హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:
“నా సహచరులను తిట్టబాకండి. నా సహచరులను తిట్టబాకండి. ఎవరి అధీనంలోనా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను – ఒకవేళ మీలో ఎవరయినా ఉహద్ అంత బంగారం ఖర్చు పెట్టినాసరే వీరి (అంటే సహాబాలు ఖర్చుచేసిన) అర్థ సేరు కాదు కదా కనీసం పావు సేరు ధాన్యానికి సమానమయిన పుణ్యఫలం కూడా పొందలేరు.” (ముస్లిం)
అబూసయీద్ ఖుదరి (రదియల్లాహు అన్హు) ప్రకారం ఖాలిద్ బిన్ వలీద్ – అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మధ్య ఒకసారి అభిప్రాయభేదం తలెత్తింది. అప్పుడు ఖాలిద్ బిన్ వలీద్ ఆవేశంలో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు)ను దుర్గాషలాడారు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై హదీసును పలికారు.
”ఉహద్” ఒక పర్వతం పేరు. ప్రాచీన కాలంలో అది మదీనాకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. అయితే అది ప్రస్తుతం మదీనా నగరంలో ఒక వీధిగా ఉంది. ఈ పర్వతానికి ఆనుకునే ఆనాడు మహా సంగ్రామం జరిగింది. అది ఉహద్ సంగ్రామంగా చరిత్ర ప్రసిద్ధిచెందింది.
అర్థ సేరు అనేపదం హదీసులోని ‘మద్ద్‘ అనే పదానికి మారుగా వ్రాయడం జరిగింది. “మద్” అనేది ధాన్యం కొలిచే డబ్బా లాంటిది. అది ఇంచుమించు అర్థ సేరుకు సమానం.
అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి తొలితొలి సహచరులలోని వారు. అల్లాహ్ ఆయనకు పుష్కలమయిన ధనరాసుల్ని ఒసగాడు. అయితే ఆయన ఆ ధనరాసులను అల్లాహ్ మార్గంలో విరివిగా ఖర్చు చేశారు. హిజ్రీ 33లో మదీనాలో తనువు చాలించారు.
ఖాలిద్ బిన్ వలీద్ కూడా మహాప్రవక్త సహచరులలోని వారే. అయితే ఆయన ప్రారంభంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు వ్యతిరేకంగా నిలబడి పోరాడినవారు. ఆతరువాత హిజ్రీ 8వ యేట సత్యాన్ని గ్రహించి ఇస్లాం స్వీకరించారు. ఇక ఆ తరువాత ఆయన ఇస్లాం వ్యాప్తికై తన శక్తులన్నింటినీ ధారపోశారు. ఆయన్ని ఏ సైనిక పటాలానికి కమాండర్ గా నియమించినా విజయమే లభించేది. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ హిజ్రీ 21 యేట కాలధర్మం చెందారు.
పై హదీసులో సహాబాల స్థానం, వారి త్యాగాలు ప్రముఖంగా ప్రస్తుతించబడ్డాయి.విశ్వాస స్థితిలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూచి, ఆయన వెంట ఉన్నవారిని, విశ్వాసస్థితి లోనే మరణించిన వారిని సహాబాలు అంటారు.
ఇమామ్ నవవి ఇలా అంటున్నారు:- “మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులంతా ఆదరణీయులే. నమ్మకస్తులే. ‘ఒకవేళ వారు ఉపద్రవానికి గురయినా కాకపోయినా’ దీని భావం ఏమంటే వారిలో ఎవరు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పలుకులను ఉల్లేఖించినా అవి ప్రామాణికంగానే పరిగణించబడతాయి. వారి ఉల్లేఖనాలపై సంశయాలకు తావులేదు.
హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: ”మహాప్రవక్త సున్నత్ ని అనుసరించే వారందరిలో సహాబాలు నమ్మకస్తులన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఎవరో కొద్దిమంది బిద్అతీలు (కొత్తపుంతలు తొక్కేవారు) మాత్రమే దీంతో విభేదిస్తారు.”
