అంతిమ దినం పై విశ్వాసం [5] : నరక  విశేషాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

మొదటి ఖుత్బా :-  

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం, లెక్కల పత్రము శిక్ష ప్రతిఫలం గురించి స్వర్గం గురిచి తెలుసుకున్నాం. ఈ రోజు మనం నరకం గురించి తెలుసుకుందాం. 

1. ఓ అల్లాహ్ దాసులారా! అంతిమ దినం పై విశ్వాసంలో స్వర్గనరకాలను విశ్వసించడం కూడా ఉంది. ఈ రెండూ శాశ్వతమైన నివాసాలు, స్వర్గం ఆనందాల నిలయం, విశ్వాసులు మరియు పవిత్రమైన దాసుల కోసం అల్లాహ్ సిద్ధం చేశాడు. నరకం శిక్షా స్థలం, ఇది రెండు రకాల వ్యక్తుల కోసం అల్లాహ్ సిద్దం చేశాడు: అవిశ్వాసులు మరియు పెద్ద పాపాలకు పాల్పడ్డ విశ్వాసులు. 

2. ఓ విశ్వాసులారా! నరకానికి వెళ్ళే విశ్వాసులను శిక్షించడంలో అల్లాహ్ జ్ఞానము వివేకం ఏమిటంటే, వారు పాపాల నుండి శుద్ధి చేయబడతారు, ఆ తర్వాత అల్లాహ్ వారిని స్వర్గంలోకి ప్రవేశపెడతాడు. ఎందుకంటే స్వర్గం స్వచ్ఛమైన ప్రదేశం, కాబట్టి స్వచ్ఛమైన ఆత్మలు మాత్రమే అక్కడ ఉంటాయి. పాపం అపరిశుభ్రత మరియు అపవిత్రమైనది కాబట్టి మొదట ఈ పాపాల నుండి శుద్ధి చేసుకోవడం తప్పనిసరి. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క వివేకం. అయితే అల్లాహ్, పెద్ద పాపాలు చేసిన ఏక దైవారాధకులకు ఎటువంటి శిక్ష లేకుండా కూడా క్షమించి వారిని స్వర్గంలోకి ప్రవేశింప చేయగలడు. సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ ఇలా అంటున్నాడు. 

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ

(తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.) (4:48)

కావున అల్లాహ్ ఎవరిని క్షమించినా అది ఆయన దయ, కరుణ. మరియు అల్లాహ్ ఎవరిని శిక్షించినా అది అయన న్యాయం. అవిశ్వాసుల విషయానికొస్తే, వారిని శిక్షించడంలో ఆయన వివేకం ఏమిటంటే వారిని కించపరచడం అవమానపాలు చేయడం. కానీ వారిని శుద్ధి చేయడం కాదు, ఎందుకంటే వారి యొక్క అవిశ్వాసం  వారి హృదయాలలో నాటుకుపోయింది. అది అగ్నితో కూడా శుద్ధి చేయబడదు. అందుకే వారు శాశ్వతంగా ఆ నరకంలోనే ఉంటారు. 

3. నరకంలో అనేక రకాల శిక్షలు ఉన్నాయి. వాటిని మన ఆలోచనల ద్వారా కూడా ఊహించలేము. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ۚ وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ ۚ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا

(అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!! (18:29)

మరొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు.

إِنَّ اللَّهَ لَعَنَ الْكَافِرِينَ وَأَعَدَّ لَهُمْ سَعِيرًا خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرً يَوْمَ تُقَلَّبُ وُجُوهُهُمْ فِي النَّارِ يَقُولُونَ يَا لَيْتَنَا أَطَعْنَا اللَّهَ وَأَطَعْنَا الرَّسُولَا

అల్లాహ్‌ అవిశ్వాసులను శపించాడు. ఇంకా వారి కోసం మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాడు. అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు. వారు ఏ సంరక్షకుణ్ణీ, సహాయకుణ్ణీ పొందలేరు. ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింపబడతాయి. అప్పుడు వారు, “అయ్యో! మేము అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బావుండేది?” అని అంటారు. (33: 64-66 )

