ఆమె తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం
ఇస్లాం ధర్మం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ధర్మమని తరచుగా వార్తలలో వస్తూ ఉంటుంది. ఇస్లాం స్వీకరించిన ప్రతి వ్యక్తి వెనుక ఒక ప్రత్యేకమైన గాథ మరియు ప్రత్యేక కారణాలు ఉంటాయి. ఇస్లాంలో స్త్రీల గురించిన అపోహలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇస్లాం ధర్మమే నిజమైన ధర్మమనీ మరియు ఉత్తమ జీవన విధానమనీ విశ్వసించే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆన్ రోనైన్ (Ann Ronayne) కథ క్రింద పేర్కొనబడింది.
“నేనా? కువైట్లో ఉండేందుకు వెళ్లాలా? అస్సలు ఆ ప్రశక్తే లేదు!” నా మేనేజర్ నన్ను కువైట్లో ఉద్యోగం చేయమని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పుడు నా స్పందన అది. కానీ నా విధివ్రాతలో మరో విధంగా ఉంది, {… మరియు అల్లాహ్ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం: (ఖుర్ఆన్ 33: 38)
నేను వాషింగ్టన్, D.C. నగర పరిసర ప్రాంతాలలో ఒక కాథలిక్ కుటుంబంలో పుట్టి పెరిగాను మరియు క్యాథలిక్ పాఠశాలలకు హాజరయ్యాను. 1960వ దశకంలో, మరింత ఆధునికంగా ఉండాలనే ప్రయత్నంలో కాథలిక్ చర్చి తన బోధనలలో పెద్ద మార్పులు చేసింది; ఇది సానుకూల అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మరియు ప్రతికూల అంశాలను విడిచి పెట్టడానికి ప్రయత్నించింది: ఉదారహణకు శిక్షలు, నిబంధనలు, నిర్దిష్ట సమయాల్లో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మొదలైనవి. (అదలా ఉన్నప్పటికీ, ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లోని కాథలిక్కులు ఉనికిలో ఉన్న గర్భనిరోధకాలపై నిషేధం వంటి అనేక నియమాలను విస్మరించింది.) లాటిన్లో ఎప్పుడూ చెప్పబడే ‘ప్రార్థనకు’కు బదులుగా ఇప్పుడు ఆంగ్లంలో చెప్పబడుతున్నది. చిన్నప్పుడు మాకు మత బోధనలు నేర్పిన క్రైస్తవ సన్యాసినులు (నన్సు) వారి అలవాట్లను (ధర్మపరమైన దుస్తులను) ఆధునిక దుస్తులతో మార్చుకున్నారు. మా ధార్మిక తరగతులలో ఎప్పుడూ బైబిల్ పఠనం జరగ లేదు, ఇప్పుడైతే వారు మత విశ్వాసాలపై దృష్టి సారించే బదులు, సామాజిక సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. కొత్త జనాల మాదిరిగానే చాలా వరకు సమకాలీన జానపద పాటలతో కాలం గడుపు తున్నారు. మా కాలంలో బోధించ బడిన సత్యం ఇప్పుడు పూర్తిగా మారిపోవడం వింతగా అనిపించింది. ఏదేమైనప్పటికీ, మేము మా మొదటి హోలీ కమ్యూనియన్కు సిద్ధమైనప్పుడు, పూజారి (Priest) మా నోటిలో పెట్టే రొట్టె యేసు యొక్క అసలు శరీరమని మాకు బోధించబడింది (అది మనం కొరికితే రక్తస్రావం అవుతుంది). దీని వలన మరియు ఇలాంటి అనేక ఇతర కారణాల వలన, నేను నా మతంపై సందేహాలు పెంచుకున్నాను మరియు చిన్నప్పటి నుండి అలాంటి క్రైస్తవ మత విశ్వాసాలను తిరస్కరించాను.
