ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి” – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి”
https://youtu.be/D1oAzBvsApU [32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో వక్త, బనీ ఇస్రాయీల్ ప్రవక్తలలో ఒకరైన ఉజైర్ (అలైహిస్సలాం) గారి అద్భుతమైన జీవిత చరిత్రను వివరించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మరణం ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఎలా బ్రతికించారో, ఆ సమయంలో జరిగిన చారిత్రక పరిణామాలు (బాబిలోనియా రాజు నెబుకద్ నెజర్ ద్వారా జెరూసలేం నాశనం, తౌరాత్ గ్రంథం దహనం, యూదుల బానిసత్వం మరియు విడుదల) గురించి చర్చించారు. ఉజైర్ (అలైహిస్సలాం) నాశనమైన నగరాన్ని చూసి ఆశ్చర్యపోవడం, అల్లాహ్ ఆయనను 100 సంవత్సరాలు మృతునిగా ఉంచి తిరిగి లేపడం, ఆయన ఆహారం చెడిపోకుండా ఉండటం మరియు గాడిద ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోవడం వంటి దృష్టాంతాలను ఖురాన్ వాక్యాల (సూర బఖరా 2:259) ద్వారా వివరించారు. అలాగే, యూదులు ఉజైర్ (అలైహిస్సలాం) ను దైవ కుమారుడిగా భావించి చేసిన మార్గభ్రష్టత్వాన్ని ఖండిస్తూ (సూర తౌబా 9:30), మరణానంతర జీవితం, పునరుత్థానం, మరియు అల్లాహ్ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని ఈ ప్రసంగం ద్వారా బోధించారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనము ఒక ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణం ఇచ్చి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించాడు. ఎవరండీ ఆయన? ఆశ్చర్యకరంగా ఉంది కదా వింటూ ఉంటే. ఆయన మరెవరో కాదు ఆయనే ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారు.

ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో రెండు సూరాలలో వచ్చి ఉంది. ఒకటి సూర బఖరా రెండవ సూరా, రెండవది సూర తౌబా తొమ్మిదవ సూరా. ఈ రెండు సూరాలలో ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్తలలో ఒక ప్రవక్త.

ఆయన బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడే సరికి, బనీ ఇస్రాయీల్ ప్రజల్లోని అధిక శాతం ప్రజలు కనుమరుగైపోయారు లేదా బానిసత్వానికి గురైపోయారు. అల్-ఖుద్స్ నగరంలో, పాలస్తీనా దేశంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బనీ ఇస్రాయీల్ వారు మిగిలి ఉన్నారు. అంతే కాదండీ, వారు నివసిస్తున్న పట్టణము కూడా నేలమట్టం అయిపోయింది. వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ కూడా నేలమట్టం అయిపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, దాన్ని తెలుసుకోవడానికి బనీ ఇస్రాయీల్ వారి క్లుప్తమైన చరిత్ర మనము దృష్టిలో ఉంచుకోవాలి.

సులైమాన్ అలైహిస్సలాం వారి మరణానంతరం పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. సులైమాన్ అలైహిస్సలాం వారి సంతానంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయం కలిగింది. వారు ఎంతో పటిష్టంగా ఉన్న వారి సామ్రాజ్యాన్ని రెండు ముక్కలు చేసుకున్నారు. ఒక తమ్ముడు సగ భాగాన్ని, మరో తమ్ముడు సగ భాగాన్ని పంచుకొని, ఒక భాగానికి ‘ఇస్రాయీల్ రాజ్యం‘ అని పేరు పెట్టుకున్నారు, దానికి సామరియా రాజధాని అయ్యింది. మరో భాగానికి ‘యహూదా రాజ్యం’ అని పేరు పెట్టుకున్నారు, దానికి యెరూషలేము రాజధాని అయ్యింది.

అయితే ఆ తర్వాత ఇస్రాయీల్ లో ఉన్న బనీ ఇస్రాయీల్ ప్రజలు తొందరగా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు, ‘బాల్‘ అనే విగ్రహాన్ని ఆరాధించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడికి ప్రవక్తల్ని పంపించాడు. హిజ్కీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఇలియాస్ అలైహిస్సలాం వారు వచ్చారు, అల్-యస అలైహిస్సలాం వారు వచ్చారు. ప్రవక్తలు వచ్చి వారికి చక్కదిద్దేటట్టు ప్రయత్నం చేసినా, దైవ వాక్యాలు బోధించినా, అల్లాహ్ వైపు పిలిచినా, వారు మాత్రము పాపాలను వదలలేదు, విగ్రహారాధనను కూడా వదలలేదు, మార్గభ్రష్టులుగానే మిగిలిపోయారు.

చివరికి ఏమైందంటే, పక్కనే ఉంటున్న ఆషూరీయులు వచ్చి ఇస్రాయీల్ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయి ఉన్న ఆ రెండు రాజ్యాలలో నుంచి ఒక రాజ్యము ఆషూరీయుల చేతికి వెళ్ళిపోయింది.

అయితే ఆశూరీయులు మిగిలిన రెండవ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినా వారి పప్పులు ఉడకలేదు. ఎందుకంటే ఇక్కడ దైవభీతి మిగిలి ఉండింది కాబట్టి. కానీ కొద్ది రోజులు గడిచాక ఇక్కడ పరిస్థితులు కూడా మళ్ళీ మారిపోయాయి. ఇక్కడ ప్రజలు కూడా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు, పాపాల్లో మునిగిపోయారు. అలాంటప్పుడు ఇరాక్ దేశము నుండి, బాబిలోనియా నుండి నెబుకద్ నెజరు (అరబ్బీలో ‘బుఖ్తె నసర్‘) అనే రాజు సైన్యాన్ని తీసుకొని వచ్చి యహూదా దేశం మీద, రాజ్యం మీద దాడి చేశాడు. యుద్ధం ప్రకటించి బనీ ఇస్రాయీల్ వారిని ఊచకోత కోశాడు. అలాగే బనీ ఇస్రాయీల్ వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు, వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ ని కూడా నేలమట్టం చేసేశాడు. వారు ఎంతో గౌరవంగా చదువుకునే, ఆచరించుకునే పవిత్రమైన గ్రంథం తౌరాత్ ని కూడా అతను కాల్చేశాడు.

బనీ ఇస్రాయీల్ ప్రజల్ని అయితే ముందు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా హతమార్చాడు. తర్వాత ఎవరెవరైతే పనికొస్తారు అని అతను భావించాడో వారిని బానిసలుగా ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరితో అయితే నాకు అవసరం లేదులే వీళ్ళతో అని అనుకున్నాడో, అలాంటి వారిని మాత్రము అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మిత్రులారా! ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు, ముందు ఇస్రాయీల్ సామ్రాజ్యాన్ని ఆషూరీయుల చేతికి అప్పగించాల్సి వచ్చింది, యహూదా సామ్రాజ్యాన్ని నెబుకద్ నెజరు రాజుకి అప్పగించాల్సి వచ్చింది

ఆ ప్రకారంగా వారి రెండు రాజ్యాలు కూడా రెండు వేరు వేరు శత్రువులు లాక్కున్నారు. అలాగే జయించి వశపరచుకున్నారు. మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు పరాభవానికి గురి అయ్యి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు. ఎంతో కొంతమంది మాత్రమే అక్కడ మిగిలిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో, పట్టణము కూల్చబడి ఉంది, పుణ్యక్షేత్రము కూల్చబడి ఉంది, ప్రజలు కూడా చెల్లాచెదురైపోయి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు, ఎంతో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అలాంటి స్థితిలో ఉజైర్ అలైహిస్సలాం వారు వచ్చారు.

ఆయన మామూలుగా పొలం వద్ద పని కోసము గాడిద మీద కూర్చొని బయలుదేరి వెళ్లారు. వెళ్లి అక్కడ పొలం పనులన్నీ ముగించుకొని కొన్ని ద్రాక్ష పండ్లు, అలాగే అత్తి పండ్లు తీసుకొని మళ్ళీ అదే గాడిద మీద కూర్చొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. వస్తూ వస్తూ ఒకచోట లోయలోకి ప్రవేశించి కాసేపు నీడలో సేద తీరుదాము అని ఒక గోడ నీడలో లేదా ఒక చెట్టు నీడలో ఆయన కూర్చోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన వద్ద ఉన్న గాడిదను ఒకచోట కట్టేశారు.

