అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమ
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Tp1VpjyAmIc [12 నిముషాలు]
ఈ ప్రసంగంలో ఒక విశ్వాసి యొక్క ప్రేమకు సంబంధించిన ప్రాధాన్యతలను గూర్చి వివరించబడింది. అన్నిటికంటే ముఖ్యమైన ప్రేమ అల్లాహ్ పట్ల ఉండాలని, అది ఆరాధనలో అత్యుత్తమ శ్రేణి అని చెప్పబడింది. ఆ తర్వాత, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ అత్యంత ప్రగాఢంగా ఉండాలని బోధించబడింది. విశ్వాస మాధుర్యాన్ని రుచి చూడాలంటే ఉండవలసిన మూడు లక్షణాలను ఒక హదీస్ ద్వారా వివరించారు: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను అందరికంటే ఎక్కువగా ప్రేమించడం, కేవలం అల్లాహ్ కొరకు ఇతరులను ప్రేమించడం, మరియు అవిశ్వాసం వైపు తిరిగి వెళ్ళడాన్ని అగ్నిలో పడవేయబడటం వలె ద్వేషించడం. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, పిల్లలు, సమస్త మానవాళి, చివరకు తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించనంత వరకు అతని విశ్వాసం పరిపూర్ణం కాదని స్పష్టం చేయబడింది.
ఇన్నల్ హందలిల్లాహి వహ్దహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్ అమ్మా బ’అద్.
అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
ఈ రోజు మనం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అల్లాహ్ పట్ల ప్రేమ
అందరి కన్నా ముందు అల్లాహ్ యెడల ప్రేమాతిశయంతో మెలగవలసిన బాధ్యత దాసునిపై ఉంది. అందరికన్నా ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ, ప్రేమలో ప్రథమ స్థానం అనేది అది అల్లాహ్ పట్ల కలిగి ఉండాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సూరహ్ బఖర, ఆయత్ 165 లో ఇలా తెలియజేశాడు,
وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ
(వల్ లజీన ఆమనూ అశద్దు హుబ్బల్ లిల్లాహ్)
“విశ్వసించిన వారు అల్లాహ్ ను ప్రగాఢంగా ప్రేమిస్తారు.” (2:165)
అంటే అందరికన్నా ముందు అల్లాహ్ యెడల ప్రేమాతిశయంతో మెలగవలసిన బాధ్యత దాసునిపై ఉంది అంటే ఇది ఆరాధనలో అత్యుత్తమ శ్రేణికి చెందిన అంశం. అల్లాహ్ పట్ల ప్రేమ అనేది ఇది ఆరాధన విషయంలో అత్యుత్తమ శ్రేణికి చెందిన అంశం ఇది. అందుకు ప్రపంచంలో అందరికంటే, అన్నిటికంటే, చివరికి ప్రవక్తల కంటే ఎక్కువగా అల్లాహ్ పట్ల ప్రేమ కలిగి ఉండాలి.
إِنَّ الَّذِينَ آمَنُوا
(ఇన్నల్ లజీన ఆమనూ)
ఎవరైతే విశ్వసించారో (విశ్వాసులు),
أَشَدُّ حُبًّا لِّلَّهِ
(అషద్దు హుబ్బల్ లిల్లాహ్)
అల్లాహ్ ను ప్రగాఢంగా ప్రేమిస్తారు. ఎందుకంటే అసంఖ్యాకమైన అనుగ్రహాల ద్వారా దయ దలిచే ప్రభువు అల్లాహ్ యే గనక.