నేను మరిన్ని విషయాలు తెలుసుకున్న తరువాత నా నిర్ణయం మరింతగా గట్టి పడింది. ఒకవేళ ట్రినిటీ చాలా ముఖ్యమైన భావనైతే, యేసు దానిని ఎందుకు స్పష్టంగా వివరించలేదు (ఇంకా ఎందుకు దానిని పదే పదే పునరావృతం చేయలేదు)? దేవుడు మనల్ని క్షమించాలని అనుకుంటే, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి స్వయంగా భూమి పైకి రాకుండా మరియు సిలువ వేయబడకుండానే ఆయన అలా చేయ గలడు కదా. సిలువపై మరణించినది- యేసు వ్యక్తిగానా లేక యేసు దేవుడిగానా? ఆది మరియు అంతం లేని దేవుడు ఎలా మరణిస్తాడు? మనకు మార్గనిర్దేశం చేయడానికి దేవుడు తన కుమారుడిని (అతడు కూడా దేవుడే?) భూమికి పంపితే, అతను తన ముప్పై మూడు సంవత్సరాల కాలంలో మనకు సత్యసందేశాన్ని అంద జేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? మరి, యేసును ఎప్పుడూ కలవని పాల్, ఆ తర్వాత సత్యసందేశాన్ని కనుగొని మనకు అందించటం ఏమిటి?! ఒకవేళ ఆ క్రైస్తవ మతమే నిజమైన మతం అయితే, యేసు స్వయంగా ఎందుకు జీవించి ఉండలేదు మరియు దానిని మనకు బోధించలేదు?
చాలా కాలం వరకు, నాకు నేను నాస్తికుడిగా లేదా అజ్ఞేయవాదిగా భావించాను. కానీ నేను ఏదైనా లేబుల్ ఎంచుకోవడం గురించి ఎన్నడూ ఆలోచించలేదు. నేను మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించడంతో సరిపోతుందని భావించాను. దేవుడిని విశ్వసించనివారే నిజానికి ఎక్కువ మంచి పనులు చేస్తారని భావించాను. ఎందుకంటే వారు సహాయం కోసం ఏ అతీంద్రియ శక్తి పైనా ఆధారపడరు. నేను జీవిత ఉద్దేశ్యానికి లేదా మత విశ్వాసాలకు సంబంధించిన సమాధానాల కోసం అన్వేషిస్తున్నట్లుగా ఎన్నడూ భావించలేదు.
గల్ఫ్ యుద్ధం ముగిసిన కాలం నాటి సంగతి. అపుడు నేను కంప్యూటర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. నా కంపెనీకి కువైట్లో ప్రాజెక్టు లభించింది, అది నాకు నూటికి నూరు పాళ్ళు సరిపోయే పనే. అక్కడికి నన్ను వెళ్ళమని అన్నప్పుడు నా తొలి స్పందన – స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ప్రదేశానికి వెళ్లి పని చేయాలనే కోరిక నాకు లేదు; అన్నింటి కంటే ముఖ్యంగా, కువైట్ వంటి చోట స్త్రీల గురించి సామాన్యంగా వినబడే వదంతులు ఎన్నో నా వద్ద ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న మా మేనేజర్, ‘అక్కడి ఆఫీసు వాతావరణం చాలా ప్రొఫెషనల్గా ఉందని, ఆ సంస్థలో ఉండబోయే నా సూపర్ వైజర్ మరియు మేనేజర్లతో పాటు చాలా మంది ప్రతిభావంతులైన మహిళలు ఉన్నారని’ నాకు హామీ ఇచ్చారు. ఎలాగోలా ఒక సంవత్సరం కాంట్రాక్టుపై సంతకం చేయించారు. అక్కడ పని చేయడం ఒక సాహసమేనని భావిస్తూ నేను దానికి అంగీకరించాను. అయితే, నాతో తెచ్చుకున్న వదంతులన్నీ పచ్చి అబద్ధాలని అక్కడికి చేరగానే నాకు తెలిసింది.