కాజీ అయాజ్ ఇలా అన్నారు – “ఈ హదీసు ద్వారా సహాబాలంతా, తదనంతర అనుయాయులకన్నా శ్రేష్ఠులు అన్న విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రత్యక్ష సహచరులు తొలి దశ నుంచీ కష్టకాలంలో ఆదుకున్నారు. తమ ఇళ్ళల్లో ఉన్నదంతా అల్లాహ్ మార్గంలో అర్పించారు. ఎల్లప్పుడూ మహాప్రవక్తను వెన్నంటి ఉండేవారు. ఈ భాగ్యం తరువాతి వారికి లభించలేదు. జిహాద్ విషయంలోనయినా, విధేయత విషయంలోనయినా సహాబాల తరువాతే ఇతరుల స్థానం. సర్వోన్నత ప్రభువు ఇలా సెలవిచ్చాడు –
“మీలో (మక్కా) విజయానంతరం ఖర్చుపెట్టిన వారు మరియు పోరాడినవారు, (మక్కా) విజయానికి పూర్వం ఖర్చుపెట్టిన వారితో, పోరాడినవారితో సమానులు కాజాలరు. వారు ఉన్నత శ్రేణికి చెందినవారు.”
అదీగాక వారి హృదయాలలో ప్రేమానురాగాలు, దయాభావం, సంకల్పశుద్ధి, అణకువ, వినమ్రత, అల్లాహ్ మార్గంలో పోరాటపటిమ విరివిగా ఉండేవి. ఒక్క క్షణమే కానివ్వుగాక మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి గడపటమే వేరు. ఆ మధుర క్షణాలతో సరితూగగల ఆచరణ ఇంకేది కాగలదు!? ఎవరెంత ప్రయత్నించినా ఆ స్థాయికి చేరుకోలేరు. అది కేవలం అల్లాహ్ కృప మాత్రమే. అల్లాహ్ కోరిన వారికే అది దక్కింది. కాజీ అయాజ్ ఇలా అభిప్రాయపడ్డారు : “ఈ ఉన్నతస్థానం, మహాప్రవక్త వెంట సుదీర్ఘకాలం గడిపిన, దైవమార్గంలో విరివిగా ఖర్చుచేసిన, ధర్మపోరాటం చేసిన, హిజ్రత్ చేసిన వారికే వర్తిస్తుందని పలువురు హదీసువేత్తలు అంటున్నారు. అంతేగాని మహాప్రవక్తను కేవలం ఒకసారి చూసినవారికో, లేక మక్కా విజయానంతరం విశ్వసించిన వారికో ఆ ఉన్నత స్థానం లభించదు. ఎందుకంటే వారికి అల్లాహ్ మార్గంలో హిజ్రత్ ని, ప్రారంభంలో విశ్వసించిన ముస్లిములకు సహాయపడే అవకాశం గాని రాలేదు.”
ఈ అభిప్రాయంకన్నా, మహాప్రవక్తను విశ్వాసస్థితిలో చూసిన వారంతా సహాబాలుగానే పరిగణించబడతారన్న అభిప్రాయమే నిర్వివాదాంశంగా తోస్తుంది.
ఈ హదీసు మహాప్రవక్త ప్రియ సహచరుల త్యాగాల సాగరంలో ఒక బిందువు మాత్రమే. దైవగ్రంథమైన ఖుర్ఆన్లోనూ, మహాప్రవక్త పలుకులలోనూ సహాబాల స్థానం అత్యున్నతమైందని చెప్పబడింది.
