హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర – షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర
https://youtu.be/r_3VWYO4FHI [జుమా ఖుత్బా: 25 నిముషాలు]
షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ (హఫిజహుల్లాహ్), జామె అల్ గన్నామ్, జుల్ఫీ, సఊదియ
అనువాదం: షేఖ్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యత, దానివల్ల విశ్వాసం ఎలా పెరుగుతుందో వివరించబడింది. ముఖ్యంగా, రెండవ ఖలీఫా అయిన హజ్రత్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవిత చరిత్రపై దృష్టి సారించబడింది. ఆయన ఇస్లాం స్వీకరణ, ఆయన ధైర్యం, ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలు, ఆయన పరిపాలన, మరియు ఆయన అమరత్వం (షహాదత్) వంటి ముఖ్య ఘట్టాలను హదీసుల ఆధారాలతో వివరించారు. ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఖురాన్ ఆయతులు అవతరించిన సందర్భాలు, ఆయన జ్ఞానం, మరియు ఆయన నిరాడంబర జీవితం గురించి కూడా చర్చించబడింది. ఆయన జీవితం నుండి ముస్లింలు నేర్చుకోవలసిన పాఠాలను ఈ ప్రసంగం ఎత్తి చూపుతుంది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ’అలా ఆలిహి వ’సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

ఓ ముస్లింలారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల జీవిత చరిత్రను తెలుసుకోవడం వలన విశ్వాసం పెరుగుతుంది మరియు నమ్మకం బలపడుతుంది. ఎందుకంటే వారు ఉత్తమ తరానికి చెందినవారు.

ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులందరి మంచి లక్షణాలను ప్రస్తావించడం సున్నత్.

وَمِنَ السُّنَّةِ ذِكْرُ مَحَاسِنِ أَصْحَابِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
(వ మినస్సున్నతి జిక్రు మహాసిని అస్ హాబి రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల మంచి లక్షణాలను ప్రస్తావించడం సున్నత్.

దీని భావం అర్థమైందా? ఎలాగైతే మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ ను పాటించాలి అన్నటువంటి తపన కలిగి ఉంటామో, అయితే సహాబాల చరిత్రను పరస్పరం ఒకరు మరొకరికి తెలుసుకోవడం, వారి చరిత్రలను చదవడం, పిల్లలకు నేర్పడం ఇదంతా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులలో ఒక సున్నత్ ను ఆచరిస్తున్నటువంటి భావం.

ఈ ఖుత్బాలో మనం ఒక గొప్ప సహచరుడి జీవిత చరిత్ర గురించి మాట్లాడుదాము. ఈ సహచరుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి అన్ని యుద్ధాలలో పాల్గొన్నారు. బద్ర్, ఉహుద్, ఖందఖ్ మరియు ముస్లింల ఇతర యుద్ధాలలో పాల్గొన్నారు. ఆయన ఏనుగుల సంఘటన జరిగిన 13 సంవత్సరాల తర్వాత జన్మించారు. ఆయన ఇస్లాం స్వీకరించిన మొదటి వారిలో ఒకరు, మినస్సాబిఖీనల్ అవ్వలీన్ అని అనబడుతుంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి చెప్పారు:

إِنَّ اللهَ جَعَلَ الْحَقَّ عَلَى لِسَانِ عُمَرَ وَقَلْبِهِ
(ఇన్నల్లాహ జ’అలల్ హక్క అలా లిసాని ఉమర వ ఖల్బిహి)
“నిస్సందేహంగా అల్లాహ్ సత్యాన్ని ఆయన (ఉమర్) నాలుకపై మరియు హృదయంపై ఉంచాడు.” (తిర్మిది: 3682, సహీ హదీస్)

మరో ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి ఇచ్చినటువంటి శుభవార్తను శ్రద్ధగా వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో,