4. అవిశ్వాసులు ఎల్లకాలం నరకంలోనే ఉంటారు అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే పాపాత్ములైన విశ్వాసులు మాత్రం అల్లాహ్ వారిని క్షమించకపోతే వారు చేసిన పాపాలకారణంగా ఒక నిర్దిష్ట కాలము వరకు వారు శిక్ష అనుభవిస్తారు. ఉదాహరణకు నాలుక ద్వారా జరిగినటువంటి పాపాలు లేక మర్మాంగం ద్వారా జరిగిన పాపాలు లేక బంధుత్వం సంబంధాలను తెంచుకోవడం, నిషేధితలకు బానిసవడం, హరామ్ మాట్లాడడం, హరామ్ చూడడం, హరామ్ తినడం మొదలైనవి.  అదేవిధంగా సజ్దా చేసే చోటు అగ్ని చేరుకోలేదు ఇది నమాజ్ ఔన్నత్యం తెలియజేస్తుంది. అగ్ని వారిలో కొందరి మడమల దాకా చేరుకుంటుంది మరికొందరి మోకాళ్ల వరకు చేరుకుంటుంది కొందరి నడుముల వరకు చేరుకుంటుంది మరికొందరికి పీకల వరకు చేరుకుంటుంది. (ముస్లిం) 

దీని ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే నరకంలో వివిధ రకాలుగా శిక్షించడం జరుగుతుంది. పాపాత్ములైన విశ్వాసులు నరకంలో తమ శిక్షను అనుభవిస్తారు. వారి శిక్ష పూర్తి అయినా తరువాత అప్పుడు వారు నరకం నుంచి బయటకు తీయబడతారు. వారు నల్లటి బొగ్గు స్థితిలో ఉంటారు. అప్పుడు వారిని స్వర్గం యొక్క ఒడ్డు భాగాన ఉన్న ఒక సెలయేరులో వేయడం జరుగుతుంది. దానిని జీవజలం అని కూడా అంటారు. అప్పుడు వారు ఏ విధంగా అయితే నీటి ప్రవాహం నుంచి విత్తనం జనిస్తుందో అలానే వారు దాని నుంచి లేస్తారు (బుఖారి ముస్లిం) 

ఆ పాపులైన విశ్వాసులను శుద్ధి చేయబడిన తరువాత వారిని తిరిగి స్వర్గంలోకి ప్రవేశింప చేయడం జరుగుతుంది. 

5. నరకం యొక్క నిర్మాణం చాలా పెద్దది, దాని దృశ్యం చాలా భయంకరమైనది మరియు దాని దహనం చాలా తీవ్రమైనది. దీనికి రుజువు అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) గారి ఈ హదీసు, అతను ఇలా తెలియజేశాడు:

“నరకానికి డెబ్బై వేల కళ్ళాలు ఉంటాయి ప్రతి కళ్ళానికి డెబ్బై వేలమంది దైవదూతలు పట్టుకుని లాగుతూ ఉంటారు. ఆరోజున అలాంటి స్థితిలో నరకం తీసుకురాబడుతుంది”. (ముస్లిం) 

6. దాని దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది ఇది మనకు అల్లాహ్ యొక్క వాక్యం ద్వారా తెలుస్తుంది. 

إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
(నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పు రవ్వలను విసురుతుంది.) (77:32)

అనగా నరకం అగ్ని రవ్వ లను విసురుతుంది. అవి పెద్ద భవంతుల్లాగా ఉంటాయి. ఈ వాక్యంలో ఉన్న ఈ పదం అర్థం చెట్టు యొక్క మొదలు కనుక నరకంలో ఎగిసిపడేటువంటి ఆ యొక్క అగ్ని రవ్వలు చెట్టు యొక్క మొదలులా ఉంటాయి. మేము దాని నుంచి అల్లాహ్ శరణు కోరుతున్నాము. (తఫ్సీర్ ఇబ్నే జరీర్) 

