ఖుర్ఆన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి!? [వీడియో]
https://youtu.be/0XIBN4UbyVc [40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తఫ్సీరే ఖుర్ఆన్ (ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం) తెలుసుకోవలసిన ఆవశ్యకతపై దృష్టి సారించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ ఖుర్ఆన్‌ను అవతరింపజేసి, దాని వివరణ బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు. ఖుర్ఆన్‌ను కేవలం అనువదించి చదవడం సరిపోదు, ఎందుకంటే దాని యొక్క లోతైన భావాన్ని మరియు ఆదేశాలను అర్థం చేసుకోవడానికి తఫ్సీర్ అవసరం. సహాబాలు (ప్రవక్త అనుచరులు) అరబీ భాషలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ, వారు కూడా కొన్ని ఆయతుల యొక్క వివరణ కోసం ప్రవక్తపై ఆధారపడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ఆయతులను హదీసుల ద్వారా వివరించారు. ఉదాహరణకు, ఉపవాసానికి సంబంధించిన ఆయత్‌లోని “తెల్లని దారం, నల్లని దారం” అనే పదాన్ని మరియు విశ్వాసాన్ని పాడుచేసే “జుల్మ్” (అన్యాయం) అనే పదాన్ని ప్రవక్త ఎలా వివరించారో ఈ ప్రసంగంలో స్పష్టంగా చెప్పబడింది. సరైన మార్గదర్శకత్వం కోసం ఖుర్ఆన్, సహీ హదీసులు, మరియు సహాబాల అవగాహన ఆధారంగా తఫ్సీర్‌ను నేర్చుకోవాలని నొక్కి చెప్పబడింది.

అల్ హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్.

ప్రియ విద్యార్థులారా!ఈ రోజు తఫ్సీర్ క్లాస్‌లో మన యొక్క అంశం, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి?

సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇంతకుముందు కాలాల్లో ఏ ప్రవక్తలైతే వచ్చారో ఆ ప్రవక్తలపై గ్రంథాలు అవతరింపజేసి వాటి యొక్క వివరణ స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలిపి ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలన్నటువంటి బాధ్యత ప్రవక్తలకు అప్పగించాడు. ఆ పరంపరలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిట్టచివరి ప్రవక్తగా చేసి పంపాడు.

అయితే, ప్రవక్తలపై అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాల రీతిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసి, ఖుర్ఆన్‌తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చి, ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలని చాలా స్పష్టంగా తెలిపాడు.

సూరతుల్ హదీద్, ఆయత్ నంబర్ 25లో,

لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ
(లఖద్ అర్సల్నా రుసులనా బిల్ బయ్యినాతి వ అన్జల్నా మ’అహుముల్ కితాబ వల్ మీజాన లియఖూమన్నాసు బిల్ ఖిస్త్)
వాస్తవానికి మేము మా ప్రవక్తలను స్పష్టమైన నిదర్శనాలతో పంపాము. ప్రజలు న్యాయంపై నిలబడాలని మేము వారితో పాటు గ్రంథాన్ని, త్రాసును అవతరింపజేశాము. (57:25)

అయితే, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు, ఈ విషయం మనందరికీ తెలిసినదే. రమదాన్‌కు సంబంధించిన ఆయత్ ఏదైతే ఉందో, ‘షహ్రు రమదానల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆను హుదల్లిన్నాసి వబయ్యినాతిమ్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్’. ఇంకా వేరే అనేక సందర్భాల్లో, సూరె ఆలి ఇమ్రాన్ ప్రారంభంలో అనేక సందర్భాల్లో ఆయతులు ఉన్నాయి. అయితే, ఖుర్ఆన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సర్వ మానవాళి మార్గదర్శకత్వానికి ఇచ్చి పంపాడు. అయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేసి సర్వ మానవాళికి సన్మార్గం చూపాలని, తెలియజేయాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ఇచ్చాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు ఈ ఖుర్ఆన్ బోధ చేస్తూ ఉండేవారు. మరియు ఈ ఖుర్ఆన్‌తో పాటు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చాడు. ఈ విషయం ఖుర్ఆన్‌లో అనేక సందర్భాల్లో ఉంది. సూరతుల్ బఖరాలో, సూరత్ ఆలి ఇమ్రాన్‌లో, సూరతుల్ జుముఆలో. ప్రత్యేకంగా దీని కొరకు “అల్ హిక్మ” అన్న పదం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉపయోగించాడు. మరియు ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ దాని యొక్క వ్యాఖ్యానంలో, వ్యాఖ్యానకర్తల ఏకాభిప్రాయం తెలియజేశారు, అల్ హిక్మ అంటే ఇక్కడ అల్ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు అని.

అయితే ఈ రోజు మన యొక్క ప్రసంగం అంశం, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? అయితే ఎప్పటివరకైతే మనం ఖుర్ఆన్ దాని యొక్క కేవలం అర్థం చదువుతామో, దాని యొక్క తఫ్సీర్, దాని యొక్క వ్యాఖ్యానం తెలుసుకోమో, చాలా విషయాలు మనకు అస్పష్టంగా ఉంటాయి. ఎందుకు? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు, వారు అరబీ తెలిసినవారు, అరబీ భాషలో ఎంతో ప్రావీణ్యత, ఎంతో వారికి అనుభవం ఉన్నప్పటికీ, ఎన్నో ఆయతుల భావాన్ని, భావాలను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరిచి చెప్పాడు, విడమరిచి చెప్పారు.

అయితే, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్, ఇది వ్యాఖ్యానకర్తలు తమ ఇష్టప్రకారంగా చేస్తారు అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన కొందరిలో ఉన్నది. అయితే వాస్తవానికి ఇది తప్పుడు ఆలోచన, ఎందుకంటే మీరు ఖుర్ఆన్‌లో గనుక చూస్తే సూరతుల్ ఖియామాలో ఈ తఫ్సీర్ యొక్క బాధ్యత కూడా అల్లాహ్ యే అన్నట్లుగా స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు. గమనించండి ఇక్కడ. సూరతుల్ ఖియామా, సూర నంబర్ 75, ఆయత్ నంబర్ 16 నుండి 19 వరకు చూస్తే, ప్రత్యేకంగా 19 లో ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే రండి అనువాదం మనం చదువుతున్నాము.

“ఓ ప్రవక్తా! నీవు ఖుర్ఆన్‌ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుకను వేగంగా కదిలించకు. దాన్ని సమకూర్చే, నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది.” సమకూర్చే అంటే నీ మనస్సులో, నీ హృదయంలో దాన్ని హిఫ్జ్ చేసే, దాన్ని భద్రంగా ఉండే ఉంచే అటువంటిది. “కాబట్టి మేము దానిని పఠించాక నువ్వు దాని పఠనాన్ని అనుసరించు.

ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ
(సుమ్మ ఇన్న అలైనా బయానహ్)
మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మా పైనే ఉంది.” (75:19)

దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మా పైనే ఉన్నది. చూస్తున్నారా? ఖుర్ఆన్ అవతరింపజేసిన వాడు అల్లాహ్, దాని యొక్క వివరణ, ఎక్కడ ఎలాంటి వివరణ అవసరమో అక్కడ అలాంటి వివరణ ఇచ్చేటువంటి బాధ్యత కూడా మాదే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలియబరిచాడు.

