అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయడం ధర్మ సమ్మతమేనా?
https://youtu.be/FpPJtYzHKHQ [12 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఉపన్యాసంలో, ఇస్లాంలో ప్రమాణం (ఒట్టు) చేయడానికి సంబంధించిన నియమాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. అల్లాహ్ యేతరులపై, అంటే ప్రవక్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కాబా లేదా ఇతర సృష్టితాలపై ప్రమాణం చేయడం ఇస్లాంలో ఘోరమైన పాపం మరియు షిర్క్ (బహుదైవారాధన) అని స్పష్టం చేయబడింది. అవసరమైతే, కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే నిజాయితీతో ప్రమాణం చేయాలని, లేకపోతే మౌనంగా ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు హదీసుల ద్వారా తెలియజేయబడింది. అబద్ధపు ప్రమాణాలు చేయడం, ముఖ్యంగా అల్లాహ్ పేరు మీద చేయడం కూడా మహా పాపమని హెచ్చరించబడింది. అంతిమంగా, ఈ షిర్క్ అనే పాపం నుండి దూరంగా ఉండాలని మరియు అల్లాహ్ బోధనలను మాత్రమే అనుసరించాలని ఉద్బోధించబడింది.
అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్
అభిమాన సోదరులారా! “ధర్మ అవగాహనం” అనే ఈ ఎపిసోడ్ లో మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం,
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమా, కాదా? అనే విషయం గురించి తెలుసుకుందాం.
కొన్ని సందర్భాలలో మనకు ప్రమాణం చేసే అవసరం వస్తుంది. మనము చెప్పే మాట సత్యమని, నిజమని చెప్పటానికి, మనం చెప్పే మాటను బలపరచటానికి, లేదా అవతలి వ్యక్తి మా మాటను నమ్మటం లేదని వారిని నమ్మించటానికి, లేదా ఏదో ఒక సందర్భంలో గొడవపడితే, “నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పాను, అలా చేయలేదు, ఇలా చేశాను” అని రుజువు చేయటానికి, లేదా ఏదో ఒక వాగ్దానం నెరవేర్చటానికి, బలపరచటానికి, “అల్లాహ్ సాక్షిగా నేను ఈ పని చేస్తాను” అని ఇలా కొన్ని కారణాల వల్ల మనిషి ప్రమాణం చేస్తాడు.
దైవేతరులపై ప్రమాణం చేయడం షిర్క్
మనం సమాజంలో చూస్తాము, కొంతమంది సృష్టిరాశుల మీద ప్రమాణం చేస్తారు. అది ప్రవక్తలు కావచ్చు, ప్రవక్త మీద ప్రమాణం, కాబతుల్లా మీద ప్రమాణం, మస్జిద్ సాక్షిగా మస్జిద్ మీద ప్రమాణం, దైవదూతల మీద ప్రమాణం, తాత ముత్తాతల మీద ప్రమాణం, ఆత్మల మీద ప్రమాణం, తల మీద ప్రమాణం, “నా తలపైన పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను,” “నా బిడ్డ తలపైన చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” “అమ్మ తలపైన పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” ఫలానా సమాధి మీద ప్రమాణం చేస్తున్నాను, వారి నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నాను, ఇలా అనేక విధాలుగా సృష్టి రాశులపై, దైవేతరులపై, అల్లాహ్ పైన కాకుండా, అల్లాహ్ మీద కాకుండా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, గురువులు, సమాధులు, కాబా, మస్జిద్ ఏదైనా సరే దైవేతరుల మీద ప్రమాణం చేయటం ఇది ఇస్లాం పరంగా అధర్మం. ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ అని మనకు తెలుస్తుంది ఖురాన్ మరియు హదీసులు పరిశీలిస్తే.
