దీనిని బుద్ధిమంతులు మాత్రమే గ్రహించగలరు.

అని అల్లాహుతాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాగే, ఎవరైతే ఒకరి సొమ్మును దొంగతనంగా, ఒకరి హక్కును దొంగతనంగా కాజేసుకుంటారో, అలాంటి వారి యొక్క చేతులను నరకాలి అని ఏదైతే శిక్ష వచ్చిందో, అది కూడా ప్రజల యొక్క సొమ్ము, వారి యొక్క ధనం, వారి యొక్క హక్కులు భద్రంగా ఉండాలని. అలాగే మనం ఇంకా ఇతర ఎన్నో రకాల హద్దులను ఏదైతే చూస్తున్నామో, వాస్తవానికి ఇందులో ప్రజల కొరకు ఎంతో మేలు ఉంది.

కొన్ని సందర్భాల్లో మనకు ఇస్లాం యొక్క జ్ఞానం తక్కువ ఉండడం వల్ల ఏదైనా ఒక శిక్ష గురించి అయ్యో, ఇంత చిన్న పాపానికి ఇంత పెద్ద శిక్షనా అన్నట్లుగా కొందరు భావిస్తారు. కానీ దాని యొక్క సంపూర్ణ జ్ఞానం లభించినదంటే అది వాస్తవానికి మేలు అన్న విషయాన్ని గ్రహిస్తారు.

సోదర మహాశయులారా! సోదరీమణులారా! సమాజంలో ప్రబలి ఉన్నటువంటి ఎన్నో రకాల చెడులలో ఒకటి, ఒక చెడు దొంగతనం. దొంగతనం ఇళ్లల్లో పిల్లలు వారి చిన్న వయసు నుండి చేయడం ఏదైతే మొదలు పెడతారో, ఈ దురలవాటు వారు వయసు వారైన తర్వాత పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. చివరికి ఇది సమాజానికే ఎంతో వినాశకరంగా మారుతుంది.

అయితే దొంగతనం గురించి మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఇది ఘోర పాపాల్లోని ఒక పాపం. ఎవరైతే దొంగతనానికి పాల్పడుతున్నారో, వారు గ్రహించాలి. ఆ దొంగతనం ఏదైనా చిన్న వస్తువుది చేసినా, ఏదైనా పెద్ద వస్తువుది చేసినా, దొంగతనం చేయబడినటువంటి ఆ వస్తువు దానికి ఎంతో పెద్ద రేట్ ప్రైస్ వెల ఉన్నా లేకపోయినా, ఇక్కడ ముందు గమనించవలసిన విషయం అల్లాహ్ దొంగతనాన్ని నిషిద్ధపరిచాడు. ఎందుకంటే ఇస్లాం ధర్మం, ధర్మాన్ని, మానవుల యొక్క మానాన్ని, పరువును, వారి యొక్క ధనాన్ని అన్ని రకాలుగా వారికి భద్రత ఇస్తుంది. మరియు దొంగతనం అనేది వారి ఆర్థిక విషయాల్లో ఇంకా వేరే రకంగా కూడా వారికి అన్యాయం ఇందులో జరుగుతుంది గనక ఇస్లాం దీనిని నిషిద్ధపరిచింది.

అయ్యో చిన్నదే కదా అని ఎవరైతే కొందరు అనుకుంటారో, ఇక్కడ వారు గమనించాలి. గొప్పవాడైనటువంటి అల్లాహ్ అజ్జవజల్లా యొక్క ఆదేశానికి వ్యతిరేకం చేస్తున్నారు. అతని ఆజ్ఞ పాలన చేయడం లేదు. ఇది చాలా ఘోరమైన పాపం అన్న విషయాన్ని గ్రహించాలి.

అందుకొరకే సుమారు మొత్తమొక సూరాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో సుమారు చివరిగా అవతరించినటువంటి సూరతుల్ మాయిదా, దాని ఆయత్ నెంబర్ 38లో అల్లాహుతాలా ఇలాంటి దుశ్చేష్టకు పాల్పడే వారి చేతులను నరకాలి. ఆ దొంగతనం చేసేవారు పురుషుడైనా, స్త్రీ అయినా, ఇద్దరికీ ఈ శిక్ష పడాలి అని చాలా స్పష్టం చేశారు.

మరి ఇక్కడ గమనించవలసిన విషయం ఆయత్ యొక్క చివరిలో:

وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
(వల్లాహు అజీజున్ హకీమ్)
అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా.

నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను కదా. ఖురాన్లో ఎక్కడైతే అల్లాహ్ యొక్క పేర్లు వస్తున్నాయో, ఆయత్ యొక్క చివరిలో ఆ పూర్తి ఆయత్ యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకొని అల్లాహ్ యొక్క పేర్లు ఏవైతే వచ్చాయో, వాటిపై అవగాహన, పరిశీలన, దూరపు ఆలోచన, తదబ్బుర్, తఫక్కుర్ చాలా అవసరం.

ఎందుకంటే, ఇందులోనే గమనించండి. అల్లాహుతాలా దొంగతనం చేసేవారు పురుషులైనా, స్త్రీ అయినా వారి యొక్క చేతులను నరకండి. ఇది వారు చేసినటువంటి పాపానికి ఒక శిక్ష అని ఏదైతే అంటున్నాడో, వెంటనే ఏమన్నాడు? వల్లాహు అజీజున్ అంటే ఏంటి? అల్లాహుతాలా చాలా అధికారం గలవాడు. ఎలాంటి? అతనికి ఎలాంటి సర్వాధికారం ఉన్నది అంటే అతడు ఒక ఆదేశం ఇచ్చాడంటే దానికి తిరుగు అనేది ఉండదు. ఎవరైతే అతని ఆ ఆదేశానికి వ్యతిరేకంగా చేస్తాడో అతడే నష్టంలో పడిపోతాడు. ఇక హకీం, చూడడానికి ఇక్కడ ఒక మనిషి చెయ్యిని నరికి వేయడం జరుగుతుంది. ఇలాంటి ఆదేశం అల్లాహ్ ఇస్తాడా? హకీం అతడు సంపూర్ణ వివేకం గలవాడు. అతడు ఇచ్చినటువంటి ఈ ఆదేశంలో ఎన్నో వివేకవంతమైన విషయాలు, బోధనలు ఉన్నాయి. ఇందులో చాలా గొప్ప హితోపదేశాలు ఉన్నాయి. వాటిని గమనించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ మాట పలకరాదు.

