నమాజులో ఏఏ కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి?

344. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో తషహ్హుద్ తరువాత ఇలా దుఆ (ప్రార్ధన) చేస్తూ ఉంటే నేను విన్నాను.

అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యాయి వ ఫిత్నతిల్ మమాతి. అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మినల్ మాసమి వల్ మగ్రమ్.

“దేవా! నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. ‘మసీహిద్దజ్జాల్’ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను. జీవన్మ(*)రణాల పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను. దేవా! పాపాల్లో పడివేసే పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. రుణగ్రస్తుడిని అయ్యే దుస్థితి నుండి నీ శరణు కోరుతున్నాను.”

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీరు రుణగ్రస్త స్థితి నుండి కూడా అంత ఎక్కువగా శరణు కోరుతున్నారెందుకు?” అని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఎందుకంటే మనిషి అప్పుల పాలయితే అసత్యమాడతాడు. వాగ్దాన భంగానికి పాల్పడతాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 149 వ అధ్యాయం – అద్దుఆవు ఖబ్లస్సలాం ]

(*) ‘జీవిత’ పరీక్ష అంటే, మానవ జీవితంలో ఎదురయ్యే పరీక్షలన్నీ అని అర్ధం. ఉదాహరణకు – పనికిమాలిన విషయాల్లో చిక్కుకు పోవడం, మనోవాంఛలకు బలయిపోవడం మొదలైనవి. మరణ పరీక్ష అంటే, మనిషి మరణ ఘడియల్లో దైవానుగ్రహం పట్ల నిరాశ చెందడం, సద్వచనం (కలిమా) పలకలేక పోవడం, ఇస్లాం వ్యతిరేక విషయాలు మాట్లాడటం ఇత్యాదివి. రుణగ్రస్తుడవడం అంటే, అధర్మ కార్యాలు లేక అనవసరమైన పనుల కోసం చేసే అప్పు అన్నమాట. లేదా అప్పుతీర్చే సద్బుద్ధి లేకపోవడం. నిజమైన అవసరాల నిమిత్తం అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అయితే దాంతో పాటు అప్పు తీర్చే స్తోమత కూడా ఉండాలి. ఈ దుఆ (వేడుకోలు) మొదటి భాగం దేవుని హక్కులకు, రెండవభాగం దాసుల హక్కులకు సంభందించినది.

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 25 వ అధ్యాయం – నమాజులో ఏఏ కీడు నుండి దేవుని శరణు కోరాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?

82. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు,

“ఒక్కోసారి షైతాన్ మీలో ఒకరి దగ్గరకు వచ్చి, దీన్నెవరు సృష్టించారు, దాన్నెవరు సృష్టించారు? అని అడుగుతాడు. చివరికి నీ ప్రభువుని ఎవరు సృష్టించారని కూడా దుష్టాలోచనలు కలిగిస్తాడు. అందువల్ల ఇలాంటి దుష్టాలోచనలు మనసులో రేకెత్తినప్పుడు (వెంటనే) మీరు (వాటి కీడు నుంచి) అల్లాహ్ శరణుకోరండి. మీరు స్వయంగా ఇలాంటి పైశాచిక ఆలోచనలకు మనస్సులో తావీయకండి.”

[సహీహ్ బుఖారీ : 59 వ ప్రకరణం – బదాయిల్ ఖల్ఖ్, 11 వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస్ వ జునూదిహీ]

విశ్వాస ప్రకరణం – 58 వ అధ్యాయం – మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నీరు, పాలు, తదితర పదార్ధాల పంపిణీ కుడివైపు నుండి ఆరంభించాలి

1318. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన మంచినీళ్ళు అడిగితే మేము ఒక మేక నుండి పాలు పితికి అందులో కొంచెం బావినీళ్ళు కలిపి ఆయనకు ఇచ్చాము. ఆ సమయంలో హజ్రత్ అబూబకర్ (రధి అల్లాహు అన్హు) ఆయనకు ఎడమ వైపున, హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ముందు వైపున, ఒక పల్లెవాసి కుడి వైపున కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పాలలో కొంత త్రాగి వదిలి పెట్టిన తరువాత “దాన్ని అబూబకర్ (రధి అల్లాహు అన్హు) కు ఇచ్చేయండి” అని హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) అన్నారు . కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పాలగిన్నెను (తన కుడివైపున కూర్చున్న) గ్రామీణవ్యక్తికి ఇచ్చారు. తరువాత ఆయన ఇలా అన్నారు : “మొదట కుడివైపున్న వాడికి .., మొదట కుడివైపున్న వాడికి ఇవ్వాలి గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ కుడివైపు నుండి ప్రారంభించాలి”.

