త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (5) – మరణానంతర జీవితం : పార్ట్ 46 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు [5] – [మరణానంతర జీవితం – పార్ట్ 46]
https://www.youtube.com/watch?v=wYTBaAwO2oE [24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. వీటిలో ముఖ్యంగా జ్యోతిష్కులను సంప్రదించడం, వారు చెప్పినది నమ్మడం, మరియు అలా చేయడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు (40 రోజుల నమాజ్ స్వీకరించబడకపోవడం, ఇస్లాంను తిరస్కరించినట్లు అవ్వడం) వంటివి హదీసుల ఆధారంగా చర్చించబడ్డాయి. అలాగే, మత్తుపానీయం సేవించడం యొక్క పాపం, దాని పర్యవసానాలు, మరియు పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఇతరుల హక్కులను కాలరాయడం, వారి ఆస్తులను అన్యాయంగా తీసుకోవడం, మరియు ప్రళయ దినాన “దివాలా తీసిన వ్యక్తి”గా నిలబడటం గురించి హెచ్చరించబడింది. చివరగా, దుష్ప్రవర్తన సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో, మరియు ఒక ముస్లిం పరువుకు భంగం కలిగించడం ఎంత పెద్ద పాపమో స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బా’ద అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మనం త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము.

అందులో ఎనిమిదవ విషయం, జ్యోతిషునితో ఏదైనా ప్రశ్న అడగడం.

మహాశయులారా! ఈ రోజుల్లో మన సమాజంలో స్వయంగా వారి భవిష్యత్తు ఏమిటో వారికి తెలియకుండానే ప్రజల భవిష్యత్తు చెప్పడానికి ఫుట్‌పాత్‌ల మీద, వేరే కొన్ని ప్రదేశాలలో, మరి కొందరు హై-ఫై ఇంకా సౌకర్యాలతో కూడి ఉన్న స్థలాల్లో ఉన్నవారు ఫలానా రోజు అలా జరుగుతుంది, ఫలానా రోజు అలా జరుగుతుంది, నీ వివాహం తర్వాత ఇలా నీకు లాభం ఉంటుంది, నీ వివాహం తర్వాత నీకు ఇలా నష్టం ఉంటుంది, ఈ వ్యాపారం నీవు ప్రారంభిస్తే నీకు ఇందులో లాభం ఉంటుంది, నీకు ఇందులో నష్టం ఉంటుంది, ఈ విధంగా కొన్ని భవిష్య సూచనలు, కొన్ని విషయాలు చెప్పడం మనం అడపాదడపా వింటూనే ఉన్నాము.

వాటిలో అనేక విషయాలు అబద్ధం, అసత్యం అన్న విషయం మనలోని చాలా మందికి తెలుసు. కానీ అనేకమంది కొన్ని మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలకు గురియై ఉంటారు. వారిపై ఏదైనా ఆపద, ఏదైనా పరీక్ష వచ్చిపడినప్పుడు, ఇలాంటి వారిని నమ్ముకొని, వారి వద్దకు వెళ్ళి తమ భవిష్యత్తు గురించి వారితో తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇలా భవిష్యత్తు గురించి వారిని ఏదైనా ప్రశ్నించడం, ఇది మహా పాప కార్యం. ఎంతటి పాప కార్యం అంటే దీనివల్ల మన ఇతర సత్కార్యాలు, ఇతర మంచి విషయాలు అన్నీ నశించిపోతాయి.

వినండి ఈ హదీథ్.

مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةُ أَرْبَعِينَ لَيْلَةً
(మన్ అతా అర్రాఫన్ ఫస’అలహు అన్ షై’ఇన్ లమ్ తుఖ్బల్ లహు సలాతు అర్బ’ఈన లైలా)

“ఎవరైనా జ్యోతిష్కుని వద్దకు వచ్చి వారిని ఏదైనా విషయం అడిగారంటే వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు.”

నలభై రోజుల నమాజ్. వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు అంటే ఎంత నష్టంలో ఆ మనిషి పడి ఉంటాడో గమనించవచ్చు.