దొంగతనం సమాజానికి చాలా నష్టం చేకూర్చునది గనక ఇస్లాంలో వచ్చే వారితో ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షిర్క్ చేయకూడదు అన్నటువంటి వాగ్దానం ఏదైతే తీసుకునేవారో, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఇలాంటి చెడు గుణాలు చేయకుండా పవిత్రంగా ఉంటారన్నటువంటి వాగ్దానం కూడా తీసుకునేవారు.

దీనికి సంబంధించి సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలలో చాలా స్పష్టంగా హదీస్ వచ్చి ఉంది. సహీ బుఖారీలోని హదీస్ నెంబర్ 18, సహీ ముస్లింలోని 1709 హదీసులు గమనిస్తే ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు తాలా అన్హు తెలుపుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ సహాబాలు కూర్చుని ఉన్నారు. ప్రవక్త వారు చెప్పారు,

بَايِعُونِي عَلَى أَنْ لاَ تُشْرِكُوا بِاللَّهِ شَيْئًا، وَلاَ تَسْرِقُوا، وَلاَ تَزْنُوا، وَلاَ تَقْتُلُوا أَوْلاَدَكُمْ، وَلاَ تَأْتُوا بِبُهْتَانٍ تَفْتَرُونَهُ بَيْنَ أَيْدِيكُمْ وَأَرْجُلِكُمْ، وَلاَ تَعْصُوا فِي مَعْرُوفٍ
(బాయిఊనీ అలా అల్లా తుష్రికూ బిల్లాహి షైఅ, వలా తస్రికూ, వలా తజ్నూ, వలా తక్తు లూ అవ్లాదకుం, వలా తతూ బిబుహ్తానిన్ తఫ్తరూనహు బైన ఐదీకుం వఅర్జులికుం, వలా తఅసూ ఫీ మఅరూఫిన్)

బైఅత్ చేయండి, శపదం చేయండి, మీరు ఏ మాత్రం అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయరు, షిర్క్ చేయరు అని. దొంగతనం చేయరు అని. వ్యభిచారం చేయరు అని. మీ సంతానాన్ని హతమార్చరని. మీరు ఎవరిపై ఎలాంటి అపనింద వేయరు అని. మరియు మేలు విషయాల్లో ఏ ఆదేశం నేను మీకు ఇస్తున్నానో, దానికి మీరు అవిధేయత పాటించరని కూడా వాగ్దానం చేయండి

గమనిస్తున్నారా? ఎలా వాగ్దానం తీసుకునేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ వాగ్దానం కేవలం పురుషులతోనే కాదు, స్త్రీలతో కూడా తీసుకునేవారు. ముస్లిం షరీఫ్ లోని ఈ హదీస్ ని గమనించండి, 1866. అల్లాహుతాలా సూరతుల్ ముమ్తహినా ఆయత్ నెంబర్ 12లో దీని ప్రస్తావన చేశారు.

గమనించండి. ఈ ఆయతును శ్రద్ధ వహించండి.

يَا أَيُّهَا النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَايِعْنَكَ عَلَىٰ أَن لَّا يُشْرِكْنَ بِاللَّهِ شَيْئًا وَلَا يَسْرِقْنَ وَلَا يَزْنِينَ وَلَا يَقْتُلْنَ أَوْلَادَهُنَّ وَلَا يَأْتِينَ بِبُهْتَانٍ يَفْتَرِينَهُ بَيْنَ أَيْدِيهِنَّ وَأَرْجُلِهِنَّ وَلَا يَعْصِينَكَ فِي مَعْرُوفٍ ۙ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللَّهَ ۖ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ

ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించబోము అనీ, దొంగతనం చేయబోము అనీ, వ్యభిచారానికి పాల్పడబోము అనీ, తమ సంతానాన్ని చంపబోము అనీ, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్నీ కల్పించబోము అనీ, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు. వారి క్షమాపణ కొరకు అల్లాహ్ ను ప్రార్ధించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి. (60:12)

ఆయిషా రదియల్లాహు తాలా అన్హా తెలుపుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలతో కూడా ఇలాంటి శపదం తీసుకునేవారు. కానీ ఏం జరిగేది? ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులతో వాగ్దానం తీసుకునే సందర్భంలో చేతిలో చేయి వేసి వారితో శపదం తీసుకునేవారు. కానీ స్త్రీలతో ఏ మాత్రం చేయి ముట్టుకునేవారు కాదు. ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు,

وَاللَّهِ مَا مَسَّتْ يَدُ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدَ امْرَأَةٍ قَطُّ
(వల్లాహి మా మస్సత్ యదు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యదంరఅతిన్ కద్)
ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శుభ హస్తం ఏ పరాయి స్త్రీని తాకలేదు, ఏ పరాయి స్త్రీ యొక్క చేతిని అంటుకోలేదు, ముట్టలేదు.

غَيْرَ أَنَّهُ يُبَايِعُهُنَّ بِالْكَلَامِ
(గైర అన్నహు యుబాయి ఉహున్న బిల్ కలాం)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోటి మాట ద్వారానే వారితో శపదం తీసుకునేవారు.

అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి? దొంగతనం ఎంతటి చెడ్డ దురలవాటు, కొన్ని సందర్భాలలో ఇస్లాంలో ప్రవేశించే స్త్రీ పురుషులందరితో కూడా దీని గురించి వాగ్దానం తీసుకోబడేది. దీని ద్వారా ఈ చెడు గుణం యొక్క చెడుతనం అర్థమవుతుంది కదా? అలాగే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఈ దొంగతనం అన్నది ఎంతటి చెడ్డ గుణం అంటే,

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ
(వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్)
సర్వ లోకాల కొరకు మేము మిమ్మల్ని కారుణ్య మూర్తిగా పంపాము

అని ఎవరి గురించైతే అల్లాహ్ తెలుపుతున్నాడో, అలాంటి కారుణ్య మూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దొంగతనం చేసే వారిని لَعْنَة (లఅనత్) చేశారు, శపించారు, ఏం చెప్పారు? సహీ హదీసులో వచ్చి ఉంది. సహీ బుఖారీ 6783 మరియు సహీ ముస్లిం 1687.

لَعَنَ اللَّهُ السَّارِقَ
(లఅనల్లాహు స్సారిక్)
దొంగతనం చేసే వారిని అల్లాహ్ శపించాడు.