“(ఈ విజయప్రాప్తి) ఆ బీద ముహాజిర్లకే చెందాలి. ఎవరయితే తమ ఇళ్ళూ, వాకిలి మరియు ఆస్తిపాస్తులకు నోచుకోకుండా తీసివేయబడ్డారో, వీరు అల్లాహ్ కృపను, ఆయన ప్రసన్నతను కోరుకుంటారు. అల్లాహ్ మరియు ప్రవక్త మద్దతుకై సన్నద్ధులై ఉంటారు. వీరే సన్మార్గగాములు. ఇంకా, ఈ ముహాజిర్లు వలస రాకపూర్వం విశ్వసించి ‘దారుల్ హిజ్రత్’ (యస్రిబ్ లేదా మదీనా) లో వేచివున్న వారికి కూడా (ఈ విజయ ప్రాప్తిచెందాలి). వీరు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. ఏది వారికి ఇచ్చినా దాని గురించి మనసులోనే పెట్టుకోరు. తమకేదయినా అవసరం ఉన్నప్పటికీ తమ స్వయంపై ఇతరులకే ప్రాధాన్యతనిస్తారు. యధార్థానికి తమ మనసులోని సంకుచితత్వానికి దూరంగా మసలుకున్నవారే సాఫల్యం పొందుతారు.” (అల్ హష్ర్ : 8, 9)
పై రెండు ఆయత్లలో అల్లాహ్ అన్సార్లను, ముహాజిర్లను సాఫల్యం పొందిన వారుగా పేర్కొన్నాడు. ఈ విధంగా ఎన్నో ఆయత్లలో మహాప్రవక్త ప్రియ సహచరులు కొనియాడబడ్డారు. తరువాత వచ్చిన అనుయాయులు ఈ సహాబాల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, వారి కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉండాలని తాకీదు చేయడంజరిగింది. హష్ర్ సూరాలోనే పదవ ఆయత్లో చూడండి –
”వీరి తరువాత వచ్చిన వారు ఇలా వేడుకుంటారు – “ఓ మా ప్రభూ! మమ్మల్ని, మాకు పూర్వం విశ్వసించిన సోదరులందరినీ క్షమించు! విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎటువంటి కాపట్యాన్నీ ఉంచబాకు. మా ప్రభూ! నువ్వెంతో దయామయుడవు, కృపాకరుడవు.” (అల్ హష్ర్ : 10)
తమకు పూర్వం విశ్వసించిన వారి మన్నింపునకై ప్రార్థించటం విశ్వాసుల సుగుణానికి తార్కాణమని పై ఆయత్ ద్వారా రూఢీ అవుతోంది. వారి యెడల ఎటువంటి కాపట్యాన్నిగాని, దురుద్దేశ్యాన్ని గాని వారు సహించరు.
మహాప్రవక్త ప్రియ సహచరులలో ఎవరినయినాసరే నోటికొచ్చినట్లు మాట్లాడే వారిని గురించి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అర్వ బిన్ జుబైర్ తో ఇలా అన్నారు: “ఓ నా సోదరి కుమారా! సహాబాల మన్నింపునకై వేడుకుంటూ ఉండమని వీరికి ఆదేశించబడింది. కాని వీళ్ళు వారిని దుర్భాషలాడారు.” (ముస్లిం)
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు – “అత్యుత్తమమైన కాలం నాది. ఆపైన నా తరువాతది. ఆపైన దాని తరువాతది.” (బుఖారి)
ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు – “మహాప్రవక్త వారి సహచరులను దూషించకండి. వారు మహాప్రవక్తతో గడిపిన ఒక్క క్షణం మీ యొక్క 40 యేళ్ళ ఆచరణకన్నా శ్రేష్ఠమైనది.”
”కొంతమంది, దైవప్రవక్త సహచరులను, ఆఖరికి అబూబకర్, ఉమర్లను కూడా పరుషంగా మాట్లాడుతున్నారు” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) తో చెప్పగా, “అందులో ఆశ్చర్య పడాల్సింది ఏముంది? వారి ఆచరణ సమాప్తమయింది. అయితే వారికి లభించేపుణ్యఫలం సమాప్తం కారాదని అల్లాహ్ నిర్ణయించాడు” అని ఆమె బదులిచ్చారు. ఈ పలుకులను జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. దీని భావం ఏమిటంటే, దుర్భాషలాడిన, చాడీలు చెప్పిన వారి సత్కార్యాలు కీర్తిశేషులయిన ఆ మహనీయుల ఖాతాలో జమ అవుతాయి. ఆ విధంగా వారు చనిపోయినప్పటికీ ప్రతిఫలాన్ని పొందుతూనే ఉన్నారు.
ప్రముఖ హదీసు వేత్త అబూజర్ అత (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు : “ఎవరయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియ సహచరులలో ఎవరినయినా అగౌరవపరుస్తూ మాట్లాడటం మీరు చూస్తే అతను ధర్మభ్రష్టుడని తెలుసుకోండి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సత్యసంధులు. ఖుర్ఆన్ సత్యబద్ధమైనది. అటువంటి ఖుర్ఆన్ ను, మహాప్రవక్త సంప్రదాయాన్ని మన దాకా అందజేసినవారే సహాబాలు. ఖుర్ఆన్ మరియు సున్నత్ ను మనకందజేసిన సహాబాలు నమ్మకస్తులు కారని వారు చెప్పదలుస్తున్నారు. ఆ విధంగా ఖుర్ఆన్ హదీసులు మిథ్య అని నిరూపించదలుస్తున్నారు. ఇటువంటి వారంతా ధర్మ విరోధులు, ధర్మ భ్రష్టులు.”