తర్వాత నీడలో కూర్చొని ఆయన వద్ద ఉన్న ద్రాక్ష పండ్లను ముందుగా ఒక పాత్రలో పిండారు. ఆ ద్రాక్ష రసంలో కొన్ని రొట్టె ముక్కలు నాన్చడానికి ఉంచారు. ఆ రొట్టెలు నానే వరకు ఆయన గోడను లేదా చెట్టుని అలా వీపుతో ఆనుకొని, కంటి ముందర కనిపిస్తున్న దృశ్యాలను చూడసాగారు. ముందర పాడుబడిపోయిన పట్టణము, కూల్చబడిన పట్టణము, కూల్చబడిన పుణ్యక్షేత్రము అవి దర్శనమిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే, ఊహించని రీతిలో, అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే:

أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا
[అన్నా యుహ్ యీ హాజిహిల్లాహు బాద మౌతిహా]
దీని చావు తర్వాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు? (ఖుర్ఆన్, 2:259)

అంటే ఈ నగరం మొత్తం పాడుబడిపోయింది కదా, మళ్ళీ ప్రజల జీవనంతో ఈ నగరం కళకళలాడాలంటే ఇది సాధ్యమవుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తపరిచారు. అనుమానం వ్యక్తపరచలేదు, ఇది ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉజైర్ అలైహిస్సలాం వారు గొప్ప దైవభీతిపరులు, గ్రంథ జ్ఞానము కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అల్లాహ్ తో ఇది సాధ్యమేనా అని అనుమానము, సందేహము ఎప్పుడూ వ్యక్తపరచరు. అల్లాహ్ శక్తి మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆశ్చర్యం వ్యక్తపరిచారు – ఇది ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఇప్పట్లో ఇది అయ్యే పనేనా? అనేటట్టుగా ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆయన ఏ స్థితిలో అయితే నీడలో అలా వీపు ఆంచుకొని కూర్చొని ఉన్నారో, అదే స్థితిలో ఆయనకు మరణం ఇచ్చేశాడు. ఎన్ని సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు అంటే, వంద సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు.

فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ
[ఫ అమాతహుల్లాహు మిఅత ఆమిన్]
“అల్లాహ్ అతన్ని నూరేళ్ళ వరకు మరణ స్థితిలో ఉంచాడు.” (ఖుర్ఆన్, 2:259)

ఖురాన్ లో నూరేళ్ళ వరకు ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అదే స్థితిలో ఉంచాడు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.

అయితే 100 సంవత్సరాలు ఆయన అదే స్థితిలో ఉన్నారు కదా, మరి ఈ 100 సంవత్సరాలలో ఏమి జరిగిందంటే చాలా ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఏమి జరిగిందంటే, నెబుకద్ నెజరు బనీ ఇస్రాయీల్ వారి మీద దాడి చేసి, పుణ్యక్షేత్రం కూల్చేసి, గ్రంథము కాల్చేసి, బనీ ఇస్రాయీల్ వారిని పురుషుల్ని అలాగే మహిళల్ని బానిసలుగా మార్చి ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి పట్టుకెళ్లిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే…

పక్కనే ఉన్న పార్షియా దేశం (ఇరాన్ దేశం అని మనం అంటున్నాం కదా), ఆ పార్షియా దేశానికి చెందిన రాజు ఇరాక్ దేశం మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసి ఇరాక్ దేశాన్ని జయించేశాడు. ఇరాక్ దేశము ఇప్పుడు పార్షియా దేశ రాజు చేతికి వచ్చేసింది. ఆ పార్షియా దేశము (అనగా ఇరాన్ దేశపు రాజు) ఇరాక్ దేశాన్ని కూడా జయించిన తర్వాత, అక్కడ బానిసలుగా నివసిస్తున్న యూదులను స్వతంత్రులుగా చేసేసి, “మీరు మీ సొంతూరికి, అనగా పాలస్తీనా దేశానికి, అల్-ఖుద్స్ నగరానికి తిరిగి వెళ్లిపోండి” అని అనుమతి ఇచ్చేశాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 50-60 సంవత్సరాల తర్వాత ఆ రాజు ద్వారా బనీ ఇస్రాయీల్ ప్రజలకి మళ్ళీ బానిసత్వం నుండి స్వతంత్రం లభించింది. అప్పుడు వారందరూ కూడా స్వతంత్రులై బాబిలోనియా పట్టణాన్ని వదిలేసి, మళ్ళీ పాలస్తీనాలో ఉన్న అల్-ఖుద్స్ నగరానికి పయనమయ్యారు. అయితే ఈ 50-60 సంవత్సరాలలో వారు భాష మర్చిపోయారు, సంప్రదాయాలు మర్చిపోయారు, ధర్మ ఆదేశాలు కూడా చాలా శాతము మర్చిపోయారు. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ మళ్ళీ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగా కూల్చివేయబడిన ఆ పట్టణము, నగరము మళ్ళీ ప్రజల నివాసంతో కళకళలాడటం ప్రారంభించింది. ఇలా వంద సంవత్సరాల లోపు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్న తర్వాత, అప్పుడు రెండవసారి మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉజైర్ అలైహిస్సలాం వారికి మళ్ళీ బ్రతికించాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఆయన మరణించే సమయానికి ఆయన వయస్సు 40 సంవత్సరాలు ఉండింది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించబడుతున్నప్పుడు కూడా ఆయన 40 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా, అదే శక్తితో, అదే శరీరంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మళ్ళీ బ్రతికించాడు.

దూత వచ్చాడు. దూత వచ్చి ఆయనను లేపి:

قَالَ كَمْ لَبِثْتَ
[ఖాల కమ్ లబిస్త]
“నీవు ఎంత కాలం ఈ స్థితిలో ఉన్నావు?” అని అడిగాడు. (ఖుర్ఆన్, 2:259)

ఉజైర్ అలైహిస్సలాం వారు లేచి ముందు అటూ ఇటూ చూశారు. చూస్తే గాడిద కనిపించట్లేదు. గాడిద బంధించిన చోట పాడుబడిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. 100 సంవత్సరాలు గడిచిన విషయం ఆయనకు తెలియదు. ఈ 100 సంవత్సరాలలో గాడిద చనిపోయింది, ఎముకలు కూడా పాడుబడిపోయాయి, కొన్ని పాడుబడిన ఎముకలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉంచబడిన ద్రాక్ష రసంలో ఉంచబడిన రొట్టె ముక్కలు, అవి మాత్రము తాజాగా అలాగే ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఆహారాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడే కొద్దిసేపు ఏమో నేను అలా పడుకొని లేచానేమో అనిపిస్తూ ఉంది. గాడిదను చూస్తూ ఉంటే అసలు గాడిద కనిపించట్లేదు. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నారంటే:

لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ
[లబిస్తు యౌమన్ ఔ బాద యౌమ్]
“ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను” అని చెప్పారు. (ఖుర్ఆన్, 2:259)

ఆహారాన్ని చూసి ఆయన ఆ విధంగా అనుమానించారు. అయితే దూత వచ్చి:

بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ
[బల్ లబిస్త మిఅత ఆమ్]
“కాదు, నీవు ఈ స్థితిలో వంద సంవత్సరాలు ఉన్నావయ్యా” (ఖుర్ఆన్, 2:259)

అని చెప్పి, “చూడండి మీ గాడిద మరణించి ఎముకలు ఎముకలైపోయింది. మీ కళ్ళ ముందరే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని మళ్ళీ బ్రతికిస్తాడు చూడండి” అని చెప్పగానే, అల్లాహ్ నామంతో పిలవగానే ముందు ఎముకలు తయారయ్యాయి. ఎముకలు జోడించబడ్డాయి. ఆ ఎముకల మీద మాంసము జోడించబడింది. ఆ తర్వాత దానికి ప్రాణము వేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఉజైర్ అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే ఎముకలుగా మారిపోయిన ఆ గాడిద మళ్ళీ జీవించింది. అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు అదంతా కళ్ళారా చూసి వెంటనే ఈ విధంగా పలికారు:

قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
[ఖాల ఆలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్]
“అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని ఉజైర్ అన్నారు. (ఖుర్ఆన్, 2:259)

ఈ ప్రస్తావన మొత్తము ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము 259వ వాక్యంలో వివరంగా తెలుపబడి ఉంది.

సరే, 100 సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికారు, పట్టణం ప్రజలతో కళకళలాడుతూ ఉంది, పట్టణం పూర్తిగా మళ్ళీ నిర్మించబడి ఉంది, పుణ్యక్షేత్రము కూడా మళ్ళీ నిర్మించబడి ఉంది. గాడిద మీద కూర్చొని ఆయన పట్టణానికి వెళ్లారు.

పట్టణానికి వెళ్ళినప్పుడు చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన మరణించేటప్పుడు ఆయన ఇంటిలో ఒక సేవకురాలు ఉండేది, అప్పుడు ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన 100 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారంటే ఆవిడ వయస్సు ఎంత అయి ఉంటుందండి? 20 + 100, కలిపితే 120 సంవత్సరాలకు చేరుకొని ఉంది. ఆవిడ పూర్తిగా ముసలావిడగా మారిపోయి, వృద్ధాప్యానికి గురయ్యి, కంటిచూపు దూరమైపోయింది, కాళ్ళు కూడా పడిపోయి ఉన్నాయి. ఆవిడ ఒక మంచానికే పరిమితమైపోయి ఉంది.

ఆవిడ వద్దకు ముందు ఉజైర్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. వెళ్లి “అమ్మా నేను ఉజైర్ ని” అంటే, ‘ఉజైర్’ అన్న పేరు వినగానే ఆవిడ బోరున ఏడ్చేసింది. “ఎన్నో సంవత్సరాల క్రితము మా యజమాని ఉండేవారు” అని ఏడుస్తూ ఉంటే, “అమ్మా నేనే మీ యజమాని ఉజైర్ ని” అని చెప్పారు. అప్పుడు ఆ మహిళ, “అరె! 100 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు నా యజమాని అంటున్నారు, ఎలాగండి నేను నమ్మేది? ఉజైర్ గొప్ప భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా ఆమోదించేవాడు. మీరు ఉజైర్ అయితే, నాకు కంటిచూపు మళ్ళీ రావాలని, అలాగే చచ్చుబడిపోయిన నా కాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా మారాలని దుఆ చేయండి” అని కోరారు.

