జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం [ఆడియో, టెక్స్ట్]

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం
https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.

జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ‏”‌‏
అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”.
(అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.)
(సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ‏”‌‏
అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”.
(అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم ‏ “‏ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ‏”‏
అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.

(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ ఫ అహ్సనల్ వుదూఅ సుమ్మ అతల్ జుముఅత ఫదనా వస్తమఅ వఅన్సత గుఫిర లహు మాబైనహు వబైనల్ జుముఅ వజియాదతు సలాసతి అయ్యామ్, వమన్ మస్సల్ హసా ఫఖద్ లగా”.

(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).

ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.

మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.

ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.

عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ، قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ “‏ لاَ يَغْتَسِلُ رَجُلٌ يَوْمَ الْجُمُعَةِ، وَيَتَطَهَّرُ مَا اسْتَطَاعَ مِنْ طُهْرٍ، وَيَدَّهِنُ مِنْ دُهْنِهِ، أَوْ يَمَسُّ مِنْ طِيبِ بَيْتِهِ، ثُمَّ يَخْرُجُ فَلاَ يُفَرِّقُ بَيْنَ اثْنَيْنِ، ثُمَّ يُصَلِّي مَا كُتِبَ لَهُ، ثُمَّ يُنْصِتُ إِذَا تَكَلَّمَ الإِمَامُ، إِلاَّ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ الأُخْرَى ‏”‌‏

అన్ సల్మానల్ ఫారిసీ రదియల్లాహు అన్హు ఖాల్, ఖాలన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం, “లా యగ్తసిలు రజులున్ యౌమల్ జుముఅ, వ యతతహ్హరు మస్తతాఅ మిన్ తుహ్రిన్, వ యద్దహిను మిన్ దుహ్నిహి, అవ్ యమస్సు మిన్ తీబి బైతిహి, సుమ్మ యఖ్రుజు ఫలా యుఫర్రిఖు బైనస్నైన్, సుమ్మ యుసల్లీ మా కుతిబ లహు, సుమ్మ యున్సితు ఇదా తకల్లమల్ ఇమాము, ఇల్లా గుఫిర లహు మా బైనహు వబైనల్ జుముఅతిల్ ఉఖ్రా”.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).

ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.

అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/