وَالَّذِي نَفْسِي بِيَدِهِ مَا لَقِيَكَ الشَّيْطَانُ قَطُّ سَالِكًا فَجًّا إِلَّا سَلَكَ فَجًّا غَيْرَ فَجِّكَ
(వల్లజీ నఫ్సీ బియదిహి, మా లఖియకష్ షైతాను ఖత్తు సాలికన్ ఫజ్జన్ ఇల్లా సలక ఫజ్జన్ గైర ఫజ్జిక్)
షైతాన్ ఎప్పుడూ ఒక దారిలో వెళ్తున్నప్పుడు నిన్ను కలుసుకోడు; అతను నీ దారి కాకుండా వేరే దారిలో వెళ్తాడు.” (సహీ బుఖారీ: 3294, సహీ ముస్లిం: 2396)

హజ్రత్ సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి ఉల్లేఖనం ఇది.

ఏ సహాబీ చరిత్ర ఈరోజు మనం తెలుసుకోబోతున్నామో, ఆయన ఇస్లాం స్వీకరణ ముస్లింలకు ఒక విజయం మరియు వారి చింతల నుండి అంటే బాధల నుండి విముక్తి మరియు కష్టాల నుండి బయట పడటానికి గొప్ప సబబుగా నిలిచింది. అల్లాహు అక్బర్! మరియు ఆయన వలన మరియు ఆయన యొక్క వలస ఒక విజయం మరియు ఆయన యొక్క పరిపాలన కారుణ్యంగా ఉండినది.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఆయన స్వర్గం యొక్క సువార్త పొందిన పది మంది సహాబాలలో ఒకరు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన గురించి ఇలా అన్నారు, “ఈ వ్యక్తి ఇస్లాం స్వీకరించే వరకు అల్లాహ్ ను బహిరంగంగా ఆరాధించడం జరగలేదు“. మా ఉబిదల్లాహు జహరతన్.

ఈయన ఈ ఉమ్మత్ యొక్క ఫారూఖ్. మిహ్రాబ్ యొక్క షహీద్ (అమరవీరుడు). అబూ హఫ్స్, ఉమర్ బిన్ అల్-ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు. సంక్షిప్త వంశావళి, ఉమర్ బిన్ ఖత్తాబ్ బిన్ నుఫైల్ అల్-ఖురషీ.

ఇప్పుడు మనం ఎవరి చరిత్ర తెలుసుకోబోతున్నామో తెలిసింది కదా! కొన్ని ఘనతలు మనం ఇప్పటికే తెలుసుకున్నాము కదా! ఇక ముందుకు చాలా శ్రద్ధగా వినండి.

ఆయన ఇస్లాం స్వీకరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవార్తతో నెరవేరింది. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేశారు,

اَللّٰهُمَّ أَعِزَّ الْإِسْلَامَ بِأَحَبِّ هٰذَيْنِ الرَّجُلَيْنِ إِلَيْكَ: بِأَبِيْ جَهْلٍ أَوْ بِعُمَرَ بْنِ الْخَطَّابِ
(అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ బి అహబ్బి హాజైనిర్ రజులైని ఇలైక, బి అబీ జహ్లిన్ అవ్ బి ఉమరబ్నిల్ ఖత్తాబ్)
“ఓ అల్లాహ్! నీకు ఇద్దరు వ్యక్తులలో ఎవరు ప్రియమైనవారో వారి ద్వారా ఇస్లాంను బలపరచు, అబూ జహల్ లేదా ఉమర్ బిన్ ఖత్తాబ్.”