అభిమాన సోదరులారా! ఇది ప్రేమ విషయంలో ప్రథమ స్థానం అల్లాహ్ కు చెందుతుంది. మనం అందరినీ ప్రేమిస్తాం, ప్రేమించాలి. బంధువులను, అన్నిటికంటే ఎక్కువ అమ్మానాన్నకి, భార్యాపిల్లలు, స్నేహితులు, మిత్రులు, సమీప బంధువులు, ఇరుగుపొరుగు వారు, ఉపాధ్యాయులు, గురువులు, ఇలా అందరినీ ప్రేమించాలి. కానీ మనం సాధారణంగా ఎక్కువ ప్రేమ ఎవరికి కలిగి ఉంటాము? తల్లిదండ్రులకి, ఆ తర్వాత భార్యా సంతానంకి, సంతానానికి, ఇలా సంబంధం ఎంత దగ్గరగా ఉంటే ప్రేమ అంత ఎక్కువగా ఉంటుంది. ఇది సర్వసాధారణమైన విషయం. కాకపోతే విశ్వాసపరంగా, ధార్మికంగా ఒక దాసుడు, ఒక ముస్లిం అన్నిటికంటే ఎక్కువగా అల్లాహ్ పట్ల మాత్రమే ప్రేమ కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ
రెండవ విషయం, అల్లాహ్ యెడల ప్రేమ తర్వాత, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధిక ప్రేమను కలిగి ఉండటం అవశ్యం, తప్పనిసరి. మొదటి స్థానం అల్లాహ్. అల్లాహ్ ప్రేమ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధిక ప్రేమ కలిగి ఉండటం తప్పనిసరి, అవశ్యం.
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ లో ఇలా సెలవిచ్చారు,
ثَلَاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلَاوَةَ الْإِيمَانِ
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్)
మూడు విషయాలు ఎవరిలోనైతే ఉన్నాయో అతను విశ్వాస మాధుర్యాన్ని పొందాడు.
విశ్వాసం యొక్క మాధుర్యం ఆస్వాదించాలంటే, విశ్వాసంలోని మాధుర్యాన్ని పొందాలంటే మూడు విషయాలు కలిగి ఉండాలని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఆ మూడు విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
మొట్టమొదటి విషయం,
أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا
(అన్ యకూనల్లాహు వ రసూలుహూ అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా)
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని దృష్టిలో అందరికన్నా ఎక్కువగా ప్రియతములై ఉండాలి.
ఇది మొదటి విషయం. విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే మూడు షరతులు, మూడు విషయాలు కలిగి ఉండాలి. ఆ మూడు విషయాలలో ప్రథమమైన విషయం, మొట్టమొదటి విషయం ఏమిటి? అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అతని దృష్టిలో, ఆ వ్యక్తి దృష్టిలో అందరికన్నా ఎక్కువగా ప్రియతములై ఉండాలి. అంటే అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం.
అలాగే రెండవది,
وَأَنْ يُحِبَّ الْمَرْءَ لَا يُحِبُّهُ إِلَّا لِلَّهِ
(వ అన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహూ ఇల్లా లిల్లాహ్)
అతడు ఎవరిని ప్రేమించినా, కేవలం అల్లాహ్ కొరకే ప్రేమించేవాడై ఉండాలి.
ఒక వ్యక్తి ఎవరికి ప్రేమించినా ఆ ప్రేమ అల్లాహ్ కోసం, అల్లాహ్ ప్రసన్నత కోసం అయ్యి ఉండాలి. ఇది రెండో విషయం.
ఇక మూడో విషయం,
وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ بَعْدَ أَنْ أَنْقَذَهُ اللَّهُ مِنْهُ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ
(వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి బ’అద అన్ అన్ ఖ దహుల్లాహు మిన్హు కమా యక్రహు అన్ యుఖ్ దఫ ఫిన్నార్)
అవిశ్వాసం వైపునకు మళ్ళించబడటం అతని దృష్టిలో అగ్నిలో పడవేయబడటం కన్నా ఎక్కువ అయిష్టకరంగా ఉండాలి
ఈ హదీస్ ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఈ హదీస్ ఉంది. ఈ మూడు విషయాలలో చివరి విషయం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తనకు మోక్షం ప్రసాదించిన మీదట, తాను కుఫ్ర్ అంటే అవిశ్వాసం వైపునకు మళ్ళించబడటం అతని దృష్టిలో అగ్నిలో పడవేయబడటం కన్నా ఎక్కువ అయిష్టకరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసాన్ని ప్రసాదించాడు, మోక్షాన్ని ప్రసాదించాడు, హిదాయత్ ని ప్రసాదించాడు, ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి కుఫ్ర్ వైపునకు, అవిశ్వాసం వైపునకు మళ్ళించబడటం అతని దృష్టిలో అగ్నిలో పడవేయటం ఎంత అయిష్టకరమో అంతకంటే ఎక్కువగా కుఫ్ర్ వైపునకు, అవిశ్వాసం వైపునకు మళ్ళించబడటం అంతకంటే ఎక్కువ, అగ్నిలో పడవేయడం కంటే ఎక్కువగా అయిష్టకరంగా ఉండాలి.