నా సహోద్యోగులు ఎల్లప్పుడూ నాతో స్నేహపూర్వకంగా మరియు మర్యాదగా మెలిగేవారు. నా జీవితంలో ఇంత వరకు లైంగిక వేధింపులకు సంబంధించిన ఎలాంటి ఘటనలూ నేను చూడని ఒకే ఒక్క ప్రదేశం ఇదేనని నాకు అనిపించింది ఆ వాతావరణం ఎంత పవిత్రంగా ఉందంటే, అక్కడ కనీసం మామూలుగా ఆఫీసు డెస్కులపై వేలాడుతూ ఉండే మనోరంజక కుళ్ళు జోకులు కూడా అక్కడ కనబడవు, డేటింగ్ తేదీల క్యాలెండర్లు కూడా కనబడవు. (ఇది ఖచ్చితంగా US మిలిటరీలో నేను అనుభవించిన వాతావరణానికి పూర్తి భిన్నంగా ఉంది.) నాతో పని చేస్తున్న అక్కడి మహిళలలో చాలామంది విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లు మరియు మనసు విప్పి మాట్లాడటానికి సిగ్గుపడరు. అయినా వారిలో ఎక్కువ మంది ఇస్లామీయ దుస్తులు ధరించడాన్నే ఎంచుకున్నారు. తద్వారా తమ దుస్తులను వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించబడే ఎడ్వర్టైజ్మెంటు బోర్డుల వలే వాడుకునే అవకాశాన్ని వారు కల్పించలేదు.
కుటుంబాలు మరియు సమాజ సభ్యుల మధ్య కనబడిన పవిత్ర బంధాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఒక సహోద్యోగి తన పేచెక్ (జీతం) పోగొట్టుకుంటే, అతని కోసం అదే మొత్తంలో డబ్బును సేకరించే వరకు ఎవ్వరూ విశ్రమించలేదు. అక్కడి ప్రజలు స్థానికంగానూ మరియు ప్రపంచ వ్యాప్తంగానూ ఉదారంగా నిరుపేదలకు దానధర్మాలు చేసేవారు.
ఒకరి తల్లి ఫోన్ చేసి తనకు ఏదోలా ఉందని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లడానికి లేదా ఆమెకు అవసరమైనది అందించడానికి తన పని విడిచి పెట్టి వెళ్ళిపోవడం; మరొక వ్యక్తి యొక్క మామ చనిపోతే, పురుషులందరూ అంత్యక్రియల ప్రార్థనకు హాజరు కావడం; ఒక స్త్రీ అత్త చనిపోతే, స్త్రీలందరూ తమ సంతాపాన్ని తెలియ జేయడానికి ఆమెను సందర్శించడం; ఎవరైనా వివాహం చేసుకుంటే లేదా బిడ్డకు జన్మనిస్తే లేదా ఏదైనా ఆపరేషన్ నుండి కోలుకుంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహోద్యోగుల విస్తృత నెట్వర్క్ ఆ అనుభవాన్ని సుహృద్భావంతో పంచుకోవడం; అక్కడి ఆసుపత్రి గదులు చాలా పెద్దవిగా ఉండి, రోగులను పరామర్శించేందుకు అక్కడికి వచ్చే సందర్శకులందరికీ వసతి కల్పించడానికి వీలసుగా సోఫాలు మరియు కుర్చీలతో కూడా అమర్చబడి ఉండడం మొదలైన వాటిని నేను ఎంతో సంభ్రమాశ్చర్యాలతో చూసేదాన్ని.
అక్కడ పెద్ద కుటుంబాలు ఒకే ఇంట్లో అనేక తరాలతో పాటు కలిసి జీవిస్తూ ఉన్నందు వలన, వృద్ధుల పట్ల వైఖరి నేను అంతకు ముందు చూసిన దానికి భిన్నంగా ఉండేది; ఒకే ఇంట్లో నివసించని వారు, రోజూ కాకపోయినా తరచుగా తమ పెద్దలను సందర్శించడానికి వచ్చేవారు. తాతా నాయనమ్మలు పిల్లలతో మరియు మనుమలు ఆ పెద్దలతో నివసిస్తుండేవారు. అలా ఆ పెద్దలను ఒంటరిగా జీవిస్తూ, ఏకాకిగా చనిపోవడానికి వదిలివేయలేదు లేదా నర్సింగ్ హోమ్లకు పంపలేదు (అలాంటివి కూడా అక్కడ లేవు) వృద్ధ స్త్రీలను ఎంతో గౌరవించేవారు; అందువలన ఇతరుల దృష్టిని తమ వైపు మళ్ళించేందుకు, ఇతరులను ఆకర్షించేందుకు తమ వయసు దాచుకునేందుకు మరియు అందంగా కనిపడేందుకు ప్రయత్నించ వలసిన అవసరం వారికి లేదు. ఒకరి వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం ఒక భారంగా కాకుండా మంచి పనులు చేయడానికి లభించిన ఒక ఆశీర్వాదంగా మరియు అవకాశంగా భావించే వారు. ఒకరి తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత గురించి ఇస్లామీయ నైతిక వ్యవస్థలో గట్టిగా నొక్కి చెప్పబడింది. (అయితే పాశ్చాత్య దేశాలలోని ముస్లిమేతరులు తమ తల్లిదండ్రులను పట్టించుకోరని చెప్పడం లేదు, కానీ వారికి విభిన్నమైన ప్రాధాన్యతలు మరియు అవసరాలు ఉన్నాయి. సాధారణంగా చిన్న కుటుంబాలు మరియు స్వతంత్ర కుటుంబాలు ఎక్కువ ఆకర్షణీయంగా, సానుకూలంగా కనబడతాయి. ఎందుకంటే వృద్ధులు స్వయంగా తమకు తాము పిల్లల కుటుంబంపై భారంగా మారడాన్ని కోరుకోరు.) సాధారణంగా, క్లిష్ట పరిస్థితులతో చక్కగా వ్యవహరించడం అనేది ఒక పరీక్షగా భావించబడిందే గానీ నిరాశకు కారణంగా కాదు. ఇక్కడ ఆత్మహత్యలు చాలా అరుదు. ఇక్కడ నిషేధం కూడా ఎందుకంటే అల్లాహ్కు మాత్రమే ప్రాణం తీసే హక్కు ఉంది.
పవిత్ర రమదాన్ మాసం వచ్చినప్పుడల్లా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక బిలియన్ ముస్లింలు కలిసికట్టుగా ఏకకాలంలో ఉపవాసం ఉంటారనే ఆలోచన నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నుండి సూర్యుడు అస్తమించే వరకు వారు అన్నపానీయాలకు దూరంగా ఉంటారు. నేను వారితో కలిసి నెల మొత్తం ఉపవాసంలో పాటించాను, అయినప్పటికీ నాకు ముస్లిం కావాలనే ఉద్దేశం లేదు. కానీ, నేను ముస్లింగా మారిన తర్వాత రమదాన్ నెల ఉపవాసాలలో అనుభూతి చెందిన ఆధ్యాత్మిక రీచార్ట్ను నేను ముస్లిం కాకుండా ఉన్న రమదాన్ ఉపవాసాలలో అనుభవించలేదు.
ఆ సమయంలో, నాకు ఇస్లాం గురించి కొంచెం మాత్రమే తెలుసు. ఇస్లాంను వెనుకబడిన మతంగా భావించడమనేది అజ్ఞాన ప్రజలకు మాత్రమే నచ్చుతుందని చెప్పడానికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. నేను తెచ్చుకున్న వదంతులన్నీ తప్పని మెల్లమెల్లగా అర్థమయ్యాక, నాకు ఇస్లాం ధర్మం పట్ల ఆసక్తి కలిగింది. నేను మరింతగా తెలుసు కున్నప్పుడు, నేను చూసిన నైతిక వ్యవస్థకు ఇస్లామే కారణమనీ మరియు ఈ సానుకూల సామాజిక అంశాలు శతాబ్దాలుగా ఇస్లామీయ సమాజాలలో భాగంగా ఉన్నాయని నేను గుర్తించాను. లిప్టు లేదా ఆఫీసులలో ప్రవేశించగానే అపరిచితుల మధ్యా వినబడే అస్సలాము అలైకుమ్ అనే శుభాకాంక్షల అభివాదం వంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇస్లాం బోధనలలో ప్రామాణికతను, ఆధారాల్ని కలిగి ఉన్నాయి.
నాకు ఖుర్ఆన్ అనువాదం మరియు ఇస్లాంకు సంబంధించిన కొన్ని పుస్తకాలను లభించాయి. నేను వాటిని చదవడం ప్రారంభించాను. పదే పదే, నేను కనుగొన్న వాటిని చూసి ఆశ్చర్యపోసాగాను, ఇంకా అంతకంటే ఎక్కువగా నేను కనుగొనని వాటి గురించి ఆలోచిస్తూ. ఇస్లాంలో నేను హేతుబద్ధమైన మరియు గజిబిజీగా లేని ఒక నమ్మక వ్యవస్థను గుర్తించాను. నేను ఊహించినంతగా స్త్రీల అణచివేత లేదా అత్యాచారాల్ని కనుగొనలేదు. ఇస్లాం ధర్మం సామాజిక న్యాయానికి ఎంతో ప్రాధాన్యత నివ్వడం. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడటం నన్ను ఆకర్షించింది.
