అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]
మూలం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్
తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల హఖ్ తెలుగు పబ్లికేషన్స్
కరుణామయుడు కనికరించేవాడు అయిన అల్లాహ్ పేరుతో
మహాశయులారా !
ఇస్లాంలో దైవ గృహాన్ని మస్జిద్ అనంటారు. మస్జిద్ లో అల్లాహ్ ఆరాధన జరుగుతుంది. ఇతర ధార్మిక కార్యక్రమాలు కూడా మస్జిద్ లో జరుగుతాయి. మస్జిద్ ల అన్నింటి దిశ మక్కాలో ఉన్న అల్లాహ్ కేంద్ర ఆరాధనా స్థలమైన కాబా గృహం వైపుకు మరలి ఉంటుంది. ఏ విధంగానయితే ఒక ముస్లిం పై ప్రతి రోజూ అయిదు పూటల నమాజ్ విధిగా చేయబడిందో అదే విధంగా అది సవ్యంగా నెరవేరేందుకుగాను జమాఅత్ తో కలసి, అంటే సామూహికంగా నమాజ్ చేయమని కూడా ఆదేశించటం జరిగింది. సామూహికంగా చేసే నమాజ్ లో అపారమయిన, అసంఖ్యాకమైన ప్రాపంచిక, పరలోక శుభాలు ఇమిడి ఉన్నాయి.
అయితే ప్రతి సామూహిక నమాజ్ కోసం వేళకు చేసే ప్రకటననే ‘అజాన్‘ అంటారు. ఈ ‘అజాన్’లో యావత్తు ఇస్లామీయ బోధనల సారాంశం పొందుపరచబడి ఉంది. అందుకే అజాన్ ను ‘దావతితామ్మ‘ అన్నారు. అంటే అది పరిపూర్ణమైన పిలుపు అన్నమాట. ఈ పిలుపులో గొప్ప ఆకర్షణ ఉంది. అదెంతో ప్రభావవంతమైంది. వేళకు అయ్యే ‘అజాన్’ పనిలో వున్న వారిని, ఖాళీగా ఉన్న వారిని, నిద్రించేవారిని అందరినీ కదిలిస్తుంది. అజాన్ పిలుపు ద్వారా, అల్లాహ్ – దైవదాసుని వాస్తవం ప్రస్ఫుటం చెయ్యబడుతుంది. ఈ పిలుపులో ఇహపర సాఫల్యాల సందేశం ఉంది. ఈ పిలుపు దాసుడ్ని అతని స్వంత పనులన్నింటి నుండి, కోర్కెల నుండి వేరు చేసి అతన్ని అల్లాహ్ తో, అల్లాహ్ నామ స్మరణతో, అల్లాహ్ ఆరాధనతో సంబంధం ఏర్పరుస్తుంది. మహత్తరమైన ఈ పిలుపు దాసుని హృదయాంతరాళాల్లో ఓ విధమైన ప్రకంపనం పుట్టిస్తుంది. అల్లాహ్ ఆరాధనకై అతన్ని సమాయత్తం చేస్తుంది. అంతేకాదు, ఈ గొప్ప పిలుపు, అల్లాహ్ పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉన్న వారెవరో, బూటకపు ప్రేమ కలిగి ఉన్న వారెవరో కొద్ది సేపట్లోనే తేల్చి వేస్తుంది. సర్వోన్నతుడయిన అల్లాహ్ పట్ల, దైవ ప్రవక్త పట్ల, దైవ ధర్మం పట్ల నిజమయిన, నిష్కల్మషమైన ప్రేమ, విశ్వాసం ఉన్నవారు ఈ పిలుపు వినగానే అల్లాహ్ గృహం వైపుకు మరలి వస్తారు. మనో వాక్కాయ కర్మలచేత వారు ఈ పిలుపుకు బదులు ఇస్తారు. అంటే, వారు అల్లాహ్ ఆరాధనలో నిమగ్నులవుతారు.
అజాన్ పిలుపు విన్న తరువాత అల్లాహ్ గృహం వైపుకు మరలటం ముస్లిం పురుషులకు తప్పనిసరి అయిపోతుంది. ఇది శక్తిమంతుడయిన అల్లాహ్ యొక్క తిరుగులేని ఆదేశం. అజాన్ ఎవరి పిలుపు అనుకున్నారు ?! అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేరిట పంపబడే ఓ గొప్ప ట్రంకాల్, ఆ ట్రంకాల్ ను అందుకుని దానికి బదులు ఇవ్వటం దాసులు విధి. ‘ఒక విశ్వాసి అజాన్ పిలుపు ఇస్తే ఆ పదాలకు మీరు బదులు పలకండి’ అని మానవ మహోపకారి (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధించారు. ఉదాహరణకు, ముఅజ్జిన్ ‘అల్లాహు అక్బర్’ అనంటే మనమూ ఆ పదాన్ని పలకాలి. ఆ విధంగా చేస్తే మన ప్రక్కనున్న వారు కూడా దాన్ని అనుసరిస్తారు. ఆ వాతావరణం చూస్తుంటే దాసులు తన ప్రభువుతో సంభాషిస్తున్నారా! అన్నట్లే ఉంటుంది. అందుకే అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేర వచ్చిన ట్రంకాల్ అని అనటం ఎంతో సమంజసం.
