అరఫా దినం యొక్క ప్రత్యేకతలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ అరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

 స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి. ఎల్లవేళలా ఆయన భయాన్ని కలిగి ఉండండి. తెలుసుకోండి! అల్లాహ్ ఈ సృష్టి ప్రధాత. ఆయన ఎవరిని కోరుతాడో వారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. వారు మనుషులైనా లేక ప్రదేశమైనా లేక ఏదైనా సందర్భం అయినా లేక ఏదైనా ఆరాధన అయినా. అది ఆయన వివేకంపై ఆధారపడి ఉంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

(وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَار)
(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)

ఇన్షా అల్లాహ్, మనం ఈ ఖుత్బా లో అరఫా దినానికి ఉన్న గొప్పదనం గురించి మరియు దాని 10 ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

1. అరఫా దినం యొక్క ప్రత్యేకతలో మొదటిది – అరఫా రోజు ధర్మం పూర్తి గావించబడిన రోజు. అల్లాహ్ యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి రోజు.

తారిఖ్ బిన్ షిహాబ్ ఉల్లేఖనం ప్రకారం ఒక యూదుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ వారి వద్దకు వచ్చాడు మరియు ఇలా అన్నాడు – ఓ విశ్వాసుల చక్రవర్తి, మీ గ్రంథమైనటువంటి ఖురాన్ లో ఒక వాక్యం ఉంది. దాన్ని మీరు పఠిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ వాక్యం మా యూదులపై గనక అవతరించి ఉండి ఉంటే మేము ఆ రోజుని పండుగ దినంగా చేసుకునే వారము. అప్పుడు ఉమర్ వారు ఇలా అన్నారు: ఆ వాక్యం ఏది? యూదుడు ఇలా అన్నాడు: ఈ ఆయత్

(الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا)
(ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను.)

అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మేము ఈ వాక్యం ఎక్కడ మరియు ఎప్పుడు అవతరించిందో మాకు తెలుసు. ఈ వాక్యం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై జుమా రోజున అరఫాత్ మైదానంలో నిల్చొని ఉండగా అవతరించింది“. (బుఖారి-ముస్లిం)

2. అరఫా దినం యొక్క రెండో ప్రత్యేకత ఏమిటంటే అల్లాహ్ ఖురాన్ లో రెండు చోట్ల దీనిపై ప్రమాణం చేశాడు.

నిశ్చయంగా అల్లాహ్ గొప్ప విషయాలపైనే ప్రమాణం చేస్తాడు. అల్లాహ్ యొక్క ఈ ఆజ్ఞ (  وشاهد ومشهود) యొక్క అర్థం ఈ అరఫా రోజే. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: “షాహిద్ అంటే జుమా రోజు మష్ హూద్ అంటే అరఫా రోజు మరియు మౌఊద్ అంటే ప్రళయ దినం రోజు.” (అహ్మద్)

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క మరొక ఆజ్ఞ (والشفع والوتر)

ఇందులో వత్ర్ అనగా అరఫా దినము. జాబీర్ కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ చేశారు: “ఈ వాక్యంలో అషర్  అనగా జిల్ హిజ్జా మాసం యొక్క పది రోజులు. మరియు వత్ర్ అంటే అరఫా దినము. మరియు షఫఅ అనగా ఖుర్బాని రోజు అని అర్థం”. (అహ్మద్)

3. అరఫా దినం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున పాటించే ఉపవాసం వలన ఒక సంవత్సరం యొక్క పాపాలు మన్నింపబడతాయి

అబూ ఖతాదహ్ (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:అరఫా దినం యొక్క ఉపవాసం నాకు నమ్మకం ఉంది అది గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలను పోగొడుతుంది.” (ముస్లిం)

4. అరఫా దినం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే అది గౌరవప్రదమైనటువంటి నెలలో వస్తుంది మరియు దానికంటే ముందు వచ్చేనెల మరియు తర్వాత వచ్చేనెల రెండు కూడా గౌరవప్రదమైనవి.

5. అరఫా దినం యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే అది నరకం నుండి విముక్తి పొందే రోజు.

