అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు [వీడియో | టెక్స్ట్]

అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు
https://www.youtube.com/watch?v=pcIMF4mR90E [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క విధిరాత (ఖద్ర్) పట్ల అసంతృప్తి మరియు కోపాన్ని ప్రదర్శించడం తౌహీద్ (ఏకేశ్వరోపాసన)కు విరుద్ధమని, అది అవిశ్వాసం (కుఫ్ర్) వైపు నడిపించే ప్రమాదం ఉందని వివరిస్తారు. కష్టాలు మరియు ఆపదలు ఎదురైనప్పుడు, సహనం వహించడం, నాలుకను మరియు అవయవాలను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. అల్లాహ్ తాను ప్రేమించిన వారిని పరీక్షిస్తాడని, గొప్ప బహుమతి గొప్ప పరీక్షతోనే వస్తుందని ఒక హదీసును ఉటంకిస్తారు. విధిరాత పట్ల సంతృప్తిగా ఉన్నవారికి అల్లాహ్ యొక్క ప్రసన్నత లభిస్తుందని, కోపగించుకున్న వారికి ఆయన ఆగ్రహం కలుగుతుందని ఆయన ముగిస్తారు.

అల్లాహ్ రాసిన విధిరాత (ఖద్ర్) పట్ల అయిష్టత, అసహ్యత మరియు కోపం ప్రదర్శించరాదు. అల్లాహ్ రాసినటువంటి ఖద్ర్, ఖదా. దాని పట్ల ఎప్పుడూ కూడా అయిష్టత, అసహ్యత, కోపం ప్రదర్శించరాదు. ఈ పాపంలోనైతే మనలో చాలా మంది పడిపోతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

అల్లాహ్ నిర్ణయించిన దాని ప్రకారం ఏమైనా ఆపదలు వస్తే అయిష్టత, కోపం ప్రదర్శించుట ఇది సంపూర్ణ తౌహీద్‌కు విరుద్ధం. ఒక్కోసారి ఇదే స్థితిలో మనిషి ఏదైనా కుఫ్ర్ మాటలు, అవిశ్వాస పలుకులు పలికితే, లేదా కుఫ్ర్, అవిశ్వాసానికి సంబంధించిన ఏదైనా పని చేస్తే, ఈ చేష్ట అతని తౌహీద్ పునాదులను కదిలించి అతడు కుఫ్ర్‌లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? నాకే అల్లాహ్ ఇట్లా రాయాల్నా? నా మీదనే ఈ ఆపద రాసి రావాల్సి ఉండేనా? అయ్యో నా పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడే నా భర్త చనిపోవాల్నా? ఏంటిది అల్లాహ్ యొక్క ఈ అన్యాయం? ఇలాంటి మాటలు ప్రజలు అంటూ ఉన్నారు ఈ రోజుల్లో. కొన్ని ప్రాంతాల్లోనైతే ఓ అల్లాహ్, నా భర్తే దొరికిండా నీకు తీసుకోవడానికి? ఇంకా ఎవరూ లేకుండినా? ఇట్లాంటి మాటలు కూడా కొందరు అన్నారు. ఇది చాలా పాపం, చాలా పాపం. మనల్ని తౌహీద్ నుండి, ఇస్లాం నుండి వైదొలగడానికి, ఇస్లాం నుండి దూరమైపోవడానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

విధిరాతను అసహ్యించుకోకూడదు. తఖ్దీర్‌ను అయిష్టతతో లేదా ఏదైనా మన ద్వారా ఒక అసహ్యం ఏర్పడింది అన్నట్లుగా మనం ప్రదర్శించకూడదు. అల్లాహు త’ఆలా అందరి తఖ్దీర్ ముందే రాసి పెట్టాడు గనక, అతడు అలీమ్ మరియు హకీమ్. సర్వజ్ఞాని మరియు సర్వ వివేకవంతుడు. అల్లాహు త’ఆలా వివేకవంతుడు గనకనే అదృష్టాన్ని, తఖ్దీర్‌ని రాసిపెట్టాడు.