మరి హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) మూడుసార్లు ఇలా పలికారు. “కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం, కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం, కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 4 వ అధ్యాయం – మనిస్ తస్ఖా]

పానీయాల ప్రకరణం : 17 వ అధ్యాయం – నీరు, పాలు, తదితర పదార్ధాల పంపిణీ కుడివైపు నుండి ఆరంభించాలి.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం

882. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

మూడు మస్జిద్ ల దర్శనం కోసం తప్ప మరే పుణ్యస్థల దర్శనం కోసమూ ప్రయాణం చేయకూడదు.
(1) మస్జిదుల్ హరాం (మక్కాలోని కాబా మస్జిద్)
(2) మస్జిదె నబవి (మదీనాలోని ప్రవక్త మస్జిద్)
(3) బైతుల్ మఖ్దిస్ లోని మస్జిదె అఖ్సా

[సహీహ్ బుఖారీ : 20 వ ప్రకరణం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్ మక్కా వ మదీనా – 1 వ అధ్యాయం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్]

హజ్ ప్రకరణం – 95 వ అధ్యాయం – మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నా (ఉమ్మత్) లో ఒక వర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది

1250. హజ్రత్ ముఆవియా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

నా అనుచర సమాజం (ఉమ్మత్) లో ఒకవర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది. ఎవరైనా వారిని అవమాన పరచదలిచినా లేదా వ్యతిరేకించ దలచినా వారా వర్గం (ముస్లింల) కు ఎలాంటి హాని కలిగించలేరు. ఆ విధంగా చివరికి ప్రళయం వచ్చినా అప్పుడు కూడా ఆ వర్గం వారు దైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగానే ఉంటారు.

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 28 వ అధ్యాయం – హద్దసనీ ముహమ్మదుబ్నుల్ ముసన్నా]

పదవుల ప్రకరణం : 53 వ అధ్యాయం – నా అనుచర సమాజంలో ఒక వర్గం ఎల్లప్పుడూ ధర్మంపై స్థిరంగా ఉంటుంది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు

1049. హజ్రత్ ఆమిర్ (రహ్మతుల్లా అలై) కధనం :-

హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రధి అల్లాహు అన్హు) వేదిక ఎక్కి ఇలా అనడం నేను విన్నాను – “మా నాన్నగారు నాకొక కానుక ఇచ్చారు. అయితే (నా తల్లి) హజ్రత్ ఉమ్రా బిన్తె రావాహ (రధి అల్లాహు అన్హ) దీనిపై తన అభిప్రాయం వెలిబుచ్చుతూ “మీరీ కానుక ఇవ్వడం పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ని సాక్షిగా నిలబెట్టనంతవరకు నేను సంతోషించలేను” అని అన్నారు. అందువల్ల మా నాన్నగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్లి “ధైవప్రవక్తా! నేను ఉమ్రా బిన్తె రావాహా (రధి అల్లాహు అన్హ) కడుపున పుట్టిన నా కొడుక్కు ఒక కానుక ఇస్తే దానికి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టాలని అన్నది ఆమె” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “మరి నీవు నీ కొడుకులందరికీ ఇలాగే కానుకలిచ్చావా?” అని అడిగారు. దానికి మా నాన్న లేదన్నారు. అప్పుడు దైవప్రవక్త “దేవునికి భయపడి, నీ కొడుకుల మధ్య న్యాయాన్ని పాటించు” అని బోధించారు. దాంతో మా నాన్నగారు (ఇంటికి) తిరిగొచ్చి తానిచ్చిన కానుకను నా దగ్గరనుండి వాపసు తీసుకున్నారు”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 13 వ అధ్యాయం – లా షహాద ఫిల్ హిబా]

హిబా (స్వయం సమర్పణ) ప్రకరణం : 3 వ అధ్యాయం – సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?

429. హజ్రత్ మస్రూఖ్ (రహ్మతుల్లా అలై) కధనం :-

నేను (ఓసారి) హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ని “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?” అని అడిగాను. దానికామె “ఆయనకు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం” అని సమాధానమిచ్చారు.

“మరి రాత్రివేళ ఆయన (తహజ్జుద్ నమాజు చేయడానికి) ఎప్పుడు లేస్తారు? అని అడిగాను మళ్ళీ. అందుకామె “కోడికూత వినగానే లేస్తారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 7వ అధ్యాయం – మన్ నామ ఇన్ద స్సహార్]

ప్రయాణీకుల నమాజు ప్రకరణం – 17 వ అధ్యాయం – ఇషా నమాజులో పఠించవలసిన రకాతుల సంఖ్య
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా?