ఉజైర్ అలైహిస్సలాం వారు దుఆ చేశారు. దుఆ చేయగా ఆవిడకు కంటిచూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరిగి ఇచ్చేశాడు, ఆవిడ కాళ్ళు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ నయం చేసేశాడు. అప్పుడు ఆవిడ లేచి, ఉజైర్ అలైహిస్సలాం వారిని చూసి, చెయ్యి పట్టుకొని, “నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈయనే ఉజైర్ అలైహిస్సలాం” అని సాక్ష్యం ఇచ్చారు.

తర్వాత “రండయ్యా మీ ఇంటిని చూపిస్తాను, మీ కుటుంబీకుల్ని చూపిస్తాను” అని ఉజైర్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని ఉజైర్ అలైహిస్సలాం వారి ఇంటికి వెళితే, అప్పుడు కుటుంబ సభ్యులలో ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారులు ఉన్నారు. వారి వయస్సు కూడా 100 దాటిపోతూ ఉంది. ఉజైర్ అలైహిస్సలాం వారిని ఇంటి బయట నిలబెట్టి, ఆవిడ ఇంటిలోనికి ప్రవేశించి ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారుల వద్దకు వెళ్లి, “మీ నాన్నగారు వచ్చారు” అంటే వారందరూ షాక్ అయ్యారు. అవాక్కయిపోయారు. “అదేమిటి 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కనుమరుగైపోయిన మా తండ్రి ఇప్పుడు తిరిగి వచ్చారా ఇంటికి?” అని వారు షాక్ అయిపోతూ ఉంటే, “అవునండీ, చూడండి నాకు కంటిచూపు ఉండేది కాదు, నాకు కాళ్ళు కూడా చచ్చుబడిపోయి ఉండేవి. కానీ ఆయన వచ్చి ప్రార్థన చేయగా నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కంటిచూపు ఇచ్చాడు, కాళ్ళను నయం చేశాడు. నేను మళ్ళీ ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. చూడండి బయట ఉన్నారు” అని చెప్పగానే, వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించగా, ముందుగా కుమారులు ఆశ్చర్యపడ్డారు.

సందేహం వ్యక్తపరుస్తూ ఒక కుమారుడు ఏమన్నాడంటే, “చూడండి మా నాన్నగారికి భుజం పక్కన మచ్చ లాంటి ఒక గుర్తు ఉండేది, అది ఉందేమో చూడండి” అన్నారు. ఉజైర్ అలైహిస్సలాం వారు బట్టలు కొంచెం పక్కకు జరిపి చూపియగా, అక్కడ నిజంగానే ఆ మచ్చ లాంటి గుర్తు కనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులు ఉజైర్ అలైహిస్సలాం వారిని “ఈయనే మా తండ్రి” అని గ్రహించారు.

అయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఉజైర్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 సంవత్సరాల వ్యక్తి లాగే సిద్ధం చేశాడు. వారి కుమారులు మాత్రము 100 సంవత్సరాలు చేరుకున్న వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలా సంఘటన జరిగిన తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు మళ్ళీ నగరంలోకి వచ్చారు, నగర ప్రజల్ని ప్రోగు చేశారు. ప్రోగు చేసి “ఎవరెవరికి తౌరాత్ గ్రంథంలోని వాక్యాలు కంఠస్థమై ఉన్నాయో, ఎన్ని కంఠస్థమై ఉంటే వారు వచ్చి నాకు వినిపించండి” అని పిలుపునిచ్చారు. ఎవరెవరికి ఎన్ని వాక్యాలు కంఠస్థం చేయబడి ఉన్నాయో వారందరూ వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారికి వారు కంఠస్థం చేసిన ఆ తౌరాత్ గ్రంథంలోని దైవ వాక్యాలు వినిపించారు.

అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు ఒక చెట్టు నీడలో కూర్చొని, ఇతర వ్యక్తుల నోట విన్న వాక్యాలు, ఆయన స్వయంగా కంఠస్థం చేసిన వాక్యాలు అన్నీ కూడా మళ్ళీ రచించారు. ఆ ప్రకారంగా మళ్ళీ తౌరాత్ గ్రంథం (నెబుకద్ నెజరు రాజు దాన్ని కాల్చేసి వెళ్లిపోయాడని చెప్పాము కదా), ఆ కాలిపోయి కనుమరుగైపోయిన తౌరాత్ గ్రంథంలోని వాక్యాలను, ఎవరెవరు ఎంత కంఠస్థం చేసి ఉన్నారో అన్ని వాక్యాలు మళ్ళీ తిరిగి ఉజైర్ అలైహిస్సలాం వారు రచించారు. రచించి ప్రజలకు గ్రంథము ఇవ్వడంతో పాటు ఆ గ్రంథంలోని వాక్యాలు, వాటి సారాంశము ప్రజలకు బోధించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు అంటే, చరిత్రలో ప్రామాణికమైన ఆధారాలు మనకు ఎక్కడా దొరకలేదు. ఆయన మాత్రము మరణించారు. ఎప్పుడు మరణించారు? ఎన్ని సంవత్సరాల వయసులో మరణించారు? ఏ విధంగా ఆయన మరణం సంభవించింది? అన్న వివరాలు మాత్రము ప్రామాణికమైన ఆధారాలలో మనకు ఎక్కడా దొరకలేదు. అయితే ఆయన సమాధి మాత్రము ‘డమస్కస్’ నగరంలో నేటికీ ఉంది అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ఉజైర్ అలైహిస్సలాం వారు జీవించినన్ని రోజులు ప్రజలు ఆయనను ఒక బోధకునిగా గౌరవించారు. ఆయన మరణించిన తర్వాత… ఆయన 100 సంవత్సరాలు మరణించి మళ్ళీ జీవించారన్న ఒక అభిప్రాయం ఉండేది, ఆయన దుఆతో ప్రజల సమస్యలు తీరాయని మరొక అభిప్రాయం ఉండేది, అలాగే ఆయన గ్రంథాన్ని రచించి ప్రజలకు వినిపించారు, ఇచ్చారు అనే మరో అభిప్రాయం ఉండింది. ఇలా అనేక అభిప్రాయాల కారణంగా ఉజైర్ అలైహిస్సలాం వారి గౌరవంలో బనీ ఇస్రాయీల్ ప్రజలు హద్దు మీరిపోయారు. ఆ గౌరవంలో, అభిమానంలో ఏకంగా ఉజైర్ అలైహిస్సలాం వారిని “దైవ కుమారుడు” అని చెప్పటం ప్రారంభించారు. తర్వాత అదే వారి విశ్వాసంగా మారిపోయింది, “ఉజైర్ దైవ కుమారుడు” అని నమ్మటం ప్రారంభించారు. వారి ఈ నమ్మకం సరికాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం, 30వ వాక్యంలో స్పష్టంగా ఖండించి ఉన్నాడు.

وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులు అంటున్నారు. “మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకులలోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారో చూడండి. (ఖుర్ఆన్, 9:30)

అంటే ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు నమ్ముతున్న నమ్మకాన్ని ఖండిస్తూ, ఇది నిజము కాదు, వారు కల్పించుకున్న కల్పితాలు మాత్రమే, వారి నోటి మాటలు మాత్రమే అని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

ఉజైర్ అలైహిస్సలాం వారి గురించి ఒక హదీసులో పరోక్షంగా ప్రస్తావన వచ్చి ఉంది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక హదీసు ఉందండి. ఆ హదీసు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

‘పూర్వము ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన వెళుతూ ఉంటే ఒకచోట కూర్చున్నప్పుడు, ఆయనకు ఒక చీమ కరిచింది. చీమ కరిచినప్పుడు ఆయన కోపగించుకొని, కోపంతో చీమ పుట్టను త్రవ్వేసి, ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశారు.వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ప్రవక్త వద్దకు వహీ (దైవవాణి) పంపించాడు. ‘నీకు హాని కలిగించింది, నీకు కుట్టింది ఒక చీమ కదా. నీకు కోపం ఉంటే ఒక చీమను చంపుకోవాలి. కానీ, పూర్తి పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేయటము, కాల్చేయటం ఏమిటి?’ అని ఒక ఉల్లేఖనంలో ఉంది.

మరో ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: ‘నీకు ఒక్క చీమ కుట్టిందన్న సాకుతో, నీవు ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశావు. వాస్తవానికి ఆ సమూహము అల్లాహ్ ను స్మరించేది (తస్బీహ్ చేసేది). అల్లాహ్ ను స్మరించే ఒక సమూహాన్ని ఒక్క చీమ కుట్టిన కారణంగా నీవు దహనం చేశావేమిటి?’ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆక్షేపించాడు.’

మరి ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది అంటే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు హసన్ బస్రీ రహిమహుల్లా వారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఉజైర్ అలైహిస్సలాం ఏ కాలానికి చెందిన వారు అంటే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, సులైమాన్ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం వీరిద్దరి మధ్యలో వచ్చిన ప్రవక్త. అలాగే మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారు అంటే, ఉజైర్ అలైహిస్సలాం వారు ప్రవక్త కాదు, ఆయన గొప్ప భక్తుడు, గ్రంథ జ్ఞాని అని అంటున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఇది ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర. ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము గ్రహించాల్సిన పాఠాలు ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని మాటను ముగిస్తాను.

