8 వ అధ్యాయం
మంత్రాలు (రుఖ్ యా) మరియు తాయత్తుల విషయంలో వచ్చిన ఆదేశాలు
అల్ ఖౌలుస్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab.
باب ما جاء في الرقى والتمائم
8వ అధ్యాయం: రుఖ్ యా (మంత్రాలు), తాయత్తుల ఆదేశాలు
في الصحيح عن أبي بشير الأنصاري رضي الله عنه أنه كان مع رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ في بعض أسفاره، فأرسل رسولاً: أن لا يُبقين في رقبة بعير قلادة من وَتَر، أو قلادة إلاَّ قُطِعت.
అబూ బషీర్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఆయన ఓ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చాటింపు చేసే వ్యక్తిని ఈ వార్త ఇచ్చి పంపారు: “తమ ఒంటె మెడలో ఎవరూ కూడా తీగతో తయారైన పట్టా ఉంచకూడదు. ఒక వేళ ఉంటే తెంపేసెయ్యాలి”. (బుఖారీ 2843, ముస్లిం 2115).
وعن ابن مسعود رضي الله عنه قال: سمعت رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يقول: إن الرُّقى والتّمائم والتِّوَلَة شرك.
ఇబ్ను మస్ ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను. “మంత్రాలు, తాయత్తులు, తివల (భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయుట) షిర్క్“. (అబూ దావూద్ 3883).
وعن عبد الله بن عُكيم مرفوعاً: من تعلّق شيئاً؛ وُكِل إليه.
అబ్దుల్లాహ్ బిన్ ఉకైం రజియల్లాహు అన్హు ప్రవక్తతో ఉల్లేఖించిన హదీసులో ఉంది: “ఎవరు ఏదైనా వస్తువు వేసుకుంటే అతన్ని దాని వైపునకే అప్పగించబడుతుంది“. (తిర్మిజి 2072).
తాయత్తు అంటే: దిష్టి తగలకుండా తమ సంతానానికి ధరింపజేయబడే వస్తువులు. ఇది ఖుర్ఆన్ నుండి ఉంటే కొందరు పూర్వ ధర్మవేత్తలు యోగ్యమని చెప్పారు. మరి కొందరు యోగ్యం కాదని, నివారించబడింది అని చెప్పారు. నివారించినవారిలో ఇబ్నె మస్ ఊద్ రజియల్లాహు అన్హు ఉన్నారు.
మంత్రాలను ‘అజాయిం’ అని అంటారు. దిష్టి తగిలినప్పుడు, విష పురుగులు కాటేసినప్పుడు మంత్రిచవచ్చును కాని షిర్క్ అర్థమునిచ్చే పదాలు ఉండకూదడు.
తివల అంటే: భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు చేయబడే ఇంద్రజాలం.
وروى أحمد عن رُوَيْفع قال: قال لي رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يا رُوَيْفِع، لعل الحياة ستطول بك؛ فأخبر الناس: أن من عقد لحيته، أو تقلّد وَتَراً، أو استنجى برجيع دابة أو عظم؛ فإن محمداً بريء منه.
రువైఫిఅ యొక్క హదీసు ఇమాం అహ్మద్ ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా తెలిపారు: “ఓ రువైఫిఅ! బహుశా నీవు దీర్ఘకాలం బ్రతికి ఉంటావేమో, అయితే ప్రజలకు నీవు ఈ విషయం తెలుపు: గడ్డమును ముడి వేసేవారితో, లేక తీగలు మెడలో వేసుకునేవారితో, పశువుల పేడ, ఎముకలతో మలమూత్ర విసర్జన తర్వాత పరిశుద్ధ పరుచుకునేవారితో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎలాంటి సంబంధం లేదు”.
وعن سعيد بن جبير قال: “من قطع تَمِيمَة من إنسان؛ كان كعدل رقبة” رواه وكيع.
సఈద్ బిన్ జుబైర్ ఇలా చెప్పారు: ‘ఒక వ్యక్తి ధరించిన తాయత్తును తీసే వారికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభించును’. (ఇమాం వకీఅ ఉల్లేఖనం).
وله عن إبراهيم قال: “كانوا يكرهون التّمائم كلها؛ من القرآن وغير القرآن”.
ఇమాం వకీఅ ఇబ్రాహీం నఖ్ఈతో ఉల్లేఖించారు: “వారు (అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ శిష్యులు) అన్ని రకాల తాయుత్తులను అసహ్యించుకునేవారు (నిషిద్ధంగా భావించేవారు). అవి ఖుర్ఆన్ కు సంబంధించినవైనా, లేదా ఖుర్ ఆన్ కు సంబంధం లేనివైనా.”
ముఖ్యాంశాలు
1. మంత్రము (రుఖ్య), తాయత్తు యొక్క వివరణ తెలిసింది.
2. తివల యొక్క భావం తెలిసింది.
3. ఎలాంటి వ్యత్యాసం లేకుండా పైన పేర్కొన్న మూడూ విషయాలు కూడా షిర్క్ గా పరిగణింపబడుతాయి. (ఇందులో వివరణ ఉంది, క్రింద వస్తుంది).
4. దిష్టి తగిలినప్పుడు లేదా తగలకుండా లేదా విషపురుగు కాటేసినప్పుడు షిర్క్ పదాలు కాకుండా ఖుర్ఆన్, హదీసుతో రుజువైన దుఆలతో రుఖ్య చేయుట (మంత్రించుట) షిర్క్ కాదు. (అన్ని రకాల రోగాలకు రుఖ్య చేయవచ్చును).
5. ఖుర్ఆన్ ఆయతులతో వ్రాయబడిన తాయత్తు విషయములో పండితుల బేధాభిప్రాయం ఏర్పడినది. (వాస్తవమేమిటంటే అది కూడా యోగ్యం కాదు. ఎలా అనగా మంత్రం షిర్క్ అని తెలిపిన తరువాత యోగ్యమైనదేదో ప్రవక్త స్వయంగా తెలిపారు. కాని తాయత్తు విషయంలో అలా తెలుపలేదు. అందుకే ఇందులో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు మాటనే నిజమైనది).
6. పశువులకు దిష్టి తగలకుండా తీగలు, ఇంకేవైనా వేయుట కూడా షిర్క్ కు సంబంధించినవే.
7. అలాంటివి వేసినవారిని కఠినంగా హెచ్చరించబడింది. (فإن محمداً بريء منه)
8. ఒక వ్యక్తి మెడ నుండి తాయత్తు తీయుట ఎంత పుణ్యమో తెలిసింది.
9. ఇబ్రాహీం నఖ్ఈ మాట, పైన తెలిపిన మాటకు విరుద్ధం ఏమీ కాదు. ఎలా అనగా; ఈయన ఉద్దేశం అబుల్లాహ్ బిన్ మస్ ఊద్ శిష్యులు అని.
తాత్పర్యం
తమాయిమ్ తమీమా యొక్క బహువాచనం, మన భాషలో తాయత్తు అని అంటాము, వాటి వైపే ప్రజల మనస్సు అంకితం అయిపోతుంది. దీని వివరణ దీనికంటే ముందు ఏడవ అధ్యాయంలో తెలిపిన మాదిరిగానే ఉంటుంది.
తాయత్తులు వేసుకొనుట షిర్క్ అని తెలిసింది. అయితే ఇందులో కొన్ని షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్). ఉదా: షైతాన్ తో లేక సృష్టిరాసులతో సహాయం కోరడం జరుగుతుంది, అల్లాహ్ ఆధీనంలో మాత్రమే ఉన్నదాని గురించి ఇతరులతో అడగడం జరుగుతుంది, కనుక పెద్ద షిర్క్ లో పరిగణించబడుతుంది. ఈ విషయం మరీ వివరంగా తరువాత అధ్యాయాల్లో వస్తుంది.
తాయత్తుల్లో మరి కొన్ని నిషిద్ధం, ఎందుకనగా అవి షిర్క్ వైపునకు తీసుకెళ్తాయి. ఉదా: అర్ధం లేని పేర్లతో, పదాలతో ఉన్న తాయత్తులు.
ఇక ఏ తాయయత్తుల్లో ఖుర్ఆన్ ఆయతులు, లేదా హదీసులో వచ్చిన దుఆలుంటాయో, ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు గనక వాటిని విడనాడడమే ఉత్తమం. ఈ పద్ధతి నిషిద్ధమున్న వాటి ఉపయోగమునకు దారి తీస్తుంది. అపరిశుద్ధ స్థలాల్లో పోక తప్పదు గనక, వాటిని వేసుకున్నవాడు వాటి గౌరవ మర్యాదను పాటించలేడు. (ఇవి పాటించినవానికి సయితం అనుమతి లభించదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇవ్వలేదు).
మంత్రం విషయంలో ఉన్న వివరాన్ని కూడా తెలుసుకోవాలి. అది ఖుర్ఆన్, హదీసు నుండి ఉంటే మంత్రించేవాని గురించి అభిలషనీయమే. ఎందుకనగా ఇది కూడా ఒక ఉపకారం, పుణ్యం క్రింద లెక్కించబడుతుంది గనుక యోగ్యం కూడా. కాని మంత్రం చేయించుకునే వ్యక్తి స్వయంగా అడగక ఉండడమే మంచిది. మంత్రించడమైనా లేక ఇంకేదైనా అడగక ఉండడం మానవుని సంపూర్ణ నమ్మకం, బలమైన విశ్వాసం యొక్క నిదర్శన. అడగడంలో అతనికి లాభం మరియు అది యోగ్యం అయినప్పటికీ అడగక పోవడం మంచిది అనబడుతుంది. ఇందులోనే వాస్తవ తౌహీద్ యొక్క రహస్యం ఉంది. ఈ విషయాన్ని గమనించి ఆచరించేవారు చాలా అరుదు. మంత్రంలో అల్లాహ్ యేతరులతో స్వస్థత కోరి, వారితో దుఆ చేయబడితే అది పెద్ద షిర్క్. ఎందుకంటే: దుఆ, మొర అల్లాయేతరులతో చేయరాదు గనక. ఈ వివరాలన్నీ జాగ్రత్తగా తెలుసుకో! అందులో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను గమనించకుండా అన్నిటి గురించి ఒకే రకమైన తీర్పు చేయకు. జాగ్రత్తగా ఉండు!
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

You must be logged in to post a comment.