అల్లాహ్ స్వయంగా తన దాసుడ్ని ‘అజాన్’ ద్వారా తన దర్బారుకు పిలుచుకున్నాడంటే ఎంత దయగలవాడాయన! ఆ పిలుపును, ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయన దర్బారుకు వెళ్ళిన దాసుడు ధన్యుడు. ఇక్కడ అతిధేయుడు అల్లాహ్ అయితే అతిథి దాసుడు. అడిగేవాడు దాసుడయితే ఇచ్చేవాడు అల్లాహ్. అతిథి అయిన దాసునికి అతిథేయుడు అయిన అల్లాహ్ ఇచ్చే వరాలకు, అనుగ్రహాలకు హద్దే లేదు.
అల్లాహ్ ఆరాధన కోసం దాసుడు మస్జిద్ లో అడుగు పెట్టగానే దైవ దూతలు అతని చుట్టూ అల్లుకుంటారు. నమాజ్ కోసం నిరీక్షించినంత వరకూ దూతలు అతని కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉంటారు. అల్లాహ్ కారుణ్యం అతనిపై కురవాలనీ, సుఖశాంతులు అతనికి ప్రాప్తం కావాలని వేడుకుంటారు. అతని పాపాల క్షమాభిక్షకై వేడుకుంటారు.
అల్లాహ్ చివరి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఏమని ప్రబోధించారంటే “దాసుడు అల్లాహ్ గృహం వైపుకు మరలి అతను వేసే ఒక్కో అడుక్కీ ఒక్కో పాపం చెరిపివేయబడుతుంది. అతని ఖాతాలో ఒక్కో అడుక్కి ఒక్కో సత్కార్యం రాయబడుతుంది. అతని స్థాయి, ఒక్కో మెట్టు అల్లాహ్ సాన్నిధ్యంలో పెంచబడుతుంది.”
ఇహ పరాలలో అజాన్ ఎన్ని శుభవార్తలనిస్తుందో ఆలోచించండి !
అజాన్ స్థానం
ఇక ధర్మంలో అజాన్ ఔన్నత్యం ఏమిటో చూద్దాం. దైవ ధర్మమయిన ఇస్లాం నిదర్శనాలలో ఓ గొప్ప నిదర్శనం అజాన్. ఇది సున్నతె ముఅక్కిద. అంటే దీని ప్రాముఖ్యం ధర్మంలో ‘ఫర్జ్’కు దరిదాపుల్లో ఉంది. ఒకవేళ ముస్లింలు సామూహికంగా ‘అజాన్’ వ్యవస్థను గనక బహిష్కరిస్తే, కాలపు ఖలీఫా వారికి వ్యతిరేకంగా కఠిన చర్య తీసుకోగలడు. అందుకు కారకులయిన వారిపై మరణ దండన కూడా విధించగలడు.
ఎంతో మహత్పూర్వకమయినది అజాన్. అజాన్ పిలుపు ఇవ్వటం, సామూహిక నమాజ్ కై మొదటి వరుసలో వచ్చి నిలబడటం ఈ రెండు పనులు ఎంత శుభ ప్రదమయినవంటే ముస్లింలు వాటిని నెరవేర్చడానికి పరస్పరం పోటీ పడినా తప్పు లేదు.
ఎవరయితే అల్లాహ్ ప్రసన్నతను చూరగొనే ఉద్దేశ్యంతో వేతనం తీసుకోకుండా ఏడేండ్లు అజాన్ ఇస్తాడో అతనికి నరకం నుండి విముక్తి లభిస్తుందని ఓ సందర్భంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.
కాబట్టి ముస్లిం సమాజంలోని స్థితిపరులు వేతనం లేకుండా అజాన్ ఇచ్చే అలవాటు చేసుకోవాలి. అదెంతో గౌరవ ప్రదమయిన పని అని భావించాలి. ఒక వేళ ఇలాంటివారు గనక ఈ పనికి సిద్ధం కాకపోతే సామాన్యులకు జీతం ఇచ్చి అయినా సరే ఈ పనికి నియమించాలి. ముఅజ్జిన్ ను గౌరవ దృష్టితో చూడాలి. అజాన్ మరియు ధార్మిక వ్యవస్థ కొనసాగటానికి ఇలా చేయటం ఎంతో అవసరం.