ఆ రోజున అల్లాహ్ తన దాసులకు దగ్గర అవుతాడు. మరియు అల్లాహ్ దైవదూతల ముందు అరఫా మైదానంలో నిల్చుని ఉన్నటువంటి హాజీలను చూసి గర్వపడతాడు. ఈ మూడు ప్రత్యేకతల గురించి ఒకే హదీసులో తెలియజేయబడింది. ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “అల్లాహ్ తన దాసులకు అరఫా రోజు నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదించినంతగా మరే రోజులోనూ ప్రసాదించడు. మరియు అల్లాహ్ తన దాసులకు దగ్గరవుతాడు మరియు వారందరిని చూసి దైవదూతల ముందు గర్వపడతాడు, మరియు ఇలా అంటాడు వీరు ఏం కోరుకుంటున్నారు?” (ముస్లిం)

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు: “అల్లాహ్ రోజు సాయంత్రం వేళ అరఫాత్ మైదానంలో నిల్చొని ఉన్నటువంటి తన దాసులను చూసి దైవదూతల ముందు గర్వపడతాడు. మరియు ఇలా అంటాడు: “నా దాసులను చూడండి. చెరిగిన జుట్టు, దుమ్ము ధూళితో నిండిన దుస్తులు ధరించి ప్రయాణ అలసటతో నా దర్బారులో హాజరయ్యారు“. (అహ్మద్)

ఇబ్నే రజబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “అరఫా రోజు నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదించబడేటువంటి రోజు. ఆ రోజున హజ్ చేసే వారిని మరియు తన ఇతర దాసులకు నరకం నుంచి విముక్తి ప్రసాదిస్తాడు. అరఫాత్ మైదానంలో ఉన్న లేకున్నా. ఎందుకంటే వారు పాప క్షమాపణకై అల్లాహ్ ను వేడుకుంటారు. అందుకే ఆ తరువాత వచ్చేటువంటి రోజును పండుగ దినంగా నిర్దేశించడం జరిగింది

6. అరఫా దినం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆరోజు చేసేటువంటి దుఆ ప్రార్ధన కు స్వీకారయోగ్యం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు:

“అన్నిటికంటే ఉత్తమమైన దుఆ అరఫా రోజున చేసే దుఆ. మరియు నేను ఇప్పుడు మీ ముందు పఠించింది లేక నాకంటే ముందు వచ్చిన ప్రవక్తలు అందరూ పఠించిన దుఆ లలో ఉత్తమమైన దుఆ ఇది”

“لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد وهو على كل شيء قدير”
లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్దహు, లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.

ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. విశ్వమంతా ఆయనకే చెందింది మరియు సకల ప్రశంసలు ఆయనకే చెందుతాయి. ప్రతి దానిపై ఆయనకు ఆధిపత్యం ఉన్నది.

7. అరఫా దినం యొక్క ప్రత్యేకతలలో మరొకటి ఏమిటంటే ఇది జిల్ హిజ్జ మాసం మధ్యలో వస్తుంది మరియు ఇది రోజులలో కెల్లా అతి శ్రేష్టమైన రోజు

ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియచేశారు: జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజుల్లో చేయబడిన సత్కార్యాలకన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ అల్లాహ్ దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహపడుతూ ప్రవక్త వారిని ఇలా ప్రశ్నించారు: ఓ ప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం దాని కన్నా ప్రియమైనది కాదా? అని అడిగారు దానికి సమాధానం ఇస్తూ అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా ప్రియమైనది కాదు, ఒకవేళ ఎవరైనా ధన ప్రాణాల సమేతంగా బయలుదేరి వాటిలో ఏది తిరిగి రాకపోతే, వీరమరణం పొందితే తప్ప. (బుఖారి)

8. అరఫాదినం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున హజ్జ్ యొక్క అతి గొప్ప భాగం నిర్వహించబడుతుంది.

ఇది వుఖూఫ్-ఎ-అరఫా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులో ఇలా ఉంది “హజ్ అంటే” అరఫా లో నిల్చోవడం.(నసాయి)

9. అరఫా దినం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున ముస్లింలందరూ వివిధ ప్రదేశాలనుంచి వచ్చి ఒకే చోట సమావేశమవుతారు మరియు ఒకే విధిని నిర్వహిస్తారు.

