ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి బులూగుల్ మరాం | హదీస్ 1237 https://youtu.be/ScQ39BtR9Fg [13 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1237. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు`;
“ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరిలా చేసినపుడు) అల్లాహ్ యొక్క ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.” (బుఖారి , ముస్లిం)
సారాంశం:
అల్లాహ్ ను విశ్వసించే వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపంచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానయినా ఎదుటి వారిని మించిపోవాలన్న పేరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు అల్లాహ్ పట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదలపట్ల దయ, జాలి ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ల మంచీచెబ్బరల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతనొక దయాశీలిగా, సత్పౌరునిగా ఉంటాడు
—
ఈ ప్రసంగంలో, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక ముఖ్యమైన హదీద్ వివరించబడింది. ప్రాపంచిక విషయాలలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడటం ద్వారా అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదే సమయంలో, ధార్మిక విషయాలలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారిలా పుణ్యకార్యాలలో పురోగమించడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ సూత్రం అసూయ, అసంతృప్తి వంటి సామాజిక రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుందని వక్త నొక్కి చెప్పారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి అసంతృప్తికి లోనవ్వకుండా, పేదవారిని, అవసరమైన వారిని చూసి మనకున్నదానిపై సంతృప్తి చెంది, అల్లాహ్ పట్ల కృతజ్ఞతతో జీవించాలని ఆయన ఉద్భోదించారు. ఈ రెండు గుణాలు (కృతజ్ఞత మరియు సహనం) ఉన్నవారిని అల్లాహ్ తన ప్రత్యేక దాసుల జాబితాలో చేర్చుతాడని కూడా వివరించారు.
انْظُرُوا إِلَى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ (ఉన్ జురూ ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్) మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి.
وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ (వలా తన్ జురూ ఇలా మన్ హువ ఫౌఖకుమ్) మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారి వైపు చూడకండి.
فَهُوَ أَجْدَرُ أَنْ لَا تَزْدَرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ (ఫహువ అజ్ దరు అల్ లా తజ్ దరూ ని’మతల్లాహి అలైకుమ్) మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.
ఏంటి దీని భావం? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. ఎల్లప్పుడూ, మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి. మీరు ప్రాపంచిక సిరిసంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి, అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడకండి. గమనిస్తున్నారు కదా? హదీద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపు చూడండి. ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపుకు చూడకండి. మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.
ఇక ఒకవేళ మీరు హదీద్ లోని అరబీ పదాలు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా అంటే చూడండి ఇక్కడ, ఉన్ జురూ – మీరు చూడండి. ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్ – మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపున. వలా తన్ జురూ – చూడకండి. ఇలా మన్ హువ ఫౌఖకుమ్ – ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో. ఫహువ అజ్ దరు – ఇదే ఉత్తమ విధానం, ఉత్తమ మార్గం. ఫహువ అజ్ దరు, అది మీ కొరకు ఎంతో మేలు, ఉత్తమ మార్గం. దేని కొరకు? అల్ లా తజ్ దరూ – మీరు చిన్నచూపుతో చూడకుండా, మీరు తమకు తాము అల్పంగా భావించకుండా, దేనిని? ని’మతల్లాహి అలైకుమ్ – మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని.
సోదర మహాశయులారా, సభ్యతా, సంస్కారాలు, మర్యాదలు వీటికి సంబంధించి హదీద్ లు మనం తెలుసుకుంటున్నాము. ఇందులో ఈ హదీద్ కూడా ఎంత ముఖ్యమైనది ఈనాటి మన సమాజంలో ఒకసారి అర్థం చేసుకోండి. హదీద్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చిన బోధనలని గనక మనం గ్రహించామంటే, పరస్పరం ఎంతో ప్రేమగా, ఒకరు మరొకరితో ఎంతో మంచి రీతిలో కలిసిమెలిసి ఉండవచ్చును. ఈ రోజుల్లో అసూయ, ఈర్ష్య, జిగస్సు, పరస్పరం కపటం, ద్వేషం లాంటి ఈ సామాజిక రోగాలు ఏవైతే పెరిగిపోతున్నాయో, ఇలాంటి హదీథులను చదవకపోవడం వల్ల.
ఈ హదీద్ లో మీకు మూడు విషయాలు తెలుస్తున్నాయి కదా. ఆ మూడు విషయాలు ఏంటి? ఈ హదీద్ ద్వారా మనకు కలిగిన లాభాలు, ప్రయోజనాలు ఏంటి? చివర్లో సంక్షిప్తంగా తెలుసుకుందాము. అయితే రండి.
ధార్మిక మరియు ప్రాపంచిక విషయాలలో మన దృక్పథం
ఒక హదీద్ లో వస్తుంది, ఈ భావాన్ని మీరు మరో హదీస్ ఆధారంగా మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
رَحِمَ اللَّهُ عَبْدًا (రహిమల్లాహు అబ్దన్) అల్లాహ్ ఆ దాసున్ని కరుణించు గాక! చూడండి.
ఇంతకుముందు చదివిన హదీస్ లో ఒక ఆదేశం ఉంది. ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇందు ఈ లాభం, ఇలా తెలపబడింది. కానీ ఆ హదీద్ ను విడమరిచి చెప్పేటువంటి మరికొన్ని హదీద్ లలో ఘనతలు, లాభాలు ఎలా ఉన్నాయో గమనించండి. అక్కడ ఏముంది? రహిమల్లాహ్, అల్లాహ్ కరుణించు గాక! ఈ గుణం గనక నేను, మీరు అవలంబించుకున్నామంటే అల్లాహ్ యొక్క కరుణ మనపై కురుస్తుంది. ఏంటి? రహిమల్లాహు అబ్దన్, అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించు గాక!
نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ (నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు) ప్రాపంచిక రీత్యా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి వైపున చూస్తాడు.
فَحَمِدَ اللَّهَ وَشَكَرَهُ (ఫ హమిదల్లాహ వ షకరహ్) ఓ అల్లాహ్! అతనికంటే నేను ఎంతో మేలు ఉన్నాను. నేను ఎంతో బాగున్నాను. అతనికంటే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను. నీకే సర్వ స్తోత్రములు! నీకే అన్ని రకాల పొగడ్తలు! నీకే అన్ని రకాల కృతజ్ఞతలు!
وَفِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ (వ ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు) మరి ఎవరైతే ధర్మపరంగా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అతన్ని చూస్తాడు.
فَجَدَّ وَاجْتَهَدَ (ఫ జద్ద వజ్తహద్) ఆ తర్వాత అతను చాలా చాలా అలాంటి పుణ్యాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా త్యాగం, ప్రయాస, ప్రయత్నం, కష్టపడతాడు, స్ట్రగుల్ చేస్తాడు దేనికొరకు? ధర్మ కార్యాల్లో, పుణ్య విషయాల్లో అలాంటి వారి స్థానానికి చేరుకోవడానికి, వారికంటే ఇంకా ముందుకు ఉండడానికి.
