https://youtu.be/bqXH8XAhqW8
[ 15 నిముషాలు]
అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
విశ్వాస మూల సూత్రాలు పుస్తకం నుండి .
వీడియో లో ఈ విషయాలు చెప్ప బడ్డాయి:
- అల్లాహ్ ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన రకాలు
- అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావన
- అల్లాహ్ ఆరాధన యొక్క ప్రత్యేక భావన
- హృదయానికి సంబంధించిన ఆరాధనలు – ప్రేమించడం,భయపడడం ..
- శరీరానికి సంబంధించిన ఆరాధనలు – నమాజు , హజ్ ,ఉపవాసం
- ధనానికి సంబంధించిన ఆరాధనలు – జకాత్ , సదఖా
- ఆరాధన అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి, లేనియెడల అది షిర్క్ అవుతుంది
- దుఆ ఇబాదత్ (ఆరాధన)లో ఒక రకం , కేవలం అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి
- తవక్కుల్ (నమ్మకం, భరోసా) అల్లాహ్ మీద మాత్రమే ఉంచాలి
- కష్ట సమయంలో కీడు నుంచి రక్షణ కోరడం, సహాయం అర్ధించడం
- మొక్కుబడులు
ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఆరు మూల స్తంభాల గురించి, ముఖ్యంగా మొదటి స్తంభమైన అల్లాహ్ పై విశ్వాసం గురించి వివరించబడింది. ఆరాధన అనేది కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించబడాలని, అందులో ఎవరినీ భాగస్వాములుగా చేయరాదని స్పష్టం చేయబడింది. దుఆ (ప్రార్థన), తవక్కుల్ (భరోసా), సహాయం మరియు శరణు వేడటం, మొక్కుబడులు వంటి ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ తోనే చేయాలని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక విషయాలలో జీవించి ఉన్న వారి నుండి, వారి శక్తి పరిధిలోని సహాయం కోరడానికి మరియు చనిపోయిన వారి నుండి సహాయం కోరడానికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా వివరించబడింది. చివరగా, అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.
సోదర మహాశయులారా! విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్యమైన శీర్షికలో మనం ఇప్పటివరకు అల్లాహ్ యొక్క దయవల్ల ఆరు పాఠాలు విని ఉన్నాము, తెలుసుకున్నాము. ఈనాటి ఏడవ పాఠం అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాలు. విశ్వాస మూల సూత్రాలు ఎన్ని ఉన్నాయి? ఆరు ఉన్నాయి. ఆరిట్లో మొట్టమొదటిది, ఎక్కువ ప్రాముఖ్యత గలది అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ పై విశ్వాసంలో ఎన్నో విషయాలు వస్తాయి. వాటిలోనే ఒక ముఖ్యమైనది ఏమిటి? అల్లాహ్ ను ఆరాధించడం. అల్లాహ్ ఆరాధనలో ఎవరినీ కూడా భాగస్వామిగా చేయకపోవడం.
అయితే ఈ ఒక్క మాటనే సరిపోతుంది. మనల్ని అల్లాహ్ ఆరాధించడానికే పుట్టించాడు గనక ఆయన ఆరాధనలో మనం మరెవరినీ కూడా భాగస్వామిగా చేయకూడదు. అయినా ఆరాధన అని మనం అన్నప్పుడు ఏ ఏ విషయాలు అందులో వస్తాయి? వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
అల్లాహ్ ఆరాధన – ఒక పరిచయం
అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు, ఇందులో ముందు రెండు విషయాలని మీరు అర్థం చేసుకోండి. ఒకటి, అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు ఒక సామాన్య భావన, మరొకటి ప్రత్యేక భావన. అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావం, మరొకటి ప్రత్యేక భావం. ప్రత్యేక భావం అంటే ఏంటి? కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఎలాంటి భాగస్వామ్యం లేకుండా చేసేటువంటి పనులు. అవి మన హృదయానికి సంబంధించినవి ఉన్నాయి, మన ధనానికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా మన సామాన్య అవయవాలు, నాలుక, చేతులు, కాళ్ళు, శారీరక ఆరాధనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనవి.