ఇలాంటిది మరే ఇతర రోజుల్లో, ఇతర ప్రదేశంలో, ఇతర ఆరాధనలో ఈ విధంగా నిర్వహించబడదు. ఇది ఇస్లాం యొక్క గొప్ప గుర్తింపు మరియు ఔన్నత్యము. ఇది షైతాన్ యొక్క తిరోగమనానికి కూడా కారణం. ఎందుకంటే వాడు చూస్తాడు అల్లాహ్ యొక్క దయ మరియు కారుణ్యం తన దాసులపై కురుస్తూ ఉంటుంది, వారి యొక్క పాప క్షమాపణ జరుగుతూ ఉంటుంది, దాని వలన వాడికి బాధ కలుగుతుంది.

ఓ అల్లాహ్ దాసులారా! ఇవి అరఫా దినముకు సంబంధించిన 10 ప్రత్యేకతలు తెలియజేయడం జరిగింది. వీటి గొప్పతనం మరియు ఔన్నత్యం రీత్యా మనం వీటిపై ఆచరించడానికి ప్రయత్నించాలి. దీని కొరకు అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకోవాలి. ఇలాంటి సత్కార్యాలలో ఒకరిని మించి ఒకరు పోటీపడాలి మరియు అల్లాహ్ తో వీటి ప్రతిఫలాన్ని ఆశించాలి. ఎందుకంటే ఇది ఆచరించేటువంటి సమయం ఇక్కడ లెక్క పత్రం ఉండదు కానీ రేపు మన లెక్క తీసుకోబడేటువంటి రోజు అక్కడ ఆచరణ చేసే అవకాశం లభించదు.

(سَابِقُوا إِلَى مَغْفِرَةٍ مِنْ رَبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا كَعَرْضِ السَّمَاءِ وَالْأَرْضِ أُعِدَّتْ لِلَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ)

(రండి!) మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరుగెత్తండి. ఇంకా, భూమ్యాకాశాలంత వెడల్పు గల స్వర్గం వైపు పరుగిడండి. అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించే వారికోసం అది తయారు చేయబడింది.

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ విశ్వాసులారా! మీరు తెలుసుకోండి. అరఫా రోజున దువా చేయడం గురించి వచ్చినటువంటి ప్రాధాన్యత కేవలం హాజీల వరకే పరిమితం కాదు, పూర్తి ప్రపంచ వాసులందరి కొరకు. ఎందుకంటే ఇది ఆ సమయానికి సంబంధించినటువంటి ఘనత. ఆ సమయంలో హాజీలందరూ అరఫా మైదానంలో ఉంటారు. అలాంటి వారికి ప్రదేశం మరియు సమయం యొక్క రెండు ఘనతలు ప్రాప్తిస్తాయి.

అల్లాహ్ దాసులారా! అరఫా రోజున జిక్ర్ మరియు దుఆలను నిర్వహించడంలో సహాయపడే వాటిలో ఒకటి మధ్యాహ్నం నుండి సూర్యాస్తమయం వరకు వీలైనంత వరకు మస్జిద్ లో ఉండడం. అదేవిధంగా అరఫా రోజున నమాజ్ తరువాత తక్బీర్ పఠించేందుకు ధర్మం అనుమతించింది. ఇది హజ్ కు వెళ్లలేని వారందరికీ కూడా. అరఫా దినం యొక్క ఫజర్ నమాజ్ నుండి మొదలుకొని జిల్ హిజ్జా యొక్క 13వ తారీకు అసర్ నమాజ్ సమయం పూర్తయ్యేంతవరకు దీనిని పటించేటటువంటి అనుమతి ఉంది. ఇక హాజీల యొక్క విషయానికి వస్తే వారు తమ తక్బీర్ ని అరఫా రోజు జుహర్ మరియు అసర్ నమాజ్ తర్వాత నుండి ప్రారంభిస్తారు. హాజీలు తమ నమాజ్ ని పూర్తి చేసుకున్న తరువాత మూడుసార్లు ఇస్తిగ్ఫార్ చేయాలి. మరియు ఈ దువా పటించాలి

(اللهم أنت السلام ومنك السلام، تبارك يا ذا الجلال والإكرام)

ఆ తర్వాత మళ్లీ తక్బీర్ చెప్పాలి.
(الله أكبر، الله أكبر، لا إله إلا الله ، الله أكبر، الله أكبر ولله الحمد)۔

