సఫర్ నెల [పుస్తకం]

సఫర్ (صفر) మాసం – ఇస్లామీయ క్యాలెండరులో రెండవ నెల. ఇది ముహర్రం నెల తర్వాత వస్తుంది. దీనికా పేరు ఎలా వచ్చిందనే విషయమై కొందరు పండితులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు – ఈ నెలలో ప్రయాణం కోసం ప్రజలు మక్కా నగరాన్ని ఖాళీ (ఇస్ఫార్) చేస్తుండేవారు.

ఇంకో అభిప్రాయం ప్రకారం ఈ నెలలో మక్కావాసులు ఇతర తెగలపై దాడి చేసి, వారి మొత్తం సంపదనను కొల్లగొట్టేవారు (అరబీలో సిఫ్రాన్ మినల్ మతాఅ) అంటే వారికి ఏమీ మిగల్చకుండా నిలువుదోపిడి చేసేవారు. (ఇబ్నె అల్ మంధూర్ వ్రాసిన లిసాన్ అల్ అరబ్ పుస్తకం 4వ భాగం 462-463) 

సఫర్ అంటే భాషాపరంగా శూన్యమాసం అంటే ఖాళీ నెల అని అర్థం. ఈ పదం ఉనికిలోనికి రావటానికి రెండు కారణాలు వాడుకలో ఉన్నాయి:

మొదటిది: ఈ నెలలో అనాగరిక అరబ్బులు తమ ఇళ్ళను ఖాళీ చేసి లూటీ చేయటం కోసం వెళ్ళటం – సిఫర్ అంటే విసర్జించటం లేక ఖాళీ చేయటం.

రెండోది: అరబీ పదమైన సుఫ్ర్ అంటే పసుపు అనే పదం నుండి సఫర్ అనే పదం రావటం. ఈ నెలకు ఆ పేరు పెట్టబడిన కాలంలో, క్రమంగా క్షీణించిపోతూ, ఆకులు పసుపు రంగులో మారిపోయే శరదృతువులో ఆ నెల రావటం వలన దానికి ఆ పేరు వచ్చిందనేది మరొక అభిప్రాయం.