అయితే ఇక్కడ హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క మాట మన కొరకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంతకుముందు కూడా వేరే కొన్ని క్లాసులలో ఈ విషయం ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఈ మాట చెప్పడం జరిగింది. అయితే సంక్షిప్తంగా ఇప్పుడు అందులోనే ఒక విషయం చెబుతున్నాను గమనించండి. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, ఖుర్ఆన్‌లోని ఆయతులు కొన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఏమిటి? కొన్ని ఒక రకమైన ఆయతులు ఎలాంటివి అంటే ప్రతి మనిషి ఎలాంటి వివరణ లేకుండా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఎలాంటివి అవి? అవి ప్రత్యేకంగా అల్లాహ్ ఏకత్వం గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రిసాలత్ గురించి, మరియు పరలోకం రానున్నది, మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పకుండా పుట్టిస్తాడు, సర్వ మానవుల్ని మలిసారి బ్రతికిస్తాడు అన్నటువంటి అంశాలకు సంబంధించిన ఆయతులు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అందులో చాలా లోతైన వివరాలు ఏమీ అవసరం లేకుండానే కేవలం వాటిని తిలావత్ చేస్తూ, కొంతపాటి అరబీ భాష వచ్చినా గాని లేదా అనువాదం చదివినా గాని అర్థమైపోతుంది.

రెండో రకమైన కొన్ని ఆయతులు ఎలా ఉన్నాయి? అందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు అహ్కామ్, వారి జీవిత వ్యవహారాలకు సంబంధించిన ఎన్నో ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. అయితే ఇవి కొందరికి స్పష్టంగా అర్థమౌతే, ధర్మ జ్ఞానంలో ఎవరు ఎంత అధ్యయనం చేసి లోతు జ్ఞానంతో ఉన్నారో వారికి త్వరగా అర్థం కావచ్చు. కానీ సామాన్య ప్రజలకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అయితే ఆ సామాన్య ప్రజలు ఏం చేస్తారు? ఆ విషయాలను ఆ ఉలమాలతో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఎన్నో ఆదేశాలు వాటి యొక్క వివరణ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియబరిచాడు. ఈ రెండవ రకానికి సంబంధించిన వాటిలోనే కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. కానీ ఆ ఉదాహరణలు తెలుసుకునేకి ముందు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక నియమం ఏదైతే తెలిపాడో దాన్ని కూడా మీరు ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ ద్వారా చాలా స్పష్టంగా గమనించండి. చూస్తున్నారా సూరత్ అన్నహల్, ఆయత్ నంబర్ 44.

وَأَنزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ
(వ అన్జల్నా ఇలైకజ్ జిక్ర లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిమ్)
“ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు మేము అవతరింపజేశాము ఈ జ్ఞాపిక ఈ గ్రంథాన్ని.”
(16:44)

ఓ ప్రవక్త నీవు ప్రజలకు విడమరచి చెప్పడానికి. గమనించారా? అల్లాహ్ ఏ తఫ్సీర్ ప్రవక్తకు తెలుపుతాడో ప్రవక్త ఆ విషయాన్ని విడమరచి చెప్పేవారు. ఇదే భావం, ఇదే సూరత్ అన్నహల్ లోని మరోచోట ఆయత్ నంబర్ 64 లో ఉంది.

وَمَا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
(వమా అన్జల్నా అలైకల్ కితాబ ఇల్లా లితుబయ్యిన లహుముల్లజీ ఇఖ్తలఫూ ఫీహి వహుదన్ వ రహ్మతన్ లిఖౌమిన్ యు’మినూన్)
వారు విభేదించుకునే ప్రతీ విషయాన్ని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం. (16:64)

చూశారా? అయితే ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ అవతరింపజేయడంతో పాటు దీని యొక్క తఫ్సీర్‌ను కూడా అవతరింపజేశాడు. ప్రవక్తకు ఈ విషయాలు వివరంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పేవాడు మరియు ప్రవక్త సహాబాలకు వివరించేవారు.

తఫ్సీర్ ఆవశ్యకతకు ఉదాహరణలు

దీనికి కొన్ని ఉదాహరణలు ధర్మవేత్తలు ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా తెలిపి ఉన్నారు. ఉదాహరణకు, మీరు ఇదే ఖుర్ఆన్‌లో చూడవచ్చును. సూరతుల్ బఖరాలోని ఒక ఆయత్, ఉపవాసాలకు సంబంధించినది. ఆయత్ కొంచెం పెద్దగా ఉన్నది, కానీ ఇందులో ఒక ఆదేశం ఏమున్నది?

وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ
(వ కులూ వష్రబూ హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతిల్ అస్వది మినల్ ఫజ్ర్)
అల్లాహ్ ఏమంటున్నాడు ఇందులో?
తొలిజాములోని తెలుపు, నడిరేయి నల్లని చారలో నుంచి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి, త్రాగండి. (2:187)

ఉపవాసం గురించి అల్లాహ్ యొక్క ఆదేశం ఇది. రాత్రివేళ మనం తిన త్రాగవచ్చు, కానీ ఎప్పటివరకు? ఫజ్ర్ సమయం ప్రవేశించే వరకు అని సర్వసామాన్యంగా హదీసుల ఆధారంగా మనం చెబుతాము. కానీ ఖుర్ఆన్‌లో వచ్చినటువంటి విషయం ఏంటి? “హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యద్”. అల్ ఖైతుల్ అబ్యద్, శాబ్దిక అర్థం ఏంటి ఇది? అల్ ఖైత్ అంటే దారం, అల్ అబ్యద్ అంటే తెల్లది, “మినల్ ఖైతిల్ అస్వద్” నల్లని దారం నుండి. అయితే ఒక సహాబీ ఏం చేశారు? ఈ ఆయత్ పదాలతో స్పష్టమై భావం ఏదైతే ఉందో, దాన్ని చూసి అతను తన మెత్త కింద ఒక నల్ల దారం, మరొక తెల్ల దారం పెట్టుకున్నారు. ఇక కొంత కొంత సేపటికి తీసి చూసేవారు. కానీ రాత్రి పూట, చీకటి పూట తెల్ల దారమా, నల్ల దారమా అది స్పష్టంగా కనబడుతుందా? కనబడదు. తెల్లారిన తర్వాత కనబడుతుంది. కదా? అయితే ఆ విషయం వచ్చి ప్రవక్తకు చెబితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరచి చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరచి చెప్పారు. నీ మెత్త, పిల్లో ఏదైతే నువ్వు పెట్టుకున్నావో, అది చాలా పెద్దగా ఉన్నట్టు ఉన్నది. అయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో ఏదైతే అల్ ఖైతుల్ అబ్యద్, తెల్లని దారం అని అంటున్నాడో, దాని ఉద్దేశం, నిజంగా ఏమైనా దారాలు తీసుకోండి అని మాత్రం భావం కాదు, భావం అది కాదు. దీని భావం ఏంటి? ఆకాశంలో, ఆకాశంలో ఈ భేదం అనేది కనబడుతుంది. దాన్ని గమనించి, ఇక్కడ అసలు ఉద్దేశం ఫజ్ర్ సమయ ప్రవేశం గురించి చెప్పడం జరిగింది అని సహీ బుఖారీలో కూడా ఈ హదీస్ వచ్చి ఉంది, హదీస్ నంబర్ 1916. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఈ హదీస్ హజ్రత్ అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు తాలా అన్హు ద్వారా ఉల్లేఖించడం జరిగింది.