ఓ విశ్వాసులారా! ఇది మన ప్రియమైన, మహోన్నతమైన ప్రభువు నుండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే ఒక గొప్ప అవకాశం. కనుక ఈ సందర్భంలో మనిషి అల్లాహ్ ముందు మేలైన రీతిలో మసులుకోవాలి. ఆరాధన, జిక్ర్ మరియు ప్రార్ధన వేడుకోలు నిర్వహించాలి. ఎందుకంటే అల్లాహ్ అంటున్నాడు: “దాసుడు నావైపు జానెడు దగ్గరైతే నేను అతనికి మూరెడు దగ్గరవుతాను. మరియు అతను మూరెడు దూరం దగ్గరైతే నేను బారెడు దగ్గర అవుతాను. అతను నా వైపుకు నడుచుకుంటూ వస్తే నేను అతని వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాను“. ఈ హదీస్ అల్లాహ్ యొక్క గొప్పదనాన్ని తెలియపరుస్తుంది. దాసుడు మంచి పనులు చేస్తూ అల్లాహ్ కు ఎంత అయితే దగ్గర కావాలనుకుంటాడో అల్లాహ్ కూడా అతనికి అంత కంటే ఎక్కువగా దగ్గరవుతాడు.

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు. సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి. ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు,

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.  

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

జిల్ హిజ్జా నెల పది రోజుల ప్రత్యేకతలు మరియు ఘనత – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లింలారా! అల్లాహ్ దైవభీతిని కలిగి ఉండండి. ఎల్లవేళలా మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. తెలుసుకోండి అల్లాహ్ తన సృష్టి రాశులలో కొన్నింటికి కొన్నింటిపై ప్రాధాన్యతను ఇచ్చాడు అవి మనుషులైనా, ప్రదేశమైనా,  సమయమైనా లేదా ఏదైనా ఆరాధనైనా. దీని వెనుక వివేకాత్మకమైనటువంటి నిర్ణయం ఉంటుంది ఇది కేవలం అల్లాహ్ కి మాత్రమే తెలుసు! అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

(وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ مَا كَانَ لَهُمُ الْخِيَرَةُ)
నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిలో ఎవరికీ ఎటువంటి అధికారం లేదు.

మనం ఈ ఉపన్యాసంలో జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలకు ఉన్నటువంటి గొప్పదనం మరియు ప్రత్యేకతలను గురించి తెలుసుకుందాం!

మొదటి ప్రత్యేకత: ఏమిటంటే అల్లాహ్ తఆలా ఈ దినముల గురించి ప్రత్యేకంగా ఖురాన్ లో తెలియజేశాడు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

لِّيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَّعْلُومَاتٍ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ

వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్‌ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్‌ నామాన్ని స్మరించాలి (ఉచ్చరించాలి).

ఈ వాక్యంలో ఉన్న నిర్ణీత దినాలు అనగా జిల్ హిజ్జా మాసం యొక్క పది దినాలు. ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు: “నిర్ణిత దినాలు అనగా జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలు”

జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలు ఘనత కలిగినటువంటివి అనడానికి మరొక ఆధారం ఏమిటంటే అల్లాహ్ తఆలా వాటి రాత్రుల యొక్క ప్రస్తావన చేస్తూ ఇలా అంటున్నాడు:

وَالْفَجْرِ وَلَيَالٍ عَشْرٍ
ఉషోదయం సాక్షిగా! పది రాత్రుల సాక్షిగా!

ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వాక్యం యొక్క వివరణలో పది రాత్రుల యొక్క ప్రస్తావన చేసి ఇవి జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజులే అని తెలియజేశారు. ఇబ్నే అబ్బాస్, ఇబ్నే జుబైర్, ముజాహిద్ మరియు ఇతర పండితుల యొక్క అభిప్రాయం కూడా ఇదే.

జిల్ హిజ్జా మాసం యొక్క పది రోజుల శ్రేష్టతకు గల మరో కారణం ఏమిటంటే ఆ దినాలలో చేసేటువంటి ఆచరణ పుణ్యఫలం రీత్యా సంవత్సరంలోని ఇతర రోజులు కంటే ఎక్కువగా ఉంటుంది హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

జిల్ హిజ్జా మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ అల్లాహ్ దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహ పడుతూ, “దైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా?” అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధన ప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్ఠుడే)” అని చెప్పారు. (బుఖారీ)

ఇబ్నే రజబ్ (రహిమహుల్లాహ్) ఈ హదీస్ యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ఇలా అంటున్నారు:

