ఉమ్రహ్ విధానం – ఇమామ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) [పుస్తకం]

ఉమ్రా విధానం - ఇమామ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) [పుస్తకం]

صفة العمرة
ఉమ్రా విధానము
రచయిత: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)

షేక్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ యొక్క ఉమ్రా సంక్షిప్త విధానం
(మూలం: షేక్ బిన్ బాజ్ ఫతావాలు, సంపుటి 17/425, తేదీ13/2/1416)

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[15 పేజీలు] [PDF]

సకల కృతజ్ఞతలు, ప్రశంసలు కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి మరియు ఆయన ఏకైకుడు. ఇక ఆ తరువాత, ఇది ఉమ్రహ్ యొక్క సంక్షిప్త విధానాల గురించిన సారాంశం మరియు పాఠకుడికి దీని వివరణ ఇలా ఉంది:

ఉమ్రహ్ చేయాలని అనుకున్న వ్యక్తి మీఖాత్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో తలస్నానం) చేసి, శుద్ధి చేసుకోవడం మంచిది. స్త్రీలు ఋతుస్రావం స్థితిలో ఉన్నా లేదా ప్రసవానంతర రక్తస్రావం స్థితిలో ఉన్నా కూడా గుసుల్ చేయాలి. అయితే, ఆమె ఆ రక్తస్రావం నుండి శుద్ధి అయి స్నానం చేసే వరకు కాబా గృహం చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయకూడదు.

ఇహ్రామ్ ధరించే వ్యక్తి తన శరీరానికి సుగంధ ద్రవ్యాలు (అత్తరు) పూసుకోవచ్చు, కానీ తన ఇహ్రామ్ బట్టలకు సుగంధం పూయకూడదు. మీఖాత్ వద్ద గుసుల్ (తలస్నానం) చేయడం సాధ్యం కాకపోతే, అందులో ఎలాంటి దోషమూ లేదు. అయితే, మక్కా చేరిన తర్వాత సాధ్యమైతే గుసుల్ చేసి, తవాఫ్ (కాబా ప్రదక్షిణ) ప్రారంభించడం మంచిది.

పురుషుడు కుట్టబడిన బట్టలన్నీ విడిచి, ఇజార్ (నడుము క్రింద వస్త్రం) మరియు రిదా (భుజం పైభాగం కప్పుకునే వస్త్రం) ధరించాలి. ఇవి తెల్లగా మరియు శుభ్రంగా ఉండటం మంచిది.

ఇక స్త్రీ విషయానికి వస్తే, ఆమె తన సాధారణమైన అలంకరణ, ప్రదర్శన లేని వస్త్రాలలోనే ఇహ్రాం ధరించాలి (నికాబ్, బుర్ఖా మరియు చేతి దస్తానాలు తప్పించి (మినహాయించి), ఆ మహిళ వాటిని తీసివేసి, తన ముఖాన్ని మరియు చేతులను గైర్ మహరంలైన పురుషుల నుంచి ఇతర వస్త్రాల ద్వారా కప్పుకోవాలి.

తర్వాత ఇహ్రామ్ కట్టుకునే వ్యక్తి తన మనస్సులో ఉమ్రహ్ సంకల్పం చేసుకుంటూ, తన నాలుకతో ఇలా పలుక వలెను: ‘లబ్బైక ఉమ్రహ్‘ లేదా ‘అల్లాహుమ్మ లబ్బైక ఉమ్రహ్ ‘ (ఓ అల్లాహ్! నేను ఉమ్రహ్ కోసం హాజరయ్యాను). ఒకవేళ ఇహ్రామ్ కట్టుకున్న వ్యక్తి తన ఉమ్రహ్ పూర్తి చేయలేక పోవచ్చమోనని భయపడుతున్నట్లయితే (ఉదాహరణకు, అనారోగ్యం, శత్రువుల భయం లేదా ఇతర అడ్డంకుల కారణంగా) అప్పుడు ఇహ్రామ్ కట్టుకునే సమయంలో ఈ క్రింది షరతును పేర్కొనడం షరియత్ ప్రకారం అనుమతించబడింది. అప్పుడు అతనిలా పలుకవచ్చు:

((فَإِنْ حَبَسَنِي حَابِسٌ فَمَحِلِّي حَيْثُ حَبَسْتَنِي))
“ఫఇన్ హబసనీ హాబిసున్ ఫమహిల్లీ హైథు హబస్తనీ”
(ఒకవేళ ఏదైనా అడ్డంకి నన్ను ఆపితే, నీవు నన్ను ఆపిన స్థానమే నా ఇహ్రామ్ ముగింపు స్థానం అవుతుంది.) – జుబాఅహ్ బిన్తె జుబైర్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ఆధారంగా.

తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతును అనుసరిస్తూ, ఇలా తల్బియా పలకాలి:

لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ، لَبَّيْكَ لا شَرِيكَ لَكَ لَبَّيْكَ، إِنَّ الْحَمْدَ والنَّعْمَةَ لَكَ وَالمُلْكُ، لا شَرِيكَ لَكَ

“లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్-హద్దు వన్-నిఅమత లక వల్-ముల్క్, లా షరీక లక్’

(హాజరయ్యాను, ఓ అల్లాహ్! నేను హాజరయ్యాను, నీకు ఎలాంటి భాగస్వామీ లేడు. హాజరయ్యాను. నిశ్చయంగా, సకల స్తుతులు మరియు సకల అనుగ్రహాలు నీకే చెందుతాయి, సర్వలోకాలపై సార్వభౌమత్వం నీదే, నీకు ఎటువంటి భాగస్వామీ లేడు).”

మరియు పవిత్ర కాబా గృహం చేరే వరకు ఈ తల్బియా పలుకులతో పరమ పవిత్రుడైన అల్లాహ్ ధ్యానాన్ని, దుఆలను పునరావృతం చేయాలి.

అయితే, మస్జిదుల్ హరామ్ (కాబా) కు చేరుకున్న తర్వాత, అందులో ప్రవేశించేటప్పుడు కుడి కాలు ముందుకు వేసి ఈ దుఆ చదవాలి:

((بسم اللهِ وَالصَّلاةُ وَالسّلامُ عَلى رَسولِ اللهِ أَعُوذُ بِاللَّهِ الْعَظِيمِ وَبِوَجْهِهِ الْكَرِيمِ وَسُلْطَانِهِ الْقَدِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ. اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ))

”బిస్మిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అఊదు బిల్లా హిల్ అజీమ్, వ బివజ్’ హి హిల్ కరీమ్, వ సుల్తాని హిల్ ఖదీమ్, మినష్ షైతానిర్రజీమ్. అల్లాహుమ్మ ఫ్ ‘ తహ్’ లీ అబ్వాబ రహ్మతిక్.”

(అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి, శుభాలు కురుయుగాక. మహోన్నతుడైన అల్లాహ్ శరణు కోరుతున్నాను, ఆయన గొప్ప ముఖకాంతి ద్వారా బహిష్కరింపబడిన షైతాన్ బారి నుండి శాశ్వత సార్వభౌముడైన ఆయన శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్! నీ కరుణాకటాక్షాల ద్వారాలను నా కొరకు తెరవుము.)

కాబాగృహం (బైతుల్లాహ్) చేరుకున్నప్పుడు, తల్బియాను ఆపివేసి, హజరె అస్వద్ (నల్లరాయి) వైపు వెళ్లాలి. దానికి ఎదురుగా, కుడి చేత్తో తాకి, సాధ్యమైతే ముద్దాడాలి (కానీ ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా హడావిడి చేయకూడదు, తొక్కిసలాటలో పడకూడదు). రాయిని తాకినప్పుడు అతను ఇలా పలకాలి: ‘బిస్మిల్లాహి, అల్లాహు అక్బర్’ (అల్లాహ్ పేరుతో, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు).

ఒకవేళ ముద్దాడడం కష్టమైతే, చేతితో తాకవచ్చు లేదా కర్ర / ఇతర వస్తువుతో తాకి, దాన్ని ముద్దాడవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే, రాయి వైపు చేతితో సైగ చేసి ‘అల్లాహు అక్బర్’ అని పలకాలి (కానీ సైగ చేసిన చేతిని ముద్దాడకూడదు).