ప్రమాణం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడైతే అప్పుడు, ఎవరి మీద అంటే వారి మీద చేయకూడదు, తప్పు, చాలా తప్పు.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِنَّ اللَّهَ تَعَالَى يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللَّهِ أَوْ لِيَصْمُتْ
(ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం అన్ తహ్లిఫూ బి ఆబాయికుం ఫమన్ కాన హాలిఫన్ ఫల్ యహ్లిఫ్ బిల్లాహి అవ్ లియస్ముత్)
నిశ్చయంగా అల్లాహ్, మీరు మీ తండ్రి తాతల మీద ప్రమాణం చేయడాన్ని నిషేధించాడు. కనుక ఎవరైనా ప్రమాణం చేయదలిస్తే అల్లాహ్ మీదనే చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. (ముత్తఫకున్ అలై – బుఖారీ మరియు ముస్లిం)
ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథములో ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని అల్లాహ్ వారించాడు.” ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం – అల్లాహ్ ఖండించాడు, అల్లాహ్ నిషేధించాడు, అల్లాహ్ వారించాడు మీరు మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని, అంటే చేయవద్దండి అని అర్థం.
ఫమన్ కాన హాలిఫన్ – ఒకవేళ ప్రమాణం చేయదలచుకుంటే ఆ అవసరం వచ్చింది. ఏదో ఒక తగాదాలో, గొడవలో, ఏదో ఒక సందర్భంలో, విషయంలో తప్పనిసరిగా ప్రమాణం చేసే అవసరం వచ్చింది, ప్రమాణం చేయదలచుకుంటున్నారు, అటువంటి సమయంలో ఫల్ యహ్లిఫ్ బిల్లాహ్ – అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయండి, అవ్ లియస్ముత్ – లేకపోతే ఊరుకోండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే, ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, ఊరుకుండాలి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం, యొక్క ప్రవచనం ఇది.
అలాగే ముస్లిం గ్రంథంలో ఇలా ఉంది, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ
(లా తహ్లిఫూ బిత్తవాగీ వలా బి ఆబాయికుం)
మీరు తాగూత్ (దైవేతర శక్తులు) మీద ప్రమాణం చేయకండి, మీ తండ్రి తాతల మీద కూడా ప్రమాణం చేయకండి.
మీరు మీ తాత ముత్తాతల మీద, మీరు మీ, మీరు విగ్రహాల మీద, దైవేతరుల మీద ప్రమాణం చేయకండి. “తవాగీ” ఇది బహువచనం తాగూత్ కి. తాగూత్ అంటే అల్లాహను తప్ప ఎవరిని ఆరాధిస్తున్నామో అది తాగూత్ అవుతుంది. అల్లాహ్ కాక ఎవరిని ఆరాధన దైవాలుగా భావించుకున్నారు, అది తాగూత్ కిందికి వస్తుంది. సమాధి పూజ చేస్తే సమాధి తాగూత్, ఒక చెట్టుకి పూజిస్తే ఆ చెట్టు తాగూత్. చనిపోయిన ప్రవక్తలను, ఔలియాలను, పుణ్య పురుషులను పూజిస్తే అది తాగూత్. అల్లాహ్ ను కాక ఎవరిని పూజిస్తే అది తాగూత్ అవుతుంది. అంటే, లా తహ్లిఫూ బిత్తవాగీకి అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఏ వస్తువు పైనా, ఏ వ్యక్తి పైనా, ఏ ఇతరుల మీద కూడా ప్రమాణం చేయకండి. వలా బి ఆబాయికుం – మీ తాత ముత్తాతల మీద కూడా ప్రమాణం చేయకండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా, అంతేకాదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا
(మన్ హలఫ బిల్ అమానతి ఫలయ్స మిన్నా)
ఎవరైతే అమానత్ (విశ్వసనీయత/నిజాయితీ) మీద ప్రమాణం చేస్తాడో, అతను మా పద్ధతిని అనుసరించిన వాడు కాదు.
ఎవరైతే నిజాయితీ మీద ప్రమాణం చేస్తాడో, వాడు ముస్లిం పద్ధతిని అనుసరించట్లేదు అని అర్థం. ఫలయ్స మిన్నా – మావాడు కాదు, మాలోని వాడు కాదు.
అభిమాన సోదరులారా, అంతే, ఇది ఎంత చిన్న విషయం కాదు. మనం చూస్తూ ఉంటాము మాటిమాటికీ, చీటికిమాటికి ప్రమాణం చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకి ప్రమాణం చేసేస్తాం. అది కూడా దైవేతరుల పైన మీద – అమ్మ మీద ఒట్టు, నా బిడ్డ మీద ఒట్టు, నా తల మీద ఒట్టు, తలపైన చెయ్యి పెట్టుకొని, పిల్లలపైన చెయ్యి పెట్టుకొని. ఇది మహా పాపం. అధర్మం, అన్యాయం. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.