అజాన్ కు బదులు పలకటం
ఎవరయితే ముఅజ్జన్ పిలుపుపై అజాన్ పదాలకు బదులు పలుకుతాడో అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడని మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు. సుబ్ హా నల్లాహ్ !
ధర్మవిహీనులు, షైతాన్ పాలిట అజాన్
నమాజ్ కోసం అజాన్ పిలుపు ఇస్తే షైతాన్ అది విని పలాయనం చిత్తగించి, మదీనాకు 36* మైళ్ళ దూరాన గల ముఖామె రౌహ దగ్గరకు వెళ్ళి ఆగుతాడని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది.
మరో హదీసు ప్రకారం అజాన్ పిలుపు మొదలవగానే షైతాన్ పెడబొబ్బలు పెడుతూ పారిపోతాడు – ఆ విధంగానైనా అజాన్ వినకుండా ఉండటానికి. అజాన్ ఇవ్వటం పూర్తయినాక తిరిగి వస్తాడు. నమాజీలలో రకరకాల దుష్ప్రేరణలు కలిగిస్తాడు.
(*) 36 అంటే 36 అనే కాదు. విషయాన్ని వివరించటం అసలు ఉద్దేశ్యం. ప్రవక్తలు మేధా సంపత్తి కలిగి ఉంటారు. విషయాన్ని వారు ఉదాహరణలతో సహా హృదయంలో నాటుకునేలా బోధిస్తారు.
అజాన్ ప్రారంభ దశ
ప్రవక్త మహనీయులు మదీనాలో ఉండగా ఒక సహచరుడు హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) ఒక కలగన్నారు. ఆ కలలో ఆయనకు అజాన్ పదాలు తెలుపబడ్డాయి. ఆ కల గురించి ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు వివరించారు. అంతా విని, అల్లాహ్ తలిస్తే ఈ కల నిజం కాగలదన్నారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ‘వెళ్ళు- వెళ్ళి నీకంటే హెచ్చు స్వరం గల హజ్రత్ బిలాల్ కు ఈ పదాలు నేర్పు. ఆయన ప్రజలను నమాజ్ పిలుస్తార’ని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జైద్ ను ఆదేశించారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఈ పిలుపు వినగానే, “దైవ ప్రవక్తా! మీకు ఎవరయితే సత్యం ఇచ్చి పంపాడో ఆ శక్తిమంతుని సాక్షిగా చెబుతున్నాను. ఈయనకు కలలో ఏదయితే నేర్పబడిందో అదే నాకూ తెలియజేయబడింది” అన్నారు హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు). ఇది విని మహా ప్రవక్త అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కనుక అజాన్ అల్లాహ్ ప్రేరితమైందని చెప్పవచ్చు.
ఇక అజాన్ భావం వినండి
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్
అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు.
అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు.
అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్
అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను.
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను.
అష్ హదు అన్న ముహమ్మదర్ర సూలుల్లాహ్
అష్ హదు అన్న ముహమ్మదర్ర సూలుల్లాహ్
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
హయ్య అలస్సలాహ్, హయ్య అలస్సలాహ్
నమాజ్ కోసం రండి. నమాజ్ కోసం రండి.
హయ్య అలల్ఫలాహ్, హయ్య అలల్ఫలాహ్
సాఫల్యం కోసం రండి, సాఫల్యం కోసం రండి.
అస్సలాతు ఖైరుమ్మిన్ననౌమ్, అస్సలాతు ఖైరుమ్మినన్నౌమ్
(ఇది కేవలం ఫజ్ర్ నమాజ్ కొరకే పలుకబడుతుంది)
నమాజ్ నిద్రకంటే శ్రేష్ఠమయింది. నమాజ్ నిద్రకంటే శ్రేష్ఠమయింది.
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్
అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు.
లా ఇలాహ ఇల్లల్లాహ్
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.
మహోన్నతమైన, పరిపూర్ణమైన పిలుపు
అజాన్ లోని పై వాక్యాల గురించి ఆలోచిస్తే ఇస్లాం బోధనల సంపూర్ణ సారాంశం మనకిందులో లభిస్తుంది. దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి:
“వమా ఖలఖ్ తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లీయాబుదూన్” (అజ్జారియాత్: 56)
“నేను జిన్నుల్ని, మానవుల్ని పుట్టించింది కేవలం నా దాస్యం కొరకు తప్ప మరి దేనికీ కాదు.”