సహజంగానే, ఏ మతానికైనా సంబంధించిన ప్రధాన ప్రశ్న నిజమైనదా, కాదా అనే నిర్ణయం. ఈ నిర్ణయం కొంతవరకు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, మనం దానిని నిజంగా ఎలా తెలుసు కోగలం? దానిని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక అంశం ఏమిటంటే ఆ మతం యొక్క మూలాల విశ్వసనీయత, ప్రామాణికత; మరి, ఇస్లాం విషయంలో, దాని అత్యంత ముఖ్యమైన మూలం ఖుర్ఆన్ గ్రంథము.
ఇటీవల వరకు కనుగొనబడని శాస్త్రీయ దృగ్విషయాలను వివరించే వచనాల ద్వారా ప్రదర్శించబడిన దాని శాస్త్రీయ ఖచ్చితత్వం చూసి నేను మరింతగా ఆశ్చర్యపోయాను. యూరోపు చీకటి యుగంలో ఉన్నప్పుడు ఇస్లామీయ ప్రపంచం శాస్త్రీయ విజ్ఞానానికి పెద్దపీట వేసిందని, నాగరికత మరియు విద్యాభ్యాసానికి కేంద్రంగా ఉండేదని గ్రహించాను. తార్కికంగా, ఏడవ శతాబ్దపు నిరక్షరాస్యుడైన ఒక అరబ్, ఈ గొప్ప ఖుర్ఆన్ గ్రంథాన్ని స్వయంగా వ్రాయలేడని నాకు తెలుసు. సృష్టికర్త లేడనే నా ఆలోచనపై నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను విశ్వం మరియు దాని జీవిత రూపాలను రూపొందించిన సంక్లిష్ట వ్యవస్థలు యాదృచ్ఛికంగా అభివృద్ధి చెందాయా లేదా మనం పుట్టాము, జీవించాము మరియు ఎలాంటి ప్రయోజనం లేకుండా మరణించాము. వాస్తవం ఇంతేనా.
ఇన్నాళ్లుగా ఖుర్ఆన్ ఎన్నడూ మార్చబడలేదనే వాస్తవం నన్ను ఇంకా ఆకట్టుకున్నది. ఈ రోజు మనం చదివే ఖుర్ఆన్, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వస్లం) పై 1400 సంవత్సరాల క్రితం అవతరించిన మరియు ఆయన దానిని తన సహచరులకు అందించిన విధంగానే (అది అవతరించిన అసలు అరబీ భాషలో) ఎలాంటి మార్పులు చేర్పులకు గురికాకుండా శతాబ్దాలకు తరబడి దాని అసలు రూపంలోనే మిగిలి ఉంది. ముస్లింలందరూ దానిలోని భాగాలను కంఠస్థం చేస్తారు మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజలు దీనిని పూర్తిగా కంఠస్థం చేసిన వారున్నారు. కాబట్టి భూమిపై నుండి దాని ప్రతి కాపీ అదృశ్యం చేయబడినా, అది చాలా సులభంగా మళ్లీ లిఖించబడ గలదు. దీనిని కాలక్రమేణా వివిధ వ్యక్తులు వ్రాసిన పుస్తకాల సమాహారమైన బైబిల్తో పోల్చడానికి నేను సాహసం చేయలేకపోయాను, వివిధ క్రైస్తవ వర్గాలు ఏ పుస్తకాలు చేర్చబడ్డాయో ఏ పుస్తకాలు చేర్చబడలేదో అనే దానిని కూడా అంగీకరించవు, కొన్ని సందర్భాల్లో, విద్వాంసులకు సువార్తల పుస్తకాలు ఎవరు రాశారో కూడా తెలియదు. వారి వద్ద అసలు మూలాలు లేవు కానీ, తరువాత కాలంలోని మూలాల యొక్క విభిన్న సంస్కరణలు ఉన్నాయి. వాటిలో అనేక వైరుధ్యాలు ఉన్నాయి. నిజానికి, పాతనిబంధనలోని అనేక బోధనలను కొత్తనిబంధన తిరస్కరించింది.