అమర్ బిన్ షు’ఐబ్ ఉల్లేఖించిన ఒక హదీద్ లో ఇలా కూడా వస్తుంది:
خَصْلَتَانِ (ఖస్లతాని) రెండు ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ రెండు గుణాలు ఎవరిలో ఉంటాయో, అల్లాహ్ వారిని
شَاكِرًا صَابِرًا (షాకిరన్ సాబిరా) కృతజ్ఞత చెల్లించే వారిలో, ఓపిక సహనాలు వహించే వారిలో అతన్ని కూడా లిఖింపజేస్తాడు. షుక్ర్ చేసేవారు, సబ్ర్ చేసేవారు, కృతజ్ఞత చెల్లించేవారు, సహనాలు పాటించేవారు పుణ్యదాసులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారి జాబితాలో అల్లాహ్ త’ఆలా ఇతన్ని కూడా చేర్చుతాడు. ఎ
వరిని? ఎవరిలోనైతే ఈ రెండు గుణాలు ఉంటాయో. ఏంటి ఆ రెండు గుణాలు?
مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ فَحَمِدَ اللَّهَ عَلَى مَا فَضَّلَهُ بِهِ (మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు ఫ హమిదల్లాహ అలా మా ఫద్దలహు బిహ్) ఎవరైతే ప్రాపంచిక విషయాలలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి, అల్లాహ్ అతనికంటే ఎక్కువగా అతనికి ఏదైతే అనుగ్రహించాడో దానిని చూసి అల్లాహ్ యొక్క స్తోత్రం పఠిస్తాడు.
وَمَنْ نَظَرَ فِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ فَاقْتَدَى بِهِ (వ మన్ నజర ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు ఫక్ తదా బిహ్) మరియు ధర్మ విషయాల్లో తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి వారి లాంటి ఆ సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాడు.
وَأَمَّا مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ فَوْقَهُ (వ అమ్మా మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ ఫౌఖహు) కానీ ఎవరైతే దీనికి భిన్నంగా, ప్రపంచ రీత్యా తనకంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూస్తాడో,
وَآسَفَ عَلَى مَا فَاتَهُ (వ ఆసఫ అలా మా ఫాతహు) అతని వద్ద ఉన్న దానిని చూసి, అయ్యో నాకు ఇది దొరకపాయె, నాకు ఇది ఇవ్వకపాయె, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నాడో, ఇట్లా బాధపడుతూ ఉంటాడు.
فَإِنَّهُ لَا يُكْتَبُ شَاكِرًا وَلَا صَابِرًا (ఫ ఇన్నహు లా యుక్తబు షాకిరన్ వలా సాబిరా) ఇలాంటి వ్యక్తి, షాకిరీన్, సాబిరీన్ లో, కృతజ్ఞత చెల్లించే, సహనాలు పాటించే వారి జాబితాలో లిఖించబడడు.
అందుకొరకే మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఏమనేవారో తెలుసా? నీవు ప్రపంచ రీత్యా నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకు. దీనివల్ల నీలో ఒక న్యూనతాభావం, అయ్యో నాకు లేకపాయె ఇంత గొప్ప స్థితి, నాకు లేకపాయె ఇంత గొప్ప సంపద, నాకు లేకపాయె ఇలాంటి అందం, నాకు లేకపాయె ఇలాంటి… ఈ బాధ అనేది అతనిలో అతన్ని కుమిలిపోయే విధంగా చేస్తుంది.
అందుకొరకు ఏమి చేయాలి? బీదవాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వారిని చూడాలి. వారి వద్ద ధర్మం ఎక్కువ ఉండి, ప్రపంచ పరంగా ఏమంత ఎక్కువ లేకున్నా గానీ, వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనివల్ల అల్లాహ్ వారికంటే మంచి స్థితిలో మనల్ని ఉంచాడు అని అల్లాహ్ యొక్క కృతజ్ఞతాభావం కలుగుతుంది.
ఆధునిక కాలంలో హదీద్ యొక్క ప్రాముఖ్యత
ఈ సందర్భంలో ఈనాటి టెక్నాలజీ కాలంలో, మరొక ఈ హదీద్ ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బోధన ఏమిటంటే, ఇక ఏం పనిపాట లేదు కదా అని కొందరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో, చాట్… షేర్ చాట్, ఏమేమో సోషల్ మీడియాలో ఏం చూస్తారండీ? మన అవ్వలు, మన అక్కలు అందరూ, ఆ… వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టాలంట, అవంతా చూపిస్తున్నారు. కిచెన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా చూపిస్తున్నారు. ఆ… నెలకు ఒకసారి జీతం దొరికినప్పుడు, ఆమె భర్త ఎంతగానో మంచి బట్టలు ఆమెకు కొనిస్తాడో, అవన్నీ వాళ్ళు వ్లోగ్ లు అంట, ఇంకా ఏమేమో యూట్యూబ్ లలో అంతా కచరా పెడుతున్నారు కదా పెట్టేవాళ్ళు. ఈ పని పాట లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు.
తర్వాత, ఏమండీ ఈసారి నెల జీతం దొరికిన తర్వాత ఇంట్లో ఫలానా తెచ్చుకుందామా? అని మెల్లగా మొదలవుతాయి మాటలు. ఇక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఈ విధంగా శక్తి సామర్థ్యము లేకున్నా పర్లేదండీ, ఫలానా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారట లోన్, ఫలానా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంట.
ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి? అలాంటి ఛానెల్ లను చూడకూడదు. ఏ ఛానెల్ ద్వారా అయితే, అయ్యో మన వద్ద ఇది లేకపాయే, ఇది ఉంటే ఎంత బాగుండు అని మనం కుమిలిపోతామో, అలాంటి ఛానెల్ లు చూసుకుంటూ మన ఇల్లులు పాడు చేసుకోవద్దు.
ప్రపంచ రీత్యా, ఈ విషయమైనా గానీ, హోదా, అంతస్తు, విద్య, ఇంకా అందచందాలు, సిరిసంపదలు, సౌకర్యాలు, ఏ విషయంలోనైనా ప్రపంచ రీత్యా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని, వారి యొక్క ఛానెల్ లను, వారి యొక్క ప్రోగ్రాంలను చూసుకుంటూ ఉండి, అయ్యో నాకు లేకపాయె, నాకు లేకపాయె అన్నటువంటి బాధల్లో ఉండకూడదు.
ఈ ప్రపంచ రీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి, అల్హందులిల్లాహ్ ఓ అల్లాహ్ నీ యొక్క ఎంత అనుగ్రహం! కొందరైతే ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను. అయ్యో ఫలానా సిటీలో నేను వెళ్ళినప్పుడేదో చూశాను, పైపులలో ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు. నాకైతే దానికంటే మంచిగా కనీసం కిరాయి ఇల్లు అయినా గానీ ఉంది కదా ఓ అల్లాహ్! ఇలాంటి కృతజ్ఞతాభావంలో జీవితం గడపాలి.
