ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ఖుత్బా అంశము: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పతనానికి గల పది కారణాలు
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు భయపడండి. మరియు తెలుసుకోండి ఈ ఉమ్మత్ కు అల్లాహ్ తఆలా గొప్ప ప్రాధాన్యతను ప్రసాదించాడు. మరియు తన సృష్టిలో ఉత్తమమైనటువంటి వ్యక్తిని ప్రవక్తగా మరియు దైవ సందేశహరునిగా ఎన్నుకున్నాడు. ఆయనే మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆయన వాస్తవంగా సమస్త మానవులలో నైతికతపరంగా, జ్ఞానపరంగా, ఆచరణ పరంగా, ఉత్తములు. దీని కారణంగానే ఈనాడు పూర్తి ప్రపంచంపై ఆయన యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది.
మానవులైనా లేక జిన్నులైనా లేక వేరే ఇతర జీవరాసులైనా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రభావం వారిపై ఉంటుంది. కాబట్టి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాస్తవంగా ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన లాంటి వ్యక్తి ఈ భూప్రపంచంపై పుట్టలేదు మరియు పుట్టడు కూడా. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గొప్పదనం కేవలం కొన్ని కోణాలకే పరిమితం కాదు. ప్రతి అంశంలోనూ ప్రతి కోణాన్ని కలిగి ఉంటుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనం గురించి ఎన్నో ఆధారాలు దాదాపు వంద కంటే పైపెచ్చు మనకు లభిస్తాయి. ప్రతి ఆధారం మరో ఆధారానికి భిన్నంగా ఉంటుంది అందులో ఇవి కొన్ని.
1. అల్లాహ్ తఆలా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని దైవ సందేశహారునిగా బాధ్యతలు నెరవేర్చడానికి సమస్త మానవులలో నుండి ఎన్నుకున్నాడు. అల్లాహ్ తన ప్రవక్తతో ఇలా అన్నాడు.
﴿وأرسلناك للناس رسولا﴾
(ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త జనులకు సందేశం అందజేసేవానిగా చేసి పంపాము
2. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మరొక గొప్పదనం ఏమిటంటే, అల్లాహ్ తఆలా ఆయనను (నబి) ప్రవక్తగా మరియు (రసూల్) దైవ సందేశహరునిగా ఎన్నుకున్నాడు.
3. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పతనంలో భాగంగా మరొక ఆధారం ఏమిటంటే ఆయన “ఉలుల్ అజ్మ్” ప్రవక్తలలోని వారు. “ఉలుల్ అజ్మ్” ప్రవక్తలు ఐదుగురు. వారు నూహ్, ఇబ్రహీం, మూసా, ఈసా (అలైహిముస్సలాం) మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). దీని గురించి ఖుర్ఆన్ రెండు చోట్ల ప్రస్థావన ఉంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు:
﴿وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَى وَعِيسَى ابْنِ مَرْيَمَ﴾
(ఆసందర్భాన్ని జ్ఞాపకంచేసుకో) మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము (ముఖ్యంగా) నీ నుండి, నూహ్ నుండి, ఇబ్రాహీం నుండి, మూసా నుండి, మర్యమ్ కుమారుడైన ఈసా నుండి.
మరో చోట ఇలా అంటున్నాడు:
﴿شَرَعَ لَكُم من الدِّينِ مَا وَصَّى بِهِ نُوحًا وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهِ إِبْرَاهِيمَ وَمُوسَى وَعِيسَى أَنْ أَقِيمُوا الدِّينَ وَلا تَتَفَرَّقُوا فِيه﴾
ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్ నూహ్‌కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకూ నిర్ధారించాడు. దానినే (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం!) మేము నీ వైపుకు (వహీ ద్వారా) పంపాము. దాని గురించే ఇబ్రాహీముకు, మూసాకు, ఈసా (అలైహిముస్సలాం)కు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలనీ, అందులో చీలిక తీసుకురావద్దనీ (వారికి) ఉపదేశించాము.
4. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మరొక గొప్పదనం ఏమిటంటే అల్లాహ్ తఆలా ఆయన ప్రవక్త తత్వాన్ని సూచించే ఎన్నో సంకేతాలను ఉన్నతీకరించాడు. ఇబ్నే ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) తన గ్రంథమైనటువంటి “ఇగాసతు అల్ లహ్ఫాన్” యొక్క చివరి భాగంలో వెయ్యి కంటే ఎక్కువ సూచనలను తెలియజేశారు. ఇది దాసులపై అల్లాహ్ యొక్క కారుణ్యం ఎందుకంటే ప్రవక్తపై ప్రజలు విశ్వాసం తీసుకురావడంలో ఈ సూచనలు ఎంతో తోడ్పడతాయి, మరియు శత్రువుల యొక్క వాదనలను తిప్పికొడతాయి.
5. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మరో గొప్పదనం ఏమిటంటే అల్లాహ్ తఆలా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రసాదించిన అద్భుతాలలో ప్రళయం వరకు ఉండేటువంటి ఒక గొప్ప అద్భుతం “దివ్య ఖుర్ఆన్ “.
ఎందుకంటే ప్రవక్తలు చేసినటువంటి అద్భుతాలు వారి మరణంతోనే ముగిసిపోయాయి. కానీ ఖుర్ఆన్ ఎంతటి మహా అద్భుతం అంటే ఈ భూమ్యాకాశాలు అంతమయ్యేంతవరకు ఉంటుంది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు: దైవ ప్రవక్తలలో అద్భుతాలు ప్రసాదించబడని ప్రవక్త అంటూ లేరు, మరియు ప్రజలు వీటి ప్రకారమే వారిని విశ్వసించారు మరియు నాకు ప్రసాదించబడినటువంటి అతిపెద్ద అద్భుతం “ఖుర్ఆన్”. అల్లాహ్ దీనిని నాపై అవతరింపజేశాడు. మరియు నాకు నమ్మకముంది, రేపు ప్రళయ దినం రోజున ప్రవక్తల అందరిలో కెల్లా నాఅనుచర సమాజమే ఎక్కువగా ఉంటుంది.(బుఖారి, ముస్లిం)
6. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క గొప్పదనానికి గల మరొక రుజువు ఏమిటంటే, అల్లాహ్ అయనపై అత్యుత్తమ (షరియత్‌ను) ధర్మాన్ని అవతరింపజేసాడు, మరియు అన్ని ఆకాశ గ్రంథాలలో ఉన్న అన్ని ప్రధాన ఆజ్ఞలను మరియు బోధనలను అందులో ఉండేలా చేసాడు, మరియు వాటికి మరిన్ని ఆజ్ఞలను కూడా జోడించాడు.
7. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనం యొక్క మరొక రుజువు ఏమిటంటే అల్లాహ్ ఆయనపై వహీ ద్వారా షరీయత్ యొక్క వివరణ తెలియజేసే హదీసులను కూడా అవతరింపజేశాడు.
8. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనం యొక్క మరొక రుజువు ఏమిటంటే అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను సమస్త మానవులు మరియు జిన్నాతుల కొరకు దైవ సందేశారునిగా చేసి పంపించాడు, కానీ ఇతర ప్రవక్తలను మాత్రం ఒక ప్రత్యేక జాతి కొరకు పంపించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وما أرسلناك إلا كافة للناس بشيرا ونذيرا﴾
(ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము.
అల్లాహ్ తఆలా మరో చోట ఇలా తెలియ చేస్తున్నాడు:
﴿وما أرسلناك إلا رحمة للعالمين﴾
(ఓ ముహమ్మద్!) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.
మరియు అల్లాహ్ ఈ విషయాన్ని కూడా తెలియజేశాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశాన్ని జిన్నులు కూడా స్వీకరించాయి.
﴿ وإذ صرفنا إليك نفرا من الجن يستمعون القرآن فلما حضروه قالوا أنصتوا فلما قُضِي ولوا إلى قومهم منذرين ﴾
(ఓ ప్రవక్తా!) జిన్నుల సమూహం ఒకదానిని మేము ఖుర్‌ఆన్ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు, “నిశ్శబ్దంగా వినండి” అని (పరస్పరం) చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియ గానే, తమ వర్గం వారిని హెచ్చరించటానికి వాళ్ల వద్దకు తిరిగి వచ్చారు.
మరో చోట ఇలా సెలవిచ్చాడు:
﴿ يا قومنا أجيبوا داعي الله وآمنوا به يغفر لكم من ذنوبكم ويجركم من عذاب أليم ﴾
ఓ మా జాతివారలారా! అల్లాహ్ వైపునకు పిలిచేవాని మాట వినండి. అతన్ని విశ్వసించండి. అల్లాహ్ మీ పాపాలను మన్నిస్తాడు. బాధాకరమైన శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు.
ఈ వాక్యంలో అల్లాహ్ వైపు పిలిచే “దాయి” అనగా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అని అర్థం. ఆయన ద్వారానే జిన్నాతులు ఖుర్ఆన్ పారాయణాన్ని విన్నాయి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రతి ప్రవక్త తన ప్రజల కోసం ప్రత్యేకంగా పంపబడ్డాడు.మరియు నేను ఎరుపు మరియు నలుపు అందరి కొరకు పంపబడ్డాను” (ముస్లిం) ఈ హదీస్ లో ఎరుపు మరియు నలుపు అనగా పూర్తి ప్రపంచం అని అర్థం.
9. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనం గురించి మరొక రుజువు ఏమిటంటే అల్లాహ్ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారి ద్వారా ప్రవక్తల యొక్క పరంపరను ముగించాడు. ఆయనను చిట్ట చివరి ప్రవక్తగా చేసి పంపాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:
﴿ ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين ﴾
(ప్రజలారా!) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నాకు మరియు నా ముందున్న ప్రవక్తలందరి ఉదాహరణ ఎలాంటిదంటే ఒక వ్యక్తి ఒక ఇల్లు నిర్మించాడు మరియు అందులో అన్ని రకాల అలంకరణ చేశాడు, కానీ ఒక మూలలో ఒక ఇటుకను అమర్చలేదు ఇప్పుడు ప్రజలందరూ వచ్చి ఇంటి చుట్టూ నలువైపులా చూస్తున్నారు మరియు ఆశ్చర్యానికి లోనవుతారు మరియు ఇలా అంటారు – ఇక్కడ ఒక ఇటుక ఎందుకు అమర్చలేదు! అయితే ఆ ఇటుకను నేనే మరియు నేనే చిట్టచివరి ప్రవక్తను.(బుఖారి, ముస్లిం)
10. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్పతనంలో భాగంగా మరొక రుజువు ఏమిటంటే అల్లాహ్ తఆలా ఆయన ఘనతను ఉన్నతం చేశాడు. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:
﴿ورفعنا لك ذكرك﴾
ఇంకా – మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము.
అల్లాహ్ తఆలా తన ప్రవక్త పేరును తౌహీద్ యొక్క సాక్ష్యంలో ఒక విడదీయరాని భాగంగా చేసాడు: “అల్లాహ్ తప్ప మరే ఆరాధనకు అర్హుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను”, ఎన్నో ఆరాధనాలలో అల్లాహ్ పేరుతో ప్రవక్త పేరు కూడా ప్రస్తావించ బడుతుంది. అజాన్, ఇఖామత్, ఖుత్బా, నమాజ్, అత్తహియ్యాత్, మరియు ఎన్నో దుఆలలో ఈ విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు ప్రపంచ నలుమూలలా మారుమ్రోగుతూ ఉంటుంది. మరియు ఈ విధంగా మరే వ్యక్తి గురించి లేదు.
హస్సాన్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా అన్నారు:
إذا قال في الخمس المؤذن أشهد ألم تر أن الله أخلد ذِكره
إذا قال في الخمسِ المؤذنُ أشهدُ وَضَمَّ الإلـٰهُ اسمَ النبيِّ إلى اسمه
فذو العرش محمودٌ وهذا محمدُ وشقَّ له من اسمه لِـــيُــجِلَّــــهُ
అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పేరును తన పేరుతో జత చేసేశాడు. ఇక ముఅజ్జిన్ (అజాన్ పలికే వ్యక్తి) (ప్రతిరోజూ) ఐదు సార్లు అజాన్ పలుకుతూ “అష్ హదు” అని అంటాడు. మరియు అల్లాహ్ తన పేరుతోపాటు ఆయన పేరును కలిపాడు, తద్వారా ఆయన్ను గౌరవించాలని. అందుకే అర్ష్ వాసుడు (అల్లాహ్) ‘మహమూద్’ అయితే, ఈయన ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వ సల్లం).
ఓ ముస్లిం లారా! ఇవి మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనానికి సంబంధించిన పది ఆధారాలు. ఇలాంటి ఆధారాలు వంద కంటే ఎక్కువ గా ఉన్నాయి. దీని గురించి మీకు ముందు తెలియజేయడం జరిగింది.
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక! ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
నిశ్చయంగా అత్యంత అసభ్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ముస్తఫా (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అవమానించడం మరియు ఆయనను దూషించడం, కించపరచడం. ఇలాంటి వారు ఇస్లాం మరియు ముస్లింల పట్ల విద్వేషాన్ని కలిగి ఉంటారు. వీరిని ఉద్దేశించి అల్లాహ్ ఇలా అంటున్నాడు:
(إن شانئك هو الأبتر)
ముమ్మాటికీ నీ శత్రువే నామరూపాల్లేకుండా పోయేవాడు.
అనగా నిన్ను మరియు నీకు ప్రసాదించ బడినటువంటి ధర్మాన్ని మరియు సన్మార్గాన్ని ద్వేషించేవారు నామరూపాలు లేకుండా పోతారు. వారి ప్రస్తావన చేసే వారెవరు ఉండరు మరియు వారు అన్ని రకాల మేళ్ళ నుండి దూరమైపోతారు.