నిశ్చయంగా ఇది ఒక గొప్ప హదీస్. ఎందుకంటే ఏదైనా చిన్న ఆచరణ ఘనత కలిగినటువంటి సమయంలో చేయడం మూలంగా ఆ సమయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా ఆచరణ యొక్క ఘనత కూడా పెరుగుతుంది, అదే విధంగా జిల్ హిజ్జా  యొక్క మొదటి పది రోజులలో చేసేటువంటి ఆచరణలు ఇతర దినాలలో చేసేటువంటి ఆచరణలు కంటే గొప్పవిగా పేర్కొనడం జరిగింది. అయితే అందులో కేవలం జిహాద్ కు మాత్రమే మినహాయింపు ఇవ్వబడింది అది కూడా ధన మన ప్రాణాలతో బయలుదేరి మళ్లీ తిరిగి రాకపోవడం.

అనగా ఈ హదీస్ ద్వారా వెలువడేటువంటి మరొక విషయం ఏమిటంటే జిల్ హిజ్జా యొక్క మొదటి దినాలలో చదివే నఫిల్ రంజాన్ యొక్క చివరి భాగంలో చదివే నఫీల్ కంటే ఉత్తమమైనవి. అదేవిధంగా జిల్ హిజ్జా యొక్క పది రోజులలో చేయబడే ఫరజ్ లు ఇతర దినాలలో చేయబడే ఫరజ్ ల కంటే గొప్పవి.

జిల్ హిజ్జా యొక్క పది దినాల యొక్క శ్రేష్టతకు గల మరొక కారణం: ఈ పది దినాలలో అరఫా దినము కూడా ఉంది. అల్లాహ్ తఆలా తన ధర్మాన్ని పరిపూర్ణంగావించిన రోజు మరియు ఈ వాక్యం అవతరణ కూడా జరిగింది:

 الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي 
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీ పై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను

జిల్ హిజ్జా యొక్క పది దినాల యొక్క శ్రేష్టతకు గల మరొక కారణం: ఈ పది దినాలలో ఖుర్బాని దినం కూడా ఉంది. ఈ ఈ దినమునే పెద్ద హజ్ అని కూడా అంటారు. ఈ రోజున ఎన్నో ఆరాధనలు ఏకమవుతాయి. ఖుర్బానీ, తవాఫ్ కాబా (ప్రదక్షణ), సఫా, మర్వా కొండల మధ్య పరిగెత్తడం (సయీ చేయడం), శిరోముండనం, జమరాత్ (షైతాన్) కు రాళ్ళు విసరడం.

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు హదీసులో ఇలా తెలియజేశారు: అల్లాహ్ తఆలా దగ్గర అత్యంత గొప్ప దినము ఖుర్బానీ దినము అనగా (జిల్ హిజ్జా మాసం పదవ దినం). ఆ తరువాత ఖుర్రా దినము, అనగా జిల్ హిజ్జా మాసం పదకొండవ దినము.(అబూ దావూద్). ఇక్కడ ఖుర్బానీ దినాన్ని ఖుర్రా దినముగా పేర్కొనడం జరిగింది దీనికి గల కారణం ఏమిటంటే ఆ రోజున హాజీలు మినా ప్రదేశంలో  ఆగి ఉంటారు.

1. అతి ఎక్కువగా అల్హందులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని స్మరిస్తూ ఉండాలి అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు: “అల్లాహ్ వద్ద ఈ పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ అత్యంత ప్రియమైనవి కావు, కనుక ఈ పది రోజుల్లో లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అల్హందులిల్లాహ్ ను ఎక్కువగా స్మరిస్తూ ఉండండి” (అహ్మద్)

బుఖారి (రహిమహుల్లాహ్) వారు ఇలా అన్నారు: ఇబ్నే ఉమర్ మరియు అబూ హురైరా వారు ఈ పది దినాలలో బజారులోకి వెళ్లి అతి బిగ్గరగా తక్బీర్ పలికేవారు అది చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా వారితో పాటు తక్బీర్ పలికే వారు (బుఖారి)

తక్బీర్ ఇలా పలకాలి:
(అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్,  అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్)

కాబట్టి ఈ పది దినములలో అతి ఎక్కువగా అల్లాహ్ ని స్మరించడం ఉన్నతమైన ఆచరణగా తెలుపబడింది. ఇళ్లల్లో బజారుల్లో అల్లాహ్ స్మరణకు అనుమతించబడిన ప్రతి చోట ఈ విధంగా అల్లాహ్ ను స్మరించడం ఉత్తమం. దీని ద్వారా అల్లాహ్ యొక్క మహిమ ఆయన ఎంత గొప్పవాడో ప్రదర్శించబడుతుంది. మరియు వీటిని పఠించేటప్పుడు పురుషులు ఒకేసారి బిగ్గరగా పటించాలి. స్త్రీ ఎవరైనా ఉంటే ఆమె నెమ్మదిగా తక్బీర్ పట్టించాలి.