కానీ ధర్మపర విషయానికి వస్తే, ధర్మ విషయాలలో, మంచి కార్యాలలో, పుణ్య విషయాలలో మనకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నారో వారిని చూసి, అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఫిఖ్‘హ్ దుఆ – ఈ మొదటి క్లాస్ లో దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు & అవరోధాలు క్లుప్తంగా వివరించడం జరిగింది. వచ్చే క్లాసులలో ప్రతి పాయింట్ గురుంచి వివరంగా చెప్పబడుతుంది ఇన్ షా అల్లాహ్.
విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.
ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, దాని షరతులు, మర్యాదలు, అంగీకార సమయాలు మరియు అంగీకారానికి అడ్డంకులుగా ఉండే విషయాల గురించి వివరించబడింది. దుఆ అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహమని, అల్లాహ్ యే దుఆ చేయమని ఆదేశించి, దాని విధానాన్ని నేర్పించి, దానిని అంగీకరిస్తానని వాగ్దానం చేశాడని వక్త నొక్కిచెప్పారు. దుఆ అంగీకరించబడటానికి ఐదు ముఖ్య షరతులు ఉన్నాయి: ఇఖ్లాస్ (చిత్తశుద్ధి), ముతాబఆ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం), ప్రగాఢ నమ్మకం, ఏకాగ్రత మరియు దృఢ నిశ్చయం. దుఆ చేసేటప్పుడు వుదూతో ఉండటం, ఖిబ్లా వైపు తిరగడం, చేతులు ఎత్తడం, అల్లాహ్ ను స్తుతించడం, దరూద్ పంపడం మరియు పశ్చాత్తాపం చెందడం వంటి మర్యాదలను పాటించాలని సూచించారు. అర్ధరాత్రి, అజాన్ మరియు ఇఖామత్ మధ్య, వర్షం కురుస్తున్నప్పుడు మరియు జుమా రోజు వంటి ప్రత్యేక సమయాల్లో దుఆ అంగీకరించబడుతుందని తెలిపారు. చివరగా, హరామ్ తినడం, తొందరపాటు, ఘోర పాపాలు చేయడం మరియు విధులను నిర్లక్ష్యం చేయడం వంటివి దుఆ అంగీకారానికి అడ్డంకులుగా నిలుస్తాయని హెచ్చరించారు.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్హందులిల్లాహి వహదహ్, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్.
సోదర మహాశయులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహ్ యొక్క దయతో మనం అల్హందులిల్లాహ్ ఒక కొత్త సబ్జెక్ట్ ప్రారంభం చేయబోతున్నాము. ఈరోజు నుండి, తర్వాత కొన్ని వారాల వరకు అల్లాహ్ యొక్క దయతో ఈ క్లాస్ కొనసాగుతూ ఉంటుంది.
ఇందులో మనం దుఆ, దాని యొక్క నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు, అవరోధాలు, అంటే దుఆ అంగీకరించబడడానికి ఏ విషయాలు అడ్డుపడతాయి, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
అయితే, ఈరోజు మనది ఫస్ట్ క్లాస్ గనుక, మొదటి క్లాస్. ఇందులో మనం అల్లాహ్ యొక్క దయతో, ఇప్పుడు మీరు ఇక్కడ ముఖ్యంగా ఏ విషయాలు చూస్తున్నారో, దుఆనిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయ సందర్భాలు, స్థలాలు, అవరోధాలు అని, వీటి గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుంటాము. వీటిలో ప్రతీ ఒక్కటి సంపూర్ణ ఆధారాలతో, వాటికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు హదీసుల నిదర్శనాలతో రాబోయే క్లాసుల్లో కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకోబోతారు.
అయితే, రండి ఏమీ ఆలస్యం చేయకుండా, దుఆ గురించి ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు చూపించబడుతుంది, అలాగే ఆ విషయం తెలపబడుతుంది కూడా. అదేమిటంటే, దుఆ అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని మీరు ఒకసారి గ్రహించండి, దుఆ చేయండని అల్లాహ్ యే ఆదేశించాడు. దుఆ చేసే విధానం కూడా అల్లాహ్ యే నేర్పాడు. ఇంకా మీరు దుఆ చేస్తే నేను అంగీకరిస్తాను అన్న వాగ్దానం కూడా అల్లాహ్ చేశాడు.
గమనిస్తున్నారా? దుఆ చేయండని అల్లాహ్ యే ఆదేశించాడు. దుఆ ఎలా చేయాలి, దుఆ చేసే విధానం కూడా అల్లాహ్ యే నేర్పాడు. మనం దుఆ చేస్తే అంగీకరిస్తానని కూడా అల్లాహ్ వాగ్దానం చేశాడు. అంతేకాదు, మనం దుఆ చేస్తున్నందుకు అదనంగా మనకు ఇంకా వేరే పుణ్యాలు కూడా ప్రసాదిస్తాడు. విషయాన్ని గ్రహిస్తున్నారా ఇక్కడ?
ఇక్కడ విషయం గ్రహించండి. ఒకటి, మనం చేసే దుఆ, దుఆలో ఏం అడుగుతామో అది అల్లాహు త’ఆలా అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. ఇది ఒక విషయం. మరొక విషయం ఏంటి? మనం దుఆ చేసినప్పుడు అల్లాహు త’ఆలా దానిని స్వీకరించడమే కాకుండా, దుఆ చేసినందుకు సంతోషపడి మనకు పుణ్య ఫలం కూడా ఇస్తాడు.
సోదర మహాశయులారా, ఇంతటి గొప్ప ఈ దుఆలో ఉన్నటువంటి అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైనా మీరు గ్రహించే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలు, దీనికి సంబంధించిన ఎన్నో సంఘటనలు కూడా గుర్తుకు వస్తున్నాయి. కానీ నేను చెప్పాను కదా, అల్లాహ్ యొక్క దయతో ఇన్ షా అల్లాహ్, అవన్నీ కూడా నేను మీకు తర్వాత రోజుల్లో తెలియజేస్తాను.
ఇక్కడ మరో విషయం గమనించండి. సూరత్ అల్-ముఅ్‌మినూన్… సారీ, సూరత్ అల్-ముఅ్‌మిన్, దానిని గాఫిర్ అని కూడా అనడం జరుగుతుంది. సూర నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో ఉంది,
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ (వకాల రబ్బుకుముద్’ఊనీ అస్తజిబ్ లకుమ్) మరి మీ ప్రభువు చెప్పాడు: “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను.” (40:60)
మరి మీ ప్రభువు చెప్పాడు, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. అంతేకాకుండా, సూరె ఫాతిహా, ఖురాన్ యొక్క ఆరంభం, దీనిని గనక మనం శ్రద్ధగా గమనించామంటే, స్వయంగా అల్లాహు త’ఆలా ఇందులో దుఆ చేసే విధానము, దుఆలో అతి ముఖ్యమైనవి ఏమిటి అన్న విషయాలు, ఇంకా మనం అల్లాహ్ తో దుఆ చేయడంలో ఏ పద్ధతిని అవలంబించాలి, ఆ విషయం అల్లాహు త’ఆలా తెలియజేశాడు. అలాగే ఖురాన్ చివరిలో రెండు సూరాలు గనక మీరు చూస్తే సూరతుల్ ఫలఖ్ మరియు సూరతున్ నాస్, అందులో కూడా మనం వాస్తవానికి అల్లాహ్ ను వేడుకుంటున్నాము. అల్లాహ్ యొక్క శరణులోకి వస్తున్నాము. ఆ గొప్ప విషయం అక్కడ ఉంది.
ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రియ వీక్షకులారా, దుఆ యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, ఎల్లవేళల్లో మనం దుఆ చేస్తూ ఉండాలి. ఈ దుఆ అనేది మన జీవితంలో చాలా చాలా గొప్ప మార్పు తీసుకువస్తుంది. ఈ దుఆ వల్ల విధి వ్రాత కూడా మార్చడం జరుగుతుంది అన్నటువంటి విషయం కూడా మనం వింటాము, దానికి కూడా సహీ హదీసుల ద్వారా ఆధారం దొరుకుతుంది. కానీ అది ఏ విధి వ్రాత? లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది కాదు. దైవదూతలకు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో మరియు ఏ దాని ద్వారానైతే ప్రతీ సంవత్సరం అలాగే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏదైతే వ్రాయబడుతుందో అది అని భావం.
దుఆ యొక్క షరతులు (నిబంధనలు)
ఇక రండి, సోదర మహాశయులారా, దుఆ నిబంధనలు, దాని యొక్క షరతుల గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.
దుఆ ఆయుధం అని చెప్పడం జరిగింది.
اَلدُّعَاءُ سِلَاحُ الْمُؤْمِنِ (అద్దుఆఉ సిలాహుల్ ముఅ్‌మిన్) దుఆ విశ్వాసి యొక్క ఆయుధం. అని మీరు మాటి మాటికి వింటూనే ఉంటారు కావచ్చు.
అయితే ఆయుధం ఎంత పదునుగా, మనం వాడుక భాషలో ఏమంటాము? కొచ్చగా. ఇలా పెడితేనే కోసేయాలి. అంత పదునుగా మరియు దానిని వాడేవాడు ఎంత నేర్పరి అయి ఉంటాడో, మరియు అది కరెక్టుగా పని చేయడానికి వేరే ఏ ఆటంకము, అడ్డు ఉండదో అప్పుడే ఆ ఆయుధం చాలా చక్కగా పనిచేస్తుంది, ఉద్దేశాన్ని పూర్తి చేస్తుంది.
ఈ మూడిటిలో, మూడు అంటే అర్థమయ్యాయా? ఆయుధం పదునుగా ఉండడం, వాడేవాడు నేర్పరి అయి ఉండడం మరియు ఏ ఆటంకము ఉండకపోవడం. ఈ మూడిటిలో ఏ ఒక్క లోపం ఉన్నా అది సరిగా పనిచేయదు, ఉద్దేశం పూర్తి కాదు. అందుకే, అన్నిటికీ ముందు దుఆ యొక్క షరతులు మరియు దుఆ అంగీకారంలో అడ్డు ఏమిటో తెలుసుకోవడం చాలా చాలా అవసరం.
అయితే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా, దుఆ యొక్క షరతులలో మొట్టమొదటి షరతు, ఇఖ్లాస్. చిత్తశుద్ధి. అంటే, దుఆ కేవలం అల్లాహ్ తో మాత్రమే చేయాలి, అల్లాహ్ ప్రసన్నత కొరకే చేయాలి. పేరు ప్రఖ్యాతి, ప్రదర్శన బుద్ధి అనేది దుఆ చేయడంలో ఏమాత్రం ఉండకూడదు.
రెండవది, ముతాబఆ. అంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, అనుసరణ. అంటే, దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలోనే చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆకు సంబంధించి ఇంకా ఏ ఏ బోధనలు హదీసులు ఉన్నాయో, అందులో ఏ రీతిలో దుఆ చేయాలి అని, దుఆలో ఏ తొందరపాటు ఇంకా వేరే విషయాలు ఉండకూడదు అని చెప్పారో, వాటిని మనం పాటించాలి.
ఈ ఇఖ్లాస్ మరియు ముతాబఆ, ఈ రెండు షరతులు ప్రతీ సత్కార్యంలో అవసరం. తప్పనిసరి. నమాజ్, ఉపవాసం, హజ్, ఉమ్రా, జకాత్, విధిదానం , తల్లిదండ్రుల పట్ల సేవ, ఎవరికైనా ఏదైనా మనం దానం చేస్తున్నాము, ఎవరి పట్ల ఏదైనా మనం ఉత్తమ రీతిలో వ్యవహరిస్తున్నాము, మీరు ఏ ఏ విషయాన్ని సత్కార్యంగా భావిస్తారో వాటన్నిటిలో కూడా ఇఖ్లాస్ మరియు ముతాబఆ, ఈ రెండు షరతులు ఉండడం తప్పనిసరి. ఈ రెండు షరతులు లేవు అంటే, మన ఏ సత్కార్యం కూడా స్వీకరించబడదు. దీనికి సంబంధించి కూడా ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు, మన సలఫ్ సాలిహీన్ వారి యొక్క ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ తర్వాత రోజుల్లో అవి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మూడవ షరత్, అల్లాహ్ దుఆ అంగీకరిస్తాడని ప్రగాఢ నమ్మకం ఉండాలి. అయ్యో, ఏదో మౌల్వీ సాబ్ చెప్పిండు కదా చేయమని, చేసి చూస్తాను. ఇలా ఉండకూడదు. అల్లాహ్ నా యొక్క దుఆను తప్పకుండా స్వీకరిస్తాడు. బలమైన నమ్మకం ఉండాలి.
నాల్గవ షరతు, మనస్సు పెట్టి దుఆ చేయాలి. దుఆ చేసే సందర్భంలో అశ్రద్ధగా ఉండకూడదు. నోటితో ఏ పలుకులు పలుకుతున్నామో మనస్సులో దాని అర్థ భావాలు తెలిసి, మనం పూర్తి శ్రద్ధా భక్తులతో దుఆ చేయాలి.