111. హజ్రత్ మస్రూఖ్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషాను (రధి అల్లాహు అన్హ) – 

“అమ్మా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును (ప్రత్యక్షంగా) చూశారా?” అని అడిగాను. దానికి ఆమె ఇలా అన్నారు : “నీ మాటలు విని నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నీకు తెలుసా? ఈ మూడు విషయాలను గురించి మీలో ఎవరైనా తన వైపు నుంచి ఏదైనా అంటే అతను అబద్ధాలకోరుగా పరిగణించబడతాడు :

(1) “ఎవరి చూపులూ ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులనూ అందుకోగలడు.”  [దివ్యఖుర్ఆన్ – 6 : 103]
“అల్లాహ్ ఏ మానవునితోనూ ప్రత్యక్షంగా సంభాషించడు. మానవ మాత్రుడికి అది సాధ్యమయ్యే పనికాదు. అల్లాహ్ తన మాటను వహీ ద్వారానో లేక తెరవెనుక నుంచో మాత్రమే మానవునికి చేరవేస్తాడు.”  [దివ్యఖుర్ఆన్ – 42 :51]

(2) అలాగే రేపు జరగబోయే విషయాలేవో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు తెలుసనేవాడు కూడా అబద్దాల కోరే. ఈ సందర్భంలో హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మానవునికీ తెలియదు.” [దివ్యఖుర్ఆన్ – 31 : 34 ]

(3) అదే విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ధర్మానికి సంబంధించిన) ఏదైనా విషయం రహస్యంగా ఉంచారని అనేవాడు కూడా అబద్దాలరాయుడే. దీన్ని గురించి హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “ప్రవక్తా! నీ ప్రభువు నుండి నీపై అవతరించే బోధనలను ప్రజలకు అందజేస్తూ ఉండు. ఒకవేళ నీవలా చేయకపోతే దౌత్య బాధ్యతను నెరవేర్చని వాడవుతావు.”  [దివ్యఖుర్ఆన్ – 5 : 67]

కనుక అసలు విషయం ఏమిటంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను అతని నిజ స్వరూపంలో రెండుసార్లు చూశారు.”

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్, 53 వ సూరా – అన్నజ్మ్ – 1 వ అధ్యాయం – హద్ధసనా యహ్యా]

విశ్వాస ప్రకరణం – 75 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

హజ్ లో – కాబా వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి (Menstruating woman) మినహాయింపు ఉంది

836. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో “దైవప్రవక్తా! సఫియా బిన్తే హుయ్యి (రధి అల్లాహు అన్హు) బహిష్టు అయి ఉంది” అని తెలిపాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మనం ఆగిపోవడానికి ఈమె కారకురాలవుతుందేమో!” అని అన్నారు. ఆ తరువాత “ఆమె మీ అందరితో పాటు ఏదైనా ఒకసారి కాబా ప్రదక్షిణ చేయలేదా?” అని అడిగారు. “ఎందుకు చెయ్యలేదు, చేసింది (సందర్శనా ప్రదక్షిణ)” అన్నా నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే ఇక పరవాలేదు. మనం బయలుదేరవచ్చు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 6 వ ప్రకరణం – హైజ్, 27 వ అధ్యాయం – అల్ మర అతి తహైజు బాదల్ ఇఫాజా]

హజ్ ప్రకరణం – 67 వ అధ్యాయం – వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి మినహాయింపు ఉంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు

753. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒక వ్యక్తి అర్ఫా రోజు (Day of Arafah) వఖూఫ్ (లేచి ఉండు) స్థితిలో ఉండి హఠాత్తుగా ఒంటె మీద నుంచి జారిపడ్డాడు. అతని మెడ ఎముక విరగడంతో (అక్కడికక్కడే) చనిపోయాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అతని భౌతిక కాయానికి రేగాకులు కలిపిన నీళ్ళతో స్నానం చేయించి రెండు వస్త్రాలతో చుట్టండి. శవానికి సువాసన పూయకండి. ముఖం (వస్త్రంతో) కప్పకుండా అలాగే బయట ఉంచండి. ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 20 వ అధ్యాయం – అల్ కఫని ఫి సౌబైన్]

హజ్ ప్రకరణం : 14 వ ప్రకరణం – ఇహ్రాం స్థితిలో యాత్రికుడు చనిపోతే ఏం చేయాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్