ఇలా కూడా వస్తుంది దీని భావం.
దొంగతనం చేసే వారిని అల్లాహ్ శపించుగాక.

అల్లాహ్ శపించుగాక అంటే ఏంటో అర్థం తెలుసా మీకు? అల్లాహ్ అతన్ని తన కారుణ్యం నుండి దూరం చేయుగాక. అల్లాహ్ యొక్క కారుణ్యం ఇలాంటి చెడు గుణానికి పాల్పడే వారికి అల్లాహ్ యొక్క దయ, కరుణ ఏదీ కూడా లభించకుండా ఉండాలి.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ (బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం) అని మాటిమాటికి మనం చదువుతుంటాము. ఏంటి? అల్లాహ్ యొక్క రెండు గుణాలు అందులో వచ్చాయి. الرَّحْمَٰن (అర్రహ్మాన్) الرَّحِيم (అర్రహీం). ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం رَءُوفٌ رَحِيمٌ (రఉఫుర్రహీం). కానీ దొంగతనం ఎంత చెడ్డ గుణం, అలాంటి వారి గురించి ప్రవక్త శపించారు, అలాంటి వారిపై అల్లాహ్ యొక్క శాపం పడుతుంది.

ఇక ఇంత విన్న తర్వాత ఎవరైనా తనకు తాను అల్లాహ్ యొక్క శాపానికి గురి చేసుకోవడం ఇది మంచిదేనా ఒకసారి గమనించండి. దొంగతనం ఎంత చెడ్డ గుణం, దీనికి పాల్పడే వారికి ఇతర పాపాలు, ఇతర నేరాలతో పాటు ఈ దొంగతనానికి పాల్పడినందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరికి ఎలాంటి శిక్ష ఇచ్చారో ఒక్కసారి గనక మీరు గమనించారంటే, సహీ బుఖారీ, సహీ ముస్లింలో వారి ప్రస్తావన వచ్చి ఉంది.

ఉకల్ లేదా ఉరైనా కబీలాకు సంబంధించిన కొంత మంది మదీనాలో వచ్చారు. అక్కడి వాతావరణం వారికి అనుకూలంగా లేకుండినది. అనారోగ్యానికి పాలయ్యారు. వారి యొక్క రోగాన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెలు కట్టే చోట ఏదైతే ఉంటుందో, మదీనా సిటీకి కొంచెం దూరంలో, అక్కడికి వారిని పంపి కొంచెం బయటి ప్రాంతంలో, బయటి వాతావరణంలో అక్కడ ఉండండి, ఆ ఒంటె యొక్క పాలు మరియు దాని యొక్క మూత్రం మీ ఈ రోగానికి ఒక మంచి చికిత్స అని తెలియజేశారు. అయితే వారు కొద్ది రోజులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆరోగ్యవంతులైపోయారు. వారికి స్వస్థత కలిగింది. చూడండి, ఉపకారానికి అపకారము చేయరాదు అని చదువుకుంటూ ఉంటాము కదా మనం. కానీ దీనికి విరుద్ధంగా వారేం చేశారు? ఆ ఒంటెల కాపరి అక్కడ ఎవరైతే ఉన్నారో, ఆ ఒంటెల కాపరిని హతమార్చి, ఒంటెలు దొంగతనం చేసి మరియు అరాచకం చేసి అక్కడి నుండి పారిపోయారు. పొద్దు పొద్దున్న ఈ నేరాలు, ఈ ఘోర పాపాలకు గురై అక్కడి నుండి పారిపోయారు అన్న విషయం ప్రవక్తకు తెలిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమంది వీరులను వారిని పట్టుకోవడానికి పంపారు. సహాబాలు, వీరులు వారిని గాలించి, వెతికి పట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకొచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పగటి పూట రాకముందే వారిని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి ఒక చెయ్యిని, ఒక కాలును నరికి వేయడంతో పాటు వారికి ఘోరమైన శిక్ష విధించడం జరిగింది. మరియు ఒకచోట ఎక్కడైతే సౌకర్యాలు లేవో అక్కడ వారిని వదలడం జరిగింది.

అబూ కిలాబా రహిమహుల్లాహ్ ఈ హదీస్ ను ఉల్లేఖించిన వారు, ఒక తాబియీ చెబుతున్నారు,
فَهَؤُلَاءِ
(ఫహా ఉలా)
ఈ ముజ్రిమీన్, ఈ క్రిమినల్ పర్సన్స్,

سَرَقُوا
(సరకూ)
దొంగతనానికి పాల్పడ్డారు,

وَقَتَلُوا
(వకతలూ)
హత్య నేరానికి పాల్పడ్డారు,

وَكَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ
(వకఫరూ బాద ఈమానిహిం)
విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు,

وَحَارَبُوا اللَّهَ وَرَسُولَهُ
(వహారబుల్లాహ వరసూల)
అల్లాహ్ మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమయ్యారు.

గమనిస్తున్నారా? ఈ నేరాలలో ఒకటి ఏముండినది? దొంగతనం కూడా ఉండినది. ఇక అల్లాహుతాలా వారికి ఎలాంటి శిక్ష ఇచ్చాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎలాంటి శిక్ష విధించారో విన్నారు.

అందుకే సోదర మహాశయులారా, ఇక్కడి వరకే సరిపోదు, ఒకవేళ దొంగతనం చేసే వ్యక్తి స్వచ్ఛమైన తౌబా చేసి తన మనసును పరిశుభ్రం చేసుకొని అల్లాహ్ తో భయపడి ఈ తప్పిదాన్ని, ఈ పాపాన్ని వదలలేదు అంటే అతడు మరీ ఘోరాతి ఘోరమైన శిక్షకు గురి అవుతాడు. ఏంటి ఆ శిక్ష? అల్లాహు అక్బర్. గమనించండి. ఆ శిక్ష ఏమిటో, ఎలాంటి రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నమాజులో ఉండగా ఇలాంటి పాపానికి పాల్పడే వారి శిక్ష నరకంలో ఏముందో అది చూపించబడింది అంటే ఆ సిచువేషన్, ఆ సందర్భాన్ని మీరు గ్రహించండి. ఈ దొంగతనం లాంటి చెడ్డ గుణం ఎంత చెడ్డదో అర్థం చేసుకోండి.