ఇక ఐదవ నిబంధన, దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి. అంటే ఏంటి దృఢ నిశ్చయంతో? ఓ అల్లాహ్ నీకు ఇష్టం ఉంటే నాకు ఆరోగ్యం ఇవ్వు, లేకుంటే లేదు. నీకు ఇష్టం ఉంటే నన్ను క్షమించు, లేకుంటే లేదు. ఇట్లాంటి ధోరణి, ఇట్లాంటి మాట విధానం ఉండకూడదు. దృఢంగా ఓ అల్లాహ్ నన్ను క్షమించు. ఓ అల్లాహ్ నీవే క్షమించేవాడివి, ఇంక నేను ఎక్కడికి వెళ్లి క్షమాపణ కోరాలి? నీవు నన్ను తప్పకుండా క్షమించాలి. ఓ అల్లాహ్ ఇది నాకు అవసరం, ఆరోగ్యం, విద్య, సదాచరణ, ఇంకా సంతాన బాగోగుల గురించి, తల్లిదండ్రుల మంచి గురించి, ముస్లింలందరి మేలు గురించి మనం ఏదైతే అడుగుతున్నామో, ఓ అల్లాహ్ నీవు దీని శక్తి గలవానివి, నాకు తప్పకుండా ఇది ప్రసాదించు అని దుఆ చేయాలి.
అర్థమైంది కదా? ఈ షరతులు, నిబంధనలు గుర్తుంచుకోండి. ఒకటి ఇఖ్లాస్. రెండవది ముతాబఆ. మూడవది అల్లాహ్ అంగీకరిస్తాడని ప్రగాఢ నమ్మకం. నాలుగవది మనస్సు పెట్టి దుఆ చేయాలి, అశ్రద్ధగా ఉండొద్దు. ఐదవది దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి, ఇష్టం ఉంటే ఇవ్వు అన్నటువంటి మాటలు ఉండకూడదు.
ఏమేం తెలుసుకున్నారు మీరు ఇప్పటి వరకు? దుఆ యొక్క ప్రాముఖ్యత. దుఆ ఎంత గొప్ప అనుగ్రహం అల్లాహ్ వైపు నుండి అన్న విషయం తెలుసుకున్నారు. మనం దుఆ చేస్తూ ఉండాలి ఎల్లవేళల్లో అన్న మాట తెలుసుకున్నారు. ఆ తర్వాత రెండవది దుఆ యొక్క షరతులు, దుఆ యొక్క నిబంధనలు తెలుసుకున్నారు.
దుఆ మర్యాదలు (ఆదాబ్)
ఇక రండి, ఇప్పుడు మనం మరికొంత ముందుకు వెళ్లి, దుఆ యొక్క కొన్ని ఆదాబ్, మర్యాదలు, పద్ధతులు తెలుసుకుందాం.
1- వుజూ స్థితిలో ఉండి దుఆ చేయలి. 2- ఖిబ్లా దిశలో ముఖం చేయాలి. 3- రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి. 4- అల్లాహ్ యొక్క స్తోత్రం, ప్రవక్తపై దరూద్. 5- అల్లాహ్ యొక్క మంచి నామాల, ఉత్తమ గుణవిషేశణాల, మన సత్కార్యాల మాధ్యమంతో. 6- పాపాలపై పశ్చాత్తాపం వ్యక్తపరుస్తూ, క్షమాభిక్ష కోరుతూ దుఆ చేయాలి. (సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్)
అయితే ఇక్కడ గమనించండి, శ్రద్ధ వహించండి. మీరు స్క్రీన్ లో ఏదైతే చూస్తున్నారో అంతవరకే కాకుండా, దాని యొక్క వివరణలో నేను చెప్పే మాటలు కూడా హృదయంలో నాటుకునే ప్రయత్నం చేయండి. లేదా అంటే కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయిపోతారు.
మొదటిది, వుదూ స్థితిలో ఉండి దుఆ చేయాలి. అయితే వుదూ లేకుండా దుఆ చేయకూడదా? అలా భావం కాదు. షరతులు ఏవైతే మనం చదివామో అవి తప్పకుండా ఉండాలి. వాటిలో ఏ ఒక్కటి ఉన్నాగాని దుఆ అనేది పైకి వెళ్లదు, అల్లాహ్ అంగీకరించడు. కానీ, ఇక్కడ ఈ మర్యాదలు దుఆ అంగీకారానికి ఇవి మరింత ఎక్కువగా దోహదపడతాయి. ఏదైనా స్థితిలో ఇవి లేకున్నా గాని నడుస్తుంది. కానీ, వీటి అలవాటు చేసుకుంటే మన కొరకే చాలా మంచిది. దుఆ అంగీకారం కొరకు గానీ, దుఆ మనం చేయడంలో మంచి ఖుషూ వ ఖుదూ, దుఆ చేయడంలో మనకు మంచి కాన్సంట్రేషన్ ఉండడానికి ఈ విషయాలన్నీ కూడా దోహదపడతాయి.
అయితే ఇక్కడ గుర్తించాలి, మనం ఇక్కడ దుఆ అని ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో, దుఆ యొక్క మర్యాదలో కొన్ని విషయాలు ఏవైతే ప్రస్తావిస్తున్నామో, ఇక్కడ ప్రత్యేకంగా ఏదైనా అవసరానికి మనం దుఆ చేసుకుంటాము కదా, అది ఇక్కడ ఉద్దేశం. ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు దుఆ చదువుతారు, మజీద్ లో వెళ్ళినప్పుడు దుఆ చదువుతారు, ఇంట్లో వచ్చినప్పుడు దుఆ చదువుతారు. అక్రమకుముల్లాహ్ వఅజకుమ్, మీరు టాయిలెట్ లో వెళ్ళినప్పుడు, వచ్చిన తర్వాత దుఆ చదువుతారు, పడుకునే ముందు చదువుతారు, ఉదయం సాయంకాలం దుఆలు, జిక్రులు చదువుతారు, ఆ సందర్భం గురించి కాదు ఇక్కడ చెప్పడం జరిగేది.
అర్థమైందా? మనం దుఆ అన్న ఉద్దేశంతో, ప్రత్యేకంగా అల్లాహ్ తో వేడుకోవాలి. ఇప్పుడు ఈ నా ప్రాబ్లం సాల్వ్ కావాలి. నేను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ని ఎంతో శ్రద్ధా భక్తులతో ఏడ్చుకుంటూ అల్లాహ్ తో దీనంగా నేను ఇప్పుడు ఈ మాట నా అల్లాహ్ ముందు పెడతాను అని ఒక ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో ఒక విషయం కోరుతూ, ఒక ప్రాబ్లం పరిష్కరింపబడడానికి ఏదైతే దుఆ చేస్తాము కదా, అలాంటి దుఆ విషయం ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. సలాం తిప్పిన తర్వాత కూడా మీరు దుఆ చేస్తారు లేక అజాన్ పూర్తయిపోయిన తర్వాత దుఆ చదువుతారు. అలాంటి దుఆల గురించి ఇక్కడ కాదు మనం చెప్పుకునేది ఇప్పుడు. అర్థమైంది కదా?
అయితే ఎప్పుడైతే ప్రత్యేకంగా, ఒక ఉద్దేశపూర్వకంగా మనం దుఆ చేయడానికి పూనుకుంటామో, అప్పుడు వుదూ ఉంటే చాలా మంచిది. అలాంటి సందర్భంలో కూడా ఒకవేళ వుదూ లేకుంటే దుఆ అంగీకరించబడుతుంది మరియు దుఆ చేయవచ్చు కానీ వుదూ ఉండడం మంచిది.