1. అల్లాహ్ మృతులను తిరిగి బ్రతికించగలడు:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మృతులను మళ్ళీ బ్రతికించేవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్న విషయం ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు 100 సంవత్సరాల కోసము మరణించి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అల్లాహ్ ఆజ్ఞతో జీవించబడ్డారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. చూసారా? మొదటిసారి ప్రాణం పోసిన ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయనకు 100 సంవత్సరాల కోసం మరణం ఇచ్చి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు బ్రతికించి ప్రాణం పోసి నిలబెట్టాడు. కాబట్టి మానవులను మళ్ళీ పుట్టించగల శక్తి అల్లాహ్ కు ఉంది అని ఈ ఉజైర్ అలైహిస్సలాం వారి ద్వారా మనకు స్పష్టం చేయబడింది.

ఖురాన్ గ్రంథం 36వ అధ్యాయం, 78-79 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ * قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ

“కుళ్లి కృశించి పోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు (మానవుడు) సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు, “వాటిని తొలిసారి సృష్టించినవాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.” (ఖుర్ఆన్, 36:78-79)

తొలిసారి పుట్టించిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మలిసారి కూడా పుట్టించగలుగుతాడు, ఆయనకు అలా చేయటం చాలా సులభం అని తెలుపబడటం జరిగింది. ఖురాన్ లో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో, “నీవు మరణించిన వారిని మళ్ళీ ఎలా బ్రతికిస్తావు?” అని అడిగినప్పుడు, పక్షుల్ని తీసుకొని వాటి ఎముకల్ని అటూ ఇటూ పడవేయ్యండి, తర్వాత అల్లాహ్ పేరుతో పిలవండి, అవి మళ్ళీ బ్రతికి వస్తాయి అని చెప్పగా, ఆయన అలాగే చేశారు. అల్లాహ్ పేరుతో పిలవగానే ఎముకలుగా మార్చబడిన ఆ పక్షులు మళ్ళీ పక్షుల్లాగా జీవించి ఎగురుకుంటూ ఆయన వద్దకు వచ్చాయి.

అలాగే హిజ్కీల్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 35 వేల మంది లోయలో మరణించారు. ప్రవక్త కళ్ళ ముందరే మళ్ళీ వారు బ్రతికించబడ్డారు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 70 మంది బనీ ఇస్రాయీల్ తెగకు చెందిన నాయకులు పర్వతం మీద మరణించారు. తర్వాత మూసా అలైహిస్సలాం దుఆతో వాళ్ళు మళ్ళీ బ్రతికించబడ్డారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారు, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడతారు అన్న కొన్ని ఉదాహరణలు తెలియజేసి ఉన్నాడు. అలాగే గుహవాసులు, ‘అస్ హాబుల్ కహఫ్’ అని మనం అంటూ ఉంటాం. వారిని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందు మరణం ప్రసాదించి, తర్వాత మళ్ళీ జీవించేలాగా చేశాడు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేసి ఉన్నాడు.

ఆ ఉదాహరణల ద్వారా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు అని స్పష్టంగా, ఉదహరించి మరీ నిజమైన ఆధారాలతో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విశ్వాసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు, మళ్ళీ బ్రతికించగలుగుతాడు అని నమ్మాలి, విశ్వసించాలి.

2. సమాజ సంస్కరణ బాధ్యత:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మరొక విషయం, సమాజ సంస్కరణకు కృషి చేయాలి. ఉజైర్ అలైహిస్సలాం వారు రెండవసారి లేపబడినప్పుడు, ప్రజల వద్దకు వెళ్లి దైవ వాక్యాలు రచించి, ప్రజలకు అందజేయడంతో పాటు బోధించారు. సమాజాన్ని సంస్కరించారు, ప్రజలను సంస్కరించారు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేయాలి. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజమైన మనకు “ఉత్తమ సమాజం” అని బిరుదు ఇస్తూ, “మీరు మంచిని బోధిస్తారు, చెడును నిర్మూలిస్తారు” అని బాధ్యత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజ సంస్కరణ కోసము కృషి చేయాలన్న విషయం ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి.

3. మరణానంతర జీవితం:

మరణానంతరం జీవితం ఉంది అన్న విషయం కూడా ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు మరణించారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. అదే విధంగా పుట్టిన తర్వాత మరణించిన ప్రతి మనిషిని పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బ్రతికిస్తాడు. అక్కడ లెక్కింపు ఉంటుంది, చేసిన కర్మలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ లెక్క తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరణానంతర జీవితం ఉంది అని స్పష్టపరచడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ప్రజలకు కొన్ని ఉదాహరణలు ప్రపంచంలోనే చూపించి ఉన్నాడు. మరణించిన వాడు మరణించాడు, ఇక మట్టిలో కలిసిపోయాడు అంతే, ఆ తర్వాత మళ్ళీ జీవితం అనేది లేదు అని భ్రమించే వారికి, చూడండి మరణించిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ లేపుతాడు అని ఇక్కడ కొంతమందిని లేపి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రకారంగా మరణానంతర మరొక జీవితం ఉంది అన్న విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రతి విశ్వాసి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

4. సృష్టి యావత్తు అల్లాహ్ ను స్తుతిస్తుంది:

అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి. చీమల గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమన్నారంటే, “అవి అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. అల్లాహ్ ను స్తుతించే చీమలని మీరు దహనం చేసేసారు ఏమిటి?” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ ఆ ప్రవక్తను నిలదీశాడు అంటే, చీమలు సైతం అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. ఉత్తమ జీవులైన మానవులు మరీ ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి, అల్లాహ్ ను స్మరిస్తూ ఉండాలి.

ఖురాన్ గ్రంథం 62వ అధ్యాయం, 1వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు:

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
[యుసబ్బిహు లిల్లాహి మాఫిస్ సమావాతి వమా ఫిల్ అర్జ్]
“భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి.” (ఖుర్ఆన్, 62:1)

భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ ను స్తుతిస్తూ ఉంది, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంది, అల్లాహ్ ను స్మరిస్తూ ఉంది. కాబట్టి మానవులు కూడా అల్లాహ్ ను స్తుతిస్తూ, అల్లాహ్ ను స్మరిస్తూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఎవరైతే అల్లాహ్ ను స్తుతిస్తారో వారు ఇహపర సాఫల్యాలు మరియు అనుగ్రహాలు పొందుతారన్న విషయం కూడా తెలియజేయడం జరిగింది.

5. అగ్నితో శిక్షించే అధికారం:

చివర్లో ఒక విషయం ఏమిటంటే, అగ్నితో శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన (పూర్వం ఒక ప్రవక్త) చీమ కుట్టింది అని చీమలను కాల్చేశాడు. కాల్చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఎందుకు వారిని కాల్చింది? కుట్టింది ఒక చీమే కదా. ఆ ఒక చీమని కావాలంటే మీరు చంపుకోవాలి గాని, మొత్తం చీమలను దహనం చేశారు ఏమిటి?” అని నిలదీశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారు అంటే:

“నిశ్చయంగా, అగ్నితో శిక్షించే అధికారం అగ్నిని సృష్టించిన ప్రభువు (అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా) కు మాత్రమే ఉంది” అన్నారు. (అబూ దావూద్). మరొక ఉల్లేఖనంలో, “అగ్నితో శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదు అల్లాహ్ కు తప్ప” అన్నారు (బుఖారీ). అంటే అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ అగ్నితో శిక్షించే అధికారం లేదు.

ఇవి ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనకు బోధపడిన కొన్ని విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మిమ్మల్ని అందరినీ అన్న విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

2:259 أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఉజైర్ (అలైహిస్సలాం)
(వందేళ్ళు నిద్రపోయిన మనిషి)
(500-400 క్రీ.పూ.)

ఉజైర్ (అలైహిస్సలాం) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళకళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మపైకి కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, విసనకర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లతెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దాని పై కూర్చుని వెళ్ళిపోయారు.

దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారితప్పి తనను ఎటో తీసుకు పోవడాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనల నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుపడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థిపంజరాలు చెల్లాచెదరుగా పడఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందర వందరగా పడి ఉన్నాయని గ్రహించారు.

ఆయన గాడిదపై నుంచి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు అనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.

అలా రోజులు గడచపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలసపోయాయి. ఉజైర్ (అలైహిస్సలాం) నిద్రలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా తరాలు గడచిపోయాయి. జాతులు అంతరించాయి. కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి.

అల్లాహ్ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించక పోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశ హరులైన ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అంద జేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం. అందుకుగాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవదూతలు వచ్చేవారు. స్వర్గనరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతరం జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.

ఉజైర్ (అలైహిస్సలాం) తన దీర్ఘనిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయ్యింది. ఆయన నిద్ర పోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్తో దైవదూత, “ఎంతకాలం నిద్రపోయానని భావిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉజైర్ (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను” అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, “కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగునీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు.. అల్లాహ్ మహత్యాన్ని చూడు..మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బతికిస్తాడో అర్థం చేసుకో.. దీన్ని నీ ప్రభువు తరపు నుంచి నిదర్శ నంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో” అన్నాడు.