గమనిస్తున్నారా మీరు? ఈ విధంగా కొన్ని ఆదేశాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్‌లో ఏదైతే తెలిపాడో, హదీసుల్లో వాటి వివరణ వచ్చి ఉంది. ఇక అందుకొరకే మనం తఫ్సీర్‌ను తెలుసుకోవడం, తఫ్సీర్‌ను నేర్చుకోవడం, ఖుర్ఆన్ యొక్క ఆయత్ కేవలం నాకు అరబీ వస్తుంది లేదా అనువాదం చదువుకొని ఆచరిస్తాను అంటే సరిపోదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖుర్ఆన్ ఆయతుల, ఏ ఆయత్ యొక్క ఏ భావం ఎలా తెలిపారు? సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారు? ఆ రీతిలో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. లేదా అంటే ఖవారిజ్‌ల మాదిరిగా, ఖదరియా ముర్జియాల మాదిరిగా, మోతజిలాల మాదిరిగా తప్పుడు విశ్వాసాల్లో, బిద్అతులలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని పేర్లు ఏదైతే చెప్పానో, ఖవారిజ్, మోతజిలా, ఖదరియా, ముర్జియా, ఇవి గుమ్రాహ్ ఫిర్ఖాలు. చూడడానికి ముస్లింలే, ఖుర్ఆన్ ద్వారానే మేము ఆధారం తీసుకుంటాము అన్నటువంటి వాదన వాదిస్తారు. కానీ వాస్తవానికి వారు ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా నచ్చజెప్పారో, విడమరిచి చెప్పారో, వివరించి చెప్పారో, ఆ అలా సహాబాలు అర్థం చేసుకున్న రీతిలో వారు ఆచరించరు. అందుకొరకే వారు పెడమార్గాన పడిపోయారు. సన్మార్గం నుండి దూరమైపోయారు. మన పరిస్థితి అలా కాకూడదు. మన పరిస్థితి అలా కాకూడదు.

ఇప్పుడు నేను సూరతుల్ బఖరాలోని ఉపవాసాలకు సంబంధించిన ఒక ఆయత్ మరియు దాని యొక్క వివరణ తఫ్సీర్ సహీ బుఖారీలోని 1916 హదీస్ నంబర్‌తో తెలిపాను. ఇలాంటి ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాటి ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి? మనం తప్పకుండా తఫ్సీర్ తెలుసుకోవాలి. దీనికి మనకు ఇంకా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఉదాహరణకు, సహీ బుఖారీలోని హదీసే చూడండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఇచ్చినటువంటి దుఆ. దాని పూర్తి సంఘటన చెప్పలేను. సహీ బుఖారీలో ఇమాం బుఖారీ రహిమతుల్లాహ్ ఈ హదీసును ఎన్నో సందర్భాల్లో తీసుకొచ్చారు. సంక్షిప్త భావం ఏమిటి?

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యల్లో ఒకరు హజ్రత్ మైమూనా రదియల్లాహు తాలా అన్హా. హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఖాలా అవుతుంది. ఖాలా అంటే తెలుసు కదా, పిన్ని అంటారు, చిన్నమ్మ అంటారు. ఇబ్ను అబ్బాస్ యొక్క తల్లి మరియు మైమూనా రదియల్లాహు తాలా అన్హా ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ళు. ఒక రాత్రి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద రాత్రి గడుపుతారు. అయితే రాత్రి ఎప్పుడైతే ప్రవక్త వారు మేల్కొంటారో, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తారో, ప్రవక్త తిరిగి వచ్చేవరకు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఏం చేస్తారు? ప్రవక్త ఉదూ చేసుకోవడానికి నీళ్లు సిద్ధం చేసి పెడతారు. ఉదూ నీళ్లు. ప్రవక్త వచ్చాక ఈ విషయాన్ని చూసి సంతోషపడి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి దుఆ ఇస్తారు. ఏమని దుఆ ఇస్తారు? ఏమని దుఆ ఇస్తారు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ… తొందరగా! మన టాపిక్ ఏం నడుస్తుంది మీకు తెలుసు కదా. అందరి మైక్ ఆఫ్ ఉన్నదా ఏంటి? ఉంది. కానీ ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు. లేదా నా వాయిస్ ఎవరి వరకు చేరుతలేదా ఏంటి? ఆ వచ్చింది షేక్. ఖుర్ఆన్ యొక్క జ్ఞానాన్ని అల్లాహ్ మీకు ఇవ్వాలని దుఆ చేస్తారు. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ఇది నేను మొదటిసారిగా చెప్పడం లేదు. మిమ్మల్ని ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఈ మాట చెప్పడం జరిగింది.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు, ఓ అల్లాహ్, ఇబ్ను అబ్బాస్‌కి నీవు ఖుర్ఆన్ యొక్క విద్య, ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం, వివరణ జ్ఞానం ప్రసాదించు అని దుఆ చేశారు. ధర్మ అవగాహన, ఖుర్ఆన్ యొక్క జ్ఞానం, మరియు ఈ ఖుర్ఆన్ యొక్క త’వీల్, వివరణ, దాని యొక్క వ్యాఖ్యానం యొక్క జ్ఞానం ప్రసాదించు.

ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు చిన్న వయసులో ఉన్నప్పటికీ, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు 13 ఏళ్ల వయసు కూడా వరకు చేరలేదు. కానీ అల్ హందులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ, కరుణ, అతని యొక్క లెక్కలేనన్ని కరుణా కటాక్షాలు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ బరకత్, అల్లాహ్ కరుణా కటాక్షాలు, ప్రవక్త వారి దుఆ బరకత్ మరియు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఖుర్ఆన్ జ్ఞానం నేర్చుకోవడానికి పెద్ద పెద్ద సహాబాల తలుపుల ముందు కూర్చొని ఎండ తాపాన్ని భరించి, దుమ్ము ధూళిని భరించి, ఏదైతే కష్టపడి నేర్చుకున్నారో, ఆ ప్రకారంగా అల్లాహ్ వారికి ప్రసాదించాడు. మరియు సహాబాలలోనే హబ్రుల్ ఉమ్మ, ఖుర్ఆన్ సహాబాలలో ఖుర్ఆన్ యొక్క పెద్ద జ్ఞాని ఎవరు అంటే, ఒక వైపున అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు పేరు వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క పేరు వస్తుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మన అంశానికి సంబంధించింది, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా కొందరు సహాబాలకు ఇలాంటి దుఆ ఇచ్చారు. మరియు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి, అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు వారి గురించి, ఇంకా వేరే కొందరు సహాబాల గురించి, సూరతుల్ బఖరా దానిని కంఠస్థం చేయడం, దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, తఫ్సీర్‌ని నేర్చుకోవడంలో 8 నుండి 10 సంవత్సరాలు పట్టినది మాకు అని అంటున్నారు. సహాబాల విషయం చెబుతున్నానండి. తర్వాత వచ్చిన కాలాల్లోని తాబిఈన్, తబే తాబిఈన్, ఇంకా ఉలమాలు, అయిమ్మాల గురించి కాదు. సహాబాలు. సూరే బఖరా యొక్క వ్యాఖ్యానంలో మనకు ఒకచోట ఇమాం ఖుర్తుబీ రహిమహుల్లాహ్ ప్రస్తావించారు. ఒక హజ్ సందర్భంలో అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నుల్ ఆస్ గురించి ఉంది. మరికొన్ని ఉల్లేఖనాల్లో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గురించి ఉంది. వారు సూరే బఖరా యొక్క తఫ్సీర్ ఎంతసేపు, ఎంత వివరంగా చెప్పారంటే, ఒకవేళ ఆ సందర్భంలో గనుక ఆ తఫ్సీర్‌ను యూదులు, క్రైస్తవులు విని ఉంటే ముస్లింలు అయిపోయేవారు అని ఉల్లేఖనకారులు అంటున్నారు. అంటే ఏమిటి విషయం? ఖుర్ఆన్‌ను దాని యొక్క తఫ్సీర్‌తో నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, ఇది సహాబాల యొక్క అలవాటు కూడా. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇక రండి, సమయం సమాప్తం కావస్తుంది. ఈ అంశం మీకు మరింత మంచి రీతిలో అర్థం కావడానికి మరొక ఉదాహరణ నేను ఇస్తాను. ఈ ఆయతును మీరు గమనించండి ఖుర్ఆన్‌లో మరియు దీనికి సంబంధించిన సహీ హదీస్ ఏదైతే వచ్చి ఉందో, దాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి ఆయత్ ఇక్కడ? సూరతుల్ అన్ఆమ్. చూస్తున్నారు కదా సూరతుల్ అన్ఆమ్. ఆయత్ నంబర్ 82.