అలాగే ఖిబ్లా దిశలో ముఖం చేయాలి. ఇది కూడా ఉత్తమ విషయం. లేకుంటే దుఆ ఖుబూల్ కాదు అన్నటువంటి మాట కాదు ఇక్కడ కూడా.
మూడవది, రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి. నిన్న అంతకుముందు కూడా ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలో దీనికి సమాధానం వివరంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇట్లాంటి ఏదైనా ప్రత్యేక దుఆ చేయడానికి మనం కూర్చుంటే, అప్పుడు ఏం చేయాలి? రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి.
ఈరోజు నేను దీని గురించి ఎన్నో హదీసులు చదువుతూ చదువుతూ మరొక విషయం కూడా తెలిసింది. అదేమిటి? దుఆ చేస్తున్నప్పుడు రెండు చేతులు ఎప్పుడైతే మనం ఎత్తుతామో, ఆ చేతుల యొక్క లోపలి భాగం మన ముఖం వైపునకు, ఆ అరచేతుల యొక్క వీపు అంటే అరచేతుల యొక్క పై భాగం ఖిబ్లా దిశలో ఉండాలి. ఈ విధంగా మనం భుజాల వరకు ఎత్తాలి. భుజాల వరకు అంటే భుజాలకు సమానంగా మన ముఖం ముందు.
నాలుగవ మర్యాద, పద్ధతి, అదబ్, అల్లాహ్ యొక్క స్తోత్రం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్. దీని గురించి ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి చెప్పిన విషయాలు మనం ఇంతకుముందు ప్రవక్తపై దరూద్ ఓ సలాం అనే ఒక అంశం విన్నాము జుమా రోజు. గుర్తుందా? అందులో కూడా ఈ విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. అదేంటి? దుఆ ఆరంభంలో, మధ్యలో, చివరిలో ఈ మూడు సందర్భాల్లో, మూడిటిలో ఏదైనా ఒక సందర్భంలో అల్లాహ్ యొక్క స్తోత్రము మరియు ప్రవక్తపై దరూద్ చదవాలి. అతి ఉత్తమ పద్ధతి ఏమిటి? ముందు అల్లాహ్ యొక్క స్తోత్రము, ఆ తర్వాత ప్రవక్తపై దరూద్, ఆ తర్వాత మనం అల్లాహ్ తో కోరుకునేది అంటే దుఆ, మళ్ళీ ఆ తర్వాత ప్రవక్తపై దరూద్ చదివి, అల్లాహ్ యొక్క స్తోత్రముతో సమాప్తం చేయాలి, ముగించాలి.
ఐదో విషయం శ్రద్ధ వహించండి. అల్లాహ్ యొక్క మంచి నామములు, ఉత్తమ గుణ విశేషణాలు మరియు మన సత్కార్యాల మాధ్యమంతో, వసీలాతో, ఆధారంతో దుఆ చేయడం ఉత్తమం. ఖురాన్లో కూడా అల్లాహ్ చెప్పాడు కదా మరి,
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా) అత్యుత్తమమైన పేర్లు అల్లాహ్ కే ఉన్నాయి. కాబట్టి ఆ పేర్లతోనే మీరు ఆయనను ప్రార్థించండి.
నేను ముందే చెప్పాను మీకు, ఈరోజు నేను ముఖ్యమైన విషయాలు సంక్షిప్తంగా చెప్తున్నాను. తర్వాత రోజుల్లో మనం వివరంగా దలీల్ తో తెలుసుకుందామని. కానీ గుర్తుకు వచ్చేస్తుంది నాకు కూడా, ఇలాంటి ఆయతులు, హదీసులు ఎన్నో ఉన్నాయి. దీని ద్వారా కూడా మన దుఆ అంగీకరింపబడే అటువంటి గ్యారెంటీ అనేది పెరిగిపోతుంది.
సోదర మహాశయులారా, నేను ముందే చెప్పినట్లు, ఈ దుఆ మర్యాదలు అంశం స్టార్ట్ చేసే ముందు, ఏం చెప్పాను? ఈ మర్యాదలు ఏవైతే చెప్పబడుతున్నాయో వీటిని పాటించడం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు ఎమర్జెన్సీ మీకు ఏదైనా, ఒక దెబ్బ తగిలింది మీకు పోతూ పోతూ, నడుస్తూ నడుస్తూ ఫోటోరాయి తగిలింది లేదా మీరు బండిలో వెళ్తూ వెళ్తూ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ కిక్ కొడుతున్నారు స్టార్ట్ కావట్లేదు. ఇక అక్కడ మీరు ఖిబ్లా దిశలో ఉండి, వుదూ చేసుకొని, అదబ్ లో కూర్చొని, ఇవన్నీ చేసుకుంటూ దుఆ చేస్తారా? లేదు వెంటనే మనస్సులో ఓ అల్లాహ్, నా యొక్క బండి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? ఓ అల్లాహ్ నీవు నాకు సహాయం చేయి. వెళ్తూ వెళ్తూ నడుస్తూ నడుస్తూ ఏదో కింద పడిపోయారు లేదా మీకు ఆ ఏమంటారు దాన్ని? చక్కర వచ్చినట్లు అయిపోయింది. ఆరోగ్యం కొరకు వెంటనే అక్కడ దుఆ చేస్తారు. అలా చేయకూడదా? చేయాలి. అదే ఉత్తమ పద్ధతి అక్కడ. విషయం అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ మర్యాదలు ప్రత్యేకంగా దుఆ చేయడానికి మనం కూర్చున్నప్పుడు ఈ పద్ధతులను పాటించడం చాలా చాలా ఉత్తమం.
ఆరవ మర్యాద,పాపాలపై పశ్చాత్తాపం వ్యక్తపరుస్తూ క్షమాభిక్ష కోరుతూ దుఆ చేయాలి. అవును, మనం ఏ విషయం కూడా అల్లాహ్ కు ఇష్టమైనది, పాపం కానిది అల్లాహ్ తో మనం కోరుకుంటున్నప్పుడు, వేడుకుంటున్నప్పుడు, నాకు కావాలి అని మనం అల్లాహ్ తో అర్ధిస్తున్నప్పుడు ముందు మన పాపాల విషయం, ఓ అల్లాహ్ నేను నా అన్ని రకాల పాపాల నుండి నీ క్షమాపణ కోరుతున్నాను. నా పాపాలే నీ కరుణ నా వరకు చేరడంలో అడ్డు కాకూడదు ఓ అల్లాహ్. ఈ పాపాలను వదులుకునేటువంటి భాగ్యం కూడా ప్రసాదించు ఓ అల్లాహ్. ఈ విధంగా మనం వేడుకోవాలి అల్లాహ్ తో, విన్నవించుకోవాలి.