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రియసహచరుల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ పంథా సమతూకంతో కూడినది. అది వారి స్థానం నుండి వారిని మరీ ఎత్తి దైవంతో సరితూగే స్థానమూ కల్పించదు. అలా అని వారిని అవహేళనచేసే విధంగానూ దిగజార్చదు. అందుకే అహ్లె సున్నత్లు మధ్యస్థ విధానాన్ని అవలంబిస్తారు. వారు అందరినీ ప్రేమిస్తారు. న్యాయంగా ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఇస్తారు. వారి అంతస్తును మరింత పైకి ఎత్తనూ ఎత్తరు. వారి హక్కుల్ని నెరవేర్చటంలో లోటూ రానివ్వరు. మహాప్రవక్త సహచరుల ప్రశంసలో వారి నోళ్ళు తడిగా ఉంటాయి. వారి పట్ల ప్రేమతో వారి హృదయాలు నిండిపోతాయి.
సహాబాల మధ్య ఎప్పుడయినా, ఏదయినా విభేదం గాని, వివాదం గాని తలెత్తితే అది కేవలం ‘ఇజ్తెహాద్ ‘ షరీఅత్ అన్వయింపు కారణంగానే తలెత్తేది. ఎవరు ఇజ్తెహాద్ లో కరెక్టుగా ఉంటే వారికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరెవరి ఇజ్తెహాద్ లో లోపం ఉంటుందో వారికి ఒకే వంతు ప్రతిఫలం లభిస్తుంది. సహాబాలు మానవాతీతులు కారు. వారూ మానవులే. వారి ద్వారా కూడా పొరపాట్లు జరగవచ్చు. జరిగేవికూడా. అంతమాత్రాన అసాధారణమయిన వారి త్యాగాలు, సుగుణాలు మరుగున పడజాలవు. వారి సత్కర్మలు తదనంతర అనుయాయుల సత్కార్యాల కంటే అధికం. అలాగే వారి పొరపాట్లు వారి తరువాతి వారి పొరబాట్లకన్నా బహుస్వల్పం. అదీగాక, అల్లాహ్ వారిని మన్నించాడు. వారితో ప్రసన్నుడైనాడు.
తావీ (రహిమహుల్లాహ్) గారు “అఖీద అహ్లుల్ సున్నత్ లో ” ఇలా రాస్తున్నారు : “మనమంతా మహాప్రవక్త ప్రియ సహచరులను ప్రేమిస్తున్నాము. వారిలో ఎవరి ప్రేమ పట్ల కూడా వైపరీత్యానికి పోము. ఇంకా వారిలో ఏ ఒక్కరితోనో సంబంధాన్ని త్రెంచుకోవటమూ లేదు. ఎవరు సహాబాల పట్ల కపటత్వం ప్రదర్శించారో వారిపట్ల మేముకూడా అలాగే వ్యవహరిస్తాము. మేము మటుకు వానిని మంచి పదాలతోనే స్మరిస్తాము. వారిపట్ల ప్రేమ ఉంటేనే ధర్మం (దీన్) పట్ల ప్రేమ, విశ్వాసం ఉన్నట్లు లెక్క. వారిపట్ల గనక వైరభావం ఉంటే అది కుఫ్ర్ (తిరస్కారం)కు, కాపట్యానికి, తలపొగరుతనానికి ఆనవాలు అవుతుంది.”
ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) ఏమంటున్నారో చూడండి: “సహాబా (రదియల్లాహు అన్హు)లందరి సుగుణాలను స్మరించడం, వారిలోని పరస్పర విభేదాల గురించి చర్చకు తావీయకుండా ఉండిపోవటం సంప్రదాయం (సున్నత్). ప్రవక్త సహచరుల్లో ఏ ఒక్కరినయినా సరే దూషించినవాడు మార్గవిహీనుడే. సహాబాల పట్లప్రేమ కలిగి ఉండటం సున్నత్. వారి కోసం అల్లాహ్ ను వేడుకోవటం అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటమే. ఇంకా వారి మార్గాన్ని అనుసరిస్తే అది మోక్షానికి వారధి వంటిది. వారి పాద చిహ్నాలలో నడుచుకోవటం ఔన్నత్యానికి సోపానం.”