ఎవరైతే ఇస్లాంకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారో, వారికి వ్యతిరేకంగా అల్లాహ్ ఎలాంటి కుట్ర పన్నుతాడు అంటే వారు ఇస్లాంపై దాడి చేసినప్పుడల్లా వారి దేశాల దృష్టి ఇస్లాం వైపు పెరుగుతుంది, దాని ద్వారా వారు ఇస్లాం యొక్క బోధనలను మరియు ఇస్లాం యొక్క వాస్తవికతను తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇస్లాం యొక్క ప్రచారాన్ని వ్యాపింప చేయడానికి ముస్లింలు తమ దేశాలలో దావా కార్యక్రమాలను వేగవంతం చేస్తారు అల్లాహ్ ఇలా అంటున్నాడు:
(ومكروا مكرا ومكرنا مكرا وهم لا يشعرون)
ఈ విధంగా వారు (రహస్యంగా) కుట్ర పన్నారు. మరి మేము కూడా మా వ్యూహాన్ని రచించాము. కాని దాని గురించి వారికి తెలీదు.
అదే సమయంలో, అవిశ్వాసులు ముస్లింలను రెచ్చగొట్టాలని కోరుకుంటారు. తద్వారా వారు హింస, కోపం, అజ్ఞానం, మూర్ఖత్వంతో విధ్వంసాలను సృష్టించాలని చూస్తారు. అలా జరిగినప్పుడు వారు తమ జాతి వారితో ఇలా అంటారు – ఇస్లాం మరియు ముస్లింలు ఏం చేస్తున్నారో చూశారా!. ఈ విధంగా ఇస్లాంపై బురద చల్లుతారు ఈ విధంగా ప్రజలను ఇస్లాం నుండి ఆపడానికి మీడియా ద్వారా ఎన్నో విధ్వంసకర దృశ్యాలను ప్రసారం చేస్తారు.
కాబట్టి ఇలాంటి ఉపద్రవాల నుంచి అప్రమత్తంగా ఉండాలి. మరియు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహనాన్ని ఆయుధంగా చేసుకోవాలి. ఆ సందర్భంలో జ్ఞానవంతులు,పండితులు చూపిన మార్గదర్శకత్వాలను పాటించాలి. ఇలాంటి సంఘటనలను ఇస్లాం ప్రచారం కొరకు మరియు ఇస్లాం పై లేవనెత్తుతున్న సందేహాలను దూరం చేయడం కొరకు వినియోగించుకోవాలి. తద్వారా శత్రువుల మోసానికి లోను కాకుండా ఉంటాము. ఆ సందర్భంలో అల్లాహ్ యొక్క పరీక్ష మనపై అనుగ్రహంగా మారవచ్చు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:
(ولا يستخفنك الذين لا يوقنون)
నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైంది. నమ్మకం లేనివారు నిన్ను తడబాటుకు లోనుచేసే స్థితి రాకూడదు సుమా!
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద సత్కార్యానికై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.
(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుముఆ రోజు వారిపై ఎక్కువగా దరూద్ మరియు సలాం పంపమని చెబుతూ ఇలా సెలవిచ్చారు:
“ఉత్తమమైన రోజుల్లో జుమా రోజు. ఆ రోజునే ఆదమ్ అలైహిస్సలాం పుట్టించబడ్డారు.ఆయన అదే రోజున మరణించారు, అదే రోజున శంఖం పూరించబడుతుంది. అదే రోజు గావు “కేక” కూడా వినబడుతుంది. కాబట్టి ఆరోజు నాపై అతి ఎక్కువగా దరూద్ మరియు సలాం పంపండి. అవి నా ముందు ప్రదర్శించబడతాయి”.
ఓ అల్లాహ్! నీవు, నీ దాసుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు శుభాలను పంపు. ఆయన ఖలీఫాలు, తాబయీన్లు మరియు ప్రళయం వరకు ఎవరైతే చిత్తశుద్ధితో అనుసరిస్తారో వారిని ఇష్టపడు, ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవం మరియు కీర్తిని ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయు మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.
ఓ అల్లాహ్! ద్రవ్యోల్బణం, వడ్డీ, వ్యభిచారం, భూకంపాలు మరియు పరీక్షలను మా నుండి తొలగించు, మరియు బాహ్య, అంతర్గత ప్రలోభాల యొక్క చెడులను ప్రత్యేకించి మా దేశం నుండి మరియు సాధారణ అన్ని ముస్లిం దేశాల నుండి తొలగించు.
ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. మరియు వారిని వారి దేశం కొరకు కారుణ్యంగా చేయు.
ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