పక్కన అరబీలో సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అని రాసి ఉంది. కన్ఫ్యూజ్ కాకండి. ఆ సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అనే దుఆ ఏదైతే ఉందో, అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, అందులో ఈ విషయం చాలా గొప్పగా నొక్కి చెప్పడం జరిగింది అని గుర్తు రావడానికి కేవలం అది ఒక హింట్ ఇచ్చాను అంతే. అయితే మీరు ఒకసారి
اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ (అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్దిక వ వ’అదిక మస్తత’అతు, అ’ఊదు బిక మిన్ షర్రి మా సన’అతు, అబూఉ లక బి ని’అమతిక అలయ్య, వ అబూఉ బి దంబీ ఫగ్ఫిర్లీ, ఫ ఇన్నహూ లా యగ్ఫిరుద్ దునూబ ఇల్లా అంత)
ఓ అల్లాహ్! నీవే నా ప్రభువువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. నీవే నన్ను సృష్టించావు మరియు నేను నీ దాసుడను. నేను నా శక్తి కొలది నీతో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటాను. నేను చేసిన చెడు నుండి నీ శరణు కోరుతున్నాను. నాపై నీవు కురిపించిన అనుగ్రహాలను నేను ఒప్పుకుంటున్నాను. మరియు నా పాపాలను కూడా నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి నన్ను క్షమించు. నిశ్చయంగా నీవు తప్ప పాపాలను క్షమించేవాడు మరొకడు లేడు.
చదివి చూడండి, దాని అర్థ భావాలను, ఈ మాట అనేది అక్కడ మీకు స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్పాను మీకు ఇప్పుడు హింట్స్ తెలుసుకుంటున్నాము.
దుఆ అంగీకార సమయాలు
దుఆ ప్రాముఖ్యత, దుఆ యొక్క ప్రాముఖ్యత మరియు దాని యొక్క ఇంత పెద్ద అనుగ్రహం అది. ఆ తర్వాత దాని యొక్క షరతులు, నిబంధనలు మరియు మర్యాదలు, ఆదాబ్, ఆ తర్వాత ఇప్పుడు దుఆ అంగీకార సమయాలు తెలుసుకుంటున్నాము.
1- అర్థ రాత్రి 2- రాత్రి మూడవ భాగంలో 3- అజాన్ ఇవ్వబడుతున్నప్పుడు 4- అజాన్ ఇఖామత్ ల మధ్యలో 5- ఇఖామత్ ఇవ్వబడుతున్నప్పుడు 6- ఫర్జ్ నమాజుల తర్వాత 7- రాత్రి నిద్రమేల్కొన్నప్పుడు 8- వర్షం కురుస్తున్నప్పుడు 9- జుమా రోజు ఖుత్బా మధ్యలో, అస్ మగ్రిబ్ మధ్యలో 10- సహరీ సమయంలో
అయితే సోదర మహాశయులారా, మర్యాదల విషయంలో గాని ఇక్కడ అంగీకార సమయాల విషయంలో గాని ఇంక ఎన్నో ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైనవి, మన రోజువారీ జీవితంలో మనకు అవసరమయ్యేటివి నేను ఇక్కడ కొన్ని ప్రస్తావించాను.
అంగీకార సమయాలు, అర్ధరాత్రి, రెండవది రాత్రి మూడవ భాగంలో, మూడవది అజాన్ ఇవ్వబడుతున్నప్పుడు, నాలుగవది అజాన్, ఇఖామత్ ల మధ్యలో, ఐదవ సమయం ఇఖామత్ ఇవ్వబడుతున్నప్పుడు, ఆరవ సమయం రాత్రి నిద్ర మేల్కొన్నప్పుడు, ఎనిమిదవ సమయం వర్షం కురుస్తున్నప్పుడు, తొమ్మిదవ సమయం జుమా రోజు ఖుత్బా మధ్యలో అలాగే అస్ర్ మరియు మగ్రిబ్ మధ్యలో. సహీ హదీసుల ద్వారా ఈ రెండు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
పదవ సమయం, సహరీ సమయం. అంటే రోజా ఉంటే సహరీ చేస్తేనే అని కాదు. మనం ఉపవాసం లేకున్న రోజుల్లో కూడా సహరీ సమయం ఏదైతే ఉందో అది దుఆ అంగీకరింపబడడానికి,
وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ (వబిల్ అస్ హారి హుమ్ యస్తగ్ఫిరూన్) వారు రాత్రి జామున క్షమాపణ వేడుకునేవారు.
ఖురాన్ లో కూడా దీని గురించి మనకు ఆధారం కనబడుతుంది.
ఈ విధంగా సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? దుఆ అంగీకరింపబడే అటువంటి సమయాల గురించి తెలుసుకున్నాము.
దుఆ అంగీకారానికి అడ్డుపడే విషయాలు
ఇప్పుడు రండి దుఆ అంగీకరింపబడడానికి ఏ విషయాలు అడ్డుపడతాయి? ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.
అల్లాహ్ యే కాపాడుగాక మనందరినీ. మనం ఈ విషయంలో ఒకవేళ జాగ్రత్తగా ఉండకుంటే, మనం ఎన్ని మర్యాదలు పాటించినా, మనం దుఆ అంగీకారం యోగ్యం పొందడానికి ఏ మంచి సమయం ఎన్నుకొని దుఆ చేసినా, అంతా వృధా అయిపోతుంది. ఎలాగో తెలుసా? అల్లాహ్ అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి, అన్ని రకాల రోగాల నుండి కాపాడాలి. ఒకవేళ వీరు షుగర్ పేషెంట్ అయి, షుగర్ వ్యాధిని ఇంకా పెరగకుండా, అల్లాహ్ యొక్క దయతో మొత్తమే దూరమైపోయి ఆరోగ్యవంతులు అవ్వడానికి మంచి మందులు వాడుతున్నారు. కానీ, అటు ఒకవైపున మందులు వాడుకుంటూ మంచి రసగుల్లాలు తింటున్నారు, పల్లి పట్టీలు తింటున్నారు, ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు పెద్దలు చూడటం లేదు కదా అని ఓ దోసెడు చక్కెర కూడా మింగేస్తున్నారు. ఇలా చేస్తే ఏమవుతుంది? మీ మందులు మీకు పనిచేస్తాయా? చేయవు కదా. అందుకొరకే అడ్డంకులు, ఆటంకాలు, అవరోధాలు, దుఆ అంగీకరింపబడడానికి ఏ విషయాలు ఇందులో ముఖ్యమో అవి తెలుసుకోవడం చాలా చాలా అవసరం.
వాటిలో అతి ముఖ్యమైనవి నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేమిటి? మనిషి హరామ్ తినడం, త్రాగడం, ధరించడం, తొడగడం. వీటన్నిటికీ దూరం ఉండాలి.