అలాగే, తొమ్మిదవ విషయం, ఇలాంటి జ్యోతిషుల వద్దకు వచ్చి వారు చెప్పిన విషయాన్ని సత్యంగా నమ్మడం మరీ భయంకరమైన విషయం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَنْ أَتَى كَاهِنًا أَوْ عَرَّافًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ
(మన్ అతా కాహినన్ అవ్ అర్రాఫన్ ఫసద్దఖహు బిమా యఖూల్ ఫఖద్ కఫర బిమా ఉన్జిల అలా ముహమ్మద్)

“ఎవరైతే ఇలాంటి జ్యోతిషుల వద్దకు, భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు తెలుపుతాము అని అంటారో, వారి వద్దకు వచ్చి వారు ఏదైనా ఒక మాటను వారు సత్యంగా నమ్మితే, అలాంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యే ధర్మాన్ని అవతరింపజేశాడో దానిని తిరస్కరించినట్లు, దాని పట్ల అవిశ్వాసానికి పాల్పడినట్లు.”

అందుకు మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కేవలం ప్రశ్నించడం ద్వారా నలభై రోజుల నమాజు స్వీకరించబడదు. ఇక వారు చెప్పిన సమాధానాన్ని సత్యంగా భావిస్తే అవిశ్వాసానికి పాల్పడినట్లు అవుతుంది. ఇక అవిశ్వాసం వల్ల మన సత్కార్యాలు ఏ ఒక్కటి కూడా మిగలకుండా ఉండిపోతుంది కదా? చివరికి మన త్రాసు తేలికగా ఉండిపోతుంది.

ఇంకా మహాశయులారా, అలాంటి పాప కార్యాల్లో పదవ విషయం, మత్తు సేవించడం. ఈ రోజుల్లో ఎంతమంది మత్తు సేవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు. అల్లాహ్ తో భయపడండి. ఆ సృష్టికర్తతో భయపడండి. ప్రళయ దినాన మనకు ఆయన ఇహలోకంలో ఏ ఆరోగ్యం ఇచ్చాడో, ఏ డబ్బు ధనం ఇచ్చాడో వీటన్నిటి గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పుకుందాం?

మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఒకటి, పదవది, మత్తు సేవించడం. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

“ఎవరైతే మత్తు సేవిస్తారో వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. అతను తౌబా చేస్తే అల్లాహ్ తౌబా అంగీకరిస్తాడు.”

తౌబా అంటే తెలుసు కదా, అల్లాహ్ తో క్షమాపణ కోరడం, ఇక ఎన్నడూ అలాంటి పాపానికి ఒడిగట్టను అని శపధం చేసుకోవడం మరియు తిరిగి ఆ పాపాన్ని చేయకపోవడం. ఎవరైతే ఇలా మత్తు సేవిస్తారో వారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఎవరైతే తౌబా చేస్తారో అల్లాహ్ అతని తౌబాను స్వీకరిస్తాడు.

మళ్ళీ ఎవరు రెండవసారి మత్తు సేవిస్తాడో, ఇక ఆ తర్వాత తౌబా చేసుకుంటాడో, అల్లాహ్ అతని తౌబా స్వీకరిస్తాడు. మళ్ళీ ఎవరైతే మూడోసారి మత్తు సేవిస్తాడో మరియు మళ్ళీ తౌబా చేస్తాడో, అల్లాహ్ అతని తౌబా మూడవసారి కూడా స్వీకరిస్తాడు. కానీ అతను మళ్ళీ నాలుగోసారి అదే అలవాటుకు పాల్పడ్డాడు, ఆ తర్వాత మళ్ళీ అతను తౌబా చేస్తే, ఇక నాలుగోసారి అల్లాహ్ అతని తౌబాను స్వీకరించడు.

మొదటిసారి అతను మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. రెండవసారి మత్తు సేవిస్తే, రెండవసారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. మళ్ళీ మూడవసారి మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. మూడవసారి తౌబా చేస్తే అల్లాహ్ తౌబా స్వీకరిస్తాడు. కానీ మళ్ళీ నాలుగోసారి, మళ్ళీ నాలుగోసారి అదే మత్తు సేవించడానికి అలవాటు పడితే, ఇక ఆ తర్వాత తౌబా చేస్తే అల్లాహ్ అతని తౌబా స్వీకరించడు.

నాలుగోసారి మత్తు సేవించడానికి పాల్పడ్డాడు అంటే మళ్ళీ నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఆ తర్వాత తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అంటే మూడుసార్లు అల్లాహ్ మనకు, అలాంటి పాపం చేసిన వారికి అవకాశం ఇచ్చాడు. నాలుగోసారి ఆ పాపానికి ఒడిగడితే అల్లాహ్ ఇక అతని తౌబా కూడా స్వీకరించడు.