ఉదాహరణకు, హృదయానికి సంబంధించినవి ముహబ్బత్, ఇఖ్లాస్, ఖౌఫ్, రజా. సంక్షిప్తంగా ఈ పేర్లు గత ఆరవ పాఠంలో కూడా వచ్చాయి. అంటే అల్లాహ్ ను ఎలా ప్రేమించాలో అలాగ మరెవ్వరినీ కూడా ప్రేమించరాదు. ఏ పనులు మనం అల్లాహ్ కొరకు చేస్తామో అందులో ఇఖ్లాస్, స్వచ్ఛత అనేది ఉండాలి. అంటే ఏ ప్రదర్శనా బుద్ధి, ఏదైనా ప్రపంచ లాభం పొందే ఉద్దేశం అట్లాంటిది ఏదీ కూడా ఉండకూడదు.
అల్లాహ్ తో ఏ రీతిలో మనం భయపడాలో ఆ రీతిలో ఇంకా ఎవరితోనీ కూడా భయపడకూడదు. అల్లాహ్ పట్ల మనం ఎలాంటి ఆశతో ఉండాలో అలాంటి ఆశ ఇంకా ఎవరితోనీ కూడా మనకు ఉండకూడదు. అర్థమైంది కదా?
మన శరీరానికి సంబంధించిన కొన్ని ఆరాధనలు, నమాజ్. నమాజ్ ఇది శరీరానికి సంబంధించిన ఇబాదత్. ధనానికి సంబంధించిన ఇబాదత్ లో దానధర్మాలు, ప్రత్యేకంగా బలిదానం, జిబహ్ చేయడం. ఈ విధంగా నాలుకకు సంబంధమైన ఖురాన్ యొక్క తిలావత్, జిక్ర్. విషయం కొంచెం అర్థమైంది కదా?
అయితే మరి కొన్ని ఆరాధనలు ఉన్నాయి. వాటిలో ఎంతోమంది అల్లాహ్ తో పాటు ఇతరులకు ఆ ఆరాధనలు చేస్తారు. మరియు ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎంతో నొక్కి చెప్పాడు అల్లాహ్ తప్ప వేరే ఎవరికీ అవి చేయకూడదు అని. అయితే వాటి ప్రాముఖ్యత పరంగా, వాటి గురించి ప్రత్యేకమైన ఆధారాలు, దలీల్ ఖురాన్ హదీస్ లో వచ్చి ఉంది గనుక వాటిల్లో కొన్ని మీ ముందు నేను ఉంచి వాటి యొక్క దలీల్ కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను.
దుఆ (ప్రార్థన)
ఉదాహరణకు, ఆరాధనలో ఒక రకం దుఆ. దుఆ కేవలం ఎవరితోని చేయాలి? అల్లాహ్ తో మాత్రమే చేయాలి. ఎందుకు? దీనికి సంబంధించిన ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. కానీ సూరె ఘాఫిర్, సూరా నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో,
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
మీ ప్రభువు చెప్పాడు మీతో కేవలం నాతో మాత్రమే దుఆ చేయండి, మీ దుఆలను అంగీకరించే వాడిని నేను మాత్రమే.
ఇక్కడ గమనించండి, ఈ ఆయత్ యొక్క ఆరంభం ఎలా ఉంది?
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي
మీరు నాతో దుఆ చేయండి. ఆ తర్వాత ఏమంటున్నాడు?
إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي
ఎవరైతే నా ఆరాధన పట్ల విముఖత చూపుతారో, గర్వానికి గురి అవుతారో.
అంటే ఏం తెలిసింది ఇక్కడ? దుఆ, ఇబాదత్. అసలైన ఇబాదత్. అందుగురించి తిర్మిజీ లోని ఒక సహీ హదీస్ లో ఉంది,
الدُّعَاءُ هُوَ العِبَادَةُ
(అద్దుఆవు హువల్ ఇబాదా)
దుఆ యే అసలైన ఇబాదత్
అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే నాతో దుఆ చేయరో, నాతో దుఆ చేయడంలో గర్వానికి గురి అవుతారో, నాతో దుఆ చేయడంలో విముఖత చూపుతారో,
سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ
ఎంతో అవమానంతో, పరాభవంతో వారు నరకంలో ప్రవేశిస్తారు.
అల్లాహు అక్బర్. ఏం తెలిసింది ఇప్పుడు మనకు? దుఆ ఆరాధనలో ఒక రకం, అది కేవలం ఎవరితో చేయాలి? అల్లాహ్ తో మాత్రమే. అల్లాహ్ తోనే మనం దుఆ చేయాలి. ఫలానా బాబా సాహెబ్, ఫలానా పీర్ సాహెబ్, ఫలానా వలీ సాహెబ్, ఫలానా సమాధిలో ఉన్న చాలా పెద్ద బుజుర్గ్, ఆయన మన దుఆలను వింటాడు, మన అవసరాలను తీరుస్తాడు అని వారితో దుఆ చేయడంలో ఎన్నో రకాల పాపాలు ఉంటాయి.. అందుగురించి దుఆ కేవలం ఎవరికి ప్రత్యేకించాలి? అల్లాహ్ కు మాత్రమే.