అల్లాహ్ దాస్యం చేయటం ఎలా అనేది ఆలోచించవలసిన విషయం. అల్లాహ్ తరపున ప్రభవింప జేయబడిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించి ఆయనకు విధేయులై, మనం ఆయన అడుగుజాడల్లో నడిస్తే దైవదాస్య విధానం మనకు సుస్పష్టమవుతుంది. మరోమాటలో చెప్పాలంటే, అల్లాహ్ దేనికొరకు మనల్ని సృష్టించాడో అ ధ్యేయాన్ని మనం నెరవేర్చిన వారమవుతాము. అల్లాహ్ దాస్యం యొక్క మహోన్నతమయిన, స్పష్టమయిన రూపం నమాజ్ కాగా ఆ నమాజ్ కు ఇచ్చే పిలుపే అజాన్. సుదీర్ఘంగా ఆలోచిస్తే రెండు విషయాలు అర్థమవుతాయి; ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ రెండు చోట్లా సాఫల్యం పొందినవాడే ధన్యుడు. దాస్యం ద్వారా అల్లాహ్ దాసుని నుండి రెండు విషయాలు కోర్తాడు. ఒకటేమంటే, దాసుడు తన ముందు తన అశక్తతను, నిస్సహాయ స్థితిని, దీనావస్థను వ్యక్తం చేయాలి. రెండోది; దాసుడు అల్లాహ్ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఇతోధికంగా చాటాలి. ఇదే అసలు దాస్యం యొక్క ముఖ్యోద్దేశ్యం.
దాసుడు ఇహపరాలలో అన్ని విధాలా విజయాలను కాంక్షిస్తాడు. అల్లాహ్ ఏకత్వంపై విశ్వాసం, అల్లాహ్ అంతిమ ప్రవక్త పట్ల విశ్వాసం విధేయతల ద్వారా అతనికి ఈ విజయాలు ప్రాప్తమవుతాయి. క్రియాత్మకంగా అతను ప్రతి రోజూ ఐదు పూటలు ఇవ్వబడే అజాన్ పిలుపుకు ‘లబ్బైక్’ (హాజరయ్యాను) అనాలి. దాంతో పాటు మరో విషయం కూడా అతని దృష్టిలో ఉండాలి – అదేమంటే అతని విశ్వాసం స్వచ్ఛంగా ఉండాలి. విశ్వాసంలో ఏకేశ్వరోపాసన ఉండాలి. అప్పుడే అతని ఆరాధన అల్లాహ్ సమక్షంలో స్వీకార యోగ్యమవుతుంది. ఈ వాస్తవ సముదాయమే అజాన్.
అజాన్ – దాని ప్రభావం
ఇక ఆ పిలుపు పరిసరాలపై వేసే ప్రభావాన్ని గురించి ఆలోచించండి. ముఅజ్జిన్ మస్జిద్ లో ఎత్తయిన ఓ చోట నిలబడి ‘అల్లాహు అక్బర్…’ అంటూ పిలుపు ఇవ్వగా ఆ పిలుపుకు భూమ్యాకాశాలు సయితం ప్రతిధ్వనిస్తాయి. మానవత్వం అణువణువూ పులకిస్తుంది. పరిసరాల్లోని ప్రతి వస్తువూ ఆ పిలుపుకు స్పందిస్తుంది. నిద్రావస్థలో ఉన్న వారినయినా, కార్యాలయ కార్యకలాపాల్లో లీనమై ఉన్న వారినయినా అందరినీ అది అప్రమత్తుల్ని చేస్తుంది. అల్లాహ్ ఆరాధన కోసం వారి హృదయాల్లో తహతహ మొదలవుతుంది. ఎందుకంటే మానవ నైజం విశ్వాంతరాళాల ఉనికి తౌహీద్, విధేయతల ప్రాతిపదికపై ఏర్పరచబడింది. ‘అల్లాహు అక్బర్’ అనేది తౌహీద్ యొక్క అతి పెద్ద నినాదం.
అల్లాహ్ ఔన్నత్యాన్ని స్తుతించడంతో పాటు అతను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటూ అన్ని శక్తులు, అన్ని సృష్టితాలు నిస్సహాయమయినవని, అల్పమయినవని, బలహీన మయినవని అల్లాహ్ సమక్షంలో ఒప్పుకుంటున్నాడు. అదే విధంగా అల్లాహ్ కు ఎవరూ సరిపడలేరని, సహవర్తులు కారని ప్రకటిస్తున్నాడు. మహనీయ ముహమ్మద్ అల్లాహ్ తరపున పంపబడిన చివరి ప్రవక్త అనీ, ప్రళయం వరకు ఆయన చూపిన జీవన విధానమే అల్లాహ్ కు ఆమోదయోగ్యమనీ, ప్రవక్త వారు చూపిన జీవన విధానమే మనిషి ఇహపరాల విజయానికి పూబాట అని కూడా చాటుతున్నాడు.
మరి ఆ తర్వాత ‘హయ్య అలస్సలాహ్’ అంటూ ముఅజ్జిన్ ఇచ్చే ట్రంకాల్ గురించి ఆలోచించండి.