అనేక హదీసుల్లో వచ్చిన విషయం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి సూర్య గ్రహణం అయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా దీర్ఘంగా ఖియాం, రుకూ, సజ్దాలు చేస్తూ రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఆ నమాజ్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గం మరియు స్వర్గ యొక్క భోగ భాగ్యాలు పొందే కొందరు స్వర్గ వాసులను చూపించడం జరిగింది. ఏ సదాచరణ, సత్కార్యాల వల్ల ఎవరు ఏ స్వర్గ భాగ్యం పొందారో, స్వర్గంలో ఏ స్థానం పొందారో అది చూపించడం జరిగింది ప్రవక్తకు. అలాగే కొన్ని ఘోరమైన పాపాలు, నేరాలకు పాల్పడే వారిని కూడా వారు నరకంలో ఎలాంటి శిక్ష పొందుతున్నారో చూపించడం జరిగింది.

సోదర మహాశయులారా, ఆ సందర్భంలో ఏం జరిగింది? ఒకసారి మీరు గమనించారంటే ఎంత భయాందోళన కలిగే విషయం. ఆ హదీస్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకంలో ఎవరెవరిని చూశారో, ఏ ఏ పాపాలు చేసే వారిని చూశారో, కొందరి గురించి ప్రస్తావించారు. అందులో ఒకరు ఎవరు?

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండు ఒంటెలను దొంగతనం చేశాడు. అతన్ని చూపించడం జరిగింది. అలాగే హజ్ కొరకు వచ్చిన వారు, అల్లాహ్ యొక్క గృహం, దాని యొక్క దర్శనం కొరకు, తవాఫ్ చేయడానికి వచ్చిన వారిని దొంగలించే దొంగను కూడా అందులో చూశారు. మరియు కొందరు దొంగతనంలో కూడా తమకు తాము ఎంత హుషారీతనం, ఎంత నైపుణ్యం కలిగి ఉన్నారో అన్నటువంటి గర్వానికి గురవుతారు. అలాంటి ఒక ప్రస్తావన కూడా అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఏంటి? ఒక దొంగ ఒక కట్టె తీసుకుని ఉంటాడు, దాని యొక్క చివరిలో కొంచెం ఇలా వంగి ఉంటుంది. హజ్ చేసే సందర్భంలో కొందరు తమ యొక్క ఏదైనా సామాన్, ఆ సామానుకు తన యొక్క ఆ కట్టెను ఇలా మెల్లగా తగిలించి, అతడు ఆ సామాను యొక్క వ్యక్తి గ్రహించకుండానే దాన్ని కింద పడేసుకొని లాక్కునే ప్రయత్నం చేసేవాడు. ఒకవేళ సామాను గల వ్యక్తి చూశాడు, గమనించాడు అంటే అయ్యో సారీ నా యొక్క కట్టె తగిలిపోయిందండి మీ సామానులో అనేవాడు. ఒకవేళ గమనించకుంటే దొంగలించి తీసుకెళ్లేవాడు. పవిత్రమైన స్థలం, సామాన్య నేరాల యొక్క పాపము, దాని యొక్క స్థానం అక్కడ ఎక్కువ పెరిగిపోతుంది హరంలో. అలాంటి చోట ఈ దొంగతనం చేసే వ్యక్తి మరియు ఇలాంటి సాకులు చెప్పుకుంటూ తనకు తాను ఎంతో హుషారీతనం చేస్తున్నాడు అన్నట్లుగా భావిస్తూ ఉన్న అలాంటి వారిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకంలో చూశారు.

అంటే ఏం తెలుస్తుంది? ఎవరైతే దొంగతనానికి పాల్పడతారో స్వచ్ఛమైన తౌబా చేసి ఆ చెడు గుణానికి దూరంగా ఉండరో, ప్రళయ దినాన కూడా వారికి ఎలాంటి శిక్ష ఉందో ప్రవక్తకు ఈ లోకంలోనే చూపించడం జరిగింది.

అంతే కాదు సోదర మహాశయులారా, దొంగతనం ఎంతటి చెడ్డ గుణం అంటే, రవ్వంత విశ్వాసం ఉన్న వ్యక్తి కూడా వెంటనే తౌబా చేయాలి. దొంగతనం చేసిన సామాను అతని దగ్గర ఉంటే ఏదో ఒక రకంగా ఆ హక్కు గల వారికి, ఎవరి నుండి దొంగలించాడో వారికి ఇచ్చేసేయాలి. మరియు తన విశ్వాసాన్ని స్వచ్ఛమైనదిగా, బలమైనదిగా చేసుకునే ప్రయత్నం చేయాలి. లేదా అంటే చాలా ప్రమాదంలో పడిపోతాడు. ఏంటి విషయం? సహీ బుఖారీ 2475, సహీ ముస్లిం 57 హదీద్ నంబర్:

وَلاَ يَسْرِقُ حِينَ يَسْرِقُ وَهْوَ مُؤْمِنٌ
(వలా యస్రికు హీన యస్రికు వహువ ముమిన్)
దొంగతనం చేసే సందర్భంలో విశ్వాసం అతనిలో ఉండదు.

అల్లాహు అక్బర్. ఎవరైనా తనకు తాను ముస్లిం గా భావించి దొంగతనానికి పాల్పడుతున్నాడు అంటే దొంగతనం చేసే ఆ సందర్భంలో విశ్వాసం అతనిలో ఉండదు, అతని నుండి దూరమైపోతుంది. గమనిస్తున్నారా? విశ్వాసం అతనిలో ఉండజాలదు. ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాని యొక్క వివరాల్లోకి వెళ్లేది ఉంటే నా యొక్క అంశాన్ని పూర్తి చేయలేను. కానీ ఇంత విషయం కూడా మనం విన్నామంటే భయపడిపోవాలి. ఇది ఎంతటి చెడ్డ గుణం, ఆ పనికి ఆ చెడుకు పాల్పడిన సందర్భంలో విశ్వాసం మనలో ఉండదు.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇక హదీసుల్లోని వివరాల్లోకి వెళ్లి మనం చూశామంటే, అల్లాహు అక్బర్. కొన్ని కొన్ని దొంగతనాలకు ఎలాంటి శిక్షలు ఉన్నాయో, అది కూడా ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలపడం జరిగింది, ప్రవక్త వారు వాటి నుండి మనల్ని హెచ్చరించారు.

