మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?

82. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు,

“ఒక్కోసారి షైతాన్ మీలో ఒకరి దగ్గరకు వచ్చి, దీన్నెవరు సృష్టించారు, దాన్నెవరు సృష్టించారు? అని అడుగుతాడు. చివరికి నీ ప్రభువుని ఎవరు సృష్టించారని కూడా దుష్టాలోచనలు కలిగిస్తాడు. అందువల్ల ఇలాంటి దుష్టాలోచనలు మనసులో రేకెత్తినప్పుడు (వెంటనే) మీరు (వాటి కీడు నుంచి) అల్లాహ్ శరణుకోరండి. మీరు స్వయంగా ఇలాంటి పైశాచిక ఆలోచనలకు మనస్సులో తావీయకండి.”

[సహీహ్ బుఖారీ : 59 వ ప్రకరణం – బదాయిల్ ఖల్ఖ్, 11 వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస్ వ జునూదిహీ]

విశ్వాస ప్రకరణం – 58 వ అధ్యాయం – మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఆవులించడం మంచిది కాదు

1885. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఆవులింత షైతాన్ తరఫు నుండి వస్తుంది. కనుక మీలో ఎవరికైనా ఆవులింత వస్తే అతను వీలైనంత వరకు దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించాలి.(*)

(*) ఆవులింత షైతాన్ తరుఫు నుండి వస్తుంది అంటే, మనిషి విలువైన ఆహారాన్ని హద్దు మీరి తినడం వల్ల ఉదర భారంతో ఆవులిస్తాడు. ఇక్కడ హద్దు మీరి తినడాన్ని షైతాన్ చేష్ట గా వర్ణించటం జరిగింది. ఆవులింత అవసరానికి మించి తినడాన్ని సూచిస్తుంది. ఆవులింతను ఆపడం అంటే, ఆవులింతకు కారణభూతమయ్యే పనులను మానుకోవాలని అర్ధం. ఉదాహరణకు మితిమీరి తినడం, అతిగా విశ్రాంతికి అలవడటం ఇత్యాదివి. వీలైనంతవరకు ఆవులింత రాకుండా ఆపుకోవడం అని కూడా అర్ధం వస్తుంది. ఒకవేళ ఆవులింత ఆగకపోతే ఆ సమయంలో షైతాన్ ఆశయం నెరవేరకుండా, అంటే వాడు నోట్లో దూరి మనిషి ముఖాన్ని చెడగొట్టనీకుండా నోటి మీద చెయ్యి పెట్టుకోవాలి. (సంకలన కర్త)

[సహీహ్ బుఖారీ : 59 వ ప్రకరణం – బదయిల్ ఖల్ఖ్ , 11 వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస వ జునూదిహీ]

ప్రేమైక వచనాల ప్రకరణం : 9 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

నమాజు చేయకుండా తెల్లవారే దాకా పడుకునే వ్యక్తి

444. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“మనిషి రాత్రివేళ పడుకున్న తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు. అప్పుడు మనిషి మేల్కొని దేవుడ్ని స్మరించగానే ఒక ముడి ఊడిపోతుంది.తరువాత వుజూ చేస్తే రెండవ ముడి ఊడిపోతుంది. ఆ తరువాత నమాజు చేస్తే మూడవ ముడి కూడా ఊడిపోతుంది. దాంతో ఆ వ్యక్తి తెల్లవారుజామున ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో లేస్తాడు. అలా చేయకపోతే వళ్ళు బరువయి బద్ధకంగా లేస్తాడు”

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 12 వ అధ్యాయం – అఖ్దషైతాని అలా ఖాఫియాతిర్రాస్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 28 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

షైతాన్ పై అజాన్ ప్రభావం

216. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు:-

అజాన్ చెప్పడం ప్రారంభించగానే షైతాన్ వెనక్కి తిరిగి పలాయనం చిత్తగిస్తాడు. (తీవ్రమైన భయాందోళనతొ) వాడికి అపానవాయువు వెలువడుతుంది.  దాంతో వాడు అజాన్ వినరానంత దూరం పారిపోతాడు. అయితే అజాన్ చెప్పడం అయిపోగానే వాడు మళ్ళీ (ప్రార్ధనా స్థలానికి) చేరుకుంటాడు. ఇఖామత్ చెప్పగానే తిరిగి తోకముడిచి పారిపోతాడు. ఇఖామత్ చెప్పడం అయిపోగానే మళ్ళీ వచ్చి మానవుని హృదయంలో దుష్టాలోచనలు రేకేత్తిస్తాడు. మనిషికి అంతకు ముందు గుర్తుకురాని విషయాలన్నిటినీ (నమాజు కోసం నిలబడగానే) గుర్తు చేస్తూ ‘ఇది జ్ఞాపకం తెచ్చుకో’, ‘అది జ్ఞాపకం తెచ్చుకో’ అని పురిగొల్పుతాడు. దాంతో మనిషికి (వాడి మాయజాలంలో పడిపోయి) తాను ఎన్ని రకాతులు పఠించానన్న సంగతి కూడా జ్ఞాపకం ఉండదు.

[సహీహ్ బుఖారీ : 10 ప్రకరణం – అజాన్, 4 వ అధ్యాయం – ఫజ్లిత్తాజీన్]

నమాజు ప్రకరణం – 8వ అధ్యాయం – అజాన్ ఔన్నత్యం – షైతాన్ పై దాని ప్రభావం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2

సకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్