తవక్కుల్ (భరోసా)
అలాగే తవక్కుల్, భరోసా, నమ్మకం. అల్లాహ్ త’ఆలా సూరె మాయిదా, సూరా నెంబర్ 5, ఆయత్ నెంబర్ 23 లో తెలిపాడు,
وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ
(వ అలల్లాహి ఫతవక్కలూ ఇన్ కున్తుమ్ ము’మినీన్)
మీరు నిజమైన విశ్వాసులు అయితే కేవలం అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి ఉండండి. అల్లాహ్ తో మాత్రమే మీరు భరోసా, తవక్కుల్ తో ఉండండి.
ఇంకా సోదర మహాశయులారా! ఇలాంటి ఆయతులు చూసుకుంటే ఖురాన్ లో ఈ భావంలో ఎన్నో ఆయతులు ఉన్నాయి.
సహాయం మరియు శరణు వేడటం
అలాగే ఏదైనా ఆపద, కష్ట సమయాల్లో సహాయానికి అర్ధించడం మరియు ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం, ఇవి కూడా కేవలం ఎవరితో ఉండాలి? అల్లాహ్ తో పాటు, అల్లాహ్ తో మాత్రమే.
కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని లేదా చిన్న తేడా మరియు వ్యత్యాసాన్ని గమనించండి. అదేమిటంటే ఏదైనా అవసరానికి సహాయం కోరడం గానీ లేదా ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం గానీ కేవలం ఎవరితో చేయాలి అన్నాము? అల్లాహ్ తో. కానీ కొన్ని సందర్భాల్లో మనం బ్రతికి ఉన్న కొందరు మనుషులతో సహాయము కోరుతాము మరియు శరణు వేడుకుంటాము. ఇది ఎప్పుడు జాయెజ్, ఎప్పుడు యోగ్యమవుతుంది? ఎవరితోనైతే మనం సహాయం కోరుతున్నామో, ఎవరితోనైతే శరణు వేడుకుంటున్నామో అతను బ్రతికి ఉండాలి, దగ్గరగా ఉండాలి మరియు అది ఆ శక్తి అతనిలో ఉండాలి వాస్తవానికి.
ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని హత్య చేస్తాడు అని మీకు మెసేజ్ పంపాడు, బెదిరింపులు పంపాడు, ఫోన్ పై చెప్పాడు లేదా ఏదో రకంగా. లేదా నవూజుబిల్లాహ్, అల్లాహ్ త’ఆలా మనందరినీ కూడా కాపాడు గాక, మన ఏదైనా వస్తువు తీసుకొని లేదా కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని డిమాండ్ చేస్తారు, అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? పోలీసులకి వెళ్లి అక్కడ వారి యొక్క సహాయం, వారి యొక్క శరణు కోరుతామా లేదా? ఇది షిర్క్ అయిపోతుందా? కాదు. ఎందుకు? ఇలాంటి రక్షణ కొరకే వారు ఉన్నారు.
కానీ ఇక్కడ ఒక విషయం, అదేమిటి? అల్లాహ్ తో కోరడం అనేది మనం మరిచిపోకూడదు. అల్లాహ్ ఒక సబబుగా చేశారు వారిని, వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అందుకొరకే మనం వారితో కోరుతున్నాము. కానీ అసలు కోరడం అల్లాహ్ తో అది మరవకూడదు. ఓ అల్లాహ్, ఈ శక్తి సామర్థ్యం అంతా సర్వమూ నీ చేతిలోనే ఉంది. నువ్వు నన్ను కాపాడు, నీవు నాకు సహాయపడు మరియు నీవు మాత్రమే నాకు శరణు ప్రసాదించు అని అల్లాహ్ తో వేడుకోవాలి. వేడుకొని బ్రతికి ఉన్న వారిలో దాని యొక్క శక్తి ఉండేది ఉంటే వారితోని మనం సహాయం కోరవచ్చు.