ఏం జరుగుద్ది? అతను అదే స్థితిలో చనిపోయాడు అంటే అల్లాహ్ ప్రళయ దినాన అతనికి ఏమిస్తాడు? మహాశయులారా, భయపడండి అల్లాహ్ తో. నాలుగోసారి మళ్ళీ అతడు అలవాటు పడ్డాడు అంటే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు, తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అల్లాహ్ అతనికి నహరుల్ ఖబాల్, అల్-ఖబాల్ అన్న నది నుండి వచ్చే ద్రవం త్రాగిపిస్తాడు. ఆ ఖబాల్ నది నుండి వచ్చే ద్రవం ఏంటిది, ఎలా ఉంటుంది, ఏమిటి అని అడిగినప్పుడు, అది నరకవాసుల పుండ్ల నుండి కారుతూ వచ్చిన చీము అని చెప్పడం జరిగింది.

ఎప్పుడైనా గమనించారా? మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా పుండు ఉంది అంటే స్వయంగా మనం మన శరీరంలోని పుండు నుండి వచ్చే చీమును చూడడం, దాని యొక్క దుర్వాసనను మనం భరించలేం. ఇక నరకవాసుల వారి యొక్క పుండ్ల నుండి కారుతున్న చీము వారికి త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇకనైనా మత్తు సేవించడాన్ని మానుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. ఇలా మానుకునే సద్భాగ్యం అల్లాహ్ ఈ త్రాగే వారందరికీ, మత్తు సేవించే వారందరికీ అల్లాహ్ తౌబా చేసుకునే సద్భాగ్యం ప్రసాదించాలి అని అల్లాహ్ తో వేడుకుంటున్నాను.

మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాపాల్లో 11వ విషయం, ప్రజల సొమ్మును కాజేసుకోవడం, ప్రజల సొమ్ము తినివేయడం. ఇది కూడా మహా పాపం.

మహాశయులారా, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 11వ విషయం, ఇతరుల సొమ్మును కాజేయడం, వారిపై దౌర్జన్యం చేయడం. దీనికి సంబంధించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ ఏమిటంటే, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు:

أَتَدْرُونَ مَنِ الْمُفْلِسُ
(అతద్రూన మనిల్ ముఫ్లిస్)
“ముఫ్లిస్ (దివాలా తీసినవాడు) అంటే ఎవరో మీకు తెలుసా?”

అప్పుడు సహచరులు అన్నారు:

الْمُفْلِسُ فِينَا مَنْ لاَ دِرْهَمَ لَهُ وَلاَ مَتَاعَ
(అల్-ముఫ్లిసు ఫీనా మన్ లా దిర్హమ లహు వలా మతా’అ)
“ప్రవక్తా, మాలోని బీదవాడు ఎవరంటే ఎవరి వద్దనైతే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ప్రపంచ సామాగ్రి ఏమీ లేదో అలాంటి వారు”

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

నా అనుచర సంఘంలోని బీదవారు ఎవరంటే, ప్రళయ దినాన నమాజ్, జకాత్, ఉపవాసాలు, నమాజ్, జకాత్ (విధిదానాలు), రోజా (ఉపవాసాలు), వీటన్నిటినీ తీసుకుని వస్తాడు.

وَيَأْتِي قَدْ شَتَمَ هَذَا وَقَذَفَ هَذَا وَأَكَلَ مَالَ هَذَا وَسَفَكَ دَمَ هَذَا وَضَرَبَ هَذَا
(వ య’తీ ఖద్ షతమ హాదా, వ ఖదఫ హాదా, వ అకల మాల హాదా, వ సఫక దమ హాదా, వ దరబ హాదా)

ఇంకా ప్రళయ దినాన ఆ వ్యక్తి ఎలా వస్తాడు అంటే, ఎవరినైనా దూషించి, ఎవరిపైనైనా అపనింద వేసి, ఎవరి సొమ్ము అపహరించి, ఎవరినైనా హత్య చేసి, ఎవరినైనా కొట్టి…

ఈ విధంగా ప్రజలలో ఎందరి పట్ల ఎన్నో రకాల అన్యాయాలకు గురియై ప్రళయ దినాన హాజరవుతాడు. అతని వెంట నమాజ్, విధిదానాలు, ఉపవాసాలు ఉన్నాయి, కానీ ఇలాంటి పాపాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుద్ది? వారందరూ, ఇతని నుండి ఎవరెవరికి ఏయే అన్యాయం జరిగిందో, వారందరూ హాజరవుతారు మరియు అల్లాహ్ వద్ద ఇతని గురించి షికాయత్ చేసినప్పుడు, ఇతని గురించి అల్లాహ్ వద్ద అడిగినప్పుడు, అల్లాహు త’ఆలా అతని యొక్క సత్కార్యాలన్నీ కూడా వారి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారికి ఇచ్చేస్తాడు.

