[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
మంచికైనా చెడుకైనా మనిషి నాలుక, హృదయాలే మూలమని చెప్పిన మహానుభావుడు లుక్మాన్
లుక్మాన్ (అలైహిస్సలాం) ఆఫ్రికా ఖండంలో జన్మించారు. ఆయన అడవుల్లో పెరిగి పెద్దయ్యారు. అడవుల్లో కాలికి చెప్పులు కూడా లేకుండా తిరిగేవారు. కేవలం ఒక వస్త్రాన్ని చుట్టుకుని అడవుల్లో వన్య మృగాలతో పాటు ఉండేవారు. అడవిలో జీవితం, రోజూ అడవి మృగాలతో తల పడడం – ఈ విధంగా ఆయన కఠిన మైన జీవితాన్ని గడిపేవారు. భయం అంటే ఎరుగని వ్యక్తిత్వాన్ని సంతరిం చుకున్నారు. తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి దీర్ఘంగా ఆలోచించేవారు. ఈ ఆలోచనల వల్ల అనేక కొత్త విషయా లను ఆయన తెలుసుకున్నారు.
బానిసత్వం
ఆఫ్రికాపై దండెత్తిన బానిస వ్యాపారులు ఆయన్ను నిర్బంధించారు. ఆయన్ను ఒక బానిసగా అమ్మివేశారు. తన స్వేచ్ఛా స్వాతంత్రయాలు కోల్పోయా రాయన. స్వేచ్ఛగా తిరగడానికి లేదు, మాట్లాడడానికి లేదు. జీవితంలో ఎదు రైన ఈ కష్టాన్ని ఆయన భరించారు, సహనం వహించారు. అల్లాహ్ అనుగ్రహం కోసం ఎదురుచూడసాగారు.
ఆయన్ను కొనుక్కున్న వ్యక్తి మంచి మనిషి. తెలివి, వివేకం కలిగినవాడు. అతను లుక్మాన్ను దయగా చూసేవాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) సాధారణమైన వ్యక్తి కాదని అతను గుర్తించాడు.
లుక్మాన్ వివేకానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒక రోజు లుక్మాన్ను పిలిచి గొర్రెను కోసి అందులో అత్యంత చెడ్డ భాగాలు తన వద్దకు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) ఒక గొర్రెను కోసి దాని గుండె, నాలుకలను తీసుకుని యజమాని వద్దకు వెళ్ళారు. లుక్మాన్ తీసుకొచ్చిన వాటిని చూసి యజమాని మెచ్చుకోలుగా చిరు నవ్వు నవ్వాడు. శరీరంలో అత్యంత చెడ్డ భాగాలుగా గుండె, నాలుకలను తీసుకు వచ్చిన ఎన్నిక ఆయనకు నచ్చింది. లుక్మాన్ (అలైహిస్సలాం) చాలా లోతయిన విషయాన్ని ఈ విధంగా చెప్పారని అతను అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి యజమాని లుక్మాన్ (అలైహిస్సలాం) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రారంభించాడు. ఆయన్ను మరింత ఆదరంగా చూడసాగాడు.
కొన్ని రోజుల తర్వాత యజమాని లుక్మాన్ను మళ్ళీ పిలిచి ఈసారి గొర్రెను కోసి దానిలో అత్యంత ఉత్తమమైన అవయవాలు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ యజమాని చెప్పినట్టు చేశారు. కాని విచిత్రంగా ఈసారి కూడా గొర్రె గుండె, నాలుకలే తీసుకువచ్చారు. యజమాని వాటిని చూసి శరీరంలో అత్యంత చెడ్డ భాగాలు, మంచి భాగాలు రెండు కూడా ఇవే ఎలా అవుతాయని ప్రశ్నించాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) యజమానికి సమాధానమిస్తూ, “మనిషి మంచివాడైతే అతని గుండె, నాలుకలు చాలా ఉత్తమమైన భాగాలు, మనిషి చెడ్డవాడైతే అతని గుండె, నాలుకలు అత్యంత చెడ్డ భాగాలు” అన్నారు. ఈ సంఘటన తర్వాతి నుంచి యజమాని లుక్మాన్ పట్ల అత్యంత గౌరవాదరాలు చూపడం ప్రారంభించాడు. చాలామంది లుక్మాన్ వద్దకు సలహా కోసం కూడా వచ్చేవారు. ఆయన వివేక విచక్షణలు, తెలివితేటలు యావత్తు రాజ్యంలో మారు మోగిపోసాగాయి.
స్వేచ్ఛ
యజమాని తన కుటుంబ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తన మరణానంతరం లుక్మాన్ (అలైహిస్సలాం)కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పాడు. యజమాని మరణించిన తర్వాత లుక్మాన్ (అలైహిస్సలాం)కు స్వాతంత్ర్యం లభించింది. ఆయన (అలైహిస్సలాం) అక్కడి నుంచి బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి చివరకు బనీ ఇస్రాయీల్ వద్ద స్థిరపడ్డారు. దావూద్ (అలైహిస్సలాం) పాలనా కాలంలో ఆయన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. మహావివేకంతో, విచక్షణతో, నిష్పక్షపాతంగా ఆయన ఇచ్చే తీర్పులు చాలా ప్రసిద్ధి పొందాయి. అక్కడే ఆయన పెళ్ళి చేసుకుని సంసార జీవితాన్ని గడిపారు.
లుక్మాన్ తన కుమారుడికి చేసిన బోధ దివ్యఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది:
31:13 وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం.”
31:14 وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ
మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.
31:15 وَإِن جَاهَدَاكَ عَلَىٰ أَن تُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِي الدُّنْيَا مَعْرُوفًا ۖ وَاتَّبِعْ سَبِيلَ مَنْ أَنَابَ إِلَيَّ ۚ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో. అయితే (మార్గానుసరణ విషయంలో మాత్రం) నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తరువాత మీరంతా నా వైపుకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ తెలియపరుస్తాను.”
31:16 يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ
(లుఖ్మాన్ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు.
31:17 يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ
“ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.
31:18 وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ
“జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ డాబులు చెప్పుకునే గర్విష్టిని ఇష్టపడడు.
31:19 وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ
“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.”
(దివ్యఖుర్ఆన్ 31 : 13-19)
గ్రహించవలసిన పాఠాలు
మనిషి మంచివాడు లేదా చెడ్డవాడన్నది అతని హృదయం, నాలుకల వల్ల తెలుస్తుంది. ఈ రెండు అవయవాలను ఎలా వాడాలన్నది మనిషి చేతుల్లో ఉంది.
మంచి యజమాని తన వద్ద ఉన్న వివేకవంతులైన నౌకర్లను గౌరవించాలి.
లుక్మాన్ తన కుమారునికి ఇచ్చిన సలహాను అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ప్రస్తావించి మానవాళికి ఒక ఉదాహరణగా చూపించాడు. ఈ సలహాను యావత్తు మానవాళి మార్గదర్శక సూత్రంగా అనుసరించవలసి ఉంది.
—
ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/