ఇప్పుడు ఎవరైనా ఎంత పెద్ద వలీయుల్లాహ్ గానీ, అల్లాహ్ యొక్క వలీ, ఎంత గొప్ప అల్లాహ్ యొక్క వలీ గానీ చనిపోయి ఉన్నారు. అయితే అలాంటి వారితో మనం నాకు సంతానం ఇవ్వండి, మాకు సహాయం చేయండి, మా కొడుకును పాస్ చేయండి, ఫలానా శత్రువు మాపై దండెత్తడానికి, మాకు నష్టం, కీడు చేయడానికి సిద్ధం పూనుకున్నాడు, మీరు ఏదైనా మాకు శరణు ఇవ్వండి. వారు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప వలీ కావచ్చు. కానీ అలా వారితో మనం ఈ శరణు కోరడం, సహాయం కోరడం అల్లాహ్ మనకు ఖురాన్ లో దాని యొక్క అనుమతి ఇవ్వలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ పద్ధతి మనకు నేర్పలేదు. విషయం అర్థమవుతుంది కదా?
అయితే అల్లాహ్ ను విశ్వసించడంలో ఈ విషయాలు కూడా వస్తాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రకారంగా మన యొక్క జీవితం మనం గడపాలి.
మొక్కుబడులు
మొక్కుబడులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంతో మందిని మనం చూస్తున్నాము, సమాధుల వద్దకు వెళ్లి అక్కడ మొక్కుకుంటారు. నా ఈ పని జరిగేది ఉంటే నేను ఇక్కడ వచ్చి చాదర్ వేస్తాను, పూలు వేస్తాను, ఒక మేక కోస్తాను, లేదా ఒక కోడిపుంజును జిబహ్ చేస్తాను ఈ విధంగా. ఇవన్నీ షిర్క్ లోకి వచ్చేస్తాయి. ఎందుకు? మొక్కుబడులు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.
ముగింపు
విషయం అర్థమైంది కదా? ఇంకా ఎన్నో ఇలాంటి ఆధారాలు, దలీల్ ఖురాన్, హదీస్ లో ఉన్నాయి. కానీ సమయం సరిపోదు గనుక నేను ఈ కొన్ని విషయాల ద్వారానే ఈ టాపిక్ ను ఇక్కడి వరకు ముగింపు చేస్తున్నాను. కానీ విషయం అర్థమైంది కదా మీకు? అల్లాహ్ ను విశ్వసించడం అనేది అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాల్లో మొట్టమొదటిది, ముఖ్యమైనది. అల్లాహ్ పై విశ్వాసంలో ఆయన అస్తిత్వం, అంటే ఆయన ఒకే ఒక్కడు తన అస్తిత్వంలో కూడా మరియు ఆయనకు మంచి ఉత్తమ పేర్లు, గుణాలు ఉన్నాయి అని కూడా (అస్మా వ సిఫాత్) మరియు ఆయన మాత్రమే సర్వాన్ని సృష్టించువాడు, పోషించువాడు, నడిపించువాడు (రుబూబియత్) మరియు సర్వ ఆరాధనలకు అర్హుడు కూడా కేవలం ఆయన మాత్రమే.
అల్లాహ్ విషయంలో మనం ఈ విషయాలు, అల్లాహ్ పై విశ్వాసంలో మనం ఈ విషయాల్ని అర్థం చేసుకోవడం, ఈ ప్రకారంగా మన జీవితాన్ని గడపడం ఇది చాలా అవసరం.
అల్లాహ్ త’ఆలా మనందరికీ అల్లాహ్ పై విశ్వాసం సంపూర్ణ విధంగా పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ పై విశ్వాసంలో ఏ రవ్వంత కొరత వచ్చేటువంటి చెడుల నుండి, పాపాల నుండి, లోపాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడు గాక.
ఇన్ షా అల్లాహ్, దీని తర్వాత అల్లాహ్ యొక్క దయవల్ల, అల్లాహ్ పై విశ్వాసం, దీని యొక్క లాభాలు ఏమిటి? ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సమరాతుల్ ఈమాని బిల్లాహ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతోమంది, అరే అల్లాహ్ నే నమ్మండి, అల్లాహ్ నే విశ్వసించండి అని మాటిమాటికి అంటా ఉంటారు. ఏంటి లాభం మాకు దీనితోని? కొందరితో అజ్ఞాన కారణంగా అడగవచ్చు, అడగకపోయినా గానీ మనసులో వారికి అల్లాహ్ ను మనం తప్పకుండా విశ్వసించి జీవించాలి అన్నటువంటి ఒక తపన, కోరిక ఎంతో మందిలో లేకుండా మనం చూస్తూ ఉన్నాము. అలాంటప్పుడు మనం అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా ఏం లాభాలు మనకు కలుగుతాయి, అవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవి తెలుసుకొని వాటిని పాటించేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. వ ఆఖిరు ద’వాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)
ఇతరములు: [విశ్వాసము]




You must be logged in to post a comment.