ఉజైర్ (అలైహిస్సలాం) చూస్తుండగానే గాడిద అస్థిపంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా, “అల్లాహ్ ఏమైనా చేయగల శక్తి కలిగినవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.

ఉజైరు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమె కళ్ళు కనబడడం లేదు. కాని ఆమె జ్ఞాపకశక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్నపిల్ల. ఆయన ఆమెతో, “ఇది ఉజైర్ ఇల్లేనా” అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ, “అవును” అంది. ఆమె దుఃఖంతో, “ఉజైర్ ఇల్లు వదలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు” అంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెతో, “నేనే ఉజైర్. అల్లాహ్ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్ర పోయాను. అల్లాహ్ నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు” అన్నారు.

ఈ మాటలు విని ఆ వృద్ధమహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాస్సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత, “ఉజైర్ (అలైహిస్సలాం) చాలా ధర్మాత్ముడు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్అ యితే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటిచూపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు” అని అడిగింది.

ఉజైర్ (అలైహిస్సలాం) అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించాడు. ఆ వృద్ధమహిళకు ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటిచూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్ పిల్లలు, మనుమలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్ని చూసి ఆయన తమకు తాతగారని వారు నమ్మలేకపోయారు. “ఇది నిజమా!” అని గుసగుసలాడు కోసాగారు. ప్రస్తుతం ముసలివాడై పోయిన ఉజైర్ కొడుకు ఒకరు “నా తండ్రికి భుజంపై ఒక పుట్టుమచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టుమచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టుమచ్చ చూపించండి” అని ప్రశ్నించాడు. ఉజైర్ తన భుజంపై ఉన్న పుట్టుమచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, “జెరుసలేమ్ను బుఖ్స్సర్ ఆక్రమించుకుని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి” అనడిగాడు. ఉజైర్ తౌరాత్ మొత్తం పఠించి వినిపించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు. నిజంగా ఉజైర్ (అలైహిస్సలాం) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.

ఆ పిదప యూదులు, “అల్లాహ్ ఉజైర్ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్లాహ్ కుమారుడై ఉండాలి” అనడం ప్రారంభించారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 9:30, 2:259)

9:30 وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్‌ అల్లాహ్‌ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్‌ (ఏసు క్రీస్తు) అల్లాహ్‌ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్‌ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?

సాధారణంగా మనిషి కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్ తిరిగి రావడం అల్లాహ్ చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17430

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకరియ్యా (అలైహిస్సలాం) జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం ఇక్కడ వినండి :
జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర
: https://youtu.be/DftBKf6r4MA

జకరియ్యా (అలైహిస్సలాం) జీవిత పాఠాలు – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర (Seerah of Zakariyyah & Yahya alaihimassalam) [వీడియో]

బిస్మిల్లాహ్
జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర (Seerah of Zakariyyah & Yahya alaihimassalam) త్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త షమ్ వీల్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర & జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం

ప్రవక్త షమ్ వీల్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రెండవ భాగం

ప్రవక్త షమ్ వీల్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్

పోయిన వారం మనం ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర విన్నాము, ఈ క్రింది వీడియోలో వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్”

ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త ﷺ పెద్ద మనవడు – హసన్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర (Seerat of Hasan Ibn Alee) [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రవక్త ﷺ పెద్ద మనవడు – హసన్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర (Seerat of Hasan Ibn Alee) – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర (Yusha’ bin Nun) [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రవక్త యూషా బిన్ నూన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర ( Yusha’ bin Nun – Joshua) – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలుత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్
సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం)
(970-931 క్రీ.పూ.)

“చివరకు సులైమాన్ సైన్యమంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: “ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి.” ” (ఖుర్ఆన్ 27: 18)

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వివేకం మూర్తీభవించిన పాలకులు. ఆయన కుమారుడు సులైమాన్ మరింత తెలివి, వివేకసంపద కలిగినవారు. ఆయన చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే తెలివితేటలు, వివేక విచక్షణలు ప్రదర్శించారు. రాజ దర్బారులో వివాదాల, ఫిర్యాదుల తీర్పులు జరుగుతున్నప్పుడు ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన కుమారుణ్ణి కూడా దర్బారులో పిలిచి కూర్చుండబెట్టేవారు.

ఒకసారి ఒక రైతు ఓ ఫిర్యాదు తీసుకుని వచ్చాడు. ఆ రైతు తన పొలంలో గోధుమ, మొక్కజొన్న పండించే వాడు. పొలంలో ఫలవృక్షాలు కూడా ఉండేవి. ఈ రైతుకు పొరుగున మరో వ్యక్తి ఉన్నాడు. ఈ పొరుగు వ్యక్తి గొర్రెలు పెంచేవాడు. రైతు పొలంలో పంట బాగా ఏపుగా పెరిగినప్పుడు పొరుగువాని గొర్రెలు పొలంలో పడి పంట మొత్తం ఆగం చేసి వెళ్ళేవి. ఈ వివాదం దర్బారుకు వచ్చింది. పొరుగువాడు రైతు చేసిన ఫిర్యాదు నిజమేనని ఒప్పుకున్నాడు. ఇద్దరి వాంగ్మూలాలు విన్న తర్వాత ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పు చెబుతూ, రైతుకు జరిగిన నష్టానికిగాను పొరుగు వ్యక్తి తన గొర్రెలను రైతుకు ఇచ్చి నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. తన గొర్రెలు విచ్చలవిడిగా తిరగడానికి వదలి వేసిన పొరుగువాడు ఈ విధంగా గుణపాఠం కూడా నేర్చుకుంటాడని దావూద్ (అలైహిస్సలాం) అన్నారు. అప్పటికి సులైమాన్ వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే. ఆయన ఈ తీర్పు విని లేచి నిలబడి మాట్లాడడానికి తండ్రి అనుమతి కోరారు. తండ్రి ఆయనకు అనుమతి ఇచ్చారు. సులైమాన్ మాట్లాడుతూ తాను ఈ తీర్పుతో ఏకీభవించడం లేదని, ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉందని అన్నారు. బాల సులైమాన్ ధైర్యంగా చెప్పిన ఈ మాటలు విని పూర్తి దర్బారు నిర్ఘాంతపోయింది. దర్బారులో గుసగుసలు వ్యాపించాయి. దావూద్ ప్రవక్త చిరునవ్వుతో తన కుమారుడిని చూస్తూ ఈ వివాదానికి నీ తీర్పు ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు సులైమాన్ మాట్లాడుతూ, గొర్రెలను కొంతకాలం వరకు రైతుకు అధీనం చేయాలని, ఆ విధంగా రైతు వాటి ఉత్పత్తుల ద్వారా అంటే పాలు, ఉన్ని, వగైరాలతో లాభం పొంది తన నష్టాన్ని పూడ్చుకుంటాడని, ఈ లోగా గొర్రెల యజమాని ఒక సంవత్సరం పాటు రైతు పొలాన్ని సాగుచేసి పంట పండించి పంట కోయకుండా రైతుకు అప్పగించాలని, రైతు తన అధీనంలో ఉన్న గొర్రెలను, ఎన్ని గొర్రెలయితే పొరుగువాడు తన అధీనం చేశాడో అన్ని గొర్రెలను తిరిగి అతనికి అప్పగించాలని, వాటికి పుట్టిన గొర్రెపిల్లలను ఇవ్వనవసరం లేదని అన్నారు. ఈ విధంగా గొర్రెల యజమాని నిర్లక్ష్యానికి తగిన శిక్ష కూడా పడుతుందని, అతను ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పొలంలో పని చేసి పంట పండించి రైతుకు అప్ప గించవలసి ఉంటుందని, అలాగే అతను పూర్తిగా తన గొర్రెలను కోల్పోయే పరిస్థితి కూడా ఉండదని చెప్పారు. పంట సిద్ధంగా ఉన్న పొలాన్ని అతను అప్పగించిన తర్వాత రైతు దానిని కోసుకోవచ్చు. ఈ తీర్పును రాజదర్బారు నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది.

రాజు దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పును ఉపసంహరించుకుంటున్నానని, తన కుమారుని తీర్పును అమలు చేయాలని ఆదేశించారు. కుమారుని తీర్పు నిష్పక్ష పాతంగా, న్యాయసమ్మతంగా, వివేకవంతంగా, తన తీర్పు కన్నా ఉత్తమంగా ఉందని ప్రకటించారు. రైతు, గొర్రెల యజమాని ఇద్దరూ కూడా తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి దివ్యఖుర్ఆన్ : 21:78-82)

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తర్వాత తన కుమారుడు సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించారు. కాని దావూద్ (అలైహిస్సలాం) గారి మరో కుమారుడు అబ్సాలోమ్ పెద్దవాడు. పెద్దవాడయినప్పటికీ రాజబాధ్యతలు నిర్వర్తించే యోగ్యతలు అతనికి లేవు. తన తండ్రి సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించడం అబ్సాలోమ్ కు నచ్చలేదు. అతనిలో ఈర్ష్యాద్వేషాలు బుసలు కొట్టాయి. ఎలాగైనా రాజ సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని అతను కుట్రపన్నాడు.