నేటి కాలంలో తక్బీర్ విధానాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. చాలా కొద్ది మంది మాత్రమే దీనిపై ఆచరిస్తున్నారు కాబట్టి ఈ సున్నత్‌ను పునరుద్ధరించడానికి మరియు అజాగ్రత్తగా ఉన్నవారిని అప్రమత్తం చేయడానికి, తక్బీర్‌ను ఇతరులకు వినిపించేలా బిగ్గరగా చదవాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తక్బీర్ చదవాలి, సమిష్టిగా తక్బీర్ పఠించడానికి ధర్మంలో అనుమతి లేదు. ఇది ధర్మానికి విరుద్ధమైన చర్య.

2. జిల్ హిజ్జా మొదటి పది దినాలలో చేయవలసిన మరొక పని: ఉపవాసాలు పాటించడం. కాబట్టి ఈనెలలో తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటించడం అభిలషణీయంగా పరిగణించబడింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  గారు కూడా జిల్ హిజ్జా యొక్క తొమ్మిది దినాలు ఉపవాసం పాటించేవారు.

హునైదా బిన్ ఖాలిద్ తన భార్య తో ఉల్లేఖిస్తున్నారు మరియు ఆమె ప్రవక్త గారి కొందరి సతీమణులతో ఉల్లేఖించారు: మహా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం వారు జిల్  హిజ్జా మాసం యొక్క తొమ్మిది ఉపవాసాలు, ఆషురా ఉపవాసం, మరియు ప్రతి నెల మూడు ఉపవాసాలు, సోమ మరియు గురువారం ఉపవాసాలను పాటించేవారు. (అబూ దావూద్)

అబూ ఉమామ అల్ బాహిలి (రదియల్లాహు అన్హు) గారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  గారిని ఈ విధంగా ప్రశ్నించారు: ఓ మహా ప్రవక్తా! అల్లాహ్ నాకు లాభం చేకూర్చడానికి ఏదైనా ఆచరణ గురించి తెలియజేయండి. అప్పుడు ప్రవక్త వారు ఇలా సమాధానం ఇచ్చారు; “నువ్వు ఉపవాసం పాటించు ఎందుకంటే దానికి తగిన ఆచరణ మరొకటి లేదు“. (నసాయి)

3. ఈ పది దినములలో చేసేటువంటి ఆచరణలలో మరొకటి: అరఫా ఉపవాసం పాటించాలి. దీని ఆధారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)  గారిని అరఫా నాటి ఉపవాసం గురించి విచారించడం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ “అది క్రితం యేడు మరియు వచ్చే యేటి పాపాలన్నింటినీ తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు. (ముస్లిం)

4. ఈ పది రోజులలో చేసే మరో ఆచరణ  (ఈద్ నమాజ్) ప్రార్థన కూడా ఇది ప్రసిద్ధి చెందినది.

5. ఈ పది రోజులలో చేసేటువంటి మరో ఆచరణ: ఖుర్బానీ ఇవ్వడం. ఇది స్తోమత కలిగినటువంటి వారిపై తప్పనిసరి అవుతుంది. పండుగ రోజున ఖుర్బానీ ఇవ్వడం “తష్ రీఖ్”  దినాలలో ఖుర్బానీ ఇవ్వడం కంటే ఉత్తమం, ఎందుకంటే పండుగ రోజు పది రోజులలో చివరి రోజు, మరియు ఈ పది రోజులు అన్నింటికంటే ఉత్తమమైన రోజు మరియు “తష్ రీఖ్”  దినాలు ఈ పది రోజులలో చేర్చబడలేదు. కనుక పండుగ రోజు ఖుర్బానీ ఇవ్వడం సదాచరణలో త్వరపడడాన్ని సూచిస్తుంది. (తస్హీలుల్ ఫిఖ్హ్ )

6. జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది రోజులలో చేయవలసిన మరొక ఆచరణ: హజ్ మరియు ఉమ్రా చేయడం.

