إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుంచి దూరంగా ఉండండి. మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి. అల్లాహ్ ఇతర ఆరాధనల కంటే ఎక్కువగా దీనికి ఎంతో ప్రాముఖ్యతను ప్రసాదించాడు. నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ దీనిని ఆకాశాలలో విధి గావించాడు ఇది చూడడానికి 5 నమాజులే కానీ పుణ్యఫలం పరంగా 50 నమాజుల పుణ్యఫలం లభిస్తుంది. నమాజ్ ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుంది, నమాజ్ కొరకు మస్జిద్ వైపు వెళ్లడం మరియు తిరిగి రావడం కూడా ఆరాధనలోని భాగమే, అదే విధంగా దీని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; ఈ నమాజు కొరకు పరిశుభ్రత పొందడం తప్పనిసరి.
ఓ విశ్వాసులారా! నమాజ్ యొక్క ఈ ప్రాధాన్యత దృష్ట్యా అల్లాహ్ దీని కొరకు త్వరపడమని ఆదేశిస్తున్నాడు, మరియు దీనికి సంబంధించి గొప్ప ప్రతిఫలాన్ని పెట్టాడు. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “పురుషుల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది మొదటి పంక్తి. అత్యంత హీనమైనది చివరి పంక్తి. స్త్రీల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది చివరి పంక్తి. అత్యంత హీనమైనది మొదటి పంక్తి”. (ముస్లిం)
అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు”. (ముస్లిం)
అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం లేదని భావిస్తే, వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు. మరియు నమాజ్ కొరకు త్వరపడడం వల్ల లభించే పుణ్యఫలం ఎంతో తెలిస్తే వారు ఒకరిని మించి ఒకరు పోటీపడతారు. అదేవిధంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సామూహికంగా చేయడంలో ఎంత పుణ్యముందో ప్రజలకు తెలిస్తే వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చిన సరే వారు తప్పకుండా వస్తారు.” (బుఖారీ-ముస్లిం)
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ హదీసులో(ما في النداء) దీని అర్థం అజాన్ ఇచ్చే వారికి లభించే అటువంటి పుణ్యఫలం మరియు “ یستهموا” దీని అర్థం లాటరీ వేయడం మరియు” تهجير ” దీని అర్థం త్వరపడటం మరియు” عتمة” దీని అర్థం ఇషా నమాజ్.
బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిస్సందేహంగా అల్లాహ్ తొలి పంక్తుల్లో ఉండేవారిపై కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు దైవదూతలు వారి పాప క్షమాపణ కొరకు దువా చేస్తారు”. (అబూ దావుద్)
ప్రవక్త వారి ఈ ఆదేశంలో దైవదూతలు వారి కొరకు దువాలు చేస్తారు. దీని యొక్క అర్థం ఏమిటంటే దైవదూతలు మొదటి పంక్తిలో ఉండే వారి కొరకు పుణ్యం మరియు క్షమాపణ యొక్క దువా చేస్తారు ఎందుకంటే అరబ్బీలో సలాహ్ అంటే దుఆ అని అర్థం కూడా వస్తుంది.
ఇర్బాజ్ బిన్ సారియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మొదటి పంక్తి వారి కొరకు మూడుసార్లు మరియు రెండవ పంక్తి వారి కొరకు ఒకసారి మగ్ ఫిరత్ (పాప క్షమాపణ) దుఆ చేసేవారు.(నసాయి)
అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: తన సహచరులు వెనుక (పంక్తుల్లో) ఉండిపోవటం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మందలిస్తూ, “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ తర్వాత వచ్చిన వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటు తనానికి గురిచేస్తాడు” అని అన్నారు. (ముస్లిం)
ఆయిషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “ఎవరైతే మొదటి పంక్తులకు దూరంగా ఉంటారో అల్లాహ్ తఆల వారిని తన కారుణ్యానికి కూడా దూరంగా ఉంచుతాడు”.(అబూ దావుద్)
అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన తౌబా (పశ్చాత్తాపం) చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
మీరు తెలుసుకోండి! అల్లాహ్ మీపై కనికరించు గాక! ఇస్లాంలో నమాజుకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, ఇంత గొప్ప ప్రాధాన్యత మరి యే ఇతర ఆరాధనకు లేదు. ఇస్లాం యొక్క ముఖ్య మూల స్తంభాలలో ఒకటి. ఇది లేకుండా ధర్మం స్థిరంగా ఉండలేదు.
ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఏమిటి నేను మీకు ధర్మం యొక్క అసలు మరియు దాని మూల స్తంభం మరియు దాని యొక్క శిఖరం గురించి తెలియజేయనా?” అప్పుడు నేను ఇలా అన్నాను, ఎందుకు కాదు మహా ప్రవక్తా! తెలియజేయండి. ప్రవక్త వారు ఇలా అన్నారు: “ధర్మం యొక్క అసలు ఇస్లాం, దాని మూల స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం అల్లాహ్ మార్గంలో పోరాడటం”. (తిర్మిజి)
దాసుడు మరియు అల్లాహ్ మధ్య ఇది సంభాషణకు ఒక సాధన, ఎందుకంటే నమాజులో అల్లాహ్ యొక్క పొగడ్త, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరుగుతుంది. నమాజ్ ఆరాధన హృదయం, నాలుక మరియు శరీర అవయవాల పై ఆధారపడి ఉంది ఉదాహరణకు అల్లాహ్ యొక్క పొగడ్త, దువా చేయడం, ఖురాన్ పఠించడం, అల్లాహ్ ను స్తుతించడం, తక్బీర్ చెప్పడం, మరియు శరీర అవయవాలతో ఏకాగ్రచిత్తంతో ఆచరించడం మరియు రుకూ, సజ్దా చేయడం మరియు అందులో వినయ వినమ్రతలు కనబరుస్తూ తమ చూపుని కిందికి వాల్చుకొని అల్లాహ్ ముందు తలవంచి నిల్చోవడం.
إنَّ الصَّلَوَةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ
నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). (29:45)
షేఖ్ సాది (రహిమహుల్లాహ్) పై ఆయత్ యొక్క వివరణలో ఇలా తెలియజేస్తున్నారు:- నమాజ్ యొక్క ఒక లక్ష్యం దాని కంటే గొప్పది అనగా హృదయం మరియు నాలుక మరియు శరీరంతో అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఎందుకంటే అల్లాహ్ తన దాసులను దాని కొరకే పుట్టించాడు, దాసులవైపు నుంచి చేసేటువంటి ఆరాధనలలో అతి గొప్ప ఆరాధన నమాజ్. నమాజులో తప్ప మనిషి యొక్క శరీర అవయవాల ద్యారా ఇలాంటి ఆరాధన జరగదు. అందుకే అల్లాహ్ అంటున్నాడు (وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ) అల్లాహ్ స్మరణ అన్నింటి కంటే గొప్పది.
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.
إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (అల్ అహ్ జాబ్ 33:56)
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు మరియు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి
పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్