ముందుగా అతడు ప్రజలను మభ్యపుచ్చి తన పక్షానికి వచ్చేలా చేయాలనుకున్నాడు. ప్రజలను తన వైపు త్రిప్పుకోవడానికి ఒక పథకం వేశాడు. ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి సులైమాన్ దర్బారుకు వస్తున్నప్పుడు వారిని అక్కడకు వెళ్ళకుండా అడ్డుకుని తన వద్దకు వచ్చేలా చేశాడు. ఆ విధంగా తాను చాలా వివేకవంతుడినన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించాడు. ఆ పిదప తన కుట్రకు పనికివచ్చే కొంతమంది దుర్మార్గులను తన అనుచరులుగా చేర్చుకున్నాడు. ఒక రోజు అతను తన తండ్రితో గిబియన్ పట్టణానికి వెళ్తాను అనుమతించమని కోరాడు. గిబియన్ పట్టణంలో తాను చేయవలసిన పని ఉందని సాకులు చెప్పాడు. తనతో పాటు తన అనుచరులను తీసుకుని వెళ్ళాడు. గిబియన్ పట్టణానికి వెళ్ళిన వెంటనే బనీ ఇస్రాయీల్లోని వివిధ తెగలకు రహస్య సందేశాలు పంపాడు. నగారా శబ్దం వినగానే తనను రాజుగా ప్రకటించాలని వారందరికీ సూచనలు పంపించాడు. కాని దావూద్ (అలైహిస్సలాం) పట్ల విశ్వాసం కలిగిన ప్రజలు ఈ ఆదేశాన్ని లక్ష్యపెట్టలేదు. అబ్సాలోమ్ అనుచరులకు, వివిధ తెగలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. జెరుసలేమ్ పట్టణం దాదాపుగా నాశనం అయ్యింది.

తన కుమారుని ద్రోహం గురించి దావూద్ ప్రవక్తకు తెలిసింది. తన స్వంత కుమారుడు ఇలా వ్యవహరించాడని తెలిసి ఆయన చాలా బాధకు గురయ్యారు. అయినా ఆయన సంయమనాన్ని కోల్పోలేదు. తన రాజ్యంలో రక్తపాతాన్ని ఆయన ఇష్టపడలేదు. అబ్సాలోమ్ పట్టణాన్ని బలవంతంగా వశపరచుకోవచ్చని ఆయన భయపడ్డారు. అందువల్ల ఆయన తన వారికి వెంటనే పట్టణాన్ని వదిలి వేయాలని సందేశం పంపించారు. హాని కలుగకముందే అక్కడి నుంచి తప్పించుకొమ్మని చెప్పారు. చాలా మంది పట్టణాన్ని వదలి జోర్డాన్ నదిని దాటి వచ్చేశారు. దావూద్ (అలైహిస్సలాం) ఆలివ్ కొండను ఎక్కి అల్లాహ్ ను ప్రార్థించారు. ప్రజలను ఈ ప్రమాదం నుంచి కాపాడమని వేడుకున్నారు. కొంతమంది ప్రజలు తమ దుస్థితికి రాజుగారే కారణమని విమర్శించారు. కాని చాలా మంది దావూద్ పక్షాన విశ్వాసంగా నిలబడ్డారు. ఆయన వారితో, “నా స్వంత కుమారుడు నాకు ద్రోహం చేసినప్పుడు పరులు నాకు వ్యతిరేకమయ్యారని నేను ఎలా చెప్పగలను” అన్నారు.

దావూద్ (అలైహిస్సలాం) కొందరు అధికారులను అక్కడికి పంపి పరిస్థితి చక్క దిద్దమన్నారు. అబ్సాలోమ్కు ఎలాంటి హాని చేయవద్దని వారిని ఆదేశించారు. దావూద్ (అలైహిస్సలాం) పంపిన అధికారులు కఠినంగా అక్కడి తిరుగుబాటును అణచి వేశారు ఈ పోరాటంలో అబ్సాలోమ్ హతమయ్యాడు. జెరుసలేమ్ మళ్ళీ శాంతిభద్రతలు పునరుద్ధరించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) రాజుగా పరిపాలించడం కొనసాగింది.

తన తండ్రి మరణానంతరం సులైమాన్ (అలైహిస్సలాం) రాజుగా పాలనాపగ్గాలు చేపట్టారు. తన రాజ్యం వంటి మరో రాజ్యం లేనంత చక్కగా పాలించే అనుగ్రహం ప్రసాదించాలని ఆయన అల్లాహ్ ను ప్రార్థించారు. అల్లాహ్ ఆయన కోరికను మన్నించాడు. సులైమాన్ (అలైహిస్సలాం) మహావివేకవంతుడు మాత్రమే కాదు, అల్లాహ్ ఆయనకు అనేక వరాలు ప్రసాదించాడు. ఆయన గాలులను తన అదుపులో ఉంచుకోగలిగేవారు. పశుపక్ష్యాదులతో మాట్లాడగలిగేవారు. భూగర్భంలో ఉన్న ఖనిజాలను త్రవ్వి బయటకు తీసి వాటితో ఉపకరణాలు, ఆయుధాలు తయారు చేసే విద్యను మనుష్యులకు, జిన్నాతులకు (అగ్నితో సృష్టించబడిన బుద్ధిజీవులైన ప్రాణులకు) నేర్పాలని అల్లాహ్ ఆయనకు ఆదేశించాడు. అల్లాహ్ ఆయనకు ఒక రాగి గనిని కూడా ప్రసాదించాడు. ఆ కాలంలో రాగి అరుదైన లోహంగా ఉండేది.

ఒక రోజు సులైమాన్ (అలైహిస్సలాం) తన సైన్యాన్ని సమావేశపరచారు. అదొక విచిత్రమైన సైన్యం. అందులో మనుష్యులు, పశుపక్ష్యాదులు, జిన్నాతులు ఉన్నారు. సైన్యాన్ని తీసుకుని ఆయన అష్కెలాన్ రాజ్యానికి బయలుదేరారు.

వారు ఒక లోయ నుంచి వెళుతున్నప్పుడు ఒక చీమ ఈ సైన్యం రావడాన్ని చూసింది. మిగిలిన చీమలను హెచ్చరిస్తూ, ”పారిపోండి. పుట్టల్లో తలదాచు కోండి. లేకపోతే మనల్ని చూడకుండా సులైమాన్ సైన్యం మనల్ని తొక్కేస్తుంది” అని అరిచింది. ఈ అరుపు సులైమాన్ చెవులకు సోకింది. ఆయన నవ్వుకున్నారు. ఒక ప్రవక్తగా తాను కావాలని అల్లాహ్ సృష్టి దేనికీ హాని తలపెట్టనన్న విషయాన్ని ఆ చీమ గుర్తించినందుకు సంతోషించారు. చీమలను కాపాడినందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

జెరుసలేమ్ ఒక పెద్ద శిలపై సులైమాన్ (అలైహిస్సలాం) ఒక అందమైన ఆరాధనాలయాన్ని నిర్మించారు. ప్రజలు అల్లాహ్ ను ఆరాధించడానికి వచ్చేలా ఈ ఆరాధనాలయాన్ని కట్టారు. నేడు దీనిని “మస్జిదుల్ అక్సా” లేదా “మస్జిదుల్ ఖుద్స్” లేదా ”డోమ్ ఆఫ్ రాక్” అని పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి సులైమాన్ (అలైహిస్సలాం) వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కాలోని పవిత్ర గృహానికి యాత్రకు బయలు దేరారు. వారు తమ హజ్ యాత్ర పూర్తి చేసుకుని అక్కడి నుంచి యమన్ చేరుకుని సనా పట్టణానికి వచ్చారు. ఇక్కడ తెలివిగా పట్టణాల్లో నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పద్ధతి చూసి ఆయన చాలా ప్రభావితులయ్యారు. తన రాజ్యంలో కూడా అలాంటి నీటిపారుదల సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కాని తన రాజ్యంలో అందుకు అవసరమైన నీటివనరులు లేవు. ఆయన వెంటనే హూపో పక్షి కోసం కబురంపారు. ఆ పక్షి భూగర్భంలో జనవనరులను పసిగట్టగలదు. ఆయన హూపో పక్షి కోసం నాలుగు చెరగులా సందేశాలు పంపారు. కాని ఆ పక్షి ఎక్కడా లేదు. ఆయన కోపంగా ఆ పక్షి కనుక సరియైన కారణం లేకుండా గైర్హాజరైతే దానిని కఠినంగా శిక్షిస్తానని అన్నారు.

చివరకు హూపో పక్షి సులైమాన్ వద్దకు వచ్చింది. తన ఆలస్యానికి కారణాన్ని వివరించింది. “మీకు తెలియని ఒక విషయాన్ని నేను కని పెట్టి వచ్చాను. నేను సబా (షీబా) నుంచి ఒక శుభవార్త తీసుకుని వచ్చాను” అంది. ఈ మాటలు విన్న సులైమాన్ ఆగ్రహం మాయమై ఆయనలో కుతూహలం చోటుచేసుకుంది. ”సబా రాజ్యాన్ని బిల్కిస్ అనే రాణి పాలిస్తోంది. ఆమెకు అన్ని సౌభాగ్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె సింహాసనం చాలా అద్భుతంగా ఉంది. కాని ఇంత సంపద ఉన్నప్పటికీ, ఆమె హృదయంలో, ఆ రాజ్య ప్రజల హృదయాల్లో షైతాన్ తిష్ఠవేసుకుని ఉన్నాడు. ప్రజలు ఆమె పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. వారంతా విశ్వప్రభువైన అల్లాహ్ కు బదులు సూర్యుణ్ణి పూజించడం చూసి నేను నిర్ఘాంతపోయాను” అని ఆ పక్షి వివరించింది.