ఇది ప్రపంచంలోని ట్రంకాల్ లన్నిటికంటే గొప్పది. అల్లాహ్ ప్రతినిధి అయిన ముఅజ్జన్, అల్లాహ్ టెలిఫోన్ ఆపరేటర్ మనకు ట్రంకాల్ ఇస్తాడు. ‘రండి, అల్లాహ్ దాస్యం చేయండి. అల్లాహ్ నామాన్ని స్మరించండి. అల్లాహ్ గృహం వైపుకు రండి. అల్లాహ్ ముందు తలవంచండి. అల్లాహ్ ఎదుట పశ్చాత్తాపపడండి. అల్లాహ్ ను అడగండి. అల్లాహ్ ముందు మీ అవసరాలేమిటో విన్నవించుకోండి’ అని.
ఆ తర్వాత ముఅజ్జిన్ సాఫల్యం వైపుకు పిలుస్తాడు. సాఫల్యం ఎక్కడ అన్వేషిస్తున్నారు? మీరు అల్లాహ్ దర్బారుకు రండి. మీరిక్కడికి వస్తే ఇహలోక సాఫల్యం, పరలోక సాఫల్యం రెండూ లభిస్తాయి.
మరి ముఅజ్జన్ ఫజ్ర్ నమాజ్ కోసం ఇచ్చే పిలుపులో ‘అస్సలాతు ఖైరుమ్మినన్నౌమ్’ అంటూ అదనంగా మరోవాక్యం పలుకుతాడు. దాని భావమేమిటి? నిద్రసుఖాల కోసం తపించేవారలారా! ఆరాధనా మాధుర్యాన్ని ఆస్వాదించండి. స్వర్గసుఖాలు అన్వేషించండి, నిద్రకంటే నమాజ్ ఎంతో శ్రేష్ఠమయినది.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ – అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు. ఈ విధంగా ముఅజ్జిన్ మరోసారి అల్లాహ్ ఏకత్వాన్ని స్మరిస్తూ, షిర్క్ ను ఖండిస్తున్నాడు. ఈ విషయమే అల్లాహ్ కు అత్యంత ప్రీతికరమయినది.
ప్రతి రోజూ ఐదు పూటలు ఈ పిలుపుపై ‘లబ్బైక్’ (హాజరయ్యాను) అనే దాసులు, అల్లాహ్ తో తమ సంబంధం ఏర్పరచుకుని, ఇహపరాల సాఫల్యం పొందిన వారు అదృష్టవంతులు.
అజాన్ కు నోటి ద్వారా ఇచ్చే జవాబు
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించారు:
ముఅజ్జిన్ పిలుపు విన్న ప్రతి ఒక్కరూ బదులుగా ఆ వచనాలను పలకాలి (*). ఈ కలిమాలను పలకడమంటే అజాన్ కు సమాధానమివ్వడమన్న మాట!
(*) అంటే ‘అల్లాహు అక్బర్’ అని ముఅజ్జిన్ పలకగానే వినేవారు కూడా ‘అల్లాహు అక్బర్’ అనాలి. అదేవిధంగా ఇతర పదాలకు బదులు పలకాలి. అయితే ముఅజ్జిన్ హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ఫలాహ్ అనగానే, దానికి సమాధానంగా వినేవారు, లా హౌలా వలా ఖువ్వత ఇల్లా బిల్లా హిల్ అలియ్యిల్ అజీమ్ (అంటే మహోన్నతుడు మహోత్కృష్టుడయిన అల్లాహ్ తప్ప ఏ శక్తి, మరే బ్రహ్మాండమూ లేదు) అని పలకాలి. హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ఫలాహ్ అనే పిలుపుపై షైతాన్ మనిషిని పెడదారి పట్టించజూస్తాడు. అందుచేత షైతాన్ ప్రేరణ నుండి, అతని జాలం నుండి సురక్షితంగా ఉండటానికి గాను ఇలా పలకమని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు. ఇదీ అజాన్ కు మనం నోటి ద్వారా పలికే సమాధానం. అజాన్ కు ‘బదులు’ పలకడం తప్పనిసరి. అయితే భోజనం చేస్తుండగా, బహిర్ ప్రదేశంలోఉండగా లేక తత్సంబంధిత అవసరంలో ఉండగా లేక ఎవరికయినా ధర్మ సంబంధమయిన విషయాన్ని ప్రబోధిస్తున్న సమయంలో ‘అజాన్’కు బదులు పలుకనవసరం లేదు.