కాల వకాన అహబ్బుహుమా ఇలైహి ఉమర్ (అతను, అంటే ఇబ్నె ఉమర్, చెప్పారు, వారిలో అంటే వారిద్దరిలో అల్లాహ్ కు అత్యంత ప్రియమైనవారు ఉమర్). ఈ హదీస్ తిర్మిదిలో ఉంది (3681), షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీ అన్నారు.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా అన్నారు,

مَا زِلْنَا أَعِزَّةً مُنْذُ أَسْلَمَ عُمَرُ
(మా జిల్నా అఇజ్జతన్ మున్జు అస్లమ ఉమర్)
“ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా, గర్వంగా ఉండగలిగాము.” (సహీ బుఖారీ: 3684)

తబ్రానీ కబీర్ (10/198) లో ఉంది, హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు,

أَوَّلُ مَنْ جَهَرَ بِالْإِسْلَامِ عُمَرُ بْنُ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ
(అవ్వలు మన్ జహర బిల్ ఇస్లామి ఉమరుబ్నుల్ ఖత్తాబి రదియల్లాహు అన్)
“ఇస్లాం బహిరంగంగా ప్రకటించిన మొదటి వ్యక్తి ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు.” 
[షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ‘సహీహుస్ సీర’ (పేజీ నెం. 193) లో సహీ అన్నారు ఈ ఉల్లేఖనాన్ని]

చరిత్రకారులు ఆయన్ని చాలా పొడవాటి వ్యక్తిగా వర్ణించారు. ఆయన ఎంత పొడవాటి వారంటే గుర్రంపై ఎక్కిన తర్వాత కూడా ఆయన కాళ్లు నేలను తాకేవి. ఆయన పొడవుతో పాటు దృఢంగా, విశాలమైన భుజాలు, కండరాలు, చేతులు, తెల్లటి రంగులో కొద్దిగా ఎరుపు రంగుతో ఉండేవారు.

ఆయన ఘనత మరియు గొప్ప స్థానాన్ని సూచించే అనేక హదీసులు ఉన్నాయి. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,

لَوْ كَانَ نَبِيٌّ بَعْدِي لَكَانَ عُمَرَ بْنَ الْخَطَّابِ
(లవ్ కాన నబియ్యున్ బాదీ లకాన ఉమరబ్నల్ ఖత్తాబ్)
“నా తర్వాత గనక ఎవరైనా ప్రవక్త అయితే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ అయ్యేవారు.” 
(తిర్మిదిలోని హదీస్ 3686, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు.)

అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా అన్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చొని ఉండగా, ఆయన ఇలా అన్నారు, “నేను నిద్రిస్తుండగా నన్ను నేను స్వర్గంలో చూశాను. అప్పుడు ఒక స్త్రీ ఒక రాజ భవనం పక్కన వుజూ చేస్తుంది.” ఎక్కడ ఇది? స్వర్గంలో. ఒక చాలా పెద్ద కోట, దాని పక్కన ఒక స్త్రీ వుజూ చేస్తుంది స్వర్గంలో, ఆ విషయం, ఆ సంఘటన నేను చూశాను. “నేను ఈ రాజ భవనం ఎవరిది?” అని అడిగాను. “అది ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ ది” అని చెప్పారు. నేను ఆయన ఈర్ష్య (గైరత్)ను గుర్తు చేసుకున్నాను మరియు వెనక్కి తిరిగిపోయాను. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా అన్నారు, ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ ఈ మాట ప్రవక్త ద్వారా విని ఏడ్చారు, మళ్ళీ ఇలా అన్నారు, “నేను నా తల్లిదండ్రులను మీకు అర్పింతుగాక ఓ ప్రవక్తా! నేను మీపై ఈర్ష్య పడతానా?” (సహీ ముస్లింలోని పదాలు ఇవి: 2395, సహీ బుఖారీలో కూడా ఉంది: 3680).