7. నరకం చాలా కఠినంగా దహిస్తుంది. హదీస్ లో ఈ విధంగా వస్తుంది – “మానవుడు వెలిగించే ఈ భూలోక అగ్ని నరకాగ్నిలో 70వ వంతు” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులు ఇలా విన్నవించుకున్నారు: “అల్లాహ్ సాక్షి ఓ ప్రవక్తా! మానవుల్ని దహించడానికి ఈ అగ్నే చాలు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “కాని అది భూలోక అగ్ని కన్నా 69 రెట్లు వేడిగా ఉంటుంది. దాని ప్రతిభాగం ఈ లోకపు అగ్నిలా వేడిగా ఉంటుంది.”.(బుఖారి,ముస్లిం) 

8. ఓ ముస్లింలారా! నరకానికి 7 ద్వారాలు ఉన్నాయి నరకవాసులందరూ తమ పాపాలకు అనుగుణంగా ప్రత్యేక ద్వారం నుంచి ప్రవేశిస్తారు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ

(అలాంటి) వారందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు నరకం. దానికి ఏడు ద్వారాలు ఉంటాయి. ఒక్కో ద్వారం వారిలోని ఒక్కో వర్గం కోసం కేటాయించబడింది. (15:43-44)

9. నరకంలో అనేక తరగతులు ఉన్నాయి. ఎందుకంటే నరకవాసుల శిక్ష వారి పాపాలకు అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నరక వాసుల కొరకు తినడానికి చీముని ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
గాయాల కడుగు నీరు తప్ప మరొకటేదీ వీడికి ఆహారంగా లభించదు. (69:36)

నరకవాసులలో కొందరికి తినడానికి ముండ్ల చెట్టుని ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ
వారికి తినడానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు. (88:6)

నరకవాసులలో మరికొందరికి తినడానికి గాను రాకాసిజముడుని ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

إِنَّ شَجَرَتَ الزَّقُّومِ طَعَامُ الْأَثِيمِ كَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِ

నిశ్చయంగా జెముడు వృక్షం (జఖ్ఖూమ్‌ చెట్టు). పాపాత్ముల ఆహారంగా ఉంటుంది. అది నూనె గసి లాగా ఉంటుంది. కడుపులోకి పోయి ఉడుకుతూ ఉంటుంది. (44:43-45)

రాకాసి జముడు చెట్టు ఇది నరక అడుగుభాగం లో పండుతుంది. దీనిని చూడడానికి తినడానికి అసహ్యకరంగా ఉంటుంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

 أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ

(ఈ ఆతిథ్యం మంచిదా? లేక జఖ్ఖూమ్‌ (నరకంలోని జెముడు) వృక్షం (మంచిదా?) దానిని మేము దుర్మార్గుల కోసం పరీక్షగా చేసి ఉంచాము. నిశ్చయంగా ఆ వృక్షం వేరు నరకం వేరు (అట్టడుగు భాగం) నుంచి మొలకెత్తుతుంది. దాని పండ్ల గుత్తులు షైతానుల తలల మాదిరిగా ఉంటాయి. మరి (నరకవాసులు) దాన్నుంచే తింటారు. దాంతోనే తమ పొట్టలు నింపుకుంటారు.) 

10. నరకంలో త్రాగడానికి సలసల కాగుతున్న నీరుని ఇవ్వడం జరుగుతుంది. వాటిని వారి తలల మీద పోయడం జరుగుతుంది. దాని ద్వారా శరీర బయట భాగము మరియు వెలుపల భాగము కాలిపోతుంది. మరియు దాని వలన వారి వారి శరీరంపై ఉన్న తోలు లేచిపోతుంది అల్లాహ్ ఇలా అంటున్నాడు. 

 هَٰذَانِ خَصْمَانِ اخْتَصَمُوا فِي رَبِّهِمْ ۖ فَالَّذِينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّن نَّارٍ يُصَبُّ مِن فَوْقِ رُءُوسِهِمُ الْحَمِيمُ يُصْهَرُ بِهِ مَا فِي بُطُونِهِمْ وَالْجُلُودُ

(అయితే అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించ బడుతుంది. దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి.) (22:19-20)

మరోచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు. 

وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ

(పేగులను సయితం ముక్కలు ముక్కలుగా చేసి వేసేటటువంటి సలసలా కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా?) (47:15)

నరకవాసులు త్రాగడానికి ఇంకా ఎన్నో పానీయాలు ఉన్నాయి. అల్లాహ్ తఆలా వాటి గురించి ఇలా తెలియజేస్తున్నాడు. 

هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ

(ఇదీ (వారి గతి)! దాన్ని వారు రుచి చూడాలి. మరిగే నీళ్లు, చీము నెత్తురు, అదిగాకుండా, అలాంటివే రకరకాల శిక్షలు ఉంటాయి.) (38:57-58)

గస్సాఖ్ అంటే నల్లని విషపూరితమైన మలిన ద్రవపదార్థం మరియు నరక వాసుల శరీరాల నుంచి వచ్చే చీము. 

11. ప్రళయ దినం రోజున మూడు రకాల వారు కఠినంగా శిక్షించబడతారు వారిలో మొదటి వారు ఫిరోన్ మరియు అతని అనుచరులు, బనీ ఇస్రాయిల్ లోని అవిశ్వాసులు, మునాఫిక్ అనగా కపట విశ్వాసులు. దీని ఆధారం అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

 وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ
మరి ప్రళయం సంభవించిననాడు, “ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి” (అని సెలవీయబడుతుంది). (40:46)

మరియు అల్లాహ్ తఆలా బనీ ఇస్రాయిల్ గురించి ఇలా తెలియజేశాడు. 

 فَمَن يَكْفُرْ بَعْدُ مِنكُمْ فَإِنِّي أُعَذِّبُهُ عَذَابًا لَّا أُعَذِّبُهُ أَحَدًا مِّنَ الْعَالَمِينَ

(మరి ఆ తరువాత కూడా మీలో ఎవరయినా అవిశ్వాసానికి పాల్పడితే లోకంలో ఎవరికీ విధించనటువంటి శిక్షను వారికి విధిస్తాను.”) (5:115)

మరియు మునాఫిక్ ల గురించి తెలియజేస్తూ ఇలా అన్నాడు.4.145 

إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ وَلَن تَجِدَ لَهُمْ نَصِيرًا

(కపటులు నిశ్చయంగా నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకిపోతారు. వారికి సహాయపడే వారిని నీవు ఎన్నటికీ చూడలేవు.) (4:145)

12. ప్రళయ దినం రోజున అతి స్వల్ప శిక్ష ఏమిటంటే వారికి అగ్ని చెప్పులు ధరిస్తారు. దాని వల్ల వారి మెదడు ఉడుకుతుంది (ముస్లిం) 

13. ప్రతి ఒక్కరూ కూడా నరకం పైనుంచి ప్రయాణించవలసి ఉంటుంది. వారు విశ్వాసి అయినా లేక అవిశ్వాసి అయినా. అల్లాహ్ ఇలా అంటున్నాడు. 

وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا

(మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావలసిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే బాధ్యత ఆయనపై ఉంది.) (19:71)

అయితే అల్లాహ్ రక్షించాలని కోరుకునే విశ్వాసులను అగ్ని తాకలేదు, మరియు వారు దానిని (వంతెనను) దాటి వెళతారు. మరలా అగ్ని వారిని తాకదు. కానీ అల్లాహ్ ఎవరిని శిక్షించాలనుకుంటున్నాడో, పాపాత్ముడైన విశ్వాసి లేదా అవిశ్వాసి, వంతెనకు తగిలించిన గోర్లు అతనిని కొరికి నరకంలో పడవేస్తాయి. కానీ విశ్వాసులు వారి పాపాల మేరకు మాత్రమే నరకంలో శిక్షించబడతారు, ఆ తర్వాత వారు అక్కడ నుండి బయటకు తీసుకెళ్లబడతారు మరియు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. కానీ అవిశ్వాసులు ఎప్పుడూ శాశ్వతంగా నరకంలోనే ఉంటారు. ఈ వాక్యం చివరిలో ఆ విషయం గురించే తెలియజేయబడింది. 