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ
(అల్లజీన ఆమనూ వలమ్ యల్బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాఇక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్తదూన్)
ఎవరైతే విశ్వసించారో, తమ విశ్వాసాన్ని జుల్ముతో కలగాపులగం చేయకుండా ఉన్నారో, ఇక్కడ అరబీలో చూస్తున్నారు మీరు. “వలమ్ యల్బిసూ” కలగాపులగం చేయలేదు, కలుషితం కానివ్వలేదు. “ఈమానహుమ్” తమ విశ్వాసాన్ని, తమ యొక్క ఈమాన్‌ని దేనితో కలుషితం కానివ్వలేదు? “బి జుల్మిన్” జుల్ముతో. ఎవరైతే తమ విశ్వాసాన్ని జుల్ముతో కలుషితం కాకుండా కాపాడుకున్నారో, అలాంటి వారే “లహుముల్ అమ్న్” సురక్షితంగా ఉన్నవారు. వారికొరకే శాంతి, వారికొరకే పీస్ ఫుల్ లైఫ్. “వహుమ్ ముహ్తదూన్” మరియు వారే సన్మార్గంపై ఉన్నవారు కూడా.

ఇక ఈ ఆయత్ అవతరించిన వెంటనే సహాబాలు భయపడిపోయారు. సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 82 గుర్తు ఉంది కదా. సహాబాలు భయపడిపోయారు. ఎందుకని? మాలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక చిన్న రీతిలో చిన్నపాటి జుల్మ్ జరుగుతూనే ఉంటుంది. ఇక మా విశ్వాసం బాగులేదా? మేము సన్మార్గంపై లేమా? మాకు నరకం నుండి సురక్షితం అనేది లభించదా? అన్నటువంటి భయం వారికి కలిగింది. అందుకొరకే సహీ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 32. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం. సహీ బుఖారీ ఎంత ప్రామాణిక గ్రంథమో మీ అందరికీ తెలుసున విషయమే. ఇంతకుముందే ఇప్పుడు ఇంతకుముందే మనం అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు వారి పేరు కూడా చెప్పాము. తఫ్సీరే ఖుర్ఆన్‌లో ఆయన పేరు కూడా వస్తుంది. సూరే బఖరా నేర్చుకోవడంలో 8 సంవత్సరాలు వీరికి కూడా పట్టింది అని. ఇక ఖుర్ఆన్ తఫ్సీర్ యొక్క ఆవశ్యకత ఎంతగా ఉన్నదో అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ద్వారా సహీ బుఖారీలోని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. హదీస్ నంబర్ 32. ఏమంటున్నారో గమనించండి. “లమ్మా నజలత్” ఎప్పుడైతే అవతరించిందో ఈ ఆయత్, “అల్లజీన ఆమనూ వలమ్ యల్బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాఇక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్తదూన్” (సూరతుల్ అన్ఆమ్, ఆయత్ నంబర్ 82). అందులో ఏమున్నది? ఈమాన్‌ను జుల్ముతో కలుషితం చేయని వారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ అంటున్నారు, “ఖాల అస్హాబు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం”, ప్రవక్త వారి యొక్క సహచరులు అప్పుడు చెప్పారు, ఏమని? “అయ్యునా లమ్ యజ్లిమ్?” మాలో ఎవరు ఏ మాత్రం జుల్మ్ చేయకుండా ఉండేవారు? అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ లుఖ్మాన్, ఆయత్ నంబర్ 13 తెలియబరిచాడు.

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
(ఇన్నష్ షిర్క ల జుల్మున్ అజీమ్)
నిశ్చయంగా షిర్క్ అత్యంత ఘోరమైన జుల్మ్. (31:13)

ఇక సూరతుల్ అన్ఆమ్‌లో జుల్మ్ యొక్క పదం ఏదైతే వచ్చిందో ఆయత్ నంబర్ 82 లో, ఇక్కడ జుల్మ్ అంటే సామాన్యమైన జుల్మ్, ఒకరు మరొకరిని కొట్టడం గానీ, తిట్టడం గానీ, ఏదైనా సొమ్మును కాజేయడం గానీ, ఇవన్నీ కూడా జుల్మ్. కానీ ఇక్కడ ఈ ఆయతులో ఈ జుల్మ్ కాదు ఉద్దేశం. ఈ ఆయతులో జుల్మ్ అంటే షిర్క్ అని భావం.

అర్థమైంది కదా? ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసుల ద్వారా మరియు స్వయంగా ఖుర్ఆన్ ద్వారా మనకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖుర్ఆన్ తఫ్సీర్‌తో నేర్చుకోవడం, తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఏ ఉలమాలైతే, ఏ ఆలిములైతే, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్, ఖుర్ఆన్‌తో, సహీ హదీసులతో, ప్రవక్త సహాబాల యొక్క వ్యాఖ్యానాలతో తెలియజేస్తున్నారో, అలాంటి వారి ద్వారానే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. లేదా అంటే ఈ రోజుల్లో కొందరు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్ చేస్తున్నారని. కానీ ఎలా? మాకు అరబీ భాష తెలుసు, అరబీ గ్రామర్ తెలుసు, ఖుర్ఆన్ ఈనాటి కాలంలో మన అందరి కొరకు సన్మార్గ గ్రంథం గనుక సైన్స్ టెక్నాలజీ యొక్క విషయాలు అందులో ఏవైతే వచ్చాయో, వాటి యొక్క వివరణలతో తెలుసుకుంటే మరింత మనం వేరే వాళ్లకు కూడా మంచిగా నచ్చజెప్పవచ్చు అని దానిపై మాత్రమే ఆధారపడి అలాంటి విషయాలను వెతికి… చూడండి ఖుర్ఆన్‌లో మానవులందరికీ ప్రళయం వరకు వచ్చే అటువంటి సర్వ మానవాళి కొరకు మార్గదర్శకత్వం ఉంది గనుక, ప్రజలకు లాభదాయకమయ్యే ప్రతీ విద్య మూలాలు ఇందులో ఉన్నాయి. అవును, సైన్స్ కు సంబంధించి, టెక్నాలజీ కి సంబంధించి, జాగ్రఫియా కు సంబంధించి, మెడికల్ కు సంబంధించి, ఇంకా ఎన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే విద్యలు ఉన్నాయో, వాటన్నిటి గురించి, వాటన్నిటి గురించి మూల విషయాలు ఉన్నాయి. కానీ ఖుర్ఆన్ యొక్క అసలైన ఉద్దేశం ఏమిటి? ఖుర్ఆన్ యొక్క అసలైన ఉద్దేశం, మానవులు ఈ లోకంలో కేవలం అల్లాహ్ ను ఆరాధిస్తూ, అల్లాహ్ చెప్పిన ప్రకారంగా జీవితం గడిపి, ఎలా వారు నరకం నుండి రక్షణ పొంది స్వర్గం పొందగలుగుతారో, అల్లాహ్ యొక్క ఏకారాధన, అల్లాహ్ యొక్క ఆదేశాలన్నిటినీ పాటిస్తూ ప్రవక్త విధానంలో అల్లాహ్ ను ఆరాధిస్తూ, నరకం నుండి రక్షణ పొంది స్వర్గం ఎలా పొందాలి, దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఇది గనుక దీనిని మనం కరెక్ట్ గా ఫాలో అవుతూ, ఇంకా అన్ని రకాల వేరే లాభాలను కూడా మనం స్వయం పొందడం, ఇతరులకు లాభం చేకూర్చడం మంచి విషయమే. కానీ అసలైన ఉద్దేశం నుండి దూరం కాకూడదు.