తవాఫ్ (కాబా ప్రదక్షిణ) సరిగ్గా చెల్లుబాటు కావడానికి, తవాఫ్ చేసే వ్యక్తి చిన్న అశుద్ధత (అల్-హదత్ అల్-అస్గర్) లేదా పెద్ద అశుద్ధత (అల్-హదత్ అల్-అక్బర్) ల స్థితి నుండి పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే తవాఫ్ కూడా నమాజ్ లాంటిదే, అయితే ఇందులో మాట్లాడడానికి అనుమతి ఉంది.

తవాఫ్ సమయంలో కాబాగృహాన్ని తన ఎడమ వైపున ఉంచుకుని 7 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణలో రుక్న్-ఎ- యమానీ (యమనీ మూల)ను దాటినప్పుడు, సాధ్యమైతే కుడి చేత్తో దాన్ని తాకి ‘బిస్మిల్లాహి, అల్లాహు అక్బర్’ అని పలకాలి (కానీ దాన్ని ముద్దాడకూడదు). ఒకవేళ తాకడం కష్టమైతే, దాన్ని తాకకుండానే తవాఫ్ కొనసాగించాలి (సైగ చేయకూడదు లేదా తక్బీర్ పలకకూడదు), ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులలో లేదు.

ప్రతి ప్రదక్షిణలో హజరె అస్వద్ (నల్లరాయి) వద్దకు వచ్చినప్పుడు, మునుపు వివరించినట్లుగానే దాన్ని తాకి ముద్దాడాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే, దాని వైపు సైగ చేసి ‘అల్లాహు అక్బర్’ అని పలకాలి. అలాగే, తవాఫుల్ – ఖుదూమ్ (ప్రథమ తవాఫ్) యొక్క మొదటి మూడు ప్రదక్షిణల్లో పురుషులు రమల్ చేయడం ముస్తహబ్ – అంటే వేగంగా, వడివడిగా నడవడం మరియు అడుగులను దగ్గర దగ్గరగా వేయడం.

అలాగే, పురుషులు తవాఫుల్ – ఖుదూమ్ (మొదటి మూడు ప్రదక్షిణల) యొక్క అన్ని ప్రదక్షిణల్లోనూ ఇజ్ తిబా చేయడం ముస్తహబ్. ఇజ్తిబా అంటే తన రిదా (పై వస్త్రం) మధ్యభాగాన్ని కుడి భుజం క్రిందికి తీసి, దాని రెండు కొనలను ఎడమ భుజంపై వేయడం (కుడి భుజం స్పష్టంగా అందరికీ కనబడేలా).

తవాఫ్ యొక్క ప్రదక్షిణలన్నింటిలోనూ సులభంగా, తేలిగ్గా స్మరించదగిన జిక్ర్ లు (అల్లాహ్ స్మరణలు) మరియు దుఆలు ఎక్కువగా చేయడం ముస్తహబ్ (సిఫారసు చేయబడినది).

తవాఫ్ (కాబా ప్రదక్షిణ) లో నిర్దిష్టంగా చేయవలసిన ప్రత్యేక దుఆ లేదా ప్రత్యేక జిక్ర్ (అల్లాహ్ స్మరణ) అంటూ ఏదీ లేదు. మీకు ఇష్టమైన ఏదైనా దుఆ చేయవచ్చు మరియు అల్లాహ్ ను మీకు ఇష్టమైన పదాలతో స్మరించవచ్చు. అయితే రుకున్ అల్ యమానీ మరియు హజరె అస్వద్ ల మధ్య ఈ దుఆ చేయమని చెప్పబడింది.

رَبَّنَا وَاتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ

“ఓ మా ప్రభువా! మాకు ఇహలోకంలో మంచిని, పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు. మరియు మమ్మల్ని నరక యాతన నుండి కాపాడు.” (2:201)

ప్రతి తవాఫ్ ప్రదక్షిణలో ఈ దుఆ పఠించడం మంచిది, ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతు.

ఏడవ తవాఫ్ ప్రదక్షిణ ముగింపులో, సాధ్యమైతే హజర్ – ఎ – అస్వద్ (నల్లరాయి)ని తాకి ముద్దాడాలి లేదా మునుపు వివరించిన విధంగా దాని వైపు సైగ చేస్తూ ‘అల్లాహు అక్బర్’ అనాలి. తవాఫ్ పూర్తి చేసిన తర్వాత, తన పై వస్త్రాన్ని (రిదా) తిరిగి ధరించాలి – దాని మధ్యభాగాన్ని భుజాలపై వేసి, రెండు కొనలను ఛాతీపై పడేలా సరిచేసుకోవాలి.