హూపో పక్షి చెప్పిన మాటలు నిర్ధారించుకోవడానికి సులైమాన్ (అలైహిస్సలాం) ఆ పక్షితో సబా రాణికి ఒక లేఖ పంపారు. రాణికి లేఖ చేరవేసి అక్కడే రహస్యంగా ఉండి రాణి ఏం చేస్తుందో చూడమని పక్షికి సూచనలిచ్చారు.

హూపో పక్షి ఆ లేఖను సబా రాణి ముందు పడవేసి ఎగిరిపోయింది. వెళ్ళి ఓ మూలన దాక్కుని చూడసాగింది. సబా రాణి ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకుని చదివింది. “ఈ లేఖ సులైమాన్ నుంచి పంపబడింది. అనంత కరుణా మయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నాకు వ్యతిరేకంగా బలప్రదర్శనకు దిగవద్దు. లొంగిపోయిన మనిషి మాదిరిగా నా వద్దకు రావాలి…..” ఈ లేఖ చూసి రాణి చాలా ఆందోళనకు గురయ్యింది. వెంటనే తన సలహాదారులను పిలిపించింది. వారు ఆమెతో తాము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలమని, ఆదేశాలిచ్చి చర్యలు తీసుకోవలసినది రాణిగారేనని విన్నవించు కున్నారు. వారి ఉద్దేశ్యాన్ని ఆమె గ్రహించింది. వారంతా సులైమాన్తో యుద్ధరంగంలో ఢీకోవాలని భావిస్తున్నారు. కాని ఆమె వారితో, ”స్నేహం, శాంతి యుద్ధం కన్నా మంచివి. వివేక వంతమైనవి. యుద్ధం వల్ల పరాభవాలు వాటిల్లుతాయి. ప్రజలు బానిసలవుతారు. సంపద నాశనం అవుతుంది. నేను సులైమాన్కు కానుకలు పంపాలని భావిస్తున్నాను. మన ఖజానాలోని విలువైన వస్తువుల్ని పంపుదాం. ఈ కానుకలు తీసుకుని వెళ్ళే రాజప్రతినిధులు సులైమాన్ గురించి కూడా తెలుసుకోవచ్చు, అతని సైనిక బలాన్ని కూడా అంచనా వేయవచ్చు” అని చెప్పింది.

కాని ఆమెకు తన మాటలన్నింటినీ హూపో పక్షి వింటుందన్న విషయం తెలియదు. హూపో వెంటనే సులైమాన్ వద్దకు వెళ్ళి ఈ విషయాలు చేరవేసింది.

సులైమాన్ (అలైహిస్సలాం) వెంటనే తన అధీనంలో ఉన్న ఒక జిన్నుతో ఒక మహా ప్రాసాదాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ మహాసౌధంలో రాబోయే అతిథులను స్వాగతిస్తానని చెప్పారు. సబా రాణి వద్ద నుంచి వచ్చిన రాజప్రతినిధులను ఆయన చాలా ఆదరంగా స్వాగతించారు. అద్భుతమైన ఆ భవనాలను చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు తమ రాణి పంపిన విలువైన కానుకలను సులైమాన్ (అలైహిస్సలాం)కు అందజేశారు. స్నేహానికి గుర్తులుగా వాటిని తమ రాణి పంపిందని, వాటిని స్వీకరించాలని కోరారు. కాని సులైమాన్ ఆ కానుకలను విప్పి చూడకుండానే వారిని ఉద్దేశించి, “అల్లాహ్ నాకు పుష్కలంగా ప్రసాదించాడు. ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చాడు. ప్రవక్త పదవిని ఇచ్చాడు. కాబట్టి నేను లంచాలకు లొంగే అవకాశం లేదు. నా లక్ష్యం ఒక్కటే, తౌహీద్ (ఏకదైవారాధన)ను వ్యాపింప జేయడం” అన్నారు. అంతేకాదు, ఆ కానుకలను తిరిగి తీసుకువెళ్ళాలని ఆదేశించారు. మీ రాణి తన ఆరాధనా పద్ధతిని మార్చుకోనట్లయితే రాజ్యాన్ని వశపరచు కుంటానని, ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళగొడతానని కఠినంగా చెప్పారు.

రాణి ప్రతినిధులు ఆ కానుకలు తీసుకుని ఆమె వద్దకు చేరుకుని సులైమాన్ (అలైహిస్సలాం) చెప్పిన మాటలు చెప్పారు. అంతేకాదు, సులైమాన్ రాజ్యంలో తాము చూసిన అద్భుతాలను కూడా వివరించారు. సులైమాన్ సందేశం పట్ల ఆమె ఆగ్రహం ప్రదర్శించే బదులు సులైమాన్ రాజ్యాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది. తనకు విశ్వాసపాత్రులైన నౌకర్లతో ఆమె సబా రాజ్యాన్ని వదలి బయలుదేరింది. ఒక సందేశహరుడితో సులైమాన్ (అలైహిస్సలాం) వద్దకు తాను వస్తున్న వర్తమానం ముందుగానే పంపించింది.

సులైమాన్ (అలైహిస్సలాం) తన అధీనంలో ఉన్న జిన్నులను పిలిచి సబా రాణి రాక ముందే ఆమె సింహాసనాన్ని తన వద్దకు ఎవరు తీసుకువస్తారని అడిగారు. ఒక జిన్ను, ”ఈ సమావేశం ముగిసేలోపే ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను. నేను నిస్సందేహంగా బలం కలవాడిని. ఇలాంటి పనులు చేయడానికి నమ్మక స్తుడిని” అన్నాడు. కాని ఈ పని చేయడానికి జిన్నులు పోటీపడ్డారు. ఇంతలో ప్రత్యేక జ్ఞానం కలిగిన ఒక జిన్ను, “నేను రెప్పపాటులో ఆ సింహాననాన్ని మీ ముందు ఉంచుతాను” అంటూ మాట పూర్తయ్యేలోపే సింహాసనాన్ని ముందు ఉంచాడు. సులైమాన్ (అలైహిస్సలాం) ఆశ్చర్యంగా, ”ఇదంతా అల్లాహ్ అనుగ్రహం నేను కృతజ్ఞత చూపుతానో లేదో అని ఆయన పరీక్షిస్తున్నాడు” అన్నారు. ఆ తర్వాత ఆయన ఆ జిన్నుతో ఆ సింహాసనం ఆకారాన్ని మార్చమన్నారు.

బిల్కీస్ సులైమాన్ రాజప్రాసాదంలోకి వచ్చినప్పుడు ఆమెను ఘనంగా స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత సులైమాన్ (అలైహిస్సలాం) తన వద్ద ఆకారం మార్చి ఉన్న సింహాసనాన్ని ఆమెకు చూపించి ఆమె సింహాసనం కూడా అలాంటిదేనా అని ప్రశ్నించారు. ఆమె ఆ సింహాసనాన్ని పదే పదే చూసింది. తాను చూస్తున్న సింహాసనం తన సింహాసనం అయ్యే అవకాశం లేదని భావించింది. ఎందుకంటే, తన సింహాసనం తన రాజభవనంలో ఉంది. కాని తన సింహాసనానికి ఈ సింహాసనానికి పోలికలు చాలా ఉండడం చూసి ఆమె ఆశ్చర్యంగా, “ఈ సింహాసనం నా సింహాసనాన్ని చాలా విధాలుగా పోలి ఉంది” అంటూ జవాబిచ్చింది. ఆమె చాలా తెలివైన, దౌత్యపరమైన నైపుణ్యం ఉన్న మహిళగా సులైమాన్ (అలైహిస్సలాం) గుర్తించారు.