సహాబాలలోని తప్పులను చర్చించే, లేదా వారిలో ఎవరినయినా అవమానపరచే అనుమతి ఎవరికీ లేదు. అలా చేసిన వారిని కాలపు రాజ్యాధికారి విధిగా శిక్షించవలసి ఉంటుంది. అటువంటి వారిని మన్నించి వదలివేయటం సబబు కాదు. వారిని శిక్షించాలి, ఆపైన వారిచేత పశ్చాత్తాపం ప్రకటించాలి. పశ్చాత్తాపపడితే సరి. లేకపోతే వారికి మళ్ళీ శిక్ష విధించాలి. వారు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడేవరకూ నిర్బంధంలో పెట్టాలి.
అబూ సయీద్ ఖుదరి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం సహాబాలలో అంతస్తులున్నట్లు నిర్ధారణ అవుతోంది. వారిలో వివిధ కోవలున్నట్లు కూడా విదితమవుతోంది. విజయానికి పూర్వం అల్లాహ్ మార్గంలో తమ ధనంతో, ప్రాణాలతో పోరాడిన వారికి విజయం తరువాత పోరాడిన వారు సాటి రాలేరని అల్లాహ్ స్వయంగా “పేర్కొన్నాడు.
“మీలో ఎవరయితే విజయం తరువాత ఖర్చు చేశారో, పోరాడారో వారు ఎప్పటికీ విజయానికి పూర్వం ఖర్చుచేసిన, పోరాడిన వారితో సమానులు కాలేరు.”
ఇక్కడ “విజయం” అనే పదం హుదైబియా ఒడంబడిక నేపధ్యంలో ఉంది. హుదైబియా ఒప్పందం తరువాత చేసిన త్యాగాల కంటే హుదైబియా ఒప్పందానికి ముందుచేసిన త్యాగాలు ఇంకా విలువైనవని తెలుస్తోంది. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు)ని ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) పరుషంగా మాట్లాడినప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారించటమే గాక అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ను తన సన్నిహితునిగా పేర్కొన్నారు. ఎందుకంటే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించారు. ఖాలిద్ బిన్ వలీద్ చివర్లో ఇస్లాం స్వీకరించారు. ఖాలిద్ బిన్ వలీద్ అంతటి వారే అబ్దుర్రహ్మాన్ బిన్ఔఫ్ (రదియల్లాహు అన్హు)కు సాటి రాలేనపుడు ఆ తరువాతి అనుయాయుల్లో మాత్రం సహాబాలతో సరిపడే వారెవరుంటారు?
హదీసు ద్వారా బోధపడిందేమంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రియ సహచరులంతా మనకు గౌరవనీయులు, ఆదర్శప్రాయులు, కనుక వారి పొరపొచ్చాలను వెతుకుతూ ఉండటం, వాటిని సాగదీయటం వాంఛనీయం కాదు. అది అమర్యాద, అవిజ్ఞత అనిపించుకుంటుంది. మనం ఎంతసేపటికీ వారి సత్కార్యాలనే మార్గపు కాగడాలుగా ఎంచుకోవాలి. వారిలోని లోటుపాట్లను విస్మరించాలి. వారి స్థాయిని మనలో ఎవరూ అందుకోలేరని తెలుసుకోవాలి. వారి అపారమైన సుగుణాల ముందు వారి లోటుపాట్లు దేనికీ పనికిరావు. అనుయాయుల్లో ఎవరయినా సరే వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం అమర్యాదకరంగానే పరిగణించబడుతుంది. మనం చేయవలసిందల్లా వారి శ్రేయాన్ని అభిలషిస్తూ ప్రార్థించటం, వారి జీవితాల ద్వారా గుణపాఠం గరపుతూ ఉండటమే.
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ, అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
—
సహాబాలు మరియు మన సలఫ్:
https://teluguislam.net/sahaba-and-salaf/