ఇక మరో ఉల్లేఖనం వినండి, సహీ ముస్లిం (2390), బుఖారీ (23)లో ఉంది. హజ్రత్ అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నేను నిద్రిస్తుండగా ప్రజలు నాకు చూపబడ్డారు మరియు వారు చొక్కాలు ధరించి ఉన్నారు. వాటిలో కొన్ని ఛాతీ వరకు, మరికొన్ని అంతకంటే తక్కువ ఉన్నాయి. మరియు ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రదియల్లాహు త’ఆలా అన్హు) నాకు చూపబడ్డారు మరియు అతను ఒక చొక్కాను లాగుతూ వెళ్తున్నారు.” అంటే చాలా పొడుగ్గా ఉంది ఆ చొక్కా. అప్పుడు సహాబాలు అడిగారు, “ప్రవక్తా! మీరు దానిని ఎలా వ్యాఖ్యానించారు?” అంటే మీరు చూసిన స్వప్న దాని యొక్క తావీల్ ఏమిటి? ప్రవక్త చెప్పారు, “అద్దీన్” (ధర్మం). అంటే సంపూర్ణంగా, దృఢంగా ధర్మం ప్రకారంగానే జీవించాలి అన్న తపన హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి జీవితంలో చాలా స్పష్టంగా కనవచ్చేది.

సహీ ముస్లిం (2391) మరియు సహీ బుఖారీ (82)లో ఉంది. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అంటున్నారు, “నేను నిద్రిస్తుండగా నాకు ఒక గ్లాసు కనబడింది. అందులో నాకు పాలు ఇవ్వబడ్డాయి. నేను వాటిలో నుండి త్రాగాను. నా గోళ్ల నుండి దాని యొక్క తడి వస్తున్నట్లు నేను గ్రహిస్తున్నాను. అప్పుడు నేను నా మిగిలిన పాలను ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హుకు ఇచ్చాను.” సహాబాలు అడిగారు, “ఓ ప్రవక్తా! మీరు దానిని ఎలా వ్యాఖ్యానించారు?” అంటే ఈ ఖాబ్, కల, స్వప్నం ఏదైతే చూశారో దాని గురించి ఎలా మీరు వ్యాఖ్యానిస్తున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “అల్-ఇల్మ్” (ధర్మ జ్ఞానం). అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్!

హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ముల్హమ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “మీకు ముందున్న తరాలలో కొందరు ముహద్దసూన్ ఉండేవారు. మరియు ఈ నా సమాజంలో అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే, అతను ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రదియల్లాహు త’ఆలా అన్హు) అవుతారు.” (సహీ ముస్లింలోని హదీస్: 2398).

ఇప్పుడు ఇక్కడ మీరు రెండు పదాలు విన్నారు, ఒకటి “ముల్హమ్,” మరొకటి “అల్-ముహద్దస్.” అయితే, అల్-ముహద్దస్ యొక్క బహువచనం “అల్-ముహద్దసూన్.” ఈ రెండు పదాలు ఇస్లామిక్ పరిభాషలో ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండు పదాలు ఒక వ్యక్తికి అల్లాహ్ నుండి ప్రత్యక్షంగా జ్ఞానం లేదా మార్గదర్శకత్వం లభించడాన్ని సూచిస్తాయి. అయితే, అది ప్రవక్తలకు వచ్చే వహీ (దైవవాణి) స్థాయిది కాదు. ఇది ఒక ప్రత్యేక రకమైన విధానం ద్వారా జ్ఞానం, మార్గదర్శకత్వం వారి హృదయాల్లోకి లేదా మనసులోకి ప్రవహిస్తుంది. క్రింద మనం మరికొన్ని హదీసులు చూడబోతున్నాము, తర్వాత వినబోతున్నాము. వాటిని శ్రద్ధగా వహించండి, శ్రద్ధగా వినండి, మీకు ఈ విషయం అర్థమవుతుంది.

విషయం ఏమిటంటే, హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆలోచనల, అభిప్రాయాలకు అనుగుణంగా అనేక సందర్భాలలో ఖురాన్ అవతరించింది.