ఇవి ఈ పది రోజులలో చేసేటువంటి అత్యుత్తమ  కార్యాలు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  గారు చూపించినటువంటి విధానం ప్రకారం హజ్ నెరవేర్చాలి మరియు అందులో వారించబడినటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. అనగా అపసవ్యమైన చేష్టలకు, వ్యర్థ విషయాలకు, పోట్లాటలకు దూరంగా ఉంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  గారు చేసినటువంటి వాగ్దానం ప్రకారం పుణ్యఫలం ప్రాప్తం అవుతుంది. అనగా ఆమోదముద్ర పడిన హజ్  ప్రతిఫలం స్వర్గము. (బుఖారి,ముస్లిం)

ఓ అల్లాహ్ దాసులారా! ఇవి ఆరు ఆచరణలు జిల్ హిజ్జా మాసం మొదటి పది దినములలో చేయవలసిన పది ఆచరణలు. ఈ ఆరాధనలు సంవత్సరం మొత్తంలో కంటే ఈ పది రోజులకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. అందుకే ఈ పది రోజులు ఔన్నత్యం రీత్యా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. మరియు మూల ఆరాధనలు అన్నీ కూడా ఇందులో మమేకమయ్యాయి ఉదాహరణకు నమాజ్, రోజా, సదఖా మరియు హజ్.

ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ప్రజలు రంజాన్ యొక్క చివరి భాగంలో అతి ఎక్కువగా కార్యాచరణను మరియు ఆరాధన లో పాల్గొంటారు. కానీ వాస్తవంగా జిల్ హిజ్జ మాసం యొక్క మొదటి పది దినాలు వాటికంటే ఎంతో ప్రాధాన్యత గలవి కనుక అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఈ దినాలలో ఆరాధన చేయాలి.

తాబయీ లలో గొప్ప వ్యక్తి అయిన సయీద్ బిన్ జుబైర్ (రహిమహుల్లాహ్) జిల్ హిజ్జా యొక్క పది రోజులు వచ్చినప్పుడు,వారు తమ ప్రాణాలను పణంగా పెట్టేంత వరకు తీవ్ర ప్రయత్నంతో మరియు అంకితభావంతో ఆరాధన చేసేవారు. (ఫత్ హుల్ బారి)

మరియు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు: జిల్ హిజ్జా యొక్క రాత్రులలో దీపాన్ని సైతం ఆర్పకండి. అనగా అతి ఎక్కువగా ఆ రాత్రిల్లో ఖురాన్ పారాయణం మరియు తహజ్జుద్ చదువుతూ ఉండండి.

కాబట్టి! మనం ఈ రోజుల్లో అల్లాహ్‌ యొక్క సహాయం కోరుతూ ఉండాలి మరియు అనేక మంచి పనులు చేస్తూ ఉండాలి. ఆచరించడంలో ఒకరినొకరు అధిగమించడానికి ప్రయత్నించాలి. మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి ఈ ఆచరణల ప్రతిఫలం  ఆశించాలి. ఎందుకంటే ఈ రోజు ఆచరించే అవకాశం ఉంది రేపు లెక్క తీసుకోబడే రోజు(తీర్పు దినం) అక్కడ మనకు ఆచరించడానికి అవకాశం లభించదు.

అల్లాహ్ ఖుర్ఆన్  యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ విశ్వాసులారా! జిల్ హిజ్జా యొక్క పది రోజులు రంజాన్ చివరి పది రోజుల కంటే  గొప్పవని తెలుసుకోవాలి. మరియు ఈ రోజుల్లో ఎంతో శ్రమతో మరియు అంకితభావంతో ఆరాధన చేయాలి.

ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) ఈ విధంగా వ్రాశారు: ఈ పది రోజులు అన్ని రోజుల్లో కెల్లా హదీసుల్లో వీటి ఘనత గురించి తెలుపబడింది. మరియు చాలామంది ధార్మిక పండితులు కూడా ఈ రోజులను రంజాన్ యొక్క చివరి భాగంపై ప్రాధాన్యతను ఇచ్చారు. ఎందుకంటే రమజాన్ చివరి భాగంలో ఉన్న ఆరాధనలే ఈ దినాల్లో కూడా ఆచరించబడతాయి. నమాజ్, రోజా, సదఖా మొదలైనవి. కానీ జిల్ హిజ్జా పది దినాలకు గల ప్రత్యేకత ఏమిటంటే అందులో హజ్ ఆరాధన ఉంది.