అజాన్ కు క్రియాత్మక సమాధానం
అజాన్ వచనాలను మీరు పలకడమయితే నోటి ద్వారా ఇచ్చే సమాధానం. అయితే క్రియాత్మక సమాధానం ఏమిటంటే, మనిషి తన దైనందిన కార్యక్రమాలను, పనులను, లావాదేవీలను వదలివేసి ఆసక్తితో అల్లాహ్ గృహానికి మళ్ళటం. ఏ ముస్లిమయితే అజాన్ విని ఆ కలిమాలకు బదులు పలికాడో, ఇంకా మస్జిద్ వైపుకు మరలాడో అతను అజాన్ పిలుపును, అల్లాహ్ ఆదేశాన్ని శిరసావహించాడు. ఇంకా అతను సర్వోన్నత ప్రభువుతో సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇదే నిజమైన విధేయుని ప్రధాన లక్షణం. ఎవరయితే క్రియాత్మకంగా దీనికి సమాధానం ఇవ్వడో అతను అల్లాహ్ తో , దైవ ప్రవక్తతో, దైవధర్మంతో తనకు ప్రేమ ఉందని ఎలా చెప్పగలడు? అల్లాహ్ ధరణిపై మనుగడ సాగించే హక్కు అసలు అతనికెలా ఉంటుంది?
అజాన్ పిలుపు అనంతరం దుఆ
అజాన్ పిలుపు పూర్తయిన తరువాత మొదట దరూద్ పఠించాలి. అనంతరం ఈ దుఆ పఠించాలి:
اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ إِنَّكَ لَا تُخْلِفُ المِيعَادَ
“అల్లాహుమ్మ రబ్బ హాజి హిద్దావ తిత్తామ్మతి వస్సలా తిల్ ఖాయిమతి ఆతి ముహమ్మద్ నిల్ వసీలత వల్ ఫజీలత వబ్ అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వ అత్తహు ఇన్నక లా తుఖ్ లిఫుల్ మీ ఆద్”
(అల్లాహ్! పరిపూర్ణమైన ఈ సందేశానికి ప్రభూ! స్థాపించబడే నమాజ్ కు యజమానీ!! నీపు మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు (స్వర్గంలో) అత్యున్నతమయిన స్థానం ప్రసాదించు. ప్రళయదినాన సిఫార్సుకు సంబంధించిన ఏ ప్రశంసా పాత్రమయిన ‘మఖామె మహమూద్’ గురించి నీవు ముహమ్మద్ వారికి వాగ్దానం చేశావో ఆ స్థానంలో ఆయన్ని ప్రతిష్టింపజెయ్యి. నిస్సందేహంగా నువ్వు వాగ్దాన భంగం చేసేవాడవు కావు)
తమ అనుచరుల్లో ఎవరెవరయితే ఈ దుఆ పఠిస్తారో, వారి కోసం నా సిఫారసు వాజిబ్ (తప్పనిసరి) అయిపోతుందని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించినట్లు హదీసు ద్వారా తెలుస్తోంది.
అజాన్ – కొన్ని ముఖ్యమయిన నియమాలు
(1) నమాజ్ వేళకు ముందే అజాన్ ఇవ్వబడుతుంది. వేళకాని వేళ అజాన్ ఇవ్వటం సబబుకాదు. ఒకవేళ అలా జరిగితే, వేళ అయ్యాక మరోసారి అజాన్ ఇవ్వటం తప్పనిసరి.
(2) అన్ని ఫర్జ్ నమాజుల కోసం అజాన్ ఇవ్వటం పురుషుల కోసం సున్నతె ముఅక్కద అవుతుంది.
(3) ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అధ్ హా నమాజుల కోసం అజాన్, ఇఖామత్ ఇవ్వవలసిన అవసరం ఉన్నట్లు మహాప్రవక్త ద్వారా రూఢీ కావటం లేదు.
(4) అజాన్ అయినా, ఇఖామత్ అయినా నిర్ణీత అరబీ పదాల్లోనే పలకటం తప్పనిసరి.
(5) అరబ్బేతర భాషలో అజాన్ పలకటం సమ్మతం కాదు.
(6) ప్రాజ్ఞ వయస్సు వచ్చిన పురుషులు మాత్రమే అజాన్ ఇవ్వాలి. కేవలం టేప్ రికార్డర్ ద్వారా అజాన్ వినిపిస్తే అది సమ్మతం కాదు. ఇందులో షరీఅత్ కు సంబంధించిన పరమార్థాలెన్నో ఉన్నాయి.
(7) ముఅజ్జిన్ ప్రాజ్ఞ వయస్సు వచ్చిన పురుషుడయి ఉండాలి. స్త్రీలు, మానసిక పరిపక్వత రానివారు, మతిస్థిమితం లేనివారు అజాన్ ఇవ్వటం సమ్మతం కాదు.
(8) ముఅజ్జన్ పరిశుద్ధుడయి ఉండాలి. అంటే స్నానం చేయవలసిన అగత్యం లేకుండా ఉండాలి. అయితే అతను వుజూ లేకపోయినా అజాన్ ఇవ్వగలడు. కాని ఎల్లప్పుడూ ఇలా చేయటం వాంఛనీయం కాదు.