ఆ తర్వాత, ఇతని వద్ద సత్కార్యాలన్నీ కూడా మిగలకుండా అయిపోయినప్పుడు, ఇంకా ఎన్నో కేసులు మిగిలి ఉన్నప్పుడు, వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారి పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది మరియు ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. గమనించారా? నమాజులు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల విధిదానాలు, దానధర్మాలు ఉన్నాయి. కానీ కొట్టడం, తిట్టడం, అపనింద వేయడం, ఈ రకంగా ఎన్నో పాపాలకు గురి అయినందుకు వారందరూ కూడా వచ్చి ఇతనికి వ్యతిరేకంగా అల్లాహ్ వద్ద కేసు పెట్టినప్పుడు, ఇతని సత్కార్యాలన్నీ వారికి ఇవ్వడం జరుగుతుంది. సత్కార్యాలన్నీ ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని కేసులు మిగిలి ఉంటే, వారి యొక్క పాపాలు ఇతనిపై వేయబడి, ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. ఎంత నష్టం అవుతుందో కదా? అల్లాహ్ యొక్క ఎంత గొప్ప అనుగ్రహం, ఇలాంటి పరిస్థితులు రానున్నాయి, అందు గురించి ఇహలోకంలోనే జాగ్రత్త పడి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి అని మనకు చెప్పడం జరుగుతుంది.

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇలాంటి అన్యాయాలకు పాల్పడతారో, ఇహలోకంలోనే వారి యొక్క ఆ హక్కు చెల్లించేసేయాలి. మన వద్ద చెల్లించడానికి ఏమీ లేకుంటే, కనీసం వారితో కలిసి, వారితో మాఫీ చేయించుకోవాలి. లేదా అంటే ప్రళయ దినాన ఇలాంటి ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది, ప్రళయ దినాన మన యొక్క త్రాసు అనేది తేలికగా అయిపోతుంది.

తిర్మిజీలోని ఒక హదీథ్ లో ఉంది, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

“అల్లాహ్ ఆ మనిషిని కరుణించు గాక, అతని ద్వారా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే అతను వారితో క్షమాపణ కోరి లేదా వారికి ఏదైనా ఇచ్చే హక్కు ఉండేది ఉంటే ఇచ్చేసి ఇహలోకంలోనే ఎలాంటి బరువు లేకుండా, ఎలాంటి ఒకరిపై అన్యాయం లేకుండా ఉంటాడో, ఈ విధంగా ప్రళయ దినాన అతను కలుసుకున్నప్పుడు అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను పొందుతాడు. కానీ ఎవరైతే ఇలా కాకుండా ప్రజల పట్ల అన్యాయాలకు గురి అయి వస్తాడో, ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఇతని పుణ్యాలు ఆ బాధితులకు ఇచ్చేస్తాడు. ఇతని వద్ద పుణ్యాలు లేనిచో, బాధితుల నుండి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది.”

అందుగురించి మహాశయులారా, అన్ని స్థితుల్లో అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి. ఎక్కడ ఎవరు ఏమీ చూడడం లేదు అని భావించకుండా మనం అన్ని రకాల సత్కార్యాల్లో ముందుకు ఉండాలి. ఎవరిపై కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలి.

ప్రజల పట్ల ఏదైనా అన్యాయం చేయడం, ఇది ఎంత భయంకరమైన పాపమో మన యొక్క సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ చాలా మంచి విధంగా గ్రహించేవారు. అందుకే సుఫ్యాన్ అస్-సౌరీ రహమహుల్లాహ్ ఒక సందర్భంలో చెప్పారు:

“నా మధ్య, అల్లాహ్ మధ్య 70 పాపాలు ఉండడం, నాకు, నా మధ్య మరియు నాలాంటి మనుషుల మధ్య ఒక్క పాపం ఉండడం కంటే ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే నా మధ్య నా ప్రభువు మధ్య ఉండే పాపాల గురించి నేను డైరెక్ట్ గా క్షమాపణ కోరుకుంటే అది మన్నించడం జరుగుతుంది. కానీ నా మధ్య మరియు నాలాంటి దాసుని మధ్య ఉన్న పాపం అది నేను అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే క్షమించబడదు. వెళ్ళి అతనితో క్షమాపణ కోరుకోవాలి, లేదా అతనికి ఏదైనా హక్కు ఇచ్చేది ఉంటే తప్పకుండా ఇవ్వాలి.”