ఈ మూడు విషయాలు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో ఆ వ్యక్తి విశ్వాసపు యొక్క, ఈమాన్ యొక్క మాధుర్యాన్ని పొందుతాడు. ఈ మూడు విషయాల్లో మొట్టమొదటి విషయం ఏమిటి? అందరికంటే, అన్నిటికంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉండాలి? అల్లాహ్ కు, అల్లాహ్ ప్రవక్తకు.
అభిమాన సోదరులారా! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَلَدِهِ وَوَالِدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ
లా యు’మిను అహదుకుం హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మ’ఈన్
“మీలో ఏ వ్యక్తి కూడా తన ఆలుబిడ్డల కన్నా, తన తల్లిదండ్రుల కన్నా, సమస్త మానవుల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకు విశ్వాసి కాజాలడు”
అంటే అమ్మానాన్న కంటే ఎక్కువ, భార్యా పిల్లల కంటే ఎక్కువ, సమస్త మానవుల కంటే ఎక్కువ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించినంత వరకు ఆ వ్యక్తి విశ్వాసం పరిపూర్ణం కాజాలదు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే మన విశ్వాసం సంపూర్ణం కావాలంటే, మన విశ్వాసం ఉన్నత స్థాయికి చెందాలంటే మనము అందరికంటే, అన్నిటికంటే ఎక్కువ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించాలి. చివరికి ప్రాణం కంటే ఎక్కువ. అవును, ప్రాణం కంటే ఎక్కువ.
అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.
وَالَّذِي نَفْسِي بِيَدِهِ، حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ نَفْسِهِ
(వల్లదీ నఫ్సీ బియదిహీ, హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ నఫ్సిక్)
ఒక హదీస్ లోని ఒక భాగం ఇది. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా, అంటే అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ సాక్ష్యంతో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా, అల్లాహ్ సాక్షిగా, నీ దృష్టిలో నేను నీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రియతముణ్ణి కానంత వరకు నీ విశ్వాసం సంపూర్ణం కాజాలదు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అంటే ఒక సందర్భంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హును ఉద్దేశించి చెప్పిన మాట ఇది. అంటే ప్రాణం కంటే ఎక్కువగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించనంత వరకు ఆ వ్యక్తి యొక్క విశ్వాసం సంపూర్ణం కాజాలదు, పరిపూర్ణం కాజాలదు అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
ప్రియ సోదరులారా! నా ఈ మాటలకి సారాంశం ఏమిటంటే మనం అందరికంటే మరియు అన్నిటికంటే, అమ్మానాన్న, భార్యాపిల్లలు, ఆస్తి, హోదా, అందం, ఐశ్వర్యం, ధనం, డబ్బు, పదవి, ఇవన్నీ ఈ ప్రపంచం అన్నిటికంటే, చివరికి ప్రాణం కంటే ఎక్కువగా అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను ప్రేమించాలి. వారిద్దరిలో మొదటి స్థానం అల్లాహ్ ది, ఆ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ లలో ఏ విధంగా అల్లాహ్ ప్రేమ గురించి, అల్లాహ్ ప్రవక్త ప్రేమ గురించి చెప్పబడిందో, ఆ విధంగా మనందరూ మనందరికీ ఆ ప్రేమ కలిగి ఉండాలని నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ రీతిలో, ఏ స్థానంలో, ఏ విధంగా అల్లాహ్ ను ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించే శక్తిని, సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. అలాగే ఏ విధంగా, ఏ రీతిలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మనం ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించే శక్తిని ప్రసాదించమని అల్లాహ్ తో వేడుకుంటూ నా ఈ మాటలను ముగిస్తున్నాను.
మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు. వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44297
ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]