ఖుర్ఆన్ హక్కులు: ఖుర్ఆన్ పై విశ్వాసం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]

ఖుర్ఆన్ హక్కులు: ఖుర్ఆన్ పై విశ్వాసం 
Rights of the Quran: Belief in the Quran
https://www.youtube.com/watch?v=oJlAj6X5D2I [9 నిముషాలు]
హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 

ఈ ప్రసంగం ఇస్లాంలో పవిత్ర ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. వక్త ఖురాన్‌ను ఒక దైవిక గ్రంథంగా మరియు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికి మాత్రమే కాకుండా, యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథంగా పరిచయం చేస్తున్నారు. ఇది అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటిగా చెప్పబడింది. విశ్వాసులపై ఖురాన్‌కు ఉన్న హక్కులు ఈ ప్రసంగం యొక్క ప్రధాన అంశం, ప్రత్యేకించి మొదటి హక్కు అయిన దానిపై పూర్తి మరియు అచంచలమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటంపై దృష్టి పెడుతుంది. ఈ విశ్వాసం, ఖురాన్ అల్లాహ్ యొక్క కల్తీ లేని వాక్యమని, జిబ్రయీల్ దూత ద్వారా అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేయబడిందని నమ్మడాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక, అల్లాహ్ స్వయంగా ఖురాన్‌ను ఎలాంటి మార్పుల నుండి అయినా సంరక్షిస్తానని హామీ ఇచ్చాడని, ఆ వాగ్దానం 1400 సంవత్సరాలకు పైగా నిజమని నిరూపించబడిందని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ అ దహు)
أَمَّا بَعْدُ
(అమ్మా బ అద్)

అభిమాన సోదరులారా, కారుణ్య కడలి, రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం ఖుర్ఆన్ హక్కులలోని ఒక హక్కు గురించి తెలుసుకోబోతున్నాం. ఇస్లాం మౌలిక విశ్వాసాలకి ముఖ్యమైన ఆధారాలలో ఖుర్ఆన్ గ్రంథం ప్రధానమైనది. ఈ గ్రంథం పూర్తిగా దివ్య సందేశం. ఈ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.

సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు తన దాసులపై అమితమైన ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించాడు.ఆ వరాలలో, అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనపైన కురిపించిన వరాలలో అత్యంత మహోన్నత వరం దివ్య ఖుర్ఆన్. ఈ గ్రంథం సులభమైనది. స్వార్థపరులు ఎంత ప్రయత్నించినా మార్పులు చేర్పులకు సాధ్యం కాని విధంగా పంపబడిన గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.

మానవులు మరచిపోయిన ధర్మాన్ని పునర్జీవింపజేయడానికే ఖుర్ఆన్ అవతరించింది. ఖుర్ఆన్ గ్రంథం ఏదో ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. దీనిపై అధికార పెత్తనాలు చెలాయించే హక్కు ఏ వర్గానికీ లేదు. ఇది మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఇది మానవులందరికీ మార్గదర్శకం. కనుక ఖుర్ఆన్ గ్రంథాన్ని అనుసరించేవారు తమ నిజ ప్రభువు ఆజ్ఞలను అనుసరిస్తున్నట్లే.ఇది క్లుప్తంగా నేను ఖుర్ఆన్ యొక్క పరిచయం చేశాను

మనపై ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. అవేమిటో మనం తెలుసుకుందాం. కానీ ఖుర్ఆన్ యొక్క హక్కులలో ఈరోజు మనం మొదటి హక్కు, అనగా ఖుర్ఆన్ పై విశ్వాసం గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం. మిగతావి తర్వాత తెలుసుకుందాం.

ఖుర్ఆన్ యొక్క మొదటి హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్ పై విశ్వాసం. మనపై ఖుర్ఆన్ కు గల మొదటి హక్కు, దానిని మనం విశ్వసించాలి. మనస్ఫూర్తిగా నమ్మి, అంగీకరించి విశ్వసించాలి. ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఈ గ్రంథం, ఈ ఖుర్ఆన్ గ్రంథం, జిబ్రయీల్ దైవదూత ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిందని నోటితో అంగీకరించి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నమ్మి, తన వాక్కాయ కర్మలతో ఆచరించాలి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు.

وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ
(వ ఇన్నహు ల తన్జీలు రబ్బిల్ ఆలమీన్)
نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ
(నజల బిహిర్ రూహుల్ అమీన్)
عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ
(అలా ఖల్బిక లితకూన మినల్ మున్దిరీన్)
بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ
(బి లిసానిన్ అరబియ్యిమ్ ముబీన్)

నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. (ఓ ముహమ్మద్‌ – సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది.(ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది. (అష్-షుఅరా 26:192-195)

దీని సారాంశం ఏమిటి? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. జిబ్రయీల్ దైవదూత ద్వారా ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఖుర్ఆన్ వచ్చింది. సర్వ మానవుల కొరకు ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది.

అభిమాన సోదరులారా, అంటే ఈ గ్రంథం ముమ్మాటికీ సర్వలోక ప్రభువైన అల్లాహ్ తరఫున పంపబడిన గ్రంథం. దీన్ని విశ్వసనీయుడైన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని వచ్చారు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. సర్వ లోకాల, సర్వ మానవుల సన్మార్గం కోసం ఖుర్ఆన్ గ్రంథం అవతరింపబడినది.

ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా సురక్షితంగా ఉందని నమ్మాలి. ఖుర్ఆన్ గ్రంథంలో ఎటువంటి మార్పులు జరగలేదు, జరగవు కూడా. సురక్షితంగా ఉందని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
(ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్)
నిశ్చయంగా ఈ హితోపదేశాన్ని (ఖుర్‌ఆన్‌ను) మేమే అవతరింపజేశాము. మరి మేమే దీనిని పరిరక్షిస్తాము. (అల్-హిజ్ర్ 15:9)

మేము ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. కావున దివ్య ఖుర్ఆన్ స్వార్థపరుల కుయుక్తుల నుండి, అలాగే ప్రక్షిప్తాల బారి నుండి, మార్పులు చేర్పుల నుంచి కాపాడి స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను మేము స్వయంగా తీసుకున్నామని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సెలవిచ్చాడు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చెప్పిన ఈ వాక్కు, ఈ ఆయత్ సత్యమని గత 1442 సంవత్సరాలుగా రూఢి అవుతూనే ఉంది.

సూరహ్ బఖరాలోనే రెండవ ఆయత్:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
(జాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్ లిల్ ముత్తఖీన్)
ఈ గ్రంథం అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. (అల్-బఖర 2:2)

అభిమాన సోదరులారా, సారాంశం ఏమనగా ఖుర్ఆన్ అల్లాహ్ పంపిన గ్రంథం. ఖుర్ఆన్ జిబ్రయీల్ దైవదూత ద్వారా పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన గ్రంథం. ఖుర్ఆన్ సర్వమానవులకు సన్మార్గం చూపటానికి పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. ఇది మానవులందరి ఉమ్మడి సొత్తు. అలాగే ఖుర్ఆన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరించింది. ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులకి, చేర్పులకి తావు లేదు. మార్పులు చేర్పులు జరగలేదు, జరగవు. దానిని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు.

కావున, ఖుర్ఆన్ యొక్క హక్కులలో, మనపై ఖుర్ఆన్ కు గల హక్కులలో మొదటి హక్కు ఏమిటి? ఖుర్ఆన్ ను విశ్వసించడం. దానిని మనము విశ్వసించాలి. కేవలం విశ్వసిస్తే సరిపోతుందా? సరిపోదు. ఇంకా విశ్వసించటమే కాకుండా ఇంకా అనేక హక్కులు ఉన్నాయి. అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు ద అ వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

పవిత్ర ఖుర్ఆన్ పరిచయం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]

పవిత్ర ఖుర్ఆన్ పరిచయం – హబీబుర్రహ్మాన్ జామిఈ
https://youtu.be/ztbp2wtF5do [6 min]

ఈ ప్రసంగంలో ఖురాన్ గురించి వివరించబడింది. ఖురాన్ అంటే అల్లాహ్ వాక్యం, యావత్ మానవాళికి మార్గదర్శకం, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం అని నిర్వచించబడింది. ఇది అల్లాహ్ తరఫున జిబ్రయీల్ దూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడింది. ‘ఖురాన్’ అనే పదానికి ‘ఎక్కువగా పఠించబడేది’ అని అర్థం. రమజాన్ మాసంలో ఖురాన్ అవతరణ ప్రారంభమైందని, అందుకే ఈ మాసానికి, ఖురాన్‌కు మధ్య బలమైన సంబంధం ఉందని సూరహ్ బఖర మరియు సూరహ్ జుమర్ వాక్యాల ఆధారంగా వివరించబడింది.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అద అమ్మా బ’అద్.
అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

‎اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఖురాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

‎قُرْآن كَلَامُ الله
(ఖురాన్ కలాముల్లాహ్)
ఖురాన్, అల్లాహ్ యొక్క వాక్కు.