నేను చెప్పాను కదా ఇంతకుముందే? హదీసులు, ఆధారాలు అవన్నీ కూడా తర్వాత మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాము. కానీ ఇప్పుడు సంక్షిప్తంగా ఏం తెలిసింది? మన దుఆ అంగీకరింపబడాలంటే మనం హరామ్ తిండికి దూరం ఉండాలి. వడ్డీ అయినా గాని, లంచం తీసుకోవడం అయినా గాని, ఇంకా వేరే దొంగతనం చేసి గాని, లేకుంటే తెలిసి తెలిసి ఈ రోజుల్లో ఎన్నో రకాల జూదములు, లాటరీలు, ఎన్నో రకాల చైన్ బిజినెస్, చైన్ సిస్టం బిజినెస్ లు వస్తున్నాయి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి. హరామ్ సొమ్ము అనేది మన తిండిలో, మన త్రాగడంలో, మన దుస్తుల్లో, బట్టల్లో ఏమాత్రం ఉండకూడదు.
రెండవది, తొందరపాటు. అంటే ఏంటి? ఒకసారి, రెండుసార్లు, కొన్నిసార్లు దుఆ చేసి అయ్యో ఇంకా దుఆ అంగీకరింపబడటం లేదు, ఇంకా అంగీకరింపబడటం లేదు అని దుఆ చేయడం మానుకోవడం. ఇది కూడా చాలా ప్రమాదకరం. చేస్తూ ఉండండి దుఆ. మీ యొక్క కోరిక, మీరు ఏ విషయం గురించి అయితే అల్లాహ్ తో దుఆ చేస్తున్నారో, అలా చేయడం ఇస్లాం ప్రకారంగా యోగ్యమైనది ఉంటే, అది మీకు పొందే వరకు ఇహలోకపు ఏదైనా అవసరం కావచ్చు, మీ యొక్క మంచి ఉద్యోగం కొరకు కావచ్చు, మీ చదువులో ఉన్నత శిఖరానికి చేరి మంచి ర్యాంకులో పాస్ అవ్వడం కావచ్చు, ఇంకా మంచి భార్య దొరకాలని లేకుంటే మంచి భర్త దొరకాలని కావచ్చు, అలాగే మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే అల్లాహ్ ఆరోగ్యం ప్రసాదించాలని కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మీకు అది ప్రాప్తించే వరకు దుఆ చేస్తూనే ఉండండి కానీ, ఏంటయ్యా, ఓ సంవత్సరం నుండి దుఆనే చేస్తున్నాను, పది సంవత్సరాల నుండి దుఆ చేస్తున్నాను, నాకు సంతానమే కలగటం లేదు అని దుఆ చేయడం వదులుకోవడం, ఇంకా వేరే తప్పుడు మార్గాలు వెళ్ళడం, ఉదాహరణకు సంతానం లేనివారు ఎంతోమంది ఏం చేస్తారు? దర్గాల వద్దకు వెళ్ళిపోతారు. అది ఇంకా మరింత ఎక్కువ ప్రమాదంలో పడిపోతారు.
మూడో విషయం, ఘోరమైన పాపాలు. ప్రతీ పాపం కూడా చాలా ప్రమాదకరమైనది, నష్టం చేకూర్చేది. కాకపోతే, పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోకపోవడం. ఇది కూడా మన దుఆ అంగీకారానికి అడ్డు కలుగుతుంది. చూడండి కొన్ని సందర్భాల్లో స్వీకరించబడుతుంది, అది అల్లాహ్ యొక్క దయ. అల్లాహ్ ఖురాన్ లో చెప్పిన ప్రకారంగా మనకు ఏం తెలుస్తుంది? ఎన్నో సందర్భాల్లో, అలాగే సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీస్ ప్రకారంగా ద’వతుల్ మజ్లూమ్, అవిశ్వాసి, కాఫిర్, ముష్రిక్, బహుదైవారాధకుల దుఆ కూడా అల్లాహ్ స్వీకరిస్తాడు. కానీ, మనం అల్లాహ్ ను నమ్ముకున్న వాళ్ళము, ముస్లింలము, విశ్వాసులము. మనం పాపాలను, ప్రత్యేకంగా పాపాలలో ఘోర పాపాలు ఏవైతే ఉంటాయో వాటిని వదులుకోవాలి.
ఇక నాలుగవది, అల్లాహు త’ఆలా మనపై విధించిన వాటిని పాటించకపోవడం. అల్లాహు త’ఆలా మనపై ఏ విధులను విధించాడో, ఆ విధులను మనం ఒకవేళ నెరవేర్చకుంటే, మన దుఆలు అంగీకారానికి అవి అడ్డుపడతాయి. అందుకొరకే అల్లాహ్ విధించిన ప్రతీ విధిని మనం పాటిస్తూ ఉండాలి.
ఐదవది, ఏ విషయం మనం అల్లాహ్ తో కోరుతున్నామో, అడుగుతున్నామో, ఇది నాకు కావాలి అని అంటున్నామో అది ఏదైనా పాప విషయం కాకూడదు. ఓ అల్లాహ్, నా కొడుకు టెన్త్ లో మంచిగా పాస్ అయ్యేది ఉంటే, అతడు పబ్జీ గేమ్ ఆడుకోవడానికి మరియు మంచి ఫిలింలు, సీరియల్లు చూసుకుంటూ ఉండడానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తానని నేను వాగ్దానం చేశా. ఓ అల్లాహ్ ఇంకా జీతం దొరకట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు. నాకు మంచిగా డబ్బులు సమకూర్చు ఓ అల్లాహ్. నా కొడుక్కి నేను చేసిన వాగ్దానాన్ని పూర్తి చేస్తాను. మంచిగా ఉందా? పాప కార్యానికి, పాప కార్యం కోరుతూ దుఆ చేయడం జరుగుతుంది కదా, ఇలాంటి దుఆ చేయకూడదు.
అలాగే, బంధుత్వాలు తెగిపోవడానికి, సత్సంబంధాలు ఉండకుండా దూరం కావడానికి అలాంటి దుఆ కూడా చేయకూడదు. ఎవరైనా ఒక బంధువు నుండి ఎప్పుడైనా ఏదైనా మాట మీకు ఇష్టం లేనిది విన్నారు కావచ్చు, ఓ అల్లాహ్ రేపటి నుండి నేను అతని ముఖమే చూడకుండా చెయ్. ఇలా బంధుత్వాల తెగ తెంపులకు దుఆ చేయకూడదు.
అయితే ముఖ్యంగా ఈ ఐదు విషయాలు ఏవైతే మనం మన యొక్క దుఆ అంగీకారానికి అడ్డుగా ఉంటాయో, వాటిని తెలుసుకున్నారు. ఇన్ షా అల్లాహ్ వచ్చే క్లాసులలో ఇందులో ఇంక ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటి వివరాలు, ఖురాన్, హదీసుల ఆధారాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
అల్లాహు త’ఆలా మనందరికీ కూడా దుఆ అతనికి ఇష్టమైన రీతిలో, ప్రవక్త విధానంలో చేస్తూ ఉండే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వ’స్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.