ఇక ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు కూడా. ఏ ఇస్లాం ధర్మం అయితే ఇతరులకు ఏ బాధ కలిగించకుండా, ఇతరులపై ఏ అన్యాయం చేయకుండా ప్రళయ దినాన హాజరు కావాలి అని నేర్పుతుందో, ఆ ఇస్లాం ధర్మం, ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల్లో ఏయే అభాండాలు మోపడం జరుగుతుందో వాటన్నిటి శిక్షణ ఇస్లాం ఇస్తుంది అని చెప్పగలమా? బుద్ధి జ్ఞానంతో మనం గ్రహిస్తే, సోదరులారా, సోదరీమణులారా, సామాన్య జీవితంలో మామూలీ చిన్నపాటి ఏ అన్యాయానికి కూడా ఇస్లాం మనకు అనుమతి ఇవ్వదు. ఎందుకంటే దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు బరువు తగ్గిపోతుంది అని హెచ్చరించడం జరుగుతుంది.

ఇక యుద్ధ మైదానంలో ఉన్నప్పటికీ కూడా, యుద్ధంలో శత్రువులు మన ముంగట ఉన్న ఉండి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరి పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా ఉండడానికి కూడా ఇస్లాం మనకు శిక్షణ ఇచ్చి ఉంది.

హజ్రత్ ముఆద్ ఇబ్ను అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, “మేము ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఒక యుద్ధంలో ఉన్నాము. ఆ యుద్ధంలో ఒక సందర్భంలో ఒకచోట మజిలీ చేయడం అవసరం పడింది. అయితే అప్పుడు ప్రవక్తతో ఉన్న ప్రజల్లో కొంతమంది దారిలో ప్రజలు నడిచేటువంటి దారిలో సైతం తమ యొక్క గుడారాలు వేసుకొని, ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే అటువంటి విధంగా ప్రవర్తించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు.” ఏం చెప్పారు అప్పుడు?

గమనించండి. ఈ రోజుల్లో సిటీలలో ప్రజలు నడిచే దారిని కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ మైదానంలో ఉన్నారు. ఎడారిలో. కానీ ప్రజలు అడపాదడపా వచ్చిపోయే దారిలో గుడారాలు వేసుకొని, టెంట్ వేసుకొని ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే విధంగా ఉండడాన్ని కూడా ఇష్టపడలేదు. అదే సందర్భంలో ఎలాంటి ఆదేశం జారీ చేశారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు: “ఎవరైతే ప్రవక్తతో యుద్ధంలో పాల్గొన్నాము, చాలా పుణ్యాలు మనం పొందుతాము అన్నటువంటి సంతోషంలో పడి ఉన్నారో కానీ దారిలో ఏదైనా గుడారం వేసి, టెంట్ వేసి ప్రజలకు నడిచే దారిలో వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారో, అలాంటి వారికి ఆ యుద్ధం యొక్క ఏ పుణ్యమూ లభించదు.” ఏ పుణ్యమూ లభించదు అంటే ఏమిటి? యుద్ధం పాల్గొనే యొక్క గొప్ప పుణ్యం ఏదైతే ఉందో, దానిని ఇలాంటి చిన్నపాటి అన్యాయం అని అనుకుంటారు కావచ్చు, మరికొందరైతే దీనిని ఏ అన్యాయము అని కూడా భావించరు కావచ్చు, అలాంటి విషయాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహించడం లేదు.

అందుగురించి మహాశయులారా, మనం ప్రజల పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించాలి. వారిపై మన నుండి ఏ ఒక్క చిన్నపాటి అన్యాయం ఉండకూడదు లేదా అంటే ప్రళయ దినాన మనం చాలా నష్టపోయే వారిలో కలుస్తాము.

ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అయ్యే పాప కార్యాల్లో 12వ విషయం, దుష్ప్రవర్తన.

త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో సత్ప్రవర్తన అని విన్నాము కదా? అయితే త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో దుష్ప్రవర్తన.