 ثُمَّ نُنَجِّي الَّذِينَ اتَّقَوا وَّنَذَرُ الظَّالِمِينَ فِيهَا جِثِيًّا

(తర్వాత మేము భయభక్తులు కలిగివున్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో మోకాళ్లపైపడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము.) (19:72)

ఈ వాక్యం లో (جِـثـيا) అంటే మోకాళ్లపై పడడం, ఇది కూర్చోవడంలో అత్యంత హీనమైన స్థితి, ఎందుకంటే ఒక వ్యక్తి తనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే మోకాళ్లపై కూర్చుంటాడు.(తఫ్సీర్ ఇబ్నె జరీర్) 

14. అవిశ్వాసులు నరకం వద్దకు గుంపుగా తీసుకెల్లబడతారు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

وَسِيقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ زُمَرًا
(అవిశ్వాసులు గుంపులు గుంపులుగా నరకం వైపు తోలబడతారు.) (39:71)

15. నరకవాసులను తీవ్ర దాహమయ్యేటువంటి స్థితిలో నరకం వద్దకు లాక్కొని రావడం జరుగుతుంది. 

وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا
(అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము.) (19:86)

ఈ వాక్యంలో (وِردا)ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే దాహం తీర్చుకొనుటకై నీటి వద్దకు రావడం అందుకే ఇక్కడ ఈ పదాన్ని వినియోగించడం జరిగింది. 

16. ఆ రోజున నరకవాసులను దైవదూతలు కొన్ని సంకేతాల ద్వారా గుర్తుపడతారు, వారిని గుర్తించినప్పుడు, వారు వారిని తమ నుదురు మరియు పాదాలతో పాటు పట్టుకుని, తమ శక్తితో నరకంలో పడవేస్తారు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ

(అపరాధులు తమ వాలకాన్ని (నలుపు ఆవరించిన తమ ముఖాలను) బట్టే పసిగట్టబడతారు. మరి వారు తమ నుదుటి జుట్టు ద్వారా, పాదాల ద్వారా పట్టుకోబడతారు.) (55:41)

మరో చోట ఇలా అంటున్నాడు.

يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
(ఆ రోజు వారు త్రోయబడుతూ, నెట్టబడుతూ నరకాగ్ని వైపు తీసుకురాబడతారు.) (52:13)

17. నరకవాసుల మరో శిక్ష ఏమిటంటే వారిని బోర్ల పడవేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం జరుగుతుంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ

ఏ రోజున వారు తమ ముఖముల ఆధారంగా అగ్నిలోకి ఈడ్చబడతారో (ఆ రోజు) “నరకాగ్ని తాకిడి రుచిచూడండి” (అని వారితో అనబడుతుంది). (54:48)

నరక వాసుల మరో శిక్ష ఏమిటంటే వారికి అగ్ని దుస్తులు ధరింప చేయడం జరుగుతుంది.

فَالَّذِينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّن
(అయితే అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి.) (22:19)

మరియు నరకవాసుల కొరకు అగ్నితో కాల్చబడిన ఇత్తడి దుస్తులను ధరింప చేస్తారు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ
(వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి.) (14:50)

మరో శిక్ష ఏమిటి అంటే వారికి అగ్ని సంకెళ్లు తొడిగించడం జరుగుతుంది.హజ్ 21 

وَلَهُم مَّقَامِعُ مِنْ حَدِيدٍ
(ఇంకా, వారి కొరకు (వారిని చితక బాదటానికి) ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి.) (22:21)

ఈ వాక్యంలో దీని భావం ఏమిటంటే దైవదూతల దగ్గర పెద్ద పెద్ద ఇనుప సుత్తులు ఉంటాయి దాని ద్వారా నరక పాలకుడు నరకవాసులను దానితో కొడతాడు. 

18. నరకాగ్ని, అల్లాహ్ దాని నుంచి మనల్ని రక్షించుగాక!, అది గర్జిస్తుంది మరియు భయంకరంగా అరుస్తుంది. దీని ఆధారం అల్లాహ్ ఇలా అంటున్నాడు. 