ఖురాన్ అల్లాహ్ వాక్యం. ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకం. ఖురాన్ సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం. ఖురాన్ అల్లాహ్ గ్రంథం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని జిబ్రయీల్ దూత ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సర్వ మానవుల కొరకు అవతరింపజేశాడు.

అభిమాన సోదరులారా! ఈ ఖురాన్ గ్రంథం ధర్మ పండితులు రాసుకున్న పుస్తకం కాదు. ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వయంగా చెప్పిన మాటలు కావు. ఖురాన్ గ్రంథం అల్లాహ్ వాక్యం.

జిబ్రయీల్ దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. ఎవరికోసం అవతరింపజేశాడు? సర్వమానవుల సన్మార్గం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడు.

అలాగే ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడినది. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసు 63 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రవక్త పదవి లభించింది. అంటే, 63 సంవత్సరాలలో 40 తీసేస్తే మిగిలింది 23 సంవత్సరాలు. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. ఈ 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ అవతరింపజేయబడినది.

ఖురాన్ అనే పదానికి శాబ్దిక అర్థం, ఎక్కువగా పఠించబడేది. ప్రపంచంలోనే ఎక్కువగా చదవబడే, పఠించబడే గ్రంథం ఖురాన్.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుజ్ జుమర్‌లో ఇలా తెలియజేశాడు:

‎تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِ
(తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్)
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన, వివేకవంతుడైన అల్లాహ్‌ తరఫున జరిగింది. (39:1)

ఈ ఖురాన్ ఎవరి తరఫున జరిగింది? అల్లాహ్ తరఫున. ఈ గ్రంథావతరణ, ‘తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్‘ – ఈ గ్రంథావతరణ సర్వాధికుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా తెలియజేశాడు, సూరా నెంబర్ రెండు:

‎شَهْرُ رَمَضَانَ الَّذِيْٓ اُنْزِلَ فِيْهِ الْقُرْاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الْهُدٰى وَالْفُرْقَانِ
రమజాను నెల – మానవులందరికీ మార్గదర్శకమైన ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల అది. అందులో సన్మార్గంతోపాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలున్నాయి. (2:185)

రమదాన్ నెల, ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం, అందులో సన్మార్గంతో పాటు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. అంటే, రమజాన్ ఖురాన్ అవతరింపజేయబడిన నెల, అంటే రమజాన్ మాసంలో ఖురాన్ అవతరింపజేయబడినది.

ఇంతకుముందు ఒక మాట విన్నాం, 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ వచ్చింది, మరి ఇది రమజాన్ నెలలో ఖురాన్ అవతరించింది అంటే, దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రమజాన్ మాసంలో తొలి ఆకాశంలో బైతుల్ ఇజ్జత్ అనే ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ఖురాన్ రమజాన్ మాసంలోనే పెట్టాడు. అక్కడ నుండి ఈ భూమండలంలోకి అవసరానుసారం, సందర్భం ప్రకారం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు పంపిస్తూ ఉన్నాడు. రెండో అర్థం, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జబల్ నూర్, హిరా గుహలో ఉన్నప్పుడు మొదటి దైవవాణి, ఖురాన్ అవతరణ ప్రారంభం అయ్యింది రమజాన్ మాసంలో.

ఈ విధంగా ఖురాన్ ప్రారంభం అయ్యింది అది రమజాన్ మాసంలోనే. కావున ఈ రమజాన్ మాసం, ఖురాన్ మాసం. అభిమాన సోదరులారా, ఇన్ షా అల్లాహ్, ఖురాన్ గురించి మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

‎وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి మాట ఇదే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.

‎وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.