అయితే ఈ కొన్ని ఆధారాలు, ఎగ్జాంపుల్స్, ఉపమానాల ద్వారా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఖుర్ఆన్ తప్పకుండా మనం దాని యొక్క వ్యాఖ్యానం, తఫ్సీర్‌తో చదివే, నేర్చుకునే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మంచి రీతిలో మనం ఆచరించగలుగుతాము. లేదా అంటే, ఒకవేళ తఫ్సీరే ఖుర్ఆన్ అవసరం లేదు అంటే, ఒక చిన్న ఉదాహరణ ఇలాంటి పొరపాటులో పడిపోతాము. ఒక రెండు చిన్న ఉదాహరణలు ఇచ్చి నేను సమాప్తం చేస్తాను. ఖుర్ఆన్‌లో ఇప్పుడు నేను చూపించుకుంటూ మళ్ళీ వస్తే సమయం చాలా పడుతుంది, అందుకొరకే రెండే రెండు ఎగ్జాంపుల్స్ తొందరగా చెప్పేస్తున్నాను, గమనించండి మీరు. ఖుర్ఆన్‌లో ఒకచోట కాదు, ఎక్కువ చోట్ల ఉంది, రక్తం నిషిద్ధం అని. కదా? ఈ ప్రకారంగా చూసుకుంటే, ఒక మేకనే అనుకోండి ఉదాహరణకు, మనం జిబహ్ చేసిన తర్వాత సున్నత్ ప్రకారంగా, రక్తం అంతా వెళ్ళిపోతుంది కదా. కానీ ఎప్పుడైతే మనం మాంసపు ముక్కలు కూడా చేసేస్తామో, లోపట దాని యొక్క నరాల్లో, మాంసం మధ్యలో చిన్నపాటి రక్తం అనేది, కొంతపాటి రక్తం అనేది కనబడుతుంది. అవునా కాదా? అయితే, ఖుర్ఆన్ ప్రకారంగా చూస్తే అది కూడా ఎక్కడా ఒక చిన్న చుక్క ఉండకుండా పూర్తిగా శుభ్రమైపోవాలి అన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారి సహీ హదీస్ ఉన్నది, ప్రవహించే రక్తం ఏదైతే ఉంటుందో, అదంతా పోయింది. ఈ మాంసం మధ్యలో, చిన్న చిన్న నరాల మధ్యలో ఏదైతే కొంచెం ఆగి ఉన్నదో, అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మినహాయింపు ఇచ్చాడు. దానివల్ల మనకు నష్టం జరగదు, ఎందుకంటే అది చాలా ఇబ్బందితో కూడిన పని.

ఇక సోదర మహాశయులారా, ఇది ఇలా ఉంటే, ఎవరైతే హదీస్ అవసరం లేదు, మనకు తఫ్సీర్ అవసరం లేదు, ఖుర్ఆన్ యొక్క బాహ్యమైన ఈ ఆయతుల అనువాదాలు చూసి మనం ఆచరిస్తే సరిపోతుంది అంటారో, వాస్తవానికి వారి యొక్క నమాజులు కూడా సరియైనవి కావు, వారి యొక్క రోజువారి జీవితంలో వివాహ, పేరంటాలు ఇవి కూడా సరియైన సున్నత్ ప్రకారంగా జరగవు. ఎందుకు? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ద్వారా ఏ ఖుర్ఆన్‌ను విడమరచి హదీసు ద్వారా కూడా మనకు చెప్పారో, దాన్ని విడనాడినందుకు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖుర్ఆన్‌ను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా సహాబాకు నేర్పారో, సహాబాలు నేర్చుకున్నారో, అలా నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

101.సూరతుల్ ఖారిఅహ్ (మహోపద్రవం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)

101.సూరతుల్ ఖారిఅహ్ (మహోపద్రవం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/Qrb396ZG5wI [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో 11 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా తీర్పుదినం గురించి వివరించింది. ఈ సూరాకు పేరుగా పెట్టబడిన పదం మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది. తీర్పుదినం నాటి భయానక పరిస్థితులను ఇందులో వివరించడం జరిగింది. ఆ రోజున తీవ్రమైన ప్రకంపనాలు సంభవిస్తాయి. పర్వతాలు దూదిపింజల్లా ఎగురుతాయి. మానవులు దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా చెల్లాచెదరయిన దీపపు పురుగుల్లా కనబడతారు. చేసిన కర్మలకు తగిన విధంగా శిక్షా లేదా బహుమానాలు ఆ రోజున లభిస్తాయి.

101:1 الْقَارِعَةُ
ఎడా పెడా బాదేది.

101:2 مَا الْقَارِعَةُ
ఏమిటీ, ఆ ఎడా పెడా బాదేది?

101:3 وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ
ఆ ఎడా పెడా బాదే దాని గురించి నీకేం తెలుసు?

101:4 يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ
ఆ రోజు మనుషులు చెల్లాచెదురైన దీపపు పురుగుల్లా అయిపోతారు.

101:5 وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ
పర్వతాలు ఏకిన రంగు రంగుల దూది పింజాల్లా (లేక ఉన్నిలా) అయిపోతాయి.

101:6 فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ
ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో.

101:7 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు.

101:8 وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ
మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో,

101:9 فَأُمُّهُ هَاوِيَةٌ
అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది.

101:10 وَمَا أَدْرَاكَ مَا هِيَهْ
అదేమిటో (‘హావియా’ అంటే ఏమిటో) నీకేం తెలుసు?

101:11 نَارٌ حَامِيَةٌ
అది దహించివేసే అగ్ని.


“మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది”. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్.
https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

మనం ఖుర్ఆన్ ఎందుకు కంఠస్థం చేయాలి? [ఆడియో]

మనం ఖుర్ఆన్ ఎందుకు కంఠస్థం చేయాలి? [ఆడియో]
https://youtu.be/xe-0DyNUTCQ [18 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
జామిఅ్ హుసైన్ బిన్ అలీ రజియల్లాహు అన్హుమా జుల్ఫీ(KSA)లో షేఖ్ సాలిహ్ బిన్ ఫురైహ్ అల్ బహ్‌లాల్ ఇచ్చిన జుమా ఖుత్బా అనువాదం

ఖుర్’అన్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/quran/

ఖుర్ఆన్ పారాయణ మహత్యం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ పారాయణ మహత్యం
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/s24pAH6baPY [23 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్ యొక్క ప్రాముఖ్యత మరియు ఘనత గురించి వివరించారు. ఖురాన్ అనేది హితోపదేశం, స్వస్థత, మార్గదర్శకత్వం మరియు కారుణ్యంతో కూడిన అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం అని ఆయన పేర్కొన్నారు. ఖురాన్ పారాయణం చేసేవారికి, దాన్ని నేర్చుకుని, నేర్పించేవారికి లభించే గొప్ప ప్రతిఫలాలను ఖురాన్ ఆయతులు మరియు ప్రవక్త హదీసుల ద్వారా వివరించారు. ఖురాన్ పారాయణ సభల యొక్క ఘనత, ప్రళయ దినాన ఖురాన్ తన సహచరులకు సిఫారసు చేయడం, మరియు స్వర్గంలో ఖురాన్ సహచరుడి ఉన్నత హోదా గురించి కూడా చర్చించారు. ఖురాన్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పట్ల మరియు అల్లాహ్ మార్గంలో ధనాన్ని ఖర్చు చేసే వ్యక్తి పట్ల అసూయ పడటం అనుమతించబడిందని తెలిపారు. చివరగా, ఖురాన్‌ను విడిచిపెట్టిన వారి పశ్చాత్తాపాన్ని మరియు ‘ఖురాన్ నేర్చుకుని, ఇతరులకు నేర్పించేవారే మీలో ఉత్తములు’ అనే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.