ఒకసారి ఈ హదీస్ ను వినండి. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ఎంతో మంది ఇలాంటి దొంగతనానికి పాల్పడుతున్నారు. చాలా విచిత్రం ఏమిటంటే పెద్ద పెద్ద హోదాలలో ఉన్నవారు, రాజకీయాల్లో ఉన్నవారు, డబ్బు ధనం గలవారు, ఇంకా సామాన్య ప్రజలు కూడా ఎంతో మంది ఇలాంటి పాపానికి ఒడిగడుతున్నారు. మరి వారికి ఎంత ఘోరమైన శిక్ష ఉందో, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3198, సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1610, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَنْ أَخَذَ شِبْرًا مِنَ الأَرْضِ ظُلْمًا فَإِنَّهُ يُطَوَّقُهُ يَوْمَ الْقِيَامَةِ مِنْ سَبْعِ أَرَضِينَ
ఎవరైతే మరో వ్యక్తి భూమిలో నుండి జానెడైనా అన్యాయంగా తీసుకొంటాడో, ప్రళయ దినాన ఏడు భూముల బరువు అతని మెడలో వేయబడుతుంది.

జుల్మన్ (అతని హక్కు కాదు అది కానీ అన్యాయంగా తీసుకుంటున్నాడు, దౌర్జన్యంగా తీసుకుంటున్నాడు), ఏమవుతుంది?
అతని యొక్క మెడలో ఏడు భూముల ఒక హారం లాంటిది చేసి, ఒక తౌఖ్, బంధన్ లాంటిది చేసి అతని మెడలో వేయబడుతుంది. కదిలించలేడు.

గమనించండి. జానెడు, జానెడు భూమి అన్యాయంగా తీసుకున్న వారికి ఇంత ఘోరమైన శిక్ష ఉంటే ఇక ఎవరైతే అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారో వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో గమనించండి. పంట భూముల్లో, పొలాల్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ లలో అక్కడనైతే అన్యాయంగా ఎవరిదైతే అసలు భూమి ఉంటుందో వారిపై నానా రకాలుగా ఇండైరెక్ట్ గా ఎవరెవరితో ఎన్నో లంచాలు తినిపించి ఏదో అది సెంటర్ సిటీలో ఉంది, దాని యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఓ రెండు లక్షలు వారి మూతిపై పారేస్తే ఎక్కడైనా వెళ్లి బతుకుతారు అన్నటువంటి సాకులతో, ఇంకా ఎన్నెన్నో సాకులతో భూములను కాజేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఏదైనా ఇల్లు కట్టడానికి పునాది తవ్వుతున్నారు అంటే అయ్యో పక్క వానిలో భూమి నుండి ఓ జానెడే కదా వానికి ఏం తెలుస్తుంది? ఇలాంటి అన్యాయాలకు కూడా పాల్పడతారు. కానీ గమనించండి, ఎల్లవేళల్లో ఈ హదీసును దృష్టిలో ఉంచుకోవాలి. ఇది సమాధి శిక్షల్లోని ఓ శిక్ష. అంతేకాదు, ఈ దొంగతనం ఎంతటి చెడ్డ గుణం అంటే, మనిషి ఒకవేళ ఈ చెడు గుణం నుండి ఇహలోకంలోనే తౌబా చేసుకొని దూరం కాకపోతే, తాను స్వయంగా ఎంతో పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. తన చావు సమయంలో, సమాధిలో మరియు ఆ తర్వాత ప్రళయ దినాన లేపబడినప్పుడు దీనికి సంబంధించి సహీ ముస్లింలోని ఒక హదీస్ను గమనించండి. హదీసు నెంబర్ : 1013, అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు :

تَقِيءُ الْأَرْضُ أَفْلَاذَ كَبِدِهَا أَمْثَالَ الْأُسْطُوَانِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ فَيَجِيءُ الْقَاتِلُ فَيَقُولُ فِي هَذَا قَتَلْتُ وَيَجِيءُ الْقَاطِعُ فَيَقُولُ فِي هَذَا قَطَعْتُ رَحِمِي وَيَجِيءُ السَّارِقُ فَيَقُولُ فِي هَذَا قُطِعَتْ يَدِي ثُمَّ يَدَعُونَهُ فَلَا يَأْخُذُونَ مِنْهُ شَيْئًا

భూమి తన గర్భంలోని నిధులను బంగారు, వెండి స్తంభాల రూపంలో బయటకు కక్కుతుంది. అప్పుడు హంతకుడు వచ్చి, ‘దీని కోసమే నేను హత్య చేశాను’ అంటాడు. బంధుత్వాలను తెంచుకున్నవాడు వచ్చి, ‘దీని కోసమే నేను బంధుత్వాలను తెంచుకున్నాను’ అంటాడు. దొంగ వచ్చి, ‘దీని కోసమే నా చెయ్యి నరకబడింది’ అంటాడు. ఆ తర్వాత వారంతా దానిని వదిలేస్తారు, దాని నుండి ఏమీ తీసుకోరు.

ఆ తర్వాత పరలోక దినాన వచ్చినప్పుడు, హంతకుడు వచ్చి ఏమంటాడు? నేను ఈ డబ్బు ధనం కొరకే, దీని ఆశలోనే అన్యాయంగా ఒకరిని హత్య చేశాను కదా అని పశ్చాత్తాప పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. డబ్బు ధనాల కోసం బంధుత్వాలను తెంచుకున్నవాడు ఎంతో రోదిస్తాడు, బాధపడతాడు, పశ్చాత్తాప పడతాడు. ఈ డబ్బు ధన పేరాశలో పడి నేను నా బంధుత్వాలను తెంచుకున్నాను కదా. దొంగతనం చేసి చేసిన వ్యక్తి వస్తాడు, ఏమంటాడు? ఈ డబ్బు ధన ఆశలో నేను దీనికి పాల్పడి దొంగతనం చేసినందుకు నా చేతులు నరికి వేయబడ్డాయి కదా. వారి కండ్ల ముంగట డబ్బు ధనం అంతా కనబడుతూ ఉంటుంది. అప్పుడు వారికి పశ్చాత్తాపం ఏర్పడుతుంది. దానిలో నుండి ఏ మాత్రం ఏ రవ్వంత తీసుకోరు. కానీ ఆ రోజు ఈ పశ్చాత్తాపం ఏదైనా పనికి వస్తుందా? ఆ రోజు ఈ పశ్చాత్తాపం ఏదైనా లాభం చేకూరుస్తుందా? లేదు.

సోదర మహాశయులారా! దొంగతనం ఎంత చెడ్డ గుణం అన్నది గమనించండి. ప్రవక్త మహానీయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఖురైష్ లో ఒక సంఘటన జరిగినది.