కాల ఉమర్ (హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు), “నేను నా ప్రభువుతో మూడు విషయాలలో ఏకీభవించాను.” నేను అన్నాను, “ఓ ప్రవక్తా! మనం మకామె ఇబ్రాహీం ని ప్రార్థనా స్థలంగా చేసుకుంటే బాగుండేది.” అప్పుడు అల్లాహు త’ఆలా ఆయత్ అవతరింపజేశాడు,

وَاتَّخِذُوا مِنْ مَقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى
(వత్తఖిజూ మిమ్ మఖామి ఇబ్రాహీమ ముసల్లా)
“మీరు ఇబ్రాహీం నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి.” 
(ఈ పూర్తి వివరణ చూడండి మీరు సూరతుల్ బఖరహ్, సూర 2, ఆయత్ నెం. 125).

మరియు నేను, అలాగే రెండవది హిజాబ్ ఆయత్. అంటే, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చెప్పాను, “ఓ ప్రవక్తా! మీరు మీ భార్యలను హిజాబ్ ధరించమని ఆజ్ఞాపిస్తే బాగుండేది. ఎందుకంటే మంచివారు మరియు చెడ్డవారు వారితో మాట్లాడుతారు.” అప్పుడు అల్లాహు త’ఆలా ఆయతుల్ హిజాబ్, హిజాబ్ (పరదా)కు సంబంధించిన ఆయత్ అవతరింపజేశాడు (చూడవచ్చును సూరతుల్ అహ్ జాబ్, సూర నెం. 33, ఆయత్ నెం. 53).

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలందరూ ఏకమై, వారి జీవనభృతిని పెంచాలని ప్రవక్తతో డిమాండ్ చేశారు. అంటే, అల్లాహ్ యొక్క దయతో, మదీనా వలస వచ్చిన తర్వాత వెంటనే ఎలాంటి బీదరికం, పేదరికం మరియు జీవన విషయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉండినవి, కొన్ని సంవత్సరాలలో అల్ హందులిల్లాహ్ అవి దూరమైపోయి, ధనం ఎక్కువగా రావడం మొదలైపోయింది. అందరి జీవితాల్లో కొన్ని రకాల సుఖశాంతులు పెరిగాయి. అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యలు కూడా మా జీవనభృతిని పెంచాలని ప్రవక్తతో డిమాండ్ చేశారు. హజ్రత్ ఉమర్ ఈ విషయాన్ని విని, వారితో చెప్పారు,

عَسَىٰ رَبُّهُ إِنْ طَلَّقَكُنَّ أَنْ يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِنْكُنَّ
(అసా రబ్బుహూ ఇన్ తల్లఖకున్న అన్ యుబ్దిలహూ అజ్వాజన్ ఖైరమ్ మిన్ కున్)
“ఒకవేళ అతను (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) మీకు విడాకులిస్తే, అతి త్వరలోనే ఆయన ప్రభువు ఆయనకు మీకన్నా ఉత్తమరాలైన భార్యలను ప్రసాదిస్తాడు.”

నేను ఈ మాట వారితో చెప్పాను. ఆ తర్వాత అల్లాహు త’ఆలా ఖురాన్ ఆయత్ సూరత్ అత్-తహ్రీమ్ లో అవతరింపజేశాడు.
(సూరత్ అత్-తహ్రీమ్, సూర నెం. 66, ఆయత్ నెం. 5).

ఈ విధంగా సోదర మహాశయులారా, సోదర మహాశయులారా, హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎంత గొప్ప ధర్మ జ్ఞానం కలవారో, వారికి ధర్మం పట్ల ఎంత ఆసక్తి ఉండినదో ఈ విషయాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు, బద్ర్ ఖైదీల విషయంలో, మునాఫికీన్ (కపటుల) కోసం నమాజ్ చేసే విషయంలో, అలాగే ఖమర్ (మద్యం) నిషేధంలో ఇంకా ఇతర సందర్భాలలో ఏకీభవించారు. అంటే హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అభిప్రాయ ప్రకారం అల్లాహు త’ఆలా ఖురాన్ ఆయత్లను అవతరింపజేశాడు. ఇక్కడ గమనిస్తున్నారు కదా! హజ్రత్ ఉమర్ కు అనుగుణంగా అల్లాహ్ అవతరింపజేశాడు అని భావం ఈ పదాలలో కాదు తీసుకునేది. అల్లాహ్ కు అన్ని విషయాలు ముందే తెలుసు. హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు నోట ఆ విషయాలు వెలువడిరించాడు అల్లాహు త’ఆలా. ఆ తర్వాత ఆ భావంలో ఆ ఆయతులు అవతరింపజేశాడు. అర్థమైంది కదా!

హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు సహచరులలో అత్యంత జ్ఞానవంతులు మరియు మేధావి. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా అన్నారు, “ఉమర్ జ్ఞానాన్ని త్రాసులోని ఒక పళ్ళెంలో మరియు భూమిపై ఉన్నవారి జ్ఞానాన్ని మరొక పళ్ళెంలో ఉంచితే, ఉమర్ జ్ఞానం వాటిని మించిపోతుంది.” అల్లాహు అక్బర్! ఈ విషయం ఎక్కడ ఉంది? ఇమామ్ అబూ ఖైతమ రహిమహుల్లాహ్ వారి ‘అల్-ఇల్మ్’ పుస్తకంలో మరియు షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీని యొక్క సనదును సహీ అన్నారు. మరో ఉల్లేఖనంలో ఉంది, “జ్ఞానాన్ని పది భాగాలు చేస్తే, వాటిలో తొమ్మిది భాగాలు ఉమర్ వద్ద ఉండినవి” అని సహాబాలు భావించేవారు. అంటే ఉమర్ అంత గొప్ప జ్ఞాని మరియు అల్లాహ్ తో భయపడేవారని అర్థం.

కనుక అల్లాహ్, ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు పట్ల సంతృప్తి చెంది మరియు అందరిలో ఆయన్ని సంతృప్తినిగా చేయుగాక. మన వైపు నుండి మరియు ముస్లింల వైపు నుండి ఆయనకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక. నిస్సందేహంగా అల్లాహ్ ప్రతి దానిపై శక్తిమంతుడు.

أَعُوذُ بِاللهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنْصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُمْ بِإِحْسَانٍ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
ముహాజిర్లలోనూ, అన్సారులలోనూ ఎవరైతే అందరికన్నా ముందున్నారో, తొలివారో మరియు సద్వర్తనతో వారిని అనుసరించిన వారితో అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు కూడా ఆయనతో ప్రసన్నులయ్యారు. ఆయన వారి కొరకు క్రింద కాలువలు ప్రవహించే తోటలను సిద్ధపరచి ఉంచాడు. వారు వాటిలో కలకాలం ఉంటారు. ఇదే గొప్ప విజయం. (9:100)

బారకల్లాహు లీ వలకుమ్ ఫిల్ ఖుర్ఆనిల్ అజీమ్, వ నఫ’అనీ వ ఇయ్యాకుమ్ మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీమ్. అస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్.

అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అల్లాహ్ యొక్క దాసులారా! అల్లాహ్ కు నిజంగా భయపడండి మరియు మీ రహస్య, బహిరంగాలను అల్లాహ్ గమనిస్తున్నాడని నమ్మండి.

ఓ ముస్లింలారా! హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తర్వాత హిజ్రీ 13వ సంవత్సరంలో ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఖలీఫాగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ధర్మవంతుడు, భయభక్తులు గలవాడు, నిరాడంబరుడు మరియు అల్లాహ్ విషయంలో ఏ నిందకు భయపడేవారు కారు. ఆయన పాలనలో అనేక విజయాలు సాధించబడ్డాయి మరియు పర్షియన్ మరియు రోమన్ లాంటి పెద్ద సామ్రాజ్యాలు పతనమయ్యాయి. ఇవి ఆయ పాలనలో, ఇవి ఆయన పాలనలో గొప్ప విజయాలలో ఒకటి.