أَلْحَمْدُ لِلّٰهِ نَحْمَدُهُ وَنَسْتَعِيْنُهُ وَنَسْتَغْفِرُهُ وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ
[అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త’ఈనుహూ వ నస్తగ్ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్]
సర్వ స్తోత్రములు అల్లాహ్ కే. మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము మరియు ఆయననే క్షమాపణ కోరుతున్నాము, ఆయనపైనే విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే భారం మోపుతున్నాము.

وَنَعُوْذُ بِاللهِ مِنْ شُرُوْرِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا
[వ న’ఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’మాలినా]
మరియు మేము మా ఆత్మల కీడుల నుండి మరియు మా చెడు కార్యాల నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.

مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహ్]
అల్లాహ్ ఎవరికైతే మార్గనిర్దేశం చేస్తాడో, అతనిని ఎవరూ తప్పుదారి పట్టించలేరు, మరియు ఆయన ఎవరిని తప్పుదారి పట్టిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ
[వ అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహ్]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైక దేవుడు మరియు ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيْثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’ద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక ఆ తర్వాత, నిశ్చయంగా అన్ని మాటలలో కెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్). మరియు అన్ని మార్గాలలో కెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గం.

وَشَرَّ الْأُمُوْرِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అహ్, వ కుల్ల బిద్’అతిన్ దలాలహ్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో కెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం బిద్అత్ (ధర్మంలో నూతన ఆవిష్కరణ). మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనపై అసంఖ్యాకమైన వరాలను ప్రసాదించాడు, ఉపకారం చేశాడు. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఖురాన్ గ్రంథం అవతరణ. ఖురాన్ అవతరణ ద్వారా ఈ ఉమ్మత్ పైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసిన గొప్ప ఉపకారాలలో ఒకటి. ఈ ఖురాన్ గ్రంథంలో మౌఇదా, హితోపదేశం ఉంది. షిఫా, స్వస్థత ఉంది. హుదా, మార్గదర్శకం ఉంది. రహ్మా, కారుణ్యం ఉంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ లో ఇలా తెలియజేశాడు.

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
“ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసుగుతుంది. మరియు నమ్మే వారి కోసం మార్గదర్శకం చూపుతుంది (మరియు కారుణ్యం).”

ఈ ఖురాన్ జ్యోతి, స్పష్టమైన గ్రంథం. దానిలో ఏముంది? అది మనం తెలుసుకోవాలి. చదివి, అర్థం చేసుకొని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ
“అల్లాహ్ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది, అంటే స్పష్టమైన గ్రంథం వచ్చేసింది.”

يَهْدِي بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

అంటే ఈ ఖురాన్ జ్యోతి, స్పష్టమైన గ్రంథం. దాని ద్వారా, ఖురాన్ ద్వారా, ఈ జ్యోతి ద్వారా, ఈ నూర్ ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ప్రసన్నతను అనుసరించే వారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన కోరిక మేరకు వారిని చీకట్లో నుంచి, అంధకారంలో నుంచి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాడు, ఈ ఖురాన్ ద్వారా, ఈ నూర్, ఈ జ్యోతి ద్వారా.

ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు.

إِنَّ الَّذِينَ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَأَقامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً يَرْجُونَ تِجَارَةً لَّن تَبُورَ
దైవగ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు. (35:29)

అంటే, ఈ జ్యోతిని, ఈ స్పష్టమైన గ్రంథాన్ని, ఈ ఖురాన్‌ని పఠిస్తూ నమాజును నెలకొల్పే వారు, ఖురాన్ పారాయణం, ఖురాన్ పఠనం, అలాగే నమాజును నెలకొల్పే వారు, వారిని మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను, బహిరంగంగాను ఖర్చు చేసేవారు. అంటే ఈ ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూడు విషయాలు తెలియజేశాడు. ఒకటి, ఖురాన్ గ్రంథాన్ని పఠించేవారు, పారాయణం చేసేవారు. రెండవది, నమాజును నెలకొల్పేవారు. మూడవది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన వాటిలో గోప్యంగా, బహిరంగంగా దానం చేసేవారు, ఖర్చు పెట్టేవారు. వారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు.

దీని సారాంశం ఈ ఆయత్ యొక్క.

لِيُوَفِّيَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۚ إِنَّهُ غَفُورٌ شَكُورٌ

వారికి వారి ప్రతిఫలాలు పూర్తిగా ఇవ్వటానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికి గాను, (అంటే ఈ గుణాలు, ఈ లక్షణాలు కలిగిన వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తిగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.) నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు.(35:30)

అభిమాన సోదరులారా, ఇప్పటివరకు మనం ఖురాన్ ఆయతులు లో కొన్ని ఖురాన్ గురించి, దైవ గ్రంథం గురించి తెలుసుకున్నాం.

ఈ ఖురాన్ పఠనం, ఖురాన్ నేర్చుకోవటం, ఖురాన్‌ని నేర్పించటం. దీని గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. అబూ హురైరా రది అల్లాహు త’ఆలా అన్హు కథనం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللَّهِ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلَّا نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ وَذَكَرَهُمُ اللَّهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్తమ’అ ఖౌమున్ ఫీ బైతిమ్ మిమ్ బుయూతిల్లాహి యత్లూన కితాబల్లాహి వ యతదారసూనహూ బైనహుమ్ ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్హుముల్ మలాయికతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

ఈ జ్యోతి గురించి, ఈ ఖురాన్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు,

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమిగూడి, జమా అయి, దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ కేవలం పారాయణం మాత్రమే కాదు. యతదారసూనహూ దాన్ని గురించి పరస్పరం చర్చించుకునేవారు అంటే నేర్చుకునేవారు, నేర్పించేవారు. ఒకరికొకరు అర్థం చేసుకునేవారు, అర్థం చెప్పేవారు, నేర్చుకునేవారు, నేర్పించేవారు. అల్లాహ్ తరఫు నుండి వారి మీద ప్రశాంతత ఆవరిస్తుంది, మొదటి ప్రయోజనం, మొదటి ప్రతిఫలం. ఒకచోట జమా అయి ఖురాన్ పారాయణం చేస్తూ దాన్ని చర్చించుకుంటూ, నేర్చుకుంటూ, నేర్పిస్తూ ఉంటే అల్లాహ్ యొక్క ప్రశాంతత వారి మీద ఆవరిస్తుంది, అల్లాహ్ తరఫు నుండి. రెండవది, అల్లాహ్ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. మూడవది, దైవదూతలు వారిని చుట్టుముడతారు. నాలుగవది, ఇంకా వారిని గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని దైవదూతల దగ్గర వారికి పరిచయం చేస్తాడు.

ఇది ఖురాన్ పఠనం, ఖురాన్ నేర్పించడం గురించి.