చివరికి నిజాయితీ మీద కూడా ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ పేరు మరియు ఆయన గుణగణాల తప్ప, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క గుణగణాల తప్ప ఇతర ఏ విషయం మీద కూడా ప్రమాణం చేయకూడదు. నిజాయితీ కూడా అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం అది. “నా నిజాయితీ మీద, నీ నిజాయితీ మీద, వారి నిజాయితీ మీద ఒట్టు, ప్రమాణం చేసి చెప్తున్నాను” అంటే నిజాయితీ ఏమిటి? అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం. మరి ఆ ఆదేశం మీద ఒట్టు, ప్రమాణం చేస్తే, అది అల్లాహ్ యొక్క గుణగణాలకి పోల్చినట్లు అవుతుంది.
అభిమాన సోదరులారా, ప్రమాణం అనేది, ఒట్టు అనేది దీనికి అరబీలో, ఉర్దూలో “ఖసమ్” అంటారు. ఇది కేవలం అల్లాహ్ మీదనే. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తగాబున్, ఆయత్ 7లో ఇలా సెలవిచ్చాడు:
قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ
(ఖుల్ బలా వ రబ్బీ లతుబ్’అసున్న)
(ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు” (64:7)
అంటే చనిపోయిన జీవితం, మరణానంతర జీవితం, మీరు చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు లేపుతాను, మీరు లేపబడతారు. ఆ విషయం చెప్పటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నారు, ఖుల్ – ఓ ప్రవక్తా, ఇలా అను. బలా వ రబ్బీ – నా ప్రభువు సాక్షిగా. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఏం నేర్పించాడు? ప్రమాణం చేయగలిగితే, ఆ అవసరం పడితే, చేయాలనుకుంటే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి. ఖుల్ బలా వ రబ్బీ – ఓ ప్రవక్తా, వారితో ఇలా అను, “నా ప్రభువు సాక్షిగా లతుబ్’అసున్న – మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు.” అంటే కొందరికి విశ్వాసం ఉండదు, మరణానంతర జీవితంపై. అది వేరే ముఖ్యమైన సబ్జెక్ట్ అది. మీరు చనిపోయిన తర్వాత లేపబడతారు. సుమ్మ లతునబ్బ’ఉన్న బిమా అమిల్తుం – మీరు ఏం చేశారో మీ కర్మలు, మంచి చెడు మొత్తం మీ ముందర ఉంచడం జరుగుతుంది. అల్లాహ్ చూపిస్తాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా పాపం చేశాడా, పుణ్యం చేశాడా, తక్కువ, ఎక్కువ, న్యాయం, అన్యాయం మొత్తం మన జీవిత చరిత్ర అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు చూపిస్తాడు మరియు మన ఆ కర్మల పరంగానే మనకు తీర్పు జరుగుతుంది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో తెలియజేశాడు. అంటే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి. దైవేతరుల మీద, అల్లాహ్ యేతరుల మీద ప్రమాణం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? షిర్క్ అవుతుంది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ
(మన్ హలఫ బి గైరిల్లాహి ఫఖద్ అష్రక)
ఎవరైతే అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేశాడో, అతను షిర్క్ చేశాడు.
అల్లాహు అక్బర్! ప్రమాణం అనేది అంత పెద్దది. ఒక ముఖ్యమైన విషయంలో ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి. అది కూడా ప్రమాణం నిజం ఉండాలి, సత్యం ఉండాలి. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన కూడా చేయకూడదు. ఇతరులకి మోసం చేయటానికి కొందరు ఒక వస్తువు అమ్మటానికి అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన చేస్తారు. ఇది కూడా మహా పాపం. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ మీద కూడా చేయకూడదు. నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం, ధర్మం అనే విషయంలో ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్, కుఫ్ర్, బిద్అత్ నుండి కాపాడుగాక, రక్షించుగాక! అభిమాన సోదరులారా, మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రములు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
ఇతర ముఖ్యమైన పోస్టులు :
- అల్లాహ్ యేతరుల పేరు మీద ప్రమాణం చేయడం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [2p]
- అల్లాహ్ యేతరులపై ప్రమాణం చెయ్యవచ్చా? [ఆడియో] [5 నిముషాలు]
- తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

You must be logged in to post a comment.