ఇస్లాం ధర్మం యొక్క మూలాలు, యూదమతం మరియు క్రైస్తవ మతాల మూలాలు ఒక్కటే అని మరియు ముస్లింలు కూడా అబ్రహాం, మోసెస్ మరియు జీసస్ (అలైహిస్సలాం)లతో సహా ప్రవక్తలందరినీ విశ్వసిస్తున్నారని తెలుసుకుని నేను మరింతగా ఆశ్చర్యపోయాను.
ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఎందుకు అంతగా ప్రేమిస్తారో అనే విషయాన్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఎందుకు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి నాకు ఇంత వరకు ఏమీ తెలియలేదని ఆశ్చర్యపోయాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో ప్రఖ్యాతి చెందిన ఒక చారిత్రక వ్యక్తి అని ఆయన సమాధి ఎక్కడ ఉందో కూడా ఎంతో మందికి తెలుసని మరియు ఎంతో మంది ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిదును సందర్శిస్తారని కూడా నాకు తెలియదు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క అత్యంత సన్నిహితుల నుండి వచ్చిన ప్రామాణిక హదీథులు అనబడే ఉల్లేఖనలు, ఆయనను ఒక నిరాడంబరమైన, నిజాయితీ గల వ్యక్తిగా, న్యాయం కోసం మరియు అణచివేతకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తిగా వర్ణిస్తున్నాయి.
ఖుర్ఆన్ సూచించినట్లుగా, నేను రాత్రిపూట బీచ్ వెంబడి నడుస్తూ, చంద్రుడిని మరియు నక్షత్రాలను చూస్తూ, అల్లాహ్ యొక్క సృష్టిని గురించి అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండేదానిని. ఖుర్ఆన్ తప్పనిసరిగా అల్లాహ్ నుండి వచ్చిన సందేశమేనని నేను నమ్మసాగాను. కానీ, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి నాకు కొంత సమయం పట్టింది… అయినప్పటికీ అది చాలా హేతుబద్దమైనది మరియు దాని సారాంశంలో అది చాలా సరళమైనది: ఏకైక దైవం విశ్వం యొక్క మరియు దానిలోని ప్రతి దాని యొక్క ఏకైక సృష్టికర్త. ఆయనే మనకు ఇహలోక జీవితంలో మరియు తదుపరి పరలోక జీవితంలో మన జీవితాలను ఉత్తమంగా మార్చుకునేందుకు మార్గదర్శకత్వం అందించినాడు. అంతేకాదు! మరెన్నో ఖచ్చితమైన వివరాలు ఉన్నాయి. అయితే, ఇస్లామీయ విశ్వాసాలను సంగ్రహించేందుకు ఇది సరిపోతుంది మరియు ఎవరైతే దీనిని అంగీకరిస్తాడో, ఆ వ్యక్తి తప్పకుండా ముస్లిం అయి పోతాడు.
ఇస్లాం ధర్మంలోని దైవభావన చాలా స్వచ్చంగా, తార్కికంగా అనిపించింది, ముఖ్యంగా ట్రినిటీ భావనతో పోల్చినప్పుడు. ట్రినిటీని హేతుబద్ధంగా వివరించలేరు. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, కానీ వారు ఒక దేవుడా? యేసు పూర్తిగా దైవికుడు మరియు పూర్తిగా మానవుడు, తద్వారా అతను శక్తివంతుడైనప్పటికీ ఆకలి, దాహం మరియు ఇతర భౌతిక అవసరాలను అనుభవించాడా? దానికి భిన్నంగా, ఇస్లాం యొక్క సంక్లిష్టత లేని ప్రధాన సూత్రం దైవం ఒక్కడే ఇది ఖుర్ఆన్ గ్రంథంలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రవచనాలలో మరియు సామాన్య ముస్లింల ప్రార్థనలలో పదే పదే పునరావృతం అవుతుంది. ట్రినిటీ భగవంతుని యొక్క నిజమైన సారాంశమే అయితే, దానిని స్పష్టంగా వివరించి, పదే పదే ప్రస్తావించి ఉండేవారు కాదా?