అలాగే ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను ఉద్దేశించి ఇలా అన్నారు, “ఇన్న లిల్లాహి అహ్లీన మినన్నాస్” (నిశ్చయంగా ప్రజలలో అల్లాహ్ కు చెందిన వారు ఉన్నారు). జనులలో అల్లాహ్ దాసులలో కొందరు అహ్లుల్లాహ్ (అల్లాహ్ ప్రజలు) ఉన్నారు. అల్లాహ్ కు చెందిన వారు. ఈ మాట విని సహాబాలు ప్రశ్నించారు, “ఓ దైవ ప్రవక్తా, మన్ హుమ్?” (వారెవరు?). ఆ అహ్లుల్లాహ్ అనే వారు, అహ్లుల్లాహ్ అనబడే వారు, అల్లాహ్ కు చెందిన వారు, వారెవరు? అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. వారు, “హుమ్ అహ్లుల్ ఖురాన్” (వారు ఖురాన్ ప్రజలు). వారే అహ్లె ఖురాన్, ఖురాన్ వారు అల్లాహ్ కు చెందిన వారు. ఇక్కడ ఖురాన్ వారు అంటే ఎవరు? ఖురాన్ పఠించే వారు, ఖురాన్ పారాయణం చేసే వారు, ఖురాన్ ని నేర్చుకునే వారు, ఖురాన్ ని అర్థం చేసుకునే వారు, ఖురాన్ ని నేర్పించే వారు, వారు అహ్లుల్ ఖురాన్. వారి జీవితం ఖురాన్ పరంగా ఉంటుంది. వారే, “అహ్లుల్లాహి వ ఖాస్సతుహు” (అల్లాహ్ యొక్క ప్రజలు మరియు ఆయన ప్రత్యేకమైన వారు). వారే అల్లాహ్ కు చెందిన వారు, వారే అల్లాహ్ కు ప్రత్యేక దాసులు. ఇది ఖురాన్ పారాయణం యొక్క మహత్యం.

అభిమాన సోదరులారా, ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహు త’ఆలా అన్హు కథనం, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ
[ఇన్నల్లాహ యర్ఫ’ఉ బి హాదల్ కితాబి అఖ్వామవ్ వ యద’ఉ బిహీ ఆఖరీన్]
నిశ్చయంగా, నిస్సందేహంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథం ఆధారంగా, ఈ ఖురాన్ మూలంగా కొన్ని జాతుల్ని ఉన్నత స్థితికి లేపుతాడు. ఈ ఖురాన్ మూలంగానే కొన్ని జాతుల్ని అధోగతి పాలు చేస్తాడు.

అంటే ఖురాన్ పారాయణం చేసే వారికి, ఖురాన్ అర్థం చేసుకునే వారికి, ఖురాన్ ని నేర్పించే వారికి, ఖురాన్ పరంగా తమ జీవితం గడిపే వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నత స్థితి, ఉన్నత స్థాయిని ప్రసాదిస్తాడు. గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ఎవరైతే ఖురాన్ ని విడనాడుతారో, వదిలేస్తారో, ప్రక్కన పెట్టేస్తారో, పట్టించుకోరో అటువంటి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అధోగతి పాలు చేస్తాడు, అగౌరవాన్ని పాలు చేస్తాడు.

ఈ ఖురాన్ గ్రంథం ఇహలోకంలో మరియు పరలోకంలో, ఈ ఇహపరలోకాలలో ఖురాన్ మూలంగా మనుషుల గౌరవం, స్థానం ఎన్నో రెట్లు, ఎంతగానో పెరిగిపోతుంది.

ప్రళయ దినాన ఖురాన్ గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. అబూ ఉమామా రది అల్లాహు అన్హు అంటున్నారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నాను.

اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ
[ఇఖ్రవుల్ ఖురాన ఫ ఇన్నహూ య’తీ యౌమల్ ఖియామతి షఫీ’అన్ లి అస్ హాబిహీ]
“ఓ దైవ దాసులారా, ఖురాన్‌ను పఠించండి, పఠిస్తూ ఉండండి. అత్యధికంగా ఖురాన్ పారాయణం చేయండి. ఎందుకంటే ప్రళయ దినాన ఖురాన్ గ్రంథం తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారుగా వస్తుంది.”

అల్లాహు అక్బర్. రేపు ప్రళయ దినాన భయంకరమైన రోజు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు కుడి చేతిలో కర్మల పుస్తకం ఇస్తాడో, ఎడమ చేతిలో ఇస్తాడో తెలియదు. ఆ రోజు స్వయంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వేరే వారి గురించి పట్టించుకోరు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో, ఇందస్ సిరాత్ (పుల్ సిరాత్ దాటే సమయంలో), ఇందల్ కితాబ్ (కర్మల పుస్తకం ఇచ్చే సమయంలో), ఇందల్ మీజాన్ (కర్మలు తూచే సమయంలో). కర్మలు ఇది చేసే సమయంలో, ఎవరి కర్మలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరి కర్మలు తక్కువగా ఉన్నాయి, త్రాసులు, కర్మల, కర్మల త్రాసులు వేసే సమయంలో. ఈ మూడు సందర్భాలలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ మూడు సందర్భాలలో నేను నా గురించి తప్ప ఇతరుల గురించి నాకు ఆలోచన రాదు అని ఎవరికి అంటున్నారు? ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా గారిని అంటున్నారు. అటువంటి సమయంలో ఖురాన్ అత్యధికంగా పఠించే వారికి ఖురాన్ ఆ రోజు సిఫారసు చేస్తుంది.

అభిమాన సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు.

يُقَالُ لِصَاحِبِ الْقُرْآنِ اقْرَأْ وَارْتَقِ وَرَتِّلْ كَمَا كُنْتَ تُرَتِّلُ فِي الدُّنْيَا فَإِنَّ مَنْزِلَتَكَ عِنْدَ آخِرِ آيَةٍ تَقْرَأُ بِهَا
[యుఖాలు లి సాహిబిల్ ఖురాన్, ఇఖ్ర’ వర్తఖి వర్రత్తిల్ కమా కున్త తురత్తిలు ఫిద్దున్యా, ఫ ఇన్న మన్జిలతక ఇంద ఆఖిరి ఆయతిన్ తఖ్రవుహా]

“రేపు ప్రళయ దినాన ఖురాన్ వారితో ఇలా అనడం జరుగుతుంది. ఇక్కడ ఖురాన్ వారు అంటే ఎవరు? ఖురాన్ ని పఠించేవారు. ఖురాన్ పారాయణం చేసేవారు అత్యధికంగా. ఖురాన్ ను అర్థం చేసుకునేవారు. ఖురాన్ పరంగా ఆచరించే వారు. సాహిబె ఖురాన్ తో, ఖురాన్ వానితో ఇలా అనబడుతుంది, ఏమని? ‘ఇఖ్ర’’, ఓ ఖురాన్ వాడా, ఓ ఖురాన్ కి చెందిన వాడా, ‘ఇఖ్ర’’ పఠిస్తూ ఉండు. ‘వర్తఖి’, ‘వరత్తిల్ కమా కున్త తురత్తిలు ఫిద్దున్యా’ నువ్వు ప్రపంచంలో నెమ్మదిగా ఖురాన్ పఠించినట్లు ఎప్పుడూ కూడా అలాగే పఠిస్తూ పైకెళ్తూ ఉండు. అలా పఠిస్తూ వెళ్తూ ఎక్కడ పఠనం, పారాయణం చేయటం ఆపుతావో ఆ చివరి ఆయత్ దగ్గరే నీ అంతస్తు ఉంటుంది.”

అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, పాపాలలో అసూయ అనేది ఘోరమైన పాపం. పెద్ద పాపం. కానీ రెండు విషయాలలో లేదా రెండు వ్యక్తుల, రెండు రకాల వ్యక్తుల విషయంలో అసూయ చెందవచ్చు, అనుమతి ఉంది. అదేమిటి?

لَا حَسَدَ إِلَّا فِي اثْنَتَيْنِ
[లా హసద ఇల్లా ఫిస్నతైన్]
“ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరి పట్ల అసూయ చెందకూడదు”

ఘోరమైన పాపం అసూయ. కానీ ఇద్దరి పట్ల అసూయ చెందవచ్చు.