ఆ తర్వాత ఆయన అమెను ఒక పెద్ద హాలులోకి ఆహ్వానించారు. ఆ గది లో నేల అంతా గాజుతో పరచబడి ఉంది. ఆమె గాజు నేలను చూసి అదంతా నీరుగా భ్రమపడింది. ఆమె అక్కడ అడుగుపెట్టేటప్పుడు తన దుస్తులు తడవకుండా కొద్దిగా కాలిమడమల పైకి లాక్కుంది. సులైమాన్ (అలైహిస్సలాం) ఆమెను చూస్తూ ఇక్కడ నీరు లేదు, గాజుతో చేసిన నేల అని చెప్పారు. ఆమె ఆశ్చర్య పోయింది. అలాంటి నిర్మాణాన్ని ఆమె అంతకుముందు ఎన్నడూ చూడలేదు. తన ముందు ఉన్నది విజ్ఞానవివేకాలు మూర్తీభవించిన అసాధారణ వ్యక్తి అని ఆమె గుర్తించింది. ఆయన కేవలం ఒక రాజ్యానికి పాలకుడు మాత్రమే కాదని, అల్లాహ్ ప్రవక్త కూడా అని తెలుసుకుంది. ఆమె తన ఆరాధనా పద్ధతులలోని తప్పులకు పశ్చాత్తాపపడింది. సూర్యుణ్ణి పూజించే అలవాటు మానుకుంది. అల్లాహ్ ను ఒకే ఒక్క దేవునిగా విశ్వసించింది. తన రాజ్యంలోని ప్రజలను కూడా అదే విధంగా చేయాలని కోరింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 6:84, 21:81-82, 34:12-14, 27:15-44, 2-103, 38:32-40)

సులైమాన్ (అలైహిస్సలాం) కాలంలో ప్రజలు గుర్రాలపై ప్రయాణాలు చేసేవారు. యుద్ధరంగంలో సైనికులకు యుద్ధ సామగ్రిని, ఆయుధాలను చేరవేయడానికి గుర్రాలనే ఉపయోగించేవారు. వస్తురవాణాకు, వాహనాలు లాగడానికి కూడా గుర్రాలనే వాడేవారు. గుర్రాల పట్ల చాలా శ్రద్ధ చూపేవారు. వాటికి చక్కని శిక్షణ ఇచ్చేవారు. సులైమాన్ (అలైహిస్సలాం) గుర్రపుశాలలో చాలా గుర్రాలు ఉండేవి. గుర్రాలంటే ఆయనకు చాలా శ్రద్ధ ఉండేది. ఒకసారి ఆయన తన గుర్రపుశాలలో గుర్రాలను చూస్తూ వాటిని ప్రేమగా నిమురుతూ చాలాసేపు గడిపారు. సూర్యుడు అస్తమించే సమయం అయిపోయింది. అస్ర్ నమాజు సమయం దాటిపోతోంది. ఆయన తాను చేస్తున్న ఆలస్యాన్ని గుర్తించి వెంటనే, “నేను ఈ సంపదను నా ప్రభువు సంస్మరణార్థం ప్రేమించాను.”…..”వాటిని నా వద్దకు తిరిగి తీసుకు రండి” అన్నారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 38:32-33)

సులైమాన్ (అలైహిస్సలాం) పాలనలో అనేక పనులను జిన్నులే చేస్తుండేవి. జిన్నులు చేసిన పాపాలకు శిక్షగా వాటితో ఈ పనులు చేయించడం జరిగేది. అగ్నితో సృష్టించబడిన జిన్నులు తమకు సమస్త శక్తులున్నాయని, తాము అగోచరాలను కూడా చూడగలమని, భవిష్యత్తును తెలుసుకోగలమని ప్రజలను నమ్మించడం వంటి పాపాలకు పాల్పడేవారు. తన అనుచరుల్లో ఇలాంటి తప్పుడు విశ్వాసాలు చోటుచేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఒక ప్రవక్తగా సులైమాన్ (అలైహిస్సలాం) పై ఉంది. భవిష్యత్తు తెలుసుకునే శక్తి జిన్నులకు గాని, ప్రవక్తలకు గాని ఎవరికీ లేదని, కేవలం అల్లాహ్ కు తప్ప అలాంటి శక్తి మరెవ్వరికీ లేదని ప్రజలు తెలుసుకునేలా చేయడం ఆయన బాధ్యత. ఈ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన మరణానంతరం కూడా కొనసాగడం చెప్పుకోదగిన విశేషం.

ఒక గనిలో జిన్నుల పనిని పర్యవేక్షిస్తూ ఆయన తన చేతికర్రకు ఆనుకుని కూర్చుని ఉన్నారు. ఆ విధంగా కూర్చున్న స్థితిలోనే ఆయన తుదిశ్వాసను విడిచారు. చాలా సమయం వరకు ఆయన (అలైహిస్సలాం) మరణం గురించి ఎవరికీ తెలియదు. ఆయన (అలైహిస్సలాం) అక్కడ కూర్చున్నట్లే చాలా మందికి కనబడ్డారు. సులైమాన్ (అలైహిస్సలాం) చూస్తున్నారన్న భయంతో జిన్నులు విరామం లేకుండా పని కొనసాగిస్తూ పోయారు. ఈ సంఘటనను దివ్యఖుర్ఆన్ ఇలా వివరించింది. “ఆ తరువాత సులైమాన్ పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు, జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చెదపురుగు తప్ప మరొకటేదీ కాదు, ఈ విధంగా సులైమాన్ పడిపోగా, తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసి పోయింది.”

ఆ విధంగా ఆయన మరణం కూడా ఆయన అనుచరులకు ఒక పాఠంగా మిగిలింది. జిన్నులేకాదు, ఎవరూ కూడా భవిష్యత్తును గురించి తెలుసుకునే అవకాశం లేదన్నది అందరికీ తెలిసివచ్చింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 34:14)

  • సరియైన విధంగా న్యాయం చేయాలంటే, తీర్పు చెప్పేముందు ఇరు పక్షాల వాదనను పూర్తిగా వినాలి. న్యాయం జరిగిందని ప్రజలు తెలుసుకునేలా ఉండాలి.
  • వయసులో చిన్నవాడైన తన కుమారుడి వివేకాన్ని గుర్తించి తండ్రి తన స్వంత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు.
  • ప్రార్థనలతో సహా వివిధ పనులకు తగిన విధంగా సమయాన్ని విభజించు కోవాలి. ప్రవక్తలు, చాలామంది పాలకులు ఇహపరలోకాల విధులు నిర్వర్తించడానికి తగిన విధంగా సమయాన్ని విభజించుకునేవారు.
  • మనిషి ఆధ్యాత్మిక శక్తి అతని ధార్మిక విశ్వాసంలో ఉంది.
  • మంచి పనులు జాతిని పతనానికి గురికాకుండా కాపాడుతాయి. అయితే విదేశీ దాడుల నుంచి కాపాడుకోవడానికి సైనిక ఏర్పాట్లు అవసరం.
  • ఆత్మసమీక్ష : మనిషి తన ఆచరణల విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అల్లాహ్ వైపునకు మరలి మార్గదర్శనం కోసం ప్రార్థించాలి.
  • అల్లాహ్ సృష్టి పట్ల సులైమాన్ (అలైహిస్సలాం) చాలా శ్రద్ధ తీసుకునేవారు, చివరకు ఒక చీమకు కూడా హాని కలుగడాన్ని ఇష్టపడలేదు.
  • వివేకజ్ఞానాలు ఉన్న సులైమాన్ (అలైహిస్సలాం) కూడా ఒక పక్షి నుంచి నేర్చుకు న్నారు. ఆ పక్షి సలహా తీసుకుని ఆ ప్రకారం వ్యవహరించారు.
  • పరస్పర సంప్రదింపులు: బిల్కిస్ ఒక స్త్రీ, ఆమె ఒక పాలకురాలు కూడా. అయినప్పటికీ అల్లాహ్ ఆమె పాలనాశైలిని గుర్తించాడు. ఆమె ఇతరులతో సంప్రదింపులు జరిపింది, కాని వారిచ్చిన తప్పుడు సలహాలను పాటించ లేదు.
  • శాంతి అన్నది సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. యుద్ధాలు, పోరాటాలు వినాశానికి కారణమవుతాయి.
  • లంచాలకు, అవినీతికి ఎన్నడూ లొంగరాదు.
  • సులైమాన్ (అలైహిస్సలాం) మరణం కూడా మానవాళికి గుణపాఠం వంటిది. మనిషి జిన్నులను కూడా పాలించగలడు. అవి మనిషిపై ఆధిపత్యాన్ని సాధించలేవు. వాటికి భవిష్యత్తును తెలుసుకునే శక్తి కాని, అగోచరాలను గ్రహించే శక్తి కాని లేవు.
  • బైబిలులో కింగ్స్.. చాప్టర్ 2లో సులైమాన్ (అలైహిస్సలాం) దేవుని ఆదేశాలకు విరుద్ధంగా 700 మంది మహిళలను వివాహం చేసుకున్నారని, 300 మంది మహిళలను ఉంచుకున్నారని, ఆ మహిళలు ఆయన్ను విగ్రహారాధన చేసేలా ప్రలోభపెట్టారని, ఆయన అనేక విగ్రహారాధనాలయాలు కట్టించాడని, తన భార్యల కోసం బలిపీఠాలు కట్టించాడని ఇలాంటి అనేక అసత్య ఆరోపణలు ఉన్నాయి. కాని దివ్యఖుర్ఆన్ ఈ అసత్య ఆరోపణలను, అలాగే బ్లాక్ మ్యాజిక్కు పాల్పడ్డాడన్న ఆరోపణలన్నింటినీ ఖండిస్తోంది. (చదవండి దివ్యఖుర్ఆన్ 2-102)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో, టెక్స్ట్]

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర
https://youtu.be/6wNGPCoz60I [30 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.

అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
[ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం]
నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
[వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్]
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.

అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.

చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.

అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.

తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.

అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.

నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.

ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.

కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.

సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.

చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.

చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.

మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.

అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.

రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.

అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.

అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.

అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.

మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.

రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.

ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.

‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.

మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.

ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.

అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.

నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”

కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.

ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!

అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.

ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.

అకూలు కౌలి హాజా, అస్తగ్ఫిరుల్లాహ లి వలకుమ్ వ లిసాయరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.


సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8