మరొక వాక్యంలో ఇలా ఉంది: రమజాన్ యొక్క చివరి పది రోజులు ఘనత కలిగినటువంటివి ఎందుకంటే అందులో లైలతుల్ ఖాదర్ రాత్రి ఉంది అది 1000 నెలల కంటే ఉన్నతమైనది.

మరొక వర్గం వారు మధ్యస్తంగా ఇలా తెలియజేశారు: జిల్ హిజ్జా యొక్క మొదటి పది దినములు మరియు రంజాన్ యొక్క చివరి పది రాత్రులు ఎంతో ఘనత కలిగినటువంటివి. (అల్లాహ్ కు బాగా తెలుసు)

మరియు మీరు తెలుసుకోండి! అల్లాహ్ మిమ్మల్ని కరుణించుగాక! ఖుర్బానీ ఇచ్చేటువంటి వ్యక్తి వెంట్రుకలను గోళ్లను తీయడం నుండి వారించబడింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  వారు ఈ విధంగా తెలియజేశారు: మీరు జిల్ హిజ్జా మాసం నెలవంకను చూడగానే ఖుర్బానీ యొక్క సంకల్పం గనుక ఉంటే మీరు మీ వెంట్రుకలను మరియు గోళ్ళ ను తీయకండి. (ముస్లిం).

మరొక హదీసులో ఇలా ఉంది: ఎవరైతే ఖుర్బానీ యొక్క సంకల్పం చేశారో వారు జిల్ హిజ్జ మాసం ప్రారంభం అవగానే  వెంట్రుకలను మరియు చర్మాన్ని కత్తిరించరాడు. (ముస్లిం)

ఓ ముస్లిం లారా! ఇస్లాం యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటిని దూరం చేస్తుంది. కనుక ఏ వ్యక్తి అయినా వెంట్రుకలు గోళ్లు మరియు చర్మాన్ని తీసేటువంటి అవసరం వస్తే తీసేయవచ్చు ఇబ్నే ఉసైమీన్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరికైనా వెంట్రుకలు గోళ్ళు మరియు చర్మం కత్తిరించేటువంటి అవసరం వస్తే వాళ్లు వాటిని తీయొచ్చు.  ఉదాహరణకు; ఏదైనా గాయం కారణంగా వెంట్రుకలు తీయాల్సి వచ్చింది లేక గోరు ఊడిపోయింది లేక చర్మం తెగి వేలాడుతూ ఉంది ఆ సందర్భంలో కత్తిరించవచ్చు, అయితే ఇందులో వారిపై ఎటువంటి తప్పు ఉండదు.

ఓ ముస్లిం లారా! అదేవిధంగా ఒక హజీ ఖుర్బానీ చేసే సంకల్పం చేయగానే అతను కూడా ఇదే ఆజ్ఞ పరిధిలోకి వస్తాడు. ఉమ్రా పూర్తి చేసే వరకు వెంట్రుకలు చర్మం కత్తిరించరాదు ఒకవేళ ఉమ్రా పూర్తి చేస్తే అతను తన వెంట్రుకలు తప్పక తీయాలి (అతను ఖుర్బానీ ఇచ్చే సంకల్పం చేసుకున్నప్పటికీ) ఎందుకంటే ఉమ్రా తర్వాత వెంట్రుకలు తీయడం ఆరాధనలో భాగం. ఇది ఇబ్నే బాజ్ మరియు ఇబ్నే ఉసైమీన్ వారి మాట.

మరియు ఇది కూడా తెలుసుకోండి. అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)

(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు,సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి.

ఓ అల్లాహ్! మాకు జిల్ హిజ్జా మాసం యొక్క పది దినాలను ప్రసాదించు. మరియు వాటిలో ఉపవాసం పాటించి నీ కొరకు తహజ్జుద్ నమాజ్ చదివే భాగ్యాన్ని ప్రసాదించు!

ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.    

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.  

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయ పడుతున్నాము మరియు ఆ స్వర్గం లోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.  మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము. మరియు  నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి  నీ శరణు కోరుకుంటున్నాము.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