رَجُلٌ آتَاهُ اللَّهُ الْقُرْآنَ فَهُوَ يَقُومُ بِهِ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ
[రజులున్ ఆతాహుల్లాహుల్ ఖురాన ఫహువ యఖూము బిహీ ఆనాఅల్లైలి వ ఆనాఅన్నహార్]
ఒకడు, అల్లాహ్ ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించాడు, రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి.

ఖురాన్ పఠించే వ్యక్తి, ఖురాన్ పరంగా ఆచరించే వ్యక్తి, ఖురాన్ నేర్పించే వ్యక్తి విషయంలో అసూయ చెందవచ్చు. అలాగే రెండో వ్యక్తి ఎవరు?

وَرَجُلٌ آتَاهُ اللَّهُ مَالًا فَهُوَ يُنْفِقُهُ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ
[వ రజులున్ ఆతాహుల్లాహు మాలన్ ఫహువ యున్ఫిఖుహూ ఆనాఅల్లైలి వ ఆనాఅన్నహార్]
రెండవ వ్యక్తి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే వ్యక్తి.

ఈ ఖురాన్ కి చెందిన వ్యక్తి, ఈ దానం చేసే వ్యక్తి, వీరిద్దరి విషయంలో అసూయ పడవచ్చు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఇక చివర్లో ఖురాన్ లో కొన్ని ఆయతుల అర్థం తెలుసుకుని ముగిద్దాం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. దుర్మార్గుడు పరలోకంలో వాడు ఎవడు అనేది మనకు తెలుస్తుంది.

وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا

ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!” (25″27)

ఆ రోజు, ప్రళయ దినాన, ఎవ్వరూ ఎవరికీ పనికి రారు. సహాయం చేయరు, చేయలేరు. భార్య అయినా, సంతానం అయినా, అమ్మ నాన్న అయినా, బంధువులైనా ఎవ్వరైనా సరే, సిరిసంపదలైనా, హోదా అయినా ఏదీ పనికి రాదు. ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ, బాధతో, దుఃఖంతో తనను తాను నిందించుకుంటూ, “అయ్యో, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది.”

يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا
“అయ్యో నా పాడుగాను, నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది.” (25:28)

لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسانِ خَذُولًا
“నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!” (25:29)

“నా వద్దకు ఉపదేశం వచ్చింది. ‘అద్-దిక్ర్’ వచ్చింది, ఖురాన్ వచ్చింది. కానీ వాడు నాకు ఖురాన్ నుంచి దూరం చేశాడు. నా దగ్గరకు అల్లాహ్ ‘దిక్ర్’ పంపించాడు. ఖురాన్ వచ్చింది, హితోపదేశం వచ్చింది, ‘దిక్ర్’ వచ్చింది, మౌఇదా వచ్చింది, రహ్మా వచ్చింది. ఇవన్నీ ఖురాన్. కానీ వాడు నాకు వీటి నుంచి దూరం చేశాడు. ఎంతైనా షైతాను మనిషికి ద్రోహం చేసేవాడే.” కానీ అక్కడ తెలుసుకుని ఏం ప్రయోజనం లేదు. అది ఇక్కడ తెలుసుకోవాలి.

ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోరు విప్పుతారు. వాడు బాధపడుతున్నాడు, “నా పాడుగాను”, తన్ను తాను నిందించుకుంటున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆ సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తారు.

وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا
“ఓ నా ప్రభువా! నిశ్చయంగా నా జాతి వారు ఈ ఖురాన్‌ను వదిలిపెట్టారు.”

అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుతారు. అంటే పరలోకంలో పరాజయం, అవమానం, దుర్భర స్థితి, శిక్షకు కారణం ఏమిటి? ఖురాన్‌ను విడనాడటం, వదిలివేయటం.

కావున, అభిమాన సోదరులారా, ఈ ప్రపంచంలో అందరికంటే ఉత్తములు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఇచ్చారు. ఈ ప్రపంచంలో, అందరికంటే ఉత్తములు, ప్రవక్త గారు సెలవిచ్చారు, బుఖారీ గ్రంథంలోని హదీస్ ఇది.

خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ
[ఖైరుకుమ్ మన్ త’అల్లమల్ ఖురాన వ అల్లమహూ]
“మీలో ఖురాన్‌ను నేర్చుకుని ఇతరులను నేర్పించేవారు అందరిలోకెల్లా ఉత్తములు.”

అంటే ఈ భూమండలంలో మానవులలో, అల్లాహ్ దాసులలో, ఈ ఉమ్మత్ లో అందరికంటే శ్రేష్టమైన వారు, ఉన్నతమైన వారు, ఉన్నత స్థితికి చెందిన వారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట పరంగా ఎవరు? ఖురాన్ నేర్చుకునేవారు, ఖురాన్ నేర్పించేవారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసే సౌభాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ అహ్లె ఖురాన్ లో చేర్చుగాక. మన జీవితాంతం ఖురాన్ ను పఠించే, ఖురాన్ ను అర్థం చేసుకునే, ఖురాన్ ను ఆచరించే సౌభాగ్యం ప్రసాదించు గాక.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
[అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్]
ఓ అల్లాహ్! ముహమ్మద్ పై మరియు ఆయన కుటుంబంపై కారుణ్యం కురిపించు, ఇబ్రాహీం మరియు ఆయన కుటుంబంపై నువ్వు కారుణ్యం కురిపించినట్లు. నిశ్చయంగా నువ్వు ప్రశంసనీయుడవు, ఘనత గలవాడవు.

اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّdٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
[అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్]
ఓ అల్లాహ్! ముహమ్మద్ పై మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు, ఇబ్రాహీం మరియు ఆయన కుటుంబంపై నువ్వు శుభాలు కురిపించినట్లు. నిశ్చయంగా నువ్వు ప్రశంసనీయుడవు, ఘనత గలవాడవు.

رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
[రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వ ఖినా అదాబన్నార్]
ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.

رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ
[రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బ’ద ఇద్ హదైతనా వ హబ్ లనా మిల్ లదున్క రహ్మా, ఇన్నక అంతల్ వహ్హాబ్]
ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తర్వాత మా హృదయాలను వక్రమార్గం వైపు త్రిప్పకు. మరియు నీ వద్ద నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు.

رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ
[రబ్బనగ్ ఫిర్ లనా వ లి ఇఖ్వానినల్లదీన సబఖూనా బిల్ ఈమాని వలా తజ్’అల్ ఫీ ఖులూబినా గిల్లల్ లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్ రహీమ్]
ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు విశ్వాసంలో మా కంటే ముందు గడిచిపోయిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వసించిన వారి పట్ల ఎలాంటి ద్వేషాన్ని ఉంచకు. ఓ మా ప్రభూ! నిశ్చయంగా నువ్వు దయగలవాడవు, కరుణామయుడవు.

رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا
[రబ్బిర్ హమ్హుమా కమా రబ్బయానీ సగీరా]
ఓ నా ప్రభూ! నా తల్లిదండ్రులు చిన్నప్పుడు నన్ను ఎలా కారుణ్యంతో పెంచారో, నువ్వు కూడా వారిపై అలాగే కారుణ్యం చూపు.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ
[సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అన్త అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్]
ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు మరియు నీకే సర్వ స్తోత్రాలు. నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను మరియు నీ వైపుకే పశ్చాత్తాపంతో మరలుతున్నాను.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[ఆఖిరు ద’వానా అనిల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మరియు మా చివరి ప్రార్థన, సర్వ స్తోత్రాలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే.

  1. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా]
ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 38 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఖుర్’ఆన్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/quran/