(9) ముఅజ్జిన్ కొన్ని విషయాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవాలి. అవేమంటే:
(అ) మస్జిద్ బయట ఏదయినా ఎత్తయిన స్థానంలో నిలబడి అజాన్ ఇవ్వటం ఉత్తమం.
(ఆ) ఖిబ్లా వైపుకు తిరిగి నిలబడాలి. చూపుడు వ్రేళ్ళను చెవుల్లో పెట్టుకొని తన శక్తి మేరకు బిగ్గరగా అజాన్ ఇవ్వాలి.
(ఇ) అజాన్ ఇస్తున్నప్పుడు మాట్లాడరాదు. ఎవరయినా ‘సలాం’ చేస్తే బదులు కూడా పలకరాదు.
(ఈ) అజాన్ ఇవ్వటంలో పొరపాటు జరిగితే తప్పుగా పలికిన పదాన్ని మళ్ళీ సరిచేసుకోవాలి. ఉదాహరణకు: ‘హయ్య అలస్సలాహ్’ బదులు ‘హయ్య అలల్ఫలాహ్’ పలికినట్లు అనుమానం వస్తే అటువంటి సందర్భంలో మొదట హయ్య అలస్సలాహ్ చెప్పి ఆ తర్వాత హయ్య అలల్ఫలాహ్ పలికితే సరిపోతుంది.
(ఉ) అజాన్ పదాలు సరయిన విధంగా ఉచ్ఛరించాలి. పాట మాదిరిగా రాగాలు తీయరాదు.
(ఊ) హయ్య అలస్సలాహ్ పలికేటప్పుడు కుడివైపున, హయ్య అలల్ఫలాహ్ అనేటప్పుడు ఎడమ వైపున తిరగాలి. ఐతే ఆ సమయంలో కూడా రొమ్ము ఖిబ్లా దిశగానే ఉండేట్లు జాగ్రత్తపడాలి.
(10) ప్రయాణీకులు నమాజ్ వేళకు అజాన్ ఇవ్వటం ‘ముస్తహబ్’ అవుతుంది ‘సున్న ముక్కద’ కాదు.
(11) సామూహిక నమాజ్ కోసం అజాన్ ఇవ్వటం సున్నతె ముఅక్కద అయితే స్త్రీలు వేళకు నమాజ్ చేయవలసి ఉన్నప్పుడు, ఆ వేళకు అజాన్ కాకపోయినా నమాజ్ చేయవచ్చు. అజాన్ కోసమే నిరీక్షించవలసిన అవసరం లేదు. పురుషులు కూడా నమాజ్ వేళ మొదలయిపోతే సున్నత్, నఫిల్ నమాజ్ చేయగలరు.
(12) అజాన్ ఇస్తున్న సమయంలో ముఅజ్జన్ స్పృహ కోల్పోయినా లేక చనిపోయినా లేక అతని గొంతు పడిపోయినా మళ్ళీ మొదటి నుండి అజాన్ ఇవ్వటం సున్నతె ముఅక్కిద.
ముఅజ్జిన్ స్థానం
ఇక మహత్తరమయిన, మహత్పూర్వకమయిన అజాన్ పిలుపు ఇచ్చే ముఅజ్జిన్ ఎలాంటివాడయి ఉండాలి? అతని స్థానం ఎంత ఉన్నతమయినదయి ఉండాలి?
ముఅజ్జిన్ విద్యావంతుడు, బుద్ధిమంతుడు, షరీఅత్ ఆదేశాలను గురించి తెలిసినవాడయి ఉండాలి. చెడుల నుండి వారించేవాడు మంచివైపుకు ప్రజలను ఆహ్వానించేవాడై ఉండాలి. షరీఅత్ కు బద్ధుడయి ఉండాలి. దైవభీతిపరుడయి ఉండాలి. ఎందుచేతనంటే, అజాన్ ద్వారా దాసుల్ని దైవారాధన వైపుకు పిలిచేవాడు తన వ్యక్తిగత స్థాయిలో పిలవటం లేదు. అతను చిన్నలను, పెద్దలను, రాజులను, సామాన్యులను – అందరినీ అల్లాహ్ తరపున పిలుస్తున్నాడు. ముఅజ్జిన్ పిలుపుపై లబ్బయ్క్ అనటం అల్లాహ్ మరియు దైవ ప్రవక్త పిలుపుకు సమాధానం పలకటం వంటిదే. ఈ పిలుపు ఇచ్చే వ్యక్తి ఎంతో గౌరవనీయుడు. అతని వృత్తి ఎంత గొప్పది! మన పూర్వీకులు ఈ యదార్థాన్ని గ్రహించబట్టే, ఎంతో యోగ్యుడైన, దైవ భక్తిపరుడయిన వ్యక్తినే ముఅజ్జిన్ గా నియమించేవారు. ముఅజ్జిన్ పట్ల గౌరవప్రదంగా మెలిగేవారు.