మఖ్జూం కబీలా అని ఒక వంశం ఉండినది. ఆ వంశాన్ని చాలా గౌరవంగా ప్రజలు చూసేవారు. అయితే వారిలో ఒక స్త్రీ ఉండినది. ఆమె ప్రజల యొక్క సామానులు అమానతుగా ఉంచుకునేది. కానీ ఎక్కడ ఏ చెడ్డ గుణం కలిగిందో, షైతాన్ ప్రేరణలో వచ్చేసింది, దొంగతనానికి పాల్పడింది. అయితే పేరుకు అంత మంచి స్త్రీ, ఎన్ని రోజుల నుండి చాలా పలుకుబడి ఉన్నది, మరియు వంశం కూడా ఆమెది చాలా పెద్ద వంశం. ఏమంటారు? అరే ఎంత పెద్ద మినిస్టర్ కదండీ, అగ్ర కులానికి చెందిన వారు కదండీ అని ఈ రోజుల్లో కూడా శిక్షలు పడకుండా తమ హోదా అంతస్తు, తమ వంశం పేరు మీద తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అలాంటి వారు కూడా మరి ఎవరి చేతిలోనైతే అధికారాలు ఉన్నాయో కేవలం కింది వారికి శిక్షలు ఇచ్చి పెద్దవారిని వదులుతూ ఉంటారో ఈ హదీసును వినాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆమె ప్రస్తావన వచ్చేసింది. ఇక ప్రవక్త ఆమె యొక్క చేతులు నరికి వేయడానికి శిక్ష ఇవ్వకూడదు అని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రవక్తకు చాలా ప్రియాతి ప్రియులైన వారిని ప్రవక్త వద్దకు పంపి సిఫారసులు చేయించడం మొదలు పెట్టారు. ప్రవక్త యొక్క ప్రియుడైన కొడుకు, అతను కూడా చాలా ప్రియుడు, ఉసామా బిన్ జైద్, అతన్ని పంపడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత కరాఖండిగా నిరాకరించారంటే ఉసామా భయపడిపోయారు. ఎందుకంటే ప్రవక్త వద్ద ఈ సిఫారసు గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు, ప్రవక్త ఇతని మాట విన్న తర్వాత ప్రవక్త యొక్క ముఖ కవళికలు మారిపోయాయి. ఆగ్రహానికి గురయ్యారు ప్రవక్త. ఏం చెప్పారు ప్రవక్త?

أَتَشْفَعُ فِي حَدٍّ مِنْ حُدُودِ اللَّهِ؟
(అతష్వఫీ హద్దిన్ మిన్ హుదూదిల్లాహ్)
అల్లాహ్ నిర్ణయించిన హద్దులో, అల్లాహ్ ఏ శిక్ష విధించాడో అది పడకుండా ఉండడానికి నీవు సిఫారసు చేయడానికి వచ్చావా?

ఉసామా చాలా చాలా సిగ్గుపడి, పశ్చాత్తాపపడి ప్రవక్తతో వెంటనే

اسْتَغْفِرْ لِي يَا رَسُولَ اللَّهِ
(ఇస్తగ్ఫిర్లీ యా రసూలల్లాహ్)
నేను ఇలాంటి పాపానికి, ఇలాంటి తప్పుకు గురి కాను. మీరు నా గురించి క్షమాపణ కోరండి అని చెప్పారు.

అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య, ఉమ్ముల్ ముమినీన్, ఉమ్మె సలమా రదియల్లాహు తాలా అన్హా వారి వద్దకు కూడా ఆమె వచ్చింది. ప్రవక్తకు సిఫారసు చేయాలన్నట్లుగా. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య యొక్క మాట కూడా వినలేదు. ఆ సందర్భంలోనే ప్రవక్త వారు ఒక మాట చెప్పారు, స్వర్ణాక్షరాలతో రాయబడేవి. ఏంటి?

لَوْ أَنَّ فَاطِمَةَ بِنْتَ مُحَمَّدٍ سَرَقَتْ لَقَطَعْتُ يَدَهَا
(లవ్ అన్న ఫాతిమత బిన్త ముహమ్మదిన్ సరఖత్ లఖతఅతు యదహా)
ముహమ్మద్ కుమార్తె అయినటువంటి ఫాతిమా కూడా ఒకవేళ దొంగతనం చేసింది అంటే, నేను ఆమె చేతులు కూడా నరికేవాన్ని.

ఆ తర్వాత ఆ మఖ్జూమియా కబీలాకు చెందినటువంటి స్త్రీ యొక్క చేతులు నరికేయాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆమె చేతులు నరికి వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ శిక్షను గ్రహించండి. మరియు ఈ రోజుల్లో కూడా తారతమ్యాలు ఏదైతే చేస్తారో శిక్ష విధించడంలో, అలాంటి వారు కూడా ప్రవక్త వారి ఈ మాటలు శ్రద్ధ వహించాలి. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెపై శిక్ష విధించారు. ఆమె ఆ శిక్ష పొందినది. కానీ తర్వాత స్వచ్ఛమైన తౌబా చేసినది. ఆయిషా రదియల్లాహు అన్హా చెబుతున్నారు,

حَسُنَتْ تَوْبَتُهَا وَتَزَوَّجَتْ
(హసనత్ తౌబతహా, వతజవ్వజత్)
ఆ తర్వాత ఆమె వివాహం కూడా చేసుకున్నది, చాలా మంచి జీవితం ఆమె గడిపినది.

అంటే ఇస్లాంలో ఇలాంటి గొప్ప అవకాశం కూడా ఉన్నది. ఎవరైనా వాస్తవంగా మారిపోతే, తనలో మార్పు తెచ్చుకుంటే, సంస్కరించుకుంటే ఇస్లాంలో చాలా గొప్ప స్థానం కూడా ఉన్నది. అయితే ఇక్కడ మరో విషయం ఏం తెలుస్తుంది అంటే హాకిం, ఖాదీ, జడ్జ్, ఎవరైతే శిక్ష విధించే అధికారి ఉన్నాడో అతని వద్దకు విషయం రాకముందు, దొంగ తౌబా చేసుకొని ఎవరి హక్కు ఉన్నదో వారికి ఇచ్చేస్తే ఆ హక్కు గలవారు మాఫ్ చేసేస్తే ఇక ఆ విషయం అక్కడికే అయిపోతుంది. కానీ అధికారి వద్దకు వచ్చిన తర్వాత శిక్ష అనేది తప్పనిసరిగా పడవలసిందే. దీనికి సంబంధించి కూడా మన ముందు కొన్ని హదీసులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సునన్ నిసాయిలో వచ్చినటువంటి హదీస్, సఫ్వాన్ బిన్ ఉమయ్య చెబుతున్నారు. ఆయన కాబతుల్లాలో తవాఫ్ చేశారు, నమాజ్ చేశారు. ఆ తర్వాత తన వద్ద ఉన్నటువంటి ఒక దుప్పటి దాన్ని పెట్టుకొని తల కింద పడుకున్నారు. కానీ ఒక దొంగ వచ్చాడు. మెల్లగా దాన్ని తీశాడు.