ఆయన పాలనలో ఒక సంవత్సరంలో ప్రజలు తీవ్రమైన కరువును ఎదుర్కొన్నారు. భూమి ఎండిపోయింది, నల్లబడిపోయింది మరియు వర్షం ఆగిపోయింది. ఆ సంవత్సరాన్ని ‘ఆమ్ ఉర్-రమాదా’ (బూడిద సంవత్సరం) అని పిలిచారు. ఆయన రొట్టె మరియు నూనె తినేవారు ఆ సమయంలో మరియు ఇలా అనేవారు, “ముస్లింల పిల్లలు కడుపు నిండా తినే వరకు నేను కడుపు నిండా తినను.” మరియు ఆయన రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా అన్నారు, “పగటి పూట నేను నిద్రిస్తే, నా ప్రజలు నష్టపోతారు. రాత్రి పూట నేను నిద్రిస్తే, నా ఆత్మ నష్టపోతుంది.” అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్!

ఓ అల్లాహ్ దాసులారా! త్యాగాలు మరియు విజయాలు ఇంకా అచీవ్మెంట్స్ తో నిండిన జీవితం గడిపిన తర్వాత, అల్లాహ్ ఆయనకి షహాదత్ (అమరవీరత్వాన్ని) ప్రసాదించాడు.

ఎలా? హిజ్రీ 23వ సంవత్సరంలో ఫజ్ర్ నమాజ్ చేయిస్తున్నప్పుడు, విశ్వద్రోహి, దుర్మార్గుడైన అబూ లూలుఆ అల్-మజూసీ చేత రెండు అంచుల కత్తితో పొడిచి చంపబడ్డారు. అల్లాహు అక్బర్! ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్.

ముస్నద్ అహ్మద్ లో హదీస్ ఉంది (హదీస్ నెం. 89), ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు శుక్రవారం రోజు మింబర్ పై ప్రజలకు ఖుత్బా ఇస్తూ అల్లాహ్ ను స్తుతించి, ప్రశంసించారు. ఆపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హును ప్రస్తావించారు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు, “నేను ఒక కల చూశాను. అది నా మరణానికి సూచన అని నేను భావిస్తున్నాను. ఒక కోడి నన్ను రెండు సార్లు పొడిచినట్లు నేను చూశాను.” అల్లాహు అక్బర్! మళ్ళీ అతను ఇలా అన్నాడు, “మరియు అది ఎర్ర కోడి అని నాకు చెప్పబడింది.” నేను ఈ కలను హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క భార్య అయిన అస్మా బిన్తె ఉమైస్ కు వివరించాను. ఆమె చెప్పింది, “నిన్ను ఒక అజమీ (అంటే అరబ్బేతరుడు) చంపుతాడు.” అల్లాహు అక్బర్!

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి అమరవీరత్వం గురించి, షహాదత్ గురించి శుభవార్త ఇచ్చారు. హజ్రత్ అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబకర్, ఉమర్ మరియు ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హుమ్ లతో కలిసి ఉహుద్ పర్వతంపైకి ఎక్కారు. పర్వతం కొంచెం కంపించింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “నిశ్చలంగా ఉండు, కదలకుండా ఉండు ఓ ఉహుద్! ఎందుకంటే నీపై ఒక ప్రవక్త, ఒక సత్యవంతుడు మరియు ఇద్దరు అమరవీరులు (షహీదులు) ఉన్నారు.” ఇది సహీ బుఖారీలోని హదీస్ (3675).