إِذَا رَأَتْهُم مِّن مَّكَانٍ بَعِيدٍ سَمِعُوا لَهَا تَغَيُّظًا وَزَفِيرًا
(దూరం నుంచే అది వారిని చూసినప్పుడు, ఆగ్రహంతో అది ఉడికిపోతూ, గర్జిస్తూ ఉండటాన్ని వారు వింటారు.) (25:12)

నరకం హష్ర్ మైదానంలో అవిశ్వాసులను చూసినప్పుడు అది వారిని చూసి గర్జిస్తుంది. వారు ఆ గర్జన వింటారు మరియు వారు దాని తెరుచుకునే శబ్దాన్ని వింటారు, ఇవి రెండు ప్రసిద్ధ శబ్దాలు, కానీ ఇవి ఎలా ఉంటాయో అల్లాహ్ కు మాత్రమే తెలుసు. 

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 

إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ
(వారు అందులో పడవేయ బడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికి పోతూ ఉంటుంది.) 

19. నరకాగ్ని మండుతూ ఉంటుంది మరియు చల్లారుతూ ఉంటుంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు. 

كُلَّمَا خَبَتْ زِدْنَاهُمْ سَعِيرًا
(అది మందగించినప్పుడల్లా వారి కోసం దాన్ని రాజేస్తూ ఉంటాం.) (17:97)

20. నరకాన్ని భర్తీ చేస్తాను అని అల్లాహ్ తఆలా వాగ్దానం చేసి ఉన్నాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

وَلَٰكِنْ حَقَّ الْقَوْلُ مِنِّي لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ
(అయితే, “నేను నరకాన్ని జిన్నులతోనూ, మనుషులతోనూ తప్పకుండా నింపుతాను” అన్న నా మాట నిజమయింది.) (32:13)

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక! ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక!. అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా) పాశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు. 

స్తోత్రం మరియు దరూద్ తరువాత: 

21. ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ తో భయపడండి. నరకం కూడా ఒక సృష్టి. అది ఇప్పటికీ ఉంది. దీని ఆధారం అల్లాహ్ ఇలా అంటున్నాడు. 

وَاتَّقُوا النَّارَ الَّتِي أُعِدَّتْ لِلْكَافِرِينَ
(అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి.) (3:131)

హదీసు ద్వారా దీని ఆధారం ఏమిటంటే మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ప్రవచించారు: “నేను అమ్ర్ బిన్ లుహై ని నరకంలో ప్రేగులను ఈడ్చుకుంటూ పోవటాన్ని చూశాను. ఎందుకంటే మొదటగా ఇబ్రాహీం ధర్మం లో మార్పు చేర్పులు చేసింది ఇతనే. మరియు విగ్రహారాధన ప్రారంభించింది కూడా ఇతనే.” (బుఖారి ముస్లిం) 

అదేవిధంగా ప్రవక్త వారు ఒక స్త్రీ పిల్లిని చంపడం వల్ల నరక శిక్ష అనుభవిస్తూ చూశారు. ఆమె ఒక పిల్లిని కట్టివేసింది. దానికి తినడానికి త్రాగడానికి ఏమి పెట్టలేదు. కనీసం దాన్ని వదిలిపెట్టను లేదు. .(బుఖారి ముస్లిం) 

ఓ అల్లా దాసులారా! 20 విషయాలు మీ ముందు తెలియజేయడం జరిగింది. నరకం గురించి, నరక వాసుల గురించి విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. మరియు ప్రతి ఒక్కరు దీనిని గుర్తు చేసుకుంటూ ఉండాలి మరియు దీని నుంచి రక్షణ కొరకు పాపాల నుండి దూరంగా ఉండాలి. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదు. 

ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి, నరక శిక్ష నుండి, చావు బ్రతుకుల ఉపద్రవం నుండి మరియు దజ్జాల్ ఉపద్రవం నుండి నీ శరణు వేడుకుంటున్నాము. 

ఓ అల్లాహ్! మేము నిన్ను స్వర్గం గరించి, అందులో ప్రవేశించడానికి గల సదాచరణ గురించి అడుగుతున్నాము మరియు మేము నరకం నుండి మరియు దానికి దగ్గర చేసే ప్రతి ఆచరణ నుండి నీ శరణు కోరుతున్నాము. 

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు , నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు . ఆమీన్

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి