దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా?
https://youtu.be/5a9fdHuql-U [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, దిష్టి తగలకుండా కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం మరియు మెడలో తాయెత్తులు (తావీజులు) ధరించడం వంటి నమ్మకాలపై ఇస్లామీయ తీర్పును వివరించబడింది. ఇవి ఇస్లాంలో నిషిద్ధమైన చర్యలని, షిర్క్ (బహుదైవారాధన) కిందకు వస్తాయని స్పష్టం చేయబడింది. ఇలాంటివి ధరించి చేసే నమాజ్ వంటి ఆరాధనలు స్వీకరించబడవని చెప్పబడింది. ఇలాంటి మూఢనమ్మకాలకు బదులుగా, కేవలం అల్లాహ్‌పైనే ఆధారపడాలని మరియు అన్ని రకాల కీడు, రోగాలు మరియు దిష్టి నుండి రక్షణ పొందడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన ఖురాన్ సూరాలు మరియు ప్రామాణికమైన దువాలను పఠించాలని నొక్కి చెప్పబడింది.

నల్ల దారం మరియు తాయెత్తులపై ఇస్లామీయ తీర్పు

నల్ల దారం అనేది కట్టుకోకూడదు. మనుషులే కాదు, అప్పటి కాలంలో అరబ్బులో ఒంటెలకు ఒక రోగం వచ్చేది. దాని కారణంగా ఒక రకమైన తీగ, ‘వతర్’ అని వారు అనేవారు, దానిని ఒంటెల మెడలకు వేసేవారు. అయితే ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉన్నప్పుడు, కొందరు ఇలాంటి తప్పుకు పాల్పడింది చూసి ఇలా అన్నారు:

لَا يَبْقَيَنَّ أَحَدُكُمْ قِلَادَةً أَوْ وَتَرًا
(లా యబ్ఖయన్న అహదుకుం కిలాదతన్ అవ్ వతరన్)
“మీలో ఎవరు కూడా తమ ఒంటెలో ఇలాంటి ఏ పట్టా గానీ, ఏ దారం గానీ, ఏ తీగ గానీ, ఇలాంటి రోగాలు రాకుండా, దిష్టి తగలకుండా వేయకూడదు” అని చాలా స్పష్టంగా చెప్పారు.

ఇక మన వద్ద కొందరు తావీజులు ఏవైతే వేసుకుంటారో, తావీజ్ మెడలో గానీ, ఇక్కడ గానీ, కొందరు ‘ఇమామె జామిన్’ అని సౌదియాకు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ తల్లులు, “నా బేటా, తూ ఇమామె జామిన్ పెహన్ కే జా, తూ సలామత్ సే ఆయేగా మేరా బేటా” అని ఎంతో ప్రేమగా తల్లులు వేయించి పంపుతారు. మరికొందరు స్త్రీలు వారి యొక్క గర్భ సమయంలో గానీ, లేదా వారికి కాన్పు చాలా సులభంగా జరగాలని కానీ, ఇక్కడ నడుములో కట్టుకుంటారు. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ హిదాయత్ ఇవ్వు గాక. మరి కొందరి గురించి వచ్చిన వార్తలు, ప్రజలు అడిగిన ప్రశ్నల్లో, కొందరు తొడలకు కూడా ఇలాంటి తావీజులు కట్టుకుంటారు అని తెలిసింది. మరి కొందరు కింద చీలమండలానికి పైగా కాళ్ళకు కూడా వేసుకుంటారు. ఇవన్నీ కూడా తప్పు విషయాలు. ఇంట్లో పుట్టిన చిన్న పిల్లలకు ఏ దిష్టి తగలకూడదని నల్ల పూసలు వేస్తారు. ఇటు పక్కన నల్ల కాటుక అది పెడతారు. లేదా ఇక్కడ పెడతారు, లేదా పాదంలో పెడతారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం దూరం ఉండాలి.

సరైన విశ్వాసం మరియు రక్షణ మార్గాలు

అల్లాహ్ పై మాత్రమే మన నమ్మకం ఉండాలి. అల్లాహ్‌ను మాత్రమే మనం బలంగా విశ్వసించాలి. మరియు అన్ని రకాల దిష్టి నుండి, చెడు నుండి, మరియు అన్ని రకాల కీడుల నుండి రక్షణ కొరకు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దువాలు చదువుతూ ఉండాలి మరియు ఇంకా మన ఇహలోక పరంగా కొన్ని మంచి సాధనాలను ఉపయోగించి, చెడుకు పాల్పడే అటువంటి సాధనాలను వదులుకోవాలి.

ప్రవక్త (స) నేర్పిన దువాలు (ప్రార్థనలు)

మనకు ఏమైనా అవస్థ, బాధ, కష్టం, శరీరంలో ఏదైనా నొప్పి ఉండేది ఉంటే, మూడు సార్లు ‘బిస్మిల్లాహ్’ చదివి, ఏడు సార్లు ఈ దువా చదవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పారు:

أَعُوذُ بِعِزَّةِ اللَّهِ وَقُدْرَتِهِ مِنْ شَرِّ مَا أَجِدُ وَأُحَاذِرُ
(అ’ఊదు బి ఇజ్జతిల్లాహి వ ఖుద్రతిహీ మిన్ షర్రి మా అజిదు వ ఉహాదిర్)
“నేను అనుభవిస్తున్న మరియు భయపడుతున్న దాని కీడు నుండి అల్లాహ్ యొక్క శక్తి మరియు ఘనతతో శరణు వేడుకుంటున్నాను.”
ఆ చోట ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ వేలు పెట్టి ఈ దువా చదువుతూ ఉంటే అల్లాహ్ త’ఆలా స్వస్థత కలిగించేవాడు ఉన్నాడు. మరియు దానికి తగినటువంటి కొన్ని మందులు గట్రా వాడటంలో కూడా పాపం లేదు.

ఎవరికైనా దిష్టి తగిలే అటువంటి ప్రమాదం ఉండేది ఉంటే, ఈ దువా చదువవచ్చు:

أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ
(అ’ఊదు బి కలిమాతిల్లాహిత్ తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్)
“అల్లాహ్ యొక్క సంపూర్ణ వాక్యాలతో ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి శరణు కోరుతున్నాను.”

అలాగే, ప్రత్యేకంగా దిష్టి గురించి:

أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّةِ مِنْ كُلِّ شَيْطَانٍ وَهَامَّةٍ وَمِنْ كُلِّ عَيْنٍ لامَّةٍ
(అ’ఊదు బి కలిమాతిల్లాహిత్ తామ్మహ్, మిన్ కుల్లి షైతానిన్ వ హామ్మహ్, వ మిన్ కుల్లి ‘అయ్నిన్ లామ్మహ్)
“అల్లాహ్ యొక్క సంపూర్ణ వాక్యాలతో నేను శరణు కోరుతున్నాను, ప్రతి షైతాన్ నుండి, ప్రతి విషపు పురుగు నుండి మరియు హాని కలిగించే ప్రతి కన్ను (దిష్టి) నుండి.”

ఇంకా వేరే ఎన్నో రకాల దువాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సూరతుల్ ఇఖ్లాస్ (ఖుల్ హువల్లాహు అహద్), సూరతుల్ ఫలఖ్ (ఖుల్ అ’ఊదు బి రబ్బిల్ ఫలఖ్), సూరతున్ నాస్ (ఖుల్ అ’ఊదు బి రబ్బిన్ నాస్), ఈ సూరాలు జ్ఞాపకం ఉంచుకొని, ఇవి మరియు ఆయతుల్ కుర్సీ లాంటివి మనం చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక సహీ హదీథ్‌లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَا تَعَوَّذَ مُتَعَوِّذٌ بِمِثْلِهِمَا
(మా త’అవ్వద ముత’అవ్విదున్ బి మిస్లిహిమా)
“శరణు కోరేవాడు ఈ రెండింటి (సూరహ్ ఫలఖ్, నాస్) వంటి వాటితో ఎన్నడూ శరణు వేడుకోలేదు.”
మరి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఇఖ్లాస్ కూడా. ఇంతకంటే ఉత్తమమైన, మంచి, గొప్ప ఏ శరణు వేడుకోవడానికి ఏ మంచి సూరాలు దువాలు ఇక వేరేవి లేవు అని కూడా ప్రవక్త చెప్పి ఉన్నారు. బహుశా ఈ ప్రశ్నకు ఇంత సమాధానం సరిపోతుందని అనుకుంటున్నాను.