మదీనాలో అమరవీరుడిగా మరణించాలనే ఆయన దుఆ, కోరికలను కూడా అల్లాహు త’ఆలా అంగీకరించాడు. ఏంటి విషయం? హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా దుఆ చేసేవారు,

اَللّٰهُمَّ ارْزُقْنِيْ شَهَادَةً فِيْ سَبِيْلِكَ، وَاجْعَلْ مَوْتِيْ فِيْ بَلَدِ رَسُوْلِكَ
(అల్లాహుమ్మర్ జుఖ్నీ షహాదతన్ ఫీ సబీలిక్, వజ్’అల్ మౌతీ ఫీ బలది రసూలిక్)
“ఓ అల్లాహ్! నీ మార్గంలో నాకు షహాదత్ (అమరవీరత్వం) ప్రసాదించు మరియు నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నగరంలో నాకు మరణం ప్రసాదించు.” (సహీ బుఖారీ: 1890).

అలీ ఇబ్ను అబీ తాలిబ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు గురించి ఆయనకు కఫన్ ధరింపజేయబడిన తర్వాత మరియు ఆయన యొక్క జనాజా నమాజ్ చేయకముందు ఇలా చెప్పారు, “అల్లాహ్ సాక్షి! నీలాంటి మనిషి చేసిన పని తప్ప ఇంకే మనిషి చేసిన పనితో అల్లాహ్ ను కలుసుకోవాలని నేను కోరుకోను.” (సహీ ముస్లిం: 2389). అల్లాహు అక్బర్! ఎంత గొప్ప విషయం గమనించండి! హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు ఏమంటున్నారు? నేను అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు నీలాంటి సత్కార్యాలు చేసి కలుసుకోవాలి అన్నటువంటి కోరిక నాది ఉన్నది. అంటే అలీ రదియల్లాహు త’ఆలా అన్హు దృష్టిలో కూడా ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎంత గొప్పవారో గమనించండి. ఇక ఎవరైతే హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారిని దూషిస్తారో, తిడతారో మరియు తమకు తాము మేము అలీ రదియల్లాహు త’ఆలా అన్హుతో ప్రేమిస్తాము అని అనుకుంటారో, వారు స్వయంగా హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు విధానానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న విషయం గమనించండి. సహీ ముస్లింలోని హదీస్ ఇది, 2389 ఏదైతే మీరు విన్నారో.

కనుక అల్లాహ్, ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు పై దయచూపుగాక మరియు ఇస్లాం మరియు ముస్లింల తరఫున ఆయనకి ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక. ఆ తర్వాత, ఓ ముస్లింలారా! ఈ సుగంధిత జీవిత చరిత్రను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. దానిని మన ఆత్మలలో, మన పిల్లల ఆత్మలలో మరియు మన సమాజాలలో నాటాలి. దానిని అనుసరించడానికి మరియు ఆదర్శంగా తీసుకోవడానికి ఉన్నతమైన ఉదాహరణగా చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “నా తర్వాత అబూబకర్ మరియు ఉమర్ లను అనుసరించండి.” (తిర్మిది: 3662, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీ అన్నారు).

సలఫె సాలిహీన్ తమ పిల్లలకు అబూబకర్ మరియు ఉమర్ ల పట్ల ప్రేమను, ఖురాన్ సూరాలను నేర్పినట్లే నేర్పేవారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ఇమామ్ మాలిక్ రహిమతుల్లాహ్ చెప్పిన మాట, ‘మువత్తా ఇమామ్ మాలిక్’లో ఉంది. అలాగే ‘షర్హు ఉసూలి ఇ’తిఖాది అహ్లిస్సున్న వల్ జమా’లో ఉంది.

అల్లాహ్ మనకు మరియు మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ప్రేమను ప్రసాదించుగాక మరియు ఆయన దయగల నివాసంలో ప్రవక్తలతో, సత్యవంతులతో, అమరవీరులతో మరియు సజ్జనులతో మనలను ఏకం చేయుగాక. మరియు వారు ఎంత మంచి సహచరులు!

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వ సలామున్ అలల్ ముర్సలీన్, వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
“నీ ప్రభువు, సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారు ఆపాదించే వాటి నుండి పవిత్రుడు. మరియు ప్రవక్తలపై శాంతి కలుగుగాక. మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.”

వ’అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.