మనపై ఇహలోక పరంగా మనకు ఏదైనా ఆపద వచ్చింది. రోగ రూపంలో గానీ, లేదా మనకు సంబంధించిన దగ్గరి వారు చనిపోయే రూపంలో గానీ, ఇంకా ఏ రూపంలో ఏ ఆపద వచ్చిపడ్డా, విధిగా పాటించవలసిన విషయాలు ఏమిటంటే:

  1. నెంబర్ ఒకటి, కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా తనకు తాను సహనం వహించాలి.
  2. రెండవ విషయం, కోపం, అయిష్టత వ్యక్తపరచకుండా నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అల్లాహ్‌కు ఇష్టం లేని ఏ మాట నాలుక నుండి వెళ్లనివ్వకూడదు.
  3. మూడవది, తన శరీర అవయవాలను కూడా అదుపులో ఉంచుకోవాలి. చెంపలు బాదుకోవడం, దుస్తులు చించుకోవడం, చింపేయడం, వెంట్రుకలు పీక్కోవడం, తలపై దుమ్మెత్తి పోసుకోవడం, ఇంకా ఇలాంటి ఏ పనులు కూడా చేయరాదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజిలోని సహీ హదీస్, 2396. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

عَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ قَالَ: (إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلَاءِ وَإِنَّ اللهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلَاهُمْ فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అనస్ (రజియ ల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు సంతోషంగా మసలుకుంటారో వారికి అల్లాహ్ సంతృష్టి లభిస్తుంది. ఎవరు అయిష్టత, కోపానికి గురి అవుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి గురి అవుతాడు”. (తిర్మిజి/ ఫిస్సబ్రి వల్ బలా/ 2396).

إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلاَءِ
(ఇన్న ఇ’జమల్ జజా’ఇ మ’అ ఇ’జమిల్ బలా’ఇ)
పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది.

గొప్ప పుణ్యం కావాలా? చాలా బ్రహ్మాండమైన పెద్ద సత్ఫలితం కావాలా నీకు? అయితే అంతే పెద్ద పరీక్షలు వస్తాయని కూడా నీవు నమ్ము.

మళ్ళీ తర్వాత ప్రవక్త ఏం చెప్పారో చూడండి:

وَإِنَّ اللَّهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلاَهُمْ
(వ ఇన్నల్లాహ ఇజా అహబ్బ ఖౌమన్ ఇబ్తలాహుమ్)
మరియు నిశ్చయంగా అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో, వారిని పరీక్షకు గురిచేస్తాడు.

ఎల్లవేళలలో ఈ విషయాన్ని మదిలో ఫ్రెష్‌గా నాటుకుని ఉండే భాగ్యం ప్రసాదించు గాక. వేరే ఎల్లవేళలలో ఈ మదిలో ఈ విషయం ఉండదు గనక, ఏ చిన్న ఆపద వచ్చినా గానీ మనం తొందరగా కోపానికి గురవుతాం. ఇది నాకు ఆపద వచ్చిందంటే పళ్ళు కొరకడం, వెంట్రుకలు పీక్కోవడం, బట్టలు చింపుకోవడం, అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

ప్రవక్త ఏమంటున్నారో చూడండి, అల్లాహ్ ఎవరినైనా ప్రేమించాడంటే వారిని పరీక్షకు గురిచేస్తాడు. ఆ పరీక్షలో:

فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ
(ఫమన్ రదియ ఫలహుర్-రిదా, వ మన్ సఖిత ఫలహుస్-సఖత్)
ఎవరైతే సంతోషంగా ఉంటారో, అతనికి (అల్లాహ్ యొక్క) సంతృప్తి లభిస్తుంది, మరియు ఎవరైతే కోపానికి గురవుతాడో, అతనికి (అల్లాహ్ యొక్క) ఆగ్రహం కలుగుతుంది.

ఫలహుర్-రిదా. ఎవరైతే సంతోషంగా మసులుకుంటారో, అతనికి అల్లాహ్ యొక్క సంతృప్తి లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. అల్లాహ్ నీ పట్ల సంతృప్తి చెంది ఉండాలి, నిన్ను చూసి సంతోషపడాలి, అంటే ఏం చేయాలి? ఏ పెద్ద కష్టం వచ్చినా గానీ మూడు రకాలు ఏవైతే చూపించబడ్డాయో, ఆ మూడు పద్ధతులను అవలంబించాలి మరియు అన్ని రకాల చెడులకు దూరం ఉండాలి.

కానీ ముసీబత్, కష్టం, ఆపద వచ్చినప్పుడు వమన్ సఖిత ఫలహుస్-సఖత్, ఒకవేళ కోపానికి గురి అయ్యాడంటే అతడు కూడా అల్లాహ్ ఆగ్రహానికి గురైపోతాడు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరినీ క్షమించు గాక. ఏదైనా ఆపద వచ్చినప్పుడు తఖ్దీర్‌పై సంతోషంగా ఉండి, అల్లాహ్ మనకు అన్ని రకాల మేళ్లు చేసే భాగ్యం ప్రసాదించు గాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41278

తఖ్దీర్ (విధి వ్రాత):
https://teluguislam.net/qadr-taqdeer-vidhi-rata/

ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]
https://teluguislam.net/2011/03/23/prohibitions-in-sharia-telugu-islam/