తర్వాత, సాధ్యమైతే మఖామ్-ఎ-ఇబ్రాహీం వెనుక 2 రకాతుల సున్నతు నమాజ్ చేయాలి. ఒకవేళ అక్కడ చేయడం సాధ్యం కాకపోతే (జన సమూహం వలన ఇతరులకు ఇబ్బంది కలిగించేదిగా ఉంటే), మస్జిద్ అల్ హరామ్ లో ఎక్కడైనా ఈ నమాజ్ చేయవచ్చు. ఈ నమాజ్లో ఫాతిహా తర్వాత మొదటి రకాతులో సూరతుల్ కాఫిరూన్ మరియు రెండవ రకాతులో సూరతుల్ ఇఖ్లాస్ పఠించడం అత్యుత్తమం, కానీ ఏ ఇతర సూరహ్ చదివినా పర్వాలేదు. నమాజ్ తర్వాత, సాధ్యమైతే మళ్లీ హజర్-ఎ-అస్వద్ (నల్లరాయి) వద్దకు వెళ్లి దాన్ని తాకాలి.

తర్వాత సఫా కొండ వైపు వెళ్లి, సాధ్యమైతే దానిపై ఎక్కాలి లేదా దాని దగ్గర నిలబడాలి, ఎక్కడం మంచిది (సున్నత్) కానీ సాధ్యం కాకపోతే దాని దగ్గర నిలబడి ఈ ఆయత్ పఠించాలి:

إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ
“నిశ్చయంగా సఫా మరియు మర్వా అల్లాహ్ యొక్క చిహ్నాల లోనివే …” (2:158)

ఆ తరువాత ఖిబ్లా వైపు తిరిగి, ఇలా అల్లాహ్ యొక్క హమ్ద్ (స్తుతి) చేస్తూ, తక్బీర్ (అల్లాహు అక్బర్) పలకడం మంచిది. తర్వాత ఈ జిక్ర్ చేయాలి:

اللهُ أَكْبَرَ اللهُ أَكْبَر لَا إِلَهَ إِلَّا اللهُ اللهُ أَكْبَرَ اللهُ أَكْبَرِ وَلِلَّهِ الْحَمْدِ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلَّ شَيْءٍ قَدِيرٌ، لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ، أَنجَزَ وَعْدَهُ، وَنَصَرَ عَبْدَهُ، وَهَزَمَ الْأَحْزَابَ وَحْدَهُ

“అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్’ద్, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహ్, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వ హువ అలా కుల్లి షయ్’ ఇన్ ఖదీర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్ దహు, అంజజ వ అదహు, వ నసర అబ్దహు, వ హజమ అల్- అహ్జాబ వహ్’దహ్.’

(అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు, అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఒకే ఒక్కడు ఆయనకు భాగస్వామి లేడు. ఆయనకే విశ్వసామ్రాజ్యం చెందును, ఆయనకే సకల స్తుతులు చెందును. ఆయన ప్రతిదానిపై సంపూర్ణ ఆధిపత్యము కలిగి ఉన్న సర్వశక్తిమంతుడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఒక్కడే తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, తన దాసుడికి విజయం ప్రసాదించాడు, అహ్’జాబ్ సైన్యాలను ఒంటరిగా ఓడించాడు).”

తర్వాత రెండు చేతులను పైకెత్తి ఇష్టమైన దుఆలు చేయాలి. ఈ జిక్ర్ మరియు దుఆను మూడు సార్లు పునరావృతం చేయాలి.

తర్వాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. మొదటి ఆకుపచ్చ సంకేత స్తంభం నుండి రెండవ ఆకుపచ్చ సంకేత స్తంభం వరకు, పురుషులు వడి వడిగా (రమల్) వేగంగా నడవాలి. స్త్రీలు మాత్రం సాధారణ నడకనే కొనసాగించాలి.స్త్రీలు వేగంగా నడవడం (రమల్ చేయడం) షరియతులో నిర్దేశించబడలేదు, ఎందుకంటే అలా చేయడం ఇతరులను ఆకర్షించవచ్చు.