ఇస్లాంలో దైవం న్యాయవంతుడు; మనకు సంబంధం లేని మరొకరి పాపాలకు ఆయన మనలో ఎవరినీ బాధ్యులుగా చేయడు. వేరొకరు చేసిన అసలు పాపం నుండి మనందరినీ విముక్తి చేయడం, అసలు పాపం లేదా సిలువ వేయడం వంటి ఎలాంటి భావనా లేదు.
నిజానికి, నా జీవితంలో ఆ ముఖ్య నిర్ణయం తీసుకోవడానికి నాకు అసమ్మతమైన కొన్ని అంశాలు ఆటంకంగా నిలబడినాయి. ఉదాహరణ: నేను ఇస్లామీయ దుస్తుల యొక్క ఉద్దేశాన్ని మరియు ప్రయోజనాలను అర్థం చేసుకున్నప్పటికీ, ఇంగ్లీష్ మాట్లాడే ముస్లిం మహిళల సంస్థలో ఏర్పాటు చేయబడిన రమదాన్ విందులో హాజరయ్యే వరకు మరియు ఇస్లామీయ దుస్తులను ధరించడం గర్వంగా భావించే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన డజన్ల కొద్దీ పాశ్చాత్య మహిళలను కలిసే వరకు నేను దానిని ధరించడం గురించి అంగీకరించ లేకపోయాను.
పైన పేర్కొన్న అన్ని కారణాల వల్ల మరియు ఎవరి ఒత్తిడి లేకుండా, నేను ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క వాక్కు మరియు ఇస్లాం సత్యమైన ధర్మమనే నిర్ధారణకు వచ్చాను.
నా ఇస్లామీయ విశ్వాసాన్ని అధికారికంగా ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నానని నిర్ణయించుకున్న రోజున, అధికారికంగా అలా చేయడంలో నాకు సహాయం చేయమని నేను ఒక సహోద్యోగిని అడిగాను. వాస్తవానికి దీన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు లేదా ఎలాంటి సర్టిఫికేటూ పొందవలసిన అవసరం లేదు; విశ్వాసం యొక్క సాక్ష్య ప్రకటనపై అంటే కేవలం అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన వాడెవ్వడూ లేడని మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమివ్వడంతోనే సరిపోతుంది. ఇది నన్ను బాగా కదిల్చి వేసిన అనుభవంగా గుర్తుండి పోయింది. ఎందుకంటే నిశ్చయంగా ఆ క్షణం నుండి నేను పరిశుభ్రమైన పలకతో (క్లీన్ స్లేట్తో) పాపాలేమీ లేని కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నిస్సందేహంగా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదే.
ఆఫీసుకి తిరిగి వచ్చాక, నా డెస్కీకి చేరుకుని నా పనిలో నిమగ్నమై పోయాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం తప్ప మరేమీ కాదని నేను భావించాను. నేను తీసుకున్న గంభీరమైన నిర్ణయం ఎవరికీ తెలియదని అనుకున్నాను … కానీ నా స్నేహితురాలు దానిని అందరికీ చెప్పేసింది. నేను ఆశ్చర్యపోయేలా, ఆ రోజంతా ఎంతో మంది శ్రీయోభిలాషుల నుండి అభినందనలు అందుకుంటూనే ఉన్నాను. ఆ సాయంత్రం, ఆమె నన్ను తన ఆంటీ ఇంటికి ఆహ్వానించింది. అక్కడ కొన్ని గంటలలోనే ఆమె తల్లి, సోదరీమణులు, ఆంటీలు మరియు ఆమె కజిన్ సిస్టర్స్ (వీరిలో చాలా మందిని నేను ఇంతకు ముందెన్నడూ కలవలేదు) అందరూ కలిసి నా కోసం ఒక పార్టీ ఏర్పాటు చేసి, ఖుర్ఆన్లు, సలాహ్ దుస్తులు, బంగారం మొదలైన ఎన్నో బహుమతులు నాకు ప్రజెంట్ చేసారు. తర్వాతి రోజులు మరియు వారాల్లో, నేను సహోద్యోగుల నుండి (వీరిలో కొందరిని నేను ఎప్పుడూ కలవలేదు), స్నేహితులు మరియు పరిచయస్తుల నుండి డజన్ల కొద్దీ గిప్టులు అందుకున్నాను. నేను చాలా అదృష్టవంతురాలిని, ఎందుకంటే ఇస్లాం స్వీకరించిన తరువాత కొందరు అనేక కష్టాలు ఎదుర్కొన్నారనే విషయం నాకు తెలుసు.