فَاسْتَلَّهُ مِنْ تَحْتِ رَأْسِهِ
(ఫస్తల్లహు మిన్ తహ్తి రఅసిహి)
తెలియకుండా దొంగలించాడు.

ఎప్పుడైతే ఈ విషయం ప్రవక్త వద్దకు వచ్చిందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని దొంగను పిలిచి అడిగారు. అతను ఒప్పుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి శిక్ష పడాలి అని ఆదేశించేశారు. ఆ సందర్భంలో సఫ్వాన్ బిన్ ఉమయ్య అంటున్నారు, ప్రవక్తా, ఇతని చేతులు నరికి వేయబడతాయి అని నాకు తెలిసేది ఉంటే నేను మీ వద్దకు విషయం తీసుకురాకపోయేది, అతన్ని మన్నించేసేయండి, నా వస్తువు అయితే నాకు దొరికిపోయింది కదా. ప్రవక్త చెప్పారు, వస్తువు దొరికిపోవడమే కాదు, ఇలాంటి ఈ చెడుకు గురి కాకూడదు మరోసారి. అందుకొరకే ఈ శిక్ష. దీని ద్వారా మనకు ఏం తెలుస్తుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అతనికి, నీవు ఇక్కడికి రాకముందే మాఫ్ చేసేసి, నీ హక్కులు తీసుకొని ఉండేది ఉంటే బాగుండు. కానీ ఇప్పుడు నీ యొక్క మాట చెల్లదు, అతనికి శిక్ష పడవలసిందే.

దీంతో తెలిసింది ఏమిటంటే మనిషి తౌబా చేసుకుంటాడు హాకిం వద్దకు రాకముందు. అలాంటప్పుడు అల్హందులిల్లాహ్ అతని విషయం, అతని మధ్యలో అల్లాహ్ మధ్యలోనే ఉంటుంది. కానీ ఎవరైతే జడ్జ్, ఎవరైతే అధికారి ఉంటాడో, అతని వద్దకు వచ్చిన తర్వాత సిఫారసు చెల్లదు. మరియు అతనికి ఏదైతే శిక్ష పడినదో వాస్తవంగా అతను ఒకవేళ తౌబా కూడా చేసుకున్నాడు, తన మనసును కూడా శుభ్రపరుచుకున్నాడు, ఇలాంటి చెడ్డ గుణాన్ని పూర్తిగా వదిలేశాడు అంటే ఒక గొప్ప లాభం ఏమిటో తెలుసా? పరలోక శిక్ష అనేది అతనికి ఉండదు. ఇంతకుముందు నేను మీకు ఒక హదీస్ వినిపించాను. సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 18, సహీ ముస్లిం హదీస్ నెంబర్ 1709. ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినది. అయితే ఆ హదీస్ లోనే వస్తుంది.

وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا فَعُوقِبَ فِي الدُّنْيَا فَهُوَ كَفَّارَةٌ لَهُ
(వమన్ అసాబ మిన్ దాలిక షైఅన్, ఫఊకిబ ఫిద్దున్యా, ఫహువ కఫ్ఫారతుల్లహ్)
ఎవరైతే ఈ పాపాల్లో ఏదైనా ఒక పాపానికి గురవుతాడో, దాని యొక్క శిక్ష ఈ లోకంలో పొందుతాడో, ఇది అతని కొరకు కఫ్ఫారా అయిపోతుంది.

సోదర మహాశయులారా, దొంగతనం చేసిన వ్యక్తి యొక్క చేయి నరికి వేసే విషయం ఏదైతే ఉందో, అది వ్యక్తిగతంగా కాదు. ఈ విషయం ముందు గుర్తుంచుకోవాలి. అంటే నా సొమ్ము ఎవరైనా దొంగతనం చేశాడు, నాకు తెలిసింది. నేను వెళ్లి అతని యొక్క చేయి నరకడం ఇది కాదు. ఇలాంటి శిక్షలు అనేటివి ఇస్లామీయ ప్రభుత్వం, ఇస్లామీయ ఖలీఫా మరియు నాయకులు ఎవరికైతే అధికారం ఇచ్చి ఉన్నాడో కోర్టులలో, ఇస్లామీయ అదాలతులలో ఏ జడ్జిలను నిర్ణయించాడో, అలాంటి వారు మాత్రమే చేయగలుగుతారు. ఈ విషయాన్ని ముందు గ్రహించాలి. లేదా అంటే హత్యకు బదులుగా హత్య, దొంగతనం చేసేదానికి బదులుగా శిక్ష, వ్యభిచారం చేసిన వారికి శిక్ష, ఇలాంటివి కొందరు ఏమంటారు? ఇస్లాంలో ఉన్నాయి కదా, నా చెల్లెలును వాడు, అతను అత్యాచారం చేశాడు అని, ఫలానా వారిపై అత్యాచారం చేశాడు అని వెంటనే ఎవరైనా వెళ్లి అతన్ని చంపడం, అతనికి ఏదైనా శిక్ష ఇవ్వడం, ఇది సరైన విషయం కాదు.

ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, ఎంత పరిమాణంలో దొంగతనం చేస్తే చేతులు నరికి వేయబడతాయి? దీని గురించి చాలా వివరాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి ఇప్పుడు నేను వెళ్ళలేను. ఎందుకంటే ఇక్కడ నా ఉద్దేశం ఈరోజు దొంగతనం ఎంత చెడ్డ గుణం, దీన్ని వదులుకోవాలి అన్నటువంటి హెచ్చరిక ఇవ్వడం. మరియు ఎంత దొంగతనం చేస్తే ఎంత, ముందు ఏ చెయ్యి, చెయ్యిలో ఎంతవరకు?. కానీ ఇందులో కొన్ని కండిషన్స్ లు ఉన్నాయి.

ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, ఏ వ్యక్తి నుండి సామాను దొంగలించబడినదో, అతడు తన ఒక సొమ్ము దొంగలించబడినది అని ఆ దొంగతనం కంటే ఎక్కువ పరిమాణంలో వేరే ఏదైనా అత్యాచారం, దౌర్జన్యం లాంటివి చేసే ప్రయత్నం ఎంత మాత్రం చేయకూడదు. తన హక్కు ఏదైతే దొంగలించబడినదో దాన్ని పొందడానికి ధర్మ హద్దుల్లో ఉండి అంతకంటే ఘోరమైన పాపానికి పాల్పడకూడదు. ఈ రోజుల్లో కొందరు ఏం చేస్తారు? తన సైకిల్ మోటార్ ఏదైనా దొంగలించబడింది. తను నిలబెట్టి పోయాడు కార్, పార్కింగ్ చేసి వెళ్ళాడు. ఎవరైనా దాన్ని కొట్టి వెళ్లారు అంటే చూడడు, వెతకడు, రీసెర్చ్ చేయడు. అధికారులకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి, వారికి తెలపాలి, అలాంటిది ఏమీ చేయకుండా ఆ రోడ్డు మీద ఉన్న బండ్లన్నిటిని కూడా నాశనం చేయడం, అన్నింటిని కూడా తగలబెట్టడం, ఇంకా ఇలాంటి కొన్ని పనులు ఏదైతే చేస్తారో, ఇది సరైన విషయం కాదు. ఇలాంటి వాటికి మనం చాలా దూరం ఉండాలి.

ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ మనం గుర్తుంచుకుంటే మన విశ్వాసం పెరుగుతుంది మరియు మనకు చాలా సంతోషం కలుగుతుంది. అదేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు. ముస్లిం షరీఫ్ లోని హదీస్.

مَا مِنْ مُسْلِمٍ يَغْرِسُ غَرْسًا، إِلَّا كَانَ مَا أُكِلَ مِنْهُ لَهُ صَدَقَةً، وَمَا سُرِقَ مِنْهُ لَهُ صَدَقَةً، وَمَا أَكَلَ السَّبُعُ مِنْهُ فَهُوَ لَهُ صَدَقَةً، وَمَا أَكَلَتِ الطَّيْرُ فَهُوَ لَهُ صَدَقَةً، وَلَا يَرْزَؤُهُ أَحَدٌ إِلَّا كَانَ لَهُ صَدَقَةً

ఏ ముస్లిం అయినా ఒక మొక్కను నాటితే, దాని నుండి తినబడినది అతనికి సదకా (దానం) అవుతుంది, దాని నుండి దొంగలించబడినది అతనికి సదకా అవుతుంది, దాని నుండి క్రూరమృగం తిన్నది అతనికి సదకా అవుతుంది, పక్షి తిన్నది అతనికి సదకా అవుతుంది. ఎవరైనా దానిని తీసుకున్నా అది అతనికి సదకా అవుతుంది.

ఏ ముస్లిం అయినా ఒక ఏదైనా చెట్టు నాటాడు, ఇక ఆ చెట్టులో నుండి ఏ కొంచెం తినబడిన, లేక దొంగలించబడిన, లేదా ఆ మృగ జంతువులు వచ్చి వాటిని నాశనం చేసిన, లేక పక్షులు వచ్చి తిన్నా ఇదంతా కూడా ఒక్కొక్క విషయం చెబుతూ ప్రవక్త చెప్పారు. لَهُ صَدَقَةٌ (లహు సదకా) ఇది అతని కొరకు ఒక పుణ్యంగా రాయబడుతుంది. ఇది అతని కొరకు ఒక సదకాగా పరిగణించబడుతుంది.

అయితే మనకు దాని యొక్క ప్రతిఫలం అల్లాహ్ వద్ద లభిస్తుంది. అల్లాహ్ వద్ద ప్రతిఫలం లభిస్తుంది. ధర్మ పరిధిలో ఉండి మనం ఓపిక సహనాలు వహించాలి. హక్కు తీసుకోవడానికి కూడా ఇస్లాం అనుమతిస్తుంది. కానీ ధర్మ హద్దులో ఉండి మాత్రమే ఇలా చేయాలి.

ఇక దొంగతనం అన్నది సోదర మహాశయులారా, ఏదైనా ఒక సామాను వరకే పరిమితం ఉండదు. కొన్ని ఉదాహరణలు వచ్చేసాయి మీ ముందు. భూములు దొంగతనం చేయడం జరుగుతుంది. దొంగతనంలోని రూపాల్లో ఈ రోజుల్లో ఆన్లైన్ గా దొంగతనం, సోషల్ మీడియాలో దొంగతనాలు, ఎలక్ట్రానిక్ పరంగా దొంగతనాలు, ఇంకా పాస్వర్డ్లు అన్ని తెలుసుకొని ఏదైనా ఆ తప్పు లింకులు పంపి దాని ద్వారా ఒకరి అకౌంట్లో నుండి ఏదైనా లాక్కోవడం. దొంగతనానికి ఏ రూపు ఉన్నా కానీ. దొంగతనంలో ఈ రోజు కొందరు ఏం చేస్తారు? ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదైనా పుస్తకం రాశాడు అంటే అతని పేరు తీసేసి మొత్తం తన పేరు పెట్టుకొని తాను రాసినట్లుగా చెప్పుకోవడం. ఇలా దొంగతనంలోని ఏ ఏ రూపం ఉన్నా గానీ ప్రతి ఒక్కటి దొంగతనంలో వస్తుంది, చెడ్డ గుణం, ప్రతి రకమైన దొంగతనం నుండి మనం దూరం ఉండాలి.

అల్లాహ్ మనందరికీ ఇలాంటి చెడు అలవాట్ల నుండి, చెడు గుణాల నుండి దూరం ఉంచుగాక. దీని యొక్క నష్టాలు, దీని యొక్క ఆ వినాశకరాలు ఏమైతే ఉన్నాయో ఖురాన్ హదీస్ ఆధారంగా మీరు విన్నారు. వీటిని ఇతరులకు తెలియజేయండి, సమాజాన్ని పవిత్ర పరిచే ప్రయత్నం చేయండి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

దొంగతనానికి విధించబడే శిక్ష (హదీసులు)
హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) – Bulugh al Maraam నుండి : https://teluguislam.net/wp-content/uploads/2022/01/bulugh-al-maram.10.03.pdf (10 పేజీలు)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=18540