అయితే నేడు మన దృష్టిలో ధర్మానికి విలువ తగ్గిపోయింది. ఫలితంగా ఇమామ్, ముఅజ్జిన్ దైవభక్తిపరుల స్థానం కూడా మన దృష్టిలో పడిపోయింది. ఇది ఎంతో విచారకరమయిన విషయం. పనికిరాని వారిని, అసమర్థుల్ని నేడు మనం ఈ గొప్ప పనుల కోసం ఎన్నుకుంటున్నాము. ఫలితంగా మస్జిద్ మరియు ధర్మ వ్యవస్థ మునుపటంత ప్రభావవంతంగా ఉండడం లేదు. ఎక్కడో ఒకచోట తప్ప – సాధారణంగా పలికేదేదో అర్థం చేసుకోకుండానే పలుకుతున్నాడు. వినేవాడి పరిస్థితీ అంతే. స్వయంగా మన ఆరాధనల్లో ఏకాగ్రత కొరవడుతోంది. మన అంతర్యాల్లో భయభక్తులు తగ్గుముఖం పడుతున్నాయి.
రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఏమన్నారో తెలుసా? తనకే గనక పరిపాలనా బాధ్యతలు ఉండకపోతే తాను అజాన్ ఇస్తూ ఉండేవాడినని అన్నారాయన. అవును. ఆయన దృష్టిలో రాజ్యాధికారికన్నా అజాన్ ఇచ్చేవారి స్థానం ఉన్నతమయింది. ఇదీ ఇస్లాంలో అజాన్ కు, ముఅజ్జిన్ కు ఉన్న మహోన్నత స్థానం.
ముఅజ్జిన్ మస్జిద్ లోని ఓ మూల ఎత్తయిన చోట నిలబడి అజాన్ ఇవ్వాలి. పెద్ద కంఠం కలవాడిని ముఅజ్జిన్ గా నిలబెట్టాలి. అతని పిలుపులో మాధుర్యం, లాలిత్యం ఉండాలి. మనో జగత్తును ఊపివేసి, ఏమరుపాటుకు గురయిన వారిని అప్రమత్తుల్ని చేసే, నిద్రావస్థలో ఉన్నవారిని మేలుకొలిపే హృదయాంతరాళాల్లో అల్లాహ్ ఆరాధనకై వేడిని పుట్టించే ఆకర్షణా శక్తి ముఅజ్జన్ స్వరంలో ఉండాలి. కేవలం మనుషులే కాదు, పశుపక్ష్యాదులు, రాళ్ళురప్పలు, చెట్లు చేమలు సృష్టిలోని సమస్తమూ ప్రతిస్పందించేలా అజాన్ పలకాలి ముఅజ్జన్. అందుకే కాబోలు ప్రళయ దినాన ముఅజ్జిన్ కంఠం ఎంతో పొడవుగా ఉంటుందని రసూలుల్లాహ్ సెలవిచ్చారు. ముఅజ్జన్ పిలుపు ఎక్కడెక్కడి వరకు విస్తరిస్తుందో, ఎవరయితే ఆయన పిలుపు వింటారో వారు జిన్నులయినా, మానవులైనా, సజీవమయిన వస్తువులయినా, నిర్జీవమయినవైనా అంతా ప్రళయ దినాన ముఅజ్జిన్ పక్షాన సాక్ష్యం ఇస్తారు. ఎవరెవరు ఆయన పిలుపును వింటారో వారంతా ముఅజ్జిన్ క్షమాపణ కొరకు ప్రార్థిస్తారు.
మహాప్రవక్త అనుయాయి, అబిసీనియా దేశస్థుడయిన హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ ఇస్తే ప్రజల గుండెలపై పిడుగు పడుతుందా అనిపించేది. ఆయన (రదియల్లాహు అన్హు) స్వరంలోని గాంభీర్యానికి మహాప్రవక్త పట్టణవాసులయిన మదీనా వాసులు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు – అందరూ నిలువెల్లా కంపించేవారు. నేటికీ మనం గమనిస్తుంటాం – కొంతమంది అజాన్ ఇస్తే వారి గొంతులోని మాధుర్యానికి ముస్లింలే కాదు, ముస్లిమేతర సోదరులు కూడా ఎంతో ప్రభావితులు అవుతుంటారు. అజాన్ పదాలలో, ఆ పిలుపులో ఉన్న మహత్తు అటువంటిది మరి!
-: సమాప్తం :-
ఇతర ముఖ్యమైన లింకులు :
- అదాన్ కు సంబంధించిన దుఆలు (దుఆ # 22 – 26) – హిస్నుల్ ముస్లిం నుండి
[ఆడియో దుఆ 22 – 23 – 24* – 25]

You must be logged in to post a comment.