తర్వాత మర్వా కొండ వైపుకు వెళ్లి, సాధ్యమైతే దానిపై ఎక్కాలి లేదా దాని దగ్గర నిలబడాలి. దానిపై ఎక్కడం ఉత్తమం. సఫాలో చేసిన జిక్రలు, దుఆలన్నీ మర్వాలో కూడా పునరావృతం చేయాలి. తర్వాత కొండ దిగి, సఫా వైపు సాధారణ నడక ప్రాంతంలో మామూలుగా నడిచి, వేగంగా నడవాల్సిన ప్రాంతంలో వేగంగా నడవాలి, ఈ విధంగా సఫా మరియు మర్వా మధ్య 7 సార్లు నడవాలి (సఫా నుండి మర్వాకు వెళ్లడం ఒక నడక, తిరిగి రావడం రెండో నడక అవుతుంది). ఒకవేళ అవసరం కొద్దీ గుర్రం లేదా వాహనంపై సఈ చేసినా ఎలాంటి దోషమూ లేదు.

సఈ (సఫా-మర్వాల మధ్య నడక) సమయంలో ఎక్కువగా జిక్ర్ (అల్లాహ్ స్మరణ) మరియు దుఆలు చేయడం ముస్తహబ్ (సిఫారసు చేయబడినది). ఇది చేసేటప్పుడు పెద్ద శుద్ధి (హదద్ అక్బర్) లేదా చిన్న శుద్ధి (హదద్ అల్ అస్గర్) లేకుండా పరిశుభ్రంగా ఉండటం మంచిది (తహారుతులో మరియు ఉదూలో చేయడం మంచిది). అయితే, అశుద్ధ స్థితిలో సఈ చేసినప్పటికీ అది చెల్లుబాటు అవుతుంది.

సఈ పూర్తయిన తర్వాత, పురుషులు తలను మొత్తం గొరుగుకోవాలి అంటే గుండు చేసుకోవాలి లేదా తలవెంట్రుకలు చిన్నగా కత్తిరించుకోవాలి. మొత్తం గొరుగుకోవడం మంచిది. ఒకవేళ అతను హజ్ సమయానికి దగ్గరగా మక్కా వచ్చినట్లయితే (ఉదాహరణకు హజ్ కు కొన్ని రోజుల ముందు), తలవెంట్రుకలు చిన్నగా కత్తిరించుకోవడం మంచిది, తద్వారా హజ్ సమయంలో మిగిలిన తలవెంట్రుకలను గొరుగుకోవచ్చు. స్త్రీలు తమ తలవెంట్రుకలలో కొన్నింటి దగ్గరగా చేర్చి, అందులో నఖం (ఆరు మి.మీ) పొడవు లేదా అంతకంటే తక్కువ కత్తిరించుకోవాలి.

ఇహ్రామ్ ధరించిన వ్యక్తి ఈ పనులు చేసిన తర్వాత, అతని ఉమ్రహ్ పూర్తవుతుంది మరియు సకల కృతజ్ఞతలు అల్లాహ్ కే శోభిస్తాయి. ఇప్పుడు ఇహ్రామ్ స్థితి వలన నిషేధించబడినవన్నీ అతని కొరకు అనుమతించబడతాయి.

అల్లాహ్ మాకు మరియు మన ముస్లిం సోదరులందరికీ తన దీన్ ను (ఇస్లాంను) సరిగ్గా అర్థం చేసుకునే వివేకాన్ని, దానిపై స్థిరంగా నిలబడే ధైర్యాన్ని ప్రసాదించుగాక! మనందరి ఆరాధనల్ని ఆయన స్వీకరించుగాక. నిశ్చయంగా, ఆయన ఎలాంటి కొరతలు, బలహీనతలు లేని పరమ పవిత్రుడు, అత్యంత కరుణా ప్రదాత.

అల్లాహ్ తన దాసుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, సహాబాలపై మరియు అనుచరులపై ప్రళయదినం వరకు కారుణ్యం, శాంతి మరియు అనుగ్రహాలు వర్షింపజేయుగాక.

ఉమ్రహ్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/umrah/