దాన ధర్మాల విశిష్టత
సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/UA3H7Z8PhLY [34 నిముషాలు]
ఈ వీడియోలో గమనించవలసిన విషయాలు
1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ?
2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ?
3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ?
4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ?
5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ?
8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ?
9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ?
10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత
ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم
ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.
అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.
ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:
الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا
వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే
అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.
అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:
مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.
మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.
సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.
అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
إن الصدقة لتطفئ عن أهلها حر القبور
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్)
నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.
అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس
(కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్)
ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.
అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.
అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:
إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ)
నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.
మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.
దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:
ملكان يناديان
(మలకాని యునాదియాని)
ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.
అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?
اللهم أعط منفقا خلفا
(అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్)
ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.
దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:
ما نقصت صدقة من مال
(మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్)
దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.
తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:
قال الله: أنفق يا ابن آدم أنفق عليك
(ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్)
ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.
ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.
అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:
أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا
(అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా)
ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.
అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.
మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.
దానశీలురైన భక్తుల ఉదాహరణలు
ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.
మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.
ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.
ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.
మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.
అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:
مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً
అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.
ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.
కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.
ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.
దానధర్మాలు చేసే ఉత్తమ మార్గాలు
అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.
మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.
ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.
అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.
అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.
మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى
(అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా)
నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.
అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.
అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:
أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ
(అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న)
ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:
يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها
(యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా)
ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.
ఎప్పుడు దానధర్మాలు చేయాలి?
ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى
(అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)
నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.
దానధర్మాలలో పాటించవలసిన జాగ్రత్తలు
ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:
إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول
(ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్)
ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.
కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.
రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్‌ఫామ్‌లో, స్టేటస్‌లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్‌లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:
ومن تصدق يرائي فقد أشرك
(వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక)
ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.
అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.
మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.
ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!
ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=28200
జకాతు & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/