దుష్ప్రవర్తనకు సంబంధించిన విషయం మనం ఎప్పుడైతే సత్ప్రవర్తన గురించి విన్నామో, అక్కడ ఒక హదీసు విన్నాము. అదేమిటంటే అల్లాహ్ కు ప్రియమైన వారిలో, ఎవరైతే ప్రజల పట్ల ప్రయోజనకరంగా జీవిస్తారో మరియు అల్లాహ్ కు ఇష్టమైన ప్రియమైన కార్యాల్లో ఒక ముస్లింని సంతోషపెట్టడం, వారిపై ఏదైనా అప్పు ఉంటే అప్పు చెల్లించడంలో సహాయం చేయడం, వారికి ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం తొలగిపోవడంలో వారికి సహాయం చేయడం, ఈ విధంగా ఎన్నో విషయాలు వింటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అని కూడా మనం విన్నాము: “నేను నా ఈ మస్జిద్ లో ఏతెకాఫ్ చేయడం కంటే నా యొక్క సోదరుని అవసరాన్ని తీర్చడం నాకు ఎక్కువ ఇష్ట కార్యం.”

ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

وَإِنَّ سُوءَ الْخُلُقِ لَيُفْسِدُ الْعَمَلَ كَمَا يُفْسِدُ الْخَلُّ الْعَسَلَ
(వ ఇన్న సూ’అల్ ఖులుఖి లయుఫ్సిదుల్ అమల కమా యుఫ్సిదుల్ ఖల్లుల్ అసల)

వినండి, నిశ్చయంగా దుష్ప్రవర్తన మీ సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది. మీ సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని నశింపజేస్తుంది, ఎలాగైతే వెనిగర్ తేనె యొక్క తీపిని నశింపజేస్తుందో.

ఒకసారి అనుభవించి చూడండి, ఎంత క్వాలిటీ గల, స్వచ్ఛమైన, ఎలాంటి కలుషితం లేకుండా తేనె మీ వద్ద ఉన్నా, అందులో మీరు వెనిగర్ కలిపారంటే, ఆ వెనిగర్ అనేది ఆ తేనెపై ఎంత దుష్ప్రభావం చూపుతుందో, అలాగే మీ దుష్ప్రవర్తన అనేది మీ సర్వ సత్కార్యాలను నశింపజేస్తుంది.

అందు గురించి మహాశయులారా, మనం ఒకరి పట్ల దుష్ప్రవర్తన ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరితో ఉత్తమంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. ఇంట్లో భార్యాభర్తల్లో గాని, తల్లిదండ్రులు పిల్లలతో గాని, పిల్లలు తల్లిదండ్రులతో గాని, పరస్పరం సోదర సోదరీమణులు ఒకరి పట్ల ఒకరు, ఈ విధంగా ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల పట్ల కూడా మన వ్యవహారం చాలా ఉత్తమంగా ఉండాలి.

ప్రళయ దినాన మన త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో 13వ విషయం, ముస్లిం యొక్క, ఒక విశ్వాసునిపై ఏదైనా అపనింద వేసి అతన్ని అవమాన పాలు చేయడం.

మహాశయులారా, ఇది చూడడానికి చిన్న విషయం కానీ, మహా భయంకరమైన పాపం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

إِنَّ مِنْ أَرْبَى الرِّبَا الاِسْتِطَالَةُ فِي عِرْضِ الْمُسْلِمِ بِغَيْرِ حَقٍّ
(ఇన్న మిన్ అర్బర్-రిబా అల్-ఇస్తితాలతు ఫీ ఇర్ దిల్ ముస్లిం బిగైరి హఖ్ఖిన్)

ఒక ముస్లింను అన్యాయంగా, అక్రమంగా అవమానించడం ఇది వడ్డీలో అతి భయంకరమైన భాగం

అంటే ఏమిటి? వడ్డీ ఎలాగైతే పుణ్యాన్ని నశింపజేస్తుందో, ఆ విధంగా ఒక ముస్లింపై మనం ఏదైనా అపనింద వేసాము, అతన్ని అవమాన పాలు చేసాము అంటే ఈ రకంగా మనకు చాలా నష్టం కలుగుతుంది. ఇది కూడా దుష్ప్రవర్తనలో వచ్చేస్తుంది, సత్ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది.

అల్లాహు త’ఆలా మనందరికీ కూడా మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించి, త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43736

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]