నా మహిళావాద ఉద్యమ కాలంలో, మేము ‘సోదరిత్వం’ గురించి మాట్లాడుకునే వారం, కానీ ఇక్కడ నిజమైన సోదరిత్వం నాకు పరిచయం అయింది. ముస్లిం మహిళలు కేవలం అల్లాహ్ కొరకు నన్ను తమ సోదరిగా స్వీకరించారు. కాలం గడుస్తున్న కొద్దీ నేను వివిధ దేశాలకు, వర్గాలకు చెందిన మరియు విద్యావంతులైన అనేక అద్భుతమైన ముస్లిం స్త్రీలను కలుసుకున్నాను. మా సమావేశాలలో తరచుగా, (ఇస్లామీయ జీవితాన్ని పొందిన) మేము ఎంత అదృష్టవంతులమో, మా జీవితాలు చాలామంది ప్రజలు ఊహించే దాని కంటే ఎంత భిన్నంగా ఉన్నాయో అనే విషయాలపై తరచుగా మాట్లాడుకునే వారం. ఒకరికొకరు పరిచయం ఉన్నా, పరిచయం లేకపోయినా ఇస్లాంలో మనం సోదరీమణులమని తెలుసుకుని, అనేక మంది స్త్రీలతో ఒకే పంక్తిలో భుజం భుజం కలిపి సలాహ్ లో నిలబడే అనుభూతిని వర్ణించడం అసాధ్యం.
హిజాబ్ (ఇస్లామీయ హెడ్ స్కార్ఫ్) ధరించే ధైర్యాన్ని పెంపొందించు కోవడానికి నాకు చాలా వారాలు పట్టింది. నేను ఊహించని విధంగా ఆ సంకోచం నుండి నాకు విముక్తి లభించింది. నేను ముస్లింగా మారగానే మొదట హిజాబ్ ధరించి U.S.కి వెళ్లటం గురించి నేను ఆందోళన చెందాను, కానీ వాస్తవానికి అలా ఆందేళన చెందవలసిన అవసరం లేదు. నేను వెళ్లిన ప్రతిచోటా, ఇతర ముస్లింలు నాకు ఇస్లామీయ అభివాదమైన అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక) తో పలకరించేవారు. ఆ అభివాదం ద్వారా ప్రపంచవ్యాప్త ముస్లిం సమాజంలో ఒక భాగంగా నేను స్వాగతించబడటమనేది హిజాబ్ ద్వారా సాధ్యమవుతుందని గ్రహించాను; నేను దానిని ధరించకపోతే, ఇతర ముస్లింలు నేను కూడా ముస్లిమేనని గుర్తించి, నాకు అలా సలామ్ తో అభివాదం చెప్పేవారు కాదు కదా!
అలాగని ముస్లిం సమాజం ఒక రకంగా పరమ సుఖదాయమైన ఆదర్శ సమాజమని చెప్పడం కూడా నా ఉద్దేశ్యం కాదు. ఖచ్చితంగా, ముస్లిం సమాజంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యలు ఇస్లాం నుండి కాదు; దీనికి భిన్నంగా, ఆ సమస్యలు ఇస్లామీయ విశ్వాసాల మరియు ఆచరణల పట్ల అజ్ఞానం, వాటి తిరస్కరణ కారణంగా ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవం ఏమిటంటే ఇస్లాం ధర్మానికి సంస్కరణల అవసరం లేదు; కానీ ముస్లింలకు దానవసరం ఎంతైనా ఉంది.
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది
ఏ విషయం వారిని ఇస్లాంలోనికి తీసుకు వచ్చింది?
(What Brought Them to Islam Telugu?)
స్వచ్ఛమైన ధర్మం సిరీస్ – 8వ భాగం
రచయిత: మాజిద్ సులైమాన్ అర్రస్సీ
తెలుగు అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్